Showing posts with label సరదా సరదాగా... Show all posts
Showing posts with label సరదా సరదాగా... Show all posts

Friday, 29 April 2016

ఒక బరువైన సన్నివేశం


"డైరక్టర్‌గారూ! మీకిప్పుడో సూపర్ హిట్ కథ చెబ్తాను."

"చెప్పండి."

"అది కోర్టు. ముఖ్యమైన కేసు విచారణ జరుగుతుంది. జడ్జిగారు ఆడలేడీసు. ఆవిడ కరుణామయి, త్యాగశీలి, అభిమానవతి, పుణ్యవతి, శీలవతి... "

"అర్ధమైంది, కేరీ ఆన్."

"కానీ జడ్జిగా ఆమె నిప్పులాంటి మనిషి. ఆవిడ కోర్టులో రంగయ్య డఫేదారు. పాపం! రంగయ్యకి రెండ్రోజులుగా జొరం, తట్టుకోలేక కళ్ళు తిరిగి కోర్టు మధ్యలో పడిపొయ్యాడు."

"జొరంగా వుంటే సెలవు పెట్టొచ్చుగా?"

"చెప్పాగా! జడ్జిగారు మహాస్ట్రిక్టు."

"అవును కదా, మర్చిపొయ్యా."

"డ్యూటిలో వుండగా కింద పడిపోయినందుగ్గానూ జడ్జిగారు రంగయ్యని సెక్షన్ 106, 271, 398, 469 ప్రకారం ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారు. తీర్పు చదువుతుండగా జడ్జిగారి ముఖంలో కాఠిన్యం, కంట్లోనీరు! కిందపడ్డ రంగయ్య నేలమీద నుండే హతాశుడయ్యాడు. కొద్దిసేపటికి 'ఇన్నాళ్ళ నా సేవకి ఇదా ఫలితం?' అన్నట్లు జడ్జిగారిని దుఃఖంగా చూశాడు. ఆ తరవాత నిదానంగా కోర్టుని కలియజూశాడు, ఇప్పుడు రంగయ్య కళ్ళల్లో గర్వం!"

"ఎందుకని!!!????"

"అదే మన కథలో ట్విస్టు. జడ్జమ్మాయిగారు డఫేదార్ రంగయ్య కూతురు! రంగయ్య తన ఆరోగ్యాన్ని లెక్కజెయ్యకుండా, రాత్రనకా పగలనకా గొడ్డులా కష్టపడి కూతుర్ని చదివించి ఇంతదాన్ని చేశాడు! ఎలా వుంది సీన్?"

"సూపర్. కాకపోతే మీరీ కథని యాభైయ్యేళ్ళు లేటుగా చెబ్తున్నారు."

"!!!???"

"యేంలేదు. ఈ పాత్రలు పోషించడానికి సావిత్రి, గుమ్మడి కావాలి. ఇప్పుడు మనం వాళ్ళని తేలేం కదా! కాబట్టి ఈ కథ వద్దులేండి." 

(picture courtesy : Google)    

Wednesday, 27 April 2016

టాప్ సీక్రెట్


"ఇది టాప్ సీక్రెట్, ఎవరికీ చెప్పకు."

"యేంటది?"

"పాకిస్తాన్ పీడా ఒక్కరోజుతో వొదుల్చుకునే ప్లాన్ నాదగ్గరుంది."

"ఒక్కరోజులోనా!"

"అవును. నాక్కావల్సిందల్లా ఓ విమానం, పదిబాంబులు. ఆ పదిలో ఓ రెండు పేలని బాంబులు."

"ఎందుకు!?"

"చెబ్తా! ఆ బాంబుల మీద 'మేడిన్ పాకిస్తాన్' అని తాటికాయ కన్నా పెద్దక్షరాల్తో ప్రింట్ చేసుండాలి."

"ఎందుకు!?"

"చెబ్తా! ఆ విమానంలో యే అర్ధరాత్రో చైనావాడి భూభాగంలోకి ప్రవేశించి, గప్‌చుప్‌గా ఆ బాంబుల్ని జారవిడిచేసి వెనక్కొచ్చెయ్యాలి. చైనాగాడు పేలని బాంబుల మీదున్న 'మేడిన్ పాకిస్తాన్' చూస్తాడు. బాంబులేసింది పాకిస్తాన్‌వాడే అనుకుని కోపంతో రగిలిపోతాడు, వెంటనే పాకిస్తాన్‌గాడి మీద యుద్ధం మొదలెడతాడు. ఆ దెబ్బకి మనకి పాకిస్తాన్ పీడా విరగడౌతుంది. మనం తమాషా చూస్తూ ఎంజాయ్ చేద్దాం. శత్రువుని శత్రువుతోనే దెబ్బతియ్యాలి. ఇదీ నా ప్లాన్, ఎలా వుంది?"

"అయ్యా! ఎవరండీ తమరు?"

"ఇంత చెప్పినా తెలుసుకోలేరా!? నేను తెలుగు సినిమా రచయితని."

(picture courtesy : Google)

Monday, 18 April 2016

చినబాబు స్పందించారు!


"చినబాబూ! మీకు చెప్పదగ్గవాళ్ళం కాదు, అయినా చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి పోస్టులో నాన్నగారు బిజీగా వున్నారు. ఇప్పుడు పార్టీ నాయకత్వం మీదే. మీరేమో పొద్దస్తమానం ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు."

"అబ్బబ్బా! ఏం పార్టీ నాయకులయ్యా, ఒకటే నస. సరే! ఇప్పుడు నేనేంచెయ్యాలో చెప్పండి."

"ఎండలకి జనం మలమలా మాడిపోతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారు."

"సారీ! ఇప్పుడా ఎండల్లో తిరగడం నా వల్లకాదు."

"మీరు ఎండలోకి రానక్కర్లేదు చినబాబు, స్పందిస్తే చాలు."

"అంటే?"

"ఎండల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టండి."

"పెట్టి?"

"ప్రతిపక్ష నాయకుణ్ణి నాలుగు తిట్టండి."

"తిడితే?"

"అది చాలు చినబాబు. మీరు చెప్పిన్దానికి అదనంగా కథ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం వహిస్తూ వార్తల్ని వండి వార్చడానికి మనకి మన మీడియా వుండనే వుందిగా!"

"అవును కదా! ఆ విషయం మర్చేపొయ్యాను. వెంటనే ప్రెస్‌వాళ్ళకి కబురంపండి."

కొద్దిసేపటికి ప్రెస్ మీట్ -

"నాన్నగారి పాలనలో ప్రజలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరౌతున్నారు. మళ్ళీ సాక్షాత్తు ఆ శ్రీరాముడే మమ్మల్ని పాలిస్తున్నాడని పులకించిపోతున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా దర్జాగా, హాయిగా ఇంట్లోనే వుంటూ ఏసీ చల్లదనాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్నే మా పార్టీ అమెరికా బ్రాంచివాళ్ళు కూడా రిపోర్టు చేశారు. ప్రజలు ఇంత చల్లగా, ప్రశాంతంగా బ్రతకడాన్ని చూసి సింగపూరు, జపాను వాళ్ళు కూడా తీవ్రంగా ఆశ్చర్యపోతున్నారు. అయితే అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్ష నాయకుడు మాత్రం ప్రజల ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అందుకే - ప్రజల్ని రోడ్ల మీదకి రమ్మనీ, చచ్చిపొమ్మనీ రెచ్చగొడుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడి కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నా. అతడిపై సెడిషన్ చార్జెస్‌ మోపి వెంటనే అరెస్టు చెయ్యలని కూడా డిమాండ్ చేస్తున్నా. మా నాన్నగారికి జై! మా పార్టీకి జై!!"  

(picture courtesy : Google) 

Friday, 26 December 2014

నేనో ఆవఁదం చెట్టుని!


అదొక సైకియాట్రీ కాన్ఫరెన్స్ రోజు. పగలంతా ఎకడెమిక్ కార్యక్రమాలతో వేడెక్కిన బుర్రని చల్లబరచడానికి సాయంకాలం ఓ పార్టీ. పేద్ద హాల్, అందులో పెద్దసైజు అప్పడాల్లా - తెల్లటి గుడ్డతో ముసుగేసుకున్న గుండ్రటి టేబుళ్ళు. సరదా కబుర్లు. వెచ్చని గ్లాసులు, చల్లని మగ్గులు.

ఓ టేబుల్ చుట్టూ సీనియర్ సైకియాట్రిస్టులు. వాళ్ళల్లో ఒకాయన నన్ను చూడంగాన్లే దగ్గరగా రమ్మని సైగ చేశాడు, ఆప్యాయంగా యోగక్షేమాలు విచారించాడు.

వున్నట్టుండి పక్కనున్నవారితో - "మనవాడికి తెలుగు సాహిత్యంలో మంచి నాలెడ్జ్ వుంది." అన్నాడు.

ఇట్లాంటి స్టేట్‌మెంట్ నేనూహించలేదు. అందువల్ల బోల్డెంత సిగ్గుగా అనిపించింది.

"అబ్బే! అదంతా ఒకప్పుడు లేండి, ఇప్పుడు కాదు." మొహమాటంగా అన్నాను.

"అదేంటయ్యా? ఆరోజు మనం మాట్లాడుకున్నప్పుడు తెలుగు రచయితల గూర్చి చెప్పావుగా!?" పెద్దాయన ఆశ్చర్యపొయ్యాడు.

"ఆ రోజు మీకు రావిశాస్త్రి, పతంజలి గూర్చి మాత్రమే చెప్పానండీ!" సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లు చెప్పాను.

ఒక సీనియర్ డాక్టర్ నా వైపు ఆసక్తిగా చూస్తూ అడిగాడు.

"ఐసీ! వాళ్లిప్పుడు ఎక్కడున్నారు? హైదరాబాదులోనా?"

"వాళ్ళిప్పుడీ లోకంలో లేరు." ఇబ్బందిగా అన్నాను.

"తెలుగు రైటర్స్ ఇంగ్లీష్ లిటరేచర్‌ని కాపీ కొట్టి రాస్తారంటారు, నిజమేనా?" ఇంకో సీనియర్ డాక్టర్ కుతూహలంగా అడిగాడు.

నాకేం మాట్లాడాలో అర్ధం కాలేదు. వారి సైకియాట్రీ జ్ఞానం పట్ల నాకు గౌరవం వుంది. వారికి తెలుగు సాహిత్యం గూర్చి అసలేమీ తెలీదని అర్ధమవుతుంది. ఏదో నేను దొరికాను కదాని - కాలక్షేపంగా ధర్మసందేహాలు అడుగుతున్నారు.

"అంత లోతైన విషయాలు నాకు తెలీదండీ!"

ఇంకా అక్కడే వుంటే ఇంకేం ప్రశ్నలడుగుతారోననే భయంతో - "ఎక్స్యూజ్ మి" అంటూ ఏదో పనున్నవాళ్ళా అక్కణ్నుండి పారిపొయ్యాను.

అయితే - నేనిప్పుడు ఇంతకుముందులా సిగ్గు, మొహమాటం ఫీలవ్వట్లేదు! ఇక్కడ - పాతికేళ్ళ క్రితం ఓ పాతిక తెలుగు పుస్తకాలు చదివిన నేనే గ్రేట్!

దీన్నే 'ఏ చెట్టు లేని చోట ఆవఁదం చెట్టే గొప్ప' అంటారనుకుంటాను. అయితే - తన చుట్టూతా ఏ చెట్టూ లేకపోవడం ఆవదం చెట్టు తప్పు కాదని మనవి చేసుకుంటున్నాను!

(picture courtesy : Google)

Wednesday, 24 September 2014

నా బ్లాగ్ రీడర్‌తో కొంచెంసేపు


"ఏవిఁటాలోచిస్తున్నావు?"

"ఈ ప్రపంచాన్నెలా బాగుచెయ్యాలా అని!"

"అందుకు ఒబామా వున్నాడు. ఒబామా వెనకాల లెక్కలేనన్ని అణ్వాయుధాలున్నాయి. ఇంక నీకేం పని?"

"అవును కదా! అయితే ఈ దేశాన్నెలా బాగుచెయ్యాలా అని ఆలోచిస్తాను!"

"దేశాన్ని బాగు చెయ్యడానికి మోడీ వున్నాడు. మోడీ వెనుక 'లవ్ జిహాద్' అంటూ సంఘపరివారం వుంది. ఇంక నీకేం పని?"

"పోనీ రాష్ట్రాన్నెలా బాగుచెయ్యాలా అని ఆలోచించొచ్చా?"

"రాష్ట్రాన్ని బాగుచెయ్యడానికి చంద్రబాబు నాయుడున్నాడు. చంద్రబాబు వెనక తీవ్రంగా శ్రమించే నిస్పక్షపాత మీడియా వుంది. ఇంక నీకేం పని?"

"పోనీ మా ఊరినెలా.. "

"అందుకోసం ప్రజలెన్నుకున్న మునిసిపల్ కార్పొరేషన్ వుందిగా? ఇంక నీకేం పని?"

"నిజవేఁ! అయినా అవన్నీ నాకెందుకు? నా ఇంటినెలా చక్కబెట్టాలా అనేది ఆలోచించాలి గాని!"

"నీ ఇంటిని చెడగొట్టాలంటే నీ ఆలోచన కావాలి గానీ - చక్కబెట్టడానికైతే నీ భార్యుందిగా? ఇంక నీకేం పని?"

"సర్లే! కొద్దిసేపు ట్రెడ్‌మిల్ చేసుకుంటాను. ఆరోగ్యాన్నైనా కాపాడుకోవాలిగా!"

"పిచ్చివాడా! జననమరణములు దైవాధీనం. నీ బోడి ట్రెడ్‌మిల్‌తో దేవుడి చిత్తాన్ని మార్చగలవా?"

"కానీ 'ఆరోగ్యమే మహాభాగ్యము' అన్నారు పెద్దలు."

"ఆ పెద్దలే 'పాపి చిరాయువు' అని కూడా అన్నారు."

"మరిప్పుడు నేనేం చెయ్యాలి?"

"అలా జూ దాకా వెళ్ళి పెద్దపులితో ఒక సెల్ఫీ తీసుకోరాదా?"

"వామ్మో! పెద్దపులితో సెల్ఫీనా?"

"అవును. నాకు నిన్ను పెద్దపులితో చూడాలని ముచ్చటగా వుంది."

"ఇంతగా ముచ్చట పడుతున్నావు! ఇంతకీ ఎవర్నువ్వు?"

"హ్మ్.. నేన్నీ బ్లాగ్ రీడర్ని. నీ వెర్రిమొర్రి ఆలోచనల్ని చదివి బుర్ర తిరిగిపోయిన అభాగ్యుడను. నీనుండి తెలుగు బ్లాగుల్ని రక్షించాలనే సదాశయంతో ఇలా వచ్చాను."

"నా బ్లాగ్రాతలు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలిగానీ - నన్ను చంపేందుకు కుట్ర పన్నడం అమానుషం."

"అవున్నిజవేఁ! ఒప్పుకుంటున్నాను. కానీ - నాకింతకన్నా వేరే మార్గం కనపడట్లేదు!"

(picture courtesy : Google)

Monday, 22 September 2014

వీరిలో క్లింట్ ఈస్ట్‌వుడ్ ఎవరు?


వాళ్ళు ఎదురెదురుగా నిలబడి వున్నారు, ఒకళ్ళ కళ్ళల్లోకి ఇంకొకళ్ళు తీక్షణంగా చూసుకుంటున్నారు. అక్కడ ఎవరు ముందు తుపాకీ తీస్తారో - ఎవరు మెరుపు వేగంతో గురి తప్పకుండా కాలుస్తారో - వారిదే అంతిమ విజయం. ఇప్పుడిక్కడ ఎవరు గెలుస్తారు? ఎవరు చస్తారు? చాలా ఉత్కంఠగా వుంది కదూ!

ఇట్లాంటి సీన్లు వెస్టర్న్ సినిమాల్లో వుంటాయి. మా గుంటూర్లో లీలామహల్‌లో ఇంగ్లీషు సినిమాలు ఆడేవి. 'ద గుడ్ ద బేడ్ అండ్ ద అగ్లీ' అనే సినిమా ఒక గొప్ప కౌబాయ్ చిత్రరాజం అని ఊరంతా కోడై కూసిన కారణాన ఆ సినిమా చూశాను. మామూలే! సినిమా అర్ధం కాలేదు, కానీ - బాగుంది!

నాకైతే సినిమా చివరి సీన్ బాగా నచ్చింది. క్లింట్ ఈస్ట్‌వుడ్, లీవాన్ క్లిఫ్, ఈలై వాలెక్ - ముగ్గురూ మూడువైపులా నించుని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ నిలబడి వుంటారు. బ్యాక్‌గ్రౌండ్‌లో డాలర్స్ మ్యూజిక్ వస్తుంటుంది. సినిమా చూసిన చాలా రోజులైనా ఈ సీన్  నాకు బాగా గుర్తుండిపోయింది.  

ఈ సీన్ గూర్చి ఇప్పుడెందుకు చెబుతున్నాను? ఎందుకంటే మన రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు సీట్ల సర్దుబాటు సమయంలో అచ్చు ఇలాగే ప్రవర్తిస్తుంటాయి కనుక. మన రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాని బాగా ఇష్టపడ్డారనీ, అందుకే వారి రాజకీయ ఎత్తుగడలకి స్పూర్తి ఈ సన్నివేశమేనని నా అనుమానం!

సన్నివేశం సేమ్, నటుల మొహాలే మార్పు! ఒకప్పుడు ఈ సన్నివేశంలో చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, లాలూ యాదవ్ వంటి ఉద్దండులు నటించారు. ఇప్పుడు అమిత్ షా, ఉద్దవ్ థాకరేలు నటిస్తున్నారు. సినిమాలో చిన్న పొరబాటు జరిగినా తుపాకీ గుండుకి ప్రాణమే పోతుంది, రాజకీయ పార్టీలక్కూడా ఎన్నికలు జీవన్మరణ సమస్యే! 

ఇంతకీ మహారాష్ట్ర ఎన్నికల్లో క్లింట్ ఈస్ట్‌వుడ్ ఎవరు? అమిత్ షానా? ఉద్దవ్ థాకరేనా? మనకి తెలీదు. ఇంకొంత కాలం ఆగి వెండితెరపై చూడ్డం మినహా మనం చేసేది కూడా ఏమీ లేదు!

(picture courtesy : Google)

Thursday, 14 August 2014

జ్ఞాని


మొన్నొక డాక్టర్‌తో కబుర్లు చెబుతున్నాను. ఆయనో కార్డియాలజిస్ట్.

నేను సాధారణంగా డాక్టర్లతో స్నేహానికి పెద్దగా ఆసక్తి చూపను. ఇందుకు కార్డియాలజిస్టులు మాత్రం మినహాయింపు. ఎందుకైనా మంచిదనే (భవిష్యత్తులో ఈ గుండెజబ్బులాళ్ళతో అవసరం పడొచ్చుననే స్వార్ధం) ముందుచూపే ఇందుకు కారణం!

ఆ డాక్టర్‌తో మాట్లాడేప్పుడు నా చేతిలో ఒక పుస్తకం వుంది.

"ఆ పుస్తకం ఏమిటి?" ఆ డాక్టర్ కుతూహలంగా అడిగాడు.

"ఇది పుస్తకం ఫలానా నవల. సగం చదివాను. మీక్కావాలంటే వుంచేసుకోండి." అన్నాను.

"అబ్బే! చదివే టైం నాకెక్కడిది? ఊరికే తెలుసుకుందామని అడిగాను." అన్నాడాయన.

"మీరేమీ మొహమాట పడనక్కర్లేదు. చదువుతానంటే పుస్తకం వదిలేసి పోతాను." అన్నాను.

"నాకు మీదగ్గర అస్సలు మొహమాటం లేదు. నాకు పుస్తకాలు చదివే టైమూ లేదు, ఇంటరెస్టూ లేదు." స్థిరంగా, ఖచ్చితత్వంతో చెప్పాడాయన. 

నాకీ డాక్టర్ నచ్చాడు. బాగా పధ్ధతి గల మనిషిలాగున్నాడు. తన గూర్చి తనకి చక్కని అంచనా ఉన్నట్లుంది. నేనా డాక్టర్ వైపు ఈర్ష్యగా చూశాను!

నాకీ బుద్ధిలో సగమైనా ఉంటే బాగుణ్ణు! చాలా పుస్తకాలు చదవాలనే ప్రణాళిక వేసుకుంటాను. కానీ - భారతదేశ దారిద్ర్య నిర్మూలనా ప్రణాళికలా నా పుస్తక పఠనం ఒక్కంగుళం కూడా ముందుకు నడవదు. పోనీ - 'చదవలేను' అని ఒప్పుకోవచ్చుగా? లేదు - రాజకీయ నాయకులకి మల్లే నాకు అహం అడ్డొస్తుంది.

దేవుడి సృష్టిలో రకరకాల జీవులు. ఈ జీవుల్లో కొందరికి ఆత్రం ఎక్కువ. ఎన్నో పన్లు చేద్దామని ఆయాస పడుతుంటారు, ఏదీ చెయ్యలేక నీరసపడుతుంటారు. పోనీ - ఆ తర్వాతైనా రియలైజ్ అయ్యి వాస్తవిక దృక్పధం అలవరచుకుంటారా అంటే - అదీ వుండదు!

కావున - తన పరిమితులు గుర్తించిన వాడే అసలైనా జ్ఞాని అని అనుకుంటున్నాను. ఈ నిర్వచనం ప్రకారం నేను అజ్ఞానిని అయిపోతాను. కానీ - నా అజ్ఞానాన్ని ఒప్పుకోకపోతే పరమ అజ్ఞానిని మిగిలిపోతాననే శంకతో ఈ నిజాన్ని అర్జంటుగా ఒప్పేసుకుంటున్నాను!

(picture courtesy : Google)

Monday, 11 August 2014

ఆరోగ్యమే మహాభాగ్యము


'ఆరోగ్యమే మహాభాగ్యము' - ఈ విషయం సుబ్బారావు మనసులో లోతుగా పాతుకుపోయింది. అందుకే అతను ఆ మహాభాగ్యానికి శాశ్వత చిరునామాగా ఉందామని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ వుంటాడు. అందుకతను చాలా గర్వపడతాడు కూడా.

సుబ్బారావుకి ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధ. ఉదయాన్నే కోడికూత కన్నా ముందే లేస్తాడు. ఒక లీటరు గోరువెచ్చని నీరు తాగి - జాగింగ్ షూస్, ట్రాక్ సూట్ వేసుకుని నాలుగు మైళ్ళు పరిగెడతాడు. ఆపై గచ్చు మీద ఒక గుడ్డ పరుచుకుని కనీసం గంటపాటు యోగాసనాలు వేస్తాడు. ఆ తరవాత కొంతసేపు ధ్యానం చేసుకుంటాడు.

పిమ్మట మెలకెత్తిన గింజలు, కేరట్, కీరా దోసకాయ ముక్కలు బాగా నమిలి తింటాడు (వాటినలా నమలకపొతే సరీగ్గా జీర్ణం కావు). అతగాడి బ్రేక్‌ఫాస్ట్ రెండిడ్లీ, ఆపై ఒక కప్పు గోరువెచ్చని పాలు. అంతే! అంతకుమించి ఇంకేదీ తినడు. ఒకసారి అతని భార్య ప్రేమగా ప్లేట్లో మూడో ఇడ్లీ పెట్టిందని కోపం తెచ్చుకుని నెల్రోజుల పాటు ఆమెతో మాట్లాడ్డం మానేశాడు! అవును మరి - ఆహార నియమాల్లో అతనిది ఉక్కు క్రమశిక్షణ!

మధ్యాహ్నం భోజనంగా ఉప్పులేని కూరతో ఒక కప్పు అన్నం, కొంచెం పెరుగు. అంతకుమించి అతనెప్పుడూ తిన్లేదు. అతనికి కాఫీ, టీల్లాంటివి అలవాట్లు లేవు. వక్కపొడి రుచి తెలీదు. మరీ ఆకలనిపిస్తే అప్పుడప్పుడు ఒక యాపిల్లో నాలుగో భాగం తింటాడు. రాత్రి ఉప్పు లేని పప్పుతో ఒక పుల్కా, గ్లాసుడు పల్చని మజ్జిగ (ఉప్పు లేకుండా). గత కొన్నేళ్లుగా అతని ఆహారపు అలవాట్లు ఇవే.

ఉప్పు అనేది సమస్త రోగాలకి మూలం అని ఎవరో ఒకయాన పొద్దస్తమానం టీవీల్లో చెబుతుంటాట్ట. అందుకే సుబ్బారావు ఉప్పుని నిప్పులా చూస్తాడు. అతను అప్పుడప్పుడూ మెంతులు నముల్తుంటాడు! మెంతులు తింటే షుగర్రోగం దరిదాపులక్కూడా రాదుట! ఇలా ఆరోగ్యం గూర్చి అనేక పత్రికలు చదువుతూ, టీవీలో చూస్తూ తన జ్ఞానాన్ని మెరుగు పరుచుకుంటూ వుంటాడు.

అలా సంపాదించిన జ్ఞానంతో తన ఆరోగ్యం గూర్చి తీవ్రంగా వ్యాకులత చెందుతూ వుంటాడు సుబ్బారావు.

'ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నానా? ఇకనుండి ఒకడ్లీ మాత్రమే తింటే బెటరేమో!'

'రోజూ నాలుగు మైళ్ళ పరుగు సరిపోదేమో? ఇంకో నాలుగు మైళ్ళు పరిగెత్తితే ఎలా వుంటుంది?'

'టమోటా తింటే కిడ్నీలో రాళ్ళొస్తాయా? అరెరే! ఈ సంగత్తెలీక నిన్ననే టమోటా పప్పు తిన్నానే! కొంపదీసి నాగ్గాని కిడ్నీలో రాళ్ళేర్పడవు కదా?'

'ఇవ్వాళ నాకు నాలుగు ఫర్లాంగుల దూరంలో ఒక దరిద్రుడు సిగరెట్టు కాల్చాడు. వాడి సిగరెట్టు పొగ గాలివాటున నా ముక్కుకి తగిలిందా? అది నా ఊపిరితిత్తుల్లోకి పోలేదు కదా?'

'మొన్న పెళ్ళిలో టెమ్టయ్యి చిటికెడు మైసూరు పాకం తిన్నాను. షుగరు బొగరు రాదు కదా?'


సుబ్బారావుకి ఒక చిన్ననాటి స్నేహితుడు వున్నాడు, పేరు రమణారావు. మనిషి మంచివాడు. అతనికి సుబ్బారావంటే చాలా అభిమానం. కానీ - రమణారావు సిగరెట్లు హెవీగా కాలుస్తాడు, మందు ఫుల్లుగా కొడతాడు, విపరీతంగా తింటాడు, వ్యాయామం అంటే ఏంటో అతనికి తెలీదు.

సుబ్బారావు తన మిత్రునికి ఆరోగ్య సూత్రాల గూర్చి అనేక విధాలుగా చెప్పి చూశాడు. రమణారావు నవ్వి ఊరుకునేవాడుకానీ స్నేహితుని సలహాలు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. సుబ్బారావు రమణారావు దగ్గర ఎక్కువసేపు వుండేవాడు కాదు. వున్న ఆ కొంచెంసేపు కూడా అతనెక్కడ సిగరెట్టు ముట్టిస్తాడోననే భయంతో వణికిపొయ్యేవాడు!

కాలచక్రం గిర్రుమంటూ తిరుగుతూనే వుంది. అలా - ఆరోగ్య నియమాల్తో సుబ్బారావు.. తన అలవాట్లతో రమణారావు సంతోషముగా జీవించుచుండగా -

విధి బలీయమైనది, క్రూరమైనది, విచక్షణ లేనిది. 'ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?' అంటూ 'లవకుశ'లో ఘంటసాల పాడనే పాడాడు గదా! ఒకరోజు హఠాత్తుగా సుబ్బారావు దుర్మరణం చెందాడు! అతను పొద్దున్నే జాగింగ్ చేయుచుండగా వెనకనుండి స్పీడుగా వస్తున్న పాల వ్యాన్ గుద్దేసింది, స్పాట్ డెడ్.

రమణారావు మిత్రుని మృతి తట్టుకోలేకపొయ్యాడు, భోరున విలపించాడు. అతనిన్నాళ్ళూ - సుబ్బారావు తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వందేళ్ళు బ్రతుకుతాడని, తనకేదైనా అయినా - తన కుటుంబానికి తన మిత్రుని అండ ఉంటుందని భరోసాగా వున్నాడు.

"అయ్యో మిత్రమా! తెల్లారుగట్ట రోడ్లెంట పడి పిచ్చికుక్కలా పరుగులెత్తావు. కాళ్ళూ చేతులు మెలికలు తిప్పేస్తూ ఆసనాలు వేశావు. ఆరోగ్య పరిరక్షణ అంటూ నాకు కర్ణకఠోరమైన క్లాసులు పీకావు. ఇన్ని చేసినవాడివి - వెనకనే వస్తున్న ఆ మాయదారి పాలవాన్‌ని మాత్రం ఎందుకు చూసుకోలేపొయ్యావు?

అయ్యో నా బాల్య మిత్రమా! జీవితంలో ఏదీ అనుభవించకుండానే పొయ్యావెందుకు? నీకు విస్కీ వాసన తెలీదు, గోల్డ్‌ఫ్లేక్ మజా తెలీదు, చికెన్ రుచి తెలీదు. ఎక్కువ రోజులు బ్రతకాలని పిల్లిలాగా, గోడ మీద బల్లిలాగా - రుచీపచీ లేని చప్పని జీవితాన్ని గడిపావు. ఇలా అయిపోతావని ముందే తెలిస్తే బలవంతంగానైనా నీ నోట్లో బకార్డి రమ్ము పోసేవాణ్నే, తందూరీ చికెన్ కుక్కేవాణ్నే!"

రమణారావుని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. పాపం రమణారావు!

ముగింపు -

జనన మరణములు దైవాధీనములు, లలాట లిఖితము. దేవుణ్ణి కాదండానికి నువ్వెవరు? నేనెవరు? భూమ్మీద నూకలున్నవాడు ఏది ఎంత తాగిననూ, అసలేది తాగకున్ననూ జీవించే యుండును. నూకల్లేనివాడు ఎంత పరిగెత్తిననూ, ఎంత ఒళ్ళు విరుచుకున్ననూ పరలోకప్రాప్తి తధ్యము! అంతా ఆ పైవాడి లీల!

నీతి -

ఆరోగ్యం మహాభాగ్యమే! అయితే - యాక్సిడెంట్లు తప్పించుకొనుట అంతకన్నా మహాభాగ్యము!

(picture courtesy : Google)

Wednesday, 16 July 2014

రెండు



జ్ఞానులు రెండురకాలు - ఒకరు అజ్ఞానులు, రెండు విజ్ఞానులు. అయితే - ఇక్కడో చిక్కుంది. ఎవరికివారు తామే విజ్ఞానఖనులమని అనుకుంటారు. అంతేకాదు - ఎదుటివారు అజ్ఞానగనులని కూడా అనుకుంటారు (బయటకి చెప్పకపోయినా). ఈ సూత్రాన్ని అనుసరించి (ఎట్లాగూ అందరూ నన్ను అజ్ఞానిగానే భావిస్తారు కాబట్టి) నన్ను నేనే ఒక విజ్ఞానిగా పరిగణించుకుంటుంటాను. నేనేమన్నా తక్కువ తిన్నానా? దెబ్బకి దెబ్బ, చెల్లుకు చెల్లు!

పనులు రెండురకాలు - ఒకటి పనికొచ్చే పని, రెండు పనికిరాని లేక పనికిమాలిన పని. భుక్తి కోసం చేసే పన్లన్నీ పనికొచ్చేవే. స్టాంపులు, సీసామూతలు సేకరించుట.. పైగా అందులకు గర్వించుట - పనికిరాని పనే. ఈ పన్లని ఇంగ్లీషులో 'హాబీ' అంటార్ట! అంటే - తిని అరక్క చేసే పనులక్కూడా ఇంగ్లీషువాడో పదం కనిపెట్టాడన్న మాట! ఎంతైనా ఇంగ్లీషోడు ఇంగ్లీషోడే! 

వాదులు రెండురకాలు - ఒకరు న్యాయవాదులు (ప్లీడర్లు కాదు), రెండు అన్యాయవాదులు. ఒక అభిప్రాయాన్ని వ్యక్తీకరించి, తదనుగుణంగా ఎంతోకొంత హేతుబద్దంగా వాదించే మర్యాదస్తుల్ని న్యాయవాదులు అంటారు. తన అభిప్రాయాన్ని అందరూ ఒప్పుకోవాలనే కఠిన మనస్తత్వం కలిగుండి, తదనుగుణంగా అల్లూరి సీతారామరాజు స్పూర్తితో రాజీలేని పోరాటాన్ని సాగించేవారిని అన్యాయవాదులు అంటారు.

భర్తలు రెండురకాలు - ఒకరు నీటుభర్తలు, రెండు నాటుభర్తలు. భార్యతో అనేక రకాలుగా హింసింపబడుతూ, ఆ (గృహ)హింసని పళ్ళబిగువున భరిస్తూ, బయటకి చెప్పుకోలేక గుడ్లనీరు కుక్కుకుంటూ భారంగా, భయంగా, అయోమయంగా సంసార సాగరాన్ని ఈదువారు నీటుభర్తలు. ప్రతి యువతీ తనకి ఇట్లాంటి భర్తే లభించాలని ఎన్నో పూజలు చేస్తుంటుంది. రోజూ  పీకల్లోతు తాగి, చేతులు తిమ్మిరెక్కో లేక సరదాగానో పెళ్ళాన్ని తుక్కుబడ తన్నుకునే సౌలభ్యం వున్నవారు నాటుభర్తలు (వాడి పెళ్ళాన్ని వాడు కొట్టుకుంటాడు, చంపుకుంటాడు! మధ్యలో నీకెందుకు?). ప్రతి మగాడూ నాటుభర్తగా ఉందామనుకుంటాడు, కానీ - అదృష్టం కలిసిరాదు!

జ్ఞాపకశక్తి రెండురకాలు - ఒకటి అవసరమైనది, రెండు అనవసరమైనది. నా చిన్ననాటి స్నేహితుడు తెలివైనవాడు, అతనికి జ్ఞాపకశక్తి మెండు. ఫోన్ నంబర్లు, స్కూటర్ నంబర్లు శకుంతలాదేవి రేంజిలో గుర్తుంచుకునేవాడు. కానీ అతనికి పాఠ్యపుస్తకాల్లో వున్నదేదీ గుర్తుండేది కాదు! నాది పూర్తిగా ఆపోజిట్ సమస్య. నాకేదైనా గుర్తుండాలంటే అది పాఠ్యపుస్తకాల్లో వుండితీరాలి - లేకపోతే లేదు, అంతే! ఇందువల్ల నేను కొన్నిసార్లు నా స్కూటర్ తాళంతో, అదే రంగులో వున్న ఇంకొకడి స్కూటర్ తాళం తియ్యడానికి తీవ్రంగా ప్రయత్నించి తిట్లు తిన్న సందర్భాలు వున్నాయి. అయితే - నేనూ నా స్నేహితుడు ఎప్పుడూ కలిసే వుండేవాళ్ళం కాబట్టి, 'దోస్తి' సినిమాలో హీరోల్లా, ఒకళ్ళకొకళ్ళం సహాయం చేసుకుంటూ సింబయాటిగ్గా జీవించాం.

పరిచితులు రెండురకాలు - ఒకరు సుపరిచితులు, రెండు అపరిచితులు. ఈ సుపరిచుతులు అక్కినేని నాగేశ్వర్రావంత సౌమ్యులు, వినమృలు, మితభాషులు. చిరునవ్వుతో, దరహాసంతో 'మౌనమే నీ భాష ఓ మూగమనసా' అన్నట్లుగా వుంటారు. రెండు రౌండ్లు పడంగాన్లే జూలు విదిల్చిన సింహం వలె అపరిచితులుగా మారిపోతారు. ఆ తరవాత రౌండురౌండుకీ సీతయ్యలా గర్జిస్తారు, సమరసింహారెడ్డిలా గాండ్రిస్తారు!

వైద్యులు రెండురకాలు - ఒకరు వైద్యం చేసి డబ్బు తీసుకునేవారు, ఇంకొకరు డబ్బు కోసమే వైద్యం చేసేవారు. అనగా - రోగానికి సరైన వైద్యం చేసి, అందుకు డబ్బు వసూలు చేసేవాళ్ళు మొదటిరకం. వైద్యం తెలిసినా - తాము అనుకున్నంత బిల్లయ్యేదాకా రోగాన్ని పేరబెడుతూ వైద్యం చేసేవారు రెండోరకం. ఒకప్పుడు మొదటి రకం వైద్యులు ఉండేవాళ్ళుట! ఇప్పుడు వారు డైనోసార్లయ్యారు.

ఇలా చాలా రకాలు రాసుకుంటూ పోవచ్చుగానీ.. ప్రస్తుతానికి ఇంతటితో ఆపేస్తాను.

Friday, 30 May 2014

ప్రశ్నిజం


వేసవి కాలం, మిట్ట మధ్యాహ్నం, మండుటెండ, వేడిగాలి. 

అబ్బా! సెగలు, పొగలు, నిప్పుల కొలిమిలో నిల్చున్నట్లు, బొగ్గుల కుంపట్లో పడుకున్నట్లు.. ఇవ్వాళ ఇంత వేడిగా వుందేమిటి!

ఆకాశం ప్రశాంతంగా ఉన్నట్లు దొంగనిద్ర నటిస్తుంది, పైన ఒక్క మబ్బు తునక లేదు. నేల మండిపొతుంది, చెట్లు కాలిపోతున్నాయి, చేమలు మాడిపోతున్నాయి.. అసలు భూదేవే కాలిపోతున్నట్లుంది.

'దేవుడా! నన్ను కాపాడు, నేను నీ బిడ్డని, నామీద కోపమొచ్చిందా తండ్రీ? నీకే కోపమొస్తే నేనెవర్ని వేడుకోవాలి. రక్షించు తండ్రీ! రక్షించు.' వందోసారి దేవుణ్ని వేడుకున్నాడా వృద్దుడు.

అతనో యాచకుడు. ఎన్నోయేళ్ళుగా ఆ రోడ్డు పక్కనున్న వేపచెట్టు కింద అడుక్కుంటున్నాడు. కొన్నాళ్ళక్రితం ఆ రోడ్డు వెడల్పు చేయ నిశ్చయించిన మునిసిపాలిటీ వారు దశాబ్దాల వయసున్న ఆ వేపచెట్టుని కొట్టేశారు. ఆ విధంగా మానవజాతి అభివృద్ధి కొరకు ఒక వృక్షం హత్య చేయబడింది. (ఎవరూ చావకపోతే అభివృద్ధి సాధ్యం కాదు).

ఆ రోజునుండీ అతను నీడ కోసం వెతుక్కుంటూనే ఉన్నాడు. ఆ చుట్టుపక్కలా ఎక్కడా చెట్టు లేదు, కనీసం నీడ కూడా లేదు. ఆ పక్కగా కొన్ని దుకాణాలున్నాయి. కానీ - ఆ దుకాణాలవారు తమ దుకాణం ముందు వృద్ధుని బిక్షాటన దుకాణాన్ని ఒప్పుకోలేదు.

అతనికి నెత్తిన నీడ కరువైంది. కొన్నిరోజులుగా కడుపుకి తిండి కూడా కరువైంది. అంచేత - ప్రస్తుతం నీడలేక, తిండి లేక, దాహంతో అల్లాడిపోతున్నాడు.

రోడ్డుపై జనసంచారం లేదు. ఆ వృద్ధుని శరీరం ఎండకి కాలిపోతుంది, వణికిపోతుంది. నీరసంతో కళ్ళు మూసుకు పోతున్నాయి, క్రమేపి ఒరిగిపోతున్నాడు.

దాహం.. నోరెండిపొతుంది, దాహం.. నాలుక పిడచకట్టిపోతుంది, దాహం.. నరాలు తోడేస్తున్నాయి, ఆకలి.. కళ్ళ ముందు చీకట్లు, ఆకలి.. గుండెల్లో నిప్పులు.

ఇంక దేవుడు తనని కాపాడడని అర్ధమైపోయింది.

'దేవుడా! నన్ను నీలో కలిపేసుకో. నాకిక ఆకలి కేకలు, దాహపు మాల్గులు, రోగపు నాదాలు, ఆర్తనాదాలు.. ఏమీ లేకుండా చేసెయ్యి.' వృద్దుడు మౌనంగా ప్రార్ధించాడు.

కొద్దిసేపటికి వేటగాని దెబ్బకి ఒరిగిపోయిన జింకలా, నిదానంగా రోడ్డు మీదకి పడిపొయ్యాడా వృద్ధుడు. అక్కడి దుకాణాల వాళ్ళు ఆ వృద్దుడు ఎండకి మండుతూ ఒరిగిపోవడం చూస్తూనే వున్నారు, కానీ - వాళ్ళెవరూ అతన్ని పట్టించుకోలేదు.

ఆ దుకాణదారులు కొన్నాళ్ళపాటు తమ దుకాణాలు మూసేసి కుటుంబాలతో సహా సంపూర్ణ దక్షిణ భారత దేశ పుణ్య క్షేత్రాల్ని భక్తిగా దర్శించుకుని ఇవ్వాళే దుకాణాల్ని తెరిచారు, అంచేత వాళ్ళు తీవ్రమైన వ్యాపార హడావుడిలో వున్నారు

ఇంతలో అటువైపుగా నలుగురు యువకులు వచ్చారు, వారికి సుమారు ఇరవయ్యేళ్ళు వుండొచ్చు. వారి టీ షర్టుల మీద చె గువేరా బొమ్మ ముద్రించి వుంది. వారు తెలుగు సినిమా హీరో అభిమానుల్ట. ఆ హీరోకి రాజకీయ జ్ఞానం దండిగా వుందిట. ఈమధ్యే ఏదో పుస్తకం కూడా రాశాట్ట. ఆ యువకులు తమ హీరో పిలుపు స్పూర్తిగా - ప్రస్తుతం దేశసేవ చేసే పన్లో వున్నారు.

ఆహా! ఏమి మన సౌభాగ్యము! సినిమాలు తీసి యువతని అభిమాన మత్తులో ముంచి నాలుగు డబ్బులు చేసుకుందామనుకునే స్వార్ధపరులున్న ఈ రోజుల్లో ఒక సినిమా హీరో - యువకుల్ని సామాజికంగా, రాజకీయంగా ఉత్తేజ పరుచుటయా! గ్రేట్!

ఆ యువకులు నేలకొరిగిన వృద్దుడిపై ఒంగి చూస్తూ, ఒకరి తరవాత ఇంకొకరు ప్రశ్నల వర్షం కురిపించారు.

"ఓ పెద్దాయనా! ఎవర్నువ్వు? ఎందుకిలా ఎండలో పడిపొయ్యావు?"

"నీరసంగా వుందా?"

"దాహంగా వుందా?"

"ఆకలిగా వుందా?"

ఆ వృద్దుడికి మాట్లాడే ఓపిక లేదు. నీరసంగా, దీనంగా వాళ్ళని చూశాడు. అతని మొహం ప్రేత కళ పడింది. 

అయితే - అన్ని ప్రశ్నలడిగిన ఆ యువకులు, ఆ తరవాత అతన్ని పట్టించుకోలేదు. వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోసాగారు.

"ప్రస్తుతానికింతే! ఈ ముసలాయన మనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ - మన హీరో ప్రశ్నించమనే చెప్పాడు. ఆ ప్రశ్నించే పనిని విజయవంతంగా పూర్తి చేశాం."

"అవును, ప్రశ్నలడగమన్నాడే గానీ సమాధానం వినమని మన హీరో తన పుస్తకంలో రాయలేదు."

"ఆయన ప్రస్తుతం సినిమా షూటింగులో ఉన్నాడు, వచ్చాక ఇంకో పుస్తకం రాస్తాళ్ళే! అప్పుడది ఫాలో అవుదాం."

"ఆ పుస్తకం పేరు 'జవాబిజం' అవ్వచ్చు."

"అప్పటిదాకా ఇలా ప్రశ్నిస్తూ ఉండటమే మన రాజకీయ కార్యాచరణ."

"అవునవును, ఇవ్వాల్టికి ఈ ముసలాయన్తో కలిపి మొత్తం పదిమందిని ప్రశ్నించాం."

ఇలా మాట్లాడుకుంటూ ముందుకు సాగారు ఆ యువకులు.

ముగింపు :

రాయడానికి పెద్దగా ఏం లేదు.. కొంతసేపటికి ఆ వృద్దుడు చనిపొయ్యాడు. అంతే!

(picture courtesy : Google)

Sunday, 6 April 2014

జనం


"బామ్మర్దీ!"

"ఏంది బావా?"

"అమ్మయ్యా! మొత్తానికి కిందామీదా పార్టీ టిక్కెట్టు సంపాదించా, ఓ పనైపోయింది." నాయకుడి ఆనందం.

"కంగ్రాట్స్ బావా!" 

"రేపట్నించి మన ప్రచారం దుమ్ము రేగిపోవాలి. కానీ - జనాల్లేరేంటి బామ్మర్ది?" నాయకుడి సందేహం.

"అందుక్కారణం నువ్వే బావా!" 

"నిజమా!?" నాయకుడి ఆశ్చర్యం.

"అవును బావా! నిన్న నువ్వు ప్రెస్సోళ్ళకి ఏం చెప్పావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో."

ఒకక్షణం కళ్ళు మూసుకున్నాడు నాయకుడు. నిన్న ప్రెస్ కి తనేం చెప్పాడో గుర్తొచ్చింది.

"ఓ అదా? అవినీతి, అక్రమాల్ని తరిమి కొడతానన్నాను. అందులో తప్పేంది? ఆ ముక్క అందరూ చెప్పేదేగా?" పెద్దగా నవ్వుతూ అన్నాడు నాయకుడు.

"అక్కడే దెబ్బ తిన్నావ్ బావా! నీ స్టేట్మెంట్ చూసి జనం నీరసపడిపొయ్యారు." పదేళ్ళు పరిశోధన చేసి భారద్దేశంలో పేదరికానికి కారణం కనుక్కున్న సైంటిస్టులా అన్నాడు బామ్మర్ది.

"ఏదో సీటొచ్చిందనే ఆనందంలో ఎదవ కూతలు కూశాను, జనం లేకపోతే మరి నా ప్రచారం ఎట్లా బామ్మర్ది?" నుదురు కొట్టుకున్నాడు నాయకుడు.

ఆపై - తను ముద్దుగా పెంచుకుంటున్న టామీకి ఇక పిల్లలు పుట్టరని తెలిసి దుఃఖించే దొరసానమ్మలా మిక్కిలి బాధ పడసాగాడు నాయకుడు.

బావ బాధ చూళ్లేకపొయ్యాడు బామ్మర్ది. పుట్టినప్పట్నుండి నొప్పంటే ఏంటో తెలీకుండా పెరిగిన సుకుమారి సున్నిత పాదాలు వేసవి మండుటెండలో సర్రున మండినచో కలుగు బాధ వంటిది బావలో కనిపించింది బామ్మర్దికి.

అంచేత అనునయంగా అన్నాడు బామ్మర్ది.

"సర్లే బావా! ఏదోటి చేసి రేపీపాటికి జనాల్ని పోగేయిస్తాలే. నువ్వు బాగా అలిసిపోయ్యావు. ఇవ్వాల్టికింక పడుకో."

అటుపై బామ్మర్ది మందు చప్పరిస్తూ, సిగరెట్లు తగలేస్తూ దీర్ఘముగా ఆలోచించెను. ఆ విధంగా ఒక 'నల్లకుక్క' బ్రాండు ఫుల్ బాటిల్ విస్కీ, మూడు పెట్టెల గోల్డ్ ఫ్లేక్ కింగ్స్ సిగరెట్లు ఖర్చు చేసెను. ధూమపానము మరియు సురాపానములు మెదడుని శుభ్రపరచి, ఆలోచనా నరములని పదును పెట్టునని ఆర్యోక్తి. అది నిజము కాబోలు.. అందుకే బామ్మర్దిక్కూడా ఒక కత్తిలాంటి ఐడియా వచ్చింది. పిమ్మట ఏదో పత్రికలో విలేఖరి పన్చేసే ఆత్మీయ స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఇరువురూ తాము చెయ్యాల్సిన పని గూర్చి వివరంగా చర్చించుకున్నారు.

మర్నాడు పేపర్ల నిండా నాయకుడి వార్తలే!

'ఫలానా నాయకుడు పార్టీవాళ్ళకి డబ్బిచ్చి టిక్కెట్టు కొనుక్కున్నాట్ట!'

'నాయకుడి ఫ్లాష్ బేక్ పరమ బేడంట, ఇంతకు మునుపు పార్టీవాళ్ళు ఏదో కార్పోరేషన్లో ఏదో పోస్టిస్తే.. కార్పోరేషన్ నిధులన్నీ మింగేశాట్ట.'

'అదేదే పబ్లిక్ పరీక్షల పేపర్లు లీకు చేసి బాగా వెనకేశాట్ట!'

'అంతేనా? ఇంకా ఉంది. ఒకప్పుడు దొంగసారా అమ్మాడంటా, దొంగనోట్లు మార్చాట్ట, ముండల కంపెనీ నడిపాట్ట!'

'నాయకుడిది రక్తచరిత్ర కూడానంట!'

దాదాపు అన్ని తెలుగు పేపర్లలోనూ అటూఇటుగా ప్రముఖంగా ఈ వార్తలే! కొన్ని పేపర్లైతే బాక్సు కట్టి మరీ ప్రచురించాయి.

పొద్దున్నే పేపర్లు చూసి బావురుమన్నాడు నాయకుడు. అర్జంటుగా బామ్మర్దిని పిలిపించాడు.

హేంగోవర్ కారణాన.. బద్దకంగా, బడలికగా వచ్చాడు బామ్మర్ది.

"వామ్మో!వాయ్యో! ఏందీ వార్తలు బామ్మర్దీ?" నాయకుడి ఆందోళన.

"ఓ! ఆ వార్తలా? అవి రాయించింది నేనేలే బావా!" అంటూ చిద్విలాసంగా నవ్వాడు బామ్మర్ది.

"ఎందుకు?" నాయకుడి అయోమయం.

నాయకుడి చెయ్యుచ్చుకుని ఇంటి ముందుకు లాక్కెళ్ళాడు బామ్మర్ది. ఇంటి ముందు గొర్రెల మందల్లా, ఈగల గుంపుల్లా జనం, జనం మరియు జనం. అక్కడంతా కోలాహలంగా ఉంది.. 'ఆల్కహాలా'హలంగా కూడా ఉంది. జనం ఉత్సాహంగా విజిల్స్ వేస్తున్నారు, ఆనందం పట్టలేక స్టెప్పులేస్తున్నారు, గుండెలు పగిలేలా స్లోగన్లిస్తున్నారు.

"పేదల పెన్నిధి మన నాయకుడు"

"వర్ధిల్లాలి"

"బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన నాయకుడు."

"జిందాబాద్."

"ఈళ్ళందర్నీ ఎప్పుడు పోగేశా?" నాయకుడి ఆశ్చర్యం.

"నే పోగెయ్యలా, నీ గూర్చి పేపరోళ్ళు రాసిన వార్తలే వాళ్ళని పోగేశాయి." నవ్వుతూ అన్నాడు బామ్మర్ది.

ఆ జనం చేస్తున్న హడావుడికి నాయకుడు ఆనందంతో పొంగిపొయ్యాడు. అంతలోనే తన గూర్చి వచ్చిన వార్తలు గుర్తొచ్చి.. బిర్యానీలో బొద్దింకని చూసిన వాళ్ళా మొహం వికారంగా పెట్టాడు.

నల్లగా ఉండేవాణ్ని నల్లోడంటే కోపగించుకుంటాడు, బీదవాణ్ని దరిద్రుడంటే గింజుకుంటాడు. అంచేత - తనగూర్చి అన్నీ నిజాలే రాయించిన బామ్మర్ది పట్ల నాయకుడికి చికాకు కలిగింది. కానీ - బామ్మర్ది తన ఫ్లాష్ బ్యాకంతా తన మంచి కోసమే జనాలకి తెలియజెప్పాడు. ఇందులో బామ్మర్ది తప్పేం లేదు. కానీ - ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా.. బ్రాందీలో భృంగామలక తైలం కలిసినట్లుగా, ఫిష్ కర్రీలో ఫినాయిల్ ఒలికినట్లుగా.. వెగటుగా అనిపిస్తుంది.

"నాకా వార్తలు నచ్చలేదు." నాయకుడి ఇబ్బంది.

"అదేంటి బావా అట్లా అంటున్నావు! ఆ వార్తల్ని రాయించడానికి చాలా సొమ్ము, పలుకుబడి ఖర్చు పెట్టాను. నువ్విప్పుడు రాష్ట్రస్థాయి నాయకుడివయిపోయ్యావు, తెలుసా?" గర్వంగా అన్నాడు బామ్మర్ది.

"ఆవుననుకో.. " నాయకుడి నసుగుడు.

"బావా! బాధపడకు. ఇట్లాంటి నెగెటివ్ పబ్లిసిటీ పెళ్లిసంబంధానికైతే ఇబ్బంది గానీ.. రాజకీయాల్లో మాత్రం చాలా మంచిది. ఈ వార్తల్తో నీ అభ్యర్ధిత్వానికి గ్లామర్ కూడా జతయ్యింది, అర్ధం చేసుకో." నచ్చజెప్పచూశాడు బామ్మర్ది.

"కానీ.. " నాయకుడి పీకులాట.

"బావా! అడవిలో పులికి చేతిలో పంజా, నోట్లో కోరలే ఆయుధం, పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీకి తగ్గట్టుగానే పులి వేటాడాలి, తప్పదు.. అది దాని జాతిధర్మం. పులి అహింసావాది అయినట్లైతే ఆకలితో చావాల్సిందేగానీ, ఆహారం దొరికించుకోలేదు. అంచేత రాజకీయనాయకుళ్ళో నీతి, పులిలో సాత్వికత.. చూసేవాళ్ళతో చప్పట్లు కొట్టించుకొనుటకు బాగుండునేమో గానీ.. వారికి మాత్రం ఆత్మహత్యా సదృశం." తత్వం బోధించాడు బామ్మర్ది.

"అవునా?" నాయకుడి కుతూహలం. 

"అబ్బా బావా! నీతో ఇదే చిక్కు. నిన్నేమో ప్రచారానికి జనాలు లేరని బాధ పడ్డావు. ఇప్పుడేమో జనాలు కుప్పలు తెప్పలుగా వచ్చారు, సంతోషించవేం? రాజకీయాల్లో పబ్లిసిటీ ముఖ్యం బావా! అది మంచిదా, చెడ్డదా అన్నది అనవసరం. నిన్న 'నేను నిజాయితీపరుణ్నంటూ' జనాలకి నువ్వు తప్పుడు సంకేతాలు పంపావు, ఇవ్వాళ్టి వార్తల్తో నువ్వెవరివో జనాలకి క్లియర్ గా అర్ధమైంది. నీక్కావలసింది వాళ్ళు చేసిపెడతారు, వాళ్ళక్కాల్సింది నువ్వు ఇచ్చేస్తావు, అంతే! సింపుల్." అన్నాడు బామ్మర్ది.

"అంతేనంటావా?" నాయకుడి నూతనోత్సాహం.

"ఓ బావా! నన్ను నమ్ము. రాజకీయాలు అత్యంత నీచమైనవి, హేయమైనవి. ఈ రంగంలో ఎవడైతే లోఫర్, దగుల్బాజి అన్న పేరొందగలడో వాడే రాణించగలడు. అందువలన నీవు సందేహింపక, అతి ఘనమైన నీ గతాన్ని గళమెత్తి చాటినచో నిశ్చయముగా నిన్ను విజయలక్ష్మి వరించును. నామాట విని నీతివాక్యములు వల్లించుట కట్టిపెట్టుము. నీతిమంతులు టీవీ స్టూడియెల్లో రాజకీయ చర్చలు జరపగలరు, ఎలక్షన్లలో డిపాజిట్ సాధింపలేరు. ఇది సత్యము." అంటూ గీతోపదేశం చేశాడు బామ్మర్ది.

"అవును కదా! నా కళ్ళు తెరిపించావ్, థాంక్సులు బామ్మర్దీ! థాంక్సులు." అంటూ ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతుండగా బామ్మర్దిని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు నాయకుడు.

(picture courtesy : Google)

Tuesday, 10 December 2013

జ్ఞానాంధకారం


"ముళ్ళపూడి వెంకట్రవణ భలే రాస్తాడు గదా!"

"అలాగా! ఆయన రాసినవాటిల్లో నీకు బాగా నచ్చిందేమిటి?"

"శ్రీరామరాజ్యం"

"ఇంకా?"

"అది కాకుండా ఆయనింకేమన్నా రాశాడా?"

"ఇద్దరమ్మాయిలు - ముగ్గురబ్బాయిలు, జనతా ఎక్స్ ప్రెస్, ఋణానందలహరి, రాజకీయ భేతాళ... "

"అలాగా! అయితే అవన్నీ కూడా భలే రాసుంటాడు."

ఇక్కడ ముళ్ళపూడి అభిమానం తప్ప విషయం లేదని అర్ధమైపోయింది.


"hmtv లో వందేళ్ళ తెలుగుకథ ప్రోగ్రాం చూడు. బాగుంది."

(ఈ విషయంపై ఇంతకుముందొక పోస్ట్ రాశాను.)

"నీకు నచ్చిందా?"

"ఎందుకు నచ్చదు? గొల్లపూడి కథల గూర్చి చెబుతున్నాడుగా!"

"తెలుగులో నీకు నచ్చిన రచయితల పేరు చెప్పు."

"పరుచూరి బ్రదర్స్."

ఇంకానయం! చందనా బ్రదర్స్ అన్లేదు.


"విశ్వనాథ సత్యనారాయణ 'వేయి పడగలు' చదువు. బాగుంటుంది."

"నాకైతే ప్రస్తుతానికి ఒక్క పడగ కూడా చదివే ఓపిక లేదు. ఎందుకు చదవాలో నువ్వు చెప్పు.. చదవడానికి ప్రయత్నిస్తాను."

"భలే బాగుంది. ఎందుకు చదవాలో నాకేం తెలుసు? ఊరికే చెప్పాను. నీకు తెలుసుగా.. నేను చాలా బిజీ."

"మరెందుకు చెప్పావ్?"

"వదిలెయ్యి బాసూ! వేయిపడగలు బాగుంటుందని మొన్నెవడో అన్నాడు. నీకా ఫీల్డులో ఇంటరెస్ట్ ఉందని.. ఆ విషయం నీ చెవిలో ఊదా."

పాపం! నేనన్ని ప్రశ్నలడుగుతానని ఊహించలేదు. ఏదో గొప్ప కోసం చెప్పాడు. అతగాడు బిజీట.. అక్కడికి నేనేదో పనీపాట లేకుండా ఉన్నట్లు!


"ఛస్తే తెలంగాణా రాదు."

"ఎలా?"

"అశోక్బాబు తెలంగాణా రాకుండా అడ్డుకుంటాడు."

"రాష్ట్రవిభజన అనేది కేంద్రప్రభుత్వానికి సంబంధించిన విషయం. విభజన విషయంలో ప్రధాన ప్రతిపక్షం కూడా పట్టుదలగా ఉంది. కేంద్రస్థాయిలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు తమ నిర్ణయాన్ని రివర్స్ చేసుకుంటే గాని రాష్ట్ర విభజన ఆగిపోయే అవకాశం లేదు."

"నీకు తెలీదులే. మధ్యలో కొన్ని చోట్ల బ్రేకులెయ్యొచ్చు."

"అప్పుడు విభజన కొద్దిగా ఆలస్యం అవుతుంది గానీ.. ఆగిపోదు కదా!"

"చూస్తూ ఉండు. మనకి స్టార్ batsman కిరణ్బాబు ఉన్నాడు."

"నే రాజకీయాలు మాట్లాడుతుంటే నువ్వు క్రికెట్ మాట్లాడతావేం?"

"పిచ్చివాడా! ఈ రోజుల్లో రాజకీయాలే క్రికెట్, క్రికెట్టే రాజకీయం."

అతనికి కొందరు వ్యక్తుల పట్ల గుడ్డినమ్మకమే గానీ, రాజకీయంగా పెద్ద జ్ఞానం లేదని అర్ధమైంది. తెలుగు వార్తల్ని మాత్రమే ఫాలో అయ్యేవారి జ్ఞానం ఇలాగే ఉంటుంది.


"నరేంద్ర మోడియే కాబోయే ప్రధానమంత్రి. బుద్ధున్నవాడెవడైనా మోడీకే ఓటేస్తాడు."

"మంచిది. అలాగే వేసేద్దాం. మరి 2002 మారణకాండ గూర్చి ఆలోచించావా?"

"అదంతా కాంగ్రెస్ దుష్ప్రచారం."

"మరి ముస్లిముల్ని దారుణంగా చంపేసింది ఎవరు?"

"ఎవరో? నాకేం తెలుసు? నరేంద్ర మోడీ మాత్రం కాదు."

"అంటే ఆనాడు ముస్లిములందరూ సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారంటావా?"

"అవన్నీ నాకు తెలీదు. నరేంద్ర మోడీ మాత్రం మహాత్ముడు."

మోడీకి అనుకూలంగా చాలా విషయంతో వాదిస్తాడనుకున్నాను. కానీ అతనికి మోడీ గూర్చి పెద్దగా తెలీదు!


పరిచయస్తులతో మాట్లడేప్పుడు ఇట్లాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. చాలామందికి చాలా విషయాలపై గట్టి అభిప్రాయాలుంటాయి. అయితే వారికెందుకా అభిప్రాయం ఏర్పడిందో వారిక్కూడా తెలీదు!

సాధారణంగా ఒక విషయం పట్ల అభిప్రాయం కలిగినవారు రెండు కేటగిరీలుగా ఉంటారు.

కేటగిరీ 1. వీళ్ళు ఒక విషయం పట్ల కొద్దోగొప్పో అధ్యయనం చేస్తారు. కొంత అవగాహన ఏర్పరచుకుంటారు. ఆపై విషయాన్ని విశ్లేషిస్తూ సమర్ధిస్తారు లేదా వ్యతిరేకిస్తారు. వీరితో చర్చలు ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని కొత్త సంగతులు తెలుస్తాయి కాబట్టి.. మన జ్ఞానం, అజ్ఞానం కూడా ఏ స్థాయిలో ఉన్నాయో బేరీజు వేసుకోవచ్చు.. మార్పుచేర్పులు చేసుకోవచ్చు.

కేటగిరీ 2. వీళ్ళు ఏ విషయాన్నీ తెలుసుకోటానికి ఆసక్తి చూపరు. కనీసస్థాయిలో కూడా విషయం పట్ల అవగాహన ఉండదు. కానీ రాకెట్ సైన్స్ దగ్గర్నుండి రిజర్వ్ బేంక్ వ్యవహారాల దాకా అనర్గళంగా మాట్లాడతారు. ఒక్కోసారి తీవ్రంగా ఆవేశపడుతుంటారు. చాలాసార్లు వీళ్ళ అభిప్రాయాలు అరువు తెచ్చుకున్నవి.

మనం మొదటి కేటగిరీలో లేకపోయినా పర్లేదు.. కానీ రెండో కేటగిరీలోమాత్రం వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఉండగలిగే స్పృహ డెవలప్ చేసుకోవాలి. అందువల్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఈమాత్రం అవగాహన కలిగుంటే చాలాసార్లు మర్యాదగా బయటపడొచ్చు.


"ఈ పాడు కాంగ్రెస్ విధానాల వల్ల ద్రవ్యోల్పణం పెరిగిపోతుందోయ్. ఏవంటావ్?"

"నాకు ద్రవ్యోల్పణం అంటే తెలీదు గానీ.. నాదగ్గర మాత్రం ద్రవ్యం ఎప్పుడూ అల్పంగానే ఉంటుంది."

"టెన్త్ లో చదువుకున్నావుగా! గుర్తు లేదూ?"

"నాకు నిన్న చదివినవే గుర్తుండవు. అదేదో నువ్వే చెప్పి నా అజ్ఞానాన్ని పారద్రోలరాదా?"

"నాయనా! నీకు ద్రవ్యోల్పణం గూర్చి తెలీకపోతే దేశానికొచ్చిన నష్టమేమీ లేదు. ఈ వయోజన విద్యా కార్యక్రమం నా వల్ల కాదు."

ఏవిటో ఈ లోకం! విషయం తెలీదని నిజాయితీగా ఒప్పుకున్నా హర్షించదు గదా!


"పొద్దున్నే చిన్నుల్లిపాయ టీ తాగితే బీపీ, షుగర్లు రావని రాస్తున్నారు తెలుసా?"

"నాకు తెలీదు. నేను పొద్దున్నే ఇడ్లీలు, దోసెలు తింటాను. పగలు కాఫీ, రాత్రి సింగిల్ మాల్టు తాగుతాను. ఖాళీసమయంలో బ్లాగులు రాస్తాను. ఇవి చేస్తే ఛస్తారని ఎక్కడైనా రాస్తే చెప్పు. ఆలోచిస్తాను."

"లేదులేదు. ఇకనుండి నువ్వు కూడా చిన్నుల్లిపాయ టీ తాగు."

"చెప్పాను కదా. నాకు తాజ్ మహల్ టీ తెలుసు.. తాగుతాను. చిన్నుల్లి టీ తెలీదు.. తాగను."


ప్రతి వ్యక్తికి అన్నీ తెలిసుండాలని లేదు. ఏదీ కూడా తెలుసుకోకుండానే హాయిగా బ్రతికెయ్యొచ్చు. అసలేదీ తెలుసుకోకుండా నోరు మూసుకుని బ్రతికేసేవాడే ఉత్తముడని నా అభిప్రాయం. 

(picture courtesy : Google)

Friday, 8 November 2013

రాలిన ప్రేమ

నోర్మూసుకుని పెళ్ళాం మాట వినడమే మంచి భర్తకి నిర్వచనం అయినట్ల్తైతే మా ఆయన మంచిభర్తల కేటగిరీలోకే వస్తాడు. దించిన తల ఎత్తకపోవడమే బుద్ధిమంతుల లక్షణం అయినట్లయితే మా ఆయన బుద్ధిమంతుల కేటగిరీలోక్కూడా వస్తాడు.

అయితే నాకు మా ఆయన పట్ల ఇష్టానికి కారణాలు ఇవేవీ కావు. నాకు మా ఆయన ఉంగరాల జుట్టంటే ఎంతో ఇష్టం. నాకు ఆయన ఒత్తైన జుట్టు ఒక అద్భుతంగా తోస్తుంది. ఆ నల్లని ఆ జుట్టుని చూస్తూ మైమరిచిపోతాను. తలకట్టు మీద ప్రపంచ పోటీ పెడితే మా ఆయన ఒలింపిక్స్ మెడల్ సాధించుకొస్తాడని నా నమ్మకం!

పెళ్లి చూపుల్లో మొహమాటంగా, ఇబ్బందిగా కూర్చున్న ఆయన్ని చూసి ముచ్చట పడ్డాను. ఫ్యాన్ గాలికి సముద్రపు అలల్లా కదులుతున్న ఆ ఉంగరాల జుట్టు చూసి మత్తెక్కిపొయ్యాను. పెళ్ళయ్యాక ఆయన జుట్టుతో నా అనుబంధం మరీ పెరిగిపోయింది. ప్రేమతో కుంకుడు రసంతో తలంటేదాన్ని. నూనె రాసి అపురూపంగా తల దువ్వేదాన్ని. నిద్ర పట్టనప్పుడు ఆ జుట్టుతో ఆడుకుంటూ ఆనందపడిపోయ్యేదాన్ని.

మా ఆయనకి ఫిల్టర్ కాఫీ చాలా ఇష్టం. ఆయన ఆఫీసు నుండి రాంగాన్లే ఘుమఘుమలాడే చిక్కటి ఫిల్టర్ కాఫీ ఇచ్చేదాన్ని. ఆయనా కాఫీని లొట్టలేసుకుంటూ త్రాగేవాడు. 'నీ చేయి తగిలి కాఫీ మరింత రుచి పోసుకుందోయ్' అని బుగ్గ మీద చిటికేసేవాడు.

సిగ్గుగా అనిపించేది, గర్వంగానూ అనిపించేది. నా అదృష్టానికి నాకే అసూయ కలిగేది. 'గృహమే కదా స్వర్గసీమ! భర్తే గదా సుందరాంగుడు!' అని కూడా అనిపించేది. అందుకే 'జీవితమే మధురము, రాగసుధా భరితము, ప్రేమకథా మధురము' అని పాడుకునేదాన్ని.

కాలచక్రం గిర్రున తిరిగింది. ఇప్పుడు మా పెళ్లై ఇరవయ్యేళ్ళయింది. పిల్లలు పెద్దవాళ్ళయినారు. కొన్నేళ్లుగా నాకు మా ఆయన పట్ల ప్రేమ తగ్గిపోతూ వచ్చింది. ఆయనంటే చాలాసార్లు చికాగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు మండిపోతూ కూడా ఉంటుంది.

ఇప్పుడు సమయం సాయంకాలం ఆరు గంటలైంది. చెట్లపై పక్షులు కిలకిలమంటూ కబుర్లాడుకుంటున్నాయి. ఎదురింటి పిల్లలు దీపావళి రోజు మిగిలిపోయిన టపాకాయలు కాల్చుకుంటున్నారు. కొంపలు మునిగిపోతున్నట్లు ఆఫీసు నుండి హడావుడిగా తగలడ్డాడు మా గురుడు. ఏం? ఇంకొచెం సేపు ఆఫీసులోనే ఏడవచ్చుగా!

నవ్వుతూ ఇంట్లోకొచ్చాడు. పళ్ళికిలిస్తూ 'కాఫీ' అంటూ నవ్వాడు.

చూడబోతే తిండి కరువు లాగా.. కాఫీ కరువు ప్రాంతం నుండి వచ్చినట్లుగా ఉన్నాడు. అందుకే అంత కక్కుర్తిగా సిగ్గు లేకుండా కాఫీ అని దేబిరిస్తున్నాడు. చివ్వున లేచి వంటింట్లోకెళ్ళాను.

'ఎందుకు? ఎందుకిలా జరిగింది? నా ఖర్మ ఎందుకిలా తగలడింది? దేవుడా! నేనే పాపం చేశాను? నన్నెందుకిలా అన్యాయం చేశావ్? నీకు తుమ్మెద రెక్కల్లాంటి మా ఆయన జుత్తే కావల్సొచ్చిందా? అందుకేనా మా ఆయన నెత్తి మీద జుట్టంతా ఊడగొట్టేసి అద్దం లాంటి బట్టతలని చేసేశావ్? ఇది నీకు న్యాయమా? ధర్మమా?'

దుఃఖం భరించలేక భోరున ఏడ్చేశాను.


(pictures courtesy : Google)

Wednesday, 6 November 2013

నేను రచయితనవడం యెలా?


అన్నా! రచయితనవడం నా జీవితాశయం. నా ఆశయం కోసం గత కొన్నాళ్ళుగా పడరాని పాట్లు పడుతున్నా, కానీ రచయితని మాత్రం కాలేకపోతున్నా. కొంచెం సలహా చెప్పన్నా!

- గురజాడ అంతటివాణ్నవ్వాలని నెత్తిన తలపాగా పెట్టుకు తిరిగాను, 'కన్యాశుల్కం' తలదన్నే నాటకం రాద్దామనుకున్నాను. తలకి గాలాడక బుర్ర హీటెక్కి జుట్టూడిపోయింది గానీ ఒక్క ఐడియా రాలేదు.

- చాసో కథని పట్టుకుందామని అదేపనిగా చుట్టలు కాల్చాను, నోరు చేదెక్కింది తప్పించి ఒక్క కథా పుట్టలేదు.

- శ్రీరంగం నారాయణ బాబుని మరిపిద్దామని జులపాల జుట్టు పెంచాను, చమురు ఖర్చు పెరిగిందే కానీ పన్జరగలేదు.

- రావూరి భరద్వాజ కన్నా పెద్దగెడ్డం పెంచేసి జ్ఞానపీఠాన్ని కొడదామనుకున్నా. మూతి దురద తప్పించి.. జ్ఞానపీఠం కాదుగదా.. కనీసం ముక్కాలి పీట కూడా కొట్టలేకపోయ్యా.

- కారా మాస్టార్లా కారా కిళ్ళీ దట్టించి 'యజ్ఞం'కి బాబులాంటి కథ రాద్దామనుకున్నా. నోరంతా పొక్కి కథాయజ్ఞయత్నం కాస్తా భగ్నమైపోయింది.

- శ్రీశ్రీ కన్నా గొప్పకవిత్వం కోసం ఫుల్లుగా మందు కొట్టాను. 'మహాప్రస్థానం' సంగతేమో గానీ మహామైకం ఆవహించింది.

రావిశాస్త్రి వచనం కోసం బాకీలు చేశాను. బాకీలకి వడ్డీ పెరిగిందేగానీ 'బాకీకథలు' పుట్టలేదు.

- శివారెడ్డిలా శాలువా కప్పుకుని 'మోహనా! ఓ మోహనా!!' అంటూ కవిత్వాన్ని ఆహ్వానించాను. ఉక్కపోత తప్పించి కవిత్వం రాలేదు. 'దేవుడా! ఓ దేవుడా!!' అని ఏడ్చుకున్నాను.

- గద్దర్ పాట కోసం నల్లగొంగళీ భుజాన వేసుకుని చిందులు వేశాను. గొంగళీ వల్ల దురద, గంతుల వల్ల కాళ్ళు నొప్పులు మిగిలాయి.. తప్పించి పాట పెగల్లేదు.

తమ్ముడూ! నువ్వు అన్నీ చేశావు గానీ అసల్ది మర్చిపోయ్యావు. మంచి రచయితవవ్వాలంటే ముందు జీవితాన్ని చదవాలి, నీకు శుభం కలుగు గాక.

- అవునా అన్నా? ఎంతైనా నువ్వు చాలా తెలివైనోడివి, అందుకే గొప్ప సలహా యిచ్చావు. ఇంతకీ ఆ 'జీవితం' పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? వెంకట్రామా అండ్ కో లోనా? విశాలాంధ్ర బుక్ హౌజ్ లోనా?

(posted in fb on 20/1/2018)