Showing posts with label నివాళి. Show all posts
Showing posts with label నివాళి. Show all posts

Thursday, 24 October 2013

మన్నాడే


ఈరోజు ప్రముఖ హిందీ సినిమా నేపధ్య గాయకుడు మన్నాడే మరణించాడు.

మన్నాడే మధుర గాయకుడు, శాస్త్రీయ సంగీతంలో నిష్టాతుడు.. ఇలా అనేక విశేషాలతో రేపటి పత్రికల్లో వ్యాసాలు వస్తాయి. ఆసక్తి ఉన్నవారు రేపటిదాకా ఆగవలసి ఉంటుంది.

మన్నాడే తన పాటలతో నన్ను అలరించాడు. ఆయనది చాలా క్లీన్ వాయిస్.

శాస్త్రీయ సంగీతంలో మంచి ప్రతిభ కలవారు సినిమా పాటలు పాడటానికి ఇబ్బందిగా ఫీలవుతారు. కారణం.. సినిమా అనేది పూర్తిగా డిఫెరెంట్ మీడియం. అక్కడ సన్నివేశాన్ని అనుసరిస్తూ, సందర్భాన్ని బట్టి నటీనటుల బాడీ లాంగ్వేజికి అనుగుణంగా పాడవలసి ఉంటుంది.

రాకెట్ సైంటిస్టుని రాకెట్ ఎలా ఎగురుతుందో ఒక చందమామ కథలాగా చెప్పమంటే ఇబ్బంది పడతాడు. వెయ్యిమందికి అవలీలగా వంట చేసేవాణ్ణి.. ఇద్దరికీ కాఫీ పెట్టమంటే చికాకు పడతాడు. రోజూ గుండె ఆపరేషన్లు చేసే డాక్టర్ని.. గొంతు నొప్పికి మందడిగితే చాలాసేపు ఆలోచిస్తాడు. ఇవన్నీ సింపుల్ గా కనిపించే ఇబ్బందికరమైన అంశాలు.

అట్లాంటి ఇబ్బందే గొప్ప గాయకులకి కూడా ఉంటుంది. మనకి తెలిసిన ఘంటసాల, రఫీలు శాస్త్రీయ సంగీతాన్ని పద్దతిగా నేర్చుకున్నారు. మంచి ప్రతిభావంతులు. అయితే వారు తమ ఇబ్బందిని అధిగమించి.. సినిమా పాటలకి తగ్గట్టుగా తమని తాము మలచుకున్నారు. గొప్ప విజయాలు సాధించారు. ఇదేమీ మామూలు విషయం కాదు. మన్నాడే కూడా ఈ మహాగాయకుల కోవకి చెందినవాడేనని నా అభిప్రాయం.

రచయితలకైతే ఫలానా కథ అని గుర్తు చేసుకుంటాం. గాయకులకైతే ఫలానా పాట అని జ్ఞాపకం చేసుకుంటాం. ఇంటర్నెట్ లో యూట్యూబ్ లింక్ ఇచ్చుకుని చూసుకునే సౌకర్యం ఉంది కాబట్టి.. నాకు నచ్చిన సినిమాలోంచి, నచ్చిన మన్నాడే పాటొకటి  ఇస్తున్నాను. చూసి ఆనందించండి.

Saturday, 13 July 2013

ప్రాణ్


హిందీ సినిమా నటుడు ప్రాణ్ చనిపోయాడు. ప్రాణ్ మనదేశంలో అత్యంత ప్రముఖుడైన దుష్టుడు. తొంభై సంవత్సరాలు దాటి జీవించాడు. బహుశా హిందీ సినిమా ప్రేక్షకులు ఆయన్ని (ఆయన పాత్రల్ని) తిట్టిన తిట్లన్నీ దీవెనలుగా మారి ఇంతటి దీర్ఘాయుష్షు ప్రసాదించాయేమో!

వందేళ్ళక్రితం ప్రజలకి సినిమా అంటే ఏంటో సరీగ్గా తెలీదు. సినిమా అందుబాటులోకి వచ్చిన మొదట్లో చాలారోజులపాటు అంతకుముందు ప్రదర్శించిన నాటకాల్నే సినిమాలుగా మార్చుకున్నారు. కొంతకాలానికి సాంఘిక కథలు సృస్టించడం మొదలెట్టారు.

అయితే ఈ 'సాంఘిక' కథలక్కూడా రామాయణ మహాభారత కథలే మూలం, స్పూర్తి అని నా అభిప్రాయం. మంచి లక్షణాలన్నంటినీ పేర్చి నాయకుడిగానూ, చెడ్డలక్షణాలన్నీ కుప్పపోసి ప్రతినాయకుడిగానూ కథలు రాసుకుని సినిమాలు తీశారు. అనగా విలన్ పాత్రలకి ప్యాంటు, షర్టు తోడిగినా.. వాడికన్నీ రాక్షస లక్షణాలే. అందుకే విలనెప్పుడూ దుర్మార్గుడు, నీచుడు, స్త్రీలోలుడు.

అంచేత ఆ రోజుల్లో దాదాపు అన్నిభాషల్లో ఇట్లాంటి విలన్ పాత్రలుండేవి (అనుకుంటున్నాను). 1950 మరియు 60 లలో తెలుగులో రాజనాల, తమిళంలో నంబియార్, హిందీలో ప్రాణ్ లు దుష్టపాత్రలు పోషించారు. అర్ధశతాబ్దం తరవాత.. ఇప్పుడు మనకా పాత్రలు cartoon characters లా అనిపిస్తాయి కానీ.. ఆ రోజుల్లో అవి కథకి అత్యంత అవసరమైన పాత్రలు.

మన తెలుగు ప్రేక్షకులది బీభత్సమైన టేస్ట్. అంచేత మన అభిరుచికి తగ్గట్లుగా దర్శకులు విలన్ మొహంపై కిందనుండి లైటు వేసి నీడల్ని సృష్టించి భయపెట్టడం.. కనుబొమలు మందంగా, వంకరగా మేకప్ చెయ్యడం వంటి రకరకాల ట్రిక్కులు  ప్రయోగించి.. సాధ్యమైనంత విలన్ మొహాన్ని క్రూరంగా చూపెట్టేవాళ్ళు. తమిళులది మనకన్నా మరీ బీభత్సమైన టేస్ట్.. ఆ విషయం మీకు నంబియార్ని చూస్తే స్పష్టంగా అర్ధమైపోతుంది.

పాపం హిందీలో ప్రాణ్ కి ఇట్లాంటి ఫెసిలిటీలు లేవు. ఆయన పాత్రరీత్యా (ఎక్కువగా) ఫుల్ సూట్లో కనబడేవాడు. మనిషి బాగుంటాడు. అంచేత హిందీ సినిమా విలన్ పాత్రలో క్రూరత్వ ప్రదర్శన కోసం ప్రాణ్ తనదైన కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టాడు. కళ్ళల్లో తోడేలు వంటి మోసపు చూపు, పెదవులపై వంకరగా నవ్వీనవ్వనట్లు ఒక విషపు నవ్వు చూపిస్తూ మనని భయపెట్టాడు. తద్వారా తనంటే ప్రేక్షకులు అసహ్యించుకునేట్లు చేసుకున్నాడు.

ప్రాణ్ విలన్ పాత్రల కోసం సిగరెట్లని కూడా చక్కగా ఉపయోగించుకున్నాడు. ఈ సిగరెట్ల విలనిజం (ముఖ్యంగా) దిలీప్ కుమార్, షమ్మీకపూర్ సినిమాల్లో గమనించవచ్చు. స్టైలిష్ గా లైటర్తో సిగరెట్ వెలిగించుకోవటం.. తన దుర్మార్గపు ప్లాన్ల గూర్చి తీవ్రంగా ఆలోచిస్తున్న భావం ప్రదర్శిస్తూ.. గుప్పుగుప్పున దట్టమైన సిగరెట్ పొగ వదుల్తూ (నిజానికి ఇవన్నీ చిన్నచిన్న ట్రిక్స్) గొప్ప విలనిజాన్ని పండించాడు ప్రాణ్.

ప్రాణ్ నిజజీవితంలో స్మోకరో కాదో తెలీదు కానీ.. తన పాత్రల కోసం మాత్రం దిండ్ల కొద్దీ సిగరెట్లు తాగుంటాడు (ఆ రకంగా చూసుకుంటే.. ఇన్ని సిగరెట్లు తాగి కూడా అన్నేళ్ళు బతకడం విశేషమే). ఆరోజుల్లో ప్రాణ్ కనిపిస్తే తన్నాలన్నంత కోపం, కసితో హిందీ సినిమా ప్రేక్షకులు ఉండేవారని చదివాను. ఇంతకన్నా ఒక నటుడికి గొప్ప compliment ఉంటుందనుకోను!

చివరి తోక :

ప్రాణ్ గూర్చి నా ఆలోచనలు రాద్దామని ఉదయం నుండి తీవ్రంగా ప్రయత్నించి.. ఇప్పటికి హడావుడిగా నాలుగు ముక్కలు రాయగలిగాను. అమ్మయ్య! ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది.

(photo courtesy : Google)

Saturday, 25 May 2013

దిక్కులు పిక్కటిల్లిన గానం


తమిళ సినీ నేపధ్య గాయకుడు T.M.సౌందరరాజన్ ఇవ్వాళ మరణించాడు. ఇప్పుడే టీవీలో స్క్రోలింగ్ చూశాను.

నేను సినిమాలు చూసే రోజుల్లో అరవ సినిమాలు (ఇప్పుడంత కాకపోయినా) తెలుగు డబ్బింగులుగా వచ్చేవి. ఎక్కువ సినిమాల్లో శివాజీ గణేశన్, M.G.రామచంద్రన్ లు హీరోలు. వారి నటన అత్యంత తీవ్రంగా ఉండేది. 'కోటీశ్వరుడు' అని ఓ శివాజీ గణేశన్ డబ్బింగ్ సినిమా గుర్తుంది. అందు శివాజీ నటనా బీభత్స విశ్వరూపం గాంచి గజగజలాడితిని.

సినిమాకి హీరో ఎవరైనా సౌందరరాజన్ పాట మాత్రం ఉండేది. నాకు సౌందరరాజన్ పాడుతున్నట్లుగా అనిపించేది కాదు. దిక్కులు పిక్కటిల్లేట్లు పెడబొబ్బలు పెడుతున్నట్లుగా ఉండేది. పొత్తికడుపులోంచి నరాలు బిగబెట్టి.. కడుపులోంచి పేగుల్ని మెలితిప్పుతూ.. ఒంట్లోని రక్తాన్నంతా గొంతులోకి తెచ్చుకుని.. గుడ్లు పగిలేలా, గుండెలు అవిసేలా పాడటం సౌందరరాజన్ స్పెషాలిటీ. వామ్మో! ఏమి హై పిచ్ స్టోన్! ఆయన పాటే ఓ సుడిగాలి, సునామి, భూకంపం, ప్రళయం.

తెలుగులో జయభేరి సినిమాలో చివరిపాట మన సౌందరరాజన్ పాడాడు. వదినగారి ప్రాణాలు తిరిగి ఇవ్వమని అర్ధిస్తూ (గద్దిస్తూ, గర్జిస్తూ) కాశీనాథశాస్త్రి సౌందరరాజన్ గొంతుతో పాడతాడు. అన్ని పాటలూ పాడిన ఘంటసాల ఈ పాట ఎందుకు పాడలేదు?

అప్పుడు నాకర్ధం కాలేదుగానీ.. ఇప్పుడర్ధమైంది. ఇది పి.పుల్లయ్య దర్శకత్వ ప్రతిభే. ఘంటసాల గొంతైనట్లైతే  మబ్బుల్లోంఛి దూసుకెళ్ళి దేవుడి దాకా చేరేది కాదు. చేరినా ఘంటసాలకి దేవుడు భయపడే వాడు కాదు. సౌందరరాజనా మజాకా! దెబ్బకి దేవుడు దడుచుకుని శాంతకుమారికి ప్రాణం ప్రసాదిస్తాడు. మీ కోసం ఆ పాట ఇస్తున్నాను. చూసి ఆనందించండి. 



(photo courtesy : Google)

Thursday, 25 April 2013

శంషాద్ బేగం.. ఒక లేడీ రౌడీ సింగర్


ఇవ్వాళ 'హిందూ'లో గాయని శంషాద్ బేగం మరణవార్త చదివి ఆశ్చర్యపొయ్యాను. ఆవిడ ఇంకా ఉందని అనుకోలేదు. ఎప్పుడో చనిపోయిందనుకున్నాను. ఒక వ్యక్తి మరణం గూర్చి ఇంత దుర్మార్గంగా ప్రస్తావించడం తప్పే, క్షమించండి. సూర్యుడు పడమరన మాత్రమే అస్తమిస్తాడని తెలీకపోవడం, ఆ తెలీనివాడి తప్పే అవుతుందిగానీ, సూర్యుడుది కాదు. ఫిల్టర్ కాఫీ అత్యంత మధురంగా ఉండునన్న సత్యం గ్రహించలేకపోవడం, ఆ గ్రహింపలేనివాడి గ్రహపాటే అవుతుంది గానీ, ఫిల్టర్ కాఫీది కాదు. 

'శంషాద్ బేగం మరణంతో సంగీత ప్రపంచం మూగబోయింది, ఆ గానసరస్వతి లేని లోకం చిన్నబోయింది. ఆ స్వరమాధుర్యం దేవుడు ప్రసాదించిన వరం, ఆ గానం నిత్యనూతనం. చిరకాలంగా ఆబాలగోపాలానికి అనిర్వచనీయ ఆనందాన్ని కలిగించిన శంషాద్ బేగం ఇక లేరు అన్న వార్త విని సంగీతాభిమానులు ఖిన్నులయ్యారు.' అంటూ పడికట్టు పదాలతో.. ఏడుస్తూ..  శంషాద్ గూర్చి సంతాపం రాయబోవట్లేదు. శంషాద్ బేగంకి వయసైపొయింది. పోయింది. ఈ సందర్భంగా శంషాద్ పాటొకటి ఇస్తున్నాను. చూడండి.




మనం ఒక వ్యక్తిని చూడంగాన్లే అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. నీటుగా ఉండేవాడు మంచివాడనీ, నాటుగా ఉండేవాడు రౌడీ అనీ.. ఇట్లా. కొందరైతే పేదవారంతా దొంగలేననీ, అలగాజనాన్ని నమ్మరాదనీ కూడా నమ్ముతారు.. ఇది వారి వర్గతత్వ రోగాన్ని సూచిస్తుందేమోగానీ.. మరి దేన్నీ సూచించదు. తెలుగుకవులకి మాత్రం రిక్షా తొక్కువాడు పీడితుడిగా, కారు నడుపువాడు పీడకుడిగా భావిస్తారు. అలా భావిస్తేనే వారికి నమస్కారాలు, పురస్కారాలు లభిస్తాయి. మరికొందరినైతే వ్యక్తి యొక్క అందచందాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇందుకు కారణం బహుశా మన మైండ్ లో ముద్రించుకు పోయిన 'స్టీరియోటైపి' కావచ్చు. ఇది అందరికీ తెలిసిన సంగతే.

నా మైండ్ గొంతుల్ని కూడా స్టీరియోటైప్ చేసేసింది. లతా మంగేష్కర్, లీల, సుశీల.. నాకు చాలా ఇష్టం. వీరి గొంతులో మాధుర్యం, తీపిదనం, లాలిత్యం నన్ను కట్టిపడేస్తాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి వలె కనులు మూసుకుని నా స్వప్నసుందరిని గాంచుతూ.. ఆనందపారవశ్యం చెందెదను. నా సుందరి అందాలరాసి, ముగ్ధ, బేల, అమాయకురాలు, పరాయి పురుషుణ్ణి పరాకుగానైనా దరిచేరనీయని గుణవంతురాలు.

భానుమతి, డి.కె.పట్టమ్మాళ్, బెజవాడ రాజారత్నం, శంషాద్ బేగం.. నాకు వీళ్ళ వాయిస్ అంటే భయం. ఇవి చాలా క్లీన్ వాయిస్ లు. వీరి వాయిస్.. వోకల్ కార్డ్స్ ని చీల్చుకుంటూ ఒక సుడిగాలిలా, ఒక సునామీలా.. ఊపిరి తిత్తుల ఫుక్ థ్రాటిల్ తో.. ఫడేల్మని ప్రళయ గర్జన చేస్తూ బయటకొస్తుంది. అసలు వీరి గొంతే ఇలా ఉండగా.. పాడే విధానం మరింత విలక్షణంగా.. చాలా డైనమిక్ గా ఉంటుంది. నాకైతే దందా చేస్తున్న రౌడీ వార్నింగ్ ఇస్తున్నట్లుంటుంది.



మరీ ముఖ్యంగా.. శంషాద్ బేగం పాట వింటుంటే.. 'ఈ ప్రపంచం నాది. దీన్ని నేను శాసిస్తున్నా! ఇక్కడ నా మాటే ఒక వేదం.' అంటూ గర్వంగా డిక్లేర్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అంతే అయితే పర్లేదు. ఇంకా.. 'నాతో వేషాలేస్తే మాడు పగలకోడ్తా' అంటూ ముఖం మీద ఈడ్చి తంతున్నట్లుగా కూడా అనిపిస్తుంది.

'నీ మొఖం! నీదంతా అతితెలివి. ఆడలేడీసు గొంతులన్నీ ఒకటే. వారికి అవకాశాలొచ్చాయి. దేవుడిచ్చిన స్టోన్ తో పాడారు. దానికంత విశ్లేషణలు ఎందుకు? ఈ మధ్య నీకు ఆడాళ్ళంటే భయం పెరిగిపోతుంది. జస్ట్ ఇగ్నోర్ ఆల్ దిస్. బీ హేపీ!'

'అంతేనంటారా? అలాగైతే ఓకే!'

(photos courtesy : Google)

Sunday, 27 January 2013

బి.చంద్రశేఖర్ జ్ఞాపకాలు



"చంద్రా! అర్జంటుగా నీ ఫొటో ఒకటి నాకు మెయిల్ చెయ్యి. ఇవ్వాళ నా బ్లాగులో నీగూర్చి రాస్తాను." ఉదయం పేపర్లో NHRC తీర్పు చదవంగాన్లే చంద్రశేఖర్‌కి ఫోన్ చేశాను.

"నువ్వు బజ్జీలు, సినిమాల గూర్చి సరదాగా రాస్తున్నావు. అలాగే కంటిన్యూ చెయ్యరాదా? నన్ను నీ స్నేహితుడిగా పరిచయం చేస్తే కొందరు రీడర్లు నీ బ్లాగుకి దూరమైపోతారు." నవ్వుతూ అన్నాడు.

"నా బ్లాగులో నా స్నేహితుడి గూర్చి రాసుకుందామనుకుంటున్నాను. ఏది రాయాలో, రాయకూడదో నాకు తెలుసు. నీ సలహా నాకనవసరం, మర్యాదగా నీ ఫోటో పంపించు." అన్నాను. 

"ఇప్పుడు ప్రెస్‌కి ఇంటర్వ్యూలిస్తూ బిజీగా ఉన్నా, మధ్యాహ్నం పంపిస్తా."

"నేనూ ఓపిలో బిజీగా ఉన్నాన్లే. ఈ లోపు వీలును బట్టి నీగూర్చి నాలుగు ముక్కలు రాస్తా."

అన్నట్లుగానే మధ్యాహ్నానికి కొన్ని ఫోటోలు మెయిల్ చేశాడు. నాకు నచ్చిన ఫోటో ఒకటి ప్రచురించాను.

నేను బాలగోపాల్ జ్ఞాపకాలు రాసినప్పుడు మరీ పొట్టిగా రాశానని విసుక్కున్నాడు. బాలగోపాల్, కన్నాభిరాన్ లు చంద్రాకి దేవుళ్ళతో సమానం. ఇప్పుడు తన గూర్చి రాసినప్పుడు ఇంకా పొట్టిగా రాశాను, కారణం సమయాభావం.

ఫోన్ చేసి చెప్పాను. పోస్ట్ పబ్లిష్ చేశానని, కాకపొతే మరీ చిన్నదిగా రాశానని.

"ఇంక చూసుకో! ఇన్నాళ్ళూ నువ్వొక డాక్టర్‌వని నిన్ను మర్యాదస్తుల లిస్టులో వేశారు, ఈ పోస్టు దెబ్బతో నువ్వు విలన్ల లిస్టులో చేరిపోతావు." అంటూ నవ్వాడు.

చంద్రశేఖర్‌పై నా బ్లాగులో విమర్శల వాన మొదలైంది. కొన్ని కామెంట్లు వ్యక్తిగత స్థాయిలో మరీ హీనంగా ఉన్నాయి. ఇది నాకు కొత్త, ఎలా రియాక్టవ్వాలో అర్ధం కాలేదు. చంద్రాకి ఫోన్ చేశాను, డిల్లీలో ఉన్నాట్ట.

"ఇప్పుడు నాకు NHRC చైర్మన్తో appointment ఉంది, ఔటర్ ఆఫీస్‌లో కూర్చునున్నాను." అంటూ హడావుడిగా ఓ నాలుగు లైన్ల రెస్పాన్స్ నా బ్లాగులో రాశాడు.

అటు తరవాత చంద్రాతో ఏదో మాటల సందర్భంలో అన్నాను.

"నా బ్లాగులో కొందరు నిన్ను ఘోరంగా తిట్టారు, వెరీ సారీ. ఆ కామెంట్లు డిలీట్ చేశాను."

"ఉంచేస్తే బాగుండేది. తిట్లు కూడా ఒక భావవ్యక్తీకరణే కదా! నాకయితే చంపేస్తామని కూడా లెటర్లు వస్తుంటాయి, పట్టించుకోను. ఆవోరకమైన లవ్ లెటర్లనుకుంటాను. నీకివన్నీ కొత్త, అందుకే నిన్నీ పోస్ట్ రాయొద్దన్నాను."

"కందకి లేని దురద కత్తిపీటకెందుకు? ఇన్నాళ్ళూ అనవసరంగా నీ గూర్చి ఫీలయ్యాను." నవ్వుతూ అన్నాను.

ఈ నెల రెండో తేదీనాడు కొద్దిసేపు గురజాడపై తను రాయబోతున్న పుస్తకం గూర్చి చెప్పాడు (ఆ వివరాలు ఇవ్వాళ ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ 'ఆదివారం అనుబంధం'లో రాశాడు).

చంద్రాలో నాకు నచ్చిందేమిటి? విపరీతంగా పుస్తకాలు చదువుతాడు. తను చెప్పదలచుకున్న పాయింటుకి అనుకూలంగా రిఫరెన్సులు ఇస్తుంటాడు. సామాజిక, రాజకీయ అంశాల గూర్చి చక్కటి అవగాహన ఉంది. చాలా సీరియస్ అంశాల పట్ల కూడా జోక్స్ వేసే గొప్ప సెన్సాఫ్ హ్యూమరుంది.

చంద్రాలో నాకు నచ్చని అంశం? విషయాన్ని మరీ సీరియస్ గా తీసుకోవడం. చిలకలూరిపేట బస్ దహనం కేసు, చుండూరు దళితుల కేసుల సమయంలో చంద్రా ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉండేది. పుస్తకాలు, ఫైళ్ళ మధ్యలో దయ్యంలాగా పని చేసేవాడు (నేనే విషయాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకొను).

చంద్రశేఖర్ వృత్తిపరంగా సాధించిన విజయాల పట్ల పత్రికలు రాస్తున్నాయి. నాకయితే వాటితో పెద్దగా సంబంధం లేదు. మాది దాదాపు ముప్పైయ్యేళ్ళ స్నేహం, పూర్తిగా వ్యక్తిగతం. నేను డాక్టర్నని, అతను లాయరని ఏనాడూ మాకు గుర్తుండేది కాదు. కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం.

చంద్రా! ఐ మిస్ యూ మేన్!

(fb post on 27/1/2018)

Tuesday, 22 January 2013

బి.చంద్రశేఖర్ కి నివాళులు.


నా మిత్రుడు బి.చంద్రశేఖర్ ఇక లేడు.

ఇది నాకు భరింపరాని దుఖాన్ని కలిగిస్తుంది.

నేస్తం! నీతో గడిపిన ప్రతిక్షణం నాకిక తీపి జ్ఞాపకాలేనా!

కన్నీళ్ళు నా కళ్ళని మసకబారిస్తున్నాయి.

వేదనతో మెదడు మొద్దుబారిపొయింది.

చంద్రా!

ఎందుకింత హడావుడిగా వెళ్ళిపొయ్యావు??????????