Showing posts with label బుల్లికథ. Show all posts
Showing posts with label బుల్లికథ. Show all posts

Tuesday, 11 March 2014

కుప్పల చెత్తసామి


అది ఆంధ్రదేశంలోనున్న వేలాది మురికి వీధుల్లో ఒకటి. ఆ మూలగా ఓ చెత్త కుండీ. ఆ పక్కనే మురిక్కాలవ. దాని గట్టు మీద ఒక నడివయసు మనిషి. బక్కగా, నల్లగా, మాసిన గుడ్డల్తో, గెడ్డంతో.. చెత్తకుండీ, మురిక్కాలవకి మ్యాచింగ్ బోర్డర్లా ఉన్నాడు.

అతగాడు అరగంట క్రితం ప్రభుత్వంవారి చౌక మద్యం సేవించాడు. ఆ మద్యం కల్తీలేని స్వచ్చమైనదైయ్యుంటుంది, అందుకే నిఖార్సైన కిక్కుతో మత్తుగా జోగుతున్నాడు. ప్రశాంతంగా బీడీని కాల్చుకుంటూ ఆనందడోలికల్లో తేలియాడుచున్నాడు.

ఇంతలో అటువైపుగా వచ్చాడు ఓ పచ్చచొక్కా పెద్దమనిషి. పచ్చచొక్కాకి మురికి మనిషిని చూస్తుంటే నలిగిపోయిన ఓటులాగా కనిపించాడు.. ఎలక్షన్ల సీజను మరి!

"చూడు నాయనా! రేపు ఎలక్షన్లలో నీ ఓటు మా బాబు పార్టీకే వెయ్యాలి. అర్ధమైందా?" అంటూ పార్టీ ప్రచారం మొదలెట్టాడు.

మురికి మనిషి ఆనందానికి బ్రేకు పడింది. హఠాత్తుగా స్వర్గం అంచు నుండి జారిపడినట్లైంది. అంచేత చిరాగ్గా చూశాడు.

"ఏంది ఏసేది? ఎందుకెయ్యాల?" పెళుసుగా అన్నాడు మురికి మనిషి.

"ఎందుకా? అబివృద్ధి కోసం. రేపు కొత్త రాష్టం బాగుపడాలంటే మనమందరం బాబుకే ఓటెయ్యాలి. అసలు బాబు ఎంత గొప్పనాయకుడు? అబివృద్ధికి చొక్కా తొడిగి, గెడ్డం పెంచితే.. అది అచ్చు బాబు లాగే ఉంటుది." ఉపన్యాస ధోరణిలో అన్నాడు పచ్చచొక్కా మనిషి.

"ఏంది ఉండేది? అందుకేగా అబిరుద్ది, అబిరుద్ది అంటూ సోమ్ములన్నీ ఐదరాబాదులో కుప్పగా పోసాడు?" కాలిపోయిన బీడిని విసిరేస్తూ చికాగ్గా అన్నాడు మురికి మనిషి.

"ఈసారట్లా చెయ్యళ్ళే. అన్ని ఊళ్లు సమానంగా అభివృద్ధి చేస్తాడు. నాదీ హామీ." అన్నాడు పచ్చచొక్కా మనిషి.

"అంటే ఈసారి అబిరుద్ది చిన్నచిన్న కుప్పలుగా సేస్తాడన్నమాట." ముద్దగా అన్నాడు మురికి మనిషి.

"అవును, అవునవును. నేచేప్పేదదే." సంతోషంగా అన్నాడు పచ్చచొక్కా మనిషి.

"అట్టాగా! అయితే ఇసయం ఆలోచిస్తాలే." అంటూ మత్తుగా కళ్ళు మూసుకున్నాడు మురికి మనిషి.

'అమ్మయ్యా! ఈమాత్రం హామీ చాలు.' అనుకుంటూ అక్కణ్నుండి కదిలింది పచ్చచొక్కా.


రోడ్డు మలుపులో ఓ బడ్డీకొట్టు. కొట్లో ఓ పాతికేళ్ళ కుర్రాడు. గోళీ సోడా కొట్టించుకున్నాడు పచ్చచొక్కా పెద్దమనిషి. సోడా తాగుతూ కొట్లో కుర్రాణ్ణి అడిగాడు.

"తమ్ముడూ! ఇక్కడంతా శుభ్రంగా ఉందిగా. అతనెవరో ఇక్కడ కాకుండా ఆ చెత్తకుండీ దగ్గర ఉన్నాడెందుకు?"

"ఆడా? ఆడిది మునిసిపాలిటీలో చెత్త ఎత్తే ఉద్యోగం సార్. రోజూ పొద్దున్నే మునిసిపాలిటీ ఆడోళ్ళు చీపుళ్ళతో రోడ్డు మీద చెత్తని చిన్నచిన్న కుప్పలుగా చిమ్ముతారు. ఈడు ఎనకమాలగా ఆ చిన్న కుప్పల్ని తోపుడు బండిలోకి ఎత్తుతాడు." అన్నాడు బడ్డీకొట్టు కుర్రాడు.

"అట్లాగా!"

"ఆడికి సొంతిల్లుందండి. కానీ ఆ చెత్త కంపు అలవాటైపోయిందనుకుంటా. అందుకే డ్యూటీ అయ్యాక్కూడా ఆడే కూర్చుంటాడు." అన్నాడు ఆ బడ్డీకొట్టు కుర్రాడు.

"బాగా తాగి ఉన్నట్టున్నాడు." పచ్చచొక్కా అబ్జర్వేషన్.

"ఆడు టొంటీఫోర్ అవర్సు ఫుల్లు ఆన్ లోనే ఉంటాడండి బాబు." నవ్వాడు బడ్డీకొట్టు కుర్రాడు.

"రాజకీయం బాగానే చెబుతున్నాడు." అన్నది పచ్చచొక్కా.

"ఆడి పేరు కుప్పుసామి. చేసేది చెత్త కుప్పల పని. అందుకే ఆడేది చెప్పినా చెత్త కుప్ప భాషలోనే చెబుతాడు, ఏ విషయాన్నైనా ఆ భాషలోనే అర్ధం చేసుకుంటాడు. అందుకే ఆణ్ణందరూ 'కుప్పల చెత్తసామి' అంటారు." నవ్వుతూ అన్నాడు బడ్డీకొట్టు కుర్రాడు.

పచ్చచొక్కాకి ఇప్పుడు తత్వం బోధపడింది. నిట్టూరుస్తూ చిన్నగా ముందుకు కదిలాడు.

(photo courtesy : Google)

Tuesday, 20 August 2013

జరుగుతున్న కథ



పైనేదో మర్డర్ జరిగినట్లు నెత్తుటి గడ్డలా ఎర్రగా ఉంది ఆకాశం. ఫ్యాక్షనిస్టు సినిమాల్లో విలన్ కొంపలా విశాలంగా ఉందా ఇల్లు. హాలు మధ్యనున్న ఓ పేద్ద సోఫా.. ప్రజల రక్తం తాగే దుర్మార్గపు రాజు కూర్చునే సింహాసనంలా ఉంది. దానిపైనున్న ఆకారం రావు గోపాలరావు లాంటి ఆ ఊరి ప్రెసిడెంటుది.

ప్రెసిడెంటు చుట్ట తాగుతూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎదురుగా అల్లు రామలింగయ్య లాంటి జోగినాధం వినయంగా వంగిపోతూ నించునున్నాడు. వాతావరణం కడు గంభీరంగా ఉంది.

"జోగినాధం! ఏంటి ఊళ్ళో హడావుడి?" చుట్ట పొగ గుప్పున వదుల్తూ అడిగాడు ప్రెసిడెంటు.

ఇబ్బందిగా కదిలాడు జోగినాధం.

"చిత్తం. ఏదో చిన్నపాటి గొడవే లెండి. ఆ ఈరిగాడి కొడుకుల ఆస్థి తగాదా ఈనాటిదా? యాభయ్యారేళ్ళుగా నలుగుతుంది. తమరు ధర్మప్రభువులు.  ప్రజల కోరికపై ఎంతో ధర్మబద్దంగా ఆస్థి పంపకాలు కావించారు. ఇప్పుడా ఇల్లు తమ్ముడి వైపు పోయిందని అన్న నానా యాగీ చేస్తున్నాడు."

"అదేంటి జోగినాధం? ఈ సమస్య చాల్రోజుల్నించి పెండింగులో ఉందనీ, మనం చెప్పినట్లు నడుచుకుంటామని అన్నది వాళ్ళే కదా?" చిటపటలాడాడు ప్రెసిడెంటు.

"చిత్తం. కూలెదవలు కదండీ? పూటకో మాట మారుస్తారు. రెండ్రోజులు కడుపు కాల్తే వాళ్ళే దారికొస్తారు." భరోసాగా అన్నాడు జోగినాధం.

ఇంతలో హడావుడిగా వచ్చాడు సాక్షి రంగారావు లాంటి పంతులు.

"అయ్యా అయ్యా దొరవారు! ఘోరం జరిగిపోతుంది. రేపు రాబోయే ఎలక్షన్లో లబ్ది పొందడం కోసమే మీరు తప్పుడు తీర్పు చెప్పారని ఆ నాగభూషణం మనుషులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇట్లా అయితే మనకి ముందుముందు కష్టమే సుమండీ." అంటూ నశ్యం ఎగబీలుస్తూ దీర్ఘం తీశాడు పంతులు.

'నువ్వు నోర్మూసుకో' అన్నట్లు పంతులు వైపు గుడ్లురుమి చూశాడు జోగినాధం. విషయం అర్ధం కాక బుర్ర గోక్కున్నాడు పంతులు.

"నాయాల్ది. ఆ భూషణం గాణ్ని యేసెయ్ మంటారా దొరా?" కర్ర తీసుకుని లేచాడు ఆర్. నాగేశ్వర్రావు లాంటి బాబులు గాడు.

"నువ్వూరుకోవో. ఎప్పుడు ఏది చెయ్యాలో అదే చెయ్యాల. ఇప్పుడు కాదు.. ముందుముందు నీకు చాలా పనుందిలే." అంటూ బాబులు గాణ్ని ముద్దుగా విసుక్కున్నాడు ప్రెసిడెంటు.

ఆపై ఆరిపోయిన చుట్ట వెలిగించుకుంటూ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ప్రెసిడెంటు.


'అంటే ఊళ్ళో నాగభూషణం నాయకత్వంలో నామీదే ఎగస్పార్టీ తయారవుతుందన్న మాట. విషయం అందాకా వచ్చిందా! ఇప్పుడేం చెయ్యాలి?'

"మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. మీరు వాళ్ళ గూర్చి పట్టించుకోకండి. వాళ్ళ మొహం, వాళ్ళెంతా? వాళ్ళ బతుకులెంతా?" కళ్ళజోడు పైకి లాక్కుంటూ అన్నాడు జోగినాధం .

జోగినాధం వైపు సాలోచనగా చూసాడు ప్రెసిడెంటు.

ఆ విధంగా తీవ్రంగా యోచించిన ప్రెసిడెంటు కొద్దిసేపటికి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసి భయపడ్డాడు పంతులు. ప్రెసిడెంటు నవ్వులో సంతోషం లేదు. లేడిని చంపబోయ్యే ముందు పులిలో కనిపించే క్రూరత్వం ఉంది. ప్రెసిడెంటు నవ్వులో అమాయకత్వం లేదు. ముక్కుపుడక్కోసం ముక్కుపచ్చలారని చిన్నారిని నలిపెయ్యబొయ్యే కసాయివాడి కఠినత్వం ఉంది.

దొరవారు కొద్దిసేపు వారి నీచదుర్మార్గపు నవ్వు నవ్వి జోగినాధం వైపు సర్దాగా చూశారు.

"జోగినాధం! నీకో పని చెబుతున్నాను. జాగర్తగా విను. కొన్నాళ్ళపాటు నువ్వు నా గడప తొక్కరాదు." అన్నాడు ప్రెసిడెంటు.

తుఫానులో చిక్కుకుపోయిన కుక్కపిల్లలా గజగజలాడిపొయ్యాడు జోగినాధం.

"అయ్యా ఆయ్యా! తమ చల్లని పాదాల నీడన బతుకుతున్నాను. కావాలంటే ఇక్కడే ఇప్పుడే కత్తితో పొడిచేసి చంపెయ్యండి. అంతేగాని నాకంత పెద్ద శిక్ష విధించకండి." బావురుమంటూ దొరగారి కాళ్ళపై పడిపొయ్యాడు జోగినాధం.

ప్రెసిడెంటు మళ్ళీ నవ్వాడు. తన శిష్యుడైన నక్క చూపిస్తున్న వినయానికి మెచ్చిన తోడేలు నవ్వులా ఉందా నవ్వు.

"నీ స్వామి భక్తి నాకు తెలీదా జోగినాధం? అగ్గిపుల్లే కదాని ఆర్పకుండా పడేస్తే అడివంతా అగ్గెట్టేస్తది. రాజకీయాల్లో అన్ని వైపులా కాచుకుని ఉండాలి. జాగర్తగా లేకపోతే రేపా కూలెదవలే కొంప ముంచుతారు. అంచేత నే చెప్పొచ్చేదేంటంటే.. నువ్వూళ్ళోకెళ్ళి ఆ గొడవల్లో దూరు. ఆవేశపడు. అవసరమైతే నన్నో నాలుగు తిట్టు. ఏదోక రకంగా ఆ కూల్జనాల విశ్వాసం సంపాదించు. వారిపై పట్టు సంపాదించి వారికి నాయకుడివైపో, నాగభూషణాన్ని పడగొట్టెయ్."

జోగినాధం మళ్ళీ ప్రెసిడెంటు కాళ్ళ మీద పడ్డాడు.

"ఆహాహా! తమరి బుర్రే బుర్రండి. లక్షల కోట్ల ఆలోచన చెప్పారు."


"అర్ధమైందిగా జోగినాధం? ఈ ఊళ్ళో నాకు ఎగస్పార్టీ ఉండకూడదు. ఉన్నా అది నా మనిషే అయ్యుండాల. అంచేత మన ప్లాన్లో ఎక్కడా తేడా రాకూడదు. ఈ క్షణం నుండి నువ్వూ నేనూ ఎగస్పార్టీ వాళ్ళం. నీకూ నాకు మధ్యన పచ్చ గడ్దేస్తే అది సర్రున మండాలా. ఎప్పటికప్పుడు అక్కడ కూపీలన్నీ పంతుల్తో నాకు చేరెయ్యి." గర్వంగా మీసాలు దువ్వుకుంటూ అన్నాడు ప్రెసిడెంటు.

"చి.. చి.. చిత్తం" వంగివంగి నమస్కారం చేస్తూ నిష్క్రమించాడు జోగినాధం.

పంతులుకి భయం వేసింది. అతనికి భయంకర కీకారణ్యంలో, అంతకన్నా భయంకరమైన క్రూరమృగాల మధ్యన ఉన్నట్లుగా అనిపించింది.

(picture courtesy : Google)

Saturday, 1 June 2013

గాడీజ్ గ్రేట్


అతగాడు యువకుడు. ఉత్సాహవంతుడు. మొదటిసారిగా ప్రజాప్రతినిధి (ప్ర.ప్ర.) గా ఎన్నికయ్యాడు. రాష్ట్రాన్ని సింగపూర్ లా మార్చెయ్యాలనేది తన పార్టీ అగ్రనాయకుల కల, చిరకాల వాంఛ. తదనుగుణంగా ప్ర.ప్ర. కూడా తన నియోజకవర్గాన్ని సింగపూర్ గా మార్చెయ్యాలని నడుం కట్టాడు.

అయితే ప్ర.ప్ర.కి ఓ తలనొప్పొచ్చిపడింది. తన నియోజకవర్గంలో ఎక్కువమంది కొంపాగోడూ లేని దరిద్రులు. వారిలో ఎక్కువమంది రోడ్ల పక్కనే నివసిస్తున్నారే. వారిని వదిలించుకోవటం ఎలాగో అర్ధం కావట్లేదు. వారి వోట్లతోనే తను ప్ర.ప్ర. అయ్యాడు మరి.

వీళ్ళకి తోడు కొందరు ముష్టివాళ్ళు. కనీసం ఆ ముష్టివాళ్ళనైనా తరిమేద్దామని ప్రయత్నించాడు. అప్పోజిషన్ వాళ్ళు 'ఇదన్యాయం. ఈ దేశానికి ముష్టివాళ్ళే ముద్దుబిడ్డలు.' అంటూ గొంతు చించుకున్నారు. వారి విమర్శలకి జంకిన ప్ర.ప్ర. ఏం చెయ్యాలో తోచక తల పట్టుకున్నాడు. ఏ దిక్కూ లేనివాడికి దేవుడే దిక్కు.

"భగవాన్! ఏమిటి నాకీ దుస్థితి? ఏదోక దారి చూపవయ్యా." అని దేవుణ్ని వేడుకున్నాడు.

దేవుడు కరుణించాడు. ఆ యేడాది ఒకటే వర్షాలు. ఎన్నడూ లేనిది వరదలొచ్చాయి. కాలవలు, రోడ్లూ ఏకమై ఉప్పొంగిపొయ్యాయి. మర్నాటికల్లా గతుకుల రోడ్లు, అతుకుల గుడిశలు కొట్టుకుపొయ్యాయి. ఆ తరవాత ఒకటే దోమలు, ఈగలు, బురద, కుళ్ళు, దుర్గంధం.

తద్వారా విషజ్వరాలు, విరోచనాలు. ఆ దెబ్బకి మూడోవంతు 'దరిద్రపుగొట్టు జనాభా' చచ్చింది. ప్ర.ప్ర. చచ్చినవారికి యాభైవేలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష చేసి మరీ సాధించాడు (ధర్మప్రభువు).

తన నియోజక వర్గ అభివృద్దే ఊపిరిగా బ్రతుకుతున్న ప్ర.ప్ర. కొట్టుకు పోయిన గతుకుల రోడ్ల స్థానంలో వెడల్పాటి కొత్త రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాడు (పది పర్సెంట్ కమిషన్ బేసిస్ మీద). వరదలోస్తే వచ్చాయి గానీ.. ఇప్పుడీ వెడల్పాటి విశాలమైన రోడ్లు ఎంత ముద్దొస్తున్నాయో! ఒక పావలా సింగపూర్ వచ్చేసినట్లే.

కొత్త రోడ్డు వేసేదాకా ఓపిగ్గా నక్కిన దరిద్రులు.. రాత్రికిరాత్రే రోడ్ల మార్జిన్లని మళ్ళీ ఆక్రమించారు. ఆ విధంగా సమస్య తీవ్రత తగ్గింది గానీ.. అసలు సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఈసారి ప్ర.ప్ర. సమస్య పరిష్కారం కోసం తీవ్రస్థాయిలో పూజలు, పునస్కారాలు చేయించాడు. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు (పుణ్యాత్ముడు).

ఆ యేడాది ఎప్పుడూ లేనంతగా విపరీతమైన చలి. ఊరంతటినీ డీప్ ఫ్రీజ్ లో పెట్టి డోర్ మూసినట్లుగా గజగజా వణికిపోయింది. బిక్షగాళ్ళు ఆ చలికి ఎముకలు కోరుక్కుపోయ్యి చచ్చారు. పూరిపాకల పూర్ పీపుల్ వెన్నులోంచి చలి కమ్మి నీలుక్కుపోయ్యి చచ్చారు. ప్ర.ప్ర. మళ్ళీ దీక్ష చేసి చచ్చినవారికి ప్రభుత్వం నుండి ఈమారు లక్ష రూపాయిలు ఇప్పించాడు (ధర్మప్రభువు).

ఆ విధంగా చలికాలం వెళ్లేసరికి రోడ్డు మార్జిన్లు ఖాళీ అయ్యాయి. ఆ మార్జిన్లని మరింతగా విస్తరింపజేసి అభివృద్ధి చెయ్యడానికి నిధులు శాంక్షన్ చేయించుకున్నాడు (ఈసారి ఇరవై పర్సెంట్ కమిషన్). లాన్లు వేయించాడు. లారీల్లో తెప్పించిన పూల మొక్కల్ని దగ్గరుండి మరీ నాటించాడు (మంచి టేస్టున్న మనిషి).


పచ్చని పచ్చికలో రంగురంగుల పూల మొక్కలు సుతారంగా, వయ్యారంగా కబుర్లాడుకున్నాయి. అవన్నీ నర్సరీ నుండి వచ్చాయి కావున ఇంగ్లీషు మీడియం విద్యార్ధుల్లా ఠీవీగా, గర్వంగా కూడా ఉన్నాయి. ప్రకృతి ఎంత అందముగా యుండును!

ప్రతి దేశంలోనూ మొండిప్రాణాలుంటయ్. వాళ్ళు ప్రకృతిని, దేవుణ్ణి కూడా జయిస్తారు. కానీ తమ దరిద్రాన్ని మాత్రం జయించలేరు. అంచేత అక్కడక్కడా ఇంకా కొందరు మొండి ముదనష్టపు వెధవలు దిష్టిపిడతల్లా మిగిలే (బ్రతికే) ఉన్నారు. వాళ్ళు ఆ ముద్దులొలికే మొక్కల మధ్యనే స్నానపానాదులు, ఆశుద్ధ విసర్జన కార్యక్రమాలు నిర్లజ్జగా కానిస్తున్నారు. వాళ్ళసలు మనుషులేనా! ప్ర.ప్ర.కి గుండె బరువెక్కింది.

నా నియోజక వర్గానికి ఈ దరిద్రుల దరిద్రం వదలదా? తన సింగపూరు కల ఇక నెరవేరదా? నా ఆశ అడియాశయేనా? ప్ర.ప్ర.కి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఈసారి పట్టుదలగా గొప్పయాగం చేయించాడు. అదేమన్నా సామాన్యమైన యాగమా! అలనాడు పిల్లల కోసం దశరధ మహారాజు కూడా ఇంత భీకర యజ్ఞం చేసి ఉండడు. దేశంలో ఉన్న వేదపండితులు ప్ర.ప్ర.ని మెచ్చుకున్నారు. దీవించారు.

తన భక్తుని పూజలకి భగవంతుడు మిక్కిలి సంతసించాడు. అతగాడి కష్టాలకి కారణమైన దౌర్భాగ్య దరిద్రుల పట్ల కన్నెర్ర చేశాడు. ఫలితంగా ఆ యేడాది ఎండాకాలం నిప్పుల కొలిమిలా భగభగా మండిపోయింది. సూర్యుడి భీకర ప్రతాపానికి సశేషంగా ఉంటున్న దరిద్రులంతా మలమలా మాడి చచ్చి నిశ్శేషం అయిపోయ్యారు. ఒక్కడూ మిగలని కారణాన ప్ర.ప్ర.కి నష్టపరిహార దీక్ష కూడా అవసరం లేకుండా పోయింది.

ఇప్పడు ప్ర.ప్ర. కల నెరవేరింది. ఒక్కసారి అటుగా వెళ్లి చూడండి. విశాలమైన రోడ్లు. సుందర నందనవనంలాంటి పార్కులు. కళ్ళు చెదిరే షాపింగ్ మాల్స్. స్విమ్మింగ్ పూల్స్. టెన్నిస్ కోర్టులు. హెల్త్ స్పాలు. క్లబ్బులు. పబ్బులు. సింగపూర్ని కాదు.. లాస్ వేగాస్ నే దించేశాడు ప్ర.ప్ర.

ఈ అభివృద్ధికి కళ్ళు చెదరగా, కళ్ళు చెమర్చగా.. ఇదే మోడల్ని రాష్ట్ర ప్ర.ప్ర.లందరూ అనుసరించాలని పార్టీ అగ్రనాయకత్వం పిలుపునిచ్చింది. ప్ర.ప్ర. మిక్కిలి సంతసించెను. తన జన్మ ధన్యమైనది. ఇదంతా ఆ భగవానుడు తనకి ప్రసాదించిన వరం. గాడీజ్ గ్రేట్!

(కథ అయిపొయింది.)

epilogue 


ఇదేం కథ! ప్ర.ప్ర. ఎవరికీ అన్యాయం చెయ్యలేదు. పైగా నియోజక వర్గాన్ని మొక్కవోని దీక్షతో అభివృద్ధి చేశాడు. ఆ దరిద్రులపై ప్రకృతి వికృతంగా పగబట్టింది. అంతే! అసలు నిజానికి మనం ప్ర.ప్ర.ని అభినందించాలి.

అన్నట్లు ఇందాక ఒక ముఖ్యమైన సంగతి చెప్పడం మరచితిని.

ఏమది?

ఆ మాల్స్, మల్టిప్లెక్సులు, క్లబ్బులు, పబ్బులు మన ప్ర.ప్ర. సొంత ఆస్తి. తన నియోజక వర్గం గుడిసెల్తో, గుంటలతో దరిద్రంగా ఉండే రోజుల్లో చవగ్గా ఆ స్థలాలు కొనేశాడు. అమ్మనివారిని బెదిరించి మరీ కొన్నాడు. వీలైన చోట కబ్జా చేశాడు.

ఆక్రమణల అలగా వెధవలు 'ప్రకృతి ధర్మం'గా చచ్చుచుండగా.. భూముల విలువ పెరగుచుండగా.. ప్ర.ప్ర. తన స్థలం ఒక్కోదాన్ని ఒక్కొరకంగా డెవలప్మెంట్ కి ఇవ్వసాగెను. అందుకే అంత తొందరగా తన సింగపూర్ కలని సాకారం చేసుకోగలిగెను.

(ఇప్పుడు నిజంగానే కథ అయిపోయింది.)

(photo courtesy : Google)

Friday, 24 May 2013

దేశమేరీతిన బాగుపడేను!


వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. చిన్నప్పట్నుండి కలిసే పెరిగారు. కలిసే ఏడో క్లాసు తప్పారు. వారి ఇళ్లూ పక్కపక్కనే.

వీరు రోజూ టీవీలో వార్తలు కలిసే చూస్తారు. ఆపై కలిసే సిగరెట్లు తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు.

"మన దేశపోళ్ళు ఎంత మంచోళ్ళు! ఆ పాకిస్తాన్ సాలాగాళ్ళు మన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నార్రా!"

"అవునవును. మనం ఆ పాకిస్తాన్ని ఆక్రమించేస్తే పీడా ఇరగడవుద్ది."

"దేశంలో మతకలహాలు పెచ్చురేగిపొతన్నాయి."

"అవునవును. సాయిబుల్నందర్నీ పాకిస్తాన్లోకి తరిమిస్తే ఒక పనైపోద్ది."

"దేశంలో మా భాష గొప్పదంటే మా భాష గొప్పదని కొట్టుకు సస్తున్నారు."

"అవునవును. అందుకే భారద్దేశమంతా తెలుగుభాషే మాట్లాడాలని రూలు పెట్టాల."

"ఎదవ నాయాళ్ళు! ప్రాంతం, అసమానత అంటూ తెగ నీలుగుతున్నారు."

"అవునవును. మనూర్ని రాజధాని నగరంగా సేస్తేగానీ సమస్య తీరేట్టు లేదు."

"ఈ కులాల సమస్య కూడా రోజురోజుకీ ఎక్కువైపోతంది. దేశం ఎనక్కిపోతంది."

"అవునవును. తక్కువ కులం నా కొడుకులకి కొమ్ములొచ్చాయి. ఆళ్ళందరికీ ఓటు లేకండా సేస్తేగానీ దారికిరారు."

"పొలం తగాదాలు కూడా ఎక్కువైపోతన్నాయి. లా అండ్ ఆర్డర్ పెద్ద సమస్యగా మారింది."

"అవునవును. ఈ ఊరంతా మన పొలమే ఉండాల. అప్పుడే లా ఉంటది, ఆర్డరూ ఉంటది."

"దేశవంతా రాజకీయంగా యిడిపోయింది. ఇది దేశానికి మంచిది కాదు."

"అవునవును. అందుకే దేశవంతా మనోడి పార్టీయే ఉండాల."

"రాజకీయంగా నాయకుల మధ్య కీచులాట దేశానికి మంచిది కాదురా."

"అవునవును. అందుకే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా మనోళ్ళే ఉండాల."

"భలే చెప్పావురా! నాదగ్గర సిగరెట్లైపొయ్యాయి. నీదగ్గిరేవైనా ఉన్నయ్యా?"

"నా దగ్గిరా అయిపొయ్యాయిరా. పద! అచ్చయ్య కొట్టు కాడికెళ్లి కొనుక్కొచ్చుకుందాం."

(photo courtesy : Google)

Wednesday, 22 May 2013

దొంగ


ఆ యువకులిద్దరూ బాగా చదువుకున్నవారు. చాలాకాలంగా స్నేహితులు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో నిత్యం కలహించుకునే రెండు రాజకీయ పార్టీల అభిమానులుగా విడిపొయ్యారు. అందువల్ల వారిమధ్య రాజకీయంగా తరచూ వాదప్రతివాదనలు చోటు చేసుకుంటున్నాయి. 

ఇవ్వాళ కూడా (రోజూలాగే) ఇద్దరి మధ్యా చర్చ చిన్నపాటి వాదనగా మొదలై పెద్దపాటి కేకలు, అరుచుకునే స్థాయిదాకా వెళ్ళింది.

"మీ నాయకుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు కాజేశాడు."

"మీ నాయకుడు మాత్రం తక్కువా? రెండు లక్షల కోట్లు కాజెయ్యలేదా?"

"మా నాయకుడికి రాష్ట్ర అభివృద్దే ఊపిరి."

"మా నాయకునికి ప్రజల సంక్షేమమే జీవనం."

స్నేహితులిద్దరూ ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకున్నారు.

ఇంతలో "దొంగ! దొంగ!" అంటూ అరిచారెవరో. స్నేహితులిద్దరూ తల తిప్పి అటుగా చూశారు.

ఎదురుగా పెప్సీ తాగుతున్న నడివయసు బట్టతల పెద్దమనిషి. అతని జేబులోంచి పర్స్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఓ కుర్రాడు. పెప్సీ బట్టతల ఆ కుర్రాడి చెయ్యి గట్టిగా పట్టేసుకుని 'దొంగ దొంగ' అంటూ అరుస్తున్నాడు.

స్నేహితులిద్దరూ క్షణంలో దొంగని దొరకబుచ్చుకున్నారు. ఆ దొంగకి సుమారు పదహారేళ్ళు ఉండొచ్చు. నల్లగా, సన్నగా వెదురుబద్దలా ఉన్నాడు. మాసిన చొక్కా, చింపిరి జుట్టు. మన హీరోల పట్టు విడిపించుకోడానికి గిలిగిలలాడుతూ మెలికలు తిరిగిపోతున్నాడు.

స్నేహితులిద్దరూ ఆ పక్కనే కొబ్బరి బొండాలు అమ్మేవ్యక్తి దగ్గర కొబ్బరి తాడు తీసుకున్నారు. దొంగ పెడరెక్కలు వెనక్కి విరిచి రోడ్డు వారాగా ఉన్న కరెంటు స్తంభానికి కట్టేశారు.

ఇంక విడిపించుకోలేనని గ్రహించిన దొంగ "అన్నా! వదిలెయ్యన్నా! ఇంకెప్పుడూ చెయ్యనన్నా! నీ కాల్మొక్తా అన్నా!" అంటూ ఏడవసాగాడు. ఈ లోపు చుట్టూతా పెద్ద గుంపు తయారయ్యింది.

ఎర్రటి ఎండ. తారు రోడ్డు పెనంలా కాలిపోతుంది. కరెంటు స్తంభం నిప్పుల కొలిమిలో కాల్చి తీసినట్లు మండిపోతుంది. ఎవరో దొంగ చొక్కా, పేంటు చింపేసారు. చిరుగుల డ్రాయర్ అతగాడి నగ్నత్వాన్ని కప్పలేకపోతుంది.

స్నేహితులిద్దరూ దొంగపై పిడిగుద్దులు కురిపించారు. కొద్దిసేపటికి చేతులు నొప్పెట్టాయి. మోకాళ్ళతో దొంగ డొక్కల్లో కుమ్మారు. కొద్దిసేపటికి మోకాళ్ళు నొప్పెట్టాయి. అంచేత ఎగిరెగిరి కడుపులో తన్నారు.

ఈ దృశ్యానికి ఉత్తేజితులైన ఇంకొందరు యువకులు కూడా దొంగని తన్నటం మొదలెట్టారు. అటుతరవాత దొంగని తన్నే పవిత్రకార్యానికి వారిలో పోటీ మొదలైంది. గుంపుగా తన్నారు. వంతుల వారిగా తన్నారు.

కొద్దిసేపటికి దొంగ కళ్ళు తేలేశాడు. నోట్లోంచి నెత్తురు కారసాగింది. ఇంకొద్దిసేపటికి తల వాల్చేశాడు. శరీరం మాంసం ముద్దలా ఎర్రగా మారిపోయింది.

ఇంతలో పోలీసులోచ్చారు. ఈ దేశంలో చట్టం తన పని తను చేసుకుపోతూనే ఉంటుంది. అందుచేత చట్టబద్దులైన పోలీసులు దొంగ కట్లిప్పదీశారు.

దొంగ రోడ్డుమీదగా వాలిపోయ్యాడు. చచ్చాడా? చచ్చే ఉంటాళ్ళే. ఇట్లాంటి దొంగవెధవలు బ్రతికి ప్రయోజనమేమి.. పరుల సొత్తు దోచుకోవడం తప్ప! మనది పుణ్యభూమి. ఇచ్చట దొంగతనం మహాపాపం.

స్నేహితులిద్దరికి సంతోషంగా ఉంది. బాధ్యత కలిగిన పౌరులుగా సమాజానికి సేవ చేసినందుకు ఆనందంగా ఉంది. ఈ దేశంలో అందరూ తమలా నేరం చేసినవాడికి శిక్ష పడేట్లు చేస్తే నేరాలే ఉండకపోను!

దొంగని శిక్షించడంలో అలిసిన స్నేహితులిద్దరూ ఆ పక్కనే ఉన్న హోటల్లో వన్ బై టూ టీ తాగుతూ మళ్ళీ కబుర్లలో పడ్డారు.

"మా నాయకుడు ప్రజాధనం దోచుకుంటే మాత్రం తప్పేంటి? అందులో కొంత ప్రజాసంక్షేమానికే ఖర్చు చేశాడుగా."

"మా నాయకుడు మిక్కిలి నిజాయితీపరుడు. ఇతరులెవ్వరినీ దోచుకోనివ్వడు."

ఈ విధంగా తమ కబుర్లు కొనసాగిస్తూ ఇంటిదోవ పట్టారు.

(photo courtesy : Google)