Showing posts with label సినిమా - సమాజం. Show all posts
Showing posts with label సినిమా - సమాజం. Show all posts

Monday, 5 May 2014

సినిమాల్లోంచి సమాజంలోకి - 4


సినిమాల్లోంచి సమాజంలోకి - 3 లో మన ఆలోచనల్లో రాచరిక లక్షణాల గూర్చి రాశాను. ఇవ్వాళ - మన 'సమాజంలో స్త్రీపురుషులు సమానులేనా?' అన్న పాయింటుతో కొన్ని ఆలోచనలు రాస్తాను.   

రాచరిక, ఫ్యూడల్ వ్యవస్థల్లో మగసంతానానికి ఎంతో విలువుంది. పురాణాల్లో కూడా రాజులు కొడుక్కోసం యజ్ఞాలు చేశారే గానీ, కూతురు కోసం చేసిన దాఖలా లేదు (నాకు తెలిసి). అంచేత - నేటి యువరాజే రేపటి రాజు, నేటి రాజకీయ నాయకుడి పుత్రుడే రేపటి ఎమ్మెల్యే, నేటి హీరో కొడుకే రేపటి హీరో. విషయం ఇంతుంది కాబట్టే గర్భిణీ స్త్రీల పొట్ట స్కానింగ్ అంత (అన్)పాపులర్ అయ్యింది.

స్త్రీలు పురుషుల కన్నా పరమ తక్కువ, ఈ పాయింట్ ప్రూవ్ చెయ్యడం కోసం ఎన్ని సినిమాల్నైనా కోట్ చెయ్యొచ్చు. పాత సినిమాల్లో 'ఏవండి! మీకు దణ్ణం పెడతాను, మీకు భార్యలా కాకపోయినా కనీసం మీ పాదాల దగ్గర ఇంత చోటైనా ఇవ్వండి, పనిమనిషిలా మీకు సేవ చేసుకుంటాను' మార్కు ఏడుపుగొట్టు డైలాగులు బోల్డెన్ని! భర్త ఎంతమంది ముండలెంట తిరిగినా, తిరిగితిరిగి చివరికి తన దగ్గరకే వస్తాడని పాత హీరోయిన్ల (ప్రేక్షకుల) నమ్మకం.

అవును మరి! పెళ్ళంటే నూరేళ్ళ పంట గదా! (ఏవిటోయ్? మన పవిత్ర హిందూ సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నావు? అయినా - ఈ సెంటిమెంటు మగాళ్ళకి బాగానే వర్కౌట్ ఆయిందిగా? అది మన మగాళ్ళకి గోల్డెన్ పీరియడ్. ఇంక ఆపు నీ ఏడుపు) నాకైతే మాత్రం ఆ సినిమాలు ఇప్పుడు చూస్తే ఆ వీర పతిభక్తి డోకొచ్చేంత రోతగా ఉంటుంది.

మిత్రులారా! ఇన్ని మాటలేల? సినిమా కథల్లో స్త్రీ వివక్ష నాగార్జునా సిమెంటంత ధృఢమైనది, మన్నిక గన్నది. ఒక బాక్సాఫీసు ఫార్ములాగా పేరు గాంచినది. అంచేత - ఆ సినిమాల్ని వాటి మానాన వదిలేసి.. ఇవాల్టికి సినీజీవుల్ని ఉదాహరణగా తీసుకుంటాను. తెలుగువాడు సెల్ ఫోన్లు వాడతాడు, కానీ - ఆలోచనలు మాత్రం గ్రహం బెల్ టెలీఫోన్ కనిపెట్టినప్పటి కాలం నాటివి. ఇంటర్నెట్ పుణ్యామాని 'అంతర్జాతీయ పురాణ పురుషులు' కూడా అవతరించారు, ప్రస్తుతం వీరు సోషల్ మీడియా ద్వారా పవిత్ర హిందూ ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపిస్తున్నారు.

ఎన్టీఆర్ మొదటి భార్య చనిపోయింది, కొన్నాళ్ళకి లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు. అలా చేసుకునేందుకు ఎన్టీఆర్ కి పూర్తి స్వేచ్చ ఉంది. ఇది పూర్తిగా ఇద్దరు వ్యక్తులకి సంబంధించిన వ్యక్తిగత విషయం. వారి చర్యని విమర్శించే హక్కు ఎవరికీ లేదు, ఉండరాదు కూడా. కానీ మన తెలుగు సమాజం ఎన్టీఆర్ రెండోపెళ్లి పట్ల నెగెటివ్ గా స్పందించింది. 

మొదటి భర్తకి విడాకులు ఇచ్చినందుకు లక్ష్మీ పార్వతిని ఒక విలన్ గా చూసింది. ఈ కారణాన - ప్రజల్లో ఆవిడ పట్ల ఉన్న దురభిప్రాయాన్ని చంద్రబాబు రాజకీయంగా కేష్ చేసుకున్నాడు. ఆవిడ రాష్ట్రంపై రాజకీయ పెత్తనం చేస్తున్నట్లు ప్రచారం చేశాడు, అధికారాన్ని కైవసం చేసుకోవటంలో విజయం సాధించాడు. ప్రజలకి లక్ష్మీపార్వతిపై చులకన భావం ఆల్రెడీ మైండ్ లో రిజిస్టరై ఉండటం చంద్రబాబుకి కలిసొచ్చింది.

అసలు - లక్ష్మీపార్వతి పట్ల తెలుగువాళ్ళకి అంత చులకన భావం ఎందుకు? అందుకు కారణాలు రెండు. ఒకటి - ఆవిడ భర్తని 'వదిలేసిన' భార్య (ఈ పవిత్ర పుణ్యభూమిలో భర్తలు భార్యని ఎందుకైనా వదిలెయ్యొచ్చు, భార్యలు మాత్రం భర్తని ఎందుకైనా సరే వదిలెయ్యరాదు), రెండు - ఆర్ధిక తారతమ్యం. అందుకే - లక్ష్మీపార్వతి తెలుగు సమాజం నుండి వ్యతిరేకతని ఎదుర్కొంది. కావునే - ఎన్టీఆర్ మరణంతో ఆవిడ ఇబ్బందులు పడ్డప్పుడు - 'తిక్క కుదిరింది' అని సంతోషించిన ఆడవాళ్ళున్నారు. అదే ఎన్టీఆర్ ఏ టాటా చెల్లెల్నో, బాటా మేనకోడల్నో రెండో వివాహం చేసుకున్నట్లైతే మన తెలుగువాడి ఆత్మగౌరవం ఉప్పొంగి మురుక్కాలవలా వరదలై ప్రవహించేది.

సమాజానికి తగ్గట్లుగా ఎన్ని ముసుగులేసినా, మన 'పెద్దమనుషుల' మనసులోని అసలు భావాలు చాలాసార్లు బయటకి తన్నుకొస్తాయి. బీసీ, యస్సీ కులాల పిల్లలు అగ్రకులం పిల్లల్ని ప్రేమిస్తేనో / పెళ్లి చేసుకుంటేనో.. తక్కువకులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళని 'వల'లో వేసుకున్నారని అంటారు. ఆ తక్కువ కులంవాళ్ళ పేదరికం వారి 'దురాలోచన'కి తిరుగులేని ఋజువుగా నిలబడుతుంది. మన తెలుగునాట ఒకప్పుడు అమ్మాయిల మౌనపోరాటాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఆ పోరాటాలు చేసిన యువతులు, అబ్బాయి కన్నా 'తక్కువస్థాయి' వారు. అంచేత మన అగ్రకుల మేధావులకి వారి పోరాటం నచ్చలేదు.

ఈ కులమత భావనలకి విరుద్ధంగా తెలుగులో సాహిత్యం అయితే ఉందిగానీ, ఆ సాహిత్యం ఆయా రచయితలకి అవార్డులు, పురస్కారాలకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ సాహిత్య సభలు ఆయా పండితుల కరతాళ ధ్వనుల కోసమే గాని, సమాజానికి ప్రయోజనం ఉన్నట్లు తోచదు. ఈ రచయితలకీమధ్య అమెరికా చాన్సులు కూడా బాగానే తగుల్తున్నాయి, వారికి అభినందనలు, థాంక్స్ టు అమెరికా తెలుగు సంఘాలు. తెలుగునాట సమాజం బాగుపడక పోయినా రచయితలైనా బాగుపడుతున్నారు, సంతోషం.

ఈ సంగతులు రాయడానికి పెద్దగా ఆలోచించనక్కర్లేదు, చాలా కొద్దిగా ఆలోచిస్తే చాలు. ఈ భీకర వేసవిలో కూడా రోజూ ఐదొందలు దాకా మందు, బిరియానిలకి ఖర్చు చేసే 'ధనవంతుల'నీ.. ఒక మంచిపుస్తకానికి కనీసం పది రూపాయిలు కూడా ఖర్చు చేసి కొనలేని 'పేదవారి'నీ.. ఎందెందు చూసినా అందందే కాంచగలము. ఓపిక ఉన్నవాళ్ళు పుస్తకాల షాపులు, బార్లలో సర్వే నిర్వహించుకోవచ్చు. కావున - సాహిత్యం, సమాజం.. దేన్దారి దానిదే అని నా నమ్మకం.

సమాజాన్ని అర్ధం చేసుకోటానికి పనికొచ్చే ఇంకో ఉదాహరణ హీరో కృష్ణ కూతురు ఉదంతం. ఆ అమ్మాయి హీరోయిన్ వేషాలు వేద్దామని ముచ్చట పడింది. కానీ దురదృష్టవశాత్తు - ఆ అమ్మాయి 'గొప్పవంశం'లో పుట్టిన ఆడపడుచు. అంచేత ఆ అమ్మాయి తీసుకున్న కెరీర్ నిర్ణయం మన అభిమాన పంఖాలకి నచ్చలేదు. ఆ అమ్మాయి సినిమాల్లోకి రావడం కుదర్దంటే కుదర్దాన్నారు! కాదనే ధైర్యం చెయ్యలేక ఆ అమ్మాయి ఆ ఉద్దేశం మానుకుంది. ఆ పంఖాధములే కృష్ణ కొడుకుని హీరోగా నెత్తిన పెట్టుకుని మోశారు, అతనికి 'ప్రిన్స్' అని ముద్దు పేరు కూడా పెట్టుకుని పులకించిపొయ్యారు. రాజులు పొయ్యారు, రాజ్యాలూ పొయ్యాయి.. మరీ ప్రిన్సులు పొయ్యేదెన్నడో!

ఇలా జెండర్ బయాస్ గూర్చి చాలాసేపు రాస్తూ పోవచ్చు, కానీ నే చెప్పదల్చుకున్న పాయింట్ చెప్పేశాను కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. అలాగే - 'సినిమాల్లోంచి సమాజంలోకి' అంటూ విషయాన్ని చూయింగ్ గమ్ లాగా సాగదీస్తూ, బుడగలూదుతూ నాలుగు భాగాలు రాశాను. ఇంక ఈ టాపిక్ నాక్కూడా బోర్ కొట్టేసింది, కావున.. సెలవు.

(picture courtesy : Google)

Monday, 31 March 2014

సినిమాల్లోంచి సమాజంలోకి - 3


సినిమాల్లోంచి సమాజంలోకి - 2 లో మన ఫ్యూడల్ ఆలోచనల గూర్చి రాశాను. ఇవ్వాళ మన ఆలోచనా ధోరణిలో రాచరిక వ్యవస్థ లక్షణాల గూర్చి రాస్తున్నాను. ఈ రాతలన్నీ సినిమాల్ని ఆధారంగా చేసుకుని రాస్తున్న ఆలోచనలు కాబట్టి, విషయ పరిమితులు గమనంలో ఉంచుకోవాలని మరొక్కసారి కోరుకుంటున్నాను.

అసలు రాచరిక వ్యవస్థ అంటే ఏంటి? మిత్రులారా! నేను చిన్నప్పుడు పరీక్షల కోసం 'మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?' లాంటి పనికిమాలిన విషయాల్ని బట్టీపట్టాను, మార్కులు కొట్టేశాను. కానీ - చరిత్ర అంటే తేదీలు, సంవత్సరాలు కాదని తరవాత తెలుసుకున్నాను, బట్ టూ లేట్. కావున నాకు చరిత్ర పాఠాలు తెలీదని మనవి చేసుకుంటున్నాను. అయితే - విఠలాచార్య సినిమాలు చాలా చూశాను, లెక్కలేనన్ని చందమామ కథలు చదివాను. ఇప్పుడా జ్ఞానాన్నే దుమ్ముదులిపి 'రాచరికవ్యవస్థ' అంటూ గంభీరంగా రాస్తున్నాను.

అనగనగా ఒక దేశానికి రాజు ఉంటాడు. అతను వంశపారంపర్యంగా ప్రజలని పాలించే హక్కు కలిగుంటాడు. రాజు రాజ్యరక్షణ కోసం శత్రుదేశ రాజుల్తో యుద్ధాలు చేస్తుంటాడు. ఇందుకోసం ఆయనకో పెద్ద సైన్యం ఉంటుంది. రాజ్యం లోపల్నుండి 'రాజద్రోహులు' పన్నే కుట్రలు, కుతంత్రాల్ని కూడా రాజు భగ్నం చేస్తూ ఉంటాడు. ఇందుకోసం అతనికో గూఢాచారి వ్యవస్థ ఉంటుంది. ఈ సంస్థల్ని మేపడానికి రాజు ప్రజల నుండి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తుంటాడు.

మహారాజు తన దేశప్రజల ధన, మాన, ప్రాణ రక్షణలకి బాధ్యత వహిస్తాడు (ఇయితే ఈ విధులన్నీ మన రాజకీయ పార్టీలు రాసుకునే ఎన్నికల మేనిఫెస్టోల వంటివి). రాజుకన్నా యోగ్యుడు ప్రజల్లో వందలమంది ఉండొచ్చు, కానీ ఎవరూ రాజుగారి అధికారాన్ని ప్రశ్నించరాదు, కనీసం ఆ ఆలోచన కూడా చేయరాదు. ఒకవేళ ఎవడైనా దౌర్భాగ్యుడు అటువంటి ప్రయత్నం చేసినచో, వాడిపై రాజద్రోహ నేరం మోపబడి బహిరంగ శిరఛ్చేదన చెయ్యబడును.

రాజుకి వందలమంది మల్టీ పర్పస్ దాసీజనులు ఉంటారు. ఇద్దరు ముగ్గురు భార్యలు కూడా ఉంటారు. వాళ్ళల్లో పెద్దరాణి వారి కడుపున పుట్టేవాడే రాజవుతాడు. అంచేత ఆవిడ గర్భం ధరించడం ఒక మెగా ఈవెంట్. ఆ గర్భం కోసం యజ్ఞయాగాదులు నిర్వహించబడతాయి. ఆ సమయంలో - ఎవరో పిలిచినట్లు అడవుల్లోంచి మునులు, ఋషులు వచ్చి మంత్రించిన అరటికాయ, మామిడిపండు లాంటి తినే వస్తువులు రాణిగారికి ఇస్తుంటారు (ఎందుకో తెలీదు)!

మొత్తానికి ఏదోరకంగా రాణీ గర్భవతి అవుతుంది. 'రాణీగారి కడుపులో ఉన్నది ఆడామగా?' అనే టెన్షన్తో పురప్రజలు ఎదురుచూస్తుంటారు. కొడుకు పుట్టినచో, రాజావారు తన మెడలోని హారం అ వార్త చెప్పిన చెలికత్తెకి బహుమతిగా ఇచ్చెదరు. యువరాజావారు జన్మించినందుకు రాజ్యం యావత్తూ ఎగిరి గంతులేస్తుంది.. పండగ చేసుకుంటుంది.

అంతేనా? ప్రకృతి కూడా పులకించును. కోయిల 'కుహూ! కుహూ!'మని కూయును, నెమలి పురివిప్పి నృత్యము చేయును, మండుటెండ పున్నమి వెన్నెల వలె ప్రకాశించును, నీలాకాశం సువర్ణ వర్ణంగా మారి ధగధగా మెరియును, సూర్యచంద్రుల సాక్షిగా మేఘాలు వర్షపు తుంపరలను ఆనంద భాష్పాలుగా కురిపించును. ఇట్లాంటి దరద్రపుగొట్టు రాతలు రాజుగారి ఆస్థాన కవులు రచించెదరు, ప్రతిఫలముగా అగ్రహారాల్ని పొందెదరు (వీరు ఇవ్వాల్టి మన 'పద్మ', జ్ఞానపీఠాలకి మూలపురుషులు)!

ముసలి రాజు, తమ యువరాజులుంగారికి ఎప్పుడు పట్టాభిషిక్తుణ్ని చేస్తారా అని దేశపౌరులు యావత్తు హిచ్ కాక్ సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నట్లు ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటారు (అంతకన్నా చేసి చచ్చేదేమీ లేదు కనుక). వన్ ఫైన్ డే (ఒక శుభముహోర్తాన) యువరాజు బాబుకి పట్టాభిషేకం అనే ఒక గొప్ప వేడుక జరుగుతుంది. దేశప్రజల జన్మ ధన్యమౌతుంది. ఆ రోజు నుండి ప్రజలు కొత్తరాజుని భక్తిప్రవృత్తులతో కొలవనారంభిస్తారు. కథ మళ్ళీ షరా మామూలే!

మిత్రులారా! ఇప్పటిదాకా (నాకు తెలిసిన) రాచరిక వ్యవస్థ గూర్చి తెలుసుకున్నారు. ఇదంతా మీక్కూడా తెలిసిందే, కానీ రాయబోతున్న విషయం కోసం మీ మెమరీని కొద్దిగా రిఫ్రెష్ చేశాను, అంతే! ఇప్పుడు ఇక ఇదే అలవరసలపై (ఈ పదానికి కాపీరైట్ హక్కుదారు - మీనాక్షీ పొన్నుదురై, రేడియో సిలోన్) తెలుగు సినీచరిత్ర కూడా తెలుసుకుందాం.

ఒకానొకప్పుడు తెలుగు సినిమాకి 'రెండుకళ్ళు'లాగా ఇద్దరు హీరోలు ఉండేవారు. అవడానికవి రెండుకళ్ళే గానీ, ఆ రెండుకళ్ళు ఒకే వ్యక్తివని చెప్పలేం. ఎందుకంటే రెండుకళ్ళూ రెండు వేరువేరు సామ్రాజ్యాలు. ఎవరికీవాళ్ళే తమ దర్శకులు, రచయితలతో సొంత దుకాణాలు నడుపుకునేవాళ్ళు. అవిధంగా కళామతల్లి ముద్దుబిడ్డలు కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా జీవుల్ని రంజింపజేశారు. తమ అభిమానుల కోరికపై వృద్దాప్యంలో కూడా రంగుల విగ్గులు, తగరపు కోట్లు వేసుకుని మనవరాలు వయసు హీరోయిన్లతో నర్తించారు.

రాజులు ముసిలాళ్ళైపొతుంటే, సామంతరాజులు బలపడుతుంటారు. కావున అరవైలలో ఇద్దరు కొత్త హీరోలు రంగప్రవేశం చేశారు. క్రమేపి వాళ్ళు సామంతరాజుకి ఎక్కువ, చక్రవర్తికి తక్కువ అన్నట్లుగా సినీరంగంలో స్థిరపడ్డారు. ఆ తరవాత కొన్నేళ్ళకి 'ఒక కొత్తవర్గం' కి చెందిన నటుడొకడు డేకుతూ, పాకుతూ కష్టపడి హీరోగా నిలదొక్కుకున్నాడు.. ఆపై పెద్ద హీరోగా ఎదిగాడు. 'కొత్తవర్గం' జనులు ఆనంద భాష్పాలు కార్చారు, తమ వర్గం నటుణ్ణి భుజానికెత్తుకున్నారు. ఆనాటి నుండి తెలుగు సినీ అభిమానుల్లో వర్గపోరాటం మొదలైంది (కార్ల్ మార్క్స్ చెప్పిన వర్గపోరాటం కాదు).

ఈలోగా తమ రిటైర్మెంటుతో ఇంతకాలం తాము యేలిన తమ తెలుగు సినీసామ్రాజ్యం దిక్కులేనిదైపోతుందని, తమ అభిమానులకి దివాణం లేకుండా పోతుందని ముసలి నటులు మిక్కిలి దిగులు చెందారు. అంచేత ఆ రెండుకళ్ళ నటులు తమ తనయుల్ని యువరత్న, యువసామ్రాట్టులుగా తెరపైకి తెచ్చారు. తమ అభిమాన ముసలి హీరోల స్థానంలో వచ్చిన వారి సుపుత్ర కుర్రహీరోల్ని గాంచిన వెర్రి అభిమానులు ఆనందంతో తడిసి మోపెడయ్యారు. ముసలి హీరోల బాటలోనే, అరవైల హీరో కూడా తన అభిమానుల శ్రేయస్సుకై తన ఇద్దరు కొడుకుల్ని రంగంలోకి దించాడు, వారిలో చిన్నకొడుకు ప్రయోజకుడయ్యెను.

ఇక 'వేరే వర్గం' హీరో మాత్రం తక్కువ తిన్నాడా? అందుకే ముందుగా తమ్ముణ్నీ, తరవాతగా కొడుకునీ హీరోలుగా దించాడు. తమ్ముడు హీరో మిక్కిలి ఆలోచనాపరుడు, ఆవేశపరుడు, విప్లవకారుడు కూడా. అందుకే అభిమానులు ఆయనలో చెగువేరా, భగత్ సింగుల్ని దర్శించి తన్మయత్వం చెందుతారు. కిట్టనివాళ్ళు అతను 'జయసింహ'లో ఎస్వీరంగారావులా రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని ఎత్తులు వేస్తున్నాడు అంటారు గానీ, నిజానిజాలు మనకి తెలీదు.. అనవసరం కూడా.

మిత్రులారా! ఎక్కడా పేర్లని ప్రస్తావించకుండా నే రాసిన తెలుగు సినిమా చరిత్ర మీకు అర్దమయ్యిందనుకుంటాను. రాజలు యుద్ధాలు చేస్తారు, ఇప్పుడు యుద్ధాలు జరగట్లేదు కదా? అని మీకు అనుమానం రావొచ్చు. ఒకప్పుడు రాజ్యం చుట్టూ కోట ఋరుజు ఉండేది, మరఫిరంగులు ఉండేవి, కొట్టుకు చావడానికి సిపాయిలు ఉండేవాళ్ళు. ఇప్పుడవన్నీ రూపాంతరం చెందాయి. ఇవి ప్రపంచీకరణ రోజులు.. అన్నీ సామాన్యుల కంటికి కనపడని రక్షణ కవచాలు, యుద్ధాలే. ఇప్పుటి నటవారసులకి సొంత స్టూడియోలే రక్షణ కవచాలు, సొంత పంపిణీ వ్యవస్థే దుర్భేధ్య కోటగోడలు. ఇక్కడ అందరూ సమానులే.. కానీ కారు. ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకున్న ఓ యువనటుడి సాక్షిగా ఇది రాస్తున్నాను.

ఇప్పుడు మనం రాచరిక వ్యవస్థ కోణం నుండి తెలుగు సినిమా చరిత్ర తెలుసుకున్నాం. తద్వారా - అనాదిగా మన 'ప్రజల జాతి' (అనగా పాలింపబడే జాతి) వంశపారంపర్యత పట్ల ఎంతటి భక్తి, ఆరాధన, వినయం కలిగున్నాయో కూడా అర్ధం చేసుకున్నాం. ఇప్పుడు ఇవే ఆలోచనల్ని, ఇవే అలవరుసలపై (మళ్ళీ - థాంక్స్ టు మీనాక్షీ పొన్నుదురై) దేశ రాజకీయ రంగంలోకి మళ్ళిద్దాం.

'ఈ దేశానికి ప్రధానిగా అవతరించడానికి రాహుల్ గాంధీకున్న ఏకైక అర్హత నెహ్రూ వారసత్వం మాత్రమేనా?' అని నరేంద్ర మోడీ గర్జించి మరీ అడుగుతున్నాడు. నరేంద్ర మోడీకి వారసత్వం ఎడ్వాంటేజ్ లేకపోవడం మూలానే ఈర్ష్యతో అలా అడుగుతున్నాడని నా అనుమానం. లేదా - అతనికి విఠలాచార్య సినిమాలు, చందమామ కథలు, తెలుగు సినిమా చరిత్ర.. బొత్తిగా తెలీకపోవడం వల్లనైనా అలా అడుగుతూ ఉండుండాలి.

నిన్నగాక మొన్న, యువరాణి ఇందిరమ్మ యుద్ధవిద్యలో తండ్రి దగ్గరే కోచింగ్ తీసుకుని, ఆపై రాణిగా పట్టాభిషిక్తురాలయ్యారు కదా! ఇందిరమ్మ కొద్దిగా నయం, అసలు ఏ మాత్రం అనుభవం లేని యువరాజు రాజీవుల వారు సింహాసనాన్ని అధిష్టించారు కదా! ఏం చేస్తాం? దేశంలో క్లిష్టపరిస్థితులు అలా తన్నుకొచ్చాయి. అందుకే భార్య సోనియమ్మ వద్దంటున్నా రాజీవులవారికి రాజ్యాధికారం అనే ముళ్ళకిరీటం ధరించక తప్పలేదు.

ఒక్కసారి 'రాజమకుటం'లో కన్నాంబని గుర్తు తెచ్చుకోండి. పాపం! రాజుగారు హత్య కావించబడ్డ తరవాత రాజమాత, అధికారాన్ని కొడుక్కి అప్పచెప్పడానికి ఎన్ని కష్టాలు పడింది! షేక్స్పియర్ 'హేమ్లెట్' ఛాయలు కనిపించే రాజమకుటం సినిమాని మనం మెచ్చుకోలేదూ? ఇప్పుడు రాజమాత సోనియమ్మ సింహాసనంపై కొడుకుని కూర్చుండపెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఇందులో తప్పేంటి? మీరు మాత్రం మీ పొలాలు, ఇళ్ళూ మీ పిల్లలకి రాసివ్వరా? రాజులు అదే చేశారు, సినిమా హీరోలూ అదే చేశారు, రాజకీయ నాయకులందరూ అదే చేశారు.. ఇప్పుడు సోనియమ్మ కూడా చేస్తుందదే కదా!

మోడీకి వారసత్వంలో ఉన్న పవర్ అర్ధం కావట్లేదు. జవహర్ లాల్ నెహ్రూ, షేక్ అబ్దుల్లా, చరణ్ సింగ్, దేవీలాల్, బిజూ పట్నాయక్, విజయ రాజె సిందియా, ఎన్టీరామారావు, శరద్ పవార్, మూలాయం సింగ్ యాదవ్, దేవెగౌడ, కరుణానిధి.. ఇట్లా వారసత్వాల లిస్టు చాంతాడంత ఉంది. ఎమ్జీఆర్ కి వారసులు లేరు, అందువల్ల ఆయన అభిమానులకి జయలలితలో తమ నాయకుణ్ణి చూసుకుని తన్మయత్వం చెందలేదా? ప్రజల్లో వీళ్ళెవ్వరి పట్లా లేని అభ్యంతరం, సోనియా గాంధీ పట్ల మాత్రం ఎందుకుండాలి?

జనాలు సినిమాల్లో వారసత్వ పల్లకీలని మోసే బోయీలుగా ఉన్నారు, మరప్పుడు రాజకీయాల్లో మాత్రం నమ్మకంగా, భక్తిగా ఓట్లేసే కూలీలుగా ఎందుకుండరు? ఉంటారనే పేట్రిక్ ఫ్రెంచ్ అనే ఆంగ్లేయుడు భారత వారసత్వ రాజకీయాల గూర్చి ఓ పుస్తకంలో విపులంగా రాశాడు. తెలుగు ప్రజలకి వారసత్వం పట్ల ఎంత గౌరవం లేకపోతే ఒక మహానాయకుడి కొడుకునో, ఇంకో అధినాయకుడి అల్లుణ్నో కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తూ, వారు తమని పాలించే శుభసమయం గూర్చి ఆశగా ఎదురుచూస్తుంటారు? వారి కోరిక త్వరలోనే తీరాలని కోరుకుందాం.. అంతకన్నా చేసేదీమీ లేదు కనక!

(picture courtesy : Google)

Saturday, 15 March 2014

సినిమాల్లోంచి సమాజంలోకి - 2


'ఫ్యూడల్ భావజాలం మన ఆలోచనా విధానం నుండి డిలీట్ అయ్యిందా? లేదా?' అనేది ఓ ధర్మసందేహం. ఈ ప్రస్తావన 'సినిమాల్లోంచి సమాజంలోకి' మొదటి భాగంలో వచ్చింది. ఈ ప్రశ్నకి సమాధానం కోసం విజయవంతమైన రెండు తెలుగు సినిమాల గూర్చి మాట్లాడుకుందాం.

సుమారు ముప్పైయ్యేళ్ళ క్రితం 'బొబ్బిలి బ్రహ్మన్న' అనే సినిమా వచ్చింది. కృష్ణంరాజు అనే నటుడు హీరో. ఒక ఊళ్ళో బ్రహ్మన్న అనేవాడు ఉంటాడు. అతగాడిది అదేదో బొబ్బిలి వంశంట! గుండెల నిండా గాలి పీల్చుకుని, కళ్ళు మిటకరించి.. ఊళ్ళో జరిగే నేరాలకి ఎడాపెడా తీర్పులు తనదైన స్టైల్లో చెప్పేస్తుంటాడు. అవన్నీ హర్యానాలో జరుగుతున్న ఖాప్ పంచాయితీలు టైపు తీర్పులు. బ్రహ్మన్న ఊళ్ళో పోలీసు, న్యాయ వ్యవస్థలు ఉండవు, సర్వం బ్రహ్మన్న బాబే! వాస్తవానికి ప్రజలు ఈ సినిమాని నిర్ద్వందంగా తిరస్కరించాలి, కానీ అలా జరగలేదు.

ఇరవైయ్యేళ్ళ క్రితం 'పెదరాయుడు' అని ఇంకో సినిమా వచ్చింది. ఈ కథ కూడా ఖాప్ పంచాయితీ కథే. ఊళ్ళో ఓ అగ్రకుల పెద్దమనిషి స్టైలుగా చుట్ట పీలుస్తూ కాలు మీద కాలు వేసుకుని తీర్పులు చెప్పేస్తుంటాడు. సాంఘిక బహిష్కరణ (ఇట్లాంటి తీర్పు చట్టరీత్యా నేరం) వంటి తీర్పులు కూడా ఇచ్చేస్తుంటాడు. పంచెకట్టు, మీసం మెలెయ్యడం, బంగారు కంకణం.. ఆ పాత్ర ఆహార్యం కూడా జుగుప్సాకరంగా ఉంటుంది. పైగా అమ్మోరికి మేకని బలిస్తున్నట్లు బేక్ గ్రౌండ్ మ్యూజిక్కొకటి. ఫ్యూడల్ భావజాలాన్ని నిస్సిగ్గుగా ప్రమోట్ చేసిన ఈ సినిమా కూడా బాగా ఆడింది.

అనగనగా ఒకానొప్పుడు ప్రజలు తమకన్నా పెద్ద కులాల వారిని గౌరవించేవాళ్ళట, తక్కువ కులాల వారిపట్ల తేలికభావంతో ఉండేవాళ్ళట. అదంతా చరిత్ర కదా! కాదా? మరి ఈ రెండు సినిమాలు విజయవంతం అవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? సమాజంలో సామాన్య ప్రజానీకంలో ఫ్యూడల్ వ్యవస్థ పట్ల వ్యతిరేకత లేదు అనా? ప్రేక్షకుల్లో చాలామంది అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమర్దిస్తున్నారు అనా? అందుకే - 'పెద్ద కులం పెద్దమనిషి, పాపం తీర్పులు చెబుతూ ఎన్ని కష్టాలు పడుతున్నాడో కదా!' అంటూ ఆ ఫ్యూడల్ మనిషితో empathize అయ్యారా?

మన తెలుగు జాతికి సాహిత్య స్పృహ తక్కువ, కాబట్టి సామాజిక స్పృహ కూడా అదే రేంజ్ లో ఉండటం సహజం. కాబట్టే.. కేవలం వారసత్వంగా వచ్చిన ఆస్తి, అంతస్తు, హోదా తప్ప ఇంకే అర్హతా లేని (ఒక్కరోజు కూడా శారీరక / మేధోశ్రమ చెయ్యని / చెయ్యలేని) అడ్డగాడిద లాంటి హీరో (దేవదాసు, ప్రేమనగర్, దసరా బుల్లోడు) పడే 'ప్రేమ' అనే మూలిగే సూడిపంది ప్రసూతి నొప్పుల బాధని ఆనందంగా, ఆరాధనగా చూస్తుండిపోతాం. ఎంతైనా పెద్దకులంవాడు, డబ్బున్నవాడు, కష్టం ఎరుగని సున్నితమైనవాడు కదా!

అందుకే - (నాకు తెలిసిన) చాలామంది అగ్రకులస్తులకి కారంచేడు, చుండూరు హత్యాకాండ చాలా సహజమైనదిగా కనిపించింది. చుండూరులో అగ్రకులస్తులు తమ ఆడపిల్లల్ని దళిత యువకులు ఇబ్బంది పెడుతున్నారని, వారి కుటుంబాల్ని వెంటాడి, వేటాడి నరికి చంపారు. శవాల్ని గోనె సంచుల్లో కుక్కి కాలవలోకి విసిరేశారు. 'మన ఆడపిల్లల జోలికోచ్చిన అంటరాని కులం వాళ్లకి ఆ మాత్రం బుద్ధి చెప్పకపోతే ధర్మం నాలుగు పాదాల మీద నడవద్దూ!' అని వారి వాదన. ఈ వాదన దళితులు కానివారికి నచ్చింది (బయటకి మాత్రం అందరూ తీవ్రంగా ఖండించారు, అది వేరే సంగతి).

ప్రజల ఆదరణ పొందిన సినిమాల నుండి, సమాజ ఆలోచనా విధానాన్ని అంచనా వేస్తున్నాను. ఈ పధ్ధతిలో ఉన్న పరిమితుల గూర్చి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందువల్ల నేను రాసిన విషయాలు జెనరలైజ్ చెయ్యరాదు. సమాజంలో అప్పుడూ, ఇప్పుడూ కూడా అన్నిరకాల మనుషులు ఎన్నోరకాల ఆలోచనా ధోరణిని కలిగుంటారు. అయితే - బూజుపట్టిన భావజాలంతో వచ్చిన సినిమాలు విజయవంతం అయ్యాయి కాబట్టి, ఆ ధోరణిని సమర్ధించేవారు (కొందరైనా) మనమధ్యన ఉన్నారని (వీళ్ళు మనకి ఎంత నచ్చకపోయినా) చెప్పడం మాత్రమే నా లిమిటెడ్ పాయింట్.

(picture courtesy : Google)

Monday, 3 March 2014

సినిమాల్లోంచి సమాజంలోకి - 1


ప్రస్తుతం నడుస్తుంది ఎన్నికల సీజన్. రాజకీయ నాయకులకివి అత్యంత కీలకమైన రోజులు. కాబట్టే వాళ్ళు 'ప్రజలు తమని ఏమనుకుంటున్నారు?' అన్న సంగతి తెలుసుకోవాలనే ఆరాటంతో తెగ తంటాలు పడుతున్నారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రోజుకో సర్వే ఫలితాలు వస్తున్నాయి. అయితే ఈ సర్వేలన్నీ స్పాన్సర్డ్ బాపతు అని అర్ధమవుతుంది. మరప్పుడు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే సాధనం ఏంటి?

మిత్రులారా! నాకు నా భార్య ఎవరికి ఓటేస్తుందో కూడా అంచనా లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇది పచ్చినిజం కావున ఈ సంగతి చెప్పటానికి నేనేమీ సిగ్గు పడటం లేదు. కావున, 'నీ భార్య ఆలోచనే తెలీనివాడివి, నోర్మూసుకుని కూర్చోక సమాజం గూర్చి నీకెందుకు?' అని మీరు అనుకుంటున్నట్లైతే నాకే అభ్యంతరమూ లేదు. కానీ - ఎన్నికల సమయంలో పార్టీల జయాపజయాల గూర్చి చర్చించుకోవడం చిలక జోస్యం చెప్పించుకున్నంత సరదాగా ఉంటుంది. వాతావరణశాఖ ఋతుపవనాల్ని అంచనా వేసినంత వినోదంగా కూడా ఉంటుంది. ఈ సరదా, వినోదాన్ని నేను మాత్రం ఎందుకు కాదనుకోవాలి?

'ఏ సమాజంలోనైనా ప్రజల మనోగతాన్ని అంచనా వెయ్యడం ఎలా?' అనేది ఆలోచిద్దాం. మన దేశంలో రాచరిక వ్యవస్థ ఎప్పుడో రద్దైంది, ఫ్యూడల్ వ్యవస్థ కూడా పోయింది. రాజకీయంగా ఇట్లాంటివి చాలా అంతరించిపొయ్యాయి. కానీ ఇవన్నీ మన ఆలోచనా విధానంలోంచి కూడా డిలీట్ అయ్యాయా? అన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేం. యూరోపియన్ దేశాల్లో (ముఖ్యంగా స్కాండినేవియన్ దేశాల్లో) సోషల్ సైకాలజీ స్టడీస్ ఉన్నాయి. వారు ఆ స్టడీస్ ఆధారంగా సమాజాన్ని అంచనా వేసుకోగలుగుతారు (వారి సైంటిఫిక్ మెథడాలజీ కరెక్టా? కాదా? అన్నది వేరే విషయం).

చాలా పెద్దదైన మన దేశంలో అట్లాంటి స్టడీస్ చెయ్యాలంటే కష్టం. ఇక్కడ కులం, మతం, ప్రాంతం మొదలైన అనేక అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి, విషయం సంక్లిష్టంగా మారిపోతుంది. పైపెచ్చు ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రస్తుతం మనం ఆకలి చావులు, దోమల చావులు కూడా నివారించుకోలేని ప్రాధమిక దుస్థితిలో ఉన్నాం. కావున కనీసమైన శాస్త్రీయ పరిశోధన జరగని సోషల్ సైకాలజీ గూర్చి ఆలోచించ బూనడం వృధా ప్రయాస. కాబట్టి ఆ శాస్త్రాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం.

సరే! ఇప్పుడు మళ్ళీ మొదటికొద్దాం. అసలు ఒక సమాజపు ఆలోచనా ధోరణిని అంచనా వెయ్యడం ఎలా? కోట్లు ఖర్చుపెట్టి పరిశోధనలు చేసే పధ్ధతి తప్ప వేరే సూచికలు లేవా? పోనీ - చదువుని అర్హతగా పరిగణించి అంచనా వేస్తే? ఉహూ! లాభం లేదు. మన చదువులు ఉద్యోగం సంపాదించడం కోసం పనికొచ్చేవే తప్ప జ్ఞానాన్ని ఇచ్చేవి కావు. ఈ దేశంలో చదువు వల్ల సంపాదించుకున్న 'సుఖమయ జీవన' మేధావులకి సామాన్య మానవుడి ఆలోచనా విధానం అర్ధం కావడం మానేసి చాలా కాలమైంది. కాబట్టి చదువుకున్నవారి సంఖ్యతో సమాజాన్ని అంచనా వెయ్యబూనడం సరైన విధానం కాదు.

పోనీ ప్రజల సాహిత్యాభిలాషతో సమాజాన్ని అంచనా వేసే ప్రయత్నం చెయ్యొచ్చా? అప్పుడు మంచి సాహిత్యం అంటే ఏంటనేది పెద్ద చర్చవుతుంది? నేను శ్రీశ్రీ అంటే ఇంకొకాయన విశ్వనాథ అంటాడు. నేను రావిశాస్త్రి అంటే ఇంకొకాయన ముళ్ళపూడి అంటాడు. ఒకళ్ళకొకళ్ళకి అస్సలు పడదు. అయినా ఒకళ్ళిద్దరు మంచి రచయితలు ఉన్నంత మాత్రాన, అది దేనికీ సూచిక కాదు. ఇది ఇందిరా గాంధీ ప్రధాని అయినందు వల్ల దేశంలో ఆడవారందరూ అభివృద్ధి చెందారని చెప్పడం వంటి గమ్మత్తైన వాదన.

అసలీ సూచికలన్నీ ఒక సమాజం నూటికి నూరుపాళ్ళు విద్యావంతమైతే తప్ప ఉపయోగపడని సాధనాలు, పద్ధతులు. అంచేత, సామాన్య ప్రజల ఆలోచనల్ని అంచనా వెయ్యడం ఎలా? అనే సబ్జక్ట్ కొద్దిగా కాంప్లికేటెడ్ వ్యవహారం. ఓటు వేసేవాడికి చదువు అవసరం లేదు - మనలో మెజారిటీకి చదువు లేదు. ఓటు వేసే వాడికి సాహిత్యంతో పన్లేదు - మనలో మెజారిటీ ఏదీ చదవరు. ఓటు వేసేవాడికి సోషల్ మీడియాతో పన్లేదు - మనలో మెజారిటీకి కంప్యూటర్ అంటే ఏంటో తెలీదు.

పోనీ - సినిమా ఒక సూచిక అవుతుందా? అవ్వొచ్చునేమో! ముందుగా సినిమాలకీ, ఎన్నికలకి గల సారూప్యతల్ని పరిశీలిద్దాం. ఓటు వెయ్యడానికి ఏ అర్హతా అవసరం లేదు, సినిమా చూడ్డానిక్కూడా ఏ అర్హతా అవసరం లేదు (జేబులో టిక్కెట్టుకి సరిపడా డబ్బులుంటే చాలు). సినిమా ప్రేక్షకులు ఆయా హీరోల కులం బట్టి కూడా అభిమానులుగా ఉంటున్నారు, ఎన్నికల్లో కూడా కులం ప్రభావం ఉంటుంది. సినిమా హీరోలకి కొందరు ప్రేక్షకులు వీరాభిమానులు ఉంటారు, రాజకీయ నాయకులకి కూడా దాదాపు అదే స్థాయి అభిమానులు ఉంటున్నారు.

కాబట్టి - తరచి చూడగా.. అందుబాటులో ఉన్న సాధనాల్లో సినిమా అనేది 'కొద్దోగొప్పో' పోల్చడానికి దగ్గరగా ఉన్నట్లుగా తోస్తుంది. అయితే ఈ ప్రాధమిక అంచనాతో ఒక ఇబ్బంది ఉంది. ప్రేక్షకుల అభిరుచి బట్టి సినిమా విజయవంతం అవుతుందని అందరూ అంటారు. కానీ ఇక్కడ నేను చెయ్యబోతుంది విజయవంతమైన ఒక సినిమా ద్వారా ప్రజల అభిప్రాయం అంచనా వెయ్యబూనడం. ఇది ఒక బోర్లింపు సిద్ధాంతం (reverse hypothesis). ఇప్పుడు బోర్లింపు సిద్ధాంతాన్ని కూడా ఒక శాస్త్రంగా గుర్తిస్తున్నారు కాబట్టి, ఎలాగూ ఇక్కడదాకా వచ్చాం కాబట్టి, ఈ దోవలోనే ముందుకెళ్దాం.

(picture courtesy : Google)