Showing posts with label రచయిత. Show all posts
Showing posts with label రచయిత. Show all posts

Wednesday, 21 January 2015

రచయితలకి రక్షణ లేదా?


పెరుమాళ్ మురుగన్ అనేది స్వచ్ఛమైన తమిళ పేరు, ఇంకే భాషలోనూ వుండదు. పేరుకి తగ్గట్టుగానే పెరుమాళ్ మురుగన్ కూడా తమిళంలోనే రచనలు చేశాడు, ఇంకే భాషలోనూ రాయలేదు. నాలుగేళ్ళ క్రితం పెరుమాళ్ మురుగన్ రాసిన తమిళ రచనని ఈమధ్యే ఇంగ్లీషులోకి అనువదించారు - అదే ఆయన కొంప ముంచింది.

ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం రాసిన ఈ పుస్తకానికి ఇప్పుడెందుకు నిరసన? వారి అభ్యంతరం అనువాదం పట్లనేనా? కారణం ఏదైనా - పెరుమాళ్ మురుగన్ ఇంకెప్పుడూ రచనలు చెయ్యనని ఒక ప్రకటన ఇచ్చాడు. ఆల్రెడీ మార్కెట్లో వున్న పుస్తకాల్ని కూడా ఉపసంహరించుకున్నాడు. ఇదంతా జిల్లాస్థాయి అధికారుల అధ్వర్యంలో బలవంతంగా జరిగిందని పత్రికలు రాశాయి .

రచయితలు నానావిధాలు. ఆవకాయ దగ్గరనుండి అమెరికా దాకా అన్ని సబ్జక్టులపైనా సరదాగా కాలక్షేపం కోసం రాసేవాళ్ళు కొందరైతే - మరికొందరు మన ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాల గూర్చి మురిసిపోతూ పులకించిపోతూ రాస్తుంటారు. తద్వారా కొంతమంది అభిమానుల్ని సంపాదించుకుని - వాడవాడలా తమవారితో పొగిడించుకుంటూ, శాలువాల సన్మానాలు చేయించుకుంటూ సత్కాలక్షేపం చేస్తుంటారు. ప్రభుత్వాల దృష్టిలో ఈ శాలువా రచయితలే జాతి పరిరక్షకులు!

కొందరు రచయితలకి సమాజంలోని స్టేటస్ కో నచ్చదు,  అసమానతల్ని అసహ్యించుకుంటారు. ఈ సమాజం ఇలా ఎందుకుందని మధనపడతారు. అందుగ్గల కారణాల్ని విశ్లేషిస్తూ సీరియస్ సాహిత్యాన్ని సృష్టిస్తారు. సాహిత్యం ప్రజల బాగు కోసమేనని వారి నమ్మకం. వీరు అవార్డుల్ని పట్టించుకోరు, పైగా వాటికి దూరంగా వుంటారు. ప్రభుత్వాలకి ఈ బాపతు రచయితలంటే భలే అనుమానం.

డబ్బు కోసం రాసుకునే రచయితల సంగతేమో గానీ - తాము నమ్మిన విషయాల్ని నిక్కచ్చిగా రాసే రచయితలు - తమ రచనల పట్ల చాలా పేషనేట్‌గా వుంటారు. చాలా సీనియర్ రచయితలు కూడా ఫలానా మీ రచనలో ఫలానా లైన్లు బాగున్నయ్యంటే చిన్నపిల్లాళ్ళా ఆనందిస్తారు. కొందరు రచయితలయితే తమ పుస్తకాల్ని కన్నపిల్లల్లా సాకుతుంటారు. ఈ నేపధ్యంలో - ఒక రచయిత తనకు తానుగా మరణ శాసనం రాసుకున్నాడంటే - అతనెంత ఆవేదన చెందాడో అర్ధం చేసుకోగలను.

రచయితలెప్పుడూ సాఫ్ట్ టార్గెట్లే. అందుకే మతం ముఠాలు, కులం గ్రూపులు వీరినే లక్ష్యంగా ఎంచుకుంటాయి. ఉదాహరణకి - సల్మన్ రష్దీ రాసిన పుస్తకం తమ మతవిశ్వాసాలకి విరుద్ధంగా వుందనీ, నిషేధించాలని కొన్ని ముస్లిం సంస్థలు ఆందోళన చేశాయి. మైనారిటీ వోట్లకి ఎక్కడ గండి పడుతుందోనన్న భయంతో కేంద్రప్రభుత్వం హడావుడిగా పుస్తకాన్ని నిషేధించింది (ప్రపంచంలో 'సటనిక్ వెర్సెస్‌'ని నిషేధించిన మొట్టమొదటి దేశం మనదే)! ప్రభుత్వం సల్మాన్ రష్దీ పుస్తకాన్ని నిషేధించకపోయినట్లైతే? అయినా నష్టం లేదు - ఆయా మతసంస్థల వారికి కావలసింది పబ్లిసిటీ, అదెలాగూ వచ్చేసింది! అంటే ఇది - ఏ రకంగా చూసినా ఇది ఒక 'విన్ విన్ సిట్యువేషన్' అన్నమాట!

సల్మన్ రష్దీ అంతర్జాతీయ రచయిత కాబట్టి ఆయన ఏదోక దేశంలో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఒక చిన్న ఊళ్ళో నివసించే రచయితకి ఆ అవకాశం వుండదు, ఇంకా చెప్పాలంటే ఆ రచయితకి దిక్కూదివాణం వుండదు. అందుకు మంచి ఉదాహరణ - ఈ పెరుమాళ్ మురుగన్‌. ఆయనేదో రాశాడు. ఆయన్రాసింది ఒక మతంవాళ్ళకి నచ్చలేదు. ఓ పదిమందిని కూడేసి ఆయన పుస్తకాల్ని తగలబెట్టించారు, ఊళ్ళో బంద్ జరిపించారు. ఆయన భయపడి పారిపొయ్యాడు. జిల్లాధికారులకి ఇదంతా ఒక లా అండ్ ఆర్డర్ న్యూసెన్స్‌గా అనిపించి చిరాకేసింది. అధికార దర్పానికి - జీవిక కోసం ఏ స్కూలు మేస్టర్లుగానో, పోస్టు మేస్టర్లుగానో పన్జేస్తున్న రచయితలు నంగిరిపింగిరిగాళ్ళలాగా కనిపిస్తారు. అంచేత వాళ్ళాయన్ని చర్చలకంటూ పిలిపించి - బెదిరించి ల్యాండ్ సెటిల్‌మెంట్ చేసినట్లు ఏవో కాయితాల మీద సంతకం పెట్టించుకున్నారు. ఇదంతా చాలా సింపుల్‌గా జరిగిపోయింది.

కొందరికి 'ఒక రచయిత రాసింది కొందరికి నచ్చలేదు, ఆయన్ని బ్రతిమాలో బెదిరించో రచనల్ని ఆపించేశారు, ఇదసలే విషయమేనా?' అనిపించొచ్చు. ఇంకొందరికి 'రచయిత వ్యతిరేక గ్రూప్ విజయం సాధించింది, పెరుమాళ్ ఓడిపోయాడు' అనిపిస్తుంది. కానీ రచయిత పెరుమాళ్ నిజంగా ఓడిపోయ్యాడా? నేనైతే - తమిళ సమాజం ఓడిపోయిందనుకుంటున్నాను.

'రచయితలు ఎవరి మనసునీ నొప్పించకుండా రాయొచ్చు కదా?' నిజమే! రచయితలకైనా, ఇంకెవరికైనా - ఏ వర్గాన్నీ, వ్యక్తినీ కించపరిచే హక్కు లేదు. కానీ - ఒక రచన వల్ల ఫలానావారి మనోభావాలు దెబ్బతిన్నాయని నిర్ణయించేదెవరు? రాజకీయ పార్టీలా? మత సంస్థలా? కులం గ్రూపులా? మరి రాజ్యంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ మాటేమిటి? ఆ స్వేచ్ఛని పరిరక్షించాల్సింది ఎవరు? పరిధి దాటితే శిక్షించాల్సింది ఎవరు? రాజ్యాంగబద్ధ స్వేచ్చ పరిరక్షిస్తూనే ఆ స్వేచ్చ దుర్వినియోగం కాకుండా చూడ్డానికి రాజ్యాంగబద్ధమైన సంస్థలు (న్యాయస్థానాలు గట్రా) వున్నాయి కదా! మరప్పుడు ప్రభుత్వాలు - రచయితల్ని కొన్ని గ్రూపులకి ఆహారంగా వేసి చోద్యం చూస్తున్నట్లుగా ఎందుకంత ఉదాసీనంగా వ్యహరిస్తున్నాయి?

ఇక్కడ ప్రేమకథలు రాసుకోవచ్చు, క్షుద్రరచనలు చేసుకోవచ్చు, సరసంగా సరదాగా మనసుని గిలిగింతలు పెట్టే అందమైన మాటల పొందికతో కవిత్వం రాసుకోవచ్చు. వాళ్లకోసం 'పద్మ' అవార్డు కూడా ఎదురు చూస్తుంటుంది కూడా! కానీ - సమాజాన్ని సీరియస్‌గా కామెంట్ చేస్తూ ఒక రచన చేస్తే మాత్రం రిస్కే! 

ఇవ్వాళ గురజాడ 'కన్యాశుల్కం' రాసే పరిస్థితి వుందా? 'కన్యాశుల్కం' తమ మనోభావాలు దెబ్బతీసిందని ఒక కులం వాళ్ళు గురజాడ ఇంటి ముందు ధర్నా చెయ్యొచ్చు, విజయనగరం పట్టణం ఒకరోజు బంద్‌కి పిలుపునివ్వచ్చు. గురజాడక్కూడా పెరుమాళ్‌కి పట్టిన గతే పట్టొచ్చు! మాలపల్లి రాసిన ఉన్నవ కూడా మర్యాదగా బయటపడే రోజుల్లేవు!

ఒక వాదన వుంది - 'ఇతర దేశాలతో పోలిస్తే మన్దేశం చాలా నయం, ఈ మాత్రం స్వేచ్చాస్వాతంత్రాలు లేని దేశాలు ఎన్ని లేవు?' నిజమే! నాకీ వాదన విన్నప్పుడు మా అన్న కొడుకు గుర్తొస్తాడు. వాడు సరీగ్గా చదివేవాడు కాదు. మార్కులు ఐదూ పది కన్నా ఎక్కువొచ్చేవి కావు. 'ఏవిఁటోయ్ ఇంత తక్కువొచ్చాయ్?' అనడిగితే - 'మా బెంచీలో అందరికన్నా నాకే ఎక్కువొచ్చాయి!' అని గర్వంగా చెప్పేవాడు. ప్రభుత్వం నడిపే సాంఘిక సంక్షెమ హాస్టళ్ళల్లో ఆహారం పరమ అధ్వాన్నంగా వుంటుంది. 'వాళ్లకి ఇళ్ళల్లో తినడానికి తిండే వుండదు, వాళ్ళ మొహాలకి ఇదే ఎక్కువ.' అని ఈసడించుకునే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు నాకు తెలుసు.

అచ్చు ఇదే వాదన్ని హిందూమతానికి ప్రతినిధులమని చెప్పుకునేవారు కూడా చేస్తుంటారు. వాళ్ళు ముస్లిం మతాన్ని చూపిస్తూ - 'నువ్వెళ్ళి ఇవే మాటలు ముస్లిం దేశాల్లో చెప్పు. నీ తల తీసేస్తారు' అంటారు. నిజమే! ఒప్పుకుంటున్నాను. సౌదీలో రాజ్యానికి వ్యతిరేకంగా బ్లాగుల్రాసిన కుర్రాణ్ని ఎంత కౄరంగా హింసిస్తున్నారో చదువుతుంటే ఒళ్ళు గగుర్బొడుస్తుంది! మనం చేసే దరిద్రప్పన్లని సమర్ధించుకోడానికి మనకన్నా దరిద్రులు ఈ ప్రపంచంలో ఎప్పుడూ వుండనే వుంటారు!

రాజకీయ నాయకులు, ఉద్యమకారులు సంఘటితంగా ఒక గ్రూపుగా వుంటారు గానీ - రచయితలెప్పుడూ ఒంటరిగాళ్ళే! అందుకే వాళ్ళు ఈజీ టార్గెట్లవుతారు. వాళ్ళు మందబలానికి, భౌతిక దాడులకి భయపడతారు. అప్పుడు - 'అసలెందుకు రాయడం? హాయిగా తిని పడుకోవచ్చుగా' అనిపిస్తుంది. అవును - ఇప్పుడు జరగబోతుందదే!

సమాజం - మతపరంగా, కులపరంగా స్పష్టమైన డివిజన్‌తో విడిపోవడం పాలకులకి ఎప్పుడూ లాభదాయకమే. అప్పుడే వారు తమ ఓటు బ్యాంక్ రాజకీయాల్ని నిరాటంకంగా చక్కబెట్టుకోగలరు. రాజ్యానికి ఇబ్బంది కలిగించే రచయితలు - చైనాలోలాగా మాయమైపోడానికో, పాకిస్తాన్లోలాగా కాల్చబడ్డానికో మరికొంత సమయం పట్టొచ్చేమో గానీ - రచయితలకి చెడ్డరోజులు తరుముకుంటూ వచ్చేస్తున్నాయనేది నా అనుమానం. నా అనుమానం నిజమవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను.

(picture courtesy : Google)

Monday, 12 January 2015

'అకారసం'


"రచయితగారూ! నమస్కారం!"

"నమస్కారం!"

"మీ రచనలన్నీ చదివాం, మాకు బాగా నచ్చాయి."

"సంతోషం!"

"మీ ఆలోచనలు మా రచయితల సంఘం ఆలోచనలకి దగ్గరగా వున్నాయి."

"థాంక్యూ!"

"మీరు మా సంఘంలో చేరాలని మా కోరిక."

"మీరు అభ్యుధయ రచయితల సంఘం - 'అరసం' వాళ్ళా?"

"కాదు."

"విప్లవ రచయితల సంఘం - 'విరసం' వాళ్ళా?"

"కాదు."

"హిందూ మతానికి అన్యాయం జరిగిపోతుందని రోజువారీ గుండెలు బాదుకునే జాతీయవాద రైటిస్టు రచయితలా?"

"కాదు."

"మరి?"

"మా రచయితల సంఘం పేరు - 'అకారసం'."

"పేరెప్పుడూ విన్లేదే!"

"వినకపోవడమేమిటండీ! ఈ మధ్యన మా సంఘం పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంటేనూ!"

"అలాగా! నా అజ్ఞానాన్ని మన్నించండి. 'అకారసం' అంటే ఏంటి?"

"అర్ధం కాని రచయితల సంఘం."

"పేరు వెరైటీగా వుందే! మీ సంఘ సభ్యుల లక్ష్యం - పాఠకులకి అర్ధం కాకుండా రాయడమా?"

"పాఠకులకి అర్ధం కాకుండా రాయడం ఇప్పుడు ఓల్డు ఫేషనైపోయిందండీ!"

"మరి?"

"మేమిప్పుడు మాకే అర్ధం కాకుండా రాస్తున్నాం!"

(picture courtesy : Google)

Saturday, 27 December 2014

రచయితల రోగం


"బావా! బావోయ్!"

"వూఁ!"

"ఒక డౌటు."

"అడుగు."

"రచైత అంటే ఏంటే ఎవురు బావా?"

"రచనలు చేసేవాళ్ళని రచయిత అంటారోయ్!"

"రచన్లా! అంటే ఏంది?"

"కథలు, నవలలు, వ్యాసాలు.. ఇట్లా చాలా వున్నైలే!"

"అబ్బో! చాలా యవ్వారవేఁ వుంది. ఇంతకీ రచైతలు రచన్లు ఎందుకు చేస్తారంటావ్?"

"మనోల్లాసానికి, మనోవికాసానికి.. "

"కొద్దిగా తెలుగులో చెప్పు బావా!"

"రచయితలు గొప్ప ఆలోచనాపరులు. పాఠకులకి కొత్త విషయాలు తెలియజెయ్యడానికి రచనలు చేస్తారు."

"పాటకులా! ఆళ్ళెవరు? చీటీపాట పాడేవాళ్ళా?"

"కాదు కాదు, రచయిత రాసింది చదివేవారిని పాఠకులు అంటారు."

"బావా! రచైత అంతేసి ఆలోచించడం దేనికీ? అన్నేసి పేజీల్తో బుక్కులు రాయటం దేనికి? తోచకపోతే నాలాగా హాయిగా సుట్ట కాల్చుకుంటా గమ్మునుండొచ్చుగా?"

"వుండొచ్చు. కానీ - వారి సామాజిక స్పృహ అందుకు వొప్పుకోదు."

"అర్ధవైఁంది బావా! ఇది కూడా ఒక యసనం అన్నమాట!"

"వ్యసనమా!"

"అవును బావా! మన అబ్బిగాణ్ని చూడు - పేకాడకుండా వుండలేడు. సూరిగాడు తాక్కుండా వుండలేడు. అట్టాగే రచైతలు కూడా రచన్లు చెయ్యకుండా వుండలేరన్నమాటేగా?"

"సరే! అలాగే అనుకో!"

"బావా! ఇదేవఁన్నా రోగవాఁ?"

"వురే! ఇందాకట్నుండి చూస్తున్నాను, ఒకటే వాగుతున్నావు. పొద్దస్తమానం పొలం పన్జేసుకునేవాడివి - నీకివన్నీ అవసరం అంటావా?"

"అదేంది బావా అట్టా కోపం జేస్తావు? ఏదో సదువు లేనోణ్ని - యివరంగా చెప్పొచ్చుగా?"

"నాకు వివరంగా చెప్పేంత ఓపిక లేదు. నీకో నమస్కారం, దయచేసి దయచెయ్యి!"

"అట్టాగే పోతా! ఇంత మరియాదగా చెప్పినా యినకుంటానికి నేనేవఁన్నా రచైతల్లాగా పనీపాటా లేనోణ్నా?"

(picture courtesy : Google)

Wednesday, 26 March 2014

రచయిత


"నమస్కారం రచయిత గారు! ఈమధ్య మీర్రాసిన కథ చదివాను, చాలా బాగుందండి." వినయంగా అన్నాడు అప్పారావు.

రచయితకి మూడాఫ్ అయిపొయింది. ఎంతో ఇష్టంగా తింటున్న ఉప్మాపెసరట్టులో చచ్చిన ఈగ కనిపించినట్లు వికారంగా ఫీలయ్యాడు. వంద గజ్జికుక్కల ఆకలి చూపుల మధ్య పెళ్లిభోజనం చేస్తున్నంత రోతగా అనిపించింది. జబ్బుతో తీసుకుంటున్న పేదవాడు మొహంమీద దగ్గినంత ఇబ్బందిగా అనిపించింది. కొత్తగా కొన్న పెద్దకారుకి చిన్నగీత పడితే కారు ఓనరయ్యకి కలిగే ఆందోళన లాంటిది కూడా కలిగింది. స్కాచ్ మాత్రమే తాగేవాడికి లోకల్ బ్రాండ్ ఆఫర్ చేస్తే వచ్చే చికాకులాంటి భావన కూడా కలిగింది.

ఇన్నిరకాల భావనలతో, దేశంలో ఉన్న సమస్త దరిద్రాన్నీ మూటకట్టి నెత్తిన పెట్టుకుని మోస్తున్నవాళ్ళా భారంగా నడుస్తూ ఇంటికి బయల్దేరాడు. మనసు మనసులో లేదు, ఆలోచనలు మునిసిపాలిటీవాడు దోమలమందు చల్లినా చావని దోమల గుంపుల్లా కమ్ముకుంటున్నయ్.

'నా కథ ఈ అప్పారావుకి ఎలా అర్ధమైంది? నా రచనలు కాఫ్కా కన్నా పైస్థాయిలో ఉంటాయి కదా! నా ఆలోచనలు మేధావులకే అంతుబట్టవు. నా కథల్లోని అర్ధాన్ని వెతకడానికి ప్రపంచవ్యాప్తంగా నా అభిమాన గణం నిరంతరంగా ప్రయత్నిస్తుంటుంది. నా రచనల్లోని అర్ధాలు, గూఢార్ధాల, నిగూఢార్ధాల గూర్చి వ్యాఖ్యానాలే అనేక పుస్తకాలుగా వచ్చాయి. నేను కథకులకి మాత్రమే కథకుణ్ణి కదా! మరి ఈ ఆఫ్టరాల్ అప్పారావుకి నా కథ ఎలా అర్ధమైంది? నా కథల స్థాయి ఇంతగా దిగజారిందా?" ఆలోచనలతో రచయిత బుర్ర అట్టు పెనంలా వేడెక్కింది.

వేడెక్కిన బుర్రని అంతకన్నా వేడిగానున్న ఫిల్టర్ కాఫీతో చల్లబరచ ప్రయత్నించాడు. ధర్మాసుపత్రిలో అధర్మ డాక్టరిచ్చిన మాత్రలేసుకుంటే ఉన్న రోగం పోకపోగా, కొత్తరోగం మొదలైనట్లు.. ఆలోచనలు మరింతగా పెరిగిపోయ్యాయి.

ఇంతలో ఎక్కణ్ణుంచో ఒక శిష్యపరమాణువు నుండి ఫోన్.

"రచయిత గారు! ఫలానా కథలో సముద్రం ఎర్రబారిందనీ, అలలు ఘనీభవించాయనీ రాశారు. అలా ఎందుకు రాశారో చెప్తారా?"

మనం అప్పు పెట్టిన వడ్డీవ్యాపారస్తుడు వోల్వో బస్సు ప్రమాదంలో ఛస్తే వచ్చేంతటి బ్రహ్మానందం.. రచయితకి కలిగింది.

"ఆ కథలో సముద్రం అంటే సముద్రం అని కాదు, 'మనసు' అని అర్ధం." గర్వంగా అన్నాడు రచయిత.

"అలాగా! అయితే అప్పుడు అలలు అంటే అలలు కాదనుకుంటా." అన్నాడు శిష్యపరమాణువు.

"అక్కడ అలలు అంటే అర్ధం రెండురకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పోస్ట్ మోడర్నిస్ట్ అర్ధం, రెండు మేజిక్ రియలిజం అర్ధం. అయినా ఆ కథని విశ్లేసిస్తూ ఓ రెండు వేల పేజీల పుస్తకాన్ని నా అభిమానులు ప్రచురిస్తున్నారు." అన్నాడు రచయిత.

"రచయిత గారూ! నే చచ్చేలోపు మీలాగా ఒక్కవాక్యం రాసినా చాలండీ, నా జన్మ ధన్యమౌతుంది, మీరు నిజంగా కారణజన్ములు." తన్మయత్వంగా అన్నాడు శిష్యపరమాణువు.

ఆ మాటల్తో, తన కటౌట్ కి పాలాభిషేకం చేస్తున్న వెర్రి అభిమానుల్ని చూసినప్పుడు తెలుగు సినిమా హీరోకి కలిగేంత ఉత్సాహం వచ్చింది రచయితకి. ఫుల్లుగా మేకప్పేసుకుని పార్టీకి ఎటెండైన ఆంటీని 'మీరే కాలేజ్ స్టూడెంట్?' అనడిగితే వచ్చే గర్వానందము లాంటిది కలిగింది.

'అవును! తెలుగునాట 'మో' కవితల్ని అర్ధం చేసుకున్నవాడు ఉండొచ్చు, 'త్రిపుర' కథల్ని పరిచయం చేసేవాడూ ఉండొచ్చు, కానీ - నా రచనల్ని అర్ధం చేసుకున్నవాడు ఇప్పటిదాకా పుట్టలేదు (పుట్టకూడదని కూడా నా కోరిక)!' అని నర్తనశాలలో ఎస్వీరంగారావులా అనుకున్నాడు రచయిత.

కానీ - అంతలోనే అప్పారావు జ్ఞాపకం వచ్చాడు, నిస్సత్తువ ఆవహించింది. తన కథని బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టినంత బాధ కలిగింది. తన బార్లో రోజూ బిల్లు కట్టకుండా మందు తాగే పన్నుల అధికార్ని చూసి బారు ఓనరు లోలోపల నిశ్సబ్దంగా కుళ్ళుకుంటూ ఏడ్చినట్లు, రచయిత కూడా మనసులోనే రోదించసాగాడు.

'నా కథ అప్పారావుకి ఎలా అర్ధమైంది? ఇదెవరికైనా తెలిస్తే నాకెంత పరువు తక్కువ!' అనుకుంటూ అట్టర్ ఫ్లాప్ సినిమా తీసిన సూపర్ డైరక్టర్లా అవమాన భారంతో దీర్ఘాలోచనలో మునిగిపోయ్యాడు రచయిత.

రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాడు రచయిత. ఎంత ఆలోచించినా.. అవి చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలా సాగుతూ, అక్కడక్కడే తిరుగుతున్నాయి గానీ, ఓ కొలిక్కి రావట్లేదు. అందువల్ల - మండే వేసవి ఎండలకి కరిగే గుంటూరు తారు రోడ్డు వలే.. రచయిత బుర్ర మరీ హీటెక్కిపోయింది.

'లాభం లేదు, ఒక కథ రాయడానిక్కూడా ఎప్పుడూ ఇంతగా ఆలోచించలేదు. ఈ విషయం తేల్చాల్సిందే.' అనుకుంటూ అప్పారావుకి ఫోన్ చేశాడు.

"రచయిత గారు నమస్తే!" అప్పారావు లైన్లోకొచ్చాడు.

"నువ్వు నాకో విషయం చెప్పాలయ్యా అప్పారావు. నా కథలో నీకేం నచ్చింది?" సూటిగా సుత్తి లేకుండా అడిగేశాడు రచయిత.

అప్పారావు వైపునుండి కొద్దిసేపు నిశ్శబ్దం.

"హ్మ్.. మీ కథ బాగుందండి." మొహమాటంగా అన్నాడు అప్పారావు.

"నేనడిగేదీ అదే, నీకాకథ ఎందుకు నచ్చింది?" రెట్టించాడు రచయిత.

అటువైపు నుండి మళ్ళీ నిశ్శబ్దం.

"అప్పారావు! అడిగేది నిన్నే! లైన్లోనే ఉన్నావా?" అసహనంగా అడిగాడు రచయిత.

"రచయిత గారు! క్షమించండి. వాస్తవానికి మీ కథ ఒక్క ముక్క కూడా నాకు అర్ధం కాలేదు." ఇబ్బందిగా అన్నాడు అప్పారావు.

"మరి బాగుందని ఎందుకు చెప్పావ్?" ఆశ్చర్యంగా అడిగాడు రచయిత.

"మీరు నన్ను మన్నించాలి. మిమ్మల్ని ప్లీజ్ చెయ్యాలని ఒక చిన్న అబద్దం ఆడాను, అంతే!" తప్పు చేసినవాడిలా అన్నాడు అప్పారావు.

"థాంక్స్ అప్పారావ్."

లైన్ కట్ చేశాడు రచయిత. ఈ థాంక్స్ దేనికో అప్పారావుకి అర్ధమయ్యే అవకాశం లేదు.

మర్డర్ మిస్టరీని చేధించినప్పుడు షెర్లాక్ హోమ్స్, డిటెక్టివ్ యుగంధర్, పెర్రీ మేసన్ లకి కలిగే ఆనందం, తృప్తి లాంటివి.. రచయితక్కూడా కలిగాయి.

'అనవసరంగా పొద్దున్నుండి ఎంతలా ఆవేదన చెందాను!' సారా పేకెట్లు పంచకుండానే ఎలక్షన్లో గెలిచిన ఎమ్మెల్యేలా సంతోషంతో పొంగిపోయ్యాడు రచయిత.

'అప్పారావుకి కథ నిజంగా అర్ధమైనట్లైతే అసలు రచన చెయ్యడమే మానేద్దును. ఇప్పుడా ప్రమాదం తప్పిపోయింది. ఇది తెలుగు జాతి అదృష్టం, తెలుగు సాహిత్యం చేసుకున్న పుణ్యం.'

రచయితకి ఒక్కసారిగా తన శిష్యకోటి, అవార్డులు, రివార్డులు, సన్మాన శాలువాలు గుర్తొచ్చాయి. గర్వాతిశయములతో గుండెల్నిండా గాలి పీల్చుకుని.. ఒక కొత్త రచనకి శ్రీకారం చుట్టాడు.

అంకితం :

పాఠకులకి అర్ధం కాకుండా రాస్తూ లబ్దప్రతిష్టులైపోయిన తెలుగు రచయితలందరికీ అభినందనలతో..

(picture courtesy : Google)