మూడేళ్ళ క్రితం బ్లాగ్ మొదలెడదామనుకున్నప్పుడు - కొందరు మిత్రులు 'పని లేదా?' అని నవ్వారు. 'అవును. పని లేదు.' అనుకుని నా బ్లాగుని కూడా 'పని లేక.. ' అనేశాను. ఇదో రకమైన తిక్క. కొన్నిసార్లు నా పోస్ట్ శీర్షికలకి ముందు 'పని లేక.. ' అని ఉండటం చేత అర్ధం మారిపోయింది. ఈ విషయమై జిలేబి, బోనగిరి మొదలైన మిత్రులు జోకులు కూడా వేశారు.
రాయడం మొదలెట్టినప్పుడు నేనిన్ని పోస్టులు రాస్తానని అనుకోలేదు. నాక్కొన్ని విషయాలు నచ్చుతాయి, ఇంకొన్ని నచ్చవు. కొన్నాళ్ళకి ఈ లిస్టు అటూ ఇటుగా మారిపోతుంది. ఆ రకంగా చూస్తే 'పని లేక.. ' ఇన్నాళ్ళపాటు వుండటం నాకే ఆశ్చర్యంగా వుంది. అందుకు కారణం - కొంత సెంటిమెంటు, కొన్ని జ్ఞాపకాలు.
'పని లేక.. ' చూస్తుంటే నాకు నా మిత్రుడు బి.చంద్రశేఖర్ గుర్తొస్తాడు. "నీ 'పని లేక' హెడింగే ఒక పెద్ద అబద్దం. నువ్వు రాసేవన్నీ అబద్దాలని ఇంతకన్నా ఋజువు కావాలా ?" అంటూ పెద్దగా నవ్వేవాడు చంద్ర. దాదాపు ప్రతి పోస్ట్ చదివేవాడు. వెంటనే ఫోన్ చేసి సలహాలిచ్చేవాడు.
'పని లేక.. ' చూస్తుంటే నాకు అత్యంత ఆప్తుడైన గోపరాజు రవి గుర్తొస్తాడు. చాలాసార్లు బ్లాగ్ టైటిల్ని (ఏదైనా ఒక రావిశాస్త్రి రచన పేరుగా) మార్చేద్దామనిపించేది. కానీ - అందుకు గోపరాజు రవి ఒప్పుకునేవాడు కాదు. అతనికి 'పని లేక.. ' పేరే బాగా నచ్చింది. అప్పటికీ ముచ్చట పడి - 'అల్పజీవి' అన్న పేరుతొ రావిశాస్త్రి రచనల కోసం ఒక బ్లాగ్ మొదలెట్టాను. అయితే నాకున్న పరిమితుల వల్ల అది ముందుకు సాగలేదు.
చంద్ర, రవి - ఇద్దరూ కొన్ని నెలల తేడాలో ఒకే సంవత్సరం వెళ్లిపొయ్యారు. నాకు వీళ్ళిద్దరూ వున్నప్పుడు చాలా ధైర్యంగా వుండేది. చంద్రాతో వాగ్వివాదం, రవితో సంభాషణ నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు పోలిటిక్స్ కొంచెం ఘాటుగా రాసేవాణ్ని. అందుక్కారణం కూడా వీళ్ళిద్దరే!
ఈ సెంటిమెంట్లు, జ్ఞాపకాలు పక్కన పెడితే - ఇప్పుడు 'పని లేక.. ' అన్న పేరు నాకే బోరు కొట్టేస్తుంది. నా బ్లాగ్ పేరు మార్చడానికి ఇదొక్కటే కారణం. అయితే - కొత్తగా ఏ పేరు పెట్టినా - అది రావిశాస్త్రి రచనే కావాలి అన్న ఖచ్చితమైన నీయమం మాత్రం నాకుంది. నేన్రాసే ప్రతి వాక్యం వెనుక రావిశాస్త్రి వున్నాడని నమ్ముతున్నాను (అది నా మూఢనమ్మకం అని మీరనుకున్నా నాకు అభ్యంతరం లేదు).
ఎలాగూ 'అల్పజీవి' అనుకున్నాను కాబట్టి - ఇకనుండి నా బ్లాగ్ పేరు 'అల్పజీవి అంతరంగం'గా మారుస్తున్నాను. అంచేత ఇకపై బ్లాగ్ ఎగ్రిగేటర్లలో నా 'పని లేక.. ' బ్లాగ్ 'అల్పజీవి అంతరంగం'గా కనపడుతుంది. అరవైయ్యేళ్ళ క్రితం 'అల్పజీవి' అన్న పేరుతో రావిశాస్త్రి రాసిన నవల చాలా ప్రసిద్ధి గాంచింది. అయితే - అల్పజీవి 'సుబ్బయ్య'కీ, నాకూ ఏ మాత్రం సంబంధం లేదని గుర్తించ మనవి (ఆ సుబ్బయ్యో దొంగ వెధవ. నేను మాత్రం మంచి వెధవని).
నా బ్లాగ్ ఎడ్రెస్ (URL) yaramana.blogspot.in గానే ఉంచేస్తున్నాను. కావున bookmark చేసుకున్నవారికి ఇబ్బంది వుండదు. ఇకనుండి మీకు 'అల్పజీవి అంతరంగం' అన్న బ్లాగ్ కనిపిస్తే - ఇది ఒకప్పటి 'పని లేక.. ' వాడి బ్లాగే అన్న సంగతి గుర్తుంచుకుంటే సంతోషిస్తాను (గుర్తు రాకపోతే దుఃఖిస్తాను).
ఎందుకైనా మంచిది - కొన్నాళ్ళపాటు in brackets లో 'పని లేక.. ' అని కూడా వుంచుతాను. ఇంత చెప్పావుగా? ఇంకా పాత పేరు గుర్తు చెయ్యడం దేనికి అంటారా? ఇదో ఓల్డేజ్ ఆబ్సెషన్! అంతకుమించి మరేం లేదు!
(picture courtesy : Google)