Showing posts with label విగ్రహాలు. Show all posts
Showing posts with label విగ్రహాలు. Show all posts

Thursday, 4 December 2014

విగ్రహాల తయారీకి అచ్చులు పోసిన కార్మికులెవ్వరు?


అభిమానం రకరకాలుగా వుంటుంది. అనేకానేక ప్రాంతాల్లో, అనేకానేక వ్యక్తులు, అనేకానేక కారణాలతో కొన్నివిషయాల పట్ల, వ్యక్తుల పట్ల అభిమానం పెంచుకుంటారు. ఆ అభిమానానికి అనేక కారణాలు వుండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఒక కవినో, కళాకారుణ్నో అభిమానించేవాళ్ళు వుండొచ్చు. కానీ - మన తెలుగునాట మాత్రం ఆ ఆనవాయితీ వున్నట్లుగా లేదు.

తెలుగు ప్రాంతం గొప్పది, తెలుగు భాష గొప్పది, తెలుగువాడు గొప్పవాడు! ఇట్లా మనవాళ్ళు తమకుతామే ఉదారంగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చేసుకుంటారు (ఇంకో భాషవాడైవడైనా వచ్చి కాదండానికి వాడికి మన భాష రాదు కాబట్టి). ఎంతో గొప్పవాడైన ఈ తెలుగువాడు ఎవర్నైనా అభిమానించాలంటే ఆ వ్యక్తి - ఒక సినిమా నటుడో, రాజకీయ నాయకుడో అయ్యుండాలి. కొందరైతే - క్రికెట్ ఆటగాడైనా, అమెరికా ప్రెసిడెంటైనా - తమ కులంవాడైతేనే అభిమానిస్తారు! అవును మరి - వారిది రాజీ లేని, కల్తీ లేని కులాభిమానం! వారికి నా అభినందనలు.

ఇప్పుడు కొంచెంసేపు తెలుగు సినిమా హీరోల వీరాభిమానుల గూర్చి -

నా కాలేజి రోజుల్లో ఎన్టీఆర్‌కి వీరాభిమానులుండేవారు. వారు మాటలో, నడకలో ఎన్టీఆర్‌ని అనుకరించేవాళ్ళు. ఎవరైనా ఎన్టీఆర్‌ని చిన్నమాటన్నా సహించేవాళ్ళు కాదు, తన్నులాటకి దిగేవాళ్ళు, తన్నులూ తినేవాళ్ళు (ఇంతకన్నా గొప్ప అభిమానం వుంటుందనుకోను)! ఆనాడు సమాజంలో డబ్బు చాలా తక్కువ. కాబట్టి తమ కల్తీలేని నిఖార్సైన అభిమానాన్ని గుండెల్లో నింపుకుని తృప్తినొందేవారు (అంతకన్నా చేయగలిగిందేమీ లేక).

రోజులు మారాయి. తెలుగు సమాజంలో డబ్బుతో పాటు అభిమానాన్ని చాటుకునే మార్గాలూ పెరిగాయి. మొదటిరోజు మొదటి ఆటకి సినిమా హాల్లో నలిగిన పూలు, నిరోధ్ బూరలు ఎగరేసి ఆనందం పొందిన అభిమానులు - ఆ తరవాత రోజుల్లో హాలు ముందు తమ అభిమాన నటుడితో కలిపి దిగిన ఫొటోల్ని పెద్దపెద్ద ఫ్లెక్సీ బేనర్లుగా ప్రదర్శించే స్థాయికి ఎదిగారు.

సమాజంలో డబ్బు మరింత పెరిగింది, విలువా తరిగింది!  అంచేత - అభిమానులకి "ఫ్లెక్సీ అభిమానం" చీప్‌గా అనిపించసాగింది! ఫ్లెక్సీ కిక్కు తగ్గి ఇంకా మరేదో కావాలనుకునే స్థితికి చేరుకున్నారు. ఆ 'ఇంకా మరేదో కిక్కు' ఇచ్చునది ఏమిటి? అని తీవ్రంగా మథనపడసాగారు.

ఈ సినిమా హీరోల అభిమానులు ఇలా వుండగా -

ఒకపక్క - రాజకీయ నాయకుల అభిమానులు చాలా ముందుకు వెళ్లిపొయ్యారు. వారి అభిమానులు తమ నాయకుల విగ్రహాల్ని ఊరూర ప్రతిష్టించుకుని తృప్తినొందసాగారు. ఈ విగ్రహాల ట్రెండ్ సినిమా హీరోల అభిమానుల్ని తాకడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ - ఎప్పుడోకప్పుడు తప్పదు. 

ఈ లోకంలో డబ్బున్నవాళ్ళకి మల్లే - చదువుకున్నవాళ్ళకీ అహంకారం వుంటుంది. అందువల్ల సామాన్యుల ఇష్టాయిష్టాల్ని అర్ధం చేసుకోవడంలో వాళ్ళెప్పుడూ వెనకే వుంటారు. ఆ రోగం నాకూ వుండటం వల్ల - ఒకప్పుడు ఈ విగ్రహాల సంస్కృతిని విసుక్కుంటూ (నాకిప్పటికీ ఈ విగ్రహాలకున్న పవిత్రతేంటో అర్ధమయ్యి చావదు) - విగ్రహామా! భవిష్యత్తు నీదే!!  అంటూ ఒక పోస్టు రాశాను. ఈమధ్య నా మేధావిత్వాన్ని కొంత తగ్గించుకుని - ఈ విగ్రహాల వెనకనున్న సామాజిక అర్ధిక కోణాల్ని వెతికే పన్లో పడ్డాను!

చరిత్రకారులు చరిత్రని (దిండ్లని మరిపించే) పుస్తకాల్లో రాస్తారు. ఆ దిండ్ల వంటి పుస్తకాలు లైబ్రరీలో నిలువుగా పేర్చి వుంటాయి. ఆ లైబ్రరీలో (నిశ్శబ్దం పాటిస్తూ) ఆ దిండ్ల మధ్య రోజుల తరబడి కూర్చుని చదివి చరిత్రని అర్ధం చేసుకోవడం ఒక పద్ధతి. దీనికి చాలా ఓపిక కావాలి, అందరివల్లా అయ్యే పని కాదు.

అసలు - చరిత్రని అంత శాస్త్రీయంగా పడీపడీ చదవడం అవసరమా? ఈ సందేహం నాక్కలగడానికి ఒక కారణం వుంది. మా గుంటూరు గూర్చి రోజుల తరబడి పుస్తకాలు చదవండి - మీరు గుంటూరు నైసర్గిక స్వరూపం, చరిత్ర వంటి సమాచార "పాండిత్యం" పొందగలరు.

చదివే ఓపిక లేదా? రోడ్డు పక్క టీ స్టాల్లో టీ తాగి, క్రేన్ వక్కపలుకులు చప్పరిస్తూ - ఒక పూట అలా రోడ్లంట పడి తిరగండి. చక్కటి కల్తీలేని దుమ్ము, నిండైన మురుక్కాలవలు, గుంపుల కొద్దీ దోమలు, దారీతెన్నూ లేని ఆటోలు -  మీరు మర్చిపోలేని "అనుభవం" పొందుతారు.

అంచేత - 'అనుభవం అనేది పాండిత్యం కన్నా మిన్న' అని నేననుకుంటూ వుంటాను (ఎన్నో దశాబ్దాల క్రితం రాహుల్ సాంకృత్యయేన్ కూడా నాలాగే అనుకున్నాడు).

మీకు నా పాండిత్యం, అనుభవం థియరీ నచ్చిందా? అయితే మీకు విగ్రహాల సంస్కృతి కూడా ఈజీగా అర్ధమవుతుంది. పండితుడికి విగ్రహాలు చికాకు కలిగిస్తాయి, అనుభవజ్ఞుడికి విగ్రహాలు చరిత్రకి ఆనవాళ్ళుగా అగుపిస్తాయి.

ఫలానా వూళ్ళో ఫలానా విగ్రహం వుందంటే - అనుభవజ్ఞుడైతే ఆ ఊరివాళ్ళు ఫలానా కులం వాళ్ళని తెలుసుకుంటాడు, ఫలానా పార్టీ అభిమానులనీ అర్ధం చేసుకుంటాడు. ఈ చరిత్ర లైబ్రరీల్లో దొరకదు కదా! ఒకప్పడు అభిమానుల అభిమానం గుళ్ళో పెళ్ళీలాంటిదైతే - ఇవ్వాల్టి అభిమానం పెద్ద కన్వెన్షన్ హాల్లో భారీ పెళ్ళి లాంటిది!

నేను విగ్రహాల పట్ల ఇంత నిగ్రహంగా ఆలోచించడానికి ఇంకో కారణం కూడా వుంది. మా గుంటూరుకి దగ్గర్లో తెనాలి పట్టణం వుంది. చాలామంది పేషంట్లు తెనాలి నుండి వస్తుంటారు. అనాదిగా తెనాలి కళలకి నిలయం. 'అనాదిగా' అని రాయడానికి నాకున్న కారణం - కాంచనమాల, గోవిందరాజుల సుబ్బారావు మొదలైన లబ్దప్రతిష్టులైన సినిమా నటులు కాదు. అందుక్కారణం - బి.వీరాచారి!

నలభయ్యేళ్ళ క్రితం సినిమాలు చూసినవాళ్ళకి - 'ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు', 'హాలులో పొగ త్రాగరాదు', 'ఏ కారణము చేతనైనా ఆట ఆగినచో డబ్బు వాపసు ఇవ్వబడదు' మొదలైన స్లైడ్స్ గుర్తుండే వుంటాయి. ప్రతి స్లైడ్‌కి కింద ఓ మూలగా చిన్న అక్షరాలతో - 'బి.వీరాచారి, తెనాలి' అని వుంటుంది.

ఆవిధంగా - రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్ళల్లో తన స్లైడ్స్ ద్వారా తెనాలికి ఖ్యాతి తెచ్చిన బి.వీరాచారిని అభినందిస్తున్నాను. బి.వీరాచారిని కన్న పుణ్యభూమియైన తెనాలి పట్టణంలో అనేకమంది శిల్ప తయారీ నిపుణులు, శిల్ప వ్యాపారులు వున్నారు. వారిలో కొందరు నాకు తెలుసు.

కొన్నేళ్ళ క్రితం ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. అటుతరవాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన విగ్రహాలకి విపరీతమైన గిరాకీ వచ్చింది. ఆ సీజన్లో తెనాలి శిల్పులకి రాంత్రింబగళ్ళు ఒకటే పని. వాళ్ళు తమ పాత అప్పులు తీర్చేసుకున్నారు, భార్యలకి కొత్తగా నగలు చేయించుకున్నారు. తామంతా రాజశేఖరరెడ్డికి ఎంతో ఋణపడి వున్నామని ఆ కుటుంబాలవాళ్ళు నాకు చెప్పారు.

'ఆ విగ్రహాలు ఎక్కడ ప్రతిష్టిస్తారు? ట్రాఫిక్‌కి అడ్డం కాదా?' వంటి చెత్తప్రశ్నలు మధ్యతరగతి మేధావులకి రావొచ్చు - మనం పట్టించుకోనవసరం లేదు. విగ్రహం చేయించినవాడే ఏవో తిప్పలు పడి - ఎక్కడోక చోట నిలబెడతాడు. ఆ తరవాత అధికారంలోకి వచ్చిన పార్టీలవాళ్ళు ఎలాగూ ఆ విగ్రహాల్ని తొలగిస్తారు. కానీ - తొలగించిన విగ్రహం స్థానంలో వాళ్ళు తమ పార్టీ నాయకుని విగ్రహం పెట్టుకుంటారుగా? అంటే పాతచొక్కా బదులు కొత్తచొక్కా కొనుక్కున్నట్లన్నమాట! అప్పుడు - తెనాలి శిల్పులకి మళ్ళీ గిరాకీయే కదా?

నాయకులు - ఖద్దరు కట్టి నేతకార్మికుల్ని ఆదుకోమంటున్నారు. మరి - విగ్రహాలు తయారుచేయించి శిల్పకళా కార్మికుల్ని ఆదుకొమ్మని ఎందుకు చెప్పరు? ఎందుకో నాకు తెలీదు. కానీ - భవిష్యత్తులోనైనా వాళ్ళీ మాట చెప్పాలి, చెప్పి తీరాలి అనేది నా అభిప్రాయం.

ఇదంతా ఎందుకు రాశానంటే - ఈమధ్య పవన్ కళ్యాణ్ అనే ఒక తెలుగు సినిమా నటుడి విగ్రహం తయారైందిట. అది త్వరలో ఎక్కడో నిలబడబోతుంది.  ఈ వార్త చదవంగాన్లే - నేనూహించింది జరుగుతున్నందుకు చాలా ఆనందం కలిగింది. త్వరలోనే మనం మరిన్ని సినీనటుల విగ్రహాలు చూడబోతున్నాం (ఆ నటుడి ఎగస్పార్టీవాళ్ళు దద్దమ్మలు కాదు). అంటే - శిల్ప కళాకారులకి మరింత ఉపాధి.

సినీ హీరో అభిమానులు కాలుష్య కారణమైన ఫ్లెక్సీ పరిశ్రమ వదిలి - ఎంతో క్రియేటివిటీ వున్న శిల్పకళని పోషించే దిశగా వెళ్తున్నదుకు ఆనందిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను కూడా! ఈ స్పూర్తితో తెలుగునాట శిల్పకళ గొప్పగా అభివృద్ధి చెందుతుందని కూడా నేను భావిస్తున్నాను.

ముగింపు -

ఈ పోస్ట్ చదివారుగా! ఇకనుండి మీకు ఏ విగ్రహం కనిపించినా - ఆ విగ్రహం మొహం పట్టించుకోకండి. అది ఎవరిదైనా కావచ్చు - మనకనవసరం. మీకా విగ్రహంలో - విగ్రహానికి అచ్చులు పోసి మెరుగులు దిద్దిన కార్మికులు కనిపిస్తే సంతోషిస్తాను.

(ఈ పోస్ట్ టైటిల్‌కి ప్రేరణ శ్రీశ్రీ 'దేశచరిత్రలు' పంక్తులు.) 

(photo courtesy : Google)

Friday, 3 February 2012

విగ్రహామా! భవిష్యత్తు నీదే!!


ఆంధ్రజ్యొతి  పేపర్లో  విగ్రహాల  కూల్చివేత  గూర్చి  రంగనాయకమ్మ  రాసిన  ఆర్టికల్  చదువుతున్నాను. వ్యాసం  రంగనాయకమ్మ  రాసినట్లుగా  లేదు! చప్పగా  ఉంది. బాలేదు.

"రవణ మావా! కాఫీ. అర్జంట్." అంటూ  సుడిగాలిలా  లోపలకొచ్చాడు  సుబ్బు.

"కూర్చో  సుబ్బు! తెలుగు జాతంతా  విగ్రహాల విధ్వంసం  గూర్చి  సతమతమైపోతుంది. నువ్వు  మాత్రం  కాఫీ  తప్పితే  దేన్నీ  పట్టించుకోవు. కొద్దిగా  సీరియస్ గా  ఆలోచించు  సుబ్బు!"

ఒక్క  క్షణం  ఆలోచించాడు   సుబ్బు.


"సీరియస్ గా  చెప్పనా? అయితే  విను. విగ్రహాల  కన్నా  మనుషులు  ముఖ్యం. ఈ  రోజుకీ  ఆకలి చావులకి  నిలయమైన  మన  సమాజానికి  ఈ  పరమ పవిత్ర  విగ్రహ సంస్కృతి  అవసరమా? లక్షలు  వృధా  చేసి  విగ్రహాలు  ఏర్పాటు  చెయ్యటం  దండగ. మానవసేవే  మాధవసేవ  అన్నారు. ఇప్పుడు  విగ్రహసేవే  మానవసేవ  అంటున్నారు. అందుకే  ఇప్పుడు  మనకి  శ్రీశ్రీ  గూర్చి  లగడపాటి  పాఠాలు  చెబుతున్నాడు. సమాజానికి  శ్రీశ్రీ  రిలవెంట్  అయితే  మహాప్రస్థానం  నిలబడుతుంది. లేకపోతే  మహాప్రస్థానంతో  బాటు  శ్రీశ్రీ  కూడా  కాలగర్భంలో  కలిసిపోతాడు. పని గట్టుకుని  ఎన్టీఆర్  దాతృత్వంతో  శ్రీశ్రీ  లెగసీని  టాంక్ బండ్  ఫై  పోషించనేల? పూర్వం  పుస్తకాల  నుండి  కవుల  గొప్పదనం  గుర్తించేవాళ్ళం. ఇప్పుడు  విగ్రహాల  ద్వారా  గుర్తిస్తున్నాం. టాంక్ బండ్  విగ్రహాల్ని  కూల్చేసినప్పుడు  కొందరు  గుండెలు  బాదుకున్నారు. వాళ్ళ  ఇళ్ళల్లో  మనుషులు  చచ్చినా  అంతకన్నా  ఏడుస్తారని  అనుకోను. ఆ  ఏడ్చిన వాళ్ళల్లో  చాలామందికి  ఆ  కూలిన విగ్రహాలు  ఎవరివో  కూడా  తెలీదు."

ఇంతలో కాఫీ  వచ్చింది.

"మరీ  ఆర్.నారాయణమూర్తి  టైపు  ఆవేశం  వద్దు. కొద్దిగా  ప్రశాంతంగా, పెద్ద మనిషిలా  చెప్పు. చాలు." అన్నాను.


"అయ్యో! దానికేం  భాగ్యం! పరమ ప్రశాంతంగా  చెబుతా. విను. ఈ  విగ్రహాలనేవి  ఒక  ప్రాంతానికీ, కాలానికీ  సంబంధించిన  సాంఘిక, రాజకీయ భావాల  ఆధిపత్య  ప్రదర్శన. పుస్తకాల్లో  లిఖించబడే  చరిత్ర  వలే  విగ్రహాలు  కూడా  శిల్పులతో  చెక్కించబడే  చరిత్ర. స్టాలిన్, సద్దాం  విగ్రహాలు  ఇందుకు  ఉదాహరణ. రాజ్యాధికారం  మారినప్పుడు  ఈ  విగ్రహాలు  సహజంగానే  నేలకొరుగుతాయి. బుద్దుణ్ణి  కూలగొట్టే  ధ్వంస రచన  చేసిన  తాలిబన్లు  అప్పటి  దేశ రాజకీయ భావాల్ని  చరిత్రలో  లిఖించారు." కాఫీ  సిప్  చేస్తూ  అన్నాడు  సుబ్బు.

"సుబ్బు! మాలతి చందూర్  లాగా అర్ధం  కాకుండా  అంతర్జాతీయ స్థాయిలో  మాట్లాడుతున్నావ్. కొంచెం  ప్రజల భాషలో  చెప్పవా? ప్రస్తుతం  ఆంధ్రాలో  నడుస్తున్న  విగ్రహల గోల  గూర్చి  మాట్లాడు." చికాగ్గా  అన్నాను.

"నువ్వడిగేది  తెనాలి  విగ్రహాల  సంగతేనా? దాని  గూర్చి  మాట్లేదేముంది! పాపం.. ఆ  కూల్చేసేవాళ్ళకి  'రంగా  బొమ్మని  కూల్చండి.'  అని  చెప్పి  పంపారు. అసలు  ఆంధ్ర దేశంలో  ఇద్దరు  రంగాలున్నారన్న  సంగతి  చాలా మందికి  తెలీదు. అందుకే  కూల్చటానికి  ఏ  రంగానయితేనేం  అనుకుని  శత్రుశేషము  రంగాశేషము  లేకుండా.. రెండు  రంగా విగ్రహాల్నీ  పడేసిపొయ్యారు. కాబట్టే  మన  ఏరియాలో  సంకుల సమరం  తప్పింది. వాళ్ళకి  సామాన్య ప్రజానీకం  తరఫున  నా  కృతజ్ఞతలు."

కళ్ళు  మూసుకుని  నిదానంగా  మాట్లాడటం  మొదలెట్టాడు  సుబ్బు.

"నేనిప్పుడు  Nostradamus ని. భవిష్యత్తు  చెబుతున్నాను  విను. రాబోయే  కాలంలో  విగ్రహలు  తయారు చేసే  శిల్పుల  కోర్స్ లకి   యూనివర్సిటీ  స్థాయిలో  ఎంట్రన్స్  పరీక్ష  నిర్వహించబోతున్నారు. అందుకోసం  శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు  కోచింగ్  ఇస్తాయి. సాఫ్ట్ వేర్  నిపుణులు  శిల్పి వేర్  నిపుణులుగా  మారబోతున్నారు. ప్రస్తుతం  ఉన్న  విగ్రహాల  ముక్కు  మొహాలు  ఏవో  చలిమిడి ముద్దల్లా  ఉన్నాయి. అస్సలు  బాగా లేవు. అందుకే  విగ్రహాల తయారి నిపుణతని  పెంచుకోటానికి  Madame Tussauds  museum  వాళ్ళని  సాంకేతిక సలహాదారులుగా  నియమించబోతున్నారు. "

"కాఫీలో  ఏదో  కలిసింది. తేడాగా  మాట్లాడుతున్నావ్."

"పిచ్చివాడా! భవిష్యత్తంతా  విగ్రహాల  కూల్చివేతలదే!. ప్రతి  కులానికి, ఉప కులానికి, భాషకి, భాషలో  వివిధ  యాసలకి, మతానికి, ప్రాంతానికి, ఉప ప్రాంతానికి, వృత్తికి..... అన్ని రకాలకి  ఒక్కో  వ్యక్తి  విగ్రహం  సంకేతంగా  నిలబడబోతుంది. ప్రభుత్వాలు  మారినప్పుడూ, మరనప్పుడూ.. ధరలు  పెరిగినప్పుడు, ఉద్యోగం  పోయినప్పుడు, భార్య  తిట్టినప్పుడు, కూరలో  ఉప్పు  తగ్గినప్పుడు.. ఇట్లా  ప్రతి  సందర్భానికి  విగ్రహాలు  పడేస్తూ ఉంటారు. అన్నింటికీ  ఆత్మగౌరవమే! మనుషులంతా  విగ్రహాల  వారిగా  విడిపోయి  తన్నుకు చస్తుంటారు. ఎదుటి వాడి  విగ్రహ విధ్వంసం.. ఆపై  తమ  విగ్రహాలకి  ఇరవై నాలుగ్గంటలూ  కాపలా."

"సుబ్బు! interesting. carry on my boy!"

"యుద్ధాలు  కూడా  విగ్రహాల  ఆధారంగానే  జరుగుతాయ్. మెదక్ లో  గురజాడ  విగ్రహ  ముట్టడి. ప్రతిగా  విశాఖలో  కాళోజీ  విగ్రహ ముట్టడి. బందీలైన  విగ్రహాలు  గజ గజ. hostage  crisis. టీవీ లలో  లైవ్  షో. sms లు. టాక్  షోలు. ఉద్రిక్త పరిస్థితులు. పోలీస్  లాఠీ చార్జ్. కాల్పులు. హాహాకారాలు. మృతులు. నష్ట పరిహారాలు. తీవ్రమైన  చర్చల  అనంతరం  ఒక  రాజీ మార్గం. మేం  గురజాడ  తలపాగా  ఎగరకొడతాం. మీరు  కాళోజీ  గడ్డాన్ని నరుక్కోండి. ప్రశాంతత  నెలకొనడానికి  చర్చల  ద్వారా  తీవ్ర  కృషి  చేసిన  కేసీఆర్, బొత్స  కొడుకులకి   ధన్యవాదాలు."

"రోజూ  ట్రాఫిక్ జామ్ లన్న  మాట!"

"ఇంకెక్కడి  ట్రాఫిక్! ప్రజలు  ఊళ్లు  ఖాళీ  చేసి  పొలాల్లో  గుడారాలు  వేసుకుని  నివసిస్తుంటారు. కూల్చబడ్డ  విగ్రహాలకి  పాలాభిషేకం  కోసం, పున:ప్రతిష్ట  కోసం  చందాలిచ్చే  గొర్రెలుగా  మారిపోతారు. నగరాలన్నీ  ఖాళీ. నిర్మానుష్యం. వీధులన్నీ  వేల, లక్షల  విగ్రహాలు. కాపలాకి  ప్రైవేట్  సైన్యం. పాలిచ్చే  గేదెల్ని  మాత్రమే  బ్రతకనిస్తారు. ఎందుకంటే  అభిషేకం  కోసం  పాలు  అవసరం  కాబట్టి! కుక్కలు, కాకులు  కూడా  చంపబడతాయ్!"

"మధ్యలో ఆ  మూగజీవులు  ఏం  చేశాయి?"

"నీకన్నీ  విడమర్చాలి. కుక్కలు  కాలెత్తి  విగ్రహాల్ని  అపవిత్రం  చేస్తాయి. కాకులకి  విగ్రహాల  తలలంటే  భలే  ఇష్టం. అందుకే  వాటిని  commode గా  వాడుతుంటాయ్. అందుకని."

"సుబ్బు! బాగుంది."

"టీవీ  ప్రకటనలు. పెద్ద  బాంబ్  ప్రేలుడు. మంటల  మధ్య  చెక్కు  చెదరని  ఒక  విగ్రహం. పొగల్లోంచి  బయటకొచ్చి అక్కినేని అఖిల్  ఎనౌన్స్ మెంట్. 'మా  కంపెనీ  తయారు చేసిన  విగ్రహమే  కొనండి. ఇది  rdx  తో  కూడా  బద్దలవదు.' అంటూ. విగ్రహ తయారీకి  ప్రత్యేక సిమెంట్  తెప్పించాలని  కేబినెట్  నిర్ణయం. విగ్రహాల  తయారీలో  అవినీతి  అంతం  చెయ్యాలని  అన్నూ బక్రాలే  రాం లీలా  మైదానంలో  నిరాహార దిక్ష. వెంటనే  ప్రియాంక గాంధి  కొడుకుతో  చర్చలు." అంటూ  ఖాళీ  కప్పు  టేబుల్  మీద  పెట్టాడు.

"సుబ్బు! నీ  ఇమేజినేషన్  అదిరింది."

"గాడిద గుడ్డేం కదూ! జార్జ్  ఆర్వెల్  రాసిన  1984  స్పూర్తితో.. విల్ స్మిత్  సినిమా 'I Am Legend'  back drop గా.. జాక్ లండన్  రాసిన  ఐరన్ హీల్  climax  ని  వినిపించాను. అంతే!" అంటూ  టైం  చూసుకున్నాడు.

"ఔరా! copy cat! " అన్నాను.

"మధ్యలో  పిల్లులేం  చేశాయి  పాపం!" అంటూ  నవ్వుతూ  హడావుడిగా  నిష్క్రమించాడు  సుడిగాలి సుబ్బు!