Showing posts with label పృధ్వీరాజ్ కపూర్. Show all posts
Showing posts with label పృధ్వీరాజ్ కపూర్. Show all posts

Friday, 21 June 2013

మధుబాల డార్లింగ్


"సుబ్బు!"

"ఆఁ!"

"ఈ వెన్నెల ఎంత హాయిగా యున్నది!"

"ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవాల్సింది ప్రేమికులు. మనం కాదనుకుంటాను."

"ఈ చల్లని వెన్నెల సమయాన మధుబాల గుర్తోస్తుందోయి?"

"glenfiddich అడుగంటుతుంది. సరిపోదేమోనని భయంగా ఉందోయి."

"మొగలే ఆజమ్ లో మధుబాల ఎంతందంగా ఉంది! ఈ సృష్టిలో మధుబాల అద్భుత సౌందర్యానికి  గులాము కాని వెధవ ఎవడన్నా ఉంటాడా! మొగలే ఆజాం సినిమా చూడనివాడు గాడిద. మధుబాల అందాన్ని మెచ్చనివాడు పంది."

"సర్లే! ఇప్పుడు కాదన్నదెవరు? ఊరికే ఆయాసపడకు."

"పాపం! తొందరగా వెళ్ళిపోయింది సుబ్బు! అక్బర్ కొడుకేం ఖర్మ! సాక్షాత్తు బ్రహ్మదేవుడే తను సృష్టించిన అపరంజిబొమ్మ అందానికి దాసుడయ్యుంటాడు. అందుకనే తొందరగా తీసుకుపోయ్యాడు."

"అంతేనంటావా? పాపి చిరాయువు అన్నారు పెద్దలు. కాబట్టి మనం సేఫ్."




"ఆహాహా.. ఏం పాట సుబ్బు! 'ప్యార్ కియా తో డర్నా క్యా?' అంటూ పంచరంగుల్లో మెరిసిపోయింది. నా కళ్ళల్లోకళ్ళు పెట్టి చూస్తూ 'ప్రేమిస్తే తప్పేంటి? ఈ లోకంలో ప్రేమని తప్ప దేన్నీ లెక్క చేయను.' అంటుంటే ఆనందంతో ఏడుపొచ్చేసింది."

"వచ్చే ఉంటుంది. ఇప్పుడు నీ ఎమోషన్ చూస్తుంటే అర్ధమౌతుందిలే."

"గుండెలనిండా నిఖార్సైన ప్రేమభావం నింపుకున్న నిజాయితీ.. ఎవ్వరినీ లెక్కచేయ్యనీదేమో! స్వచ్చమైన ప్రేమ ముందు చావు చాలా చిన్నది. ఏంటి సుబ్బూ! అలా చూస్తున్నావ్!"

"ఏం లేదు. glenfiddich ని హడావుడిగా సేవిస్తే కలిగే దుష్పరిణామాలు గాంచుతున్నాను. అందుకే నిదానం ప్రధానం అన్నారు పెద్దలు."
             
"పాటకి అర్ధం తెలుసా సుబ్బూ! ప్రేమించటానికి భయం దేనికి? ప్రేమ తప్పెలా అవుతుంది? తప్పవటానికి ఇది దొంగతనం కాదు. ఈరోజు నా గుండెకధ చెపుతా. నన్ను చంపినాసరే, నా ప్రేమజ్యొతి వెలుగుతూనే ఉంటుంది. ఈ పరదాల చాటున నా ప్రేమని దాచలేను."

"ప్రేమ విషయంలో నేను వీక్. హిందీలో ఇంకా వీక్. కాబట్టి నువ్వు  చెప్పింది ఒప్పుకోక తప్పదు."

"ఆహా లతా దీది! నమస్కార్. నౌషాద్ భయ్యా! అదా బర్సే. ఆసిఫ్ భాయ్! ధన్యవాద్."

"మధుబాలని మర్చిపోయ్యావ్."

"ఛ ఊరుకో సుబ్బు! ఇంట్లో మనుషులకి ఎవరైనా థాంక్సులు చెబుతారా? అలా చెబితే మధుబాల డార్లింగ్ ఫీలవదూ!"


(pictures courtesy : Google)

Tuesday, 4 September 2012

రాజ్ కపూర్ 'ఆవారా' నుండి ఒకపాట.. కొన్నికబుర్లు



ఇప్పుడు నేను నాకు చాలా ఇష్టమైన పాట గూర్చి రాస్తున్నాను. నచ్చిన సినిమాలోనే నచ్చిన పాట అంటూ నా సినిమా పాటల పోస్టులో ఒక థియరీ రాశాను. నా థియరీ ప్రకారం నాకు ఇష్టమైన పాట ఎంతో ఇష్టమైన సినిమా నుండే రావాలి. కావున ముందు నాకు ఇష్టమైన సినిమాని ప్రస్తావిస్తాను.

సినిమాలు నాకు ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చాయి. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు నా సప్తపది సినిమా జ్ఞాపకాలు  అంటూ ఒక పోస్టులో రాశాను. నాకు సినిమాలు, స్నేహితుల జ్ఞాపకాలు కలగలిపి ఉంటాయి. రాజ్ కపూర్ తీసిన 'ఆవారా' సినిమా నాకు చాలా ఇష్టం.

ఆవారా సినిమా నాకు నా ప్రియమిత్రుడు శరత్ ని గుర్తుకు తెస్తుంటుంది. ఆరోజుల్లో శరత్ కి నాకూ తెల్లవార్లు కబుర్లే. అది సాహిత్యం కావచ్చు. సినిమా కావచ్చు. రాజకీయాలు కావచ్చు. ఫ్లాస్క్ నిండా కాఫీ, పెట్టె నిండా సిగరెట్లు. ఇవి మా ఇంధనం! పొద్దున్నే మైసూర్ కేఫ్ శంకర నారాయణ చేతిమీదుగా వేడివేడి ఇడ్లీ కారప్పొడి నెయ్యి, కాఫీ.

వెనక్కితిరిగి చూసుకుంటే.. అప్పటి రోజులు నాజీవితంలో స్వర్ణయుగం అనిపిస్తుంది. తరవాత రోజుల్లో శరత్ సైకియాట్రిస్టుగా ఖమ్మం పట్టణంలో ఒక వెలుగు వెలిగాడు. అతనిప్పుడు ఈలోకంలో లేడు. నా ఆలోచనల్లో మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. శరత్ నన్ను అంతగా ప్రభావితం చేశాడు.

శరత్ విశ్లేషణలు నాకు ఆసక్తికరంగా ఉండేవి. ఆవారా సినిమా మనకి అంతలా నచ్చడానికి కారణాలు చెప్పేవాడు. ఆవారా స్వాతంత్ర్యానంతరం దేశపరిస్థితుల్ని అద్దం పట్టింది. యువత వామపక్ష భావాలతో ఉవ్విళ్ళూరుతుంది. ధనిక, పేదల మధ్యన విపరీతమైన తేడా. పేదరికాన్ని, ముఖ్యంగా లుంపెన్ ని రొమేంటిసైజ్ చెయ్యడం యువతకి నచ్చింది. ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కి  ప్రేమకథ పూసి  subtle గా ప్రెజెంట్ చెయ్యడం ఈ సినిమా గొప్పదనం. బహుశా అందుకేనేమో ఈ సినిమా సోవియట్ రష్యాలో సూపర్ హిట్టయ్యింది.

'ఆవారా'లో రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్, నర్గీస్, కె.ఎన్.సింగ్ లు ప్రధాన పాత్రధారులు. నాకు మొదటిసారి ఈ సినిమా చూస్తున్నప్పుడు కొత్తగా అనిపించింది. కారణం lengthy close up shots. మరీ ముఖ్యంగా రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్ లు confront అయ్యే సన్నివేశాలలో ఈ టెక్నిక్ గమనించవచ్చు.

నటన విషయంలో పృధ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ ని అన్ని సీన్లలో డామినేట్ చేసేశాడు. సినిమాలో పలుచోట్ల నిశ్శబ్దం కూడా చాలా శక్తిమంతంగా మాట్లాడుతుంది! తెలుగు సినిమాలు మాత్రమే చూసేవారికి ఇదో కొత్త అనుభవం.

పృధ్వీరాజ్ కపూర్ జడ్జ్ రఘునాథ్ గా నటించాడు. జడ్జ్ గారికి అలగాజనం పట్ల ఏహ్యభావం. వాళ్ళ బుద్ధులు నీచమైనవని.. అవి ఎప్పటికీ మారవనీ ఆయనగారి ఘాట్టినమ్మకం. ఇదొక మేధోరోగం. అందువల్ల ఆయనకి నర్గీస్ రాజ్ కపూర్ తో స్నేహం చెయ్యడం ఎంతమాత్రం ఇష్టం ఉండదు.

అదే సమయంలో బ్రిటిష్ వాడి నుండి నేర్చుకున్న(తెచ్చిపెట్టుకున్న) హుందాతనం. మనసులో బురదగుంట ఆలోచనలు. బయటకి dignified restraint. ఇట్లాంటి పెద్దమనుషుల గూర్చి ఉప్పల లక్ష్మణరావు 'అతడు-ఆమె'లో వివరంగా రాశాడు. కొడుకుచే తిరస్కరించబడిన తండ్రిగా పృధ్వీరాజ్ కపూర్ నటన (సినిమా చివరి సీన్) ఎంతగానో ఆకట్టుకుంది. ఇండియాలో నటనపరంగా పృధ్వీరాజ్ ని ఎదుర్కోగల ధీశాలి ఒక్క చిత్తూరు నాగయ్య మాత్రమేనని నా నిశ్చితాభిప్రాయం.

అలగాజనం, క్లాస్ జనం మధ్యన స్పష్టమైన economical, social, biological గీత గీసిన ఉన్నతవర్గ ప్రతినిధిగా జడ్జ్   రఘునాథ్ ఒకవైపు. ఈ దేశంలో ఉన్న దరిద్రానికీ, దిక్కుమాలిన తనానికి, కసికి (తనెందుకంత మొరటుగా ఉంటాడో రీటాకి చెంపదెబ్బ కొట్టి మరీ చెబుతాడు రాజ్) ప్రతీకగా రాజ్ ఇంకోవైపు.
ఒక ఆవారా (రాజ్) ఇంకో ఆవారా (వీధి కుక్క) తో కబుర్లు చెప్పే సన్నివేశం బాగుంటుంది. ఈ సన్నివేశంతో రాజ్ మనస్తత్వాన్ని సింబాలిక్ గా దర్శకుడు మనముందు ఆవిష్కరిస్తాడు. "మనుషులు జంతువులు. వారికి స్నేహం చేసేవారు, ప్రేమించేవారు చాలా అవసరం." అంటూ రాజ్ కుక్కతో కబుర్లు చెబుతాడు. హేట్సాఫ్ టు కె.ఎ.అబ్బాస్!

కొందరు రాజ్ కపూర్ ఆవారా కేరక్టర్ (కేవలం అవారా సినిమా ఒక్కటేకాదు. మొత్తం రాజ్ కపూర్ ట్రాంప్ కేరక్టర్) చార్లీ చాప్లిన్ ట్రాంప్ కి అనుకరణగా ప్రస్తావిస్తుంటారు. రాజ్ కపూర్ ట్రాంప్ ని physical గా మాత్రమే తీసుకున్నాడనీ.. ఆవారా సైకోడైనమిక్స్ పూర్తిగా 'భారతీయత్వం' అని నా అభిప్రాయం. శ్రీ 420, జాగ్తే రహో, జిస్ దేశ్ మే గంగా బెహ్తి హై సినిమాలు విడివిడిగా చూడరాదు. కలిపే చూడాలి. అప్పుడే రాజు (ట్రాంప్) మనకి అర్ధమౌతాడు.
నాకు నచ్చిన ఆవారా పాట అనంగాన్లే మీరు నేను "ఘర్ ఆయా మేరా పర్దేశి" అంటూ డ్రీమ్ సాంగ్ గూర్చి రాస్తాననుకోవచ్చు. ఇది 'mother of all dream songs in India' అని అనుకుంటున్నాను. మిస్సమ్మలో మిస్ మేరి కలకి కూడా ఈ పాటే తల్లి! చాలా ట్యూన్లతో కూడిన ఈపాట గూర్చి తరవాత ఎప్పుడైనా రాస్తాను. ఈ పాట ట్యూన్ శంకర్ దా? జైకిషన్ దా? అని చాలా చర్చ నడిచింది. ఆరోజుల్లో ఏపాట ఎవరిది? అంటూ శంకర్-జైకిషన్ అభిమానుల్లోనే రెండు గ్రూపులుగా విడిపోయి వాదించుకునేవారు.

'ఆవారా'లో the best song "హం తుఝ్ సె మొహబ్బత్  కె  సనం.. " అని అనుకుంటున్నాను. ఈపాట ఎన్నిసార్లు విన్నా నాకు మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది. రాజ్ కపూర్ ఎంతటి అసాధారణ నటుడో ఈపాట చూస్తే తెలుస్తుంది. నాకు ఈపాట ఎందుకంత విపరీతంగా నచ్చింది? బహుశా నాలో అంతర్లీనంగా defeatism ఉందేమో! నా personality లో అపరిచితుడుగా దాగున్న ఈ pessimistic trait నాక్కూడా ఆశ్చర్యాన్నే కలగజేస్తుంటుంది.

రాజు ఒక దొంగ. పెద్దింటి అమ్మాయి రీటాని ప్రేమిస్తాడు. ఆమె ప్రేమని పొందడానికి దొరలాగా ప్రవర్తిస్తాడు. ఆమె పుట్టినరోజు కానుకగా ఇవ్వడం కోసం జడ్జ్ రఘునాథ్ దగ్గర్నుండే హారం కొట్టేస్తాడు. ఆ సంగతి పుట్టినరోజు వేడుకలో బయటపడుతుంది. అతను నిర్మించుకున్న ప్రేమసౌధం కూలిపోతుంది.
ఇష్టపడి, కష్టపడి ఆడిన ఆట ఓడిపోతే ఎలా ఉంటుంది? ఖేల్ ఖతం. దుకాణ్ బంద్. ఇంక మిగిలిందేమిటి? feelings of emptiness. sense of hopelessness. అటువంటి సందర్భాల్లో ఏడుపురాదు. హృదయం ఘనీభవిస్తుంది. గుండె గొంతుకలో కొట్టాడుతుంది. నైరాశ్యం. నిర్వేదం.

ఇదంతా రాయడం సులువు. నటించటం చాలా కష్టం. రాజ్ కపూర్ మాత్రం ఈ భావాలన్నింటినీ అద్భుతంగా అభినయించాడు. తన బాధని చిన్ననవ్వుతో మిళితం చేశాడు. ఈ expression నాకు మరీమరీ నచ్చింది. మన తెలుగులో నాగేశ్వరరావు వెలుగు నీడలు, మురళీకృష్ణ వంటి సినిమాల్లో గొప్పగా నటించాడు. కానీ నాకీ resigned look చాలా కొత్త. ఎప్పుడూ చూళ్ళేదు. అంతేనా? కాదు. రాజ్ కపూర్ చేతిలొ కత్తి కూడా నటిస్తుంది!

రాజ్ కపూర్ ఆస్థాన విద్వాంసులు శంకర్ - జైకిషన్, శైలేంద్ర మరియూ ముఖేష్. బర్సాత్ నుండి ఈ టీమ్ కంటిన్యూ అయ్యింది. ముఖేష్ గొంతులో మెలొడీ పెసరట్టులో ఉప్మాలా మెత్తగా, హాయిగా ఉంటుంది. నటుడు రాజ్ కపూర్ కన్నా దర్శకుడు రాజ్ కపూర్ ఎన్నోరెట్లు ప్రతిభావంతుడంటారు. నిజమే కావచ్చు. YouTube లోంచి ఈపాట మీ కోసం. ఎంజాయ్ చెయ్యండి మరి!

(photos  courtesy: Google)