Showing posts with label కథ. Show all posts
Showing posts with label కథ. Show all posts

Wednesday, 28 May 2014

అసంతృప్తి


అతనంటే నాకిష్టం లేదు. అతన్ని చూసినప్పుడల్లా భగభగ మండే ఎండలో చెప్పుల్లేకుండా నడుస్తున్నంత మంటగా వుంటుంది. అతనంటే నాకు ఈర్ష్య. అతన్నాపక్కనుంటే, నాకు - పులి పక్కన వినయంగా నడుస్తున్న దొంగపిల్లిలా, మంత్రిగారికి ఒంగొంగి నమస్కారాలు పెడుతున్న అవినీతి ఆఫీసర్లా, ఎస్పీ దొరగారికి సెల్యూట్ చేస్తున్న సస్పెండైన ఎస్సైలాగా, అమెరికా సూటు బాబు పక్కన సిగ్గుతో చితికిపోతూ నించున్న ఆఫ్రికా గోచిగాళ్ళా  చిన్నతనంగా వుంటుంది.

నాకెందుకీ ఇన్ఫీరియారిటీ ఫీలింగు? అతను నాకన్నా ఎక్కువ చదువుకున్నాడా? లేదు బాబు లేదు, చదువులో నేనే చాలా ఎక్కువ. నాకన్నా ధనవంతుడా? కాదండీ కాదు, డబ్బు విషయంలో మా ఇద్దరి మధ్యా భూమ్యాకాశాలకున్నంత తేడా ఉంది. మరి - నాకన్నా పైస్థాయిలో ఉన్నాడా? కాదు.. కాదా? లేదు.. లేదా? ఏమో! ఈ సందేహమే నన్ను అసంతృప్తికి లోను చేస్తుంది.

అతను నా బాల్యస్నేహితుడు, ఇద్దరం ఒకే స్కూలు, ఒకే వీధి. ఆ వీధిలోకెల్లా మా ఇల్లే పెద్ద భవంతి, ఆ వీధిలోకెల్లా అతన్దే చిన్న కొంప. అతని కన్నా నేను పొడుగ్గా, బలంగా వుంటాను. నా తండ్రికి చాలా పోలాలున్నాయ్, స్థలాలున్నాయ్. అతని తండ్రికి చిన్న ఉద్యోగం తప్ప వేరే ఆధారం లేదు. ఆయన అస్తమానం దగ్గుతూ, మూలుగుతూ ఉండేవాడు. నీరసంగా కూడా ఉండేవాడు.. ఆయనకేదో జబ్బుట!

స్కూలు లేనప్పుడు విశాలమైన మా ఇంట్లో ఆడుకునే వాళ్ళం. అతను బిడియస్తుడు, మెతక మనిషి. నాకిష్టమైన ఆట, నేను ఆడమన్నంతసేపు (నేను గెలిచే విధంగా) ఆడేవాడు. అతను మా భవంతిని కలలో కనబడే ఇంద్రభవనంలా ఆశ్చర్యంగా చూసేవాడు. మా ఇంట్లో కయ్యిమంటూ మోగే మర్ఫీ రేడియో చూసి ఆనందపడ్డాడు. భొయ్యిమని చల్లగాలి వెదజల్లే ఎయిర్ కూలర్ చూసి ముచ్చటపడ్డాడు. ఫోన్ 'ట్రింగ్ ట్రింగ్' మన్నప్పుడు సంబరపడ్డాడు. పూజామందిరంలో ఉన్న నిలువెత్తు కృష్ణుడి విగ్రహం చూసి భక్తిభావంతో నిల్చుండిపొయ్యాడు.

అతను చదువులో నాకన్నా చాలా ముందంజలో ఉంటాడు. పెద్దగా చదివినట్లుగా ఉండేవాడు కాదు. వీధి పంపులోంచి బిందెతో నీళ్ళు పట్టి మోసుకు రావడం, బట్టలుతకడంలో తల్లికి సాయం చెయ్యడం లాంటి ఇంటి పన్లు చాలా చేస్తుండేవాడు. కానీ పరీక్షల్లో మార్కులు మాత్రం విపరీతంగా వచ్చేవి. అతని మార్కుల దరిదాపుల్లోకి వెళ్దామని చాలాసార్లు ప్రయత్నించా.. లాభం లేకపోయింది. అతనికన్నీ స్కూల్ ఫస్ట్ మార్కులే. నేను కష్టపడి ఒక్కో మార్కు సంపాదిస్తే, అతను అలవోకగా పుంజీడు మార్కులు తెచ్చేసుకునేవాడు. ఎలా సాధ్యం!

అతను మంచివాడు, ఈర్ష్యాసూయలు లేశమాత్రమైనా లేనివాడు. నాకు పాఠాలు అర్ధమయ్యేలా చక్కగా వివరించేవాడు. ఆ రకంగా అతన్నుండి చాలా లబ్ది పొందాను. కానీ మనసులో ఎక్కడో అశాంతి, కుళ్ళు. సందేహం లేదు - అతను నాకన్నా తెలివైనవాడు. ఒక్క చదువు విషయంలో తప్ప అన్ని విషయాల్లో నేనే ఎక్కువ. ఇదే నాకు చాలా అసంతృప్తిగా ఉండేది. దేవుడు నా డబ్బు, ఇల్లు.. అన్నీ అతనికే ఇచ్చేసి, అతని తెలివితేటలు నాకిస్తే ఎంత బాగుణ్ణు!

మన్చేతిలో ఏదీ ఉండదు. అరిచేత్తో సూర్యకాంతిని ఆపలేం, నదీప్రవాహాన్నీ ఆపలేం. జనన మరణాలు ఆగవు, అన్యాయాలు ఆగవు, మానభంగాలు ఆగవు, రాజకీయ నాయకుల అవినీతి ఆగదు. కానీ - చదువు మాత్రం ఆగిపోతుంది. ఈ విషయం నాకతని తండ్రి మరణంతో అర్ధమైంది. కుటుంబ పోషణ కోసం అతను అర్ధాంతరంగా చదువాపేసి ఏదో అణాకానీ ఉద్యోగంలో చేరాడు. ఆ తరవాత నాకతని గూర్చి పట్టించుకునే తీరిక లేకపోయింది.

నా చదువు చక్కగా 'కొన'సాగింది. మేం ధనవంతులం కాబట్టి డొనేషన్ల సాయంతో ఉన్నత చదువులకి గోడ మీద బల్లిలా సునాయాసంగా ఎగబాకాను. నా ఉన్నత చదువులకి, ఉన్నత సిఫార్సు కూడా జతవడం చేత, ఉన్నత ఉద్యోగం కూడా వచ్చింది. ఇన్ని ఉన్నతమైన అర్హతలున్నందున, ఉన్నతమైన కుటుంబం నుండి ఉన్నతమైన ఆస్తిపాస్తుల్తో భార్య కూడా వచ్చి చేరింది.

ఇప్పుడు నాకేం తక్కువ? ఏదీ తక్కువ కాదు, అన్నీ ఎక్కువే! పెద్ద కంపెనీలో పెద్ద కొలువు, తెల్లటి మొహం మీద ఎర్రటి లిప్స్టిక్ తో అందమైన భార్య, కాంప్లాన్ బాయిల్లాగా ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఆడుకోడానికి రెండు బొచ్చు కుక్కలు. మూడు కార్లు, నాలుగైదు బిల్డింగులు, బావమరిది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబళ్ళు, ఏడాదికి రెండు ఫారిన్ ట్రిప్పులు, పెద్దపెద్దవాళ్ళ స్నేహాలు.. నా జీవితం వడ్డించిన విస్తరి.. కాదు కాదు.. బంగారు పళ్ళెంలో పోసిన వజ్రాల రాశి. కానీ - అతను నాకు గుర్తొస్తూనే ఉంటాడు. అతని జ్ఞాపకాలు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.

ఈమధ్య ముఖ్యమైన పనుండి చాలారోజుల తరవాత మా ఊరికెళ్లాను. అతన్ని చూడ్డం కూడా ఒక ముఖ్యమైన ఎజెండాగా పెట్టుకునే ఊరికెళ్ళాను. అంచేత - వెళ్ళిన పనవ్వంగాన్లే వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్లాను. ఊరికి మూలగా ఉన్న ఏరియాలో చిన్న సందులో అద్దెకుంటున్నాడు. ఇంతకీ నే వెళ్తుంది అతన్ని పలకరిద్దామనా? కాదు. నన్ను తొలిచేస్తున్న అసంతృప్తి భావన కొంతైనా తగ్గుతుందేమోననే ఆశతో వెళ్తున్నాను.

ఆ వీధి ఇరుగ్గా వుంది, మురిగ్గా కూడా వుంది. అమెరికా వాడి అప్పు కోసం ఇండియా వాడు షో కేస్ చేసే దరిద్రపుగొట్టు వీధిలా ఉంది. అంతర్జాతీయ అవార్డు కోసం ఆర్ట్ సినిమాల డైరక్టర్ వేసిన అందమైన పేదవాడి వీధిలా కూడా వుంది. నా లక్జరీ కారు ఆ ఇరుకు వీధిని ముప్పాతిక భాగం ఆక్రమించింది. చుట్టుపక్కల వాళ్ళు ఆ ఖరీదైన కారుని అందమైన దయ్యప్పిల్లని చూసినట్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

అది రెండు గదుల పెంకుటిల్లు. రోడ్డు వైపుకు ఓ చిన్న గది, లోపలవైపుగా ఇంకో చిన్న గది. ఆ ఇంటి గోడల వయసు షుమారు వందేళ్ళుండొచ్చు, ఆ గోడలకి సున్నం వేసి ఓ తొంభైయ్యేళ్ళు అయ్యుండొచ్చు. కింద నాపరాళ్ళ ఫ్లోరింగ్ ఎగుడు దిగుడుగా అసహ్యంగా ఉంది. ఆ మూల దండెం మీద నలిగిన, మాసిన బట్టలు పడేసి ఉన్నాయి. ఆ గదిలో రెండు పాత ఇనప కుర్చీలున్నాయి, మూలగా ఒక చాప. అంతే! ఇంకే ఫర్నిచరూ లేదు. ఈ కొంప కన్నా ఆ వీధే కొద్దిగా అందంగా, రిచ్చిగా ఉంది!

ఒక కుర్చీలో ఎవరో పెద్దాయన కూర్చునున్నాడు. పాత కళ్ళజోడూ, మాసిన గడ్డం, నెత్తిన నాలుగు తెల్ల వెంట్రుకలు.. దరిద్రంలో, వార్ధక్యంలో ఆ గదికి అతికినట్లు సరిపోయ్యాడు. ఆయన బక్కగా ఉన్నాడు, ముందుకు ఒంగిపోయున్నాడు. పొట్ట లోపలకి, బాగా లోపలకి పోయుంది. బహుశా ఎప్పుడో ఏదో జబ్బు చేస్తే పొట్ట కోసి పేగులన్నీ తీసేసి పొట్టని మళ్ళీ కుట్టినట్లుంది. వాలకం చూస్తుంటే చాలాకాలంగా ఈ ప్రపంచాన్ని పట్టించుకోటం మానేసినట్లుగా ఉంది.

ఆయన.. ఆయన కాదు.. అతను! నా స్నేహితుడు! నా తోటివాడు గదా! ఇలా అయిపొయ్యాడేంటి! నా అలికిడి విని నిదానంగా తలెత్తి నావైపు చూశాడు. కొద్దిసేపటికి నన్ను ఫలానా అని పోల్చుకున్నాడు. 'కూర్చోండి' అంటూ మర్యాద చేశాడు. కూర్చున్నాను. అతని చూపులో, మాటలో జీవం లేదు. నెమ్మదిగా, అతి చిన్నగా మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు మాట్లాడాక అతని వివరాలు తెలిశాయి.

తండ్రి చనిపొయేప్పటికి అప్పులు తప్పితే ఆస్తులేమి లేవు. జీతంతోనే అప్పుల్ని నిదానంగా తీర్చసాగాడు, అప్పులకి మళ్ళీ అప్పులు చేసి ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళి చేశాడు. కొన్నాళ్ళకి తల్లి కూడా చనిపోయింది. అతనికి జీతం తప్ప వేరే ఆధారం లేదు, దరిద్రం తప్ప వేరే సంతోషాల్లేవు. అతని జీతం అప్పుల మాయం, జీవితం దుఃఖమయం. అంచేత భార్య కూడా అతన్ని అతని దరిద్రానికే వదిలేసి కొడుకుతో సహా పుట్టింటికెళ్ళిపోయింది. ప్రస్తుతం ఒక్కడే జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాట్ట. నాకెందుకో అతను జీవిస్తున్నవాళ్ళా కాకుండా, చావు కోసం ఎదురు చూస్తున్నవాళ్ళా అనిపించాడు.

నాలో అసంతృప్తి మరింతగా పెరిగిపోతుంది. వెతుక్కుంటూ వచ్చి మరీ ఇరుక్కుపొయ్యాను. సందేహిస్తూ అడిగాను.. 'ఇప్పుడు నేను ఏ సహాయమైనా సరే! చెయ్యగల స్థాయిలో ఉన్నాను, ఏదైనా సహాయం కావాలా?' అని. అతనొక క్షణం నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. చిన్నప్పుడు నాకర్ధం కాని పాఠాలు చెప్పేప్పుడు కూడా నన్నలాగే చూసేవాడు. నాకెందుకో సిగ్గుగా అనిపించి తల దించుకున్నాను. అతనేమీ మాట్లాడలేదు, కానీ - అతనికి జీవితం పట్ల పెద్ద ఆసక్తి లేదని గ్రహించాను. ఆ గదిలో ఆ డొక్కు కుర్చీలకి, అతనికి పెద్ద తేడా లేదు. ఇక అక్కడ ఉండటం అనవసరం అనిపించి లేచి బయటకి వచ్చేశాను.

కారు డ్రైవర్ హడావుడిగా కారు వెనుక తలుపు తీసి వినయంగా నించున్నాడు, నిట్టూరుస్తూ కార్లో కూలబడ్డాను. ఇప్పుడు నాలో అసంతృప్తి ఇంకొంచెం ఎక్కువైంది. నాది కాని రాజ్యంలో ముసలి రాజుని చంపి ఆ సింహాసనంపై అక్రమంగా కూర్చున్న కుట్రదారుగా.. సింహం తినగా మిగిలిన వేటలో ఎముకలు ఏరుకునే నక్కలాగా.. ఆకలితో ఏడుస్తున్న పాపడి పాలు తాగేస్తున్న దొంగలాగా.. యాజమాన్యంతో కుమ్ముక్కై కార్మికుల పొట్టగొట్టిన కార్మిక నాయకుళ్ళాగా.. తీవ్రమైన అసంతృప్తి.

నాకు అతనిపై కోపం వచ్చింది. అతనితో యుద్ధం కడదాకా చేస్తే గెలుపోటములు తెలిసొచ్చేవి. కానీ - అతని దురదృష్టం అతని చేత మధ్యలోనే కాడి పడేసేట్లు చేసింది. యుద్ధం చేసి శత్రువుని ఓడిస్తేనే మజా, కానీ - ఈలోపే శత్రువుకి ఏదో రోగమొచ్చి చస్తే మనం గెలిచిందీ లేనిదీ ఎలా తెలుస్తుంది?

లేదు.. లేదు.. జీవితంలో గెలుపోటములు నిర్ణయించేది చదువు, తెలివితేటలే కాదు.. అదృష్టం, అవకాశాలు కూడా. అక్కరకు రాని తెలివి అడవి గాచిన వెన్నెల వంటిది. నేను అనవసరంగా అసంతృప్తికి లోనవుతున్నాను. నేనిలా ఫీలవ్వడం నాలోని మంచితనానికి మాత్రమే నిదర్శనం. నన్ను ఇబ్బంది పెడుతున్న నా సున్నితత్వాన్ని, మంచితనాన్ని తగ్గించుకోవాలి. 

ఇలా నన్ను నేను సర్ది చెప్పుకునే ప్రయత్నంలో ఏదోక రోజు నేను విజయం సాధిస్తానని నాకు తెలుసు.. కానీ - ఆ రోజేదో త్వరగా వచ్చేస్తే బాగుణ్ణు!

(picture courtesy : Google)

Thursday, 16 February 2012

హుస్సేన్.. నా ప్రియనేస్తం


"మీరు.. నువ్వు.. హుస్సేన్ కదూ! నన్ను గుర్తు పట్టలేదా?" రోడ్డున వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి ఉత్సాహంగా అడిగాను.

ఎర్రగా, పొడుగ్గా, బక్కపల్చటి ఆకారం. మాసిన గడ్డం, నలిగిన చొక్కా, వెలసిన లుంగీ. నిర్వేదంగా, నిరాశగా, నిర్లిప్తంగా నాకేసి చూశాడు. అతని కళ్ళలో జీవం లేదు. ప్రపంచంలోని కష్టాలన్నీ తనే అనుభవిస్తున్నట్లున్నాడు. 

"మిమ్మల్నెలా మర్చిపోతాను?" అన్నాడు.

"హుస్సేన్! నన్ను మీరు అంటున్నావేమిటి! ఇవ్వాళ నిన్ను వదలను. నీతో చాలా కబుర్లు పంచుకోవాలి. పద, అలా టీ తాగుతూ మాట్లాడుకుందాం." అంటూ పక్కనే ఉన్న హోటల్లోకి దారి తీయబోయాను.

"లేదు, లేదు. ఇప్పుడు నాకు అర్జంటు పనుది. ఈసారి తప్పకుండా.. " అంటూ నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు హుస్సేన్.. నా ప్రియనేస్తం.


హుస్సేన్, నేను మూడోక్లాస్ దాకా కలిసి చదువుకున్నాం. పరీక్షల్లో హుస్సేన్ది ఎప్పుడూ ప్రధమ స్థానమే. ఆ ప్రధమ స్థానానికి, రెండో స్థానానికి మధ్య బోలెడన్ని మార్కుల అంతరం. ఆ రెండో స్థానం కోసం నాకూ, బాబ్జీకీ మధ్య తీవ్రమైన పోటీ. ఈ పోటీ కారణంగా బాబ్జికి నాకు పడేది కాదు. హుస్సేన్ మాత్రం చాలా డిగ్నిఫైడ్ బాయ్. ఎర్రగా, సన్నగా ఉండేవాడు. లూజు నిక్కరు, నలిగిపోయిన చొక్కా. అల్లరికి ఆమడ దూరం. తక్కువ మాట్లాడేవాడు, అడిగినదానికి సమాధానం చెప్పేవాడు, అంతే.

కొద్దికాలంలోనే నేనూ, హుస్సేన్ మంచి స్నేహితులమైపోయాము. హుస్సేన్ పెన్సిల్ ఎప్పుడూ అంగుళానికి మించి వుండేది కాదు. నా పెన్సిల్ హుస్సేన్ కి ఇచ్చేవాణ్ని. ఇంట్లో పెన్సిల్ పోయిందని అబద్దం చెప్పి, కొత్తపెన్సిల్ కొనుక్కునేవాణ్ని. హుస్సేన్ దగ్గర అన్ని సబ్జక్టులకి పుస్తకాలు వుండేవి కావు. నా టెక్స్ట్‌బుక్స్ హుస్సేన్‌తో పంచుకునేవాణ్ణి. హుస్సేన్ నాకు చదువులో ఎంతో సహాయం చేసేవాడు. 

మా స్కూలు పక్కనే ఒక ఆఫీసు, ఆఫీసు వెనక విశాలమైన ఖాళీ స్థలం. ఆ స్థలంలో ఒక బిల్డింగ్ మొదలు బెట్టి.. పిల్లర్స్, స్లాబ్ వేసి వదిలేసారు. ఆ వదిలేసిన కట్టడమే హుస్సేన్ ఇల్లు. చుట్టూతా గోనెపట్టాలతో కుట్టిన పరదాలు. ఒక మూలగా మూడు రాళ్ళు. ఆ రాళ్ళ మీద మసిబారిన గిన్నె, పొయ్యిలో మంట కోసం పుల్లలు, చిన్న కిరసనాయిలు బుడ్డి, పక్కన రెండు సత్తుప్లేట్లు. పొయ్యికి నాలుగడుగుల పక్కగా పాత రేకుపెట్టె. ఇదీ హుస్సేన్ ఇంటి ఫర్నిచర్!

రేకుపెట్టె పక్కనే ఒక చింకిచాప. ఆ చాపమీద పొద్దస్తమానం ఒక మహిళ పడుకునుండేది. మనిషి అందంగా ఉంటుంది, కానీ ఎముకల గూడుతో తెల్లగా పాలిపోయి వుంటుంది. నీరసంగా, అప్పుడప్పుడూ మూలుగుతూ ఉండేది. ఆవిడ హుస్సేన్ తల్లి. హుస్సేన్ తల్లికి టీ కాచి ఇచ్చేవాడు. ఆవిడ టీ తాగుతుంటే కాళ్ళు పట్టేవాడు. హుస్సేన్ తల్లి ఉర్దూ బాషలో ఏదో చెబుతూ ఏడుస్తుండేది. హుస్సేన్ తమ్ముడు రెండేళ్ళ క్రితం 'విష జెరం' తో చచ్చిపోయాట్ట, బహుశా చనిపోయిన కొడుకు గుర్తొచ్చి ఏడుస్తుందేమో.

హుస్సేన్ స్నేహం నాకు ఎన్నో కొత్తవిషయాలు నేర్పింది. హుస్సేన్ ఇంటి వెనక దట్టమైన తుప్పలు, పొదలు ఉండేవి. ఉసిరి చెట్టు, నేరేడు చెట్టు కూడా ఉండేవి. హుస్సేన్ ఉసిరిచెట్టు కొమ్మల్ని బలంగా ఊపేవాడు. బోల్డన్ని ఉసిరికాయలు రాలి పడేవి. అవన్నీ ఏరి ఉప్పూ, కారం అద్దుకుని తినేవాళ్ళం. నేరేడు చెట్టెక్కి కాయలు కోసేవాడు. నేరేడుకాయల తినేప్పుడు నాలుక బయట పెట్టి ఎవరి నాలుక ఎక్కువ రంగు మారిందో చూసుకునేవాళ్ళం.

హుస్సేన్ బొంగరం ఆటలో స్పెషలిస్ట్. నాకు బొంగరం అరచేతిలో తిప్పడం నేర్పించాడు. నాకు నలికీసు పాములు, తొండలు అంటే భయం. అవికూడా మనలాంటివేనని, మనని చూసి అవే ఎక్కువ భయపడతాయని ధైర్యం చెప్పాడు. ఆ పక్క ఇంటివాళ్ళ మామిడిచెట్టుకి కాయలు విరగకాసి వేల్లాడుతూ ఉండేవి. చేయి పెడితే చాలు, కనీసం పదికాయలు అందుతాయ్. నేను ఆ మామిడి కాయలు కోసేద్దామని ఉబలాటపడేవాణ్ణి. అలా చెప్పకుండా కాయలు కొయ్యడం దొంగతనం అవుతుందని, దొంగతనం తప్పని హుస్సేన్ వారించేవాడు. నాకన్నా వయసులో కొద్దినెలలు మాత్రమే పెద్ద అయిన హుస్సేన్ నాకు గురువుగా మారిపొయ్యాడు.

మూడోక్లాసు పరీక్షలు దగ్గర పడ్డాయ్. రోజుట్లాగే హుస్సేన్, నేను నేరేడు చెట్టు కొమ్మమీద కూర్చున్నాం. నేరేడు కాయలు తింటూ, హుస్సేన్ చెబుతున్న పాఠాన్ని బద్దకంగా వింటున్నాను. హుస్సేన్ పాఠం చెప్పే విధం అద్భుతంగా వుంటుంది. ముందుగా పుస్తకంలో ఉన్నది పెద్దగా పైకి చదువుతాడు, ఆ తరవాత అర్ధాన్ని వివరిస్తాడు. నాకు ఆ వివరణ చందమామ కథలాగా ఉండేది.

హఠాత్తుగా హుస్సేన్ ఇంట్లోంచి పెద్దగా శబ్దాలు, కేకలు, అరుపులు వినిపించాయ్. హుస్సేన్ మెరుపు వేగంతో చెట్టు దిగి ఇంట్లోకి పరిగెత్తాడు. వెనకగా నేను కూడా హుస్సేన్ తో పాటు పరిగెత్తాను. ఇంట్లో దృశ్యాన్ని చూసి చలించిపోయాను. చాపమీద పడున్న హుస్సేన్ తల్లిని ఆమె భర్త ఎగిరెగిరి డొక్కల్లో తంతున్నాడు. ఆవిడ పెద్దగా ఏడుస్తుంది. ఏడుస్తూనే ఉర్దూలో అతన్ని ఏదో తిడుతుంది. ఆతను ఊగుతున్నాడు, తూగుతున్నాడు, మాటలు ముద్దగా వస్తున్నాయ్. అతను ఏదో కోపంతో భార్యని కొడుతున్నట్లుగా లేడు. భార్యని చంపేంత కసి, క్రోధం అతని కళ్ళల్లో నాకు కనిపించాయి.

పరుగున వెళ్లిన హుస్సేన్ తల్లిమీద బోర్లాపడి, ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు. ఇప్పుడు తండ్రి తన్నులు హుస్సేన్ వీపుమీద పడుతున్నయ్. ఆ తన్నుల ధాటికి బాధతో విలవిలలాడిపోతూ, తల్లికి దెబ్బలు తగలకుండా కాస్తున్నాడు. హృదయవిదారకమైన ఆ సంఘటన చూసి భయపడిపోయాను, ఏడుపొచ్చింది.

ఒక్కసారిగా ఇంటికి పరుగు తీశాను. తన్నులు తింటున్న హుస్సేన్ మొహమే కళ్ళ ముందు కదులాడుతుంది. నేనెప్పుడూ ఒకమనిషి ఇంకోమనిషిని అంత దారుణంగా కొట్టటం చూళ్ళేదు. తండ్రి తన్నుల ధాటికి అసలే బక్కగా, పీలగా ఉన్న హుస్సేన్ చచ్చిపోతాడా? దుఖం ఆగట్లేదు. ఏడుస్తున్నాను, పరిగెత్తుతూనే ఏడుస్తున్నాను, ఏడుస్తూనే పరిగెత్తాను.

అటు తరవాత హుస్సేన్ స్కూలుకి రాలేదు. నాకు హుస్సేన్ ఇంటికి వెళ్లాలని ఆరాటంగా ఉండేది. కానీ హుస్సేన్ తండ్రి గుర్తొస్తేనే వణుకొచ్చేది. ఆ భయమే నన్ను వెళ్ళనీయలేదు. పరీక్ష ముందురోజు హుస్సేన్‌ని పరీక్షలకి రమ్మని చెప్పటానికి మా టీచర్ నలుగురు పిల్లల్ని వాళ్ళింటికి పంపించారు. వాళ్ళల్లో నేనూ ఒకడిగా బిక్కుబిక్కుమంటూ వెళ్లాను.

ఇంట్లో హుస్సేన్ లేడు, హుస్సేన్ తండ్రి కూడా లేడు. చాపమీద శవంలా పడున్న తల్లిని హుస్సేన్ గూర్చి అడిగాం. ఆవిడ లోగొంతుకతో నీరసంగా హుస్సేన్ ఏదో 'బేరం'కి వెళ్ళాడని చెప్పింది. బేరం అంటే ఏంటో మాకు అర్ధం కాలేదు. అదే ముక్కని మా టీచర్ కి చెప్పాం. ఆవిడ 'చూశారా! దేవుడు వాడికి గొప్ప తెలివితేటలిచ్చాడు, కానీ చదువుకునే అవకాశం లేకుండా చేశాడు.' అంటూ బాధపడ్డారు. ఆ తరవాత హుస్సేన్ మళ్ళీ ఎప్పుడూ స్కూలు గుమ్మం తొక్కలేదు.

ఇంటర్ చదువుతున్నప్పుడు ఒకసారి మార్కెట్ సెంటర్లో కనిపించాడు. ఎన్నిసార్లు పిలిచినా వినిపించుకోనట్లు వెళ్లిపొయ్యాడు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు కనిపించాడు. చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వకుండా హడావుడిగా వెళ్లిపొయ్యాడు.


ఈమధ్య ఒక పెళ్ళిలో కలిశాడు బాబ్జి. ఐఐటీ చేసి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాట్ట. పక్కన పొట్టిగా, లావుగా వున్న వ్యక్తిని చూపిస్తూ - 

"ఈ శాల్తీని గుర్తుపట్ట్లేదా? మన వాసుగాడు." నవ్వుతూ అన్నాడు బాబ్జి. 

"హల్లో మైడియర్ వాసూ! వెంటనే గుర్తుపట్టనందుకు సారీ బ్రదర్!" అంటూ సంతోషంగా కౌగలించుకున్నాను. 

వాసుకి గుంటూర్లో పుస్తకాల షాపు వుందిట. నాగూర్చి వివరాలు చెప్పాను. తరవాత మా టీచర్ల గూర్చి కొంత సంభాషణ నడిచింది.

"వాసు! నీకు హుస్సేన్ ఎక్కడున్నాడో తెలుసా?" ఉన్నట్టుండి అడిగాడు బాబ్జి.

ఒక్కసారిగా వాసు మొహం మారిపోయింది. దీర్ఘంగా నిట్టూరుస్తూ -

"లేదు. మన మూడోక్లాసు పరీక్షలప్పుడే హుస్సేన్ తండ్రి యెటో వెళ్లి పొయ్యాడు. పాపం! ఆ వయసులో తల్లిని  పోషించాటానికి నానా తిప్పలు పడ్డాడు హుస్సైన్. అరటి కాయలు అమ్మాడు, సున్నం బొచ్చెలు మోశాడు. కొన్నాళ్ళకి తల్లీకొడుకుల్ని బిల్డింగ్ ఓనర్ ఖాళీ చేయించాడు, తల్లిని తీసుకుని ఎక్కడికెళ్ళాడో! ఆమధ్య సత్తెనపల్లిలో ఫుట్‌పాత్ మీద ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతుంటే చూశానని మా తమ్ముడన్నాడు, నాకయితే తెలీదు." అన్నాడు వాసు.

"పాపం! హుస్సేన్." అన్నాడు బాబ్జి.

"హుస్సేన్ చదువులో మీఇద్దరికన్నా ముందుండేవాడు, వాడే గనక చదువుకుంటే మంచి పొజిషన్లో ఉండేవాడు కదూ." నెమ్మదిగా అన్నాడు వాసు.

"అవును వాసు! నువ్వు చెప్పింది నిజం. హుస్సేన్ గుర్తొచ్చినప్పుడల్లా నాకూ అదే అనిపిస్తుంది. నాకు ఒక్కోసారి గిల్టీగా కూడా ఉంటుంది. ఇదంతా హుస్సేన్ కే చెప్పాలనిపిస్తుంది. కానీ హుస్సేన్ ఎందుకో నన్ను ఎవాయిడ్ చేస్తున్నాడు బాబ్జి." అన్నాను.

బాబ్జి ఒక్కక్షణం ఆలోచించాడు.

"నువ్వూ, వాసు కేవలం అతని చదువు గూర్చే మాట్లాడుతున్నారు, కానీ చదువొక్కటే జీవితం కాదు గదా. ఇంటర్తో చదువాపేసిన వాసు కూడా హాపీగానే ఉన్నాడు. కానీ నా బాధల్లా హుస్సేన్ బాల్యం గూర్చే. అతని బాల్యం చాలా ఘోరంగా చిదిమెయ్యబడింది. తండ్రి చేసిన తప్పులకి హుస్సేన్ జీవితం బలైపోయింది, సో సాడ్. అన్నివిధాలా అర్హత వుండికూడా, జీవితంలో ఏ అవకాశం లేకుండా చేసిన సమాజం పట్ల ద్వేషం పెంచుకున్నాడేమో. హుస్సేన్ నిన్నెందుకు ఎవాయిడ్ చేస్తున్నాడో నేనర్ధం చేసుకోగలను." అన్నాడు బాబ్జి.

ఇంటికి వస్తూ బాబ్జి చెప్పిన పాయింట్ ఆలోచించాను.

హుస్సేన్ ఆలోచనలు కూడా బాబ్జి చెప్పినట్లే ఉన్నాయా? మా అందరికన్నా తెలివైనవాడై ఉండికూడా ఎన్నో బాధలు పడ్డాడు. తనకి జరిగిన అన్యాయానికి ఈ సమాజం పట్ల ఏహ్యభావం ఏర్పర్చుకున్నాడా? నేనూ ఆ సమాజంలో భాగాన్నే కదా. అందుకనే నాతో మాట్లాడటం అతనికి ఇష్టం లేదా? నా శుష్కవచనాలు హుస్సేన్‌కి సంతోషం కలిగించకపోవచ్చు. పైగా చికాకు, కోపం తెప్పించవచ్చునేమో కూడా.

చదువు నాకు సమాజంలో ఉన్నత స్థాయిని ఇచ్చింది. నా జీవితం సంతోషమయం. ఇప్పుడు నాకు నా చిన్ననాటి స్నేహితులతో అలనాటి మధుర క్షణాలు నెమరువేసుకోవడం హాయినివ్వవచ్చు. కానీ - హుస్సేన్ కి మానిన గాయం మళ్ళీ రేపినట్లు అవ్వచ్చు. కడుపు నిండినవాడు ఆహ్లాదంగా, సరదాగా కబుర్లు చెప్పగలడు. కానీ నాతో కబుర్లు పంచుకోవటానికి హుస్సేన్‌లో కొద్దిపాటి ఆనందం అయినా మిగిలుండాలి గదా. అసలంత విశాల హృదయం హుస్సేన్‌కి ఎందుకుండాలి?

నేను హుస్సేన్ నా ప్రియనేస్తం అనుకున్నాను. కానీ హుస్సేన్‌ని బాబ్జిలాగా అర్ధం చేసుకోలేకపోయాను. అందుకే, ఇప్పుడు హుస్సేన్ గూర్చి వాకబు చెయ్యడం మానుకున్నాను.  

(picture courtesy : Google)

Thursday, 5 January 2012

మా సుబ్బారెడ్డి మామ

"అల్లుడూ! అర్జంటుగా రా! నీతో చానా విషయాలు మాట్లాడాల." అని కబురంపాడు మా సుబ్బారెడ్డి మామ.

సుబ్బారెడ్డి మామ మాట నాకు శాసనం. ఆఫీసుకి సెలవు పడేసి హడావుడిగా మాఊరికి బయల్దేరాను. మా ఊరు గుంటూరు టౌనుకి దగ్గర్లో వుంటుంది. ఒకప్పుడు పల్లెటూరు, ఇప్పుడు పట్నంలో కలిసిపోయింది.

సుబ్బారెడ్డి మామ ఆజానుబాహుడు, నల్లటి శరీరం, తెల్లటి జుట్టు, బుర్రమీసాల్తో గంభీరంగా వుంటాడు. ముతక ఖద్దరు గుడ్డతో బనీను, దానికో పెద్దజేబు, జేబులో పొగాక్కాడలు. ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయిని బావమరిది కోటిరెడ్డికి ఇచ్చుకుని ఇంట్లోనే వుంచుకున్నాడు. రెండోఅమ్మాయి భర్త బెంగుళూర్లో ఇంజనీర్.

సుబ్బారెడ్డి నాకు మేనమామ. నేను చిన్నతనంలో మా నాయన్ని కోల్పోయాను. దిక్కుతోచని స్థితిలో వున్న మా కుటుంబాన్ని మా మామ అన్నివిధాలుగా ఆదుకున్నాడు, నన్ను చదివించాడు. ఇవ్వాళ నేను ఉద్యోగం చేస్తున్నానంటే అది మామ చలవే. మామ సాయం లేకపోతే నేను మాఊళ్ళో ఏ గొడ్లో కాసుకుంటూ వుండేవాణ్ని. నాకు సుబ్బారెడ్డి మామంటే అమితమైన గౌరవం, వల్లమాలిన అభిమానం.

ఒకప్పుడు మామ పొద్దున్నే సద్దిబువ్వ తిని పొలానికెళ్ళి రైతువారీ పనుల్లో బిజీగా వుండేవాడు. మా వూరు పట్నంలో కలిసిపొయ్యాక వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లరూపాయిల ధనరాసులుగా మారిపొయ్యాయి. మా సుబ్బారెడ్డి మామ తెలివిగా, అవసరానికి మేర భూముల్ని కొద్దికొద్దిగా అమ్ముతూ గుంటూర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాడు. పెద్దమనవడికి డొనేషన్ కట్టి డాక్టర్ కోర్స్ చదివిస్తున్నాడు. ఈమధ్య శ్మశానం అభివృద్ధికీ, గుడి నిర్మాణానికి చందాలిచ్చి పుణ్యాత్ముడని పేరూ సంపాదించాడు.

ఊరికి చేరుకునేప్పటికి సాయంత్రం ఏడయింది. "ఏవిఁరా! మీమామ పిలిస్తేగానీ మనూరు గుర్తుకు రాదా?" అంటూ అత్త నవ్వుతూ పలకరించింది. టీవీలో ఏదో రాజకీయ చర్చ చూస్తున్న సుబ్బారెడ్డి మామ అల్లుడు కోటిరెడ్డి నన్నుచూసి ముఖం అటుగా తిప్పుకున్నాడు, మనసు చివుక్కుమంది. యేదో పనుండి మామ బయటకి వెళ్ళాట్ట, అన్నం తినే వేళకి వచ్చాడు. నన్ను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు కనుక్కున్నాడు.

భోజనాలకి నేను, మామ, కోటిరెడ్డి పీటల మీద కూర్చున్నాం. ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు, మామకి అట్లా కింద కూర్చుని తినడమే ఇష్టం. నాటుకోడి ఇగురు, గారెలు, చేపల పులుసు. అన్నీ నాకిష్టమైనవే! అందులో మా అత్త చేతివంట. అత్త కొసరికొసరి వడ్డిస్తూ తినిపించింది.

భోజనాలు అయ్యాక వరండాలో నవ్వారు మంచాల మీదకి చేరాం. మామ పొగక్కాడ సాపు చేసుకుంటూ అసలు విషయంలోకి వచ్చాడు. 

"రవణారెడ్డి! ఈమధ్యన మన కోటిరెడ్డి కొత్త ఆలోచనలు చెప్తా ఉండాడు. ఏది చేసినా నీతో ఆలోచన సెయ్యకుండా ఏదీ సెయ్యను. నువ్వూ, కోటిరెడ్డి ఒక మాటనుకుంటే నాకు దైర్నం." అంటూ చుట్ట కట్టటం మొదలెట్టాడు.

"అన్నా! ఏందా ఆలోచన?" ఆసక్తిగా కోటిరెడ్డిని అడిగాను.

కోటిరెడ్డి ఒకక్షణం ఆలోచించి మాట్లాడాడు. 

"తమ్ముడూ! మన్దగ్గర డబ్బుంది, ఊళ్ళో మంచిపేరుంది. ఈ రోజుల్లో ఇయ్యి మాత్రమే సరిపోతయ్యా? సరిపోవు. డబ్బున్నోడికి పలుకుబడి కూడా వుంటేనే అందం చందం. మరి పలుకుబడి యాడుంది? డబ్బులో వుందా? లేదు. మరెందులో వుంది? అధికారంలో ఉంది. మరా అధికారం యాడుంది? అధికారం రాజకీయ నాయకుల చేతిలో వుంది. ఆ అధికారం, వోదా ముందు మన్డబ్బు చిత్తుకాయితంతో సమానం! ఆ యవ్వారవే యేరు."

నాకు విషయం అర్ధమైంది. కోటిరెడ్డి రాజకీయాల్లో దిగాలనుకుంటున్నాడు. సుబ్బారెడ్డి మామకి నా సలహా కావాలి. నేనడ్డం కొడతానని కోటిరెడ్డి అనుమానం. ఆలోచిస్తూ మౌనంగా వుండిపొయ్యాను.

చుట్ట నోట్లో పెట్టుకుంటూ నావైపు చూస్తూ "ఏమిరా! ఉలుకూ పలుకూ లేకుండా అట్లా కూకున్నావ్?" అన్నాడు మామ.

"మామా! ఈ యవ్వారం మీరూమీరు మాట్లాడుకోండి. మధ్యన నేన్దేనికి?" పొడిగా అన్నా.

మామ పెద్దగా నవ్వాడు. "ఏందిరో! అయిదరాబాదు నీళ్ళు బాగా వంటబట్టినయ్యే. పరాయోడిలా గుట్టుగా మాట్లాడతా వున్నావు. సదువుకున్నోడివి, తెలివైనోడివి, మనోడివనీ నిన్ను అర్జంటుగా పిలిపిస్తిని. నువ్వేంది ఎనకా ముందాడతా వున్నావు?" అంటూ అగ్గిపుల్ల వెలిగించి చుట్టకొనకి నిప్పంటించాడు.

మామ ఈమాట అనంగాన్లే నాకు చాలా సంతోషమేసింది. ఇంక నేను నా మనసులో మాట సూటిగా చెప్పొచ్చు, కోటిరెడ్డి ఏమనుకుంటాడోనని సందేహం అనవసరం.

"రాజకీయాలకి బయట వుంటూ చేసే విశ్లేషణ వేరు, రాజకీయాన్ని ఒక కెరీర్‌గా ఎంచుకునేప్పుడు చెయ్యాల్సిన ఆలోచన వేరు. మన రాజకీయ అవసరాలు, ఆయా పార్టీ భవిష్యత్తుల్ని అంచనా వేసుకోవాలి. ఒక పార్టీ ఫిలాసఫీ గొప్పగా ఉండొచ్చు, ఆపార్టీని నడిపించే నాయకుడూ మంచోడయ్యుండొచ్చు. కానీ మనకి అవకాశాలివ్వని పార్టీ ఎంత మంచిదైనా మనకి అనవసరం."

నా మాటల ధోరణికి కోటిరెడ్డి మొహం చిట్లించాడు.

"ఆపరా నాయనా, ఆపు నీసోది. బావా! ఈడు భయస్తుడు. అవకాశాలు చూసుకోటానికి ఇదేమన్నా ఉద్యోగమా! ఇదంతా నాకనవసరం. మనకి మన కులపోళ్ళ పార్టీ వుంది, ఇంకోపార్టీ గురించి ఆలోచిస్తే ఎంత నామర్దా!" అన్నాడు కోటిరెడ్డి.

"నువ్వు తగ్గు, ఆణ్ణి చెప్పనీ." అంటూ కొటిరెడ్డి వైపు చూస్తూ చుట్టపొగ గుప్పున వదిలాడు సుబ్బారెడ్డి మామ.

నేను మాట్లాడసాగాను. "మామా! ఒప్పుకుమంటున్నాను. రాజకీయాల్లో మనకి మనోళ్ళ పార్టీనే ఫస్ట్ చాయిస్. కానీ ఆలోచించు. సపోజ్ మనం రాజకీయంగా మన పార్టీలో దిగాం అనుకుందాం. అప్పుడేమవుద్దీ? ఎలక్షన్ల దాకా పార్టీకయ్యే ఖర్చు మన్చేతే పెట్టిస్తారు. పోనీ సీటు గ్యారంటీనా అంటే అదీ వుండదు. టిక్కెట్లిచ్చేప్పుడు కులాలు, మతాలు లెక్కేలేస్తారు. చివరాకరికి టిక్కెట్టు ఇంకెవరికో ఇవ్వొచ్చు."

మామామని ఎట్లాగైనా రాజకీయాల్లోకి దించాలని పట్టుదలగా వున్నాడు కోటిరెడ్డి.

"యేందిరా నువ్వు! మనోడి పార్టీలో చేరటానికి నువ్విట్టా లాభనష్టాలు లెక్కేస్తావేంది. బావా! నాకీలెక్కలు అనవసరం. నేను మనోడి పార్టీలో చేర్తన్నా, ఎలక్షన్ల గెల్చి ఎమ్మెల్యేనైతా. ఈ రవంణారెడ్డిగాడితో నాకు మాటలేంది?"

ఆరిపోయిన చుట్ట ముట్టించుకుంటూ నాకేసి చూశాడు మామ.

"మామా! నా దృష్టిలో రాజకీయాలు పేకాటతో సమానం. వందమంది ఆరిపోతే ఒక్కడు పైకొస్తాడు. వున్న వూళ్ళో దర్జాగా హాయిగా కాలుమీద కాలేసుకుని బతుకుతున్నాం. రాజకీయాల్లోకి దిగితే ఆ వొచ్చే పదవేందో గానీ, విమర్శలు మాత్రం దారుణంగా ఎదుర్కోవాలి. ఇయ్యన్నీ మనకి అవసరమా?" అన్నాను.

"థూ నీయవ్వ! నువ్వసలు మడిసివేనా! పిరికిముండాకొడుకులు ఎంత సదూకుంటే మాత్రం యేం లాభం, గుండెకాయలో ధైర్నం లేనప్పుడు." కయ్యిమన్నాడు కోటిరెడ్డి.

"అన్నా! ఎందుకు నామీద కోపం జేస్తావ్! మామ అడగబట్టే కదా నేజెబుతుండా! ఈ రాజకీయాలు రొచ్చుగుంటలాంటివి. పార్టీని నీ చేతిలో పెడుతున్నామంటారు, పార్టీకి నువ్వే దిక్కంటారు. నీచేత గాడిద చాకిరి చేయించుకుంటారు. తీరా ఎలక్షన్ల సమయానికి వాళ్ళేసే కూడికలు, తీసివేతల్లో నీకు టికెట్ రాకపోవచ్చు. ఇట్లా దెబ్బ తిన్నోళ్ళని ఎంతమందిని చూళ్ళేదు. ఎవరో ఎందుకు? మన కిష్టారెడ్డిని చూడు. పాపం! పొలమంతా అమ్ముకున్నాడు, అప్పులపాలయ్యాడు. ఈ రాజకీయాల్లో ఏదయినా జరగొచ్చు. ఏదీ జరక్కపోవచ్చును కూడా! ఏదైతే అదైంది, పోతేపోయింది వెదవ డబ్బేగదా అనుకుంటే ఇందులోకి దిగు." అంటూ చెప్పదం ముగించాను.

"శెబాస్ అల్లుడు! ఇషయం ఇడమర్చి సెప్పావ్!" మెచ్చుకోలుగా అన్నాడు సుబ్బారెడ్డి మామ.

ఆవేశంతో ఊగిపోయాడు కోటిరెడ్డి. "రే రవణారెడ్డిగా! నీలాంటి ఎదవనాకొడుకు మన కుటుంబంలో ఉంటం మా దరిద్రం రా! గుడిసేటి నాయాలా." అంటూ అరిచాడు.

"ఏందిరా పెద్దంతరం చిన్నంతరం లేకండా నాముందే నోరు లేస్తా ఉండాది. ఆడి ఆలోసెన ఆడు సెప్పాడు, ఇందులో నేకేంది నెప్పి." అంటూ ఆరిపోయిన చుట్టని పడేశాడు సుబ్బారెడ్డి మామ.

కోటిరెడ్డి పెద్దగా అరుస్తూ విసురుగా వెళ్ళిపోయాడు.

నాకు బాధేసింది. కోటిరెడ్డి నన్ను అంతేసి మాటలంటాడని ఊహించలేదు. రాత్రంతా కలతనిద్ర. మామాఅల్లుళ్ళ మధ్య అనవసరంగా ఇరుక్కున్నానేనోమోనన్న భావన నన్ను సరీగ్గా నిద్ర పోనీయలేదు. రకరకాల ఆలోచనలు.

'ఏదో ఒకరకంగా డబ్బు గడించి అధికారమే పరమావధిగా రాజకీయాల్లోకొస్తున్నారు. ఇప్పుడున్న నాయకులేమన్నా ఆకాశం నుండి వూడిపడ్డారా! నా మధ్యతరగతి నేపధ్యం, ఉద్యోగ మనస్తత్వంతో అనవసరంగా కోటిరెడ్డిని నిరుత్సాహపరిచానా? ఏమో!'

-----

గుంటూరు నుండి హైదరాబాదుకి పల్నాడు ఎక్స్‌ప్రెస్ ఉదయానే ఐదున్నరకుంది. ఇంక వుండాలనిపించట్లేదు. తెల్లారుఝాము నాలుగింటికి లేచి బట్టలు సర్దుకుంటుంటున్నాను. నెమ్మదిగా నా గదిలోకొచ్చాడు సుబ్బారెడ్డి మామ.

"ఏమిరా అల్లుడూ! ఇంకో నాలుగు దినాలు వుండి పోవచ్చుగదా! ఆడేమి కొంపలు మునిగిపోతున్నాయి."

"మామా! ఆఫీసులో అర్జంటు పని, రాత్రే ఫోనొచ్చింది. ఇప్పుడు బయల్దేరితే ఆఫీస్ టైంకి అందుకోవచ్చు."

నా కళ్ళల్లోకి చూశాడు సుబ్బారెడ్డి మామ.

"అల్లుడూ! అర్ధమయ్యింది, నీ మనసుకి కష్టం కలిగింది. ఈ రాజకీయాల్లోకి దిగితే ఉన్నది వూడుద్దని నాకూ తెలుసు. కానీ కోటిరెడ్డికి రాజకీయం పిచ్చ పట్టింది. మరీ బడాయికి పోతా ఉండాడు. ఎన్ని సుట్లు సెప్పినా బుర్రకెక్కట్లా. నన్నేమన్లేక పెళ్ళాన్ని తిడతా ఉండాడు. గట్టిగా సెబుదామంటే.. పిల్లనిచ్చుకున్నానాయే. కడుపు సించుకుంటే కాళ్ళమీద పడుద్ది. నీసేత ఆ నాలుగు ముక్కలు సెప్పిస్తే, అయ్యడ్డం పెట్టుకుని ఆణ్ణి కొన్నాళ్ళు ఆపొచ్చు. అందుకే నిన్ను అడావుడిగా పిలిపించా."

నేను ఆశ్చర్యపొయ్యాను. నేనేదో తెలివైనోణ్ణననుకుని రాత్రి రాజకీయాల గూర్చి క్లాస్ పీకా. మామ తను చెప్పదలిచింది నాతో చెప్పిచ్చాడు. తను మంచోడిగా మిగిలాడు. ఎటోచ్చి కోటిరెడ్డి దృష్టిలో సైంధవుణ్ణి నేనే! ఇంత తెలివైన సుబ్బారెడ్డి మామకి రాజకీయాలొద్దని తప్పు సలహా చెప్పానా!

"అల్లుడూ! నిన్న కోటిరెడ్డన్న మాటలు మనసులో పెట్టుకోమాక." అంటూ చటుక్కున నా రెండు చేతులు పట్టుకున్నాడు మామ.

నాకు కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. "ఎంత మాటన్నావ్ మామా! నీ కోసం నేను చావటానిక్కూడా సిద్ధం! అట్లాంటిది నీకోసం మాట పడ్డం ఎంతపని? అవసరమైతే మళ్ళీ కబురంపు." అని మామ కాళ్ళకి నమస్కరించి రైల్వే స్టేషన్ కి బయలుదేరాను.    

Sunday, 30 October 2011

జ్ఞానం - అజ్ఞానం


'పుస్తకపఠనం మంచి అలవాటు. తద్వారా సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ విషయాల్లో టన్నులకొద్దీ జ్ఞానము, విజ్ఞానము సమూపార్జించుకొనవచ్చును. మేధావిగా కీర్తినొందవచ్చును.'

ఈ మాటలు సుబ్బారావు బుర్రలో బలంగా నాటుకుపొయ్యాయి. గొప్ప జీవితసత్యం బోధపడిపోయిందనిపించింది. తద్వారా అతనికి తను చేపట్టవలసిన  భవిష్యత్ కార్యక్రమం  అవగతమైంది.

జ్ఞానం అనబడే ఈ మహాసముద్రాన్ని - పుస్తకం అనే చెంబుతో తోడెయ్యాలని నిర్ణయించేసుకున్నాడు. తదుపరి ర్యాకుల కొద్దీ పుస్తకాలని చదివేసి అవతల పడెయ్యసాగాడు. క్రమేణా పుస్తక పఠనం అనేది సుబ్బారావుకి ఒక వ్యసనంగా మారిపోయింది.

ప్రస్తుతం సుబ్బారావు ఏ విషయాన్నైనా రిఫరెన్స్ లేకుండా మాట్లాట్టం మానేశాడు. 'ఇప్పుడు రాత్రయింది' అని సింపుల్‌గా చెప్పేసి వదిలేస్తే సుబ్బారావుకి మాచెడ్డ చిరాకు. ఇప్పుడు రాత్రి ఎందుకైందో రిఫరెన్స్ చెప్పాలి. పగలు ఎందుక్కాదో కూడా  రిఫరెన్స్ లివ్వాలి.

సుబ్బారావుని అందరూ వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా అని మెచ్చుకోటం మొదలెట్టారు. ఇంక సుబ్బారావు రెచ్చిపొయ్యాడు. 

'ధరలు మండిపోతున్నయ్' అంటే అమెరికా ఎకానమీ గూర్చి, డాలర్ పతనం గూర్చి మాట్లాడతాడు. 'ఎండలు మండిపోతున్నయ్' అంటే గ్లోబల్ వార్మింగ్ గూర్చి ఉపన్యసిస్తాడు. 'ఫలానావాడు అప్పు చేశాడు' అంటే ఏ దేశం ఏ దేశానికి అప్పు పడిందో వడ్డీతో సహా లెక్కలు చెబ్తాడు. వర్షం పడుతుంటే వర్షం వెనుక ఫిజిక్స్ చెప్తాడు.

సుబ్బారావు ధోరణి మొదట్లో ముచ్చట గొలిపినా, కొన్నాళ్ళకి బంధుమిత్రులకి విసుగొచ్చేసింది. ఒక్కొక్కళ్ళే అతనికి దూరం కాసాగారు. క్రమేపి సుబ్బారావుకి పుస్తక ప్రపంచానికీ, భౌతిక ప్రపంచానికీ తేడా మర్చిపొయ్యాడు.

రోగిష్టి తల్లి  రాత్రంతా  దగ్గుతూనే  ఉంది. 'ఒరే సుబ్బడూ! దగ్గీదగ్గీ ప్రాణం పొయ్యేట్లుంది, డాక్టరుకి చూపించరా.' దీనంగా అడిగింది. 'అమ్మంటే యెలా వుండాలి? గోర్కీ అమ్మలా వుండాలి.  నువ్వేంటి పొద్దస్తమానం ఇట్లా దగ్గుతున్నావ్?' విసుక్కున్నాడు సుబ్బారావు. 

భార్య మొత్తుకుంది - 'పిల్లలు సరీగ్గా చదవట్లేదు, చాలా సమస్యగా వుంది.' భార్యని జాలిగా చూశాడు సుబ్బారావు - 'పిచ్చిదానా! పిల్లల సమస్య కాశ్మీర్ సమస్య కన్నా పెద్దదా? ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ మీద జరిగిన ఒప్పందాలు తెలుసా?'

'నాన్నోయ్! తేజాగాడు నా బ్యాట్ లాక్కున్నాడు, అడిగితే తంతున్నాడు. బాబోయ్, నొప్పి.' అంటూ కొడుకు ఏడుస్తూ వచ్చాడు. 'ప్రశాంత్ భూషణ్ అంతటివాడే శ్రీరామసేనవాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నాడు, ఆఫ్టరాల్ నువ్వెంత? పో అవతలకి.' ఆంటూ అరిచాడు.

చెల్లెలు భర్తతో తగాదాపడి పుట్టింటికొచ్చింది. 'అన్నయ్యా! మా ఆయన వాళ్ళమ్మ మాటలిని నన్ను ఒకటే తిడుతున్నాడు.' సుబ్బారావు చెల్లెలి వైపు నిర్వికారంగా చూశాడు. 'చూడమ్మా! రంగనాయకమ్మ 'జానకి విముక్తి'  చదువుకో. నీ సమస్య తీరిపోతుంది.' చెల్లెలు  తెల్లబోయింది.

ఆఫీసుకి వెళ్ళడం మానేశాడు సుబ్బారావు. గడ్డం పెరిగిపోయింది, జుట్టు చెదిరిపోయింది. అతనిప్పుడు రోజంతా శూన్యంలోకి చూస్తూ, తీవ్రంగా యేదో ఆలోచిస్తూ గదిలోనే గడిపేస్తున్నాడు.

భార్య ఏడుస్తూ చెప్పింది - "వంటింట్లో అన్నీ నిండుకున్నయ్. ఈరోజు నుండీ మనందరికీ పస్తే."

"ఇదిగో, ఇలా రా! ఈ పుస్తకాలు చూడు. ఇది ఎమిలీ జోలా 'ఎర్త్'. ఇదేమో పెర్లెస్ బక్ 'గుడ్ ఎర్త్'. వాళ్లీ రచనల్లో దరిద్రాన్ని ఎంతో అందంగా, మరెంతో రొమేంటిగ్గా రాశారు. నిజమే! ఆకలి దుర్భరమైనది. కాబట్టే 'క్రైమ్ అండ్ పనిష్‌మెంట్‌'లో  రాస్కల్నికోవ్‌, ఆఫ్ హ్యూమ  బాండేజ్‌లో  ఫిలిప్‌లు అంతగా ఇబ్బంది పడ్డారు!"

భార్యాపిల్లలూ, తల్లీ ఏడుస్తూ తిట్టటం మొదలెట్టారు. "మీకు కోపం ఎందుకొస్తుందో తెలుసా? మన మెదడులో రసాయనాలు.. " అంటూ ఏదో చెప్పబొయ్యాడు. 

కొడుక్కి మండిపొయ్యింది. తండ్రి ముంజేతిని కసిగా కసుక్కున కొరికాడు. సుబ్బారావుకి నొప్పెట్టింది. వెంటనే నొప్పి కలిగించే నాడీమండల వ్యవస్థ గూర్చి ఆలోచనలో పడ్డాడు.

ఈవిధంగా సుబ్బారావు జ్ఞానసాగరంలో  తేలియాడుతూ.. ఆలోచనల్లో మునుగుతూ.. ఇంటి ముందు రోడ్డు దాటుచుండగా.. స్పీడుగా వెళ్తున్న ఒక కారువాడు గుద్దేసాడు. 

తలకి పెద్దదెబ్బే తగిలింది. మూడ్రోజులు కోమాలో ఉన్నాడు. చుట్టపక్కాలు సుబ్బారావు అయిపోయాడనుకున్నారు.

భార్య పూజల వల్లనైతేనేమి, డాక్టర్ల ప్రతిభ వల్లనైతేనేమి - సుబ్బారావు చావు తప్పించుకున్నాడు. కొన్నాళ్ళకి ఆస్పత్రి నుండి డిశ్చార్జయ్యాడు. భర్తకి పుస్తకాల పిచ్చి వుంటే వుంది, మనిషి దక్కాడు, అంతే చాలనుకుంది  భార్య.

కొన్నాళ్ళ తరవాత -

దగ్గుతున్న తల్లి  దగ్గరకొచ్చాడు సుబ్బారావు - "అమ్మా! హాస్పిటల్‌కి  వెళ్దాం పద." అన్నాడు. తల్లి ఆశ్చర్యపోయింది.

అటుగా వెళ్తున్న కొడుకుని  పిలిచి  మందలించాడు - "ఆటలు ఆడుకో, మంచిదే! కానీ చదువు చాలా ముఖ్యం." కొడుకు బిక్కమొహం వేశాడు.

టీవీ చూస్తున్న చెల్లెల్తో అన్నాడు - "బావకి కబురు చెయ్యమ్మా! నేనతన్తో మాట్లాడాలి." చెల్లెలి కళ్ళల్లో ఆనందం. 

వంటింట్లో వున్న భార్యని పిలిచాడు - "ఇంటి ఖర్చుల విషయంలో నువ్వెన్ని ఇబ్బందులు పడుతున్నావో నాకు తెలుసు, అయాం సారీ! త్వరలోనే ఉద్యోగంలో చేరుతున్నాను." ఆనందం పట్టలేక బిగ్గరగా ఏడ్చేసింది భార్య.

ఇంతలో - 

ఒక బట్టతల పెద్దమనిషి ఇంట్లోకి వచ్చాడు. మామిడిపండ్ల బుట్ట బల్లమీద పెట్టాడు. సుబ్బారావుకి రెండుచేతులు జోడించి నమస్కరించాడు. 

"అయ్యా! ఈ పాపిని క్షమించండి, ఆ రోజు మిమ్మల్ని గుద్దిన కారుని నడిపింది నేనే. నాభార్యని హాస్పిటల్‌కి తీసుకెళ్ళే హడావుడిలో పొరబాటు జరిగిపోయింది."

సుబ్బారావు భార్య కారు యజమానికి తిరిగి నమస్కరించింది. "అయ్యా! మీరు చేసిన మేలు ఈ జన్మకి మర్చిపోలేం, మీరు మా పాలిట దేవుడు."

బట్టతల పెద్దమనిషికి విషయం అర్ధం కాలేదు, బుర్ర గోక్కుంటూ సెలవు తీసుకున్నాడు.

(picture courtesy : Google)

Thursday, 6 October 2011

సున్నిత సమస్యాపురం


"జోగినాధం! కళ్ళెట్టుకు సూడు. ఆకాశంలో ఏదో మర్డర్ జరినట్టుంది కదూ!" అన్నాడు ప్రెసిడెంటు.

రావు గోపాల్రావు లాంటి ప్రెసిడెంటు ఆఊరికి మహారాజే. ప్రెసిడెంటుది ఆరడగుల భారీవిగ్రహం. అతని దర్జా అంతా ఆ కోరమీసంలోనే ఉందంటారు. అతనికి జోగినాధం నమ్మిన బంటు. పొట్టిగా, బక్కగా, మాసిన గడ్డం, పాత కోటు, బూతద్దాల కళ్ళజోడూ.. చూట్టానికి అచ్చు అల్లు రామలింగయ్యలా ఉంటాడు.
                   
"మహాప్రభో! ఇవ్వాళేం జరుగుతుందోననీ.. మన కనెక్సన్ కట్టయిపోద్దేమొనని నాకు కాలూ చెయ్యీ ఆడట్లేదు. మీరేమో ఆకాశమంటూ, మర్డరంటూ ఏవేమో శెలవిస్తున్నారు." భయంగా అన్నాడు జోగినాధం.

సిగరెట్ దమ్ము లాగుతూ విలాసంగా చిర్నవ్వు నవ్వాడు ప్రెసిడెంటు.
                   
జోగినాధం చెప్తున్న ఆ సమస్య గతకొన్నాళ్ళుగా ఆఊరిని అగ్నిగుండంగా మార్చేసింది. ఏ ఇద్దరు కలిసినా ఆసమస్య గూర్చే చర్చ. ఇంతకీ ఏమా సమస్య? ఏంటా కథ?


రంగి, రంగడు గత పాతికేళ్ళుగా భార్యాభర్తలు. మొదట్లో వారి కాపురం సజావుగానే సాగింది. కానీ.. గతకొన్నేళ్లుగా రంగడు ఫుల్లుగా తాగి రంగిని బాదిపడేస్తున్నాడు. ఈ రోజువారీ దెబ్బలు భరించలేని రంగి విడిపోవాలని నిర్ణయించుకుంది. రంగి చుట్టాలు కూడా రంగడికి చెప్పీచెప్పి విసిగిపొయ్యి.. ఈ ఎదవ ఇంక మారడనీ, రంగి విడిపోవాల్సిందేననే అభిప్రాయానికి వచ్చేశారు.
                   
కానీ.. విడిపోటం అనేది పెద్దసమస్యగా మారింది. రంగి పుట్టింటి తరఫున కట్నంగా తెచ్చుకున్న అరెకరా మాగాణి సమస్యంతటికీ మూలకారణం.

'నా అరెకరా నాకెచ్చియ్. నా సావు నే సస్తా.' అంది రంగి.

'మీ పుట్టింటోళ్ళ బీడు బూమి నా రెక్కల కట్టంతో బాగు చేశాను. ఇన్నాళ్ళూ దున్నాను. కాబట్టి పొలం నాదే.' అన్నాడు రంగడు.  

'దున్నేవోడిదే బూమి.' అని రాజకీయాలు కూడా మాట్లాడాడు.

రంగికి నలుగురు అన్నదమ్ములు. ముగ్గురు అప్పచెల్లెళ్ళు. రంగడికి ముగ్గురు అన్నలు. ఇద్దరు తమ్ముళ్ళు.
                   
వ్యవహారం ప్రెసిడెంటు దాక పొయ్యింది. మొదట్లో రంగి పరివారం ఆ అరెకరా పొలం గూర్చి అడిగినప్పుడల్లా ప్రెసిడెంటుకి అందులో చాలా న్యాయం కనిపించేది.

"అయినా మీపొలంతో వాడికేంటి సమ్మందం? మీకెందుకు. నే మాట్లాడతా. మీరు పోండి." అని పంపించేసేవాడు.

అసలే ఎలక్షన్లు రాబోతున్నాయ్. ఈతీర్పుతో రాబోయే ఎలక్షన్లలో కలిగే లాభనష్టాల బేరీజులో ఉన్నాడు ప్రెసిడెంటు.
                   
జోగినాధం ద్వారా ఈ సంగతి గ్రహించిన రంగడి పటాలం.. ఆరెకరా కోసం తెలివైన వాదన ఎత్తుకుంది.

'మనది ఇందూ దేశం. ఇక్కడంతా ఇందూ దరమం. పెళ్ళంటే నూరేళ్ళపంట. మొగుడెంత ఎదవైనా.. ఎంత తాగుబోతు సన్నాసైనా.. మొగుడు మొగుడే. ఇడాకులు మహాపాపం. మాకు ఇందూ నాయం గావాల.' అంటూ మతం సెంటిమెంటుతో కొట్టారు.

'ఈఇదాన పెతి ఆడముండా పొలం పుట్రా తీసేస్కుని పుట్టింట జేర్తే పాపం మగోడి బెతుకేం గావాల్న?' అంటూ ఆర్ధికసామాజికాంశాలతో కొట్టారు.

'అయినా .. కలిసుంటే కలదు సుకం అని ఎన్టీవోడు సేప్పాడు గందా. ఆ బాబు సెప్పినంక ఇంక ఏరే నాయమేంది?' అని చరిత్రతోనూ కొట్టారు.
                   
ఈ దెబ్బలకి ఆలోచనలో పడ్డాడు ప్రెసిడెంటు. ఏదో నాలుగు కేకలేసి యవ్వారం సెటిల్ చేద్దామనుకున్నాడు. కానీ ఇందులో లోతెక్కువుందని గ్రహించాడు. ఆవిధంగా ఈ మొగుడూపెళ్ళాల గోల్లో ప్రెసిడెంటు కూడా అడ్డంగా ఇరుక్కుపొయ్యాడు. ఆఊళ్ళో వీళ్ళ కులపోళ్ళ వోట్లు లేకుండా ప్రెసిడెంటుగిరీ అసాధ్యం. అటూఇటూ కలిపి ఓ ఆరొందల ఓట్లు నికరంగా ఉన్నయ్. అదీగాక.. ఊరంతా రంగీ, రంగడి పార్టీలుగా విడిపోయుంది.
                   
ఆడంగులంతా కూడా రెండు పార్టీలుగా విడిపొయ్యారు.

'ఎంతన్నేయం! తాగుబోతు సచ్చినోడు పొలాన్ని కూడా ఇడిసిపెట్టడా!' అంది రంగి పార్టీ.

'ఈ రంగిముండకి పొయ్యేకాలమొచ్చింది. మొగుడన్నాక ఆమాత్రం తన్నడా? నా మొగుడు రోజూ తాగి మక్కెలిరగదంతన్నా, ఎంతమంది ముండలెనకాల బోయినా.. ఒక్కరోజయినా చూడకుండా ఉండలేనమ్మా.' అంది రంగడి పార్టీ.
                   
ప్రెసిడెంటు బుర్ర గోక్కున్నాడు. రాజకీయాల్లో కులం, మతంలాంటి ఈక్వేషన్లు ఆయనకి తెలుసు. ఈ కొత్తసమస్య ఎటుపొయ్యి ఎటొస్తుందో.. చివరాకరికి ఎగస్పార్టీవాడికి లాభిస్తుందేమోననే అనుమానం కలిగింది. చట్టం తన పని తను చేసుకుపోతుందని తప్పించుకోటానికి ఇది కోర్టుకేసు కాదాయె!

అంచేత.. "ఇదంత అర్రీబర్రీగా తేలే యవ్వారం గాదు." అంటూ వాయిదాల మీద వాయిదాలు వేయసాగాడు.

రంగడు తాగుడు ఎక్కువ చేశాడు. ఆపై పెళ్ళాన్ని బాదుడూ ఎక్కువ చేసాడు. అతనికి 'ఇందూ నాయం' బాగా కలిసొచ్చింది. రంగి అలిగి అన్నం తినడం మానేసింది.

ఒకరోజు రంగి అన్న పీకల్దాకా తాగి 'ఏందీ అన్నేయం?' అంటూ ప్రెసిడెంటుని నిలేసాడు.
                   
ప్రెసిడెంటు ఆలోచనలో పడ్డాడు. మూడ్రోజులు ఏకధాటిగా మందుకొట్టి ఆలోచించాడు.

'పొరబాటున ఈ రొచ్చులో కాలుపెట్టా. ఇప్పుడు కాలు జాగ్రత్తగా కడుక్కొకపొతే నా ప్రెసిడెంటుగిరీకే ఎసరొచ్చేట్లుంది. ఈ అరెకరా ఆరుచెరువుల నీళ్ళు తాగిస్తుందనుకోలేదు. అయినా.. ఈ ముష్టిపొలం ఆ తాగుబోతెదవకి పొతే నాకేంటి? పిచ్చిముండ రంగికి పొతే నాకేంటి? సత్తెం జెప్పడానికి నేనేమన్నా అరిచ్చంద్రుణ్ణా? కాదుగదా! మరెందుకు నాకీ ధర్మసంకటం?'

మందు బాగా పనిచేసింది. ప్రెసిడెంటుకి కత్తిలాంటి ఐడియా తట్టింది.
                   
మర్నాడు.. అప్పుడెప్పుడో కోర్టు డఫేదారుగా పనిచేసిన తాగుబోతు కిట్టయ్యని పోరుగూర్నించి పిలిపించాడు. విషయం వివరించాడు. అతనికి సహాయంగా పదోక్లాసు పదిసార్లు తప్పి.. రోడ్లెంట జులాయిలుగా తిరుగుతున్న ఓ నలుగురు కుఱ్ఱాళ్ళనీ అదే ఊర్నించి పిలిపించాడు.

'ఈళ్ళందరూ ఓ కమిటీ.' అన్నాడు ప్రెసిడెంటు.

'కమిటీ అంటే ఏంది?' అనడిగారు ఊరిజనం.

'ఈళ్ళు మీరు జెప్పేది రాసుకుంటారు. ఆ తరవాత నాకు సలహా ఇస్తారు. అప్పుడు మీకు నేన్నాయం జేస్తాను.' అన్నాడు ప్రెసిడెంటు.
                   
కిట్టయ్య తన నలుగురు అసిస్టెంట్లతో కలిసి రంగీ, రంగడి బంధువులందర్నీ కలిశాడు. వాళ్లందరూ చెప్పింది రాసుకున్నాడు. ఎవరేం చెప్పినా రాసుకున్నాడు. తాము చెప్పే సోదంతా కమిటీ రాసుకోవటం ఊళ్ళోవాళ్ళకి భలే నచ్చింది. ఒక్కోడు చేటభారతాలు చెప్పాడు. కమిటీ మెంబర్లు బస్తాల కొద్దీ కాయితాలు నింపేశారు. ఊళ్ళో ఉన్న జనంకన్నా అభిప్రాయాలు ఎక్కువున్నై!
                   
తనకి అనుకూలంగా తీర్పు రావాలని వేడుకుంటూ.. కమిటీకి ఆరంగారంగా విస్కీ, బ్రాందీలు పోయించాడు రంగడు. రకరకాల మాంసాలతో వేపుళ్ళు వడ్డించాడు. బొమ్మిడాయిల పులుసు ఇళ్ళకి పంపించాడు. 'టీ' ఖర్చులకంటూ కొంతపైకం జేబులో కుక్కాడు.

రంగి కూడ అప్పోసప్పో చేసి బాగానే ఖర్చు పెట్టింది. ఆవిధంగా ఇరువైపులా తినీ, తాగీ.. తాగీ, తినీ.. ఆయాసం, రొప్పు రాగా మత్తుగా నిద్రపొయ్యారు. ఆపై నిద్రలేచి.. బద్దకంగా ఒళ్ళిరుచుకుంటూ.. నివేదిక అంటూ జోగినాధానికి ఒక 'సీల్డ్ కవర్' ఇచ్చాడు తాగుబోతు కిట్టయ్య.


ఊరి జనమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ప్రెసిడెంట్ సమక్షంలో సీల్డ్ కవర్ విప్పాడు జోగినాధం. అక్షరాలు కూడబలుక్కుంటూ పెద్దగా చదవసాగాడు.
                   
"ఆప్షన్ 1.రంగీ, రంగడు కలిసుండాలి. ఇది హిందూధర్మం."

రంగడు వైపోళ్ళు ఈలలేస్తూ డ్యాన్సు చెయ్యనారంభించారు. కళ్ళజోడు సరిచేసుకుంటూ ఆపమన్నట్లు చెయ్యి పైకెత్తి సైగ చేసాడు జోగినాధం.
                   
"ఆప్షన్ 2.తప్పనిసరైతే.. రంగీ, రంగడూ విడిపోవచ్చు. రంగి తనపొలం పుట్టింటికి తీసుకుపోవచ్చు."

ఈసారి రంగివైపు హర్షధ్వనాలు. మళ్ళీ చెయ్యెత్తాడు జోగినాధం!
                     
"ఆప్షన్ 3.రంగీ, రంగడు కలిసి విడిపోవచ్చు. విడిపోయి కలిసుండొచ్చు. కొన్నాళ్ళు కలిసి ఇంకొన్నాళ్ళు విడిపోవచ్చు."
                     
జనాలకి విషయం అర్ధమైంది. కిట్టయ్య కోసం వెతికారు. ఇంకెక్కడి కిట్టయ్య? ఎప్పుడో జారుకున్నాడు. జనాలు కిట్టయ్యని బూతులు తిడుతుంటే.. మీసాలచాటున ముసిముసిగా నవ్వుకున్నాడు ప్రెసిడెంట్.

షరా మామూలే. మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు.

మళ్ళీ రంగి అన్న తాగి తూలుకుంటూ ప్రెసిడెంటు మీదకెళ్ళాడు.
                       
ప్రెసిడెంటు ఆలోచించాడు.

"ఇప్పుడు మన ఇస్కూలు పంతులుతో ఒక ఏకసభ్య కమిటీ వేస్తున్నా." అంటూ ఆ ఊరి ప్రాధమిక పాఠశాల ఏకైక టీచరుకి కమిటీ బాధ్యతలప్పచెప్పాడు.

అసలే కూతురి పెళ్లి ఇబ్బందుల్లో ఉన్న పంతులు వణికిపొయ్యాడు. ఆరాత్రి మందుకొట్టే సమయంలో పంతులు చక్కబెట్టాల్సిన రాచకార్యాన్ని గీతోపదేశం చేశాడు ప్రెసిడెంటు. 'హమ్మయ్య' అనుకున్నాడు పంతులు.                


కొన్నాళ్ళకి అందరూ ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ఉదయం నుండి జోగినాధం టెన్షన్ తో చస్తుంటే.. ప్రెసిడెంటు ఆకాశమంటూ, మర్డరంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. అదీ కథ.

ఇప్పుడు విషయంలోకి వద్దాం.
                   
పంచాయితీ మొదలయ్యింది. పంతులు ఏవో చాలా పుస్తకాలు ప్రెసిడెంటు ముందుంచాడు. అవ్వన్నీ స్కూలు పిల్లల పరీక్షల తాలూకా నోటు పుస్తకాలు. ఆ సంగతి ఊర్లోవాళ్ళకి తెలీదు.

ఆ పుస్తకాల్ని చూసి 'అబ్బో! ఏదో అనుకున్నాం. ఇస్కూలు పిల్లకాయల నోటు బొక్కుల్నిండా పంతులు కూడా శానా రాసాడే!' అని మెచ్చుకున్నారు.

ఒక సీల్డ్ కవర్ జోగినాధానికి ఇచ్చాడు పంతులు.
                   
జోగినాధం ఆత్రంగా కవరు చించి ఒక పెద్ద కాగితం బయటకి  తీసాడు.

"ఇది సున్నిత సమస్య"

అని కాగితం మధ్యలో తాటికాయంత అక్షరాలతో రాసుంది.

తెల్లమొహంతో వెర్రిచూపులు చూస్తున్న జోగినాధానికి కన్ను కొట్టాడు ప్రెసిడెంటు.
                   
అర్ధం చేసుకున్న జోగినాధం "అయ్యబాబోయ్! సున్నిత సమస్యే!" అంటూ గుడ్లు తేలేశాడు.
                   
జోగినాధం చేతిలోని కాగితాన్ని తీసుకుని ఊరందరికీ చూపిస్తూ గంభీరంగా అన్నాడు ప్రెసిడెంటు.

"విన్నారుగా. ఇది సున్నిత సమస్య. అయినా తీర్పు చెప్పమంటే చెబుతా. కానీ.. ఆపై జరిగే అరిష్టానికి నేను బాధ్యణ్ణి కాను."  
                   
ఊళ్ళోవాళ్ళు అరిష్టం అనంగాన్లే భయపడిపోయారు. ఈమధ్యనే ఊర్లో అమ్మోరు పోసి నలుగురు చచ్చారు. కంగారుగా 'వద్దు, వద్దు, మాకు ఏ నాయం అక్కర్లేదు.' అంటూ పారిపోయారు.
                   
రంగి అన్నకి ఇందులో కుట్ర కనిపించింది. సున్నిత సమస్యంటే ఏందో చెప్పాల్సిందేనని తాగి ప్రెసిడెంటుని నిలదీశాడు. చిత్రం! ఆ అర్ధరాత్రి అతని గుడిసె పూర్తిగా ఎవరో కావాలని తగలబెట్టినట్లు కాలిపోయింది. ఆవిధంగా రంగి తాగుబోతు అన్నకి కూడా సున్నిత సమస్యంటే ఏంటో అర్ధమైపోయింది.
                   
ఆరోజు నుండి ఎవరూ రంగికి న్యాయం కావాలని అడగలేదు.

'పాపం! పెసిడెంటుబాబు దరమపెబువు. రంగికి నాయం చేద్దామని మాలావు పెయత్నం జేశాడు. కానీ.. ఆ ఇస్కూలు పంతులు ముందర కాళ్ళకి బందం ఏసాడు. ఆ బాబు ఊరి మేలు కోరేవాడు కాబట్టి నోరిప్పలేకపోతున్నాడు.' అనుకుని రంగివైపువాళ్ళు ఉసూరుమన్నారు.

'పెసిడెంటు మన మడిసి కాబట్టే చక్రం అడ్డేసాడు.' అని రంగడిముఠా సంతోషించింది.

ఈతీర్పు దెబ్బతో ప్రెసిడెంటు బంపర్ మెజారిటీతో ఎలక్షన్లో మళ్ళీ గెలిచాడు.


ఇంతకీ రంగీరంగళ్ళు ఏమయ్యారు?

ఈ సున్నిత సమస్య డ్రామా తన సమస్య తీర్చటం కోసం కాదనీ, ప్రెసిడెంటు ఓట్ల డ్రామా అని అర్ధమైన రంగికి పిచ్చెక్కింది. ఆ తరవాత ఇల్లిడిచి ఎటో పోయింది.

ఈ అన్యాయం తట్టుకోలేక రంగి అన్న తాగి రంగణ్ణి పొడిచేశాడు. రంగి అన్నని రంగడి తమ్ముడు పొడిచేశాడు. ఈ కత్తిపోట్ల పరంపర నేటికీ సాగుతూనే ఉంది. ఆఊళ్ళో సగంమంది యువకులు జైళ్ళల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన సగంమంది మందుకొట్టి రోడ్లమీద పొర్లుతున్నారు.
                   
ఒకప్పుడు పచ్చని చేలతో కళకళ్ళాడిన ఆఊరు నేడు వల్లకాడయ్యింది. ఆ తరవాత ప్రెసిడెంటుని ఎదురొడ్డేవాడే లేకుండాపొయ్యాడు. చచ్చేదాకా ఆయనే ఆఊరిని ఏలాడు. ఒక రోడ్డుగానీ, ఒక ప్రభుత్వ పథకంగానీ.. ఆఊరు చేరదు. అడిగే దిక్కు లేదు. అడిగినా.. సున్నిత సమస్యంటూ ప్రెసిడెంటు తీర్పు చెప్తాడనే భయం!
                   
అప్పట్నించీ ఆఊరుకి 'సున్నిత సమస్యాపురం'గా పేరొచ్చింది.

ఇప్పుడు బస్సుల మీద కూడా పేరు కుదించి 'ఎస్.ఎస్.పురం' అని రాస్తున్నారు."  

(picture courtesy : Google)