టీవీలో ఏదో సినిమా వేడుక చూపిస్తున్నారు. వేదికపై కళాతపస్వి, దర్శకేంద్రుడు, దర్శకరత్న, యువసామ్రాట్, మెగాస్టార్ మొదలైన పెద్దలు ఆశీనులైవున్నారు. ఈ బిరుదులు, విశేషణాలు ఎవరన్నా ఇచ్చారో, వాళ్ళే తగిలించుకున్నారో నాకు తెలీదు.
'విశ్వవిఖ్యాత నటసార్వభౌమ' అని ఎన్టీరామారావుకి ఒక బరువైన బిరుదుంది. అయితే ఆంధ్రరాష్ట్రం దాటితే నటుడు ఎన్టీఆర్ అంటే ఎవరికీ తెలీదని నా నమ్మకం. 'నవరసనటనా సార్వభౌమ' అంటూ సత్యనారాయణకి కూడా ఒక మెలికల బిరుదుంది. నవరసాల సంగతెందుగ్గాని సత్యనారాయణ ప్రేమరసం అభినయిస్తే జనాలు పారిపోతారని నమ్ముతున్నాను.
మన తెలుగువాడికి పేరుకి ముందు ఏదో ఒక విశేషణ తగిలించుకుంటేగానీ తుత్తిగా ఉండదేమో! భౌతికశాస్త్ర భయంకర Newton, మనోకల్లోల Freud, చిత్తచాంచల్య Adler, కథకచక్రవర్తి Maupassant, శాంతివిభూషణ J.F. Kennedy, జగదోద్ధారక Karl Marx, నటనాడింఢిమ Marlon Brando, హాస్యవిశారద Charlie Chaplin - ఇట్లా పేర్లముందు నానాచెత్త చేర్చి పైశాచికానందాన్ని పొందుతాం. వాళ్ళు తెలుగువాళ్ళు కాదు కాబట్టి పెనుప్రమాదం తప్పించుకున్నారు!
బిరుదుల విషయంలో ప్రభుత్వాలూ భలే ఉత్సాహంగా వుంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ్ వగైరా అవార్డుల పేర్లతో తెగ హడావుడి చేస్తాయి. సూర్యకాంతానికి ముందు పద్మశ్రీ అని చేర్చి - పద్మశ్రీ సూర్యకాంతం అని చదువుకోండి. అబ్బ, ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో! మరప్పుడు ఈ బిరుదులకి కల ప్రయోజనమేమి!?
ప్రతిభకి అసలైన బిరుదు సామాన్యప్రజలే ఇచ్చేస్తారని నా అభిప్రాయం. 'ఎన్టీవోడు ఇరగదీసాడ్రా, నాగ్గాడు అదరగొట్టాడు, కైకాలోడికి తిక్క కుదిరింది. దరిద్రప్ముండ సూర్యకాంతం - పాపం! సావిత్రిని రాచిరంపాన పెడ్తుంది.' మెచ్చుకునేప్పుడు కూడా ముద్దుగా తిట్టుకుంటూ మెచ్చుకునే అలవాటు మనది. అసలైన బిరుదులు ఇవేనని నా అభిప్రాయం.
(picture courtesy : Google)
