Showing posts with label టీవీ. Show all posts
Showing posts with label టీవీ. Show all posts

Saturday, 20 December 2014

టీవీ యాంకరుడు


"బావా! బావోయ్!"

"వూఁ!"

"నాకో తెలుగు టీవీలో యాంకరుద్యోగం వొచ్చింది బావా!"

"నువ్వా! టీవీ యాంకరా! ఉద్యోగవిఁచ్చిన గాడిదెవరు?"

"గాడిద కాదు బావా - మనిషే! తుళ్ళూర్లో పదెకరాల పొలం - రోడ్డు పక్కనే అద్దిరిపొయ్యే బిట్టు -  ఒక ఐదరాబాద్ పార్టీకి ఇప్పించాలే! పార్టీ ఫుల్లు హేపీసు! ఆ పార్టీకి ఐదరాబాదులో ఏదో టీవీ చానెలుందంట! నాకందులో యాంకరుద్యోగం ఇచ్చేసారు."

"వార్నీ! బ్రోకరేజితో పాటు ఉద్యోగం కూడా కొట్టేశావన్న మాట. గుడ్!"

"సర్లేగానీ బావా! ఇంతకీ టీవీ యాంకరంటే ఏంజెయ్యాలి?"

"రోజూ టీవీలో ఏదోక విషయం మీద చర్చలొస్తుంటయ్ కదా! వాటిని మోడరేట్ చెయ్యడాన్నే ఏంకరింగ్ అంటారు."

"అటూ ఇటూ మనుషుల్ని కూర్చోబెట్టుకుని కొచ్చిన్లు అడుగుతారు! యాంకర్లంటే ఆళ్ళేనా?"

"అవును."

"కానీ నాకు కొచ్చిన్లు అడగడం రాదే! ఏదైనా సలా ఇవ్వు బావా!"

"దాన్దేవుఁంది! 'దేవుడున్నాడా? లేడా? భగవద్గీత పవిత్ర గ్రంధమా? కాదా? అమ్మాయిలు లంగా వోణీలే వేసుకోవాలా? ఇవ్వాళ తెలుగు సినిమాల్లో నంబర్ వన్ హీరో ఎవరు?' అంటూ వివాదాస్పద విషయాల్ని చర్చకి పెట్టు. అవుననేవాళ్ళని, కాదనేవాళ్ళనీ చెరిసమంగా పిలువ్. వాళ్ళు అరుచుకుంటూ వుంటారు - నువ్వు వింటూ వుండు, చాలు."

"అంతేనా! సర్లే - అట్లాగే ఓ మంచి దమ్మున్న ప్రోగ్రాం కూడా చెప్పు బావా!"

"దమ్ము కోసం ఏకంగా ఒక చానెలే వుంది, ఇంక నువ్వు కొత్తగా చేసేదేముందిలేగానీ - ఒక పన్జెయ్! ఊళ్ళల్లో మొగుడూ పెళ్ళాల తగాదాలు, వివాహేతర సంబంధాలు వున్న కుటుంబాల్ని వెతుక్కో - వాళ్ళని లైవ్‌లోకి తీసుకో! వాళ్ళింక గంటల కొద్దీ తిట్టుకు ఛస్తారు, నీ అదృష్టం బాగుంటే కొట్టుకు ఛస్తారు కూడా!"

"అంతా బాగానే చెబ్తున్నావ్ గానీ - నీకు తెలుసుగా బావా? నాకు రాజకీయాలు తెలీదు, ఏం చెయ్యాలంటావ్?"

"ఏముంది! అధికార, ప్రతిపక్ష పార్టీలవాళ్ళని పిల్చి స్టూడియోలో కూర్చోబెట్టుకో. ఆ పిల్చేదేదో పాయింటు లేకుండా పెద్దగా అరుస్తూ పోట్లాడేవాళ్ళనే పిలువ్ - అప్పుడే నువ్వు సేఫ్! ఆ రోజు తెలుగు దినపత్రికల్లో వార్తలు ఒకటొకటిగా చదువు! ఇంక వాళ్ళే ప్రోగ్రాంని నడిపిస్తారు. మధ్యలో వేడి తగ్గినప్పుడు కూసింత మంట రాజెయ్యి - చాలు."

"ఓస్! యాంకరింగంటే ఇంతేనా! వుంటా బావా! అక్కనడిగానని చెప్పు."

(photo courtesy : Google)

Monday, 30 December 2013

అన్యోన్య దాంపత్యం


గజలక్ష్మి, గజరాజులు భార్యాభర్తలు. వారిది విశాలమైన ఇల్లు. ఆ ఇంట్లో ఓ విశాలమైన హాలు. ఆ హాల్లో ఓ విశాలమైన సోఫా. ఆ సోఫాలో తమ విశాలమైన శరీరాల్ని ఇరుకిరుగ్గా సర్దుక్కూర్చునున్నారు.

గజరాజు ఓ రాజకీయ నేత. ప్రజాప్రతినిధి. కొన్నేళ్లుగా తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేశాడు.

ఫలితంగా ఓ పది ఫేక్టరీలు, వెయ్యెకరాల భూమిని సమకూర్చుకోగలిగాడు.

ప్రస్తుతం భార్యాభార్తలిరువురూ ఒక టీవీ వారికి ఇంటర్వ్యూ ఇస్తున్నారు.

గత కొన్నేళ్లుగా తెలుగు టీవీ చానెళ్ళకి క్రియేటివిటీ కరువైపోయ్యి.. ఏవేవో దిక్కుమాలిన కాన్సెప్టుల్తో ప్రోగ్రాములు చుట్టేస్తున్నారు.

'చిలకా గోరింకల అన్యోన్య దాంపత్యం' అనే ప్రోగ్రాం గత కొన్నాళ్ళుగా టీవీ 420 లో విశేష ప్రజాదరణ పొందింది.

ప్రోగ్రాంలో ప్రతివారం ఒక 'ప్రముఖ జంట'ని పనీపాటా లేని వీక్షకులకు పరిచయం చేస్తుంటారు.

గజలక్ష్మి అత్యంత బరువైన పట్టుచీర, మరింత బరువైన నగలతో కళకళలాడుతుంది.

గజరాజు తెల్లబట్టల్లో అచ్చు గోరింకలా మెరిసిపోతున్నాడు.

ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయి వచ్చీరాని తెలుగులో ఏవో ప్రశ్నలడుగుతూ.. వారిచ్చే సమాధానాల్ని బోల్డంత ఆసక్తిగా వింటుంది.

"మా ఆయన బంగారం. అహోరాత్రులు కుటుంబం గూర్చే ఆలోచిస్తుంటారు. అప్పటికీ చెబుతూనే ఉంటాను.. మరీ తీవ్రంగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుందని. ఏదీ వింటేనా?" గజలక్ష్మి మురిపెంగా చెప్పింది.

"నా భార్య ఉత్తమురాలు. అనుక్షణం నా అవసరాలు కనిపెడుతూ కంటికి రెప్పలా చూసుకుంటుంది. అది నా అదృష్టం." అపురూపంగా భార్యని చూసుకుంటూ అన్నాడు గజరాజు.

"రాబోయే వంద జన్మలక్కూడా ఈయనే నాకు భర్తగా లభించాలని రోజుకి వందసార్లు దణ్ణం పెట్టుకుంటాను." భక్తిగా అంది గజలక్ష్మి.

ఇలా అనేక ముచ్చట్లతో ఇంటర్వ్యూ ముగిసింది.

బుల్లితెరపై వచ్చేవారం మీ ఇంటర్వ్యూ చూసుకోండని చెప్పి టీవీ వాళ్ళు సర్దుకున్నారు.

ఓ రెండు నిముషాలు నిశ్శబ్దం.

సిగరెట్ వెలిగించాడు గజరాజు.

"ఈ జన్మకి పెట్టే హింస చాలదా? రాబోయే వంద జన్మలకి నీ దరిద్రపు మొహమేనా?" వెటకారంగా అన్నాడు గజరాజు.

గజలక్ష్మి గయ్యిమంది.

"మాటలు జాగ్రత్తగా రానీ. నీగూర్చి నాలుగు మంచి ముక్కలు చెప్పినందుకు సంతోషించు. నీ తిరుగుళ్ళ గూర్చి చెప్పానా? దందాల గూర్చి చెప్పానా?"

"ఛీపో! నీలాంటి దరిద్రప్ముండతో నాకు మాటలేంటి!" ఈసడించుకున్నాడు గజరాజు.

"ఛీఛీ పొప్పో! నీలాంటి పోరంబోకుల్తో మాట్లాడేదేంటి?" అసహ్యించుకుంది గజలక్ష్మి.

అయ్యా! అదీ సంగతి!

మీరందరూ వచ్చేవారం ఈ అన్యోన్య దంపతుల ప్రోగ్రాం చూసి తమ విలువైన అభిప్రాయం చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

(picture courtesy : Google)

Saturday, 2 November 2013

తెలుగు వ్యూస్ చానెళ్ళు


పరిచయం :

ఆ మధ్య ఆర్టీసీ వాళ్ళు సమైక్యాంధ్ర అంటూ కొన్నాళ్ళు సమ్మె చేశారు (అటు తరవాత ముఖ్యమంత్రితో బేరం మాట్లాడుకుని సమ్మె విరమించారనుకోండి). తదుపరి భోరున వర్షాలు. ఇన్ని సమస్యల మధ్య సామాన్యుడు ఇబ్బంది పడ్డాడు, నలిగిపోయ్యాడు, అవసరాల్ని ఆపుకున్నాడు.

అడవిలో ఆహార ప్రాణులు (అనగా ఆకులు, అలములు ముప్పొద్దులా సుష్టుగా మేసి, బాగా కండపట్టి.. ఆపై తీరిగ్గా సింహాలకి, పులులకి ఆహారం అయిపొయ్యే అర్భక ప్రాణులు) కష్టాల్లో పడితే వాటిని భుజించే జంతువులక్కూడా కష్టాలొస్తాయి. అదే విధంగా సామాన్యుని కష్టాల వల్ల, వారిపై ఆధారపడ్డ అనేక వృత్తుల వారికి కూడా కొన్నాళ్ళపాటు పన్లేకుండా పొయ్యింది.

ఒక కుట్ర :

వివేకవంతుడు తీరిక దొరికినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అజ్ఞాని మాత్రం దుర్వినియోగం చేస్తాడు. నేను అజ్ఞానిని కాబట్టి (ఈ విషయంలో నాకెటువంటి సందేహమూ లేదు), ఆ తీరిక సమయంలో ఎడాపెడా తెలుగు టీవీ చానెళ్ళు చూశాను. తద్వారా ఎంతో విజ్ఞానాన్ని, మరెంతో అజ్ఞానాన్ని సంపాదించాను. అజ్ఞానమైనా, విజ్ఞానమైనా నలుగురితో పంచుకుంటేనే సార్ధకత!

అదీగాక ఆ దిక్కుమాలిన టీవీ చానెళ్ళని చూసి ఎంతో విలువైన సమయాన్ని, మరెంతో విలువైన మనశ్శాంతిని కోల్పోయాను. నాకు కలిగిన ఈ నష్టానికి దుఃఖము మరియూ ఉక్రోశమూ కలుగుతుంది. బురదలో కూరుకుపోయ్యేవాడు వీలయితే పక్కవాడిని కూడా బురదలోకి లాగుతాడు. అదో తుత్తి. అంచేత నా తెలుగు టీవీ చానెళ్ళ వీక్షణానుభవాలు మీతో చదివించి, మీక్కూడా మనశ్శాంతి లేకుండా చెయ్యాలనే కుట్రలో భాగంగా ఈ పోస్టు రాస్తున్నాను.

కులం.. ఎంతో కమ్మనైనది :

మనదేశంలోని ప్రాంతీయ భాషలన్నింటిలోకి తెలుగులోనే న్యూస్ చానెళ్ళు ఎక్కువ. ఇది మనకి గర్వకారణం. తెలుగువారికి ప్రాంతాల వారిగా, కులాల వారిగా న్యూస్ చానెళ్ళు ఉన్నాయి. వీటిలో ఎక్కువ చానెళ్ళు ఒక కులం వారివే. మన తెలుగు సమాజంలో అత్యంత ఎక్కువ డబ్బులు ఆ కులం వారి చెంతనే ఉండుట చేత ఇది సహజ పరిణామం. ఆ చానెళ్ళకి ఎడిటర్లు కూడా ఆ ఓనర్ గారి కులం వాళ్ళే. ఇది కూడా సహజమే.

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు తెలుగువాడికి జనులందు సకుల జనుల పట్ల మిక్కిలి ప్రీతి. ఇది అనాదిగా కొనసాగుచున్న ఆచారము. అందువల్ల బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ లాగా చానెళ్ళ ఓనర్లు, ఎడిటర్లు ఒకే కులంవాళ్ళయితేనే వ్యాపారము అభివృద్ధి చెందును. ఈ సంగతి రాష్ట్రం బయటి వాడికి ఆశ్చర్యం కలిగిస్తుందేమో గానీ.. మనకి మాత్రం ఇదసలు విశేషమే కాదు.

ఇచట వార్తలు వండబడును :

వెనకటి కాలంలో చాదస్తపు పత్రికా సంపాదకులు వార్తల్ని ప్రచురించేప్పుడు ప్రజాహితమే పరమావధిగా భావించేవాళ్ళు(ట). ఇప్పుడు కూడా వార్తా సంస్థలకి హితమే ప్రధానం. అయితే అది ప్రజలకి సంబంధం లేని యాజమాన్యం వారి హితం. ఇది చాలాసార్లు ప్రజలకి అహితం కూడా.

నేతిబీరకాయలో నెయ్యుండదు. వార్తా చానెల్లో వార్తుండదు. అసలు ఈ చానెళ్ళు పేరుకి మాత్రమే వార్తా చానెళ్ళు. వాస్తవానికి ఇవి సొంత దుకాణాలు. వారి యాజమాన్య వ్యాపార ప్రయోజనాలకి అనుగుణంగా వార్తల్ని వండుతుంటాయి. తమ రాజకీయ ఎజండాని అమలుచెయ్యడానికి అలుపెరగని ప్రయత్నం చేస్తుంటాయి.

ఒక చానెల్ మాత్రం మళ్ళీ దేవుడి పాలన రావాలని కోరుకుంటూ.. అందుకొరకు అనునిత్యం ఒక నాయకుణ్ణి (ఆయనే ఆ చానెల్ ఓనర్ కూడా) ఫాలో అవుతుంది. దాన్నిండా ఓనర్ గారి అనుకూల వార్తలు మాత్రమే ఉంటాయి. ఇదొకరకంగా భక్తి చానెల్ వంటిది. ఈ చానెల్ గూర్చి ఎవరికీ ఏ భ్రమలూ లేవు. కావున నో కంప్లైంట్స్.

వార్తాపత్రికల్ని కూడా నడిపే రెండు న్యూస్ చానెళ్ళు రెండు విడతలు ముఖ్యమంత్రిగా పనిచేసినాయాన్ని మళ్ళీ గద్దె మీద కూర్చుండ పెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తుంటాయి. ఇది వారి అప్రకటిత ఎజెండా. కానీ వారు ఈ విషయాన్ని చెప్పరు. అయితే వారేదో గొప్ప 'వార్తావిశ్లేషణ' చేస్తున్నట్లు పోజు కొడుతూ పొద్దస్తమానం తమ నాయకునికి అనుకూలంగా వార్తలు వ్రాయుదురు, చూపించెదరు. దీన్నే 'ప్రజల్ని మోసం చేయుట' అందురు.

దురదలందు నోటిదురద వేరయా :

పార్లమెంటరీ డెమాక్రసీలో ప్రభుత్వ విధానాన్ని ప్రభుత్వం తరఫున మంత్రులు ప్రకటన చేస్తారు. ఒక రాజకీయ పార్టీ విధానం గూర్చి ఆ పార్టీ తరఫున బాధ్యులు (కార్యదర్శి, అధికార ప్రతినిధి మొదలైనవారు) మాట్లాడతారు. ఈ ప్రకటనలకి మాత్రమే విలువ ఉంటుంది. ఇంకెవరు ఏం మాట్లాడినా ఆ మాటలకి విలువుండదు.

అయితే తెలుగునాట వందల కొద్దీ ఎమ్మెల్యేలున్నారు. డజన్ల కొద్దీ ఎంపీలున్నారు. వీరుకాక వేల కొద్ది మాజీలు ఉన్నారు. వీళ్ళంతా ప్రజానాయకులు. వీళ్ళల్లో చాలామందికి నోటిదురద ఉంది. ఆ దురద నాలుకని తుప్పు రేకుతో గోక్కున్నా తగ్గేది కాదు. అది టీవీ వాళ్ళతో సొల్లు కబుర్లు వాగితేనే తగ్గుతుంది. చానెళ్ళవారిక్కూడా ఇరవై నాలుగ్గంటలూ మసాలా వార్తలు కావాలి.

మన నోటి దురద నాయకులు ఎదుటి పక్షం వాణ్ని తిడుతూ రోజువారీగా ఇంటర్వ్యూలిస్తారు. ఆ తిట్లని టీవీవాళ్ళు లైవ్ కవరేజ్ ఇస్తూ ఆనందిస్తారు. ఇదొరకంగా ఇద్దరు దొంగలు ఒకరినొకరు సహకరించుకునే కార్యక్రమం. ఒకడు ఇంకోడిని గజ్జికుక్క అంటాడు. వాడు ప్రతిగా బురద పంది అంటాడు. అటుపై ఫలానావాడు నిజంగానే గజ్జికుక్కా? లేక బురద పందా? అనే రోజువారీ SMS ప్రోగ్రాముల చర్చా కార్యక్రమం నడుస్తుంటాయి.

ఆయా చానెళ్ళ వారు ఎగస్పార్టీ వారిని తిట్టిన ఉన్న తిట్లని పదేపదే చూపిస్తారు. ఎదుటివాడు తమ నాయకుడిని విమర్శించిన వార్తని అస్సలు చూపించరు. పైగా ఆ విమర్శ చేసిన నాయకుడిని చాలా హీనంగా చూపిస్తూ ఒక స్టోరీ రన్ చేస్తారు. ఈ విషయాల్లో కనీస స్థాయి మర్యాద చూపించరు. ఈ కళలో మన చానెళ్ళకి ఎవరూ సాటి రారు.

చర్చలా అవి! కాదు కాదు.. అరుపులు, కేకలు :

ఇక టీవీ చర్చలు. అవి చూస్తుంటే కొద్దిసేపట్లోనే అక్కడున్నవారికి కనీస స్థాయిలో పరిజ్ఞానం లేదన్న వాస్తవం అర్ధమవుతుంది. ఆ విషయం వాళ్ళకీ తెలుసు. అందుకే గందరగోళంగా ఒకేసారి మాట్లాడతారు. ఈ చర్చల్లో న్యూట్రల్ ఎంపైర్ లా పత్రికలకి సంబంధించిన ఒక పన్లేని వ్యక్తిని కూడా కూర్చోపెడతారు. కానీ ఆయనకి మాట్లాడే చాన్స్ ఎప్పుడో గానీ రాదు. వచ్చినా ఆయన ఏం చెబుతాడో మనకి అర్ధం కాదు.

ఈ టీవీల వాళ్ళకి అప్పుడప్పుడు ఏక్ దిన్ కా సుల్తాన్లు కూడా దొరుకుతుంటారు. మొన్నామధ్య అన్ని టీవీ చానెళ్ళ వాళ్ళు ఒక ఎన్జీవో నాయకుణ్ణి రోజువారీ, గంటల వారీ ఇంటర్వ్యూ చేసి పీల్చి పిప్పి చేశారు. ఆయన్ని మామిడి రసం పిండినట్లు పిండేశారు. ఇప్పుడాయనలో టెంక తప్ప ఏమీ మిగల్లేదు. ఇదీ టీవీల వాళ్ళ జగన్నాటాకం!

నా గోల :

నేన్రాసినవన్నీ అసలు విశేషాలే కాదు. ఇవన్నీ రోజువారీగా టీవీ చూసేవాళ్ళకి అనుభవమే. కాకపొతే 'ఈ గొప్ప అనుభవం' నాకు ఈ మధ్యనే అయ్యింది. పంటి నొప్పి గూర్చి రాయాలంటే పంటికి నొప్పి కలగాలి. వీపు దురద గూర్చి రాయాలంటే ఆ దురద అనుభవంలోకి రావాలి. అప్పుడే మనసులోని ఆవేదన, కసి రచన రూపంలో తన్నుకొస్తుంది. నాకీ చానెళ్ళ విశ్వరూప దర్శన భాగ్యం ఈమధ్యనే కలిగింది. ఇప్పటిదాకా ఈ చానెళ్ళ వీక్షణ ఇంతటి వ్యధాభరితమని తెలీదు.

అసలీ టీవీ లెందుకు? :

ఈ టీవీ చానెళ్ళ వల్ల సమాజానికి ఏమన్నా ఉపయోగం ఉందా?

అసలు చానెళ్ళు సమాజానికి సేవెందుకు చెయ్యాలి?

రియల్ ఎస్టేట్, విద్యావైద్య రంగ మాఫియాలు సంపాదించిన డబ్బుల్తో టీవీలు పెట్టింది సొమ్ము చేసుకోడానికీ, రాజకీయ ప్రాపకం కోసం మాత్రమే. ఇందులో ప్రజాశ్రేయస్సు లాంటి ఆలోచనలకి తావు లేదు.

ప్రజా సమూహంలో గొప్ప మేధావి నుండి నిఖార్సైన అజ్ఞాని దాకా అనేక రకాల వాళ్ళు ఉంటారు. అందువల్ల ఈ టీవీ రాజకీయ వీరుల గూర్చి రకరకాలైన అభిప్రాయాలున్నాయి.

1. ఈ టీవీల్లో కనిపించేవాడు పనిలేనివాడనీ, పనికిమాలిన వాడనీ చాలామందికి సరైన అవగాహనే ఉంది.

2. అతి తక్కువ మంది మాత్రం పొద్దస్తమానం టీవీలో కనిపించేవాడే ఓ మోస్తరు నాయకుడు అనుకుంటారు.

3. కొందరికి టీవీ రాజకీయ నాయకుల మీద సదభిప్రాయం ఉండదు. కానీ వారీ చర్చల్ని ఎంజాయ్ చేస్తారు. అదో టైపు మనస్తత్వం. వారికి పంపు దగ్గర తగాదాలు, టీ బడ్డీల దగ్గర బూతుల దండకం కూడా చాలా ఆసక్తికరంగా, సరదాగా ఉంటుంది.

జనాలు తెలివి మీరారు. కొన్నాళ్ళు సినిమాలు, ఇంకొన్నాళ్ళు క్రికెట్ మ్యాచులు, మరికొన్నాళ్ళు ఈ టీవీ చర్చల్ని సీజనల్ గా వీక్షిస్తుంటారు. చివరాఖరికి ఎలెక్షన్లప్పుడు బాగా ఆలోచించి తమ కులం పార్టీకో, డబ్బులిచ్చిన వాడికో ఓటేస్తారు.

ఏ పుట్టలో ఏ పాముందో! :

మరప్పుడు న్యూస్ చానెళ్ళు చెవి కోసిన మేకల్లా (మేకలూ! నన్ను మన్నించండి) అదే పనిగా తమ ప్రచారం ఎందుకు చేస్తుంటాయి? శ్రీకృష్ణుడు గీతలో ఏమని చెప్పాడు? నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు, ఫలితాన్ని నాకొదిలెయ్యి అన్నాడు. అందువల్ల - ఏమో! ఎవరు చెప్పొచ్చారు? తెలుగువాళ్ళంతా వెధవన్నర వెధవలై, బుర్ర చచ్చిపొయ్యి ఆ టీవీవాడు చెప్పిందే నిజమని నమ్మి గొర్రెల మందలా (గొర్రెలూ! నన్ను క్షమించండి) ఓట్లేస్తారేమో! ఏ పుట్టలో ఏ పాముందో కదా!

ఉపసంహారం :

మిత్రులారా! ఇంతటితో నా టీవీ చానెళ్ళ ఆలోచనలు రాయడం పూర్తయ్యింది. ఈ విధంగా సమ్మె సందర్భంగా, వర్ష కారణంగా  అనుకోకుండా దొరికిన తీరికని ఎంతో ఘోరంగా దుర్వినియోగం చేసుకున్నానని (కుంచెం సిగ్గుపడుతూ) తెలియజేసుకుంటున్నాను.

ఇష్టమైన విషయాలపై ఎంతైనా రాయొచ్చు. అది చాలా తేలిక కూడా. నచ్చని సంగతుల్ని రాయాలంటేనే బహుకష్టం. ఆ సంగతీ పోస్టు రాస్తున్నప్పుడు అర్ధమైంది. కానీ మీ సమయం కూడా వృధా చెయ్యాలనే తీవ్రమైన దురాలోచనే నాచేత ఈ పోస్టు రాయించింది. అమ్మయ్య! ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది.

(photo courtesy : Google)

Wednesday, 5 December 2012

'రాగమయి రావే.. ' ఎన్నిసార్లు రావాలి? నేన్రాను పో!


సమయం రాత్రి పన్నెండు గంటలు. సాహిత్యంపై బాలగోపాల్ రాసిన వ్యాసాల సంకలనం 'రూపం-సారం' చదువుతున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువసార్లు చదివిన పుస్తకం ఇదే. ఇంతలో అసరా (USA) నుండి ఒక మిత్రోత్తముని ఫోన్. చాలాసేపు చిన్ననాటి కబుర్లు, కాకరకాయలు. పిచ్చాపాటీ.

"ఈ టీవీలో 'పాడుతా తీయగా' ప్రోగ్రాం రెగ్యులర్ గా చూస్తున్నాను. ప్రోగ్రాం నాకు బాగా నచ్చింది. నువ్వు కూడా చూడు." అన్నాడు. మావాడు సంగీత ప్రియుడు. ఓ సన్నకారు పాటగాడు.

"తెలుగు టీవీ చూడకపోవడం నా ఆరోగ్య రహస్యం. కావున తియ్యగా పాడినా, చేదుగా పాడినా నాకు తెలిసే అవకాశం లేదు. నువ్వు చూడమంటున్నావు కాబట్టి తప్పకుండా చూస్తాను." అన్నాను.

నాది మాట మీద నిలబడే వంశం కాదు. అంచేత సహజంగానే అటు తరవాత ఆ టీవీ గోల మర్చిపోయ్యాను. అనగనగా ఓ పని లేని రోజు నా స్నేహితుడు, అతగాడికి చేసిన బాస గుర్తొచ్చి ఆ ప్రోగ్రాం టైమింగ్స్ వాకబు చేసి టీవీ ఆన్ చేయించాను.

టీవీ స్క్రీన్ పై ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిండుగా కనిపిస్తున్నాడు. ఏవో కబుర్లు చెబుతున్నాడు. ఈ రియాలిటీ షోలు గిరాకీ తగ్గిన పని లేని నటులకి, గాయకులకి చక్కటి ఆశ్రయం కల్పిస్తున్నాయి. మంచిది. ఇట్లాంటి కార్యక్రమాలు వృద్ధ కళాకారులకి రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్ వలే కూడా చక్కగా ఉపయోగపడుతున్నాయి. వెరీ గుడ్.

ఇంతలో బక్కపలచటి కుర్రాడొకడు సెట్ మధ్యలో కొచ్చి ఆవేశంగా ఏదో సినిమా పాట ఎత్తుకున్నాడు. కళ్ళు మూసుకుని గొంతెత్తి పాడటం మొదలెట్టాడు. నాకు చిరాకేసింది.

'వార్నీ! పాడుతా తీయగా అంటే సినిమా పాటల పోటీ ప్రోగ్రామా!' ఆశ్చర్యపోయాను.

'మరి మన అసరోత్తముడు బాగుందన్నాడేమి! నా మీద వాడికి పాత కక్షలేమీ లేవు గదా!' ఆలోచిస్తూ మళ్ళీ టీవీ చూశాను.

ఇప్పుడు కడుపులో వికారం మొదలైంది. వెంటనే టీవీ కట్టేసాను.

ఈ వికారం నాకు కొత్త కాదు. దీనికి నలభయ్యేళ్ళ చరిత్ర ఉంది. సైకియాట్రీ వైద్యంలో PTSD అని ఓ కండిషన్ ఉంది. ఒక భయంకర అనుభవం మనసులో ముద్రించుకుపోయి.. ఆ అనుభవం తాలూకా భయాలు వెంటాడుచుండగా.. ఆ అనుభవం కనీస స్థితిలోనయినా మళ్ళీ ఎదురైతే తట్టుకోలేరు. అసలా ఊహకే విచలితులవుతారు. నా జీవితంలో ఈ సినిమా పాటల పోటీ ఒక బీభత్స అనుభవం.

ఇప్పుడు కొంచెంసేపు ఫ్లాష్ బ్యాక్. నా చిన్నప్పుడు వీధివీధినా వెలిసే  శ్రీరామనవమి పందిళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలకి కేరాఫ్ ఎడ్రెసులని ఇంతకు ముందొక టపాలో రాశాను. ప్రతి యేడాది ఈ పందిళ్ళల్లో సినిమా పాటలు పోటీ కూడా ఒక ముఖ్యాంశంగా ఉండేది.

అలనాటి ఆ పాటల పోటీలు నా జీవితంలో చెరగని ముద్ర వేస్తాయని అప్పుడు నాకు తెలీదు. అరిగిపోయిన భాషతో మర్యాద కోసం 'ముద్ర' అంటున్నానే గానీ.. నిజానికవి ముద్రలు కావు.. కత్తి పోట్లు, గొడ్డలి నరుకుళ్ళు!

ఒకానొక దుష్ట సంవత్సరం విపరీతంగా పాడబడ్డ పాట.. 'రాగమయి రావే! అనురాగమయి రావే!'. ఒకళ్ళ తరవాత మరొకళ్ళు.. రేషన్ షాపు దగ్గర 'క్యూ' కట్టినట్టు వరసలో నిలబడి మరీ పాడారు. ఓ నలుగురు పాడంగాన్లే నాకు విసుగొచ్చేసింది. ఈ వెధవలు పిలిస్తే 'రాగమయి' రావడం మాట అటుంచి.. దడుపుడు జొరంతో పారిపొయ్యే ప్రమాదం తీవ్రంగా ఉంది!

ప్రతి గాయక రాక్షకుడు మైకు ముందుకు రావడం.. గొంతు సరి చేసుకుని.. 'ఇప్పుడు ఘంటసాల మాస్టారు పాడిన ఫలానా పాట.' అని ఎనౌన్స్ చేసి మరీ హింసించేవాళ్ళు. మరీ ఒక్కోడు పాడుతుంటే పిశాచాల ప్రార్ధనలా, సూడి పంది ప్రసవ వేదనలా ఉండేది. జీవితం మీద విరక్తి పుట్టేది.

చిత్రమేమంటే మహాగాయకుడు ఘంటసాల సినిమా కోసం పాడిన మట్టి రికార్డ్ మూడున్నర నిమిషాలే! కానీ మావాళ్ళు ఘంటసాల కన్నా బాగా పాడేద్దామని ఉత్సాహపడేవాళ్ళు. అంచేత ఒరిజినల్ పాటలో లేని కొత్త సంగతులు వేసి.. తన్మయత్వంతో కళ్ళు మూసుకుని రాగాలు సాగదీస్తూ పది నిమిషాలకి పైగా పాడేవాళ్ళు.

శ్రోతల ఏడుపు మొహాలు ఎవాయిడ్ చెయ్యడానికి వారు అలా కళ్ళు మూసుకొంటారని సుబ్బు అంటాడు. కొంతమంది మెలికలు తిరుగుతూ పాడేవారు. 'గొంతు ఎలాగు మెలికలు తిరగదు. కనీసం శరీరంలోనయినా చూపించనీ!' అంటాడు సుబ్బు.

మొత్తానికి ఆ యేడాది శ్రీరామనవమి పాటల పోటీ గాడిదలు, కుక్కలు, పిల్లులు, గబ్బిళాలు వంటి నానాజాతుల వికృత గాన సౌందర్య విలాసములకి పుట్టినిల్లుగా భాసిల్లింది. కళ్ళు మూసుకున్నట్లు చెవులు మూత పడకపోవడం మానవ శరీర నిర్మాణ లోపమని ఆ నాడే నాకు అర్ధమయ్యింది. అందుకే నాకు 'రాగమయి రావే' పాటంటేనే కసి, కోపం, చిరాకు, రోత!

ఒకానొక రోజు నవ్వారు మంచంపై కాళ్ళు పైకెత్తుకుని చందమామలోని ధూమకేతు, శిఖిముఖిల సీరియల్ ఉత్కంఠపూరితంగా పఠించు సమయమున.. నా ఒక్కగానొక్క అన్నయ్య ప్రేమగా అడిగాడు.

"జయభేరి సినిమాకి వెళ్తున్నా. వస్తావా?"

"ఛీ.. ఛీ.. ఆ సినిమా పొరబాటున కూడా చూణ్ను." అని ఈసడించుకున్నా.

అన్నయ్యకి అర్ధం కాలేదు. ఆ సినిమాపై నాకున్న కోపానికి కారణం తెలుసుకుని పెద్దగా నవ్వాడు.

"పోనీ ఒక పని చెయ్యి! ఆ పాట  వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని, చెవుల్లో వేళ్ళు పెట్టుకో!" అన్నాడు.

'ఇదేదో బానే ఉంది.' అనుకుంటూ అన్నయ్యతో జయభేరి సినిమాకి బయల్దేరాను.

'జయభేరి' ఒక అద్భుత దృశ్యకావ్యం. ఆసాంతం సుమధుర సంగీతమయం. నేను అసహ్యించుకున్న 'రాగమయి రావే' పాట సమయంలో కళ్ళు మూసుకోవడం కాదు.. కనురెప్ప కొట్టడం కూడా మర్చిపోయ్యి చూశాను. ఇన్నాళ్ళూ మా బ్రాడీపేట ఔత్సాహిక గాయక రాక్షసులు ఘంటసాల పాటని సామూహికంగా హత్య కావించారని అవగతమైంది.

(ఏమిరా దుష్ట దుర్మార్గ వెర్రి వైద్యాధమా! నీ రాతలతో మన బ్రాడీపేటీయుల పరువు తీయుచుంటివి? మనవాళ్ళు తమ గార్ధభ గానంతో ఘంటసాల పాటని కంకరరాళ్ళతో కలిపి కరకరలాడించారు. అంతమాత్రానికే అపచారమంటూ అంతలా అరవాలా?) 

అవును గదా! 'రాగమయి రావే!.. ' గీత హనన నేరం మా బ్రాడీపేట గాత్రకారులది కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందుకు బాధ్యత వహించవలసిన వారు ఘంటసాల, మల్లాది రామకృష్ణ శాస్త్రి, పెండ్యాల, పి.పుల్లయ్యలు మాత్రమే! ఒక పాటని మరీ అంత గొప్పగా రూపొందించడమే వారు చేసిన నేరం! దొంగలు బంగారాన్ని మాత్రమే కాజేస్తారు.

తరవాత జయభేరి సినిమా చాలాసార్లు చూశాను. ఎప్పుడు చూసినా 'రాగమయి రావే!' ఇష్టంగానే చూస్తున్నాను. కావున.. నా 'రాగమయి' పాట తాలూకా వికారం తగ్గిపోయినట్లే. ఘంటసాల అద్భుత గానం మూలానా కొందరి నీచగాన దోషం నశించినట్లుంది. పోన్లే. మంచిదే కదా!

చిత్రంగా ఇప్పుడు 'పాడుతా తీయగా' కార్యక్రమం చూస్తుంటే అప్పటి వికారం బయటేసింది. అనగా.. నేనకున్నట్లు నా చిన్ననాటి క్షుద్ర గాయకుల పట్ల నా ఆగ్రహజ్వాలలు ఇంకా చల్లారలేదన్నమాట. ఆలోచించగా ఇదంతయూ Pavlov classical conditioning వలే యున్నది. నా పసిహృదయం మరీ అంతలా గాయపడి తల్లడిల్లిందా!

దూరంగా పాట వినిపిస్తుంది. 'తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా.. మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనయినా.. '

ఈ టపాకి కారణం అయిన జయభేరి సినిమాలోని 'రాగమయి రావే.. ' పాట యూట్యూబ్ లో ఉంది. ఇక్కడ ఇస్తున్నాను. మరొక్కసారి విని ఆనందిచండి. ('చివురులు మేసిన చిన్నారి కోయిల.. ' చరణం ఆ నాటి 78 rpm రికార్డులో లేదు.)



(photos courtesy  : Google)

Monday, 28 May 2012

'అపరిచితుడు' అప్పారావు


"జగన్ అరెస్ట్ అన్యాయం, అక్రమం. నేను దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్నట్నుండి మా వంటింట్లో పొయ్యిమీద గండుపిల్లి గురకలు పెట్టి నిద్రోతుంది. రెండునెల్ల పసిగుడ్డుతో సహా ఎవరూ పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టలేదు. నా భార్య జగన్  జైల్నుండి విడుదలయ్యే దాకా కాపురం చెయ్యనంటూ పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికెళ్ళిపోయింది. మా నాన్న 'జగన్బాబూ!' అంటూ గుండెనొప్పితో మెలికలు తిరిగిపోయాడు. ఆస్పత్రిలో చేర్పించాం. ఆయన అటూఇటుగా ఉన్నాడు. మా అమ్మ 'జగన్! జగన్!' అంటూ పిచ్చిపట్టి ఏడుస్తూ ఎటో వెళ్ళిపోయింది. అన్నా! జగనన్నా! నువ్వు పోరాటం సాగించన్నా! నీ వెనక మేమున్నామన్నా! నువ్వు దేవుడవన్నా! జై జగన్!" అంటూ భోరున విలపిస్తూ కూలిపోయాడు అప్పారావు.

"కట్!" చెప్పాడు 'సాక్షి' చానెల్ విలేఖరి

కెమేరామెన్ కెమేరాని సర్దుకుంటున్నాడు.

"ఏం బాబు! ఎమోషన్ బాగా కేరీ అయ్యిందా? కావలంటే ఇంకో టేక్ తీద్దాం." అన్నాడు అప్పారావు.

"అవసరం లేదు. ఇప్పటికే ఎక్కువ చెప్పారు." అన్నాడు 'సాక్షి' విలేఖరి.

అటు తరవాత అప్పారావు భార్య వారికి జీడిపప్పు ఉప్మా, నేతి పెసరట్లు వడ్డించింది.

వాళ్ళ పక్కన కూర్చున్నాడు అప్పారావు.

"మీ ఎడిటర్ తో మాట్లాడండి. ఇప్పుడు చెప్పిన దానికి కొద్దిగా శృతి పెంచమన్నా పెంచుతాను, తగ్గించమన్నా తగ్గిస్తాను. మీ చానెల్ కి నా అభిప్రాయాన్ని చెప్పడానికి ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వస్తా!" ఫ్రీ ఆఫర్ ఇచ్చాడు అప్పారావు.

అప్పారావు భార్య ఫిల్టర్ కాఫీ ఇచ్చింది.

"మీకు ఏ టాపిక్ మీద బైట్ కావలన్నా నన్ను సంప్రదించండి. రూపాయి పతనాన్ని ఆపలేక దువ్వూరి సుబ్బారావు చేతులెత్తేశాడు. ఆయనతో నాకు లైవ్ షో ఏర్పాటు చెయ్యండి. నా సలహాలకి సుబ్బారావు స్పృహ తప్పిపోవాలి." గర్వంగా అన్నాడు అప్పారావు.

వారికి వేటపాలెం జీడిపప్పు ప్యాకెట్లు చేతిలో పెట్టాడు.

"ఇవి ఉంచండి. గుర్తుంచుకోండి, అప్పడం నుండి అమెరికా దాకా అన్ని సబ్జక్టుల్నీ కరకరలాడించి మింగేశాను. 'పనామాలో పందిమాంసం రేటెందుకు డౌనయ్యింది? ఇరాక్ లో ఉబ్బసానికి చేపమందు పని చేస్తుందా?' వంటి ఎకనామిక్ అండ్ సైంటిఫిక్ కార్యక్రమాల్లో కూడా నా అభిప్రాయం తీసుకోండి." ప్రాధేయపడ్డాడు అప్పారావు.

అప్పారావు ఆతిధ్యాన్ని స్వీకరించి 'బ్రేవ్!' మంటూ సెలవు తీసుకున్నారు 'సాక్షి' వారు.

అలసటగా కళ్ళు మూసుకుని సోఫాలో కూలబడ్డాడు అప్పారావు. తన 'అభిప్రాయం' సాక్షి చానెల్ వాళ్ళకి చెప్పడానికి 'మూడ్' (కన్నీళ్ళు) కోసం వంటింట్లో నాలుగు ఉల్లిపాయలు తరిగాడు. అంచేత కళ్ళు మండుతున్నాయి. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు.


"అప్పు! అప్పు! లేలే! నీ కోసం ఇంకో చానెల్ వాళ్ళొచ్చారు." అంటూ భార్య అరవడంతో ఉలిక్కిపడుతూ లేచాడు.

"నమస్తే! మేం ABN ఆంధ్రజ్యోతి చానెల్ నుండి వచ్చాం. జగన్ అరెస్టు గూర్చి మీ అభిప్రాయం చెబుతారా?" అంటూ ఆ చానెల్ వాళ్ళు వచ్చీ రావడంతోనే మొదలెట్టారు.

అప్పారావు వంటింట్లోకి పరిగెత్తాడు. నిమ్మకాయని కత్తితో రెండు బద్దలుగా కొశాడు. ఒక్కోకంట్లో ఒకబద్ద పిండుకున్నాడు. కళ్ళు ఎర్ర్గగా, చింతనిప్పుల్ల్లా మారిపొయ్యాయి. హాల్లోకొచ్చి కెమెరా ముందు నిలబడ్డాడు.

"కెమెరా స్టార్ట్!"

"జగన్! జగన్! జగన్! అసలెవరీ జగన్? అఫ్టరాల్ ఒక ముఖ్యమంత్రి కొడుకు. విక్రమార్కుడా? కాదు, అక్రమార్కుడు. అవినీతికి కేరాఫ్ అడ్రెస్. ఈ దేశం ఏమైపోతుంది? జగన్ని సమర్ధించేవాళ్ళలారా! ఖబడ్దార్! ఒక విషయం గుర్తుంచుకోండి!" అంటూ కెమెరాలోకి కౄరంగా చూశాడు.

"జగన్ని సమర్ధిస్తే మీరు సద్దామ్ హుస్సేన్, ఒసమా బిన్ లాడెన్ని సమర్ధించినట్లే! జగన్ అవినీతి వల్లే ఎండలు మండిపోతున్నయ్, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నయ్, సినిమాలు ఫ్లాపయిపోతున్నాయి." అంటూ గర్జించాడు అప్పారావు.

ఆంధ్రజ్యోతి వారిక్కూడా టిఫిన్లూ, కాఫీలు ఎరేంజ్ చేయబడ్డయ్.

తింటున్నవారి పక్కన కూర్చున్నాడు అప్పారావు.

"మొన్నామధ్య మీరు మా ఎదురింటి మంగతాయారుకి, పక్కింటి కృష్ణారావుకీ గల అక్రమ సమ్మందమ్మీద ఎనిమిది గంటల చర్చా కార్యక్రమం నడిపారు. ఎంత బ్రతిమాలినా నాకు మాట్లాడ్డానికి ఛాన్సివ్వలేదు. దయచేసి విలువైన నా అభిప్రాయం కూడా తీసుకోండి. నాకు బయాలజీ నుండి బూర్లెపాకం దాకా అన్ని  సబ్జక్టుల మీద మంచి గ్రిప్పుంది."

ఆంధ్రజ్యోతివాళ్ళు వెళ్ళేప్పుడు నూజివీడు రసాలు, ఆవకాయ జాడీలతో నిష్క్రమించారు.

అప్పారావు భార్యకి అనుమానం వచ్చింది.

"అప్పు! నువ్విట్లా చానెల్ చానెల్ కీ 'అపరిచితుడు'లో హీరోలాగా రంగులు మార్చేస్తున్నావ్. జనాలకి తెలిస్తే ప్రమాదమేమో?"

అప్పారావు నవ్వాడు.

"పిచ్చిమొహమా! అలా చెబితేనే వాళ్ళు చూపిస్తారు. అయినా - ఎవడికి నచ్చిన చానెల్ వాడు చూస్తాడు. ఒకవేళ అన్ని చానెళ్ళు చూసే పని లేని సన్నాసి ఎవడైనా ఉంటే అది వాడి ఖర్మ. సర్లే! నువ్వు వంట పని చూడు. ఈ దెబ్బకి మన పేరు ఆంధ్రదేశంలో మోగిపోవాలి." అన్నాడు అప్పారావు! 

(picture courtesy : Google)

Saturday, 28 April 2012

hmtv వందేళ్ళకథకు వందనాలు.. గొప్ప కామెడీ షో!


"మిత్రమా! ఇవ్వాళ రాత్రి hmtv చూడు. రావిశాస్త్రి గూర్చి ఏదో ప్రోగ్రాం వస్తుందిట." అని నా స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు. నాకు టీవీ చూసే అలవాటు పెద్దగా లేదు. అందులోనూ తెలుగు న్యూస్ చానెళ్ళు అంటే నాకు భయం! కానీ hmtv కె.రామచంద్రమూర్తి సారధ్యంలో నడుస్తున్న చానెల్. ప్రోగ్రాం బాగుండే అవకాశం ఉంది. కావున రావిశాస్త్రి కార్యక్రమం చూద్దామని నిర్ణయించుకున్నాను.

ప్రోగ్రాం పేరు 'వందేళ్ళకథకు వందనాలు'. సాహిత్య సంచికా కార్యక్రమం. సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు. ప్రోగ్రాం మొదలైంది. గొల్లపూడి ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈయన సినిమాల్లో వాగుడుకాయ పాత్రలు వేశాడు. బయటకూడా ఇంతే అని అర్ధమైపోయింది.

ఇంతకీ ఈ ప్రోగ్రాం target viewers ఎవరు? 1.ఆయాకథలు ఆల్రెడీ చదివేసి.. చదివిన కథల్ని టీవీలో చూసుకుని కొత్త అనుభూతి పొందేవారా? 2.సమీప భవిష్యత్తులో ఆయారచయితల కథలు చదువుదాం అనుకునేవాళ్ళా? 3.క్రైం వార్తలు, సీరియళ్ళు చూస్తూ పొరబాటున రిమోట్ నొక్కి hmtv లోకి వచ్చేవాళ్ళా? ఎవరికోసమైనా, ఏరకంగా చూసుకున్నా ఒక 'దశ-దిశ' లేని ప్రోగ్రాం ఈ వందేళ్ళకథలు.

పాతపాటల్ని remix చేస్తున్నట్లుగా ఈమధ్య పాతకథల్ని remix చేసే కార్యక్రమాలు మొదలయ్యాయి. ఖదీర్ బాబు చేతిలో 'సాక్షి' ఉంది కాబట్టి, పాతకథల్ని ఆయన శైలిలో రాసేసుకుంటూ పొయ్యాడు. ఆతను 'ఒక గొప్ప సాహిత్య ప్రయోగం చేశాను. మూలబడ్డ పురాతన కథలకి వెలుగునిచ్చాను.' అని అనుకోవచ్చు. మంచిది.

అయితే ఖదీర్ బాబు ఈ కథల్ని ఎవరికోసం రాశాడు? తెలుగుకథ మహా అయితే ఐదారు పేజీలుంటుంది. చదవటానికి ఎక్కువసేపు పట్టదు. ఆ ఓపిక కూడా లేనివాడికి ఒక నమస్కారం. ఎవరూకూడా తెలుగుకథని చదివి ఉద్ధరించనవసరంలేదు. (మంచి కథలు మనని గ్యారెంటీగా ఉద్ధరిస్తాయి. మనం కథల్ని ఉద్ధరించలేం!)

ఈ స్పీడుయుగంలో అందరూ అన్నీ cash చేసుకుంటారు. అందుకే కథల్ని చదివే ఆసక్తి, ఓపికా లేని మారాజుల కోసం (డబ్బు దండిగా సంపాదించి కథ వైపు తొంగిచూద్దాం అనుకునేవారి కోసం) fast food లాగా, twenty over cricket match లాగా ఖదీర్ బాబు రాసేశాడు.

నాకయితే ఖదీర్ బాబు కథనరీతి మిమిక్రీలాగా, ఏకపాత్రాభినయంలాగా అనిపించింది. సరే! ఎందఱో ఈ ప్రక్రియని విమర్శించారు. కొందరు మెచ్చుకున్నారు. ఖదీర్ బాబు చివరికి బీనాదేవి సర్టిఫికేట్ తో బయటపడ్డాడు. అతనికి ఆ మాత్రం తలంటు పొయ్యకపొతే చలాన్ని, కుటుంబరావుల్ని కూడా తిరగరాసే ప్రయత్నం చేసేవాడేమో!

పుస్తకాల్ని చదవలేని సోమరుల కోసం సంక్షిప్తం చేసే ప్రక్రియ ఇప్పటిది కాదు. కన్యాశుల్కాన్ని నార్ల వెంకటేశ్వరరావు abridge చేశాడు. మన చిన్నప్పుడు text book కి గైడ్ ఉండేది! అలాగన్నమాట. ఈ గైడ్ వల్ల నార్ల సాధించింది ఏమిటో తెలీదు. సరే! ఆయన కలం, ఆయన కాగితం, ఆయన పబ్లిషర్. మనకి అనవసరం. 

మళ్ళీ మన hmtv వందేళ్ళకథకి వద్దాం. తెలుగుసాహిత్యంలో గొల్లపూడి మారుతీరావు స్థానం, స్థాయి ఏమిటో నాకు తెలీదు. తెలీకపోవడం అనేది నా తప్పవుతుందిగానీ గొల్లపూడిది కాదు. నా అజ్ఞానాన్ని మన్నించండి. బహుశా సినిమానటుడు కూడా కావున ప్రోగ్రాంకి ప్రాచుర్యం వస్తుందని అతన్ని ఎంచుకునిఉండొచ్చు.

సెట్ చూస్తే చాలా చౌకగా ఉంది. వందేళ్ళతెలుగు కథేమోగాని.. సెట్ మాత్రం వందేళ్ళక్రితం వేసినట్లు ఉంది. black and white దూరదర్శన్ సెట్లు గుర్తొస్తాయి. ఒక టీపాయ్, రెండు కుర్చీలు. అంతే!

ఈ వందేళ్ళకథకి ఒక editorial policy ఉన్నట్లుంది. ఈ ఇరుకు సెట్లో రచయితకి ఒకకుర్చీ. సదరు రచయిత మరణించిఉంటే ఆకుర్చీలొ రచయిత భార్య, భార్య కూడా పొతే కొడుకు.. మనవడు.. మునిమనవడు. వీళ్ళెవ్వరూ దొరక్కపోతే రచయితగారి పక్కింటాయన! ఈ లెక్కననుసరించి రావిశాస్త్రి లేడు కావున ఆయన కొడుకు గొల్లపూడి ఎదురుకుర్చీలో కూర్చున్నాడు. 

పాపం! ఆ అబ్బాయి గొల్లపూడి వాగ్ధాటికి బెదిరిపోయ్యాడు. గొల్లపూడి తన trademark హావభావాలతో రావిశాస్త్రిని పొగడ్తల దండకంతో ముంచేస్తున్నాడు. అప్పుడప్పుడు రావిశాస్త్రి కొడుకుని మాట్లాడనిస్తున్నాడు. ఆ ప్రశ్నలు కూడా చౌకబారు ప్రశ్నలు. 'నాన్నగారు రాత్రిళ్లు రాస్తారా? పగలా? టేబుల్ మీద రాస్తారా? మంచంమీద రాస్తారా?' ఇవీ ఆ ప్రశ్నలు!

కొంతసేపటికి ఆ అబ్బాయి రావిశాస్త్రి కథ నొకదాన్ని కూడబలుక్కుంటూ చదవసాగాడు. గొల్లపూడి ఆ కుర్రాణ్ణి తన తండ్రి కథని పట్టుమని పదిలైన్లు కూడా చదవనీలేదు. లాక్కుని తనే చదవడం మొదలెట్టాడు. ఒక రాజకీయ నాయకుణ్ణి వందమాగదితులు పోగుడుతున్నట్లు రావిశాస్త్రిని పొగుడుతూనే ఉండటం నిరాటంకంగా కొనసాగింది. నాకు వెగటేసింది. ఇదీ hmtv వాళ్ళ సాహిత్య కార్యక్రమం! 

hmtv ఒక private channel. కావున వాళ్ళు 'ఇది మా ప్రోగ్రాం. మా ఇష్టం. చూస్తే చూడు. లేకపోతే మానెయ్యి' అనొచ్చు. అంటారు కూడా. నేను, నా బ్లాగు, నా ఇష్టం అని మనంకూడా అనుకుంటున్నాంగదా. అయితే నాకు కొన్ని సందేహాలు. ఆస్తిపాస్తులకి వారసత్వం ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి కుర్చీ కూడా వారసత్వమే అంటున్నారు. ఈ సూత్రం తెలుగు సాహిత్యానికి కూడా apply అవుతుందా?

శ్రీశ్రీ, రావిశాస్త్రి, కుటుంబరావులు తెలుగువారి ఆస్థి. పుస్తకాలపై వచ్చే రాయల్టీకి, కుటుంబ సభ్యులకి సంబంధం ఉంటుంది. అంతే! అంతేకాని ఫలానా రచయిత మనవళ్ళని, మునిమనవళ్ళని దుర్భిణీ వేసి వెతికి పట్టుకొచ్చి ఆ రచయితల వ్యక్తిగత అలవాట్లని చర్చించడం సాహిత్య కార్యక్రమం ఎలా అవుతుంది?

Medical science లో ఎన్ని బ్రాంచ్ లు ఉన్నాయో సాహిత్యంలో అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. అనేక పీఠాలున్నయ్. పీఠాధిపతులూ ఉన్నారు! వీరికి చాలా స్పష్టమైన విభజన రేఖలున్నయ్. ఒకళ్లంటే ఇంకొకళ్ళకి పడదు. కొన్ని ఉదాహరణలు రాస్తాను. ముళ్ళపూడి గూర్చి శ్రీరమణ అద్భుతంగా చెప్పగలడు. రావిశాస్త్రి గూర్చి చలసాని ప్రసాద్, చలం గూర్చి రంగనాయకమ్మ, శ్రీశ్రీ గూర్చి కె.శివారెడ్డి.. ఇట్లా అనేకరకములైన రచనలకి వేరువేరు స్పెషలిస్టులు ఉన్నారు.. ఉంటారు. విశ్వనాథ సత్యన్నారాయణని కాళీపట్నం రామారావు చేత విశ్లేషించ బూనడం సరికాదు. మా.గోఖలేకి ముదిగొండ శివప్రసాద్ పనికిరాడు. (గుండెపోటుకి చర్మవ్యాధుల వైద్యం పనికిరాదు).

అంచేత తెలుగు కథలకి పరిచయమో, పొగడ్తో.. అన్నింటికీ anchor ఉదయభానులా ఒకళ్ళే ఉండటం సరికాదు. కథకులందర్నీ అదేపనిగా ఆకాశానికి ఎత్తేస్తుంటే ఇంకా నీ గోలేంటి? నిజమే! కథా పరిచయం, విశ్లేషణ ఒక సీరియస్ సాహిత్య ప్రక్రియ. అప్పుడు మనకి రకరకాల వ్యక్తుల అభిప్రాయాలు, రిఫరెన్సులు  అవసరమవుతాయి. పొగడటానికి ఎవరైతే ఏంటి! ఏ తెలుగు పండితుడైనా.. ఏ సన్మాన పత్రాలు రాసేవాడైనా సరిపోతుంది.

hmtv వారి సాధకబాధలు మనకి తెలీదు. ఖర్చు తగ్గించుకుందామనో, సాహిత్యపు ప్రోగ్రాములకి ఇదిచాల్లే అనుకున్నారో తెలీదు. దూషణ భూషణములన్నీ గొల్లపూడి ఖాతాలోకి పోతాయిలే.. మనకెందుకు అనుకున్నారా? లేదా గొప్ప ప్రోగ్రాం అంటే ఇదే అని ఆనందపడుతున్నారేమో! మంచిది. నాకు మాత్రం ఏదో సినిమా నటుల్ని పొగిడే ప్రొగ్రాంలాగా అనిపించింది. అందుకే ఈ ప్రయత్నం ఒక C-grade TV serial స్థాయిలో  ఉంది.

అయితే.. hmtv వాళ్ళు తెలుగు సాహిత్యం అంటూ కనీసం (ఎంత చెత్త ప్రోగ్రామయినప్పటికీ) ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. అందుకు అభినందిస్తున్నాను. హుందాతనంలో మిగిలిన తెలుగు చానెల్స్ తో పోలిస్తే hmtv ఎంతో ముందుంది.  మిగిలిన చానెల్స్ మరీ నాసిగా ఉంటాయి.


కె.రామచంద్రమూర్తి print medium వదిలి టీవీకి వెళ్ళడం వల్ల తెలుగు జర్నలిజానికి నష్టం జరిగిందని భావిస్తున్నాను. ఒకవిషయం గూర్చి అవగాహనతో లోతైన విశ్లేషణ చెయ్యడం, చేయించడం print medium లోనే సాధ్యం. తెలుగు టీవీకి serious journalism అవసరమా? అవసరం లేదనుకుంటున్నాను. సరే! ఇది రామచంద్రమూర్తి career. పూర్తిగా ఆయనిష్టం. మన ఇష్టాయిష్టాలు ఆయనకనవసరం. అడగడానికి మనమెవరం? (నేను hans india పేపర్ చూళ్ళేదు.)

చికాగ్గా నాస్నేహితుడికి ఫోన్ చేసాను. "ఏమి నాయనా! నీకు నామీద ఇంత కోపముందని తెలీదు. ఒక దిక్కుమాలిన ప్రోగ్రాం చూడమంటావా?" అన్నాను.

ఆతను పెద్దగా నవ్వాడు. "ఆ ప్రోగ్రాం అసలుపేరు  గొల్లపూడి talk show. జనాలు చూడరని గంభీరత కోసం పేరు మార్చారు. నీకు ఆ ప్రోగ్రాం చూసి కోపం వచ్చింది. నాకు మాత్రం నవ్వొస్తుంది. గొల్లపూడి వాక్ప్రవాహంలో కొట్టుకుపోతున్న అతిధులని చూస్తుంటే భలే కామెడీగా ఉంటుంది నాకు. కాదేది కామెడీకనర్హము!"

"ఆ కామెడీ ఏదో నువ్వే ఎంజాయ్ చెయ్యొచ్చుగా! నా time waste చెయ్యడం దేనికి?"

"హి.. హి.. హి.. నీతో తిట్టించుకోవటం కూడా కామెడీగా ఉంది." అంటూ ఫోన్ disconnect చేశాడు!

(pictures courtesy : Google)

Saturday, 12 November 2011

అమ్మ.. నేను.. కొన్ని పెళ్ళికబుర్లు

అమ్మయ్య! చిరంజీవి కొడుక్కి పెళ్ళి కుదిరిందిట, ఆనందమానందమాయే! ఇంక నాక్కొన్నాళ్ళు రిలీఫ్! థాంక్స్ టు తెలుగు టీవీ చానెల్స్.

ఏవిఁటీ అర్ధంపర్ధం లేని రాతలు? సినిమావాళ్ళ పెళ్ళైతే నీకెందుకానందం?!

అమ్మ అన్నయ్య దగ్గర ఉంటుంది. షుగరు, బిపి, మోకాళ్ళ నొప్పుల వగైరా జబ్బులు అమ్మతో వుంటాయి. అమ్మని పలకరించాలంటే మా చుట్టాల్లో చాలామందికి భయం. ఎవరినా దొరికితే చాలు - అమ్మ తన జబ్బులు, బాధలు, మందులు.. చెప్పుకుంటూనే పోతుంది. అదో ఎల్పీ రికార్డ్! ఘంటసాల పాడిన భగవద్గీత వంటి ఆ రికార్దుని నేను రోజూ వింటూనే వుంటాను. ఎవరైనా సరే! తన వేసే రికార్డు మొత్తం చచ్చినట్లు వినాల్సిందే. ఓపిగ్గా విన్నవాడు ఉత్తముడు, వినలేనివాడు అధముడు. ఆ విధంగా మన కాండక్ట్ రోజువారీగా బేరీజు వేయబడుతుంది, అప్పటికప్పుడే సర్టిఫికేట్ జారీ చెయ్యబడుతుంది. ఏరోజు పరీక్ష ఆరోజే! నిన్న నువ్వు ప్యాసైనంత మాత్రాన ఈరోజు ఫైలవకూడదని లేదు.

అది పెద్ద హాలు, మధ్యన పెద్ద సోఫా. ఆ సోఫాలో పెదరాయుడు స్టైల్లో అమ్మ, ఎదురుగా టీవీ, చేతిలో మంత్రదండంలా రిమోట్! ఈ పెదరాయుడికి అనుచరగణం ఇద్దరు. సోఫా పక్కనే గచ్చుమీద కూర్చునే వెంకటమ్మ - ఇంటిపని చేస్తుంది. వంటగది గుమ్మానికి జారగిలిపడే చిట్టెమ్మ - వంటపని చేస్తుంది. వీళ్ళు టీవీ సీరియళ్ళని సీరియస్‌గా చూస్తూంటారు. వీళ్ళకితోడుగా ఆమధ్యదాకా సన్నీ అనబడు ఒక శునకుడు కూడా వుండేవాడు, వాడు వృద్ధాప్య కారణంగా కొంతకాలం క్రితం కాలం చేశాడు! టీవీ సీరియళ్లు రాని (లేని) సమయంలో అమ్మకి నొప్పులు, నీరసం, గుండెదడ!

అవి అల్లు అర్జున్ పెళ్లి చేసుకుంటున్న రోజులు.

నా రోజువారీ డ్యూటీలో భాగంగా డ్యూటిఫుల్‌గా అమ్మని అడిగాను. "అమ్మా! నొప్పులెలా ఉన్నాయి?"

"చిట్టెమ్మా! తొందరగా రా! పెళ్ళికి పవన్ కళ్యాణ్ వచ్చాడు చూడు! పక్కన భార్య లేకుండా ఒక్కడే చేతులూపుకుంటూ వచ్చాడేంటి?"

"అమ్మా! నొప్పులెలా ఉన్నాయి?" మళ్ళీ అడిగాను.

"వెంకటమ్మా! చిరంజీవి రెండో కూతుర్ని పిలవలేదనుకుంటా. పాపం! ఆ అమ్మాయి కూడా వస్తే బాగుండేది."

"అమ్మా! నొప్పులు.. "

"పెళ్ళికూతురు మెరిసిపోతుంది కదూ. అబ్బో! అబ్బో! ఏం నగలు! ఏం అలంకారాలు!"

ముగ్గురూ నోరు తెరుచుకుని చూస్తున్నారు. మొదట్లో నాకు చిరాకేసినా, ఆ తరవాత నేనూ వాళ్ళతో కలిసిపొయ్యాను!

"చిరంజీవి రెండో కూతురు మొగుణ్ణి పవన్ కళ్యాణ్ కాల్చేస్తానని సవాల్జేసిండంట! పాపం రావాలంటే ఆళ్ళకి బయ్యం గదా!" వెంకటమ్మ సమాచారం.

"లేదు వెంకటమ్మా! కాలుస్తాడనే తుపాకీని పోలీసోళ్ళు తీసేసుకున్నారు." చిట్టెమ్మ అదనపు సమాచారం.

ఈ విషయాల్లో వీళ్ళు నాకన్నా జ్ఞానవంతులనే సంగతి అర్ధమయ్యింది. మా ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్లే ఎన్నెన్నో విశేషాలు ముచ్చటించుకున్నారు.

చీరలు, నగలు ఎక్కడ కొన్నారు? రేటెంత? పెళ్లి జరుగుతున్న స్టేజ్ వెడల్పెంత? పొడుగెంత? వంట ఎంతమందికి? ఎన్నిరకాల స్వీట్లు? యేయే ఊళ్ళనించి తెచ్చారు? వంటల్లో వాడిన నూనేంటి? తాలింపు గింజలెన్ని? ఎవరెవర్ని పిలిచారు? వాళ్ళ డ్రస్సులేంటి?

అమ్మ తన నొప్పి, నీరసం, గుండెదడ మర్చిపోయింది. అసలు నన్నే మర్చిపోయింది! హమ్మయ్య!

అల్లు అర్జున్ పెళ్ళైపోయింది. అమ్మకి నొప్పులు, నీరసం మొదలయ్యాయి. తన పాత ఎల్పీ రికార్డుని దుమ్ము దులిపి ప్లే చెయ్యటం మొదలెట్టింది.

కొన్నాళ్ళకి నా అదృష్టం బాగుండి జూ.ఎన్టీఆర్ పెళ్లి కుదిరింది. కొన్నాళ్ళ పాటు ఆ పెళ్ళీకబుర్లు. ఆరోజు జూ.ఎన్టీఆర్ పెల్లి జరుగుతుంది.

యధావిధిగా డ్యూటిఫుల్‌గా అడిగాను - "అమ్మా! షుగర్ మాత్రలు వేసుకుంటున్నావా?"

"చిట్టెమ్మా! అర్జంటుగా రా! ఎన్టీఆర్ తల్లిని చూడు."

వంట మధ్యలో వదిలేసి పరుగున వచ్చింది చిట్టెమ్మ. "ఈమె భలే బాగుంది మామ్మగారు! మరి హరికృష్ణని ఎందుకు చేసుకుంది?"

"చాలా మంచమ్మాయిలా ఉంది. కాబోయే కోడలంటే ఎంత ప్రేమ! లక్షలు పెట్టి చీరలు కొంటుంది!"

"అమ్మా! షుగర్ మాత్రలు.. "

"వెంకటమ్మా! పెళ్ళికూతురు ఎంత ముద్దోస్తుందో! అల్లు అర్జున్ భార్యకన్నా హైటా?"

"లేదమ్మగారు! ఎన్టీఆర్ పొట్టి, అందుకనీ అమ్మాయి ఎత్తుగా అవిపిస్తుంది." వెంకటమ్మ అబ్జర్వేషన్.

అల్లు అర్జున్ పెళ్ళికీ, ఎన్టీఆర్ పెళ్ళికీ కల పోలికల గూర్చి కొంతసేపు మేధోమధనం కొనసాగింది.

"అమ్మా! షుగర్.. "

"చిట్టెమ్మా! పెళ్లికి బాలకృష్ణ రాడన్నావ్? వచ్చాడు చూడు." అమ్మ అరిచింది.

"బాబాయ్ వస్తేగానీ తాళి కట్టనన్నాట్ట పెళ్లికొడుకు. అందుకే వచ్చినట్లున్నాడు." చిట్టెమ్మ సంజాయిషీ.

నేను మాట్లాడ్డం ఆపేసాను, అమ్మ పెళ్ళీవిషయాలు ఫాలో అవుతూ అలా టీవీ చూడ్డం నాకు ముచ్చటేసింది.

ఈవిధంగా జూ.ఎన్టీఆర్ కొన్నాళ్ళపాటు అమ్మకి నొప్పులు, నీరసం పోగొట్టాడు. థాంక్యూ జూ.ఎన్టీఆర్!

ఆ తరవాత కొంతకాలం నన్ను సత్యసాయిబాబా కాపాడాడు. బాబా చనిపోయాడా? లేదా? ఆస్తి ఎవరికి వెళ్తుంది? ముగ్గురూ తీవ్రమైన చర్హలు సాగించారు. అయితే సాయిబాబా విషయం తొందరగానే తేల్చేశారు. బాబాని డా.సఫాయ సాయంతో రత్నాకర్ చంపేశాడు! ఆ తరవాత డబ్బుల పంపకంలో ఇద్దరికీ తేడా వచ్చింది. ఇట్లా అనేక మలుపులతో ఒక క్రైమ్ స్టోరీ చెప్పారు! ఈవిధంగా మీడియాక్కూడా తెలీని అద్భుత రహస్యాలు బయటపడ్డాయి!

నేను తెలివిగా అమ్మని తెలంగాణా ముగ్గులోకి లాగుదామని ప్రయత్నించాను. కానీ నా కుట్ర ఫలించలేదు. అమ్మకి తెలంగాణా మీద ఆసక్తి లేదు, సోనియాగాంధీ అంటే మాత్రం చాలా ఇష్టం. ఆ ఇష్టానిక్కారణం.. సోనియాగాంధీ తెల్లగా వుంటుంది, చీరలు బాగుంటాయి, నడక హుందాగా ఉంటుంది! భర్త చనిపోయినా అత్తగారి కొంపలోనే వుంటుంది. అంచేత - సోనియాగాంధీ తెలంగాణా ఇస్తేనే మనం తీసుకోవాలి, లేకపొతే లేదు. అంతే!

నాకు అమ్మ జబ్బుల ఎల్పీ రికార్డ్ తప్పట్లేదు, టీవీలవాళ్ళు మాత్రం ఏంచేస్తారు? పొద్దస్తమానం అందరికీ మళ్ళీమళ్ళీ పెళ్లి చెయ్యలేరుగా! పోన్లేండి! ఇప్పుడు చిరంజీవి కొడుక్కి పెళ్ళవుతుంది. కొన్నిరోజులు ఆవిడ కాళ్ళనొప్పులకి సెలవు! 

ఈ హీరోల పెళ్ళిళ్ళు కవర్ చేసినందువల్ల చానెళ్ళవాళ్ళకి వొచ్చే లాభం నాకు తెలీదు గానీ, నాకు మాత్రం హాయిగా, ప్రశాంతంగా వుంటుంది.  

Monday, 27 June 2011

నాకు నచ్చిన విద్వాంసుడు


సితార్ రవిశంకర్, వీణ చిట్టిబాబు, ఈమని శంకరశాస్త్రి, షెహనాయ్ బిస్మిల్లాఖాన్ వంటి సంగీత విద్వాంసుల గూర్చి విన్నాను, కానీ వారినెప్పుడూ విన్లేదు. వీరంతా గొప్ప ప్రతిభావంతులని అందరూ అంటుంటారు కాబట్టి నేనూ అర్జంటుగా ఒప్పేసుకుంటున్నాను. అయితే నేనిప్పుడు రాయబోతున్న వ్యక్తి వేరు !

పూర్వపు నలుపు తెలుపు టీవీ రోజులు గుర్తున్నాయా? ఆ రోజుల్లోనే ఇందిరాగాంధి చనిపోయింది. వారం రోజులు సంతాపం. వినోద కార్యక్రమాలన్నీ రద్దు చేయగా - వయొలిన్ ప్రోగ్రాం ఒక్కటే వచ్చేది. ఆ వయొలిన్ వాద్యగాడు నల్లగా, పొట్టిగా ఉండే ఓ మధ్యవయసు ఆసామి. పొట్టి పంచెతో, నలిగిన కుర్తాతో, మాసిన గడ్డంతో - ఒక మహానాయకురాలు చనిపోయిన దేశంలో రోదనకి ప్రతీకగా ఉండేవాడు.

దించిన తల ఎత్తకుండా 'కువూయి, కువూయి' అంటూ తన ఏడుపుగొట్టు వయొలిన్ వాయిద్యాన్ని గంటలకొద్దీ వాయించేవాడు. అప్పుడప్పుడు 'చాలా? ఇంకా వాయించనా?' అన్నట్లు పక్కకి ఎవరికేసో చూస్తుండేవాడు. వార్తలు మొదలయ్యే సమయానికి హఠాత్తుగా వాయింపుడు ఆపేసి, వయొలిన్ పక్కన పెట్టేసి, రెండు చేతులు జోడించి 'నమస్కార్' అని చెప్పేవాడు. 

ఆయన నమస్కారం నాకు అనేకవిధాలుగా గోచరించేది. 'అమ్మయ్య! ఇవ్వాళ నాకు బియ్యానికి డబ్బులొచ్చేసాయ్!' అని ఆనందపడుతున్నవాడిగానూ, 'నాకు మళ్ళీ ఈ సంతాప కచేరీ అవకాశం ఎప్పుడొస్తుందోగదా!' అని ఆశ పడుతున్నవాడిలాగానూ అనిపించేది. ఆరోజుల్లో దూరదర్శన్ వారు అన్ని సంతాపాలకి ఆయన్నే పిలిచేవాళ్ళనుకుంటాను. ఒక దేశ పేదరికాన్నీ, దైన్యాన్నీ -  మొహంలోనూ, వాయింపుడులోనూ అంత తీవ్రంగా వ్యక్తీకరించడం అనితరసాధ్యం! 

పిమ్మట ఆయన రాజీవ్ గాంధి సంతాపదినాల్లోనూ దూరదర్శన్ని ఏలాడు. క్రమేణా కాంగ్రెస్ వాళ్ళకి అనుమానం వచ్చింది. 'సంతాప వాయింపుడు అవకాశాల కోసం ఈ వయొలిన్ విద్వాంసుడు పూజలూ గట్రా చేస్తున్నాడా?!' అని. ఈ లెక్కన తమ కాంగ్రెసు పార్టీకి దేశనాయకుడెవడూ మిగలడని ఒక నిర్ణయానికొచ్చిన కాంగ్రెస్సోళ్ళు ఆయన్ని పక్కన పెట్టేశారు. 

వయొలిన్ విద్వాంసులవారికి మళ్ళీ అవకాశం రాకపోడానికి ఒక బలమైన కారణం వుందని మా గోపరాజు రవి చెబుతాడు. ఆయన సోనియాగాంధి దగ్గరకి పోయి 'నమస్కార్!' అని ఒక నమస్కార బాణం వదిలి - 'అమ్మా! మీ అత్తగారికి నేనే వాయించాను. మీ ఆయనకి నేనే వాయించాను. మీకు కూడా నేనే వాయించే అవకాశం కలిపించండమ్మా!' అని వేడుకున్నాట్ట!

చివరాకరకి నే చెప్పొచ్చేదేమనగా - ఆవిధంగా నా అభిమాన విద్వాంసులవారు టీవీ (తెర) మరుగయ్యారు. సంతాపాలకి రోజులు కాకుండా పొయ్యాయి. కాంగ్రెస్సోళ్ళు 'అమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నారు.  

(picture courtesy : Google)