Showing posts with label జయభేరి. Show all posts
Showing posts with label జయభేరి. Show all posts

Friday, 5 April 2013

నందుని చరిత - ఘంటసాల ఘనత


నేను చిన్నప్పుడు ఘంటసాల పాటలు వింటూ పెరిగాను. అయితే ఆ పాటలు ఘంటసాల పాడినట్లు అప్పుడు నాకు తెలీదు. ఆ పాటలు రామారావు, నాగేశ్వరరావులే పాడుతుండే వాళ్ళనుకునేవాణ్ని. కొన్నాళ్ళకి ఆ గొంతు ఘంటసాలదని తెలుసుకున్నాను. ఇంకొన్నాళ్ళకి ఘంటసాల గొప్ప గాయకుడని అర్ధం చేసుకున్నాను. అయితే ఘంటసాల విశ్వరూప దర్శనం నాకు 'జయభేరి' సినిమా చూస్తుండగా కలిగింది.

సరే! 'జయభేరి' పాటల గొప్పదనాన్ని ఇవ్వాళ నేను ఇక్కడ రాసేదేమీ లేదు. దాదాపు అన్ని పాటలు (చివర్లో వచ్చే సౌందర్ రాజన్ పాట మినహాయింపు) బాగుంటాయి. బెస్ట్ ఆఫ్ జయభేరి? రకరకాల సమాధానాలు. క్లాసికల్ ప్రేమికులు 'రసికరాజ తగువారము కాదా.. ' చెబుతారు. విరహ ప్రేమికులు 'రాగమయి రావే.. ', 'యమునా తీరమున.. ' అంటుంటారు. నాకైతే 'నందుని చరితము.. ' పాట ఒక అద్భుతంగా తోస్తుంది.

'జయభేరి' చూడనివారి కోసం.. ఈ పాట సందర్భం బ్రీఫ్ గా రాస్తాను. హీరో పేరు కాశీనాథశాస్త్రి. గొప్ప సంగీత విద్వాంసుడు. కళకి క్లాస్ డిస్క్రిమినేషన్ ఉండరాదని నమ్ముతాడు. నమ్మిన సత్యాన్ని ఆచరించగలిగిన సాహసి. అందుకే గురువుని, అన్నావదినల్ని ఎదిరించి వీధి నాటాకాలాడే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.

మహారాజు కాశీనాథుని ప్రతిభని మెచ్చి ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తాడు. అతను ఇంత స్థాయి పొందడాన్ని సహించలేని రాజగురువు, రాజనర్తకిలు కుట్ర పన్ని తాగుబోతుగా మార్చేస్తారు. ఒకనాడు మహారాజు అజ్ఞాపించినప్పుడు కూడా పాడటానికి నిరాకరిస్తాడు. రాజాగ్రహానికి గురై వీధిన పడతాడు.

గుళ్ళో హరికథ జరుగుతుంటుంది. ఒక 'అంటరానివాడు' జ్వరంతో తీసుకుంటున్న తన కూతురితో కలిసి గుడి బయట నుండే దేవునికి మొక్కుతాడు. ఆగ్రహించిన గుళ్ళో బ్రాహ్మణులు అతన్ని నెట్టేస్తారు. మద్యం మత్తులో అటుగా వెళ్తున్న కాశీనాథశాస్త్రి ఆ తండ్రీకూతుళ్ళకి దేవుని దర్శనం చేయించడానికి విఫలయత్నం చేసి.. తను కూడా గెంటింపబడతాడు.

ఈ అరాచకానికి కాశీనాథశాస్త్రి కలత చెందుతాడు. ఆవేదన చెందుతాడు. మహారాజు కోరినా పాడనని మొరాయించిన ఆ స్వరం ఒక్కసారిగా జీవం పోసుకుంటుంది. ఆవేశంతో పరవళ్ళు తొక్కుతుంది. ఆగ్రహంతో కట్టలు తెంచుకుంటుంది. అందుకే ఆ మహాగాయకుడు గొంతెత్తి నందుని చరితాన్ని ఆలాపించడం మొదలెడతాడు. ఇదీ పాట సందర్భం. ఇక్కడీ పాట యూట్యూబులో చూడండి.



ఈ పాట సందర్భాన్ని పి.పుల్లయ్య పెండ్యాలకి వివరించి ఉంటాడు. పెండ్యాల నాగేశ్వరరావు వరసలు చక్కగా కట్టి ఉంటాడు. ఏ దర్శకునికైనా, సంగీత దర్శకునికైనా ఎన్నో కోరికలుంటాయి. కానీ గాయకులని దృష్టిలో ఉంచుకుని పరిమితులు ఏర్పరచుకుంటారు. డొక్కు కారుని వంద మైళ్ళ వేగంతో నడపితే యాక్సిడెంటవుతుంది.

ఘంటసాల వాయిస్ రేంజ్ అప్పుడే షో రూం డెలివరీ అయిన బెంజ్ కారు వంటిది. ఇక నడిపేవాడి ఓపిక. ఆకాశమే హద్దు. సంగీత దర్శకుడు ఏ బాణీనైనా, ఏ శృతిలోనైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 'ఘంటసాల లక్జరీ' ని ఎస్.రాజేశ్వరరావు దగ్గర్నుండీ అందరూ అనుభవించిన వారే!

మళ్ళీ 'అధికులనీ అధములనీ.. ' పాట దగ్గర కొద్దాం. ఈ పాట ఎత్తుగడే చాలా హై పిచ్ లో ఉంటుంది. అన్యాయానికి స్పందించిన ఒక మహాగాయకుని ఆవేదన, ఆర్ద్రత, ధర్మాగ్రహం.. అంతటినీ ఘంటసాల గీతాలాపనలో గాంచవచ్చు.

నటించింది అక్కినేని నాగేశ్వరరావయినా.. సన్నివేశానికి ఘంటసాల గొంతు పదిరెట్లు ఊపునిస్తుంది. ఈ పాటని నేను చాలాసార్లు చూశాను. ఎన్నిసార్లు చూసినా.. నాకీ పాట ఒక అద్భుతంగా తోస్తుంది. ('జయభేరి' మన మనసులో చిరస్థాయిగా మిగిలిపోడానికి ప్రధాన కారకుడు ఘంటసాల అని నా అభిప్రాయం.)

అయితే.. నాకు ఘంటసాలని ఫోటోల్లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతటి అసమాన ప్రతిభావంతుడు అతి సామాన్యుడిలా, అమాయకంగా కనిపిస్తుంటాడు. ఘంటసాలకి తనెంతటి ప్రతిభాసంపన్నుడో తనకే తెలీనంత అమాయకుడని నా అనుమానం! ఘంటసాల తెలుగు పాటని హిమాలయాలంత ఎత్తున ప్రతిష్టించాడు. ఇది తెలుగువారి అదృష్టం.

మా వేలు విడిచిన మేనమామ ఒకాయనకి పెళ్ళీపెటాకులు లేవు. ఉద్యోగం సద్యోగం లేదు. పనీపాటా లేదు. ఆస్తిపాస్తులు బానే ఉన్నాయి. సాధారణంగా ఇట్లాంటివాళ్లకి ఏదొక హాబీ ఉంటుంది. మా మేనమామకి సినిమా పాటల హాబీ. అదో పిచ్చి. పొద్దస్తమానం ఏవో గ్రామ్ ఫోన్ రికార్డులు వింటూ, వాటిని తుడుచుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. సినిమా పాటల పరిజ్ఞానం చాలానే ఉంది.

ఓ సారి ఆయన ఏదో పెళ్ళిలో కనిపిస్తే అడిగాను. కచేరీల్లో ప్రతి తలకి మాసిన వెధవ ఘంటసాలలా తెగ ఫీలైపోతూ.. 'రాగమయి రావే.. ', 'నీలిమేఘాలలో..' అంటూ సెలెక్టివ్ గా కొన్ని పాటల్నే హత్య చేస్తారేమి! ఆ గార్ధభోత్తములు 'నందును చరితము.. ' జోలికి ఎందుకు పోరు? అని. ఆయన ఒక క్షణం ఆలోచించాడు. ఆపై విషయం తేల్చేశాడు.

"ఆ పాట పాడటం చాలాచాలా కష్టం. శృతి చాలదు. నా లెక్క ప్రకారం 'నందుని చరితము' పాడ్డానికి ఎవడు సాహసించినా.. పాటయ్యేలోపు గిద్దెడు నెత్తురు కక్కుకుని చస్తాడు. చావుకి తెగించి ఎవడైనా ఎలా పాడతాడు?" అన్నాడు.

నిజమే కదా! ఎవరికైనా తమ గానంతో జనాల ప్రాణాలు తియ్యాలనే సరదా ఉంటుంది గానీ.. తమ గానంతో తమ ప్రాణాలకే ఎసరు ఎందుకు పెట్టుకుంటారు?! మామా! నువ్వు కరెక్టుగానే చెప్పావు!

(photos courtesy : Google)

Wednesday, 5 December 2012

'రాగమయి రావే.. ' ఎన్నిసార్లు రావాలి? నేన్రాను పో!


సమయం రాత్రి పన్నెండు గంటలు. సాహిత్యంపై బాలగోపాల్ రాసిన వ్యాసాల సంకలనం 'రూపం-సారం' చదువుతున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువసార్లు చదివిన పుస్తకం ఇదే. ఇంతలో అసరా (USA) నుండి ఒక మిత్రోత్తముని ఫోన్. చాలాసేపు చిన్ననాటి కబుర్లు, కాకరకాయలు. పిచ్చాపాటీ.

"ఈ టీవీలో 'పాడుతా తీయగా' ప్రోగ్రాం రెగ్యులర్ గా చూస్తున్నాను. ప్రోగ్రాం నాకు బాగా నచ్చింది. నువ్వు కూడా చూడు." అన్నాడు. మావాడు సంగీత ప్రియుడు. ఓ సన్నకారు పాటగాడు.

"తెలుగు టీవీ చూడకపోవడం నా ఆరోగ్య రహస్యం. కావున తియ్యగా పాడినా, చేదుగా పాడినా నాకు తెలిసే అవకాశం లేదు. నువ్వు చూడమంటున్నావు కాబట్టి తప్పకుండా చూస్తాను." అన్నాను.

నాది మాట మీద నిలబడే వంశం కాదు. అంచేత సహజంగానే అటు తరవాత ఆ టీవీ గోల మర్చిపోయ్యాను. అనగనగా ఓ పని లేని రోజు నా స్నేహితుడు, అతగాడికి చేసిన బాస గుర్తొచ్చి ఆ ప్రోగ్రాం టైమింగ్స్ వాకబు చేసి టీవీ ఆన్ చేయించాను.

టీవీ స్క్రీన్ పై ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిండుగా కనిపిస్తున్నాడు. ఏవో కబుర్లు చెబుతున్నాడు. ఈ రియాలిటీ షోలు గిరాకీ తగ్గిన పని లేని నటులకి, గాయకులకి చక్కటి ఆశ్రయం కల్పిస్తున్నాయి. మంచిది. ఇట్లాంటి కార్యక్రమాలు వృద్ధ కళాకారులకి రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్ వలే కూడా చక్కగా ఉపయోగపడుతున్నాయి. వెరీ గుడ్.

ఇంతలో బక్కపలచటి కుర్రాడొకడు సెట్ మధ్యలో కొచ్చి ఆవేశంగా ఏదో సినిమా పాట ఎత్తుకున్నాడు. కళ్ళు మూసుకుని గొంతెత్తి పాడటం మొదలెట్టాడు. నాకు చిరాకేసింది.

'వార్నీ! పాడుతా తీయగా అంటే సినిమా పాటల పోటీ ప్రోగ్రామా!' ఆశ్చర్యపోయాను.

'మరి మన అసరోత్తముడు బాగుందన్నాడేమి! నా మీద వాడికి పాత కక్షలేమీ లేవు గదా!' ఆలోచిస్తూ మళ్ళీ టీవీ చూశాను.

ఇప్పుడు కడుపులో వికారం మొదలైంది. వెంటనే టీవీ కట్టేసాను.

ఈ వికారం నాకు కొత్త కాదు. దీనికి నలభయ్యేళ్ళ చరిత్ర ఉంది. సైకియాట్రీ వైద్యంలో PTSD అని ఓ కండిషన్ ఉంది. ఒక భయంకర అనుభవం మనసులో ముద్రించుకుపోయి.. ఆ అనుభవం తాలూకా భయాలు వెంటాడుచుండగా.. ఆ అనుభవం కనీస స్థితిలోనయినా మళ్ళీ ఎదురైతే తట్టుకోలేరు. అసలా ఊహకే విచలితులవుతారు. నా జీవితంలో ఈ సినిమా పాటల పోటీ ఒక బీభత్స అనుభవం.

ఇప్పుడు కొంచెంసేపు ఫ్లాష్ బ్యాక్. నా చిన్నప్పుడు వీధివీధినా వెలిసే  శ్రీరామనవమి పందిళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలకి కేరాఫ్ ఎడ్రెసులని ఇంతకు ముందొక టపాలో రాశాను. ప్రతి యేడాది ఈ పందిళ్ళల్లో సినిమా పాటలు పోటీ కూడా ఒక ముఖ్యాంశంగా ఉండేది.

అలనాటి ఆ పాటల పోటీలు నా జీవితంలో చెరగని ముద్ర వేస్తాయని అప్పుడు నాకు తెలీదు. అరిగిపోయిన భాషతో మర్యాద కోసం 'ముద్ర' అంటున్నానే గానీ.. నిజానికవి ముద్రలు కావు.. కత్తి పోట్లు, గొడ్డలి నరుకుళ్ళు!

ఒకానొక దుష్ట సంవత్సరం విపరీతంగా పాడబడ్డ పాట.. 'రాగమయి రావే! అనురాగమయి రావే!'. ఒకళ్ళ తరవాత మరొకళ్ళు.. రేషన్ షాపు దగ్గర 'క్యూ' కట్టినట్టు వరసలో నిలబడి మరీ పాడారు. ఓ నలుగురు పాడంగాన్లే నాకు విసుగొచ్చేసింది. ఈ వెధవలు పిలిస్తే 'రాగమయి' రావడం మాట అటుంచి.. దడుపుడు జొరంతో పారిపొయ్యే ప్రమాదం తీవ్రంగా ఉంది!

ప్రతి గాయక రాక్షకుడు మైకు ముందుకు రావడం.. గొంతు సరి చేసుకుని.. 'ఇప్పుడు ఘంటసాల మాస్టారు పాడిన ఫలానా పాట.' అని ఎనౌన్స్ చేసి మరీ హింసించేవాళ్ళు. మరీ ఒక్కోడు పాడుతుంటే పిశాచాల ప్రార్ధనలా, సూడి పంది ప్రసవ వేదనలా ఉండేది. జీవితం మీద విరక్తి పుట్టేది.

చిత్రమేమంటే మహాగాయకుడు ఘంటసాల సినిమా కోసం పాడిన మట్టి రికార్డ్ మూడున్నర నిమిషాలే! కానీ మావాళ్ళు ఘంటసాల కన్నా బాగా పాడేద్దామని ఉత్సాహపడేవాళ్ళు. అంచేత ఒరిజినల్ పాటలో లేని కొత్త సంగతులు వేసి.. తన్మయత్వంతో కళ్ళు మూసుకుని రాగాలు సాగదీస్తూ పది నిమిషాలకి పైగా పాడేవాళ్ళు.

శ్రోతల ఏడుపు మొహాలు ఎవాయిడ్ చెయ్యడానికి వారు అలా కళ్ళు మూసుకొంటారని సుబ్బు అంటాడు. కొంతమంది మెలికలు తిరుగుతూ పాడేవారు. 'గొంతు ఎలాగు మెలికలు తిరగదు. కనీసం శరీరంలోనయినా చూపించనీ!' అంటాడు సుబ్బు.

మొత్తానికి ఆ యేడాది శ్రీరామనవమి పాటల పోటీ గాడిదలు, కుక్కలు, పిల్లులు, గబ్బిళాలు వంటి నానాజాతుల వికృత గాన సౌందర్య విలాసములకి పుట్టినిల్లుగా భాసిల్లింది. కళ్ళు మూసుకున్నట్లు చెవులు మూత పడకపోవడం మానవ శరీర నిర్మాణ లోపమని ఆ నాడే నాకు అర్ధమయ్యింది. అందుకే నాకు 'రాగమయి రావే' పాటంటేనే కసి, కోపం, చిరాకు, రోత!

ఒకానొక రోజు నవ్వారు మంచంపై కాళ్ళు పైకెత్తుకుని చందమామలోని ధూమకేతు, శిఖిముఖిల సీరియల్ ఉత్కంఠపూరితంగా పఠించు సమయమున.. నా ఒక్కగానొక్క అన్నయ్య ప్రేమగా అడిగాడు.

"జయభేరి సినిమాకి వెళ్తున్నా. వస్తావా?"

"ఛీ.. ఛీ.. ఆ సినిమా పొరబాటున కూడా చూణ్ను." అని ఈసడించుకున్నా.

అన్నయ్యకి అర్ధం కాలేదు. ఆ సినిమాపై నాకున్న కోపానికి కారణం తెలుసుకుని పెద్దగా నవ్వాడు.

"పోనీ ఒక పని చెయ్యి! ఆ పాట  వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని, చెవుల్లో వేళ్ళు పెట్టుకో!" అన్నాడు.

'ఇదేదో బానే ఉంది.' అనుకుంటూ అన్నయ్యతో జయభేరి సినిమాకి బయల్దేరాను.

'జయభేరి' ఒక అద్భుత దృశ్యకావ్యం. ఆసాంతం సుమధుర సంగీతమయం. నేను అసహ్యించుకున్న 'రాగమయి రావే' పాట సమయంలో కళ్ళు మూసుకోవడం కాదు.. కనురెప్ప కొట్టడం కూడా మర్చిపోయ్యి చూశాను. ఇన్నాళ్ళూ మా బ్రాడీపేట ఔత్సాహిక గాయక రాక్షసులు ఘంటసాల పాటని సామూహికంగా హత్య కావించారని అవగతమైంది.

(ఏమిరా దుష్ట దుర్మార్గ వెర్రి వైద్యాధమా! నీ రాతలతో మన బ్రాడీపేటీయుల పరువు తీయుచుంటివి? మనవాళ్ళు తమ గార్ధభ గానంతో ఘంటసాల పాటని కంకరరాళ్ళతో కలిపి కరకరలాడించారు. అంతమాత్రానికే అపచారమంటూ అంతలా అరవాలా?) 

అవును గదా! 'రాగమయి రావే!.. ' గీత హనన నేరం మా బ్రాడీపేట గాత్రకారులది కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందుకు బాధ్యత వహించవలసిన వారు ఘంటసాల, మల్లాది రామకృష్ణ శాస్త్రి, పెండ్యాల, పి.పుల్లయ్యలు మాత్రమే! ఒక పాటని మరీ అంత గొప్పగా రూపొందించడమే వారు చేసిన నేరం! దొంగలు బంగారాన్ని మాత్రమే కాజేస్తారు.

తరవాత జయభేరి సినిమా చాలాసార్లు చూశాను. ఎప్పుడు చూసినా 'రాగమయి రావే!' ఇష్టంగానే చూస్తున్నాను. కావున.. నా 'రాగమయి' పాట తాలూకా వికారం తగ్గిపోయినట్లే. ఘంటసాల అద్భుత గానం మూలానా కొందరి నీచగాన దోషం నశించినట్లుంది. పోన్లే. మంచిదే కదా!

చిత్రంగా ఇప్పుడు 'పాడుతా తీయగా' కార్యక్రమం చూస్తుంటే అప్పటి వికారం బయటేసింది. అనగా.. నేనకున్నట్లు నా చిన్ననాటి క్షుద్ర గాయకుల పట్ల నా ఆగ్రహజ్వాలలు ఇంకా చల్లారలేదన్నమాట. ఆలోచించగా ఇదంతయూ Pavlov classical conditioning వలే యున్నది. నా పసిహృదయం మరీ అంతలా గాయపడి తల్లడిల్లిందా!

దూరంగా పాట వినిపిస్తుంది. 'తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా.. మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనయినా.. '

ఈ టపాకి కారణం అయిన జయభేరి సినిమాలోని 'రాగమయి రావే.. ' పాట యూట్యూబ్ లో ఉంది. ఇక్కడ ఇస్తున్నాను. మరొక్కసారి విని ఆనందిచండి. ('చివురులు మేసిన చిన్నారి కోయిల.. ' చరణం ఆ నాటి 78 rpm రికార్డులో లేదు.)



(photos courtesy  : Google)