Showing posts with label బ్రాడీపేట. Show all posts
Showing posts with label బ్రాడీపేట. Show all posts

Monday, 21 April 2014

హేమమాలిని! బెస్టాఫ్ లక్


పులిని చూపించి 'ఇది పులి' అని చెప్తే నవ్వొస్తుంది. అలాగే పై ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు 'హేమమాలిని' అని రాస్తే కూడా నవ్వొస్తుంది. ఎందుకంటే - హేమమాలిని పరిచయం అవసరం లేని వ్యక్తి (ముఖ్యంగా మా వయసు వాళ్లకి).

హేమమాలిని ప్రస్తుతం బిజెపి తరఫున లోక్ సభ ఎన్నికల బరిలో ఉంది. ఆవిడ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న ఫొటోలు అడపా దడపా న్యూస్ పేపర్లల్లో కనబడుతూనే ఉన్నయ్. ఆ ఫొటోలు చూసినప్పుడల్లా నాకు పాతరోజులు గుర్తొచ్చి చాలా సంతోషంగా ఉంటుంది.

నేను పదో క్లాసులో ఉండగా నాజ్ అప్సరలో 'సీతా ఔర్ గీతా' అనే హిందీ సినిమా విడుదలైంది. హేమమాలిని ద్విపాత్రాభినయం. నాకు హేమమాలిని పిచ్చపిచ్చగా నచ్చింది. అందుకే సినిమా రెండుమూడుసార్లు చూశాను. కానీ బయటకి చెప్పుకోలేని దుస్థితి. అందుక్కొన్ని కారణాలున్నయ్! ఏమిటవి?

అడవికి సింహం రాజు. కవులు సింహం జూలు, సన్నని నడుం అందానికి చిహ్నంగా రాస్తారు. అడవిలోని జంతువులకి కవులకున్న కళాహృదయం ఉండదు, కానీ - చావు భయం మాత్రం ఉంటుది. అందుకే వాటికి సింహం పంజా దెబ్బన్నా, కండల్ని చీల్చేసే వాడికోరలన్నా భయం. అంచేత సింహం కనబడితే అవి భయం చేత పక్కకి తప్పుకుంటాయ్. రాజంటే కూడా సామాన్య ప్రజలు అలాగే భయపడాలని కవుల అభిప్రాయం కావొచ్చు, అందుకే సింహాన్ని మృగరాజుగా నిర్ణయించేశారు.

సరే! ఇప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం (ఉన్నామా?!), ప్రజలు ఓట్లేస్తేనే లీడర్. అందుకే వాళ్ళు ఓట్లేయించుకోడానికి కుక్కపాట్లు పడతారు. ఎలక్షన్ల సమయంలో సామాన్య ప్రజలు తక్కువ ఆలోచిస్తారు, ఎక్కువమంది ఓట్లేస్తారు. మేధావులు ఎక్కువ ఆలోచిస్తారు, తక్కువమంది ఓట్లేస్తారు!

అడవిలో సింహం కాకున్నా, ఎలక్షన్లో నించోకున్నా.. సూర్యం మా బ్రాడీపేట గ్యాంగ్ నాయకుడుగా ఉన్నాడు. బంగారానికి వెండి తలవంచినట్లు, హెడ్ కానిస్టేబుల్ కి కానిస్టేబుళ్లు ఒదిగుండినట్లు మేం కూడా సూర్యం లీడర్షిప్పుని ఒప్పేసుకున్నాం (మా బ్రాడీపేట గ్యాంగ్ గూర్చి ద గ్రేట్ బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్  అనే పోస్టులో కొంత రాశాను).

ప్రజాస్వామ్య స్పూర్తిలో సూర్యానికి ఇందిరా గాంధీ ఆదర్శం. అందుకే - సూర్యానికి నచ్చినవే మనక్కూడా నచ్చాలి, నచ్చకపోతే మనక్కూడా నచ్చరాదు. ఎదురు మాట్లాడినవాడు అసమ్మతివాదిగా నింద మొయ్యాలి. వాడిపై సిబిఐ, ఎఫ్బిఐ మొదలైన నిఘాలు కూడా ఉంచబడతాయ్. ఇది మాకందరికీ ఏదోక స్థాయిలో అనుభవమే కాబట్టి 'బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్'గా ఉండేవాళ్ళం (లేనిచో బ్రతుకు దుర్భరం చేస్తాడని తెలుసు).

మా గ్యాంగ్ లో ఏ విషయంలోనైనా (ఏకపత్నీవ్రతుళ్ళా) ఒక్కళ్ళనే ఇష్టపడాలి. మేమందరం గుండప్ప విశ్వనాథ్ అభిమానులం. గవాస్కర్ అభిమానులకి మాలో చోటు లేదు. ఏకకాలంలో విశ్వనాథ్, గవాస్కర్ల అభిమానిగా ఉండరాదు, రూల్సు ఒప్పుకోవు! 

మా నాయకుడు సూర్యం రేఖ అభిమాని. కావున టెక్నికల్ గా నేను కూడా రేఖ అభిమానిని. ఇప్పుడు నాకు హేమమాలిని నచ్చిందంటే.. పార్టీ మారే రాజకీయ నాయకుళ్ళా చాలా వివరణ ఇచ్చుకోవాలి. అందుకు నేను సిద్ధంగా లేను.

నాజ్ అప్సర తెరపై 'సీతా ఔర్ గీతా' చూస్తున్నాను.

"కిశోర్ 'హవా కె సాథ్ సాథ్.. ' భలే పాడాడు కదూ?" 

'ఊతప్పానికి ఉల్లిపాయలే రుచి' అనే సత్యాన్ని ప్రపంచంలో మొదటిసారి కనుగొన్నవాళ్ళా అన్నాడు సూర్యం (మావాడికి కిశోర్ కుమార్ పిచ్చి).

"అవునవును" 

అమెరికా అధ్యక్షుడి మాటకి తల ఊపే ఇండియా ప్రధాన మంత్రిలా అన్నాను.

(కిశోర్ కుమారా? గాడిద గుడ్డేం కాదు! ఇక్కడ ఫుల్లుగా హేమమాలినిని చూసేస్తున్నా.)

'షోలే' మొదటిరోజు ఈవెనింగ్ షో చూశాం. దార్లో బ్రిడ్జ్ పక్కన బలరాం హోటల్లో టీ తాగుతున్నాం.

"సినిమాకి అమితాబ్ చచ్చిపోయ్యే సీన్ హైలైట్."

నిండుసభలో శ్రీకృష్ణ దేవరాయలు అల్లసాని పెద్దన పద్యాన్ని మెచ్చుకుంటున్నట్లుగా.. తల పంకిస్తూ అన్నాడు సూర్యం.

అదే సభలో ముందునించి మూడో వరసలో నించున్న నాలుగో భటుడిలా, వెంటనే.. "అవునవును!" అన్నాను.

కానీ నాకు హేమమాలిని 'బసంతి' సీన్లే నచ్చాయి. అయితే ద్రోహులే అతి వినయంగా ఉంటారని ఆ రోజు అనుభవ పూర్వకంగా గ్రహించాను. అందుకే - మనసులోని నా 'రాజద్రోహ కుట్ర' (హేమమాలిని అభిమానం) బయట పడనీకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాను.

మెడిసిన్ కోర్స్ అయిన వెంటనే సూర్యం బ్రాడీపేట వదిలేసి అమెరికా వెళ్ళిపొయ్యాడు. రాజు లేని రాజ్యం దిక్కులేనిదైపోయింది. అటు తరవాత సామంత రాజులూ దేశాలు పట్టిపోయారు. ఆ విధంగా మా బ్రాడీపేట గ్యాంగ్ ఆనతి కాలంలోనే ఎండలో ఉంచిన వెనిలా ఐస్ క్రీములా కరిగిపోయింది.

తరవాత కాలంలో హేమమాలిని ఏం చేసిందో తెలీదు, తెలుసుకోవాలన్న ఆసక్తీ లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఎలక్షన్ల సందర్భంగా హేమమాలిని మొహం కనబడుతుంది. ఆమెలో ఇంకా అదే అందం, అదే డిగ్నిటీ. వావ్!

ప్రతి మనిషికి జీవితంలో ఒక్కోదశ ఉంటుంది. చిన్నప్పుడు నాకు క్రికెట్ అంటే ఇష్టం, సినిమాలంటే ప్రాణం. ఒకప్పుడు హేమమాలిని అందాన్ని అభిమానించాను. ఇవ్వాళ నా దృష్టిలో అందానికి వీసమెత్తు విలువ కూడా లేదు.. అదసలు విషయమే కాదు. ఇవన్నీ సహజమైన పరిణామాలని అనుకుంటున్నాను.

హేమమాలిని ఈరోజుకీ ఇంత అందంగా ఉండడానికి కారణం ఏమైయ్యుంటుంది? బహుశా హేమమాలినికి సావిత్రి, మీనాకుమారిల్లాగా కష్టాలు లేకపోవటం ఒక కారణం అయ్యుండొచ్చు. ఆల్రెడీ పెళ్లై, పిల్లలున్నవాణ్ని వివాహం చేసుకున్న సినిమా హీరోయిన్లు (ఎక్కువమంది) ఇబ్బందుల్లో పడ్డారు. కొందరు మాత్రమే హేపీగా ఉన్నారు. ఆ కొందర్లో హేమమాలిని ఉంది. అందుకు ధర్మేంద్రని అభినందించాలి.

చివరగా - నా జీవితంలో ఒకానొక దశలో నన్ను అలరించి, ఆనందింపచేసిన హేమమాలిని.. కడదాకా ఇలాగే ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బెస్టాఫ్ లక్ టు హేమమాలిని!

అంకితం :

నా జీవితంలో అతిముఖ్యమైన రోజుల్లో నాకు తోడుగా ఉన్నవాడు, నా ప్రియాతి ప్రియమైన నేస్తం సూర్యంకి (Dr.Surya P Ganti, cardiac anaesthesioligist, New Jersey, USA.).  

ఇప్పుడే అందిన ఫోటో :


హేమమాలినితో మా బ్రాడీపేట గ్యాంగ్ సభ్యుడు. పేరు తేజానంద్ గౌతం మూల్పూరు, వృత్తి నరాల వైద్యం (Neurologist), ఊరు వేటపాలెం (Huntsville, Alabama, USA).

(photo courtesy : Google)

Thursday, 10 October 2013

తోక పేరు.. ఒక చల్లని నీడ



"హాయ్! ఐయాం ఫలానా చౌదరి. బాగున్నావా?" పొద్దున్నే ఫోన్లో ఒక లేడీ స్టోన్.

ఆశ్చర్యపొయ్యాను. ఈ లేడీ చౌదరి ఎవరబ్బా? నా PG రోజుల్లో 'చౌదరి' అనే తోకతో ఒక హర్యానా మనిషి ఉండేది. ఆవిడకి ఖచ్చితంగా తెలుగు రాదు. అందుకే నా పేరుని రకరకాలుగా పిలుస్తూ మూడేళ్ళపాటు నన్ను మానసిక అశాంతికి గురి చేసింది. ఇప్పుడు హర్యానాలోని రోహ్టక్ అనే ఊళ్ళో బిజీబిజీగా వైద్యం చేసుకుంటుంది. మరీ తెలుగు మాట్లాడే ఆడ చౌదరి ఎవరబ్బా?

"క్షమించాలి. నాకు మీరెవరో గుర్తు రావట్లేదు." అత్యంత వినయంగా అన్నాను.

'అతి వినయం ధూర్తలక్షణం' అన్నారు పెద్దలు. కాకపోతే ఇక్కడ నా వినయంలో ధూర్తత్వం ఏమాత్రం లేదని మనవి చేసుకుంటున్నాను. ఈ వినయం కేవలం ఒక ముందు జాగ్రత్త చర్య మాత్రమే. నాకు అపరిచిత ఆడవారితో ఫోన్లో మాట్లాడానికి గల భయానికో బలమైన కారణముంది.

గతంలో నాకో చేదు అనుభవం ఎదురైంది. కొన్నాళ్ళక్రితం నా స్నేహితుడొకడు అమెరికా నుండి అరుదెంచిన సందర్భంగా ఒక పార్టీ ఏర్పాటయ్యింది. ఆ పార్టీ విషయం చెప్పడానికి ఇంకో స్నేహితుడికి నంబర్లు నొక్కి ఫోన్ చేశాను.

'రాత్రి తొమ్మిదింటికల్లా ఫలానా హోటల్ కి వచ్చెయ్. కావాలంటే కారు పంపిస్తాను.' హడావుడిగా అన్నాను.

నా ఖర్మకాలి ఆ నంబర్ పొరబాటున ఇంకో నంబరుకి పోయింది. ఆ నంబర్ ఎవరో ఆడలేడీసుది. ఆవిడ నా హడావుడి ఆహ్వానానికి సమాధానం చెప్పకుండా 'ఏవండి' అంటూ ఒక మగజెంటుకి ఫోనందించింది.

ఆ మగజెంటు 'ఎవడ్రా నువ్వు నా పెళ్ళాన్ని హోటల్కి రమ్మంటున్నావ్?' అంటూ నన్ను దుర్భాషలాడ్డం మొదలెట్టాడు. పోలీస్ రిపోర్టిస్తానన్నాడు. పొరబాటుని క్షమించమని వేడుకుంటూ.. నేను ఫలానా అని చెప్పాను.

'డాక్టరైయ్యుండి ఇట్లాంటి పాడుపనులు చెయ్యడానికి సిగ్గులేదా?' అంటూ మళ్ళీ తిట్టాడు.

చివారకరికి పక్కనే ఉన్న నా భార్య మాట సాయంతో బయటపడ్డాను. ఆ రోజు నా భార్యే సాయం చెయ్యకపోతే నేనేమైపొయ్యేవాణ్ణోగదా అని ఇప్పటికీ అనుకుంటుంటాను (బహుశా 'మానసికి వైద్యుడి మనో వికారం' అంటూ మర్నాడు జిల్లా ఎడిషన్లోకెక్కేవాణ్ణేమో)!

ఈ భీభత్స సంఘటన నా మదిలో చెరగని ముద్ర వేసింది. దీన్నే మానసిక వైద్య పరిభాషలో PTSD అని అందురు. ఈ కారణాన.. ఆనాటి నుండి ఫోన్ నంబర్లు నొక్కడం మానేశాను. అవతల్నుండి మాట్లాడేది ఆడ స్టోనయినట్లైతే అత్యంత జాగ్రత్తగా ఉందును.

"You idiot. I will kill you. నేను నీ క్లాస్మేట్ని. నన్నే మర్చిపొయ్యావా?" అంటూ ఆ చౌదరమ్మ తన maiden name చెప్పింది.

"నువ్వా తల్లీ! పేరు చివర 'చౌదరి' విని జడుసుకున్నాను." అంటూ కబుర్లలో పడ్డాను.

ఈవిధంగా నాకు కొన్నిసార్లు నా క్లాసమ్మాయిలతో కొంత ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళల్లో చాలామంది ఇంటిపేరు మార్చేసుకున్నారు. కొందరికి పేరు చివర కులం పేరో, భర్త పేరో తగులుకుంది. మామూలుగానే నాకు తికమక.. ఇక ఈ కొత్తపేర్లు నా జ్ఞాపకశక్తికి పరీక్షలు పెట్టనారంభించాయి.

ఇప్పుడు నా చదువుకునేప్పటి ముచ్చటొకటి. మన ప్రాంతంలో రెడ్డి కులస్తుల్లో మగవారికి పేరు చివర్న 'రెడ్డి' అని ఉంటుంది (ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తమ పేరుకి ఈ 'రెడ్డి' తగిలిస్తున్నారనుకోండి). రెడ్లకి మాత్రమే ఉన్న ఈ ప్రత్యేక ప్రతిపత్తికి ఈర్ష్య చెందిన నా క్లాస్మేట్టొకడు తన పేరు చివర్న తన కులానికి చెందిన 'చౌదరి' అని తగిలించుకుని మిక్కిలి తృప్తినొందాడు. అక్కడతో ఆగాడా? లేదు. 'చౌదరి' చరణ్ సింగు కూడా తమ వాడేనని ప్రకటించుకున్నాడు.

'ఆ చౌదరి వేరురా నాయనా! చరణ్ సింగ్ ఉత్తర భారతీయుడు, జాట్ కులస్తుడు.' అంటే ఒప్పుకునేవాడు కాదు. వాదించేవాడు.

'చరణ్ సింగ్ కొడుకు మా మేనత్త తోడుకోడలి మేనమామకి బావమరిది.' అంటూ ఏదో చుట్టరికం కూడా చెప్పేవాడు.

సరే! ఈ పోస్టు ఉద్దేశ్యం కులాల పేర్ల గూర్చి రాసి.. అట్టి పేర్లు గల చదువరుల మనోభావాలు దెబ్బతియ్యడం కాదు కాబట్టి అసలు విషయంలోకొస్తాను.

డబ్బున్నవాడు ఖరీదైన దుస్తులు ధరిస్తాడు. ధనవంతులైన ఆడవారు విలువైన దుస్తులకి తోడుగా బరువైన ఆభరణాలు కూడా ధరిస్తారు. అంటే.. ఖరీదైన వేషధారణతో వాళ్ళు తమ ఆర్ధికస్థితి గూర్చి సమాజానికి ఒక బహిరంగ ప్రకటన చేస్తున్నారని మనం అర్ధం చేసుకోవాలి. ఈ ప్రకటన వారికి ఆనందాన్నీ, తృప్తినీ కలిగిస్తూ ఉండి ఉండాలి. ఏదోక ప్రయోజనం లేకుండా మన ఉక్కపోత వాతావరణంలో ఎవరూ అంతగా ఇబ్బంది పడరు గదా!

ఈ మధ్య సమాజంలో అనేక రకాలైన విశ్వాసాలు చూస్తున్నాం. ఫలానా రంగురాళ్ళు మీ భవిష్యత్తునే మార్చేస్తాయ్. ఈశాన్యం పెంచి, ఆగ్నేయం తగ్గిస్తే పట్టిందల్లా బంగారమే. ఫలానా బాబాగారి ఉంగరం, తాయెత్తు ధరిస్తే అష్టైశ్వర్యాలు గ్యారెంటీ. మీ పేరులో ఒక అక్షరం పీకేసి, ఇంకో అక్షరం కలిపితే ముఖ్యమంత్రి కూడా అవుతారు. ఈ రకమైన అదృష్టం, ఐశ్వర్యం కలిగించే వ్యాపారాలు మూడు పూవులు, ఆరు కాయలుగా సాగుతున్నాయ్. ఇవన్నీ నమ్మకాలకి సంబంధించిన వ్యవహారాలు. ఆచరించేవారికి ఆత్మస్తైర్యం కలిగిస్తాయి.

ఈ లాజిక్ ని తోక పేర్ల విషయంలోకి తీసుకొద్దాం. నేను ఫలానా కులంలో పుట్టాను. ఇది నాకు మిక్కిలి గర్వకారణం. కావున ఆ కులం పేరుని తోకగా తగిలించుకుందును. ఫలానా మా ఇంటిపేరు చాలా గొప్పది. కావున ఆ ఇంటిపేరుతో నాపేరు రాసుకుందును. ఫలానావాడు భర్తగా దొరకడం నా అదృష్టం.. అంచేత అతనిపేరు నా పేరుకి తోకగా జత చేసుకుంటాను. వీరందరికీ ఇట్లాంటి పేరు తోకల్ని చేర్చుకోవడం వల్ల అమితమైన ఆనందం, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మంచిదే కదా!


ఇలా కులం పేరుతోనో, భర్తల పేరుతోనో తోకలు ఉండొచ్చా? 'కూడదు' అంటూ సామాజిక కారణాలతో కొందరు వాదిస్తారు. ఈ కులం తొకలన్నీ ఇరవైయ్యేళ్ళల్లో మాయమైపోతాయని నా మిత్రుడు గోపరాజు రవి ముప్పయ్యేళ్ళ క్రితం బల్లగుద్ది వాదించేవాడు. అతనేమీ వీరబ్రహ్మేంద్రస్వామి కాదు. అంచేత ఈ ధోరణి తగ్గకపోగా.. మునుపటికన్నా ఇప్పుడు బాగా ఎక్కువైంది. ఇది ఒక సీరియస్ అంశం. అందుకే నేనీ పోస్టులో ఆ కోణం జోలికి పోవట్లేదు.

కొందరికి వారి కులం, వంశం, భర్త వగైరా వివరాలు తమ పేరు ద్వారా ప్రకటించుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. చల్లని నీడలో సేద తీరినట్లుగా కూడా అనిపిస్తుంది. మంచిది. కాదనడానికి మనమెవరం? మతవిశ్వాసాలు, ఆర్ధిక స్థితుల ప్రకటనల్లో లేని అభ్యంతరం తోకపేర్ల విషయంలో ఎందుకుండాలి? ఈ ప్రపంచంలో అందరూ తమ ఆనందం కోసం తమకిష్టమైన పనులు మాత్రమే చేస్తారు. ఇష్టం లేని పని అస్సలు చెయ్యరు. ఈ సంగతి ఆనంద నిలయం.. ఎంతో ఆహ్లదకరం!  అనే పోస్టులో నొక్కి వక్కాణించాను. 

పేర్లు అనేవి గుర్తుల కోసం పెట్టుకునే XYZ లాంటివని నా అభిప్రాయం. అంతకుమించి వీటికి ప్రాధాన్యం లేదు. ఈ సంగతి పేరులోనే అంతా ఉంది  అని ఇంతకుముందు రాశాను. అందువల్ల పేర్లకి కొత్త తగిలింపులు, పొడిగింపులకి పవిత్రతా లేదు, అపవిత్రతా లేదు. ఇన్ని కబుర్లు చెబుతున్న నేనూ నాపేరు గూర్చి మధనపడ్డ సందర్భం ఉంది. ఆ విషయాన్ని నాదీ ఒక పేరేనా?! హ్మ్.. ! అంటూ ఏడుస్తూ ఒక పోస్ట్ రాశాను

ఇప్పుడు నా మనసు విప్పి ఒక రహస్యం చెప్పదలిచాను. 'రమణ' అన్న పేరుయందు నాకు అమితమైన అభిమానం. అందువల్ల ఆ పేరు కల పేషంట్లని కొద్దిగా ప్రత్యేకంగా చూస్తాను. చాలాసార్లు ఫీజులో రాయితీ కూడా ఇస్తాను. అయితే ఇలా ఒక పేరు వినంగాన్లే మదిలో వీణలు మోగడాన్ని నేను సూత్రరీత్యా వ్యతిరేకిస్తాను. భాష, ప్రాంతీయ దురభిమానాల వలే.. ఇదికూడా ఒక రోగమేమోనన్న అనుమానం నన్ను పీడిస్తుంది.

ఒకానొకప్పుడు నా పేరుకి ముందు నాకెంతో ఇష్టమైన నా జన్మస్థలం 'బ్రాడీపేట' తగిలించి ప్రఖ్యాతి నొందుదామని ఒక మాస్టర్ ప్లానేశాను. అంచేత నాపేరు 'బ్రాడీపేట రమణ'గా మార్చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా.. కొన్ని కొత్తవిషయాలు తెలిశాయి. మావూళ్ళో కొత్తపేట శివ, సంగడిగుంట శీను, చుట్టుగుంట సాంబ, కొరెటిపాడు ఉమా.. అంటూ ఆల్రెడీ పేట పేర్లని తమ పేర్లకి prefix గా చేసుకున్న ప్రముఖులు కొందరు ఉన్నార్ట. అయితే వీరందరూ A+ రౌడీషీటర్లుట! అందువల్ల నాపేరు మార్చుకుని వారి సరసన చేరే సాహసం చెయ్యలేక నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను.

నా భార్య తన పేరు పదోతరగతి సర్టిఫికేట్లోని పేరునే కొనసాగిస్తుంది. ఇందుకు రెండు కారణాలు తోస్తున్నాయి. ఒకటి ఆవిడ నా పేరులోని ఎటువంటి శకలం అవసరం లేని అత్మవిశ్వాసి అయినా అయ్యుండాలి లేదా ఆవిడ దృష్టిలో నా పేరుకి అంత విలువైనా లేకుండా ఉండి ఉండాలి. నాపేరు నాకు విలువైనదే. కానీ నా భార్యకి కూడా విలువైనదై ఉండాలని రూలు లేదు. కారణం ఏదైతేనేం.. ఆవిడ నాపేరు జోలికి రాలేదు.

అంతే గదా? ఎక్కడైనా ఒకటి తరవాత సున్నాలకి విలువ ఉంటుంది గానీ.. ఒకటి ముందున్న సున్నాలకి విలువుండదు! ఇలా పైసా కూడా విలువ చెయ్యని పేరు కలవాడిని కాబట్టే.. కుళ్ళుబోత్తనంతో ఈ పోస్ట్ రాస్తున్నానని ఎవరైనా అనుకుంటే.. ఆ అనుకోడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను!

(photo courtesy : Google)

Monday, 8 July 2013

ద గ్రేట్ బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్

ముందుమాట :


ఈ పోస్టులో నా చిన్ననాటి స్నేహితుల జ్ఞాపకాలు రాస్తున్నాను. ఇది పూర్తిగా నా సొంతగోల. ఓ స్నేహితుడి కోసం నేన్రాసుకున్న తీపిజ్ఞాపకం. ఇది నా రాత కాబట్టి.. నాకంటూ ఓ బ్లాగుంది కాబట్టి.. పబ్లిష్ చేస్తున్నాను. మీకు విసుగనిపించవచ్చు. అయినా చదివేస్తాం అంటే.. మీ ఇష్టం!


టీవీలో ఏదో అమితాబ్ బచ్చన్ పాత సినిమా వస్తుంది. ఓ రెండు నిమిషాలపాటు కన్నార్పకుండా అమితాబ్ ని అలానే చూస్తుండిపొయ్యాను. గతమెంత ఘనము! రోజులెంత తొందరగా మారిపోయ్యాయి!

నేనొకప్పుడు ఇదే అమితాబ్ ని చూస్తూ మైమరచి పొయ్యేవాణ్ని. అమితాబ్ రేఖతో రొమేన్స్ చేస్తుంటే పులకరించిపొయ్యేవాణ్ని. అతని ఫైటింగులు చూస్తూ పరవశించిపోయేవాణ్ని. ఇప్పుడు అదే అమితాబ్ ని చూస్తుంటే పులకరింత, పలవరింత కాదు గదా.. కనీసం చక్కలిగింత పెట్టినట్లుగా కూడా లేదు! కారణమేమి?

వందోసారి రాస్తున్నాను.. ఈ భూమండలమునందు అత్యంత సుందర ప్రదేశం మా గుంటూరు (ఎవరికైనా అభ్యంతరం ఉంటే గుంటూరు సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు.). అందుకలదు మా బ్రాడీపేట గ్యాంగ్. మా బ్రాడీపేట సందుల్లో, గొందుల్లో విపరీతంగా క్రికెట్ ఆడేవాళ్ళం. మా సందు బౌలర్లలో డెనిస్ లిల్లీ, మైఖేల్ హోల్దింగుల్నీ.. గల్లీ బ్యాట్స్ మెన్లలో విశ్వనాథ్, సోబర్సుల్నీ చూసుకుని ముచ్చటనొందేవాళ్ళం.

మాకు విపరీతంగా సినిమాలు చూసే గొప్పఅలవాటు కూడా ఉంది. అప్పటికి మా సినీవీక్షక ప్రస్తానం విఠలాచార్య కత్తియుద్దాలతో మొదలై.. రామారావు ఫైటింగుల మీదుగా పయనించి.. అమితాబ్ బచ్చన్ హిందీ సినిమాల వద్దకి చేరుకుంది.

గుంటూర్లో అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా రంగమహాల్లోకి, తక్కువగా విజయలక్ష్మిలోకి వచ్చేవి. ఏ సినిమా ఏ హాల్లోకి వచ్చినా ఒక్కోసినిమా ఒకటికి రెండుసార్లు చూసేవాళ్ళం. మాకదో దీక్ష, నోము, యజ్ఞం, వ్రతం. అమితాబ్ సినిమాలకి మొదట్రోజు జనం ఎక్కువగా ఉండేవాళ్ళు. స్త్రీల టికెట్ కౌంటర్ వద్ద క్యూ పోట్టిదిగానూ, పురుషుల కౌంటర్ వద్ద క్యూ పొడవుగానూ ఉండేది.

మా రావాయ్ గాడు ("గల్తీ బాత్ మత్ కరో భాయ్!" ఫేం) ఆడవాళ్ళ టికెట్ కౌంటర్ల వద్ద చేతులోని రూపాయిల నోట్లు చూపుతూ, ఊపుతూ.. అత్యంత దీనంగా, జాలిగా 'అక్కా టికెట్! అమ్మా టికెట్!' అంటూ టికెట్లు తీసివ్వమని యాచించేవాడు. వీడి దొంగమొహాన్ని చూసి ఎవరో ఒక మహాతల్లికి గుండె కరిగేది. తత్ఫలితంగా మా చేతిలో టికెట్లు పడేవి.

అమితాబ్ సినిమాల్లో కిశోర్ కుమార్ పాటలుండేవి. అవి మిక్కిలి మధురంగా మనసును మైమరపించేవి. అమితానందంతో అమితాబ్ సినిమాని చూసిన మమ్మల్ని.. సినిమా తరవాత కిశోర్ గానమాధుర్యం ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ట్యూన్లలో హచ్ కుక్కలా వెంటాడేవి. సింగిల్ మాల్ట్ విస్కీలా మత్తెక్కించేవి.

ఇక్కడిదాకా పెద్ద విశేషం కాదు. ఇట్లాంటి అనుభూతులు దాదాపు అన్ని స్నేహబృందాలకి అనుభవమే. అయితే మాకు ఇక్కణ్నించే చాలా పని మొదలయ్యేది. మా బ్రాడీపేట గ్యాంగ్ లో అతి ముఖ్యుడు సూర్యం. హిందీ సినిమాల ప్రేమికుడు.

'పొద్దస్తమానం హిందీ సినిమాలేనా?' అని గింజుకునే నన్ను.. నా జుట్టు (ఆ రోజుల్లో నా తలకి ఫుల్లుగా జట్టుండేది) పట్టుకుని మరీ లాక్కెళ్ళేవాడు. సినిమా చూసిన సూర్యాన్ని కిశోర్ కుమార్ అవహించేవాడు.. పూనేవాడు. వెంటనే తీవ్రాతితీవ్రంగా కిశోర్ కుమార్ పాటల్ని అందుకునేవాడు.




బ్రాడీపేట రెండోలైన్ తొమ్మిదో అడ్డరోడ్డులో ఓంకార్స్ టైప్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దాని ఎదురుగా మా సూర్యం ఇల్లు. అది మా బ్రాడీపేట గ్యాంగ్ హెడ్ క్వార్టర్స్. అక్కడ మేం ఒక ఆర్కెస్ట్రా కూడా డెవలప్ చేశాం. ఆర్కెస్ట్రా లీడ్ సింగర్ సూర్యం.

ఒకడు తుప్పుపట్టిన బుల్ బుల్ ప్లే చేస్తాడు. ఇంకోడు దుమ్ము పట్టిన మౌతార్గాన్. ఇట్లా ఎవరికీ దొరికిన వాయిద్యంతో వాడు రెడీ అయిపోయ్యేవాడు. ఇక్కడ మాది ఇండియన్ ఒలింపిక్స్ స్పూర్తి (ఏం వాయించాం, ఎంత బాగా వాయించాం అన్నది ప్రధానం కాదు.. అసలు ఆర్కెస్ట్రాలో ఉన్నామా లేదా అన్నదే పాయింట్).

ఇప్పుడు కొంచెంసేపు నా గిటార్ గోల. నేనో గిటార్ కొనుగోలు చేసి శిక్షణ నిమిత్తం ఆర్.అగ్రహారంలో ఒక గిటార్ టీచర్ దగ్గర చేరితిని. ఆయన ఎంతసేపటికీ ఏదో నోట్స్ ఇచ్చి (అది నిలువు అడ్డగీతలతో ఉండేది) ప్రాక్టీస్ చెయ్యమనేవాడు. నాకు వేళ్ళు మంట తప్ప ఏదీ పలికి చచ్చేదికాదు.

మొత్తానికి కిందామీదా పడి 'Come September' ప్లే చెయ్యడం నేర్చుకున్నాను. దాన్నే కొంచెం మార్చి 'The Good, the Bad and the Ugly' (అంటూ) ప్లే చేసేవాణ్ణి. కావున మా గ్రూప్ లో నేనే లీడ్ గిటారిస్టునని అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా!

ఒక్క ఇంస్ట్రుమెంట్ కూడా తెలీని మా రావాయ్ గాడు అత్యుత్సాహంగా ఆర్కెస్ట్రాలో ఇరుక్కునే వాడు. ఇంట్లో అటక మీద నుండి పెద్ద బొచ్చె దించి.. దాన్ని బోర్లేసి పుల్లల్తో వీరబాదుడు బాదేవాడు. వాడు మా డ్రమ్మర్! పాట పాడటం రానివాళ్ళు, తమ బొంగురు గొంతులతో లీడ్ సింగర్ కి గొంతు సాయం చేసేవాళ్ళు. వాళ్ళని కోరస్ సింగర్స్ అందురు.

ఆ రోజుల్లో ఇళ్ళల్లో టేప్ రికార్డర్ ఉండటం కాదు.. చూసినవాళ్ళూ తక్కువే (ముప్పైయ్యైదేళ్ళ క్రితం ఇళ్ళల్లో రేడియో ఉండటమే గొప్ప)! మా సూర్యం ఇంట్లో నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ ఉండేది. అదిచూసి కొందరు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేవాళ్ళు. (అసలు ఆ టేప్ రికార్డర్ ఉండటం మూలానే మేం ఆర్కెస్ట్రా సిద్ధం చేశాం).


                            (ఐదేళ్ళ క్రితం తీసిన  పై ఫోటో ఒకప్పటి మా హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు లేదు. నేలమట్టం అయిపోయింది.) 


మెయిన్ హాల్ పక్కనున్న ఒక చిన్న రూం మా రికార్డింగ్ స్టూడియో. గాయకుడు, వాయిద్యగాళ్ళు ఇరుక్కుని చాపల మీద కూర్చునేవాళ్ళం. ఇంతమంది ఇన్నిరకాలుగా ఆర్కెస్ట్రాలో ఇరుక్కున్నా ఇంకొందరు మిగిలిపోయ్యేవాళ్ళు. వాళ్ళు self employment scheme quota లో సంగీత దర్శకుల అవతారం ఎత్తేవాళ్ళు.

అనగా.. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, శంకర్ జైకిషన్ స్టయిల్లో చేతులు పైకెత్తి.. పైకికిందకీ ఊపూతూ ట్రూప్ మొత్తం తమ చేతిసన్నల్లో ఉండేట్లు చేసుకునేవారు. ఎవరెవరు ఏ బిట్ ఎలా వాయించాలి అన్నది 'డిస్కస్' చేసుకుని.. ఇంకొద్దిసేపు ముఖ్యగాయకుడైన సూర్యంతో మరింత లోతుగా 'డిస్కస్' చేసి.. 'రెడీ! వన్.. టూ.. త్రీ.. ' అనే countdown తో ఆర్కెస్ట్రా ఫుల్ స్వింగ్ తో మొదలయ్యేది.

ఆర్కెస్ట్రా ఎంత రిచ్ గా ఉన్నప్పటికీ గాయకుడి వాయిస్ ని డామినేట్ చెయ్యరాదు అనే గొప్ప సాంకేతిక విశేషం మాకు అప్పుడే తెలుసు. అంచేత సూర్యాన్ని మైక్రోఫోన్ కి దగ్గరగా కూర్చోబెట్టి పాడించేవాళ్ళం. ఆ సత్తుబొచ్చెల డ్రమ్మర్ గాణ్ణి దూరంగా ఉంచేవాళ్ళం. తప్పదు మరి.. ఒక quality output కోసం ఆ మాత్రం ప్లాన్లెయ్యాలి.

ఈ విధంగా కిశోర్ పాటల్ని రికార్డ్ చేసుకునేవాళ్ళం. పిమ్మట మైసూర్ కేఫ్ లో శంకరనారాయణ పర్యవేక్షణలో ఇడ్లీ సాంబార్ గ్రోలి, కాఫీ సేవించి, క్రేన్ వక్కపలుకుల రుచితో సేద తీరేవాళ్ళం. ఆ తరవాత మేం రికార్డ్ చేసుకున్న పాటల్ని పదేపదే replay చేసుకుంటూ వినేవాళ్ళం. నాకా పాటలు వీనులు విందుగా ఉండేవి. కాకి పిల్ల కాకికి ముద్దు అని అనుకోకండి. ఒట్టేసి చెబుతున్నా. అదొక మధురమైన గానం. అద్భుతమైన ఆర్కెస్ట్రా!

'వాళ్ళు రికార్డ్ చేసిన పాట వింటుంటే పిశాచాలు పాళీభాషలో చేస్తున్న మృత్యుఘోషలా ఉంటుంది. కంకరరోడ్డు మీద చేస్తున్న సైనిక కవాతు వలె ఉంటుంది. ఆ ఆర్కెస్ట్రా విమానం కూలిపోతున్నట్లుగా భీకర శబ్దాలతోనూ, తోకతెగిన ఊరకుక్క రోదనలా పరమ దరిద్రంగానూ ఉంటుంది.' అని మా శత్రువర్గ దుష్టాధములు ప్రచారం చేసేవాళ్ళు.

ఉత్తమ కళాకారులకి ఆత్మవిశ్వాసమే తరగని పెన్నిధి. విమర్శలకి కుంగిపోరాదు. పొగడ్తలకి పొంగిపోరాదు. ఇవన్నీ కళాకారులమైన మాకు బాగా తెలుసు. అంచేత కువిమర్శలకి తొణకక, బెణకక మా బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోయి అనేక ఆణిముత్యాల్ని రికార్డ్ చేసింది.

అనాదిగా కళలకి, పరీక్షలకి చుక్కెదురు. అంచేత ఓ పరీక్షల సమయాన మా బ్యాండ్ చెట్టుకొకరు, పుట్టకొకరుగా అయిపోయి కనుమరుగైపోయింది. ఆ విధంగా తెలుగు కళాప్రపంచం తీరని నష్టానికి గురయ్యింది! 

చివరి మాట :

ఈ పోస్ట్ నా ప్రాణస్నేహితుడు సూర్యం కోసం రాశాను.

'సూర్యం! దిస్ ఈజ్ ఫర్ యూ.'

(గంటి సూర్యప్రకాష్. స్నేహితులకి ప్రేమగా 'సూర్యం'. గత ముప్పైయ్యేళ్ళుగా న్యూజెర్సీ పట్టణంలో మత్తు వైద్య నిపుణుడిగా స్థిరపడ్డాడు. ఈరోజుకీ తన పాటలతో అమెరికావాసుల్ని అలరిస్తున్నాడు.)

చివరి మాటకి చివరి మాట :

ముందుమాట పట్టించుకోకుండా ఇక్కడదాకా చదువుకుంటూ వచ్చారా!? అయినచో మీరు ఉత్తములు. మీకు ఆయురారోగ్యాలు, ధనకనక అష్టైశ్వర్యాలు సంప్రాప్తించుగాక!

శ్రీశ్రీశ్రీ రమణానంద మహర్షి. 

(photos courtesy : Google)

Thursday, 24 May 2012

ధారుణి రాజ్యసంపద (బీడీలబాబు కథ)

"ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి" పద్యం భీకరంగా మొదలయ్యింది. వింటున్న కొద్దీ గుండెలు ఉప్పొంగసాగాయి, మరుగుతున్న రక్తం మరిపోసాగింది, హృదయం ఉరకలు వెయ్యసాగింది. భుజంమీద గద వుంచుకుని, ఠీవీగా మీసం మెలేస్తున్న భీముడు కళ్ళముందు నిలిచాడు.

నాకు పద్యాలు అంటే యేంటో తెలీదు, అర్ధం అసలే తెలీదు, పాడిందెవరో కూడా తెలీదు. మరేం తెలుసు? భీముడు తెలుసు! తల్చుకుంటే ఆ సభలోని వాళ్ళనందరినీ గదతో మోది క్షణంలో చంపేయగలడు. కానీ - చంపనీకుండా ధర్మరాజు ఆపుతున్నాడు. ఆవేశం కంట్రోల్ చేసుకోలేక భీముడు పద్యాలు పాడేశాడు, పాపం! అంతకన్నా భీముడు మాత్రం ఏం చెయ్యగలడు?

నా చిన్నతనంలో ఇప్పట్లా సంస్కృతిని, సంప్రదాయాన్ని పరిరక్షించే సంస్థలు లేవు. కళాబంధువులు, కళాసేవకులు అసలే లేరు. ఈ పనంతా ఒంటిచేత్తో శ్రీరామనవమి పందిళ్ళు చేసేవి. పాట కచేరీలు, నృత్య ప్రదర్శనలు, నాటికలు, నాటకాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు.. అన్నీ కూడా శ్రీరామనవమి చలవే.

గుంటూర్లో వీధివీధికీ పోటాపోటీగా పందిళ్ళు ఉండేవి. రవి కాలేజీ ముందున్న పందిరి మా ఇంటికి బాగా దగ్గర. ఈ పందిరి నిర్వాహకులకి అక్కడ బడ్డీకొట్టుంది. వీరిది ఆ ఏరియాలో ఏకైక ముస్లిం కుటుంబం, అంచేత ఈ కొట్టుని 'సాయిబు కొట్టు'గా వ్యవహరించేవాళ్ళం. వీళ్ళు ఐదుగురు సోదరులు. వీరిలో సత్తార్, రజాక్ ముఖ్యులు.

ఈ పందిళ్ళల్లో - ఆధ్యాత్మిక ప్రసంగాలు, పాటకచేరీలు, డ్యాన్సులు, నాటికలు, నాటకాలు.. ఇలా రకరకాల ప్రోగ్రాంలు వుండేవి. రాత్రిళ్ళు భోంచేసి చాపలు తీసుకెళ్ళి స్టేజ్ ముందర పరిచేసేవాళ్ళం. ఒక్కొక్క చాప ఒక్కో కుటుంబానిది. వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం, పాండవోద్యోగ విజయాలు, చింతామణి.. చాలా నాటకాలు పడుకునే చూసేవాళ్ళం. నాటక కళాకారులు యాంత్రికంగా ఎవరి పద్యం వాళ్ళు పాడేసేవాళ్ళు. పాత్రధారుల మేకప్ దట్టంగా వున్నందున మొహంలో ఫీలింగ్స్ కనబడేవి కాదు, అక్కడ నటన కన్నా పద్యాలకే ప్రాధాన్యం. కృష్ణుడు, బ్రహ్మంగారు స్టేజ్ వెనుక బీడీలు తాగడం విచిత్రంగా అనిపించేది.

ఇప్పుడు మళ్ళీ అసలు కథలోకొద్దాం. పాండవ వనవాసము సినిమా రికార్డులో భీముడి పద్యాలు సైడ్ 'బి'లో ఉండేవి. సైడ్ 'ఎ' ద్రౌపది పాడిన ఏడుపుగొట్టు పాట - "దేవా! దీనబాంధవా! అసహాయురాలరా.. కావరా" వుండేది. నాకీ పాటంటే చిరాకు, అస్సలు  నచ్చదు. అయితే - సైడ్ 'ఎ' పాట తరవాతే, సైడ్ 'బి' పద్యాలు వేసేవాళ్ళు. నాకా  మూణ్నిమిషాలు మూడుగంటల్లాగా అనిపించేది.

అయితే - ఈ ఏడుప్పాట వల్ల ఒక ప్రయోజనముంది. లౌడ్ స్పీకర్లో ఆ పాట మొదలవ్వంగాన్లే ఇంట్లోంచి  పరుగందుకుని పందిట్లో వాలేవాణ్ణి. పందిట్లో మూలనున్న సీతారాములకి ఒక దణ్ణం పడేసి, ప్రసాదం నోట్లో వేసుకుని, భీముడి పద్యాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుండేవాణ్ణి. "ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి.. " మొదలు. మళ్ళీ గుండెలు.. రక్తం.. హృదయం.. షరా మాములే!

నాకీ పద్యాలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరేదికాదు. రోజంతా వినాలని చాలా కోరిగ్గా ఉండేది. కానీ ఏం చెయ్యను? ఆ రికార్డులు వేసే వ్యక్తిని అడిగే ధైర్యం లేదు. అతని పేరు షేక్ బాబు. ఎర్రగా, పొడుగ్గా, పీలగా నలిగిపోయిన వానపాములా ఉండేవాడు. అతను పొద్దస్తమానం బీడీలు తాగుతుండేవాడు, దగ్గుతుండేవాడు. దగ్గుతూ కూడా దీక్షగా బీడీలు కాలుస్తుండేవాడు! అంచేత కొందరతన్ని 'బీడీలబాబు' అనేవాళ్ళు.

గ్రామఫోన్ రికార్డులు మట్టివి. అవి పెట్టడానికి వీలుగా నిలువు అరలతో భోషాణం లాంటి చెక్కపెట్టె. పక్కన రికార్డ్ ప్లేయెర్. ప్లేయర్‌కి మూల బుల్లిఅరలో సూదులు. 'కీ' ఇవ్వడానికి 'జెడ్' ఆకారపు స్టీల్ పరికరం. బాబు రికార్డుల్నీ, గ్రామ్ ఫోన్‌నీ సున్నితంగా, ఎంతో నైపుణ్యంతో హేండిల్ చేసేవాడు. రికార్డుల్ని ప్లే చెయ్యడంలో అతనికేదో క్రమం వుంది, అన్ని రికార్డులు సమానంగా అరిగిపోవాలనే నియమం అయ్యుండొచ్చు.

బీడీలబాబు పద్యాలు మళ్ళీ ఎప్పుడు పెడతాడు? ఆ పద్యాల కోసం ఎదురుచూస్తూ అక్కడే ఎంతసేపు పడిగాపులు కాయాలి? పోనీ ఒక గంటదాకా ఆ పద్యాలు వెయ్యడా? అదేంలేదు, ఎవరన్నా పెద్దవాళ్ళు ఆ పద్యాల్ని వెయ్యమంటే ఔటాఫ్ ఆర్డర్లో వేసేస్తాడు. అప్పటికే ఇంట్లోంచి నాలుగుసార్లు పరిగెత్తుకుంటూ వచ్చా. కాళ్ళు లాగేస్తున్నాయి, నాకు ఏడుపొచ్చింది. 

అప్పటికి వందోసారి నిర్ణయించుకున్నాను. పెద్దయ్యాక నేనూ బీడీలబాబులా రికార్డులేసే ఉద్యోగంలోనే చేరతాను. పిల్లలు అడిగిన పాటలన్నీ వేస్తాను. భీముడి పద్యాలు వెంటవెంటనే వేసే బుద్ధి బాబుకి ప్రసాదించమని.. ద్రౌపది పాడినట్లు నేను కూడా 'హే కృష్ణా!' అంటూ ప్రార్ధించుకునేవాణ్ని. మనమెంత ప్రార్ధించినా ప్రయోజనం లేదని, బాబు సాయిబు అయినందున మన హిందుదేవుళ్ళు బాబు మనసు మార్చలేరని ఎదురింటి రాము అనేవాడు. పైన మబ్బుల్లో దేవుళ్ళంతా ఒకటేననీ, అక్కడ మన దేవుళ్ళు అల్లాకి రికమండ్ చేస్తారని పక్కింటి ఫణి వాదించేవాడు.

నా "ధారుణి రాజ్య సంపద.. " వీరాభిమానం కేవలం విన్డానికే పరిమితమా? కానేకాదు, ఇంట్లో భీముడుగా మోనో ఏక్షన్ చేసేవాణ్ని. పొయ్యి పక్కనున్న సరివికట్టె నా గదాదండము, దారం కట్టిన అట్టముక్క కిరీటం. ఈ రెండూ వొంటి మీదకి రాంగాన్లే నన్ను భీముడు పూనేవాడు. (లేని) మీసం మెలేస్తూ, తొడ కొడుతూ ఆవేశంతో ఊగిపొయ్యేవాణ్ణి.

"ఓరోరీ మాయాజూద వినోదా, మధు మదోన్మత్తా, దుర్యోధనా! నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తా!" అని పెడబొబ్బలు పెట్టి, తొడ గొట్టుకుంటూ "ధారుణి రాజ్యసంపద" అంటూ గర్జిస్తూ పద్యం అందుకునేవాణ్ణి. ఇంటికి ఎవరొచ్చినా వారికి భీముణ్ణి చూపేవాణ్ణి. కొన్నిసార్లు నా ప్రదర్శనకి రెండుపైసలు పారితోషకం కూడా లభించేది. ఒకరోజు ప్రదర్శనలు ఎక్కువైనందున, తొడ వాచిపోయి ఏడుస్తుంటే అమ్మ కొబ్బరినూనె రాసి ఓదార్చింది.

కొన్నాళ్ళకి దేవుడు నా మొర ఆలకించాడు - మా పక్కింటి సత్తిగాడి రూపంలో! సత్తిగాడు నాకన్నా ఒకేడాది పెద్ద. లావుగా, పొట్టిగా గుండ్రాయిలా ఉంటాడు. తండ్రికి పక్కవీధిలో కిరాణా కొట్టుంది. సత్తిగాడు మధ్యాహ్నం తండ్రి కోసం భోజనం కేరేజ్ తీసుకెళ్ళేవాడు. తండ్రి అటుతిరిగి అన్నం తింటుంటే మనవాడు గల్లాపెట్టె వద్ద తన హస్తలాఘవం చూపేవాడు.

వచ్చేప్పుడు కేరేజ్ ఖాళీది తెచ్చేవాడు, జేబులు మాత్రం నిండుగా ఉండేవి. కొట్టుకొచ్చిన డబ్బుల్తో మాకు నిమ్మతొనలు, నువ్వు జీళ్ళు, తాటి చాపలు, కలరు డ్రింకులు ఇప్పిస్తుండేవాడు. మేం వాడి వంధిమాగధులం. వీధి మూలనున్న పొట్టి చెట్టుకున్న వంకర కొమ్మ మీద విలాసంగా పడుకుని మాతో పనులు చేయించుకునేవాడు. ఎంతయినా డబ్బుకున్న దర్జా దేనికీ లేదు!

పాండవవనవాసము, భీముడి పద్యాలు అంటూ సత్తిగాణ్ణి ఊదరగొట్టేశాను. నా అదృష్టవశాత్తు మా సత్తిగాడిక్కూడా భీముడి పద్యాలు తెగ నచ్చేశాయి. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా? సత్తిగాడు ఆర్డర్ పాస్ చేసేవాడు. బీడిలబాబు వినయంగా, డ్యూటిఫుల్గా 'ధారుణి రాజ్య సంపద' వేసేవాడు. చెవులారా వింటూ మైమరచిపొయ్యేవాణ్ని.

ఇంతకీ బీడీలబాబు సత్తిగాడి బంటు ఎలా అయ్యాడు? సింపుల్! బాబుకి, సత్తిగాడికి మధ్య బీడిల ఒప్పందం కుదిరింది. ఆ పద్యాలు ఒకసారి ప్లే చేస్తే రెండు హస్తం బీడీలు ఫ్రీ. లెక్కలు ఖచ్చితంగా ఉండేవి. ఆ విధంగా భావిభారత పౌరులమైన మేం దొంగతనానికి, లంచం కలిపితే చాలా ఎఫెక్టివ్‌గా పనులవుతాయని గుర్తించితిమి.

ముగింపు -

చిన్నప్పటి నా యాంబిషన్ అయిన మట్టిరికార్డులు ప్లే చేసే ఉద్యోగం సంపాదించలేక ఇంకేదో అయిపొయ్యాను. ఏం చేస్తాం? తలరాత, మనమందరం విధి చేతిలో పావులం!

మొన్న టీవీలో 'ధారుణి రాజ్యసంపద' పద్యాలు వచ్చాయి. చేస్తున్న పని ఆపేసి గుడ్లప్పగించేశాను. నాకు టీవీలో బీడీలబాబు, సత్తిగాళ్ళే కనిపించారు. ఔరా! కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది!