Tuesday 26 July 2011

నాడు గిరీశం - నేడు నిత్యానందం


నిత్యానందుని శృంగారం,  కల్కివారి మత్తుమందులు, విజ్ఞుల ఆక్రందనలు - టీవీలో చూళ్ళేక ఛస్తున్నా. ఒకప్పుడు బాబాలు - తగ్గని రోగాలకీ, రాని ఉద్యోగాలకీ, పుట్టని పిల్లలకీ తాయెత్తులు కట్టేవాళ్ళు. ప్రస్తుతం ఈ బాపతు మనూరి మునిసిపాలిటీ బడివలే పేదోళ్ళకే పరిమితమయ్యారు. 

ఇప్పుడు అమెరికా అనకాపల్లి కన్నా దగ్గరైపోయింది. డాలర్లు ఏరులై పారుతున్నాయ్. మన అవసరార్ధం కార్పోరేట్ ఆసుపత్రులూ, షాపింగ్ మాల్సూ, పబ్బులూ,  క్లబ్బులూ వెలిశాయి. యోగా, భక్తిమార్గం corporatize చేసుకొన్నాం. యోగం, ధ్యానం, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మలను కలగలుపుతూ ఇంగ్లీషులో అనర్గళంగా ప్రసంగించే కొత్తదేవుళ్ళని సృష్టించుకొన్నాం.

మన career prosperity కి వారి పాలరాతి మందిరాల్లో, భక్తిప్రసాద రిసార్టుల్లో ముక్తి నొసంగెదరు, మనకి గుండెల నిండా గాలి ఎలా పీల్చుకోవాలో నేర్పించెదరు, మనసులోని కుళ్ళు వదిలించెదరు. డబ్బున్నబాబులకి ఈ భక్తి టూరిజం ఓ ముక్తిమార్గం. కాదన్డానికి మనవెవరం? 

ప్రజల అవసరార్ధం గిరీశాలు పుట్టుకొస్తారు. సొమ్ము చేసుకొంటారు. గిరీశాన్ని నమ్మి లేచిపోయిన బుచ్చమ్మది తప్పవుతుందిగానీ.. తన వాక్చాతుర్యంతో బుచ్చమ్మని నమ్మించిన గిరీశానిది తప్పెలా అవుతుంది?! 

రూపసి అయిన గిరీశం నాలుగు బొట్లేరు ఇంగిలీసు మాటలతో (గిరీశం పట్ల గల అసూయతో రామప్ప పంతులు బొట్లెరింగ్లీషంటాడే గానీ గురజాడవారు గిరీశంతో మంచి ఇంగ్లీషే మాట్లాడించారు.) బుచ్చమ్మని పడేసాడు. వైధవ్యం నుండీ అగ్నిహోత్రుని అగ్నినుండీ విముక్తి లభిస్తుందని బుచ్చమ్మ నమ్మింది. అయినా లేవదీసుకుపోయిన గిరీశానికీ, లేచిపోయిన బుచ్చెమ్మొదినకీ లేని బాధ మనకేల? 

మోసం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వస్తుమార్పిడి వంటిది. చదరంగం ఆట లాంటిది కూడా. మనమెవ్వరి పక్షమూ వహించనక్కర్లేదు. కానీ నాకు గిరీశాలన్నా, నిత్యానందులన్నా అసూయ - ఎందుకు? మోసం చెయ్యడానికి తెలివి కావాలి. ఆ తెలివి లేనివాడు మాత్రమే భవిష్యత్తు కోసం, భుక్తి కోసం చదువనో, వ్యాపారమనో నానా కష్టాలు పడతాడు. నేను రెండో కేటగిరీకి చెందినవాణ్ణి, అందుకు! 

(picture courtesy : Google)

Wednesday 20 July 2011

బిరుదులు - బరువులు


టీవీలో ఏదో సినిమా వేడుక చూపిస్తున్నారు. వేదికపై కళాతపస్వి, దర్శకేంద్రుడు, దర్శకరత్న, యువసామ్రాట్, మెగాస్టార్ మొదలైన పెద్దలు ఆశీనులైవున్నారు. ఈ బిరుదులు, విశేషణాలు ఎవరన్నా ఇచ్చారో, వాళ్ళే తగిలించుకున్నారో నాకు తెలీదు. 

'విశ్వవిఖ్యాత నటసార్వభౌమ' అని ఎన్టీరామారావుకి ఒక బరువైన బిరుదుంది. అయితే ఆంధ్రరాష్ట్రం దాటితే నటుడు ఎన్టీఆర్ అంటే ఎవరికీ తెలీదని నా నమ్మకం. 'నవరసనటనా సార్వభౌమ' అంటూ సత్యనారాయణకి కూడా ఒక మెలికల బిరుదుంది. నవరసాల సంగతెందుగ్గాని సత్యనారాయణ ప్రేమరసం అభినయిస్తే జనాలు పారిపోతారని నమ్ముతున్నాను.

మన తెలుగువాడికి పేరుకి ముందు ఏదో ఒక విశేషణ తగిలించుకుంటేగానీ తుత్తిగా ఉండదేమో! భౌతికశాస్త్ర భయంకర Newton, మనోకల్లోల Freud, చిత్తచాంచల్య Adler, కథకచక్రవర్తి Maupassant, శాంతివిభూషణ J.F. Kennedy, జగదోద్ధారక Karl Marx, నటనాడింఢిమ Marlon Brando, హాస్యవిశారద Charlie Chaplin - ఇట్లా పేర్లముందు నానాచెత్త చేర్చి పైశాచికానందాన్ని పొందుతాం. వాళ్ళు తెలుగువాళ్ళు కాదు కాబట్టి పెనుప్రమాదం తప్పించుకున్నారు!  

బిరుదుల విషయంలో ప్రభుత్వాలూ భలే ఉత్సాహంగా వుంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ్ వగైరా అవార్డుల పేర్లతో తెగ హడావుడి చేస్తాయి. సూర్యకాంతానికి ముందు పద్మశ్రీ అని చేర్చి - పద్మశ్రీ సూర్యకాంతం అని చదువుకోండి. అబ్బ, ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో! మరప్పుడు ఈ బిరుదులకి కల ప్రయోజనమేమి!? 

ప్రతిభకి అసలైన బిరుదు సామాన్యప్రజలే ఇచ్చేస్తారని నా అభిప్రాయం. 'ఎన్టీవోడు ఇరగదీసాడ్రా, నాగ్గాడు అదరగొట్టాడు, కైకాలోడికి తిక్క కుదిరింది. దరిద్రప్ముండ సూర్యకాంతం - పాపం! సావిత్రిని రాచిరంపాన పెడ్తుంది.' మెచ్చుకునేప్పుడు కూడా ముద్దుగా తిట్టుకుంటూ మెచ్చుకునే అలవాటు మనది. అసలైన బిరుదులు ఇవేనని నా అభిప్రాయం.

(picture courtesy : Google)         

Thursday 14 July 2011

మీ (మా) వారపత్రిక


నా చిన్నప్పుడు వారానికొక రోజు కొరియర్ బాయ్‌గా పన్జేసేవాణ్ని. డబ్బు కోసం కాదు - సైకిల్ కోసం! కొంచెం వివరంగా రాస్తాను. ఆరోక్లాసులో నాకు విశ్వం అనే స్నేహితుడు ఉండేవాడు. మనిషి సౌమ్యుడు మరియూ సాత్వికుడే గానీ - తన అన్న డొక్కుసైకిలు తొక్కుతూ బెంజ్ కారు  నడుపుతున్నంత బిల్డప్ ఇచ్చేవాడు. విశ్వం వైభోగానికి ఈర్ష్యాసూయలతో రహస్యంగా కుళ్ళుకునేవాణ్ణి. ఆపై శకుని మామలా తీరిగ్గా ఆలోచించి, ఆ డొక్కుసైకిలు తొక్కే అవకాశం కోసం మావాడితో స్నేహం డోసు పెంచాలని నిర్ణయించుకున్నాను.  
                         
స్కూలు టైము తరవాత పేరట్లో ఉన్న ఉసిరి (చెట్టు) కాయలు తీసుకెళ్ళి వాడికివ్వటం, వాడి చేతిరాత చాలా బాగుంటుందనీ, నాకన్నా వాడికే లెక్కలు బాగా వచ్చని పొగడటం.. ఇత్యాది ప్రణాళికలు రచించి అమలుపర్చాను. కష్టేఫలి! మొత్తానికి విశ్వం ఆంతరంగికులలో చోటు సంపాదించాను. తద్వారా ఆ సైకిల్ తొక్కే అర్హత నాక్కూడా లభించింది.

సైకిల్ తొక్కుతూ ఆనందపరవశుణ్ణైపొయ్యేవాణ్ణి. నేను సైకిల్ తొక్కుతుంటే సైకిలు సీటు ముందున్న కడ్డీ విశ్వానికి ఉచితాసనం. అలానే విశ్వం డ్రైవరయితే నేనా కడ్డీమీద. నిమిషానికొకసారి పడే చైన్ వేసే బాధ్యత కడ్డీ మీదవాడిది! ఆవిధంగా డివిజన్ ఆఫ్ లేబర్ని కూడా పాటించేవాళ్ళం.
                         
అసలు విషయంలోకి వస్తాను. విశ్వం అన్న (సైకిలు సొంతదారుడు) అప్పటికే ఏదో డిగ్రీలాంటిదేదో చదువుకుని ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నాడు. ఆయన మాకో పన్జేప్పేవాడు. అదేమంటే - ప్రతివారం (శుక్రవారమా?) పొద్దున్న రైల్వే స్టేషన్‌కి సైకిల్ తొక్కుకుంటూ పోయి హిగ్గిన్ బోథమ్స్‌లో ఆంధ్రపత్రిక (సచిత్రవారపత్రిక) కొనే పని. సైకిల్ కి తాళం లేదు కావున ఒకడు రైల్వే స్టేషన్లోకి వెడితే ఇంకోడు సైకిలుకి కాపలాగా బయటే ఉండాల్సొచ్చేది.    
                 
ఆంధ్రపత్రిక కొని సైకిల్ని వాయువేగంతో, శరవేగంతో తొక్కుతూ (తొందరగా తొక్కేవాళ్ళం అని రాస్తే సరిపోతుంది, కానీ - అంత కష్టపడి తొక్కిన తొక్కుణ్ణి విశేషణాలేమీ జోడించకుండా సింపు్ల్‌గా రాయటం నాకిష్టం లేదు) ఇంటికి తెచ్చి విశ్వం అన్నకి ఇచ్చేవాళ్ళం.
                   
ఆయన అప్పటికే పోస్టు కార్డుతో రెడీగా ఉండేవాడు. పత్రిక ఒక అరనిమిషం ముందుకీ, వెనక్కీ తిరగేసేవాడు. ఆ తరవాత ఒకే నిమిషంలో ముత్యాల్లాంటి అక్షరాలతో ఆంధ్రపత్రిక సంపాదకులవారికి ఉత్తరం రాసేవాడు.

ప్రతివారం ఒకటే మేటర్! మీ (మా) వారపత్రికలో ఫలాన కధ అద్భుతం. సీరియల్ తదుపరి భాగం కోసం ఇంట్లో అందరం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం. మీరు రాసిన వంటింటి చిట్కాలు అమోఘం. అందులో చెప్పిన ఫలానా వంటకం మా చెల్లెలు (ఆయనకసలు చెల్లెల్లేదు) తయారుచేసింది. ఆ రుచిని తట్టుకోలేకపోతున్నాం. ఇట్లా పోస్టు కార్డులో వ్యాసం లాంటిది రాసేవాడు.
                             
ఆయన రాసిన పోస్టు కార్డుని తీసుకుని - మళ్ళీ వాయువేగంతో, శరవేగంతో (ఈ విశేషణాలని మీరు తప్పించుకోలేరు) సైకిల్ తొక్కి, అరండల్‌పేట పెద్ద పోస్టాఫీస్ ముందుండే పెద్ద డబ్బాలో వేసేవాళ్ళం. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయేది.
                             
విశ్వం అన్న రాసిన ఉత్తరాలు అప్పుడప్పుడు పబ్లిషయ్యేవి. కానీ - ఆ ఉత్తరం 'పాఠకుల ఉత్తరాలు' శీర్షికలో రెండోదిగానో, మూడోదిగానో ఉండేది! ఎందుకో నాకర్ధమయ్యేది కాదు. నా శ్రమకి తగ్గ ఫలితం లభించట్లేదని బాధా కలిగేది.  

ఒకరోజు విశ్వం అన్న నాకు అసలు రహస్యం చెప్పాడు.
                             
ఆంధ్రపత్రిక బెజవాడ నుండి పబ్లిషవుతుందిట. బెజవాడవాళ్ళు పత్రిక రిలీజు కాకముందే ఒక కాపీ సంపాదించి, గబగబా ఉత్తరం రాసేసి పత్రిక ఆఫీస్ ముందున్న పోస్ట్ డబ్బాలో వేసేస్తారట, లేదా డైరక్ట్‌గా ఆఫీస్‌లోనే ఇచ్చేస్తార్ట. అంచేత బెజవాడ వాళ్ళు మా గుంటూరు వాళ్ళకన్నా ఎంతో ముందుంటారు. ఔరా! ఈ బెజవాడవాళ్ళు ఎంత తొందరపాటు మనుషులు!!

(photo courtesy : Google)    

Saturday 9 July 2011

కొ.కు. 'ఐశ్వర్యం' - చలం ప్రస్తావన

గుంటూరులో రాతగాళ్ళ వాతావరణం నాకంతగా కనిపించలేదుగానీ తెనాల్లో బాగా కనిపించింది. ఎదురింటి శేషాచలం దగ్గిర చలం పుస్తకం ఒకటి తీసుకున్నాను చదువుదామని.
       
"చదవక చదవక ఆ బూతు కథలే చదువుతున్నావ్?" అన్నాడు బాబాయి.
       
"బూతులేని సాహిత్యం ఎక్కడుంది బాబాయ్? నీ బీరువాలో ఆ మనుచరిత్ర ఏమిటి? బూతుకథలు కావూ ?" అన్నాను .
       
"అవి అంత తేలిగ్గా అర్ధమవుతాయా? వసుచరిత్ర, ఆముక్తమాల్యదా తీసి చదివి అర్ధం చెప్పు చూద్దాం."
       
"అందులో వాటికన్న ఇది మంచిది. ఇందులో ఉండే బూతు చక్కగా అందరికీ అర్ధమవుతుంది."
                     
బాబాయి కొంచెం ఆలోచించి "బూతు ఉంటే ఉంది. నీతి కూడా ఉండాలిగా. ఆ చలం కథల్లో నీతి లేదు." అన్నాడు.
                     
"నీతి లేకేం బాబాయ్? ఉంది. నువ్వొప్పుకునే నీతి కాదేమో?"
                     
"ఒప్పుకోవటానికి వీల్లేని నీతిని అవినీతి అంటారు. ఆమాత్రం తెలీదురా?" అన్నాడు బాబాయ్.
                   
"నిజమే బాబాయ్, కాని ఒకరి నీతి ఒకరికి అవినీతి కావచ్చు. నన్నడిగితే పురాణాలన్నీ బూతూ, అవినీతీనూ. కుంతి అడ్డమైనవాళ్ళకూ పిల్లల్ని కనటమూ నాకు బాగాలేదు. వ్యాసుడు వెధవముండలకు కడుపులు చెయ్యటమూ, వాళ్ళ సంతానం దేవతాంశంతో పుట్టినవాళ్ళని చెప్పటమూ నా బుద్ధికి దారుణంగా ఉంది. ద్రౌపదికి అయిదుగురు మొగుళ్ళు! ఈ ఛండాలమంతా ఉంది కనక భారతం సాహిత్యం కాదని నేనంటున్నానా? చలం కథల్ని నువ్వు కొట్టెయ్యకూడదు."
                   
"అయితే ఈ దిక్కుమాలిన కథలను భారతంతో పోలుస్తావా?"
                   
"ఎందుకు పోలుస్తానూ? భారతంలో ఉండే మనుషులూ, వాళ్ళ బుద్ధులూ, కష్టాలూ, సుఖాలూ, ఆచారాలూ - ఏవీ నాకర్ధం కావు. ఇందులో నాకు తెలిసిన మనుషుల జీవితమూ, బుద్ధులూ, ఆచారాలూ ఉన్నాయి. నాకిదే మంచి సాహిత్యంగా కనిపిస్తుంది."
                       
"నీతో మాట్లాడుతూ కూర్చుంటే అయినట్టే. అవతల పేపర్లు దిద్దుకోవాలి." అంటూ బాబాయి తప్పుకున్నాడు. నాకు ప్రశాంతంగా కూర్చుని "పాపం!" చదువుకునే అవకాశం దొరికింది.

(కొడవటిగంటి కుటుంబరావు నవల 'ఐశ్వర్యం' నుండి)
   కుటుంబరావు సాహిత్యం.
   మొదటి సంపుటం.
   ప్రధమ ముద్రణ - జనవరి, 1982.  
   పేజీలు .. 143 - 144  
   రచనా కాలం .. 1965 - 66 .  
   సంపాదకుడు - కేతు విశ్వనాథరెడ్డి .
   విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ .

(photos courtesy : Google)

Friday 1 July 2011

రావిశాస్త్రిని గాంచిన వేళ


"ఇది ఇందూదేసెం! ఈ దేసంలోనే గాదు, ఏ దేసంల అయినసరె పోలోసోడంటే గొప్ప డేంజిరిస్ మనిసని తెలుసుకో! ఊరికి ఒకుడే గూండా ఉండాలా, ఆడు పోలీసోడే అవాల. అప్పుడె రాజ్జెం ఏ అల్లర్లు లేకండ సేంతిబద్రతలు సక్కగ ఉంటయ్. అంచేత్త ఏటంతే, పులికి మీసాల్లాగినట్లు పోలోసోడితో దొంగసరసం జెయ్యకు! సాలా డేంజిరు!.. "

ఈ వాక్యాలు ఎవరివో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సాహిత్యంలో ఇలా రాయడం ఒక్క రావిశాస్త్రికి మాత్రమే సాధ్యం. పై వాక్యాలు 'మూడుకథల బంగారం'లో సూర్రావెడ్డు బంగారిగాడికి చేసిన ఉపదేశం.

ఒక పద్ధతిగా, ప్రశాంతంగా, హాయిగా, నింపాదిగా సాగిపోతున్న నా జీవితం - ఒక్కసారిగా పెద్ద కుదుపుకు లోనయ్యింది. అందుక్కారణం రావిశాస్త్రి! నేను హౌజ్ సర్జన్సీలో ఉండగా 'ఆరుసారా కథలు' చదివాను. ఆ భాషా, ఆ వచనం, ఆ భావం - దిమ్మ తిరిగిపోయింది. 

అంతకుముందు వరకు స్థిరంగా, గంభీరంగా నిలబడే అక్షరాల్ని చదివాను గానీ - లేడిలా చెంగుచెంగునా పరుగులు తీస్తూ, పాములా సరసరా మెలికలు తిరిగే వచనాన్ని నేనెప్పుడూ చదవలేదు. ఆ తరవాత రావిశాస్త్రిని ఒక్కపేజీ కూడా వదల్లేదు. నాకు గుర్తున్నమటుకు నా మెడిసిన్ సబ్జక్టు పుస్తకాలు కాకుండా రిపీటెడ్‌గా చదివింది రావిశాస్త్రినే! శ్రేయోభిలాషులైన నా మిత్రులు 'పీజీ ఎంట్రన్స్ పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలి గానీ నీకీ రావిశాస్త్రి పిచ్చేమిటి?' అని విసుక్కున్నారు.

విశాఖపట్నం వెళ్ళాలి, రావిశాస్త్రిని కలవాలి. ఎలా? ఎలా? ఎలా? నాకు విశాఖపట్నం వెళ్ళడం సమస్య కాదు, కానీ రావిశాస్త్రిని ఎలా కలవాలి? అందుగ్గాను ఎవర్ని పట్టుకోవాలి? ఇదే సమస్య. 

'రావిశాస్త్రిని కలిసి ఏం మాట్లాడతావోయ్?' 

'అయ్యా! దేవుణ్ని దర్శనం చేసుకోవాలి, కుదిర్తే కాళ్ళ మీద పడి మొక్కాలి. అంతేగానీ - దేవుడితో మాట్లాడాలనుకోవడం అత్యాశ!'

ఈ రకమైన ఆలోచనల్లో వుండగా - విశాఖ ప్రయాణం ఒకరోజు రాత్రికిరాత్రే హడావుడిగా పెట్టుకోవలసొచ్చింది. కారణం - మా సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ENB శర్మగారి అవసానదశ. పనిలోపనిగా రావిశాస్త్రిని కూడా కలవాలనే ఎజెండా కూడా నా ప్రోగ్రాంలో చేర్చాను. ఆ రోజంతా రావిశాస్త్రి ఇంటి ముందు బీటేసినా లాభం లేకపోయింది.

కొన్నాళ్ళకి నా అదృష్టం ధనలక్ష్మి లాటరీ టిక్కెట్టులా తలుపు తట్టింది. రావిశాస్త్రి ఒక పుస్తకావిష్కరణ సభకి గుంటూరు రావడం జరిగింది. చివరిక్షణంలో సమాచారం తెలుసుకున్న నేను 'భలే మంచిరోజు, పసందైన రోజు' అని మనసులో పాడుకుంటూ ఉరుకుపరుగులతో ఏకాదండయ్య హాలు దగ్గరకి చేరుకున్నాను. 

అక్కడ హాల్ బయట ఓ పదిమంది నిలబడి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. నేనూ ఓ పక్కగా నించుని రావిశాస్త్రి కోసం ఎదురు చూడసాగాను. ఒక్కొక్కళ్ళుగా సభస్థలానికి చేరుకుంటున్నారు. 'రావిశాస్త్రి రాలేదేమో?' కొద్దిగా అనుమానం, ఇంకొద్దిగా నిరాశ. 

ఓ పదినిమిషాలకి - అర చేతుల చొక్కా టక్ చేసుకుని - తెల్లటి వ్యక్తి, నల్లటి ఫ్రేం కళ్ళద్దాలతో నిదానంగా నడుచుకుంటూ ఆవరణలోకి రావడం కనిపించింది. ఆ వ్యక్తి ఎవరో నాకెవ్వరూ చెప్పనక్కర్లేదు. ఆ వ్యక్తి నాకు అనేక ఫోటోల ద్వారా చిరపరిచితం. ఆయన రావిశాస్త్రి!

క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఎంతో ఉద్వేగంగా రావిశాస్త్రి కోసం ఎదురు చూసిన నేను - తీరా ఆయన వచ్చేసరికి చేష్టలుడిగి నిలబడిపొయ్యాను. ఈ లోపు కొందరు ఆయనతో మాట్లాడ్డం మొదలెట్టారు. రావిశాస్త్రినే గమనిస్తూ ఆయనకి సాధ్యమైనంత సమీపంలో నిలబడ్డాను. ఈలోపు నేను మెడికల్ డాక్టర్నని ఆయనకెవరో చెప్పారు. నాకేసి చూస్తూ 'మా చెల్లెలు నిర్మల తెలుసా?' అనడిగారు.

'తెలుసు. వారు నాకు ఫార్మకాలజి పరీక్షలో external examiner సార్.' అని బదులిచ్చాను. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇంతే!

రావిశాస్త్రి ప్రక్కన చాలాసేపు గడిపాను (నిలబడ్డాను). ఒక్కమాట మాట్లాడలేదు. ఎవరెవరో ఏంటేంటో అడుగుతున్నారు. అవన్నీ - 'రాజు - మహిషి' ఎప్పుడు పూర్తిచేస్తారు? 'రత్తాలు రాంబాబు'ని పూర్తి చెయ్యకుండా ఎందుకు వదిలేశారు?' వంటి రొటీన్ ప్రశ్నలే. అవన్నీ నా మనసులో మెదలాడే ప్రశ్నలే! అయితే - నాకు వాళ్ళ సంభాషణ చికాకు కలిగించింది. 

'రావిశాస్త్రి నావాడు, నాకు మాత్రమే చెందినవాడు, నా మనిషిని ఇబ్బంది పెడతారెందుకు? అసలిక్కడ మీకేం పని? పోండి పోండి!'

నేను తెలివైనవాణ్ని. అందుకే కళ్ళు పత్తికాయల్లా చేసుకుని రావిశాస్త్రినే చూస్తూ ప్రతిక్షణం నా మనసులో ముద్రించుకున్నాను. ఎందుకంటే - నాకు తెలుసు. ఆ క్షణాలు నా జీవితంలో అమూల్యమైనవిగా కాబోతున్నాయని. అందుకే ఈ రోజుకీ రావిశాస్త్రి నాకు అతి దగ్గరలో నిలబడి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాను. ఈ అనుభూతి నాకు ఎంతో ఆనందాన్ని, మరెంతో తృప్తినీ కలిగిస్తుంది. 

ఒక్కోసారి అనిపిస్తుంది - నేనారోజు రావిశాస్త్రి ముందు ఎందుకలా నిలబడిపోయాను!? ఒక మహోన్నత శిఖరం ముందు నిలబడ్డప్పుడు ఆ దృశ్యసౌందర్యానికి spellbound అయిపోయి.. చేష్టలుడిగి నిలబడిపోతాం. ఆ రోజు నా స్థితి అట్లాంటిదేనా? అయ్యుండొచ్చు! 

(photo courtesy : Google)