Showing posts with label గురువుగారు. Show all posts
Showing posts with label గురువుగారు. Show all posts

Friday, 25 July 2014

గురువుగారికి నివాళి


శ్రీ పరిమి ఆంజనేయశర్మగారు మా గురువుగారు. వారు మొన్న ఇరవైయ్యో తారీఖున మరణించారన్న వార్త చదవంగాన్లే మనసంతా భారంగా అయిపోయింది. గురువుగారు పెద్దవారైపొయ్యరు, ఆయనకి సమయం వచ్చింది, వెళ్ళిపొయ్యారు. అవున్నిజమే, వ్యక్తులు మనకి ఎంత ఇష్టమైనా (ప్రకృతి విరుద్ధంగా) మనకోసం ఎన్నాళ్ళైనా అలాగే వుండిపోరు కదా? ఈ విషయం నాకూ తెలుసు. కానీ నేనేం చెయ్యను? నాకు చాలా దిగులుగా వుంది.

మనకి జీవితంలో అనేకమంది తారసపడుతూనే వుంటారు. వారిలో అతి అరుదుగా మాత్రమే కొందరు వ్యక్తులు మనని ప్రభావితం చేస్తారు, మనసులో చెరగని ముద్ర వేస్తారు. అటువంటి అరుదైన వ్యక్తుల్లో శ్రీ పరిమి ఆంజనేయశర్మగారు ఒకరు (గురువుగారి జ్ఞాపకాలు.. నా బాలకృష్ణ అభిమానం!). వారు నాకు పాఠాలు చెప్పి నలభయ్యేళ్ళు దాటింది. నేను వారి శిష్యుడినవడం నా అదృష్టంగా భావిస్తున్నాను, వారితో ఇంటరాక్ట్ అయిన ప్రతిక్షణాన్నీ అపురూపంగా భావిస్తున్నాను.

నేను గుంటూరు గురవయ్య హైస్కూల్లో చదువుకున్నాను. మా గురువుగారు నాకు వరసగా మూడేళ్ళపాటు సైన్స్ టీచర్. ఆయన తెల్లగా, బొద్దుగా, చిరుబొజ్జతో, జులపాల జుట్టుతో - తెల్లని పంచె, లాల్చీతో మెరిసిపోతుండేవారు. మా స్కూల్లో మంచి సైన్స్ లాబ్ ఉంది. గురువుగారికి సైన్స్ ప్రయోగాలు చేసి చూపించడం చాలా ఇష్టం. తెల్లటి జుబ్బాలోంచి తెల్లటి చేతులతో ఆ టెస్ట్ ట్యూబులు, పిపెట్లతో ఆయన చేసే విన్యాసాలు గమ్మత్తుగా అనిపించేవి.

ఒక్కోసారి ఆయన మమ్మల్నందర్నీ దూరంగా జరగమని, లక్ష్మీ ఔటు పేల్చేప్పుడు తీసుకునే జాగ్రత్తల్లాంటివి తీసుకుని, బర్నర్ మీద టెస్ట్ ట్యూబులోని ద్రవాల్ని వేడి చేస్తుండేవాళ్ళు. అప్పుడు టెస్ట్ ట్యూబులోంచి అన్నం ఉడుకుతున్నట్లు 'గుడగుడ'మని బుడగలొచ్చేవి, 'బుసబుస'మంటూ పొగలొచ్చేవి.

మాకా ల్యాబ్‌లోని కెమికల్స్ నుండి వచ్చే ఘాటైన వాసనలకి కళ్ళు మండేవి, దగ్గొచ్చేది. గురువుగారు మా అవస్థకి తెగ సంతోషించేవారు! 'ఒరే నానా! మీరీ ఘాటు అనుభవించి తీరాలి. ఇదో గొప్ప అనుభవం. గొప్పశాస్త్రవేత్తలు ఇట్లాంటి చోటే గొప్ప విషయాలు కనిపెట్టారు. మీకు బోర్డు మీద చాక్‌పీసుతో గీస్తూ ఎన్నిరోజులు పాఠాలు చెప్పినా, ఈ ల్యాబ్ అనుభవం రాదురా.' అనేవారు.

మా మాస్టారు ఒక్కోసారి మమ్మల్ని వెంటేసుకుని (మ్యూజియం చూపిస్తున్నట్లుగా) ల్యాబ్‌లోని వివిధ పరికరాల్ని, ద్రవాల్ని చూపిస్తూ వివరంగా చెప్పేవారు. నాకు ఆయనతో సమయం చాలా ఉత్సాహంగా ఉండేది. పాఠం మధ్యలో సడన్‌గా ఆపి 'నానా! ఈ నెల చందమామ చదివారా? చదవండి నానా. మీరు చందమామ రెగ్యులర్‌గా చదవాలిరా.' అనేవారు.

మా మాష్టారు పిల్లలతో సమయం గడపడం ఉద్యోగ ధర్మంగా భావించలేదు. నాకాయన పిల్లలకి పాఠాలు చెప్పడం, వారితో నిరంతరం వారి భాషలోనే కమ్యూనికేట్ చెయ్యడం.. బాగా ఎంజాయ్ చేశారనిపిస్తుంది. లేకపోతే వారు మాలో ఒకడిగా అంతలా కలిసిపొయ్యేవారుకాదు.

'ఈయన నోట్సు ఇవ్వడు, నోట్సు రాయనివ్వడు. టెక్స్టు బుక్కే చదవాలంటాడు, ఐఎంపి (important) చెప్పడు. పాఠాన్ని పాఠంలాగా కాకుండా ప్రశ్నలు, జవాబులు కార్యక్రమంలాగా విచిత్రంగా చెబుతాడు. చూసి అర్ధం చేసుకోవాలంటాడు, ఇప్పుడీ ల్యాబులో మనని చావగొడుతున్నాడు.' అని  వెనకనుండి సత్తాయ్‌గాడు, భాస్కరాయ్‌గాడు ఒకటే సణుగుతుండేవాళ్ళు.

ఆంజనేయశర్మగారు ఒకసారి మా తెలుగు క్లాసులోకి 'మాస్టారూ! విత్ యువర్ పర్మిషన్.. వన్ మినిట్.' అంటూ వడివడిగా క్లాసులోకి వచ్చారు. ఆయన తెల్లని లాల్చీ ముందు కొంత భాగం చుక్కల్లాగా బొక్కలు, మరకలు! కుడి బొటనవేలు, చూపుడు వేళ్ళు పసుపుగా వున్నాయి. ఆయన తన లాల్చీ, వేళ్ళని ప్రదర్శనగా చూపిస్తూ క్లాసంతా ఆ చివర్నుండి ఈ చివర దాకా హడావుడిగా తిరిగారు.

'నానా! ఇవ్వాళ C సెక్షన్ వాళ్ళకి ప్రయోగం చేసి చూపిస్తున్నప్పుడు టెస్ట్‌ట్యూబ్ పగిలింది. సల్ఫ్యూరిక్ ఏసిడ్ మీదకి చిందింది. అది మన వంటిమీద, బట్టల మీద పడితే ఏమవుతుందో మీరు పుస్తకంలో చదువుకున్నారు. ఇప్పుడు నన్ను చూస్తే మీకు ఇంకా బాగా అర్ధమవుతుందని చూపించడానికి వచ్చాను.' అన్నారు. ఆపై తెలుగు మేస్టారుకి థాంక్స్ చెబుతూ నిష్క్రమించారు.

తెలుగు మాస్టారు ఆయన వైపు ఆశ్చర్యంగా చూశారు. మా గురువుగారి బాడీ లాంగ్వేజి కొందరికి చాదస్తంగా అనిపించవచ్చు. కానీ - పిల్లలకి విషయం అర్ధమయ్యేట్లు చెప్పాలి అనే తపన తప్ప ఆయనికి ఇంకేవీ పట్టవు!

అన్నట్లు - గురువుగారు నాతో కథలు రాయించేవారు! అవి ఎక్కువగా రాజుగారి కూతుర్ని రాక్షసుడు ఎత్తుకుపోవటం, హీరో మంత్రశక్తుల సాయంతో రాజకుమారిని తీసుకొచ్చివ్వడం వంటి చందమామ కాపీ కథలే. అయితే అవి ఆయనకి నచ్చేవి! వాటిని క్లాసులో నాతో బిగ్గరగా చదివించేవారు. ఆయన అలా చెయ్యడం నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి దోహదపడింది. అంతకుముందు ముంగిలా మూలనుండే నేను ధైర్యంగా లేచి నిలబడి పాఠాల్లో డౌట్లు అడగడం ప్రారంభించాను. ఇది నాకు గురువుగారు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తాను.

ఆ రోజుల్లో ఎటెండెన్స్ వుంటే చాలు, ప్రమోట్ చేసేవాళ్ళు. ఆయన నాకు తొమ్మిదో తరగతి క్లాస్ టీచర్. తొమ్మిది సంవత్సారాంతాన రిజిస్టర్లలో ఎటెండెన్స్ టాలీ చెయ్యటానికి నన్ను వారి ఇంటికి రమ్మన్నారు. అప్పుడు అరండల్‌పేటలోని వారి ఇంటికి వెళ్ళాను.

ఆయనా, నేనూ ఇంటి ముందున్న చెట్టు కింద, అరుగు మీద చాపేసుకుని కూర్చున్నాం. మాస్టారు మొత్తం రిజిస్టర్లు నాముందు పెట్టారు. ఒక్కో విద్యార్ధి పేరు రాసి ఆ పేరు ముందు వారి హాజరైన దినాలు టాలీ చేసి రాయమన్నారు. ఆయనకి ఒక పిల్లవాడు (వారి అబ్బాయనుకుంటాను) స్టీలు గ్లాసులో కాఫీ తెచ్చిచ్చాడు. వారు కూనిరాగాలు తీస్తూ, చప్పరిస్తూ కాఫీని ఎంజాయ్ చెయ్యసాగారు.

నాపని - ఎటెండెన్స్ తక్కువైనవాడి పేరు మాస్టారుకి చెప్పాలి.

'శాస్త్రికి పదిరోజులు తగ్గాయండి.'

'ఒరెఒరె! మన శాస్త్రి లవకుశ పాటలు ఎంత బాగా పాడతాడ్రా! వాడికి ఆ పదిరోజులు ఎడ్జస్ట్ చెయ్యి నానా!' అన్నారు.

లవకుశ పాటలు చక్కగా పాడితే ఎటెండెన్స్ ఎందుకు సరిచెయ్యాలి? నాకర్ధం కాలేదు, బుర్ర గోక్కున్నాను. రిజిస్టర్లలో ఏబ్సెంట్ అయినచోట ఏబ్సెంట్ మార్క్ చెయ్యకుండా చుక్క పెట్టి వుంటుంది. అక్కడక్కడా ఒక పది చుక్కల్ని P గా మార్చాను.

'కృష్ణకి ఇరవై రోజులు తగ్గిందండి.'

'ఒరెఒరె! మన కృష్ణ ఎన్నముద్దాలె చాలా మంచివాడ్రా. పాపం! తండ్రి లేని పిల్లాడు, వాడిక్కూడా ఎడ్జస్ట్ చెయ్యి నానా!'

కృష్ణకి సరిచేశాను.

'సత్తాయ్, భాస్కరాయ్‌లకి బాగా తక్కువైందండి.'

వీళ్ళిద్దరి గూర్చి ఇంతకుముందు నా 'గురజాడ' కష్టాలు!  లో రాశాను. వీళ్ళు క్లాసులో చేసే గోల అంతింత కాదు.

ఇప్పుడు మాత్రం గురువుగారు ఖచ్చితంగా 'వెధవలకి బుద్ధి రావాలి. ఎడ్జస్ట్ చెయ్యకు.' అంటారు. క్లాసులుకి సరీగ్గా రాకుండా గొడవ చేసేవాళ్ళ పట్ల మాస్టారు ఎందుకు జాలి చూపుతారు? చూపరు. అదీగాక మొన్ననే వాళ్ళు గోడ దూకి పారిపోతూ మాస్టారుగారికి  పట్టుబడ్డారు కూడా.

'ఆ వెధవలకి తగ్గుతుందని ముందే ఊహించాను. వాళ్ళు క్లాసుకి వస్తే మనకి ఇబ్బంది గానీ, రాకపోతే మంచిదేగా? వాళ్ళక్కూడా ఎటెండెన్స్ సరిచెయ్ నానా!' అన్నారు గురువుగారు.

నేను ఆశ్చర్యపొయ్యాను.

'సత్తాయ్, భాస్కరాయ్‌లక్కూడానా.. ' నమ్మలేనట్లుగా అన్నాను.

ఆయన మొహమాటంగా నవ్వారు.

'నానా! మనమందరం కోతి నుండే వచ్చాం. ఈ వెధవాయిలిద్దరూ మనకి మన పూర్వీకుల్ని గుర్తు తెస్తుంటారు. అంతేగా! అయినా - పిచుకల మీద బ్రహ్మాస్త్రాలు దేనికి నానా?' అన్నారు.

ఆయనకి సత్తాయ్, భాస్కరాయ్‌ల పట్ల కూడా ప్రేమ చూపించడం (ఆరోజు) నాకు అర్ధం కాలేదు. గురువుగారి సమస్యల్లా తను కఠినంగా ఉండలేకపోవటమే! అది ఆయన బలహీనత! ఆయనకి బాగా చదివేవాడన్నా, చదవనివాడన్నా.. అందరూ ఇష్టమే! ఇదెలా సాధ్యం? ఇప్పుడు నాకనిపిస్తుంది - ఆయన మార్కుల్ని బట్టి విద్యార్ధుల్ని ప్రేమించలేదు. ఆయన విద్యార్ధుల్ని మనుషులుగా ఇష్టపడ్డాడు.

ఆరోజు అక్కడ జరిగిన కార్యక్రమం క్లాసులో వున్న అందరూ పాసయ్యేలా ఎటెండెన్స్ సరిచెయ్యడమే! నేను లేచి వచ్చేస్తుండగా 'పిల్లలకి చదువు పట్ల ఇంటరెస్ట్ వుండి స్కూలుకి రావాలి గానీ, ఈ పాడు రిజిస్టర్ల గోలేమిట్రా! గవర్నమెంటుకి బుర్ర లేదు.' అని విసుక్కున్నారు. అర్ధమైంది, ఆయనకిదంతా తప్పక చేస్తున్నారు.

పదో తరగతి - ఏదో ఇంటర్నల్ పరీక్ష. ఒకడు మా దుర్భాకుల సూరిగాడి దాంట్లోంచి తీవ్రంగా కాపీ కొట్టి రాస్తున్నారు. అటువైపుగా వెళ్తున్న గురువుగారి కంట్లో ఇది పడింది. ఆయన హడావుడిగా లోపలకొచ్చారు.

'నానా! ఇక్కడ కాపీ కొట్టి రాస్తున్నావు. రేపు పబ్లిక్‌లో నీకు ఈ సౌకర్యం వుండదు కదా? అయినా ఈ పరీక్షల్లో ఎన్ని మార్కులొస్తే మాత్రం ఏముంది? ఒకపని చెస్తాను, నీ పేపర్ నేను కరెక్ట్ కూడా చెయ్యను, ఈ పరీక్షకి నీదే ఫస్ట్ మార్క్. సరేనా? చూడకుండా రాయి నానా! నీకెంత సబ్జక్ట్ వచ్చో, ఎంత రాదో తెలుస్తుంది.' చాలా ఇబ్బంది పడుతూ ఆ కాపీ కొట్టేవాడికి చెప్పారు గురువుగారు.

ఆయన గూర్చి ఇంకో ఉదంతం రాసి ముగిస్తాను. అప్పుడు నేను హౌస్ సర్జన్సీలో వున్నాను. వారి అబ్బాయికి హిందూ కాలేజి సెంటర్లో సిటీ బస్సు ఏక్సిడెంట్ అయ్యిందని విని ఆర్ధోపెడిక్ వార్డుకి వెళ్ళాను. ఆ బాబుని పలకరించి, దెబ్బల వివరాల కోసం కేస్ షీట్ చదువుతున్నాను.

అప్పుడు అక్కడున్న హెడ్‌నర్స్ అన్న మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను.

'నేను నా సర్వీసులో ఎందరో వీఐపీలని చూశాను. కానీ ఈ పేషంట్ గూర్చి వచ్చినన్ని ఎంక్వైరీలు ఎప్పుడూ చూళ్ళేదు. సూపర్నెంటుగారు, ప్రిన్సిపాల్‌గారైతే గంటగంటకీ ఫోన్లు.'

'ఈ పేషంటు మా గురువుగారి అబ్బాయి, స్టాఫ్!' అన్నాను నేను.

'ఏం గురువుగారో ఏమో! ఇక్కడ మేం టెన్షన్‌తో చస్తున్నాం. 'మా గురువుగారబ్బాయి' అంటూ డాక్టర్లు క్యూ కట్టినట్లు వచ్చి ఆ బాబుని చూసి పోతున్నారు.' అని నిట్టూర్చింది. అంటే మా గురువుగారికి నాలాంటి శిష్యపరమాణువులతో ఒక భక్తబృందమే ఉన్నదన్నమాట!

దేశసేవ అనగానేమి? యుద్ధంలో శతృసైనికులతో పోరాడుట, సమాజసేవ చేయుట అంటూ చెబుతుంటారు. అలాగే - సమాజానికి పనికొచ్చే వృత్తులు కూడా చాలానే వున్నాయి. అందులో ఉపాధ్యాయ వృత్తి ముఖ్యమైనది. ఆ ఉపాధ్యాయ వృత్తిలో తనదైన ముద్రతో, నాలాంటి ఎందరికో స్పూర్తిని ప్రసాదించి మా గురువుగారు కూడా దేశసేవ చేశారు. ఆయన ధన్యజీవి.

మాస్టారూ! మీకు నమస్సుమాంజలులు.

ముగింపు -

ఒరే వెధవాయ్! ఏవిట్రా ఇది? నాగూర్చి ఏవిటేవిటో రాసేశావు! అందరూ కులాసానేనా! నీ బ్యాచ్‌వాళ్ళు గోవిందరాజువాడు, గంటివాడు, దావులూరివాడు, మల్లాదివాడు, స్టేషన్ మాస్టరుగారబ్బాయ్.. అందర్నీ అడిగానని చెప్పు నానా! ఉంటా నానా! ఒరిఒరి! ఎందుకురా ఆ కన్నీళ్ళు? నేనెక్కడికి పోతాను? ఎక్కడికీ పోను, మీ అందరూ నన్నెప్పుడూ తల్చుకుంటూనే వుంటారుగా! నాకేం పర్లేదు నానా!

కృతజ్ఞతలు -

లలిత గారికి. 

(picture courtesy : Google)

Friday, 2 March 2012

గురువుగారి జ్ఞాపకాలు.. నా బాలకృష్ణ అభిమానం!

నాకు బాలకృష్ణ అంటే ఇష్టం, అట్లని నేను బాలకృష్ణ అభిమానిని కాను. బజ్జీలంటే ఇష్టమేగానీ, బజ్జీలు తినను అన్నట్లు కంఫ్యూజింగ్‌గా వుందికదూ! చదువరులు నన్ను మన్నించాలి, విషయం తెలియాలంటే నా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళాల్సిందే!

అవి నేను గుంటూరు మాజేటి గురవయ్య హైస్కూల్లో పదోక్లాసు చదువుతున్న రోజులు. సుబ్బారావు నాకు క్లాస్మేట్. బోర్లించిన మరచెంబు మొహంతో, గుండ్రంగా కార్టూన్ కేరక్టర్లా వుంటాడు. అప్పుడే నిద్ర లేచినట్లు మత్తుగా, బద్దకంగా వుంటాడు. రోజూ తలకి దట్టంగా ఆవఁదం పట్టిస్తాడు. నుదుటిమీదా, మెడవెనుకా ఆవఁదం మరకలు మరియూ ఆవఁదం కంపు. అంచేత సుబ్బారావు 'ఆవఁదం సుబ్బడు'గా ప్రసిద్ధుడయ్యాడు.

ఆవఁదం సుబ్బడికి చదువంటే అమితమైన ఆసక్తి. పొద్దస్తమానం పుస్తకంలోకి తీవ్రంగా చూస్తూంటాడు, సీరియస్‌గా వల్లె వేస్తుంటాడు. కానీ పాపం! సుబ్బడికి నత్రజనికీ, నక్షత్రానికీ తేడా తెలీదు. గాంధీ గోడ్సే అన్నదమ్ములంటాడు. అమీబాకీ అమెరికాకి యేదో సంబంధం వుందని అనుమానిస్తాడు. సహజంగానే సుబ్బడికీ యేనాడూ పదిమార్కులుకూడా రాలేదు.

డబుల్ డిజిట్స్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న మా సుబ్బడు, వున్నట్టుండి ఒకసారి సైన్స్‌లో పాసైపొయ్యాడు! నాపక్కనున్నవాడు కూపీలు లాగడంలో సిద్ధహస్తుడు. క్షణకాలంలో సుబ్బడి ఆన్సర్ షీట్‌ని స్కాన్ చేసేశాడు. సుబ్బడు ఆన్సర్ షీట్ పాసయ్యేంతగా లేదనే రహస్యాన్ని నాచెవిలో వూదాడు.

మాకు సైన్స్ టీచర్ పరిమి ఆంజనేయశర్మగారు. ఆయన తెల్లగా, లావుగా, చిరుబొజ్జతో.. తెల్లని పంచె, లాల్చీతో.. పొడుగుజుట్టుతో.. కూనిరాగాలు తీస్తుంటారు. ఆయన పిల్లల్లో పిల్లాడు. అంచేత సరదాగా, హాయిగా పిల్లలతో కలిసిపొయ్యేవారు. అయన విద్యార్ధుల పట్ల మొరటుగా ప్రవర్తించరు, కనీసం పరుషంగానైనా మాట్లాడరు.

ఆంజనేయశర్మగారు సైన్సు పాఠాన్ని ఒక కథలాగా చెప్తారు, ఆ విధానం చాలా అసక్తిగా వుంటుంది. వారు నోట్సులకి వ్యతిరేకి, టెక్స్ట్‌బుక్స్ మాత్రమే చదవాలి. పాఠం అయ్యాక మేం డౌట్లు అడగాలి, ఆ డౌట్ల నివృత్తి కోసం క్లాసు చివర్లో కొంతసమయం కేటాయించుకునేవారు. ఈ ప్రశ్నలు సమాధానాల సెషన్ చాలా ఉత్సాహభరితంగా, వివరణాత్మకంగా వుంటుంది. అంతే! పాఠం అయిపోయింది, ఇంకేం లేదు. ఇదే మా మాస్టారి బోధనాపధ్ధతి.

మాకాయన బెస్ట్ ఫ్రెండ్ కూడా. నేను ప్రభుత్వ గ్రంధాలయంలో చందమామ రెగ్యులర్‌గా చదివేవాణ్ని, అక్కడ పాత చందమామలు సంవత్సరాల వారిగా హార్డ్‌బౌండ్ చేసి ర్యాకుల్లో నీట్‌గా సర్ది వుంచేవాళ్ళు. ఆ చందమామలు నాకు విందుభోజనంతో సమానం. మాస్టారుకి నా చందమామల పిచ్చి తెలుసు. అంచేత క్లాసులో నాతో పిల్లలకి చందమామ కథలు చెప్పించేవారు. గమ్మత్తేమంటే పిల్లలతోపాటు ఆయనకూడా శ్రద్ధగా నా కథలు వినేవారు! ఒక కథని వినేవాళ్ళకి ఆసక్తిదాయకంగా వుండేందుకు నాటకీయంగా ఎలా చెప్పాలో కూడా టిప్స్ ఇచ్చేవారు.

సరే! మనం మళ్ళీ మన ఆవఁదం సుబ్బడి మార్కుల విషయానికొద్దాం. సుబ్బడికి పొరబాటున మార్కులు ఎక్కువేసిన విషయం ఆయన దృష్టికి తీసికెళ్ళాను. ఆయన చిన్నగా నవ్వారు, ఆ తరవాత ఒకక్షణం ఆలోచించారు. ఆపై రహస్యం చెబుతున్నట్లు లోగొంతుకతో ఇలా అన్నారు -

"ఒరే నానా! ఎప్పట్లాగే నీకు మంచిమార్కులు వచ్చాయిగదా. సుబ్బారావుతో నీకు పోటీ ఏంటి నానా? పాపం! ఆ వెధవాయ్ మార్కుల కోసం తెగ కష్టపడుతున్నాడు నానా. ఇంతకు ముందుకన్నా చాలా ఇంప్రూవ్ చేశాడు. వాడినిప్పుడు పాస్ చెయ్యకపోతే అసలు చదువు మీదే ఇంట్రస్ట్ పోతుంది. ఈ సంగతి వాడికి తెలీనీకు నానా, తెలిస్తే హర్టవుతాడు." ('నానా!' అనేది మాస్టారి ఊతపదం.)

నాకప్పుడర్ధమైంది. గురువుగారు పేపర్ దిద్దడంలో కేవలం పరీక్షల కోణం మాత్రమే కాకుండా ఇతర అంశాల్ని కూడా అలోచిస్తారని! నేను మా గురువుగారికి శిష్యుణ్ని. అంచేత ఆయన ఆలోచనా సరళిని అనుకరిస్తాను. సుబ్బడువంటి కష్టజీవులపట్ల సానుభూతి, ఆదరణ, ప్రేమ కలిగి ఉండాలని వారి దగ్గరే నేర్చుకున్నాను.

ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ దగ్గరకొద్దాం. బాలకృష్ణంటే నాకెందుకు ఇష్టమో ఇప్పుడు మీకర్ధమైయ్యుంటుంది. బాలకృష్ణ డాన్స్ చేసే విధానం చూడండి. అందులో నాకు ఎంతో సిన్సియారిటీ కనిపిస్తుంది. ఎంతో కష్టపడి శరీరభాగాల్ని కదుపుతూ, ఆయాసపడుతూ, చిన్నప్పుడు మనం డ్రిల్ క్లాస్‌లో పడ్డ కష్టాలన్నీ పడతాడు. అతని పట్టుదల చూడ ముచ్చటగా వుంటుంది.

సినిమా రంగంలో కమల్ హాసన్, ప్రభుదేవా వంటి మంచి డ్యాన్సర్లు వున్నారు. వాళ్ళు వంకర్లు తిరిగిపోతూ డ్యాన్సులేస్తారు. ఇదేమంత విశేషం కాదు, విశేషమంటే బాలకృష్ణ డ్యాన్సే. ఆవఁదం సుబ్బడు పదిమార్కులు దాటడానికి పడ్డ తపన, శ్రమ నాకు బాలకృష్ణ డ్యాన్స్ చేసే ప్రయత్నంలో కనిపిస్తుంది!
                               
బాలకృష్ణ డైలాగుల్ని గమనించండి. అతనిలో తండ్రి గంభీరత, స్పష్టత, నైపుణ్యతలు లేశమాత్రమైనా లేవు. కానీ ఎంతో కష్టపడతాడు, శ్రమిస్తాడు. హోటల్ కార్మికుడు  పిండి రుబ్బినట్లు, కూలీవారు రాళ్ళు పగలకొట్టేట్లు.. అత్యంత ప్రయాసతో సంక్లిష్టమైన పదాలు, వాక్యాలు పలుకుతుంటాడు. గుండె ఆపరేషన్లు చేసే తండ్రికి పుట్టినందువల్ల కనీసం కాలు ఆపరేషనైనా చేద్దామనే తపన, ఆరాటం నాకు బాలకృష్ణలో కనిపిస్తుంది. ఎవరిలోనైనా ఈ గుణాన్ని మనం మెచ్చుకోవలసిందే.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కొందరు మహానుభావులు తోటికళాకారుల ప్రతిభాపాటవాల్ని ఖచ్చితత్వంతో విమర్శిస్తారు. శంకరాభరణం శంకరశాస్త్రి 'శారదా!' అనే గావుకేకతో కూతురిపెళ్లిని చెడగొట్టుకున్నాడు. ఆయన చెప్పదలచుకున్న సంగతి గావుకేక లేకుండా కూడా చెప్పొచ్చు. కానీ ఆయనలా చెప్పడు, చెబితే శంకరశాస్త్రి ఎలాగవుతాడు!?

మరప్పుడు ఆ శంకరశాస్త్రి మన బాలకృష్ణతో ఏంచెబుతాడు? - "చూడు బాలయ్యా! కళ అనేది కమ్మని ఫిల్టర్ కాఫీ వంటిది. ఆ స్వచ్చమైన కమ్మని కాఫీలో నీ నటన అనబడే ఈగపడి తాగడానికి పనికిరాకుండా చెయ్యరాదు. కాఫీ ఈజ్ డివైన్ వెదర్ ఇటీజ్ ఫిల్టర్ ఆర్ ఇన్స్టంట్." అని నిక్కచ్చిగా, నిర్దయతో చెప్పేస్తాడు.

ఒక మంచిప్రయత్నాన్ని నీరుగార్చే ఎస్వీరంగారావు మార్కు ధోరణి నాకు నచ్చదు. అన్నట్లు ఎస్వీరంగారావు బాలకృష్ణ పౌరాణిక సినిమా చూస్తే ఏమంటాడు? గద పైకెత్తి పట్టుకుని, క్రోధంతో మీసం మెలిస్తూ, ఈవిధంగా గర్జిస్తాడు.

"తుచ్ఛఢింభకా! ఏమి నీ భాష? నీ భాషాహననము కర్ణకఠోరముగా యున్నది. యేమి నీ హావభావములు? వీక్షించుటకు మనసు రాకున్నది. దీన్ని నటన అందువా బాలకా? ఇది యేదైనా అగునేమో గానీ నటన మాత్రం కానే కాదు. ఓయీ భాషా హంతకా! నటనా శూన్యా! అద్భుత ప్రతిభాశాలియైన నీతండ్రి నా మదీయ మిత్రుడైన కారణాన నిన్ను ప్రాణములతో వదిలివేయుచున్నాను. నీవు ఇప్పుడే కాదు, భవిష్యత్తునందు కూడా ఎక్కడైనా ఎప్పుడైనా డైలాగులు చెప్పజూచితివా - నా గదాదండమున నీతల వేయిచెక్కలు గావించెద. నీకిదియే నాతుది హెచ్చరిక."

అదే మా గురువుగారైతే ఏం చేసేవారు? బాలకృష్ణకి షేక్‌హ్యాండ్ ఇస్తారు, ఆప్యాయంగా కౌగిలించుకుంటారు, మెచ్చుకోలుగా భుజం తడతారు. ఆ తరవాత సంతోషంగా ఇలా అనేవారు.

"నానా బాలయ్యా! చాలా బాగా చేశావ్. నాకు నీలో పెద్దాయన కనబడుతున్నారు నానా. నీకు తొంభై మార్కులు వేస్తున్నా, ఇంకొంచెం కష్టపడు నానా. నీ తండ్రిగారి స్థాయిని తప్పకుండా అందుకుంటావ్. నువ్వు ఈసారి వందమార్కులు తెచ్చుకోవాలి నానా!"

మా గురువుగారు సహృదయులు, అమాయకులు. అందువల్ల ఆయనకి ప్రతిభ ఒకాటే కాదు, ప్రయత్నం కూడా గుమ్మడికాయంత సంతోషాన్నిస్తుంది. గురువుగారి ప్రోత్సాహంతో ఆవదం సుబ్బడు తీవ్రంగా, ఘోరంగా, బీభత్సంగా తపస్సు చేసి అత్తెసరు మార్కులతో పదోక్లాసు గట్టెక్కాడు. అటుపిమ్మట ఉన్నతోద్యోగంలో ఉన్న తన మేనమామ సాయంతో ఒక ప్రభుత్వ చిరుద్యోగిగా రూపాంతరం చెంది జీవితంలో సెటిల్ అయిపోయ్యాడు.

మా గురువుగారి శిష్యులు డాక్టర్లు, ఇంజనీర్లు చీమల్లా, దోమల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మేం ఆంజనేయశర్మగారి దగ్గర పాఠాలు నేర్చుకోవడం మా జీవితాల్లో ఒక చెరగనిముద్ర వేస్తాయని మాకు అప్పుడు తెలీదు (కొన్ని అనందాలు అనుభవిస్తున్నప్పుడు తెలీదు). నాదృష్టిలో ఆయన మాఅందరికన్నా ఆవదం సుబ్బడికే ఎక్కువ సహాయం చేశారు.

ప్రతిభ అనేది యాంత్రికంగా పాఠ్యాంశాల మనన కార్యక్రమాల ద్వారా మాత్రమే నిర్ణయించకూడదనీ, కష్టపడే తత్వాన్ని ప్రోత్సాహించాలనీ, పరుగు పందెంలో కుందేలుకి, తాబేలుకి డిఫరెంట్ యార్డ్‌స్టిక్ వుండాలనీ మా గురువుగారి అభిప్రాయం.

ముగింపు -

శ్రీ పరిమి ఆంజనేయశర్మ గారు.
సైన్స్ మరియు లెక్కల అధ్యాపకులు.
శ్రీ మాజేటి గురవయ్య హై స్కూల్, గుంటూరు.
డెబ్భై మరియు ఎనభయ్యవ దశకంలో మాలాంటి ఎందరికో స్పూర్తిప్రధాత.

మా గురువుగారి గూర్చి రాస్తూపొతే చదువరులకి విసుగనిపించవచ్చు. అంచేత నాకిష్టమైన, అలవాటైన విద్య - సినిమా సంగతుల్ని కలిపి రాశాను. అందుకోసం ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ గూర్చి రాశాను, అతని అభిమానులు సరదాగా తీసుకోగలరని నా నమ్మకం.