Showing posts with label పేరు కష్టాలు. Show all posts
Showing posts with label పేరు కష్టాలు. Show all posts

Thursday, 10 October 2013

తోక పేరు.. ఒక చల్లని నీడ



"హాయ్! ఐయాం ఫలానా చౌదరి. బాగున్నావా?" పొద్దున్నే ఫోన్లో ఒక లేడీ స్టోన్.

ఆశ్చర్యపొయ్యాను. ఈ లేడీ చౌదరి ఎవరబ్బా? నా PG రోజుల్లో 'చౌదరి' అనే తోకతో ఒక హర్యానా మనిషి ఉండేది. ఆవిడకి ఖచ్చితంగా తెలుగు రాదు. అందుకే నా పేరుని రకరకాలుగా పిలుస్తూ మూడేళ్ళపాటు నన్ను మానసిక అశాంతికి గురి చేసింది. ఇప్పుడు హర్యానాలోని రోహ్టక్ అనే ఊళ్ళో బిజీబిజీగా వైద్యం చేసుకుంటుంది. మరీ తెలుగు మాట్లాడే ఆడ చౌదరి ఎవరబ్బా?

"క్షమించాలి. నాకు మీరెవరో గుర్తు రావట్లేదు." అత్యంత వినయంగా అన్నాను.

'అతి వినయం ధూర్తలక్షణం' అన్నారు పెద్దలు. కాకపోతే ఇక్కడ నా వినయంలో ధూర్తత్వం ఏమాత్రం లేదని మనవి చేసుకుంటున్నాను. ఈ వినయం కేవలం ఒక ముందు జాగ్రత్త చర్య మాత్రమే. నాకు అపరిచిత ఆడవారితో ఫోన్లో మాట్లాడానికి గల భయానికో బలమైన కారణముంది.

గతంలో నాకో చేదు అనుభవం ఎదురైంది. కొన్నాళ్ళక్రితం నా స్నేహితుడొకడు అమెరికా నుండి అరుదెంచిన సందర్భంగా ఒక పార్టీ ఏర్పాటయ్యింది. ఆ పార్టీ విషయం చెప్పడానికి ఇంకో స్నేహితుడికి నంబర్లు నొక్కి ఫోన్ చేశాను.

'రాత్రి తొమ్మిదింటికల్లా ఫలానా హోటల్ కి వచ్చెయ్. కావాలంటే కారు పంపిస్తాను.' హడావుడిగా అన్నాను.

నా ఖర్మకాలి ఆ నంబర్ పొరబాటున ఇంకో నంబరుకి పోయింది. ఆ నంబర్ ఎవరో ఆడలేడీసుది. ఆవిడ నా హడావుడి ఆహ్వానానికి సమాధానం చెప్పకుండా 'ఏవండి' అంటూ ఒక మగజెంటుకి ఫోనందించింది.

ఆ మగజెంటు 'ఎవడ్రా నువ్వు నా పెళ్ళాన్ని హోటల్కి రమ్మంటున్నావ్?' అంటూ నన్ను దుర్భాషలాడ్డం మొదలెట్టాడు. పోలీస్ రిపోర్టిస్తానన్నాడు. పొరబాటుని క్షమించమని వేడుకుంటూ.. నేను ఫలానా అని చెప్పాను.

'డాక్టరైయ్యుండి ఇట్లాంటి పాడుపనులు చెయ్యడానికి సిగ్గులేదా?' అంటూ మళ్ళీ తిట్టాడు.

చివారకరికి పక్కనే ఉన్న నా భార్య మాట సాయంతో బయటపడ్డాను. ఆ రోజు నా భార్యే సాయం చెయ్యకపోతే నేనేమైపొయ్యేవాణ్ణోగదా అని ఇప్పటికీ అనుకుంటుంటాను (బహుశా 'మానసికి వైద్యుడి మనో వికారం' అంటూ మర్నాడు జిల్లా ఎడిషన్లోకెక్కేవాణ్ణేమో)!

ఈ భీభత్స సంఘటన నా మదిలో చెరగని ముద్ర వేసింది. దీన్నే మానసిక వైద్య పరిభాషలో PTSD అని అందురు. ఈ కారణాన.. ఆనాటి నుండి ఫోన్ నంబర్లు నొక్కడం మానేశాను. అవతల్నుండి మాట్లాడేది ఆడ స్టోనయినట్లైతే అత్యంత జాగ్రత్తగా ఉందును.

"You idiot. I will kill you. నేను నీ క్లాస్మేట్ని. నన్నే మర్చిపొయ్యావా?" అంటూ ఆ చౌదరమ్మ తన maiden name చెప్పింది.

"నువ్వా తల్లీ! పేరు చివర 'చౌదరి' విని జడుసుకున్నాను." అంటూ కబుర్లలో పడ్డాను.

ఈవిధంగా నాకు కొన్నిసార్లు నా క్లాసమ్మాయిలతో కొంత ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళల్లో చాలామంది ఇంటిపేరు మార్చేసుకున్నారు. కొందరికి పేరు చివర కులం పేరో, భర్త పేరో తగులుకుంది. మామూలుగానే నాకు తికమక.. ఇక ఈ కొత్తపేర్లు నా జ్ఞాపకశక్తికి పరీక్షలు పెట్టనారంభించాయి.

ఇప్పుడు నా చదువుకునేప్పటి ముచ్చటొకటి. మన ప్రాంతంలో రెడ్డి కులస్తుల్లో మగవారికి పేరు చివర్న 'రెడ్డి' అని ఉంటుంది (ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తమ పేరుకి ఈ 'రెడ్డి' తగిలిస్తున్నారనుకోండి). రెడ్లకి మాత్రమే ఉన్న ఈ ప్రత్యేక ప్రతిపత్తికి ఈర్ష్య చెందిన నా క్లాస్మేట్టొకడు తన పేరు చివర్న తన కులానికి చెందిన 'చౌదరి' అని తగిలించుకుని మిక్కిలి తృప్తినొందాడు. అక్కడతో ఆగాడా? లేదు. 'చౌదరి' చరణ్ సింగు కూడా తమ వాడేనని ప్రకటించుకున్నాడు.

'ఆ చౌదరి వేరురా నాయనా! చరణ్ సింగ్ ఉత్తర భారతీయుడు, జాట్ కులస్తుడు.' అంటే ఒప్పుకునేవాడు కాదు. వాదించేవాడు.

'చరణ్ సింగ్ కొడుకు మా మేనత్త తోడుకోడలి మేనమామకి బావమరిది.' అంటూ ఏదో చుట్టరికం కూడా చెప్పేవాడు.

సరే! ఈ పోస్టు ఉద్దేశ్యం కులాల పేర్ల గూర్చి రాసి.. అట్టి పేర్లు గల చదువరుల మనోభావాలు దెబ్బతియ్యడం కాదు కాబట్టి అసలు విషయంలోకొస్తాను.

డబ్బున్నవాడు ఖరీదైన దుస్తులు ధరిస్తాడు. ధనవంతులైన ఆడవారు విలువైన దుస్తులకి తోడుగా బరువైన ఆభరణాలు కూడా ధరిస్తారు. అంటే.. ఖరీదైన వేషధారణతో వాళ్ళు తమ ఆర్ధికస్థితి గూర్చి సమాజానికి ఒక బహిరంగ ప్రకటన చేస్తున్నారని మనం అర్ధం చేసుకోవాలి. ఈ ప్రకటన వారికి ఆనందాన్నీ, తృప్తినీ కలిగిస్తూ ఉండి ఉండాలి. ఏదోక ప్రయోజనం లేకుండా మన ఉక్కపోత వాతావరణంలో ఎవరూ అంతగా ఇబ్బంది పడరు గదా!

ఈ మధ్య సమాజంలో అనేక రకాలైన విశ్వాసాలు చూస్తున్నాం. ఫలానా రంగురాళ్ళు మీ భవిష్యత్తునే మార్చేస్తాయ్. ఈశాన్యం పెంచి, ఆగ్నేయం తగ్గిస్తే పట్టిందల్లా బంగారమే. ఫలానా బాబాగారి ఉంగరం, తాయెత్తు ధరిస్తే అష్టైశ్వర్యాలు గ్యారెంటీ. మీ పేరులో ఒక అక్షరం పీకేసి, ఇంకో అక్షరం కలిపితే ముఖ్యమంత్రి కూడా అవుతారు. ఈ రకమైన అదృష్టం, ఐశ్వర్యం కలిగించే వ్యాపారాలు మూడు పూవులు, ఆరు కాయలుగా సాగుతున్నాయ్. ఇవన్నీ నమ్మకాలకి సంబంధించిన వ్యవహారాలు. ఆచరించేవారికి ఆత్మస్తైర్యం కలిగిస్తాయి.

ఈ లాజిక్ ని తోక పేర్ల విషయంలోకి తీసుకొద్దాం. నేను ఫలానా కులంలో పుట్టాను. ఇది నాకు మిక్కిలి గర్వకారణం. కావున ఆ కులం పేరుని తోకగా తగిలించుకుందును. ఫలానా మా ఇంటిపేరు చాలా గొప్పది. కావున ఆ ఇంటిపేరుతో నాపేరు రాసుకుందును. ఫలానావాడు భర్తగా దొరకడం నా అదృష్టం.. అంచేత అతనిపేరు నా పేరుకి తోకగా జత చేసుకుంటాను. వీరందరికీ ఇట్లాంటి పేరు తోకల్ని చేర్చుకోవడం వల్ల అమితమైన ఆనందం, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మంచిదే కదా!


ఇలా కులం పేరుతోనో, భర్తల పేరుతోనో తోకలు ఉండొచ్చా? 'కూడదు' అంటూ సామాజిక కారణాలతో కొందరు వాదిస్తారు. ఈ కులం తొకలన్నీ ఇరవైయ్యేళ్ళల్లో మాయమైపోతాయని నా మిత్రుడు గోపరాజు రవి ముప్పయ్యేళ్ళ క్రితం బల్లగుద్ది వాదించేవాడు. అతనేమీ వీరబ్రహ్మేంద్రస్వామి కాదు. అంచేత ఈ ధోరణి తగ్గకపోగా.. మునుపటికన్నా ఇప్పుడు బాగా ఎక్కువైంది. ఇది ఒక సీరియస్ అంశం. అందుకే నేనీ పోస్టులో ఆ కోణం జోలికి పోవట్లేదు.

కొందరికి వారి కులం, వంశం, భర్త వగైరా వివరాలు తమ పేరు ద్వారా ప్రకటించుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. చల్లని నీడలో సేద తీరినట్లుగా కూడా అనిపిస్తుంది. మంచిది. కాదనడానికి మనమెవరం? మతవిశ్వాసాలు, ఆర్ధిక స్థితుల ప్రకటనల్లో లేని అభ్యంతరం తోకపేర్ల విషయంలో ఎందుకుండాలి? ఈ ప్రపంచంలో అందరూ తమ ఆనందం కోసం తమకిష్టమైన పనులు మాత్రమే చేస్తారు. ఇష్టం లేని పని అస్సలు చెయ్యరు. ఈ సంగతి ఆనంద నిలయం.. ఎంతో ఆహ్లదకరం!  అనే పోస్టులో నొక్కి వక్కాణించాను. 

పేర్లు అనేవి గుర్తుల కోసం పెట్టుకునే XYZ లాంటివని నా అభిప్రాయం. అంతకుమించి వీటికి ప్రాధాన్యం లేదు. ఈ సంగతి పేరులోనే అంతా ఉంది  అని ఇంతకుముందు రాశాను. అందువల్ల పేర్లకి కొత్త తగిలింపులు, పొడిగింపులకి పవిత్రతా లేదు, అపవిత్రతా లేదు. ఇన్ని కబుర్లు చెబుతున్న నేనూ నాపేరు గూర్చి మధనపడ్డ సందర్భం ఉంది. ఆ విషయాన్ని నాదీ ఒక పేరేనా?! హ్మ్.. ! అంటూ ఏడుస్తూ ఒక పోస్ట్ రాశాను

ఇప్పుడు నా మనసు విప్పి ఒక రహస్యం చెప్పదలిచాను. 'రమణ' అన్న పేరుయందు నాకు అమితమైన అభిమానం. అందువల్ల ఆ పేరు కల పేషంట్లని కొద్దిగా ప్రత్యేకంగా చూస్తాను. చాలాసార్లు ఫీజులో రాయితీ కూడా ఇస్తాను. అయితే ఇలా ఒక పేరు వినంగాన్లే మదిలో వీణలు మోగడాన్ని నేను సూత్రరీత్యా వ్యతిరేకిస్తాను. భాష, ప్రాంతీయ దురభిమానాల వలే.. ఇదికూడా ఒక రోగమేమోనన్న అనుమానం నన్ను పీడిస్తుంది.

ఒకానొకప్పుడు నా పేరుకి ముందు నాకెంతో ఇష్టమైన నా జన్మస్థలం 'బ్రాడీపేట' తగిలించి ప్రఖ్యాతి నొందుదామని ఒక మాస్టర్ ప్లానేశాను. అంచేత నాపేరు 'బ్రాడీపేట రమణ'గా మార్చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా.. కొన్ని కొత్తవిషయాలు తెలిశాయి. మావూళ్ళో కొత్తపేట శివ, సంగడిగుంట శీను, చుట్టుగుంట సాంబ, కొరెటిపాడు ఉమా.. అంటూ ఆల్రెడీ పేట పేర్లని తమ పేర్లకి prefix గా చేసుకున్న ప్రముఖులు కొందరు ఉన్నార్ట. అయితే వీరందరూ A+ రౌడీషీటర్లుట! అందువల్ల నాపేరు మార్చుకుని వారి సరసన చేరే సాహసం చెయ్యలేక నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను.

నా భార్య తన పేరు పదోతరగతి సర్టిఫికేట్లోని పేరునే కొనసాగిస్తుంది. ఇందుకు రెండు కారణాలు తోస్తున్నాయి. ఒకటి ఆవిడ నా పేరులోని ఎటువంటి శకలం అవసరం లేని అత్మవిశ్వాసి అయినా అయ్యుండాలి లేదా ఆవిడ దృష్టిలో నా పేరుకి అంత విలువైనా లేకుండా ఉండి ఉండాలి. నాపేరు నాకు విలువైనదే. కానీ నా భార్యకి కూడా విలువైనదై ఉండాలని రూలు లేదు. కారణం ఏదైతేనేం.. ఆవిడ నాపేరు జోలికి రాలేదు.

అంతే గదా? ఎక్కడైనా ఒకటి తరవాత సున్నాలకి విలువ ఉంటుంది గానీ.. ఒకటి ముందున్న సున్నాలకి విలువుండదు! ఇలా పైసా కూడా విలువ చెయ్యని పేరు కలవాడిని కాబట్టే.. కుళ్ళుబోత్తనంతో ఈ పోస్ట్ రాస్తున్నానని ఎవరైనా అనుకుంటే.. ఆ అనుకోడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను!

(photo courtesy : Google)

Wednesday, 1 August 2012

నాదీ ఒక పేరేనా?! హ్మ్.. !

ఇవ్వాళ సోమవారం. ఆస్పత్రి పేషంట్లతో హడావుడిగా వుంది. ఆవిడకి సుమారు ముప్పయ్యేళ్ళుండొచ్చు. నల్లగా వుంది, పొట్టిగా వుంది, గుండ్రంగా ఉంది. విష్ చేస్తూ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది. ఔట్ పేషంట్ స్లిప్ మీద ఆవిడ పేరు చూశాను. 

'వెంకట రమణ'

అబ్బా! మానుతున్న గాయంలో నిమ్మరసం పిండినంత బాధ. ఈ గాయం ఈ జన్మకి మానదేమో - నాదీ ఒక పేరేనా?! హ్మ్ .. !

'నేములో నేమున్నది?' అంటారు. కానీ - నేములోనే చాలా వుంది, ఇంకా మాట్లాడితే - చచ్చేంత ఉంది. నా పేరు చూడండి - 'వెంకట రమణ'. ఈ పేరు నాకస్సలు నచ్చదు. ఇది ఉభయలింగ నామం. అర్ధం కాలేదా? తెలుగులో చెబుతాను - ఈపేరుకి లింగం లేదు! అనగా ఆడా, మగలిద్దరికీ ఈపేరు ఉంటుంది!

నాపేరు నాన్న పూర్వీకులది. ఆయన నానమ్మ పేరు రమణమ్మ. ఇంకానయం! ఆపేరు ఏ పిచ్చమ్మో అవలేదు. అప్పుడు నేను పిచ్చయ్య నయిపోయేవాణ్ణి. నాన్నకి దేవుడు లేడు కానీ తన వంశం గొప్పదని నమ్మకం. అమ్మ వెంకటేశ్వరస్వామి భక్తురాలు. ఈ విధంగా - అన్ని విషయాల్లో కీచులాడుకునే అమ్మానాన్న, నాపేరు విషయంలో మాత్రం వొక అంగీకారానికొచ్చి - 'వెంకట రమణ' అని పెట్టేశారు.

నన్ను చిన్నప్పుడు 'రమణి!' అంటూ ముద్దుగా పిలిచేవారు. స్కూల్  ఫైనల్ చదువుతుండగా - ఒకరోజు 'రమణి' అనబడు శృంగార కథల పుస్తకం (వెచ్చటి ఊపిరి, వేడినిట్టూర్పులతో) చదవడం తటస్థించినది. ఆ మేగజైన్ నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది. కథలయితే బాగున్నాయిగానీ, అర్జంటుగా నన్ను 'రమణి' అని ఎవరూ పిలవకుండా కట్టడి చేసేశాను!

నాకు హైస్కూల్లో స్థాయిలో కూడా 'ణ' రాయడం సరీగ్గా వచ్చేది కాదు. తెలుగు లిపిలో అనేక మెలికలతో కూడిన 'ణ' అక్షరం అత్యంత కష్టమైనదని నా నిశ్చితాభిప్రాయం. మా తెలుగు మేస్టరు 'నీ పేరు నువ్వే తప్పు రాసుకుంటే ఎలా?' అంటూ విసుక్కునేవారు. మహానుభావుడు! ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు - మూడేళ్ళపాటు సవర్ణదీర్ఘ సంధి మాకు నేర్పడానికి విఫలయత్నం చేశారు. నాకు మాత్రం గుణసంధి కూడా కొద్దిగా వచ్చు, మాక్లాసులో నేను బ్రిలియంటుని లేండి!

ఎనాటమి పరీక్ష మార్కుల లిస్టు నోటీస్ బోర్డులో పెట్టారు. నాపేరు పక్కన (F) అని ఉంది! హడావుడిగా ఎనాటమి ట్యూటర్ని కలిశాను. ఆయనకి నా జెండర్ ఘోష అర్ధం కాలేదు. అందుకే కూల్ గా 'నీ నంబరు, మార్కులూ సరీగ్గానే ఉన్నాయిగా? ఈసారికి ఎడ్జస్టయిపో!' అన్నాడు. నాకు మండింది. నేను ఆడవాడిగా ఎలా ఎడ్జస్టయ్యేది! 

గట్టిగా అడగాలంటే భయం, మొహమాటం. నాపేరు పక్కన ఈ మాయదారి (F) వల్ల అమ్మాయిలు నన్నుచూసి 'రవణమ్మ' అంటూ కిసుక్కుమనుకోవడం గుర్తుంది. నేనంటే పడని ఒకళ్ళిద్దరు కసిగా 'ఒరే! వంకర్రవణా!' అని పిలవడం కూడా గుర్తుంది.

ఇడ్లీసాంబార్ తిందామని హోటలుకి వెళ్తాను. అక్కడ టేబుళ్ళు తుడిచే చింపిరిజుట్టువాడు రమణ! 'అరేయ్ రవణగా! ఈ టేబులు మీద ఈగలేందిరా? సరీగ్గా తుడవరా దున్నపోతు!' కత్తితో పొడిచినట్లుండేది. నేను వర్గ ధృక్పదంతో రాయట్లేదు, నామ ధృక్పదంతో రాస్తున్నాను.

నా డొక్కుస్కూటర్ పంక్చర్. నెట్టుకుంటూ, రొప్పుకుంటూ.. పంక్చర్ షాపుకెళ్ళాను. అక్కడా నాఖర్మ కాలింది. అక్కడి బక్కచిక్కిన అసిస్టెంటు రమణ! 'క్యాబే సాలా! చక్రం హిప్పటం హెంతసేపురా సువ్వర్ కా బచ్చా!' 

నా పేరుని హత్య చెయ్యడంలో తెలుగు సినిమావాళ్ళు కూడా తమదైన పాత్ర పోషించారు. చాలా సినిమాల్లో హీరోయిన్ తమ్ముడి పేరు రమణ! ఆ వెధవ ఏ తిక్కలోడో, తింగరోడో అయ్యుంటాడు. వాణ్ణి పోషించటానికి హీరోయిన్ నానా కష్టాలు పడుతుంది. సినిమాలో ఆ దరిద్రుడి పాత్ర ప్రయోజనం హీరోయిన్ కష్టాలు పెంచడం తప్ప మరేదీ కాదు. 

నాకు అర్ధం కానిది.. పొరబాటున కూడా ఏ ఉత్తముడికో, ఏ డాక్టరుకో (ఒక మనిషి ఉత్తముడో, డాక్టరో.. ఏదో ఒకటే అయ్యుంటాడని.. డాక్టర్లల్లో ఉత్తములుండరని మా సుబ్బు అంటుంటాడు.) -  'వెంకట రమణ' అన్న పేరు ఎందుకుండదు అనేది. 

తెలుగేతరులకి నాపేరు 'రమన' అవుతుంది! వారి 'న'ని.. 'ణ'గా మారుద్దామని తీవ్రప్రయత్నాలు చేశాను. ఆ ప్రాసెస్ లో నాపేరు 'రామన్న', 'రావణ్ణ' అంటూ మరింత ఖూనీకి గురయ్యేది. ఆవిధంగా నేను MD చేస్తున్న రోజుల్లో పంజాబీలు, బెంగాలీయులు నాపేరుని సామూహికంగా పిసికి పరోటాలు వేసేవాళ్ళు.

నాకెందుకో ఈ 'రమణ' అన్నపేరు బోడిగా, తోకతెగిన బల్లిలా ఉంటుంది. అందుకే కామోలు - నా పేషంట్లు నన్ను రమణయ్యగారు, రమణారావుగారు, రమణమూర్తిగారు అంటూ తోకలు తగిలిస్తారు. అప్పుడు నేను దిగులు చెందుతాను. 

నాపేరు ఏ నరసింహారావో, రంగారావో అయితే ఎంత బాగుండేది! ఈపేర్లలో ఎంత గొప్ప మెసేజుంది! ఈ నామధేయుడు మగవాడు, తెలుగువాడు, గంభీరమైనవాడు.. ఇంకా చాలా 'వాడు'. నాకా లక్జరీ లేదు. నన్ను చూస్తేకానీ నేనెవరో తెలీదు. 

కాలం గడుస్తున్న కొద్దీ నాకు నాపేరుపై గల 'పేరు న్యూనతాభావం' పోయింది. ఇప్పుడు పెద్దమనిషినయినాను. పరిణితి చెందాను (ఇదిమాత్రం డౌటే). అంచేత నాపేరు గూర్చి వర్రీ అవడం మానేశాను. అయితే - కొందరు పేషంట్లు అప్పుడప్పుడు ఇట్లా గుండెల్లో కత్తులు, కొడవళ్ళు గుచ్చుతుంటారు.

ఇవ్విధముగా బ్రతుకుబండిని గవాస్కరుని బ్యాటింగు వలె స్తబ్దుగా లాగుచుండగా, ఒక దుర్దినాన నా కజిన్ ప్రసాదుగాడు తగలడ్డాడు. నా చిన్నాన్న కొడుకైన ప్రసాదు చిన్నాచితక వ్యాపారాలు చేసి, అన్నిట్లో నష్టపోయి (వాడు నష్టపోతాడన్న సంగతి వాడికితప్ప అందరికీ ముందే తెలుసు) ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఏజంటుగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు (ఇళ్ళస్థలాల బ్రోకర్లని స్టైలుగా రియల్ ఎస్టేట్ ఏజంటందురు).

వీడుచేసే ఎస్టేట్ ఎంత రియలోగానీ, ప్రిస్టేజి మాత్రం ఫాల్సే! ప్రసాదుకి నిమిషానికో ఫోన్ వస్తుంది. వంద ఎకరాలంటాడు, సింగిల్ సిట్టింగంటాడు, డెవలప్మెంటంటాడు, పది కోట్లకి తగ్గేది లేదంటాడు.  

ప్రసాదుగాడి ఫోనుకి క్షణం తీరికుండదు, నోటికి తాళం ఉండదు. అనేక ప్రముఖుల పేర్లు ఫోను సంభాషణల్లో విరివిగా దొర్లుతుంటాయి. వీడి భార్య మాత్రం ఇల్లు గడవడం కష్టంగా ఉందని వాపోతుంటుంది!     

ఓ రోజున - మా ప్రసాదుగాడితో పాటు ఒక శాల్తీ రంగప్రవేశం. నల్లటి శరీరం, తెల్లటి బట్టలు, మెళ్ళో పులిగోరు చైను, సెంటుకంపు! పులిగోరు సెంటుగాళ్ళు సంఘవిద్రోహశక్తులని నా నమ్మకం.  

చికాకుని అణుచుకుంటూ 'ఏంటి సంగతి?' అన్నట్లు ప్రసాదుని చూశాను. 

ప్రసాదు మాట్లాడలేదు, బదులుగా సెంటుకంపు పులిగోరు మాట్లాడింది.

"సార్! మీపేరు చాలా బాగుంటుంది."

ఊహించని స్టేట్ మెంట్! ఆ శాల్తీని ఆశ్చర్యంగా చూశాను.

"నాకు వెంకటరమణ అన్న పేరు చాలా ఇష్టమండి. ఈపేరు విన్నప్పుడల్లా నాకు ముళ్ళపూడి వెంకటరమణ గుర్తొస్తాడు!"

అవునుకదా! ముళ్ళపూడి వెంకటరమణ సృష్టించిన బుడుగు, రెండుజళ్ళ సీత , సీగానపెసూనాంబ.. అందరూ కళ్ళముందు కదిలారు. నిజమే! ఇన్నాళ్ళూ నాకీ చిన్న సంగతి తోచలేదేమి! పోన్లే - ఇంతకాలం హోటల్ క్లీనర్లకి మాత్రమే పరిమితమైన నాపేరు మీద ఒక ప్రముఖుడు ఉన్నాడు. సంతోషం. సెంటుకంపు కొడితే కొట్టాడు గానీ చాలా మంచివాళ్ళా ఉన్నాడే!

"ఎవరైనా తమ పిల్లలకి వెంకటేశ్వరస్వామి పేరు పెడదామనుకుంటే వెంకట్రమణే బెస్ట్ నేమండి!"

అవునా! నాచెవుల్లో 'ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గొవిందా.. గొవిందా!' అంటూ గోవిందనామ స్మరణం వినిపించసాగింది! తిరువణ్ణామలై రమణ మహర్షి కనబడసాగాడు. 

ఛ.. ఛ.. నేనెంత అజ్ఞానిని! ఇంతటి పవిత్రమైన పేరుని ఇన్నాళ్ళూ ఎంతలా అవమానించితిని. ఎంతలా కించపరిచితిని. అయ్యా! సెంటుకంపు పులిగోరు బాబూ! నాకళ్ళు తెరిపించావ్. నీకు థాంక్సురా అబ్బీ!

"అసలు 'ణ' అక్షరం స్వచ్చమైన తెలుగు నుడికారానికి ప్రతీక! ఈ అక్షరమే లేకపోతే తెలుగుభాష పేదరికంలో మగ్గిపొయ్యేది!"

అవును సుమీ! ఇదీ కరెక్టే! ఈ 'ణ' ఎంత గొప్పక్షరం! ఉన్నట్టుండి తెలుగు లిపి రక్షకుడిగా ఫీలవడం మొదలెట్టాను. తరచి చూడగా.. నాపేరు తెలుగుభాషకే మకుటాయమానంగా తోస్తుంది. సడన్ గా నాకు నేను చిన్నయ సూరిలా, గిడుగు రామ్మూర్తిలా ఫీలవడం మొదలెట్టాను!

ఈయనెవరో దైవదూత వలె నున్నాడు, నా అజ్ఞానాంధకారమును ఎవెరెడీ టార్చ్ లైటు వెలుగుతో పారద్రోలినాడు. సందేహము వలదు. ఇతగాడు మహాజ్ఞాని, మహామేధావి, మహానుభావుడు. అయ్యా! మీకు శిరసు వంచి నమస్కృతులు తెలుపుచున్నాను, నమోన్నమః.

గర్వంతో, స్వాతిశయంతో గుండెలుప్పొంగగా.. నాపేరు గొప్పదనాన్ని విడమర్చిన ఆ మహానుభావుని పట్ల కృతజ్ఞతతో తడిసిపోతూ ఒకక్షణం అతన్నే చూస్తుండిపోయాను. ఎంతయినా, గొప్పవారికే గొప్పపేర్ల గూర్చి అవగాహన ఉంటుంది. వారే సరైన అంచనా వెయ్యగలరు. వారు కారణజన్ములు. 

ఒరే ఫాల్స్ ప్రిస్టేజి రియల్ ప్రసాదుగా! ఒక గొప్పవ్యక్తిని పరిచయం చేశావ్! నీ ఋణం తీర్చుకోలేనిది.

అప్పుడు గుర్తొచ్చింది. అయ్యో! నేనెంత మర్యాద తక్కువ మనిషిని! నాపేరుని ఇంతలా అభిమానిస్తున్న ఈయన నామధేయము తెలుసుకొనవలెనన్న కనీస మర్యాదని మరచితిని.

"అయ్యా! తమరు.. " అంటూ అగాను.

"నా పేరు చినపుల్లయ్య సార్! మీ తమ్ముడు ప్రసాదు క్లాస్మేట్నండి. చిట్స్ బిజినెస్ చేస్తాను."

ఒహో అలాగా! చిట్స్ వ్యాపారం చేస్తూకూడా నాపేరు మీద ఎంత రీసెర్చ్ చేశాడు! జీతే రహో బేటా! ఒకవేళ దేవుడనేవాడే ఉంటేగింటే నీ చిట్టీల వ్యాపారం బాగా సాగాలని ఆయన్ని కోరుకుంటున్నాను. లేదులేదు, ప్రార్ధిస్తున్నాను.

చినపుల్లయ్య గొంతు సవరించుకున్నాడు.

"సార్! రేపట్నించి కొత్తచీటీ మొదలెడుతున్నాను. మీరుకూడా ఒక చీటీ వెయ్యాల్సార్! అంతా మీ డాక్టర్లే సార్! మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్! చినపుల్లయ్య ఎట్లాంటివాడని ఎవర్నైనా అడగండి సార్! చీటీ పాడిన రోజే ఎమౌంట్ పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తా సార్! నాకు మార్కెట్లో ఉన్న గుడ్‌విల్ అట్లాంటిది.. " చినపుల్లయ్య మాట్లాడుతూనే ఉన్నాడు. 

'టప్'మని బెలూన్ పగిలిన శబ్దం! ఉప్పొంగిన నాగుండె ఫ్లాట్ అయిపోయింది!

నాదీ ఒక పేరేనా?! హ్మ్.. !

(నిట్టూర్చుచూ, వగచుచూ, వాపోవుచూ, చింతించుచూ, ఖేదించుచూ, దుఃఖించుచూ, శోకించుచూ.. ఇంకా చాలా 'చూ'లతో.. )

చివరి తోక -

'వెంకట రమణ' నామధేయులకి క్షమాపణలు.

Monday, 21 May 2012

పేరులో ఏముంది?!

"నీకు నా ఇష్టదైవం పేరు పెట్టుకున్నాను, అందుకైనా ఒక్కసారి ఆ దేవుడికి దణ్ణం పెట్టుకోరాదా!" ఇది అమ్మ ఆర్గ్యుమెంట్.

"నువ్విట్లా కొత్త రూల్స్ పెట్టకు. నాకీ పేరు పెట్టమని నేనడిగానా? నాకు చెప్పకుండా నాపేరు పెట్టటమే కాక, ఆ పేరుకు తగ్గట్లు ప్రవర్తించమని డిమేండ్ చెయ్యడం అన్యాయం, మానవ హక్కుల ఉల్లంఘన కూడా!" ఇది నా కౌంటర్ ఆర్గ్యుమెంట్.

అసలు పేరుకీ, ప్రవర్తనకీ సంబంధం ఉంటుందా? ఉండాలా?

నా చిన్నప్పుడు మా పక్కవీధిలో నెయ్యి అమ్మేవాళ్ళు. 'ఇచ్చట స్వచ్చమైన వెన్న కాచిన నెయ్యి అమ్మబడును.' అని పెద్ద బోర్డుండేది. ఆ నెయ్యి మాత్రం ఎలుక చచ్చిన పాడు కంపు కొడుతుండేది.

'కేర్' ఆస్పత్రి అంటారు. అక్కడ పేషంట్లని కేర్‌లెస్సుగానూ, బిల్లుల్ని కేర్‌ఫుల్లుగానూ చూస్తారని అభిజ్ఞువర్గాల భోగట్టా. ఈ మధ్య కొన్ని ఆస్పత్రులకి 'హెల్ప్' అని పేరు పెడుతున్నారు. వాళ్ళ బిల్లుల్ని చూసి జనాలు ఘొల్లుమంటున్నారు, ఇంక 'హెల్ప్' ఎక్కడ!

పాతతరం కమ్యూనిస్టులు పిల్లలకి లెనిన్ బాబు, స్టాలిన్ బాబు అని పెట్టుకునేవాళ్ళు. వారి పిల్లల బుల్లిఅడుగుల్లో భవిష్యత్ విప్లవకారుని 'లాంగ్ మార్చ్' చూసుకుని మురిసిపొయ్యేవారు. తదనంతరం ఆ బుల్లి విప్లవకారులు 'గ్రేట్ లీప్ ఫార్వర్డ్' చేసి - వడ్డీ వ్యాపారస్తులుగానూ, లిక్కర్ సిండికేట్లుగానూ 'ఎదిగి' తలిదండ్రులకి గొప్ప పేరు తెచ్చిపెట్టారు 'గోరా' తండ్రి కొడుక్కి రామచంద్రరావు అని రాముడి పేరు పెట్టుకున్నాడు. మరి గోపరాజు రామచంద్రరావు ఏం చేశాడు? 'గోరా'గా మారిపోయి ఆ దేవుడే లేడన్నాడు!

గురజాడ అప్పారావు మాత్రం తన నాటకానికి సాంప్రదాయక పద్ధతుల్నే నమ్ముకున్నాడు. 'కన్యాశుల్కం'లో పాత్రల పేర్లు వారి బుద్ధిననుసరించి ఉంటాయి. లుబ్దావధాని, అగ్నిహోత్రావధాని, కరటకశాస్త్రి, సౌజన్యారావు.. ఇది ఈ నాటకానికి నెగెటివ్ పాయింటని పలువురు విజ్ఞులు వాకృచ్చారు.

అమ్మకి 'కన్యాశుల్కం' సినిమా మాత్రమే తెలుసు. ఆవిడకి మధురవాణిగా సావిత్రి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. అంతే! అయితే కన్యాశుల్కం ఒక గొప్ప నాటకమని.. గురజాడ పాత్రలు బుద్ధిగా తమ పేర్లననుసరించే ప్రవర్తించాయని తెలీదు. తెలిసినట్లయితే ఆవిడ ఈ పాయింటుని తన డిఫెన్సుకి వాడుకునేది. ఆమెకి తెలీదని నాకు తెలుసు కాబట్టే.. పేర్లకీ, ప్రవర్తనకీ సంబంధం లేదని, ఉండదనీ బల్ల గుద్ది వాదిస్తున్నాను.

ఇంట్లో ఏదో వ్రతం. అమ్మ కొత్త ఎత్తు వేసింది.

"కనీసం ఇవ్వాళయినా ఒక్కసారి దణ్ణం పెట్టుకో.. నాకోసం!" అంటూ సెంటిమెంటుతో కొట్టింది.

చచ్చితిని. ఇరుక్కుపొయ్యానా? ఒక్కక్షణం ఆలోచించాను.

"అమ్మా! నాకయితే ఇటువంటివి నమ్మకం లేదు. నీకోసం తప్పకుండా పెడతాను. కానీ నమ్మకం లేకుండా దణ్ణం పెట్టుకోవడం మహాపచారం. అసలే నీకీ మధ్య బిపి ఎక్కువైంది, ఆ తర్వాత నీ ఇష్టం." హెచ్చరిస్తున్నట్లుగా అన్నాను.

నా మంత్రం పని చేసింది. "సరెసరే! వద్దులే." అంది కంగారుగా.

అమ్మకి కనిపించకుండా మొహం పక్కకి తిప్పుకుని.. నవ్వుకున్నాను!! 

Sunday, 26 February 2012

డా.సు.

పొద్దున్నే మా డా.సు. ఫోన్! డా.సు. అంటే డాక్టర్ సుబ్బారావుకి పొట్టిపేరు. సుబ్బారావు నా క్లాస్మేట్, అతనికో బలహీనత వుంది. తన పేరుముందు డాక్టర్ అని రాస్తాడు, ఎవరైనా డాక్టర్ సుబ్బారావు అని రాయకపోయినా, పిలవకపోయినా కోపం వచ్చేస్తుంది. అంచేత సుబ్బారావు డా.సు.గా సుప్రసిద్ధుడు! ఇదీ మా డా.సు. కథాకమామీషు.

"డాక్టర్ రమణా! నీ రాతలు చూస్తున్నాను. నీకీ జన్మకి బుద్ధి రాదా?"

"రాదు, అందుకే గదా ఈ రాతలు!" నవ్వుతూ అన్నాను.

"అయాం సీరియస్. కష్టపడి డాక్టర్ కోర్స్ చదివావ్, కానీ పేరుకిముందు డాక్టర్ అన్రాసుకోడానికి మాత్రం నామోషీ!" అన్నాడు డా.సు. 

ఇవ్వాళ పొద్దున్నే ఎవడి మొహం చూశానో కదా!

"ఓ! అదా! చూడు మైడియర్ డా.సుబ్బారావ్! మన వృత్తి పేషంట్లకి వైద్యం చెయ్యడం. వాళ్ళకోసం డా. అని రాసుకుంటాం. రాతల్ని చదవడానికి పేషంట్లు అవసరం లేదు, పాఠకులు చాలు. పాఠకులకి మన పేరుముందు డా.వున్నా, బా. వున్నా అనవసరం." అన్నాను.

"మరైతే ప్రముఖ రచయితలు కొమ్మూరి  వేణుగోపాలరావు, యం.వి.రమణారెడ్డి, కేశవరెడ్డి, వి.చంద్రశేఖరరావులు వాళ్ళపేరు ముందు డా. తగిలించుకున్నారుగా?" ప్లీడర్లా పాయింటు లాగాడు డా.సు.

"డా.ని పేరు ముందు తగిలించుకోవటం అన్నది రచయితల వ్యక్తిగత ఇష్టాయిష్టాలకి సంబంధించిన విషయం. సోమర్సెట్ మామ్, చెహోవ్‌లు మెడికల్ డాక్టర్లని చాలామందికి తెలీదు. నాకయితే డా. అనేది నాపేరులో భాగం కాదు. వైద్యవిషయాలు రాసేట్లయితే డా.అని రాసుకోవచ్చు గానీ జనరల్ రాతలకి డా. అనవసరం అని నా అభిప్రాయం." అన్నాను.

ఈ డా.సు.ని ఎలా వదిలించుకోవాలబ్బా!

"అక్కడే పప్పులో కాలేసావ్. డా.దాసరి, డా.మోహన్ బాబు.యం., డా.అక్కినేని.. మరి వీళ్ళ సంగతేంటి? కాబట్టి నీవాదన తప్పు. డా. అనేది పవిత్రమైనది. తక్షణం నీ పేరుకి డా. తగిలించు." హుంకరించాడు డా.సుబ్బారావు.

దేవుడా! ఈ డా.సు. నోరు పడిపొతే బాగుణ్ణు.

"డా.సుబ్బారావ్! పొద్దున్నే నువ్విలా విసిగించడం నీ డా.కి గౌరవం కాదు. నేనేదో ఇలా డా. లేకుండా సింపుల్‌గా బ్రతికేస్తున్నా, వదిలెయ్యవా? ప్లీజ్!" చిరాగ్గా అన్నాను. 

"హౌ శాడ్!!" అంటూ ఠపీమని ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు.. అదే డా.సుబ్బారావ్!  

Thursday, 1 September 2011

పేరులోనే అంతా ఉంది


"కాలేజీకెళ్లాలంటే భయంగా వుంది. సీనియర్లు నాపేరు మీద జోకులేస్తూ టీజ్ చేస్తున్నారు." ఆ అమ్మాయి ఇంజినీరింగ్ విద్యార్ధిని, పేరు చారుమతి. కాలేజిలో సీనియర్లు పప్పుచారు, ఉలవచారు అంటూ టీజ్ చేస్తున్నార్ట.  
                   
పిల్లలకి పేరు పెట్టేముందు నచ్చిన పేరు అనేకాకుండా - ఆ పేరువల్ల భవిష్యత్తులో వారికే ఇబ్బందీ రానివిధంగా ఆలోచించాలి. అర్ధవంతమైన పేర్లు బాగానే ఉంటాయిగానీ అర్ధాలు మారిపొయ్యే ప్రమాదం ఉంది. మౌనిక ఎక్కువ మాట్లాడినా, సౌజన్య నిర్లక్ష్యంగా వున్నా, శాంతకుమారి అశాంతిగా వున్నా వారి పేర్లకి న్యాయం జరగదు. 
                    
తెలుగు సినిమాల కారణంగా ప్రజలకి సూర్యకాంతం పేరు పెట్టుకునే ధైర్యం లేకుండా పోయింది. వంగదేశం నుండి దిగుమతైన సాహిత్యం తెలుగులో బాగా పాపులరై - బెంగాలీ పేర్లు తెలుగు పేర్లుగా మారిపొయ్యాయి. కన్యాశుల్కంలో పాత్రల పేర్లన్నీ పాత్రోచితంగా వుండటం ఆ నాటకానికున్న లోపం అని కొందరు పెద్దల ఉవాచ.  

తెలుగువారి గ్రామాల్లో ఈ సమస్య లేదు. తాతల, ముత్తాతల పేర్లు ఈరోజుకీ పెడుతూనే ఉన్నారు. ఒక గ్రామదేవత పేరే ఆ ఊరందరికీ ఉంటుంది. పెద్దంకమ్మ, చిన్నంకమ్మ, పెద్దంకయ్య, చిన్నంకయ్య, బుల్లంకయ్య.. ఇట్లా అందరిళ్ళల్లో ఒకేపేరు. పుట్టేవాడు కడుపులో ఉండంగాన్లే ఫలానా దేవతకి మొక్కుబడి ఉంటుంది కాబట్టి వారికి పేచీ లేదు.  
                     
'పద్ధతు'ల్లో ఒకప్పటి కన్నా బాగా అభివృద్ధి చెందాం. అందుకే ఈమధ్య తిధీ, నక్షత్రం చూసుకుని మరీ పేర్లు పెడుతున్నారు. పేరు మొదటి అక్షరం 'ఛ'తోనో, 'ఛీ'తోనో లేదా 'క్షి'తోనో మొదలవ్వాలని తిప్పలు పడుతున్నారు. అందుకే చాలాసార్లు ఈ బాపతు 'శాస్త్రబద్దమైన' పేర్లు మనకి అర్ధం కావు. 

నామటుకు నాకు పేరు పట్టింపు లేదు. నా పిల్లలిద్దరి పేర్లు నేను పెట్టినవి కావు. ఎవరన్నా అడిగితే అద్దిరిపోయే పేరొకటి సూచిద్దామనే తీవ్రమైన ఉత్సాహం అయితే వుంది గానీ - ఇంతవరకూ ఎవరూ నన్నేదైనా పేరు సూచించమని అడిగిన పాపాన పోలేదు. అది వారి విజ్ఞత, అదృష్టం! 
                          
పుట్టబోయే తమ పిల్లలకి ఏపేరు పెట్టాలి అనేది కొందరికి జీవన్మరణ సమస్య! మీ పిల్లలకి బోల్డన్ని పేర్లంటూ పుస్తకాలు అచ్చొత్తుకుని బాగుపడ్డ రచయితలూ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ల పుణ్యామాని ప్రసవ వేదనలు బాగా తగ్గిపోయాయి. దానికి బదులుగా ఈ నామకరణ వేదనలు పెరిగిపొయాయి.
                          
ఈమధ్య టీవీలో ఒక సూటూబూటాయన తమ పేరులోని ఒక్క అక్షరం మార్చుకుంటే దరిద్రుడు కూడా ముఖ్యమంత్రి కాగలడని బల్లగుద్ది చెబుతున్నాడు. జయలలిత పేరులో పెట్టుకున్న అదనపు 'a' పవర్ వల్లనే ఆవిడకి మహర్దశ పట్టిందనీ, తనుకూడా ఇలాగే చాలామందికి అక్షరతోకలు తగిలించి లేదా కత్తిరించి, వారిని బూర్లెగంపలోకి తన్నానని లైవ్ షోలు నిర్వహిస్తున్నాడు. ఈ అక్షర మార్పుచేర్పుల కార్యక్రమం మనకేమోగానీ, ఆయనకి మాత్రం బాగానే గిట్టుబాటవుతున్నట్లుంది.   

'నేములో నేముంది?' అన్నారు పెద్దలు. నిజంగానే ఏమీ లేదు. కాకపోతే ప్రస్తుతం తలిదండ్రులు తమ పిల్లలకి గొప్పపేరు పెడదామని ఉబలాటపడుతున్నారు. బహుశా ఎట్లాగూ వారు పెద్దయ్యాక 'గొప్పపేరు' తెచ్చుకోలేరు, అదేదో మనమే కానిద్దామనే దూరదృష్టి వల్ల కావొచ్చు! 

(picture courtesy : Google)