Saturday 17 August 2013

రూప్ తెరా మస్తానా



'ఆరాధన'. ఈ సినిమా అనేక రకాలుగా ప్రత్యేకమైనది. 1969 లో హిందీ సినిమా ప్రేమికుల్ని ప్రేమ మైకంలో ముంచెత్తింది. ప్రేమ కథా చిత్రాలకి సరికొత్త ఒరవడి సృష్టించింది. ఒక సూపర్ స్టార్ ఆవిర్భానికి, ఇంకో సూపర్ సింగర్ పునర్జన్మకి కారణమైందీ సినిమా. ఈ వివరాలన్నీ ప్రత్యేకంగా ఇక్కడ నేను రాయనక్కర్లేదు. వికీ చూస్తే చాలు. తెలిసిపోతుంది.

ఈ సినిమా ఆనాడు గుంటూరు విజయలక్ష్మి థియేటర్లో అమ్మానాన్నల్తో చూశాను. హిందీ సినిమాలు నాకు ఆట్టే అర్ధం కాకపోయినా.. ఆ సినిమాలు పంచరంగుల్లో (ఆ రోజుల్లో కలర్ సినిమాల్ని అలాగే పిలిచేవాళ్ళు) ఉంటాయి కావున నాకు నచ్చేవి. పాటలు కూడా బాగుండేవి.

ఆరాధన సినిమాలో హీరోహీరోయిన్లు వర్షంలో తడుస్తారు. ఆ తరవాత చలి కాచుకుందుకు మంట వేసుకుంటారు. అప్పుడు 'రూప్ తెరా మస్తానా' అనే పాట ఫుల్ స్వింగులొ మొదలవుతుంది. పాట విండానికి చాలా బాగుంటుంది. కానీ విషయమే అర్ధం కావట్లేదు. ఆ అబ్బాయి అమ్మాయి కళ్ళల్లోకి అదేపనిగా ఎందుకలా చూస్తున్నాడు? ఆ అమ్మాయి అతన్నుండి ఎందుకలా చూపు తిప్పుకుంటుంది? హాల్లో జనాలేమో వేడి నిట్టూర్పులు. అసలేం జరుగుంతుందిక్కడ? ఏంటో, ఏమీ తెలిసి చావట్లేదు.

అందుకే ఈ విషయాన్ని అమ్మనడిగాను. అమ్మ కసురుకుంది.

"నోర్మూసుకుని సినిమా చూడు. నీవన్నీ దరిద్రపు డౌట్లు."

నా డౌటు అమ్మ దృష్టిలో ఎందుకంత దరిద్రపుదయిందో కొన్నేళ్ళకి గానీ అర్ధం కాలేదు! ఇట్లాంటి అడగకూడని ప్రశ్నలు వేసి అమ్మని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. ఇదే తరహా సీన్ ఆ తరవాత ప్రేమనగర్ అనే తెలుగు సినిమాలో కూడా చూశాను. కనీసం డౌట్ కూడా రానంతగా చండాలంగా ఉంటుందా సీన్!

కొన్ని పాటలు కొన్నాళ్ళు బాగుంటాయి. ఇంకొన్ని పాటలు చాన్నాళ్ళు బాగుంటాయి. అరుదుగా మరికొన్ని పాటలు ఎప్పుడు విన్నా బాగుంటాయి. అత్యంత అరుదుగా అతికొన్ని పాటలు విన్నకొద్దీ ఇంకాఇంకా బాగుంటాయి. స్కాచ్ విస్కీకి లాగా వీటి విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు. 'రూప్ తెరా మస్తానా' స్కాచ్ విస్కీ కెటగిరీలొకి వస్తుందని నా అభిప్రాయం.

ఈ పాట రికార్డ్ చేసి నాలుగు దశాబ్దాలు దాటింది. SD బర్మన్ కి మాత్రమే ఈ పాటకి ఇంత గొప్ప ట్యూన్ ఇవ్వగలడు. కిశోర్ కుమార్ మాత్రమే ఈ పాటని ఇంత అద్భుతంగా పాడగలడు. ఆ రోజుల్లోని సంగీత దర్శకులు, గాయకులు గొప్ప ప్రతిభావంతులనే విషయం చెప్పడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదు. వినికిడి సరీగ్గా ఉంటే చాలు. అందుకే నేనా విషయాల జోలికి పోను.

ఆనాడు ఈ పాట కోసం వాడిన musical instruments చాలా ఆధునికమైనవి. ఆర్కెస్ట్రేషన్ కూడా ఈరోజే రికార్డ్ చేశారా అన్నంత ఫ్రెష్ గా ఉంటుంది. అంచేత ఆ రోజుల్లో ఈ పాట 'వెల్ ఎహెడ్ ఆఫ్ టైమ్స్' అనిపిస్తుంది. ఇది నాకు ఆసక్తిని కలిగించింది. అప్పటిదాకా లెక్కలేనన్నిమెలోడీల్ని అలవోకగా మన మీదకి వదిలిన సంగీత గని SD బర్మన్, ఉన్నట్లుండి ఇంత మోడర్న్ పాట ఎలా చెయ్యగలిగాడు? ఇదేదో ఆలోచించదగ్గ విషయమే!

అందువల్ల ఈ పాట మీద రీసెర్చ్ మొదలెట్టాను. ఆరాధన సమయానికి SD బర్మన్ వృద్ధుడు. కావున ఆ సాక్సఫోన్లు, కాంగో డ్రమ్స్ ఆయనకి అంతగా పరిచయం ఉండకపోవచ్చు. ఎవరో కుర్రాడు ఈ పాటకి ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసి ఉంటాడు. ఎవరా కుర్రవాడు? ఇంకెవరు? RD బర్మన్. అవును. ఈ పాట ఇంత బాగా రావడానికి కారకుడు జూనియర్ బర్మన్ అయ్యుంటాడు.

సీనియర్ (తండ్రి) డాక్టర్లు ఆపరేషన్లు చేసేప్పుడు జూనియర్ (కొడుకు) డాక్టర్ల సహకారం తీసుకుంటారు. ఇందుకు కారణాలు రెండు. ఒకటి తమ పని భారం తగ్గించుకోవడం, రెండు కొడుక్కి ట్రైనింగ్ ఇవ్వడం. ఇదే ప్రిన్సిపుల్ బర్మన్ ద్వయానిక్కూడా ఎందుకు వర్తింప చెయ్యరాదు? యురేకా! ఎంత గొప్ప ఇన్వెన్షన్! శభాష్! ఎంతైనా నేను చాలా తెలివైనవాడిని.
ఒకసారి సినీ సంగీత విమర్శకులు VAK రంగారావు గారితో చాలాసేపు కబుర్లు చెప్పే అదృష్టం నాకు కలిగింది. ఆయన సి. రామచంద్రకి వీరాభిమాని. SD బర్మన్ కి అభిమాని. ఆయన బర్మన్ సంగీత ప్రతిభ గూర్చి ఆనందంగా చెబుతుండగా.. నేను వెంటనే నా బర్మన్ నాలెడ్జ్ దుమ్ము దులిపాను (హమ్ కిసీ సే కమ్ నహీ).

"రూప్ తెరా మాస్తానా పాట  అంత గొప్పగా రావడానికి కారకుడు పంచమ్. సచిన్ దా కి ఆధునిక వాయిద్యాలపై అంతగా.. "

అయన నా మాటకి అడ్డు తగిలాడు.

"ఎవరు చెప్పారు?"

"ఎవరూ చెప్పలేదు. నేనే కనుక్కున్నాను." గర్వంగా చెప్పాను.

"యు ఆర్ రాంగ్. ఆ పాటలో RD కాంట్రిబ్యూషన్ తప్పకుండా ఉంది. కానీ SD సంగీత జ్ఞానం ముందు RD ఒక లిల్లీపుట్."

నాకు రంగారావు గారు చెప్పేది అర్ధం కాలేదు. కానీ ఆయన నా పరిశోధనని తప్పు పట్టడం నచ్చలేదు.

"పంచమ్ లిల్లీపుట్ కావచ్చు. కానీ ఆ డ్రమ్స్.. " చెప్పబోయ్యాను.

"మీరు చెబుతున్న ఆ 'గొప్ప' సంగీత వాయిద్యాలని అక్కడ, అలా ప్రయోగింప చేసింది SD బర్మన్. ఆయనకి ఇష్టం లేకపోతె RD బర్మన్ చెయ్యగలిగిందేమీ లేదు. SD బర్మన్ ఈజే జీనియస్." గట్టిగా బల్ల గుద్దినట్లు అన్నారు రంగారావు గారు.

ఇప్పుడర్ధమైంది. ఈయన RD బర్మన్ కి ఈ పాటలో పైసా వాటా కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేడు. అంచేత ఆయన SD బర్మన్ అభిమానాన్ని ఆయనకే ఉంచేసి నా రీసెర్చ్ ఫైండింగ్ నా దగ్గరే ఉంచేసుకున్నాను.


యూట్యూబ్ నుండి ఆ పాట ఇస్తున్నాను. ఎంజాయ్ ద సాంగ్.




(photos courtesy : Google) 

13 comments:

  1. ఈ బర్మన్ల(s.d & r.d) ల cotroversy ఒక్క ఆరాధన కే పరిమితం కాలేదనుకుంటాను. 'కటిపతంగ్ ' కు సీనియర్ బర్మన్ tunes ఇచ్చాడని నమ్మేవాళ్ళూ వున్నారు.

    ReplyDelete
    Replies
    1. @srinivas reddy.gopireddy,

      అవునండి. ఇట్లాంటి విషయాలు సరదాగా ఉంటాయి. RD మెలొడీ కావాలనుకున్నప్పుడు తండ్రి స్టైల్ అనుసరించేవాడని అనిపిస్తుంది.

      Delete
  2. Dear Ramana, thanks for taking us all back to the golden period of movie music! Like any self respecting 60s-70s music fan, I too have researched the behind the scenes story on Roop Tera Mastana. The song actually is a remake of the old Bengali tune by SD Burman Da, named, Ektu Pode Shashurbadi, Diye Jabo Ghoda Gaadi. So, it is clearly a creation of the senior Burman. Unfortunately, the original Bengali song from the 40s is not available anywhere on the net. Here is a little anecdotal story about the song origin:
    Origins of Roop Tera Mastana

    ReplyDelete
    Replies
    1. dear BSR,

      thanks for the excellent link.

      interesting to note RD assisting his father in spite of scoring hit music on his own for films like 'Teesri Manzil' etc.

      Delete
  3. If our Link Master General (BSR) couldn't find that song means I won't even attempt looking at it!
    So that's the story behind that all time popular song! Yes, hard work, persistence and pursuit for excellence puts anything on the top! Nice writeup! - Gowtham

    ReplyDelete
  4. From V.A.K.Ranga Rao
    Your patient Dr.Seegana brought to my notice your comment about 'Roop tera mastana.'
    Imagine you are a chef. You employ different people for washing the vessels, buying, cleaning and cutting the vegetables. You use their labour in your cooking. But you are solely responsible for what turns out, not they.
    Assistants to SDB including Suhrid Kar (whom you would not have heard about), RDB, Basu, Manohari, all did independent movies. None of them were lilliput.
    RDB's contribution, ONLY BY THE APPROVAL OF SDB, to the dance song in "Jewel Thief," is unquestionable but the song is not RDB's but SDB's. Similarly the un-Lilliputian music from "Amar Prem" is RDB's and certainly not SDB's.
    Did I really say that RDB was a Lilliput ? I must have been drunk or daft!
    Long live great composers! Long live their greater compositions!!

    ReplyDelete
  5. From V.A.K.Ranga Rao
    Your patient Dr.Seegana brought to my notice your blog about 'Roop tera mastana.'
    Imagine you are a chef. You hire people to clean the vessels, buy, wash and cut the vegetables. You use their labour but you are solely responsible for the dish that turns out. Apart from RDB, many people assisted SDB, N.Dutta, Basu, Manohari and Suhrid Kar whom you might not have heard about.All of them composed independently. None attained the stature of SDB, though they have beautiful gems to their credit.
    RDB's contribution to the dance song in "Jewel Thief" is unquestionable but the song is not his but SDB's. Similarly the un-Lilliputian music of "Amar Prem" is not SDB's.
    Did I really say that RDB was a Lilliput?
    I must have either been drunk or daft!
    According to my reckoning there were only two genius amongst Hindi film composers, SDB and Salil Chowdhry.
    Long live great composers!
    Long live their greater compositions!!

    ReplyDelete
    Replies
    1. vak రంగారావు గారు,

      నా బ్లాగ్ పోస్ట్ చదివి కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు. ఇది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.

      హనుమంతుని ముందు కుప్పిగంతులు వెయ్యను. కాబట్టి మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలుగా ఒప్పేసుకుంటున్నాను.

      'లిల్లీపుట్' పదం మీరు వాడి ఉండరు. ఆ రోజు మీరు SDB గూర్చి చాలా గొప్పగా చెప్పారు. బహుశా అందువల్ల నా పోస్టులో (inadvertently) ఆ పదం చేరి ఉండొచ్చు. (మీరు నా పోస్ట్ చదువుతారనుకున్నట్లయితే ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకునేవాణ్ని). అందుకు మీరు నన్ను క్షమించాలి.

      Delete
    2. ఈ పోస్టులో, ఇక్కడి కామెంట్లలో SDB & RDB గురించి మీ సంభాషణ హాస్యస్ఫోరకంగాను, కొన్ని విలువైన విషయాలను తెలిపేదిగాను బావుంది. Salil Choudhury & SD Burman (గతంలో Noushad) లను సమున్నతంగా ఆవిష్కరించడం ఇంకా బావుంది. ఇలాంటి మంచి విషయాలను మరిన్నింటినీ ఈ జనరేషనుకు అందించి fine aestheticsకు సంబంధించి లింకును, కనెక్టివిటీని కొనసాగించగలరు. ఎందుకంటే గొప్పది, విలువైంది ఏది అన్న ప్రమాణం, కొలబద్ధ తెలీకపోతే మనుషులంతా లిల్లిపుట్స్ గా మారిపోయే ప్రమాదముంది. పైగా, ఇవాళ్రేపు మనుషుల్లో animal instinctsను సైతం నిద్రలేపి పిచ్చిపట్టినట్టు ప్రవర్తించే రీతిలో పాప్, జాజ్, డిస్కో తరహా గొప్పగొప్ప మ్యూజిక్ కంపోజర్లు పుట్టగొడుగుల్లా మనదగ్గర చాలామందే పుట్టుకొస్తున్నారు. వాళ్లనే గొప్పవాళ్లుగా భావించి, వాటిల్లో పడి మాలాంటి మెజారిటీ వాళ్లు కొట్టుకుపోయే ప్రమాదముంది. థాంక్యూ!!

      Delete
  6. In my opinion, there were many geniuses among Hindi cinema music composers. C. Ramachandra, Ravi, OP Nayyar, Naushad, Shankar Jaikishan, Kalyanji Anandji, Madan Mohan and Hemant Kumar (in no particular order) all qualify eminently.
    BSR

    ReplyDelete
    Replies
    1. మీ హిందీ సంగీత దర్శకుల జాబితా సుసంపన్నంగాను, వారిపై మీ ప్రశంస ప్రశస్థంగాను, మొత్తంగా మీ వ్యాఖ్య పరిపూర్ణంగాను బావుంది. థాంక్యూ!

      Delete
  7. పాట మొత్తం single shot లో తీసినట్టున్నారు...

    ReplyDelete
  8. ఇప్పుడే ఫేస్‌బుక్‌లో పెట్టిన టపా -
    నాకు ఈ పాట వినడమూ, చూడడమూ ఇష్టం. వారం క్రితం B4Uలో ఆరాధన సినిమా వస్తుంటే మిగతా పన్లన్నీ మానేసి టివికి కళ్ళప్పచెప్పేశాం. నిన్న మిత్రుడు రమణ బ్లాగు (http://yaramana.blogspot.com/2013/08/blog-post_17.html) చదివినప్పుడు అందరితో ఇంకోసారి పంచుకోవాలి అనిపించింది.

    ఈ పాట మూడు నిమిషాల నలభై సెకన్లు మొత్తం ఒకటే ట్రాలీ షాట్. సెట్టులో లైటింగ్ అంతా ఒక్కలా ఉండదు. ఆర్టిస్టులు కదులుతూ ఉంటారు. ఫ్రేమింగ్ మారుతూ ఉంటుంది. హీరో హీరోయిన్ల ఇద్దరి ముఖాల్లోనూ, బాడీ లాంగ్వేజ్‌లోనూ వాళ్ళ మోహం, ఆవేశం, దగ్గరవ్వాలన్న కోరిక, దూరంగా ఉండాలన్న కట్టుబాటు, ఆ సంఘర్షణ కలిగిస్తున్న తడబాటు స్పష్టంగా తెలియాలి. మళ్ళీ హీరో హీరోయిన్ల అందమూ ఎక్కడా చెడకూడదు. సినిమాలో చాలా కీలకమైన సన్నివేశం. మూడు నిమిషాల నలభై సెకన్లు. ఇదంతా ఒక్క షాట్‌లో తీద్దామని అనుకోవడం ఏమిటి? ఎంత ధైర్యం కావాలి? ఆర్టిస్టుల మీద, టెక్నీషియన్ల మీద, తన సృజనశక్తి మీద దర్శకుడికి ఎంత నమ్మకం ఉండాలి? నాకు తెలిసి ఇలా చిత్రీకరించిన పాట మరోటి లేదు. శక్తి సామంత, తుస్సీ జహాపనా హో!

    సాహిత్యం, సంగీతం, గానం, అబినయం, సెట్ డిజైన్, కెమెరామన్ పనితనం, షాట్ ప్లానింగ్ అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరిన, అరుదైన అద్భుత సినిమా అనుభవం ఈ పాట.

    కాదంటారా, ఇంకోసారి వినండి, చూడండి. ఆడియో మ్యూట్‌లో పెట్టి విడియో చూడండి. విడియో లేకుండా పాట వినండి. ఇప్పుడు చెప్పండి.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.