Monday 25 August 2014

బకెట్‌తో సవాల్? బీ కేర్‌ఫుల్!


సమయం సాయంకాలం ఆరుగంటలు. సీరియస్‌గా నా కూతురికి నూడిల్స్ చేస్తున్నాను. ఇంతలో నా సుపుత్రుడు స్టవ్ దగ్గరకొచ్చి ఒక యూట్యూబు విడియో చూపించాడు. అదేదో ఐస్ బకెట్ ఛాలంజ్‌ట, నెత్తిన బకెట్లతో ఐస్ కుమ్మరించుకుంటున్నారు. 'ఇదంతా ఒక నరాల రోగానికి చందా వసూలు చెయ్యటానికిట!' సుపుత్రుడు తన జ్ఞానాన్ని నాక్కొంత పంచాడు. ఏవిటో! కొందరికి సరదా, మరికొందరికి పబ్లిసిటీ పిచ్చి, ఇంకొందరికి రోగుల పట్ల ప్రేమ. సరే! ఎవరి గోల వారిది. కాదన్డానికి మనమెవరం?

అయినా మనకీ సవాళ్ళు కొత్త కాదు. చెంచులక్ష్మి సినిమాలో అంజలీదేవి జిక్కి కృష్ణవేణి స్టోన్లో 'చెట్టులెక్కగలవా? ఓ నరహరి పుట్టలెక్కగలవా?' అంటూ నాగేస్సర్రావుకి సవాల్ విసిరిందిగా! అయితే - మన దేశంలో ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ కుదర్దనుకుంటున్నాను. కారణం - మనకి నీళ్ళ సమస్య వుంది. నీళ్ళున్నా ఫ్రిజ్జులుండవు. ఫ్రిజ్జులున్నా నీళ్ళు గడ్డ కట్టేదాకా కరెంటుండదు. మరీ ఎవరన్నా ముచ్చట పడితే (శవాల్ని పడుకోబెట్టే) ఐస్ దిమ్మల్ని కొనుక్కుని, సుత్తితో ముక్కలుగా కొట్టుకుని, బకెట్లో పోసుకుని నెత్తిన కుమ్మరించుకోవాలి. అయినా మన మండుటెండలలో, ఉక్కపోతలో - నెత్తిన ఐస్ నీళ్ళు పోసుకోవడం ఛాలెంజ్ ఎలా అవుతుంది? అయితే గియితే వేణ్ణీళ్ళు గుమ్మరించుకోడం ఛాలెంజ్ అవ్వాలి గానీ!

వుంటానికి దేశాలన్నీ ఒక ప్రపంచ మేప్‌లోనే వున్నాయి. కానీ సమస్యలు మాత్రం వేరువేరు. ఆఫ్రికా ఖండం సమస్త రోగాలకి నిలయం. అమెరికావాడికి టీబీ, మలేరియా సమస్య లేదు. టైఫాయిడ్, కలరా అంటే ఏంటో తెలీదు. కాబట్టే వాళ్ళు నరాల రోగ స్పృహ కోసం ఐస్ బకెట్లు నెత్తిన కుమ్మరించుకుంటున్నారు. ఐస్ కుమ్మరించుకోటానికి రోగానికి సంబంధం ఏంటో తెలీదు.

తిండానికి తిండే లేనివాడికి చద్దన్నమే పరమాన్నం. తిండి సమస్య కానివాడికి - భోజనంలో ఎన్ని పదార్ధాలు ఎలా వుండాలి? అన్నదే సమస్యవుతుంది. అంటే మొదటి సమస్య తీరితే గాని, రెండో సమస్య రాదు. పేదదేశాలు మలేరియా, ఫైలేరియా సమస్యల్తో కునారిల్లుతుంటాయి. కాబట్టి వాళ్లకి నరాల రోగం సమస్యే కాదు. మనది పేద దేశం అంటే కొందరు దేశభక్తులకి కోపం రావచ్చు గానీ, వైద్యారోగ్య విషయాల్లో మాత్రం మనం ఆఫ్రికా దేశాల సరసన ఉంటున్నామని నా అభిప్రాయం.

మన దేశంలో ఫేస్బుక్కు యువత సంఖ్య భారీగానే వుంది. వీళ్ళకి సామాజిక అవగాహన (వున్నట్లే) వుంది. అందుకే బొంబాయి ఐదు నక్షత్రాల హోటల్ మీద దాడి జరిగినప్పుడూ, ఢిల్లీ రేప్ సంఘటన సమయంలోనూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. సాధారణంగా వీళ్ళు అభివృద్ధి చెందిన దేశాల వాళ్ళని అనుకరిస్తుంటారు. మరి మన దేశంలోని ఫేస్బుక్కులోళ్ళు నెత్తి మీద ఐస్ బకెట్లు కుమ్మరించుకునే కార్యక్రమం మొదలెట్టారో లేదో తెలీదు.

బకెట్ ఐసో, బూడిదో.. ఏదైతేనేం - నెత్తిన కుమ్మరించుకోడం సరదాగానే వుంటుంది. ఐతే - ఆ సరదా కోసం ఎంచుకోవలసిన కారణం మాత్రం ప్రభుత్వాలకి ఇబ్బంది కలగని విధంగా వుండాలి. ఉదాహరణకి - అమెరికాలో అమెరికావాడి యుద్ధాలకి వ్యతిరేకంగానో, చైనాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలనో బకెట్ కాదు.. కప్పు ఐస్ గుమ్మరించుకున్నా చాలా ప్రమాదం.

ఏ సమాజంలోనైనా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఏ ప్రయత్నం చేసినా అభినందనీయమే. మనకైతే నరాల జబ్బుల ఛాలెంజిలు అవసరం లేదనుకుంటున్నాను. అంటే - ఆ రోగాలకి వైద్యం అవసరం లేదని కాదు, అంతకన్నా ముఖ్యమైన సమస్యలే మనకున్నాయని నా అభిప్రాయం. అందువల్ల - మన ఛాలెంజిలు వేరుగా వుండాలి. మనకి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు చాలానే వున్నాయి. మీరు ఏ హాస్టల్లోనైనా సరే - ఒక ముద్ద అన్నం తినగలరా? ఛాలెంజ్! ఒక గుక్క నీళ్ళు తాగ్గలరా? ఛాలెంజ్! ఆ బాత్రూముల్లో (ముక్కు మూసుకునైనా సరే) ఒక నిమిషం ఉండగలరా? ఛాలెంజ్!

ఇట్లాంటి ఛాలెంజిలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తే రెండురకాల ఫలితం రావచ్చు. ఒకటి - ప్రభుత్వాలకి బుద్ధొచ్చి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ స్థితిగతుల్ని యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చెయ్యొచ్చు. రెండు - వాస్తవాల్ని ఎత్తి చూపినందుకు ప్రభుత్వానికి కోపం రావచ్చు (ప్రస్తుతం ప్రభుత్వ పెద్దల దృష్టంతా సింగపూర్ మీదనే వుంది). అంచేత - వారు ఇదో అవమానంగా భావించి, మిమ్మల్ని ఏదో కేసులో ఇరికించొచ్చు. నేనైతే మాత్రం రెండోదే జరుగుతుందని భావిస్తున్నాను.

అంచేత - ప్రభుత్వాలకి కోపం రాకుండా మన సరదా తీర్చుకునే మార్గం గూర్చి ఆలోచిద్దాం. 'పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలకి నిరసనగా మరియూ గ్లోబల్ వార్మింగ్ పరిశోధన చందాల నిమిత్తం ఒక ఛాలెంజ్!', 'వీధికుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెయ్యాల్సిన ఆవశ్యకతని ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు మరియూ అందు నిమిత్తం నిధుల కోసం ఒక ఛాలెంజ్!' ఎలా వుంది?

ఇటువంటి సాఫ్ట్ టార్గెట్స్ ఎంచుకుంటే ప్రభుత్వాలు పట్టించుకోవు, పైగా మంత్రిగారు ముఖ్యఅతిథిగా వేంచేసి మన్ని అభినందిస్తారు. ఆ విధంగా మన సరదా తీరుతుంది, యూట్యూబులో వీడియో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే - బకెట్లతో నెత్తిన ఏం కుమ్మరించుకోవాలో తోచట్లేదు, మీ సలహాలకి ఆహ్వానం. 

మిత్రులారా! ముందు మీరు మీ బకెట్లు రెడీ చేసుకోండి! మిగిలిన సంగతులు తరవాత ఆలోచిద్దాం!

(picture courtesy : Google)

25 comments:

  1. మీ వ్యాసంలోని సామాజికస్పృహ నాకు నచ్చింది. చాలా బాగా వ్రాసారండీ. అభినందనలు. కాని అదే సమయంలో, చూడండీ మీరు వీధికుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెయ్యాల్సిన ఆవశ్యకతని ..... అంటూ ప్రస్తావించారే దానిలో ఒక తిరకాసు ఉంది. జంతువులకు కూడా బోల్డన్ని హక్కులున్నాయనీ అవి మానవహక్కులకు ఎంతమాత్రం తీసిపోవనీ చెప్పి వాటి హక్కుల పరిరక్షణకు కొందరు సెలబ్రిటీలు నడుంబిగించి తెగ హడావుడి చేస్తూ ఉంటారు. వారి వైపునుండి ఒక అభ్యంతరం వస్తుంది కదా? కుక్కల హక్కుల సంగతేమీ పట్టించుకోకుండా వాటికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిపారెయ్యలనటం దుర్మార్గం మరియు జంతుహక్కులపరిరక్షణకు విఘాతం. అవి కరవకుండా మనుష్యులు జాగ్రత్తలు తీసుకోవాలి. కార్లలో వెడితే కరవవు కదా? ఇంత చిన్న జాగ్రత్త తీసుకోవటం చేతకాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేసి కుక్కల జనాభాని నశింపచేయాలని చూడటం సహించేది లేదని వారు గర్జిస్తారు. కోర్టుకు వెళ్ళవచ్చునేమో తెలియదు. ఒకవేళ అక్కడా కుక్కలప్రేమికులైన జడ్జీలు ఈ‌ కేసు విచారిస్తే ఎంత చిక్కూ ఎంత చిక్కూ!

    ReplyDelete
    Replies
    1. అవును. ఆ ప్రమాదం కూడా వుంది.

      అయితే మనకిప్పుడు ఇంకేదైనా కారణం వెతుక్కోవలసిన పని పడిందన్న మాట. :)

      Delete
  2. ALS is a great cause to raise money for, but, I too agree that we don't need to resort to this type of oddball practices. It certainly raised awareness at least for a while though. There is some backlash against the event in the US too. Ice Bucket Challenge: Stupidest Idea Ever

    ReplyDelete
    Replies
    1. మనవాళ్ళంటే గుళ్ళూ, గోపురాలకి మాత్రమే చందాలిస్తారు. కానీ - అమెరికాలో ఇట్లాంటి research activities ఫండ్స్ బాగానే వుంటాయేమో (అని అనుకుంటున్నాను). మరీ బకెట్ ఛాలెంజిలు ఎందుకు?

      Delete
  3. We too took the Challenge..... I agree it grew because of social media but became too viral and grew out of proportionally because of the same, causing the repercussions!

    http://whnt.com/2014/08/19/als-clinic-continues-to-raise-awareness-provide-support-for-those-with-als-with-their-own-ice-bucket-challenge/

    If you wanna get bored the whole 2 min video including my talk ---http://youtu.be/SfUVZbyAap4
    Gowtham

    ReplyDelete
    Replies
    1. నరాల డాక్టరయ్యా!

      వీడియో చూశాను. బాగుంది.

      నువ్వు నిక్కరేసుకుని మంచిగా పడ్డావ్, చక్కగా చెప్పావ్, బకెట్ ఎత్తి బాగా పోసుకున్నావ్!

      ఒక నరాల రోగం గూర్చి నువ్వు పడుతున్న తపన మిక్కిలి శ్లాఘనీయం! నా హృదయాన్ని తాకావు. :)

      Delete
    2. రమణ గారు, డాక్టర్ మూల్పూరు గౌతం గారికి ALS వారి Humanitarian Award ఇచ్చారు అని ఆన్ లైన్ లో చూసాను. మీరు ఆల్రెడీ చూసారేమో? ఈ క్రింది లింక్ లో వివరాలు ఉన్నాయి. గౌతం గారికి కంగ్రాచ్యులేషన్స్.

      http://www.alabamaapi.org/TJGowtham-Mulpur-MD-receives-ALS-humanitarian-award


      Delete
    3. విన్నకోట నరసింహారావుగారు,

      సమాచారానికి ధన్యవాదాలు.

      (గౌతం నాకు నిన్న కూడా మెయిల్స్ రాశాడు. కానీ - ఈ విషయం రాయలేదు.)

      మీ కామెంట్ మావాడికి పంపుతున్నాను.

      థాంక్యూ!

      Delete
  4. నాదో సలహా!
    టివి సీరియళ్ళు తెగ చూసే ఆడవాళ్ళు (కొంతమంది మగవాళ్ళు కూడ) కన్నీటి బాల్చీ సవాల్ (టియర్స్ బకెట్ చాలెంజ్) స్వీకరించండి.

    ReplyDelete
    Replies
    1. ఇదేదో ఆలోచించవలసిన ఛాలంజ్ లాగే వుంది. :)

      Delete
  5. సమస్యకు మనతో ఎంతదూరముంటే, దానికోసం చేసే ప్రొటెస్టు/అవగాహన పెంచడానికి చేసే ప్రయత్నం అంత eliteగానూ, elegantగానూ అనిపిస్తాయి. రోడ్లుబాగులేవనీ, సౌకర్యాలు లేవనీ, ప్రభుత్వం సరిగా పనిచేయడంలేదనీ మనమెప్పుడూ ఉద్యమాలు చెయ్యం. ఎవరినా చేస్తే మనం ఒక వారాంతం వారి వెనుక నిలబడి, వాటి ఋజువులు ఫేస్‌బుక్కులోపెట్టి లైకులు పెంచుకుంటాం.

    మనం మనస్పూర్తిగా చేసే ఉద్యమాలన్నీ, మనోభావాలు గాయపడ్డప్పుడూ లేదూ ఇలా ఫ్యాషనబుల్‌గా అనిపించేవీమాత్రమే. కానివ్వండి ఫేస్బుక్ లైకులాగే ఐస్‌బకెట్ పెద్దగా ఖర్చులేని వ్యవహారమాయె, పైపెచ్చు బోల్డంత ప్రచారంకూడానూ.

    ReplyDelete
    Replies
    1. ఫేస్బుక్కు ఒక సరదా వ్యవహారం. అక్కడ ఏంచేసినా లైకుల కొరకే!

      Delete
  6. manavallu kuda start chesarandi.. " rice bucket "
    pedavadaki rice ni ivvali... kuragayalu matram vade konukkovali.

    ReplyDelete
  7. ఏంటి సార్‌! ''మనకి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు '' అని బ్లాగంత గబ్బుకొట్టిస్తారు. మేము ఊహించుకోలేక ఉండాం. తీసెయ్యండి! ఆ మాటను డెలిట్‌ చెయ్యండీ! :)

    ReplyDelete
  8. These kind of activities to raise money is common in UK also. Every year 'Red nose day' and also BBC 'children in need'. People all over the country do different activities and raise millions of pounds for various projects in Africa and even local hospitals. Of course, it is an ongoing projects for like'oxfam','red cross' 'mc millan cancer relief', 'british heart foundation','cancer research UK' etc. to name a few. For that matter I was involved with a charity called' better lives foundation' to carry medical camps in Sierra Leonne three to four times a year. Every October we have a surgical camp and I have been going there for the last four years. In that connection there is fund raising by mountaineering , prestigious "yorkshire 3 peaks" every year. We do in May every year along with another charity "seva international". I also do every year along with some of my friends and takes about 8 to 9 hours of 24 miles of up and down the mountains. I raised about £400 last year.
    If people want to come together and do these kind of activities there is plenty of scope in India. But I think you have to keep politicians completely out of it. There is lot of funding comes through charity for all these for research and to support the sufferers. I can write a lot. But I should stop here.

    ReplyDelete
    Replies
    1. మిత్రమా!

      ఒక మంచి కారణం కోసం సరదా పనులు చెయ్యడం సరదాగానే తీసుకోవాలేమో!

      ఇప్పుడు ఇండియాలో 'రైస్ బౌల్ చాలెంజ్' చేస్తున్నార్ట. గూగుల్రావు ఈ చాలెంజ్ గూర్చి చాలా సమాచారమే ఇచ్చాడు. చదివాను.. హృదయం బరువెక్కింది

      పేదలకి బియ్యం ఇవ్వడం సంస్కరణ వాదం. మన దేశానికి అడుక్కుతినే వారి నిలయంగా మంచి బ్రాండ్ ఇమేజ్ వుంది. ఇప్పుడీ చాలెంజితో మన బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది.

      ఏ నాడైతే బొచ్చె బియ్యం దానం చేస్తూ (ఫేస్బుక్ కోసం) ఫోటో తీయించుకోటానికి మనిషి దొరకడో ఆనాడు మన దేశం అభివృద్ధి చెందినట్లుగా భావించాలి.

      దాదాపు ముప్పైయ్యేళ్ళ క్రితం అనుకుంటాను. నేనూ, శరత్, గోపరాజు రవి నేను సిగరెట్లు కాల్చుకుంటూ ఎన్నో విషయాల్ని చర్చించుకునేవాళ్ళం. రవి ఆశావాది. రాబోయే రోజుల్లో ఇండియా ఆర్ధిక స్థితి మెరుగవుతుందని, తద్వారా అడుక్కునేవాళ్ళు తగ్గిపోతారని, అప్పుడు ముష్టి వేద్దామన్నా తీసుకునేవాడు దొరకడని అనేవాడు. రవి వాదనని శరత్ ఒప్పుకునేవాడు కాదు. ఈ దేశంలో అడుక్కునేవారి సంఖ్య జనాభా సంఖ్యతో బాటు పెరుగుతుందని శరత్ వాదించేవాడు.

      శరత్, రవి - ఇద్దరూ కూడా ఇప్పుడు లేరు. శరత్ వాదన నిజమైనందుకు బాధ పడుతున్నాను.

      Delete
    2. మీరు చాలా వెనకబడి ఉన్నారు సార్... రైస్ బక్కెట్ చాలెంజ్ పాతదైపోయింది... ఇయ్యాల్టి ట్రెండ్ గాజా లో "రబ్బుల్ బక్కెట్ చాలెంజ్"

      Delete
    3. //పేదలకి బియ్యం ఇవ్వడం సంస్కరణ వాదం.//
      ఒక మాజీ మంత్రి రెండవుల్లి గారి ఒక టీవీ ఇంటర్వ్‌ ఇస్తూ మన దేశం అభివృద్ది పయనిస్తున్నప్పటికి, పేదిరికం పెరిగిపోవటానికి కారణమేమంటే దాయిబాబా గారు లేక పోవటమేనట! బాబా గారు ఉన్నట్లైతే ఉన్న వారు డబ్బు మొత్తం ఆయన కాళ్లమీద పోస్తె. ఆడబ్బును ఆయన పేదలకు పంచే వారట! ఆయన లేక పోవటం వల్ల ఉన్న వారు ఎవరిని నమ్మటం లేదట వివిధ రూపెనా! అందు వల్ల వారు అణగారి పోతున్నరట! ఆ మంత్రి వర్యునికి పేదలంటే ఎంత ప్రేమో! ఆప్రేమను వ్యక్తీకరించి, పుణ్యం వడి గట్టు కోవడానికి ఆయన ఎంత తహతహ పడి పోతున్నాడో నాకు భోద పడింది. అసలు పేద వారు లేకుంటే పుణ్యం ఎలా వస్తుందీ? పేదలకు దానం చేసి పుణ్యం సంపాదించక పోతే స్వర్గమెలా దొరుకుతుంది! వీటికి ఒకదానికొకటి లింకులున్నాయి సార్‌! పుణ్యం చేసుకొనే అవకాశం లేకుండ చెయ్యమంటారా ప్రభుత్వాన్ని?

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
  9. "నరాల" వ్యాధి గురించి అవగాహన పెంచడం, నిధులు సేకరించడం ఉన్నతమైన లక్ష్యాలే. కాని అందుకోసం "నరాల్ని" జివ్వుమనిపించి కాస్సేపు మొద్దుబారిపోయాలే చేసే ఐస్ అదీ బక్కెటెడు తలమీద గుమ్మరించుకోవడమేమిటండి? అమెరికన్ పైత్యం అనచ్చేమో. మన దేశంలో కూడా ఊపందుకుంటుంది, టోమాటో ఫెస్టివల్ లాగా.

    ReplyDelete
    Replies
    1. ఒక్క క్షణం నరాలు జివ్వుమని నియంత్రణ తప్పితే ఎలా ఉంటుందో మనం అనుభవిస్తే, అది నిరంతరం అనుభవించే వారి బాధ ఎలా ఉంటుందో మన ఊహకు అందజేయడం కోసమే ఇలా సవాలు విసరడం అని ఒక స్నేహితుడు నాకు చెప్పాడు. అది చదివాకా ఇదంత పిచ్చి పని కాదేమో అనిపిస్తుంది నాకు.

      Delete
    2. థాంక్సండి వర్మ గారు. మరి కాన్సర్ లాంటి రోగగ్రస్తులు కూడా నరకయాతన అనుభవిస్తుంటారని విన్నానే. అలాగే ఫ్లోరోసిస్ బారిన పడిన వారి (ఉదాహరణకి నల్గొండ జిల్లా వాసులు) జీవితం దుర్భరం కదా.

      ఎవరి అభిప్రాయం వారిది కాని, బాధితుల్ని చూసి కూడా అవగాహన ఏర్పరుచుకుని విరాళాలు ఇవ్వచ్చని, వారి బాధని స్వయంగా అనుభవించనక్కరలేదని నా అభిప్రాయం.

      అవగాహన పెంచటానికి, నిధులు సేకరించడానికి ఇతరత్రా మార్గాలున్నాయి. పైన "Go Ve Ra" గారు చెప్పినట్లు కొండలు ఎక్కి దిగటం చెయ్యచ్చు. ఇంకా ప్రతి ఊరులోను xకె-రన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు.

      Delete

comments will be moderated, will take sometime to appear.