Showing posts with label సైకాలజి. Show all posts
Showing posts with label సైకాలజి. Show all posts

Tuesday, 24 December 2013

ఆడలేడీసుల రాజకీయ కష్టాలు


సమాజ మనుగడ, పురోగతిని రాజకీయ రంగం ప్రభావితం చేసినంతగా ఇంకే రంగమూ చెయ్యలేదు. అందుకే రాజకీయ కార్యాచరణ అత్యంత పవిత్రమైనది (ఈ పవిత్రతకి, కె.విశ్వనాథ్ సినిమాల పవిత్రతకీ సంబంధం లేదు). ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ రంగంలో సమాజంలో కనపించే అసమానతలు కూడా ప్రతిబింబించడం సహజం. వీటిల్లో లింగ వివక్షత ముఖ్యమైనది.

మన రాజకీయ నాయకుల్లో ఆడవారితో పోలిస్తే మగవారు చాలా ప్రశాంతంగా ఉంటారు (వారు టీవీ సీరియల్స్ చూడకపోవటం ఈ ప్రశాంతతకి ఒక కారణం కావచ్చు). మీడియావారు అడిగిన ప్రశ్నలకి, అడగని ప్రశ్నలక్కూడా అలవోకగా సమాధానాలు చెప్పేస్తుంటారు. అందుకే కేశవరావు, జానారెడ్డిలు బిట్ క్వశ్చన్కి ఎస్సే ఆన్సర్లు చెప్పేస్తారు (చిరంజీవి, బాలకృష్ణల సమస్య ). అదే లేడీ పోలిటీషయన్లైతే ముక్తసరిగా సమాధానాలు చెబుతారు.. కొద్దిగా టెన్షన్తో ఉన్నట్లుగా కూడా కనిపిస్తారు.

మన దేశానికి సంబంధించి ఒకప్పుడు ఇందిరా గాంధీ.. ఇప్పుడు సోనియా గాంధీ, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ, సుష్మా స్వరాజ్.. అత్యంత ప్రముఖులైన నాయకురాళ్ళు (రాజకుమారి, గంగాభవాని అక్కయ్యలు నన్ను మన్నించాలి). వీరు గంభీరంగా ఉంటారు, చిరాగ్గా ఉంటారు, హడావుడిగా కూడా ఉంటారు.

ఈ రకమైన ప్రవర్తన వెనుక మీడియా ప్రశ్నల్ని తప్పించుకునే వ్యూహం దాగి ఉందా? (ఉందో లేదో నాకు తెలీదు. అయితే ఇప్పుడీ టాపిక్ పై నేనో పోస్టు రాయాలి కాబట్టి.. వ్యూహం ఉందనే నమ్ముతున్నాను). ఉన్నట్లయితే.. ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి? అవేంటో ఆలోచన చేద్దాం ('చేద్దాం' అని మాటవరసకి అన్నాను గానీ.. ఆలోచన చేస్తుంది మాత్రం నేనే).

సైకలాజికల్ కారణాలు :  

సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక గడ్డం సైకాలజిస్టు మనోవిశ్లేషణ సూత్రాలు ప్రతిపాదించాడు (గడ్డం ఉంటే గానీ మేధావి కాదు - 'అసూబా'ల ఆహార్యం ). మన రాజకీయ నాయకులు, సినిమా హీరోలు ఈమధ్య తమ కుటుంబ వారసుల్ని తెస్తున్నారు గానీ.. ఆపని ఫ్రాయిడ్ ఎప్పుడో చేశాడు. తండ్రి ఆశిస్సులతో ఫ్రాయిడ్ కూతురు అన్నా ఫ్రాయిడ్ కూడా సైకాలజీలోనే సెటిలయ్యింది.

సిగ్మండ్ ఫ్రాయిడ్ కూతురు తమ ఫ్రాయిడ్ వారి వంశం పేరు (నేను అచ్చమైన తెలుగు వాణ్ని. అందుకే వంశాల పేరెత్తితేనే ఒళ్ళు పులకరిస్తుంది) తోడగొట్టి (అన్నా ఫ్రాయిడ్ నిజంగా తోడ గొట్టిందో లేదో నాకు తెలీదు.. ఇది మాత్రం మసాలా) మరీ నిలబెట్టింది. తండ్రి సిద్ధాంతాలకి మరింత ప్రాచుర్యం కలిపించింది. (అన్నా ఫ్రాయిడ్ చాలా తెలివైందనడానికి మరో నిదర్శనం.. ఆవిడ పెళ్లి చేసుకోలేదు).

తండ్రీకూతుళ్ళ సిద్ధాంతాల్లో డిఫెన్స్ మెకానిజమ్స్ ముఖ్యమైనవి. వీటిల్లో 'రియాక్షన్ ఫార్మేషన్' అనేది ఒక ఆసక్తికరమైన డిఫెన్స్ మెకానిజం. ఒక వ్యక్తికి అభద్రతా భావం ఉంటుంది. భయపడిపోతుంటాడు. ఆ భయం నుండి బయటకి రావడానికి అందుకు సరీగ్గా వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అంటే లేని ధైర్యాన్ని అతిగా ప్రదర్శిస్తాడు. కానీ వాస్తవానికి ఆ వ్యక్తి పిరికివాడు. మరి మన ఆడలేడీసు గాంభీర్యం కూడా ఒక రియాక్షన్ ఫార్మేషనేనా? (కత్తిలాంటి ప్రశ్న.. మీలో బాకులా దిగింది కదూ).

బయలాజికల్ కారణాలు :

స్త్రీకి మెనోపాజ్ శత్రువు (ఈ వాక్యానికి స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న వాక్యం ప్రేరణ). ఆడవాళ్ళలో menstrual cycle కి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్ల ఎక్కువతక్కువలు కారణం (ఆడవాళ్ళ మనసులాగే ఈ హార్మోన్లు కూడా అస్థిరంగా ఉంటాయి). చివరాఖరికి ఈ హార్మోన్లలో సమతుల్యత లోపించడం మూలానా మెనోపాజ్ వస్తుంది.

స్త్రీలలో థైరాయిడ్ సమస్యలు కూడా ఎక్కువ. థైరాయిడ్ హార్మోన్ తక్కువవడంతో (Hypothyroidism) అధిక బరువుకి లోనవుతారు. ఈ హార్మోన్ల సమస్యలు ఆడవారిని శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులకి గురిచేస్తాయి. కొందరిలో దిగులు, దుఃఖం, నిరాసక్తత, నిర్వేదన వంటి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి.

సర్లే! ఏదో ఒక హార్మోన్.. ఈ హార్మోన్ల తేడా వల్ల చిరాకు, అసహనం, అనుమానం.. సహచరులు తమకి హాని చెయ్యడానికి కుట్ర పన్నుతున్నారనే తీవ్రమైన భయాందోళనలకి గురౌతారు. ఈ ఆలోచనలని 'పేరనాయిడ్ థాట్స్' అంటారు. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ సమయంలో ఇలాంటి ఆలోచనలతో ఇబ్బంది పడిందని చెబుతారు.

ఆగక్కడ! చేతిలో కీ బోర్డుందని ఓ కొట్టేసుకుంటూ పోతున్నావ్! నువ్వు చెప్పే లక్షణాలు చంద్రబాబుక్కూడా ఉన్నాయి. మరి దానికేం సమాధానం చెబుతావ్?

అయ్యా! మగవాళ్ళక్కూడా 'మేల్ మెనోపాజ్' ఉంటుందని విజ్ఞులు సెలవిస్తున్నారు.

(ఇంక ఈ టాపిక్ ఆపేస్తాను.. ఇప్పటికే నాకు 'డాక్టర్ సమరం ఫీలింగ్' వచ్చేసి చిరాగ్గా ఉంది.)

సాంఘిక కారణాలు :

సమాజంలో ఉన్న లింగ వివక్షతే రాజకీయ రంగంలో కూడా కొనసాగుతుంది. ఉదాహరణకు వివాహేతర సంబంధాలని పరిశీలిద్దాం. వివాహేతర సంబంధాలు పూర్తిగా వ్యక్తిగతం. మన సమాజం రాజకీయ నాయకుడి 'అక్రమ' సంబంధం పట్టించుకోదు (మా నాయకుడు స్త్రీ జనోద్ధారకుడు. అందువల్ల రాత్రుళ్ళు ఒంటరిగా నారీమణుల కష్టాల్ని దగ్గరగా పరిశీలించెదరు.. ఆపై వారితో సుఖించెదరు).

కానీ రాజకీయ నాయకురాళ్ళకి అంత 'వెసులుబాటు' లేదు. అంచేత రాజకీయ నాయకురాళ్ళు తమపై ఎవరూ 'నింద' వెయ్యకుండా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి (మన మీడియా జయలలిత, శశికళల గూర్చి కూడా ఎంత గొప్పగా రాసిందో గుర్తుంది కదూ) .ఇది వారిపై మానసికంగా ఒత్తిడి కలిగిస్తుంది. ఈ కారణం వల్ల కూడా ఆడవారు ప్రజాజీవితంలో గంభీరంగా ఉండాల్సిన అవసరం ఉంది.

వృత్తిగతమైన కారణాలు :

మన నాయకుల ప్రజాసేవకి (తెలుగు టీవీ తాయెత్తు ప్రోగ్రాముల్లా) వేళాపాడూ ఉండదు. వారి జీవితం (జేబులు కొట్టేవాడి ఓటు కూడా కాపాడుకుంటూ) ఎక్కువ సమయం ప్రజల మధ్యనే గడిచిపోతుంది. పగలంతా ప్రజాసేవలో అలసి సొలసిన మగ రాజకీయులకి రాత్రికి తగినంత 'మందోబస్తు' (ఈ పదానికి కాపీరైట్ ముళ్ళపూడి వెంకట్రవణది) ఉంటుంది.

సహచరులతో రాజకీయాలు, అరాచకీయాలు మాట్లాడుకుంటూ కులాసాగా రిలాక్స్ అవుతారు. పాపం! ఈ లక్జరీ రాజకీయ నాయకురాళ్ళకి మాత్రం లేదు (ఏం రాస్తున్నావ్ నువ్వు? ఇది భారత దేశం. స్త్రీ సర్వశక్తి స్వరూపిణి. నీ కళ్ళు సీమటపాకాయల్లా పేలిపోగలవ్ జాగ్రత్త).

వ్యక్తిగత కారణాలు :

మన సమాజంలో అందచందాలకి ప్రాధాన్యం ఎక్కువ. తెల్లదొరలూ మనని వదిలేసి చాలా కాలమైనా.. మనకి మాత్రం తెల్లరంగుపై మోజు తగ్గలేదు. చాలామందికి అందం అంటే తెల్లగా ఉండటమే. అందువల్లనే సినిమా హీరోయిన్లు, న్యూస్ రీడర్లు ఎల్లప్పుడూ తెల్లతోలువారు మాత్రమే ఉందురు (తెల్లతోలు 'తెలుగు' హీరోయిన్లు.. ఒక పిచ్చిథియరీ!).

కావున మన దేశంలో 'సోనియా గాంధీ భలే తెల్లగా ఉంటుంది' అని మురిసిపోయే సౌందర్యారాధకులకి కొదవ లేదు. వారిలో మా అమ్మ కూడా ఉంది (అమ్మ.. నేను.. కొన్ని పెళ్ళికబుర్లు ). అంచేత రాజకీయ రంగంలో అందం (అనగా చర్మం రంగు) తక్కువగా ఉన్న నాయకురాళ్ళు ఆత్మన్యూనతకి (low self esteem కి వచ్చిన తెలుగు తిప్పలు) లోనవుతారు.

(మగవాళ్ళకి ఈ సమస్య లేదు. చంద్రబాబు పొడుగ్గా ఉంటాడనో, రాజశేఖర్రెడ్డి బట్టతల బాగుందనో ఎవడూ ఓటు వేసిన దాఖలా లేదు.)

మీడియా పక్షపాత ధోరణి :

మన దేశంలో పత్రికా రంగం మగవారి చేతిలోనే ఉంది. మెజారిటీ రిపోర్టర్లు, ఎడిటర్లు, పత్రికాధిపతులు మగవారు. వీరి మనసులో ఒక అజ్ఞాత 'పురుష పుంగవుడు' (వీడికింకో పేరు గిరీశం) దాగి యుండును. అదీగాక మీడియా మగవాళ్ళు భార్య మీద కోపం స్త్రీజాతి మీద హోల్సేల్ గా చూపిచ్చేస్తుంటారు. అందుకే వీరు ప్రతిభావంతురాలైన స్త్రీ కనబడితో పక్షపాతంతో పక్షవాతం వచ్చినట్లైపోతారు (ఈ వాక్యం మాత్రం ప్రాస కోసమే రాశాను).

కాబట్టి సహజంగానే వీరికి రాజకీయ నాయకురాళ్ళల్లో అజ్ఞానం ఎక్కువగానూ, విజ్ఞానం తక్కువగానూ కనిపిస్తుంటుంది. అందుకే వీరికి నరేంద్ర మోడీలో ఆత్మవిశ్వాసం కనబడితే.. మమతా బెనర్జీలో అహంభావం కనిపిస్తుంది (తెలుగు మీడియాలో వార్తా కథనాల కన్నా వార్తా కతలు ఎక్కువ).

చివరిగా..

రాజకీయ రంగంలో విజయవంతమైన వ్యక్తుల ప్రతిభాపాటవాలని అంచనా వెయ్యాలంటే ఈ విధంగా పలు కారణాలని పరిగణనలోకి తీసుకుంటూ భిన్నకోణంలో ఆలోచించాలి (నేనెప్పుడూ అంతేనండి, వెరైటీగా ఆలోచిస్తుంటాను).

నే రాసిన ఈ కారణాలు అందరికి వర్తించవు. కొన్ని పాయింట్లు కొందరికి వర్తించవచ్చు.. అసలు వర్తించకపోవచ్చును కూడా (ఈ ముక్క పోస్టులో ముందే చెప్పేస్తే మీరిక్కడదాకా చదవరని చెప్పలేదు). ఎందుకంటే ఇదంతా హైపొథెటికల్ రీజనింగ్ (ఇది మాత్రం తప్పించుకోటానికి దొడ్డిదోవ తలుపు తెరిచి ఉంచుకోవడమే).

కానీ స్త్రీలు రాజకీయ రంగంలో రాణించడానికి (పురుషులతో పోలిస్తే) ఎంతగానో శ్రమించాలన్నది మాత్రం నిజం. అంచేత ఈ 'అదనపు' ఒత్తిడే (కార్ల్ మార్క్స్ చెప్పిన అదనపు విలువతో ఈ అదనపు ఒత్తిడికి సంబంధం లేదు) వారిని గంభీర స్వరూపులుగా మార్చేస్తుందనిపిస్తుంది.

నా ఎనాలిసిస్ ఒప్పుకుంటే మీరు తెలివైనవారుగా పరిగణించబడతారు. ఆపై మీ ఇష్టం!

(pictures courtesy : Google)

Monday, 30 September 2013

'షావుకారు' చెంగయ్య మనస్తత్వం.. కొన్ని ఆలోచనలు


మంచి సినిమా అనగానేమి? దాని రంగు, రుచి, వాసన ఎట్లుండును? ఈ ప్రశ్నలకి నాకు తోచిన సమాధానం రాస్తాను. చాలాసార్లు ఒక సినిమాని casual గా చూట్టం మొదలెడతాం. కొద్దిసేపటికి సినిమా చూస్తున్న సంగతి మర్చిపోతాం. ఇంకొద్దిసేపటికి సినిమా కథలో పూర్తిగా engross అయిపోతాం. ఎదురుగా జరుగుతున్న సన్నివేశాలు మన చుట్టూతా జరుగుతున్నట్లుగా ఉంటాయి. అంటే సన్నివేశాల్లో పాత్రల మధ్య (passive గా) మనం కూడా ఉంటాం. ఈ అనుభూతి కలిగించే ఏ సినిమా అయినా మంచి సినిమానే అవుతుంది. ఈ విషయంలో సలహా కోసం మనం సినీపండితుల వైపు చూడనవసరం లేదు.

నా దృష్టిలో మంచి సినిమా అంటే ఏంటో చెప్పాను కదా! ఈ నిర్వచనం ఫాలో అయితే విజయావారి 'షావుకారు' ఒక మంచి సినిమా అవుతుంది. ఈ సినిమా చూస్తుంటే.. ప్రశాంత నదీ తీరాన చెలి చెంతన ఫిల్టర్ కాఫీ తాగుతూ sweet nothings (అంటే చెలితో మాట్లాడేప్పుడు nothing is sweet అని అర్ధం కాదు) మాట్లాడుకున్నంత హాయిగా ఉంటుంది. ఒక పల్లెటూర్లో కొన్నిగంటలపాటు బస చేసిన భావన కూడా కలుగుతుంది. సినిమాలో కనబడే సహజ పల్లెవాతావరణం.. పాత్రలు, పాత్రధారుల ప్రతిభల గూర్చి చాలా రాయొచ్చు. ఇప్పుడంత ఓపిక లేదు కావున.. ప్రస్తుతానికి షావుకారు చెంగయ్యకి పరిమితమవుతాను.

చెంగయ్య షావుకారు. వడ్డీవ్యాపారం చేస్తూ చాలా డబ్బు కూడబెడతాడు (ఈ వడ్డీవ్యాపారం సర్వకాల సర్వావస్థల యందు గిట్టుబాటుగానే ఉంటుంది). చెంగయ్యకి పక్కింటి అమ్మాయి సుబ్బులు (షావుకారు జానకి) అంటే ఎంతో ప్రేమ, ఆప్యాయం. ఒకరకంగా సుబ్బులు, చెంగయ్యలు స్నేహితులు కూడా (సుబ్బులు చెంగయ్యని ఆట పట్టిస్తుంటుంది). డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే చెంగయ్య.. సుబ్బులుకి బంగారు నగ బహుమతిగా ఇస్తాడు. ఇటువంటి దృశ్యాలతో చెంగయ్యకి సుబ్బులు పట్ల గల ప్రేమాభిమానాల్ని చక్కగా establish చేస్తాడు దర్శకుడు.


చెంగయ్య దగ్గర లౌక్యం కూడా బాగానే ఉంది. కాబట్టే సున్నం రంగడు (ఎస్వీరంగారావు), పంతులు (వంగర వెంకట సుబ్బయ్య) మాట కాదనలేకపోతున్నట్లుగా.. వరాలు (రేలంగి) తండ్రి శెట్టికి సత్రంలో అంగడి నడుపుకోడానికి మౌనంగా అంగీకరిస్తాడు. వాస్తవానికి సత్రంపై చెంగయ్యకి హక్కు లేదు. అది ఊరుమ్మడి. ఆ విషయం చెంగయ్యకి కూడా తెలుసు. సుబ్బులు తండ్రి రామయ్య (శ్రీవాత్సవ) ఆ నిజాన్నే సాక్ష్యంగా చెబుతాడు. అందుకు రామయ్యపై కక్ష పెట్టుకుంటాడు. సుబ్బులు అన్న నారాయణ (వల్లభజోశ్యుల శివరాం) తనపై నోరు చెసుకున్నందుకు అవమానంగా భావిస్తాడు. అందువల్ల తప్పుడు కేసు బనాయించి నారాయణని జైలు పాలు చేస్తాడు.

తను చేస్తున్నదని సరికాదనీ, తప్పు కూడాననే భావన చెంగయ్యని ఇబ్బంది పెడుతుంటుంది. చెంగయ్యలోని ఈ మంచిచెడుల conflict ని దర్శకుడు చాలా జాగ్రత్తగా maintain చేసుకుంటూ వస్తాడు. అందుకే తనలోని guilt feelings లోంచి బయటపడేందుకు.. జరుగుతున్నదానిలో తన తప్పేమీ లేదనీ, ఈ తతంగం మొత్తానికి రామయ్య, నారాయణల ప్రవర్తనే కారణం అనుకుంటూ.. rationalization చేసుకుంటాడు చెంగయ్య.

తీరా తన కొడుకు సత్యం (ఎన్టీరామారావు) కూడా చెయ్యని నేరానికి జైలు పాలయినందుకు తల్లడిల్లిపోతాడు. ఇక్కణ్నించి చెంగయ్యలో self introspection మొదలవుతుంది. తీవ్రమైన నిరాశ, నిస్పృహలకి లోనవుతాడు. అందుకే ఊరివాళ్ళతో మానసికంగా సంబంధాలు తెంచేసుకుని isolation కోరుకుంటాడు. తన అవసరం ఎవరికీ లేదనీ, తనకీ శాస్తి జరగవలసిందేనని self-reproach కి లోనవుతాడు. depressed state of mind ఉన్నవారిలో ఈ రకమైన ఆలోచన సహజం.


'దొంగలు వచ్చి చంపేస్తారు మామా!' అంటూ సుబ్బులు ఏడుస్తూ వచ్చి చెబుతుంది. తప్పించుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ.. తప్పు చేసిన తనకి శిక్ష పడవలసిందేనని భావిస్తాడు. అపరాధ భావంలోంచి బయటపడ్డానికి శిక్షకి మించిన పరిహారం మరొకటి లేదు. అందుకే బలవంతంగా సుబ్బులుని పంపేస్తాడు. చివరికి సుబ్బులు ప్రాణానికి ముప్పు ఏర్పడ్డప్పుడు మాత్రమే దొంగలకి తాళం చెవులు సంగతి చెబుతాడు. ఇవి షావుకారు చెంగయ్య వైపు నుండి కథలోని కొన్ని ముఖ్యమైన పాయింట్లు .

ఇంతకీ చెంగయ్య ఎవరు? 'షావుకారు' కథకి నాయకుడా? ప్రతినాయకుడా? రంగడు ద్వారా దొంగబంగారం కొంటాడు. కొడుకులాంటి నారాయణపై కక్షతో దొంగ సాక్ష్యం చెప్పాడు. అందువల్ల చెంగయ్య చెడ్డవాడే అయి ఉండాలి. మరైతే.. రామి (కనకం) దగ్గర చిన్నపిల్లాళ్ళా బావురుమంటాడెందుకు? కావున మంచివాడే అయ్యుంటాడు. అర్ధం కావట్లేదు కదూ?

ఏ మనిషీ పూర్తిగా మంచివాడుగానో, చెడ్డవాడు గానో ఉండడు. పరిస్థితుల బట్టి ప్రవర్తన ఉంటుంది. మంచి చెడ్డలూ మారుతుంటాయి. సుబ్బులుని చిన్నప్పట్నుండి ప్రేమగా పెంచిన చెంగయ్య చెడ్డవాడయ్యే అవకాశం లేదు. పిల్లల్ని, పుస్తకాల్ని ప్రేమించేవారు ఎప్పుడూ మంచివారే (ఈ అభిప్రాయం మాత్రం పూర్తిగా వ్యక్తిగతం.. biased కూడా).

రామయ్య సాక్ష్యం వల్ల తన పరువు పోయిందనే ఉక్రొశం, నారాయణ పెడ మాటల వల్ల కోపం తప్ప (చెంగయ్యది egocentric personality కాదుగానీ.. ఆ traits కొన్ని ఉన్నాయి).. చెంగయ్య మనసులో వేరే దుష్ట భావనలు ఉన్నట్లు తోచదు. జరుగుతున్న పరిణామాల పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా ఉంటాడు చెంగయ్య. ఏ క్షణంలోనైనా రామయ్య వచ్చి "ఏంటి బావా ఇదంతా?" అని ఒక చిన్న మాటన్నా జరిగిందంతా మర్చిపోదామన్న ఆత్రుతతో ఉన్నవాడిలా కూడా కనిపిస్తాడు. అయితే రామయ్య చెంగయ్యకి అంత అదృష్టం పట్టనివ్వడు!

నేను షావుకారు చెంగయ్య మనసు చదివేసినట్లు.. ఆయన తరఫున వకాలత్ పుచ్చుకున్నట్లు రాసేస్తున్నాను. ఎందుకంటే నాకు చెంగయ్య మనసు చక్కగా అర్ధమైంది. ఇందుకు కారకులు ఇద్దరు. షావుకారు చెంగయ్య పాత్రని ఎల్వీప్రసాద్ అనే శిల్పి ఎంతో శ్రద్ధగా ఒక అద్భుతమైన శిల్పంగా మలిస్తే.. గోవిందరాజుల సుబ్బారావు ప్రాణం పోశాడు. మహానటుడు ఎలా ఉంటాడు? అచ్చు గోవిందరాజుల సుబ్బారావులా ఉంటాడు!


అవును. గోవిందరాజుల సుబ్బారావు మహానటుడే! కన్యాశుల్కంలో నశ్యం పీల్చుకుంటూ, జంధ్యం సరిచేసుకుంటూ లుబ్దావధానులుగా ఒక పరమలోభిని మనముందు ఆవిష్కరించాడు (గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!). ఇప్పుడీ షావుకారు సినిమాలో సంక్లిష్టమైన చెంగయ్యని మనముందు నిలబెట్టాడు. ఒక పాత్రకి.. ఆ పాత్ర గుణగణాలని దుస్తులుగా తొడిగి.. పాత్రోచితంగా ప్రవర్తిస్తూ.. మనని కథలో లీనమయ్యేట్లు చెయ్యడమే ఒక మంచి నటుడి బాధ్యత. ఆ బాధ్యతని అత్యంత ప్రతిభావంతంగా నెరవేర్చేవాడే మహానటుడు.

నాకీ మధ్య ఒక అనుమానం పట్టుకుంది. నాకు పాతతరం నటుల ప్రతిభ సరీగ్గా తెలీదు. ఏ అంచనా లేకుండా ఒక సినిమా చూస్తాను. ఆ సినిమా బాగా నచ్చుతుంది. నటీనటులు ఇంకా బాగా నచ్చుతారు. అంచేత ఆ సినిమానీ. నటుల్నీ ఆకాశానికెత్తేస్తూ రాసేస్తున్నానా? అని. చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి మొదలైన నటుల విషయంలో నాలో ఈ surprise element  పనిచేసిందా?

కావున నేను ఇకనుండి ఏ నటుడికైనా మార్కులు వేసేప్పుడు పిసినిగొట్టుగా వ్యవహరించవలసిందేనని నిర్ణయించుకున్నాను. షావుకారు సినిమా నచ్చింది. చెంగయ్య పాత్రధారణ చాలా బాగా నచ్చింది. కానీ.. ఇకపై ఇట్లాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలనే సంగతీ గుర్తుంది. అంచేత సినిమాలో గోవిందరాజుల సుబ్బారావు అభినయాన్ని లెక్కల మేస్టర్లా గుచ్చిగుచ్చి చూస్తూ.. చూశాను.

అయితే 'షావుకారు'ని ఇలా చూడ్డం వల్ల నాకు ఒక నష్టం కలిగింది. చెంగయ్య సుబ్బులుపై వాత్సల్యం కురిపిస్తున్నప్పుడు (సుబ్బులు నా బంగారుకొండ).. రామయ్య ఖచ్చితమైన సాక్ష్యం చెప్పి చెంగయ్య పరువు తీసినప్పుడు (ఏం? ఆమాత్రం నాకు మాట సాయం చెయ్యడా?).. నారాయణ చెంగయ్యపై నోరు పారేసుకుంటున్నప్పుడు (నా కళ్ళ ముందే పెరిగాడు.. వెధవకి ఎంత అహంకారం?).. చెంగయ్య కలిగిన భావాలన్నీ నాక్కూడా కలిగినయ్.

కొడుకు తనని అసహ్యించుకున్నప్పుడు.. 'అనవసరంగా పట్టుదలకి పోయి స్నేహితుని కుటుంబాన్ని కష్టాలు పెట్టానే' అనే అపరాధ భావంతో చెంగయ్య దహించుకుపోతున్నప్పుడు నాక్కూడా బాధగా అనిపించింది. అందుకే ఆయన రామి దగ్గర భోరున విలపించినప్పుడు నాక్కూడా కన్నీరు ఆగలేదు (నేనెందుకిలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాను? ఇందర్ని ఏడిపించి ఏం బావుకుందామని? ఏమిటీ నాకీ ఖర్మ?).


ఇలా సినిమా అంతా నన్ను తనతో పాటు ప్రతి సన్నివేశంలో చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఎంతో ఉద్వేగానికి గురిచేశాడు గోవిందరాజుల సుబ్బారావు. ఒక ప్రేక్షకునికి ఇంత అనుభూతిని కలిగించడం ఒక గొప్ప నటుడి ప్రతిభకి తార్కాణం అని అనుకుంటున్నాను. కావున షావుకారు చెంగయ్య పాత్రపోషణ తెలుగు సినిమా చరిత్రలో గొప్ప నటనకి కొండగుర్తుగా భావిస్తున్నాను.

ఇప్పుడు నన్ను నేను ఒక ప్రశ్న వేసుకుంటున్నాను. నాకు పల్లెటూరు వాతావరణం తెలీదు. జీవితంలో ఒక్కరోజు కూడా పల్లెజీవితాన్ని అనుభవించి ఎరుగను. వ్యవసాయం తెలీదు. వడ్డీవ్యాపారం అంటే అసలే తెలీదు. అయినా నేను చెంగయ్యతో పూర్తిగా empathize అయ్యాను. (సరీగ్గా ఇలాగే ఫీలవుతూ గుండమ్మ తరఫున 'సైకోఎనాలిసిస్ ఆఫ్ గుండమ్మ' రాశాను). కారణం? నేను ప్రధానపాత్రతో identify అయ్యేలా చెయ్యటం అనేది దర్శకుడి ప్రతిభ, నటుడి గొప్పదనం. మంచి సినిమా అంటే ఇలాగే ఉంటుంది.. ఉండాలి కూడా.

ఒక మంచినటుడికి మంచివాడిగానో, చెడ్డవాడిగానో నటించడం పెద్ద కష్టం కాకపోవచ్చు (నటన తెలీనివాడికి ఏదైనా కష్టమే). అటు మంచీ కాకుండా, ఇటు చెడూ కాకుండా.. సందర్భాన్ని బట్టి react అయ్యే 'మామూలు మనిషి'గా different shades చూపిస్తూ నటించాలంటే మాత్రం అసాధారణ ప్రతిభ కావాలి. ఈ ప్రతిభ గోవిందరాజుల సుబ్బారావు దగ్గర పుష్కలంగా ఉందని తెలుస్తుంది.

ఈ సినిమా చూసిన తరవాత నాకనిపించింది.. గోవిందరాజుల సుబ్బారావు నటన ఒక అద్భుతమైన పూలతోట వంటిది. ఈ తోటకి అనేక ద్వారాలు ఉన్నాయి. కన్యాశుల్కం ఒక ద్వారం.. షావుకారు ఇంకో ద్వారం. ఆ తోటలో ఒక్కో ద్వారం నుండి వెళ్తే ఒక్కోరకమైన పూలు.. అన్నిరకాల పూలూ చూడ్డానికే కాదు.. ఆఘ్రూణించడానిక్కూడా భేషుగ్గా ఉంటాయి.

సందేహం లేదు - ఈ గోవిందరాజుల సుబ్బారావు గొప్ప నటయోధుడు. ఆయన అసమాన నటనా ప్రతిభకి గులామునైపోయి సలాము చేస్తున్నాను.

(photos courtesy : Google)

Monday, 20 May 2013

సూర్యకాంతం సృష్టించిన సమస్య


కాలం నిరంతరంగా ముందుకు సాగిపోతుంది. సమాజం కాలానుగుణంగా మారుతుంటుంది. మార్పు అనేది సమాజ ధర్మం, సహజ గుణం. అదేవిధంగా మారుతున్న కాలాన్ననుసరించి, సమాజంలో మనం వహించాల్సిన పాత్ర కూడా మారుతూ ఉంటుంది. 

సమాజ చలన సూత్రాలు కూడా క్లిష్టంగా ఉంటాయి. అందుక్కారణం ఈ సమాజంలో మతం, కులం, వర్గం, వర్ణం, ప్రదేశం అంటూ అనేక వేరియబుల్స్ ఉండటం. అందువల్ల సమాజాన్ని ఒకే యూనిట్‌గా చేసి ఆలోచించడం సరైన విధానం కాదు. 

ఉదాహరణకి - కొన్ని కుటుంబాల్లో మద్యం పేరేత్తితేనే తప్పు. ఇంకొన్ని కుటుంబాల్లో మద్యం సేవించడం స్టేటస్ సింబల్. మరికొన్ని కుటుంబాల్లో మద్యం తాగడం కాఫీ తాగినంత చిన్న విషయం. అదే విధంగా ఆహారపు అలవాట్లు కూడా. ఇవన్నీ చిన్న విషయాలు. వీటిల్లోనే ఇంతలా తేడా వుంటే ఇక జీవన విలువల్లో ఇంకెంత వైరుధ్యాలు ఉండాలి!?

మధ్యతరగతి కుటుంబాల్లో మగపిల్లాడి కోసం (ఈనాటికీ) తపించిపోతారు. ఆడపిల్లకి లేని అనేక ప్రివిలేజెస్ అనుభవిస్తూ మగవాడు పెరిగి పెద్దవాడవుతాడు. ఉద్యోగం సంపాదించి ఒక 'ఇంటివాడు' అవుతాడు. ఇక అప్పట్నుండి అత్తాకోడళ్ళ సంవాదం మొదలౌతుంది. ఇందుకు ప్రధాన కారణం తరాల అంతరం.

అత్త తన కొడుకు కోడలితో ప్రవర్తించే తీరుని పెళ్లైన కొత్తలో తన భర్త తనతో ప్రవర్తించిన తీరుతో బేరీజు వేసుకుని ఆలోచిస్తుంది. తన భర్త కొడుకులా రొమేంటిక్ గా ఉండేవాడు కాదు. సినిమాలు, షికార్లు కాదు గదా - కనీసం సరదాగా కూడా మాట్లాడింది లేదు. ఒకప్పటి తన భర్త ప్రవర్తనతో పోల్చుకుంటే ఇవ్వాల్టి తన కొడుకు ప్రవర్తన చికాగ్గా అనిపిస్తుంది. ఈ విషయం మీద కుటుంబరావు చాలా కథలు రాశాడు. 

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ వ్యక్తైనా ఒక విషయం అర్ధం చేసుకోవాలంటే అతని రెఫరెన్స్ పాయింట్ - "నేను". 'నా'కన్నా డబ్బు ఎక్కువ ఖర్చు చేసేవాడు జల్సారాయుడు, దుబారా మనిషి. 'నా'కన్నా తక్కువ ఖర్చు చేసేవాడు లోభి, పిసినిగొట్టు. ఇలా ప్రతి విషయంలోనూ ఈ "నేను" రిఫరెన్స్ గా ఉంటుంది. ఈ పాయింటు మీద ముళ్ళపూడి చాలా జోకులు రాశాడు.

ఒక పట్టణంలో ఓ సీనియర్ డాక్టర్ వుంటాడు. ఆయన ఎప్పట్నుండో జనరల్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. క్రమేణా ఊరితో పాటు డాక్టర్లూ పెరిగారు. అదే ఊరికి ఓ కుర్ర స్పెషలిస్టు డాక్టర్ వస్తాడు. కొంతకాలానికి కుర్ర డాక్టర్ పేరుప్రఖ్యాతుల్లో సీనియర్ డాక్టర్ని మించిపోతాడు. సీనియర్ డాక్టర్ ఒకప్పటి తన ప్రాముఖ్యత తగ్గడానికి కారకుడుగా కుర్ర డాక్టర్ పట్ల విముఖత పెంచుకుంటాడు. వాస్తవానికి ఇందులో కుర్ర డాక్టర్ ప్రమేయం ఏమీ ఉండదు. సరీగ్గా అతాకోడళ్ళదీ ఇదే సమస్య.

ఇప్పుడు సూర్యకాంతం గూర్చి రెండు ముక్కలు. సూర్యకాంతం మంచినటి. 1950 లలో కుటుంబ కథలతో తెలుగు సినిమాలు వచ్చాయి. అందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు ధరించిన సూర్యకాంతం తెలుగు ప్రజల్ని మెప్పించింది. తద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఆ తరవాత గయ్యాళి అత్తగా ఆవిడకి స్టార్డమ్ వచ్చిపడింది.

1960 ల కల్లా సూర్యకాంతం గయ్యాళి అత్త పాత్ర ఒక బాక్సాఫీస్ ఫార్ములా అయి కూర్చుంది. సినిమా రచయితలు సులభ సాధనాలని వదులుకోరు గదా! కథా వంటకంలో కూరలో కారం వేసినట్లు.. సూర్యకాంతం పాత్రకి ప్రాధాన్యతనిస్తూ కథలు వండారు. ఈ చర్య సినిమా విజయాలకి బాగానే తోడ్పడింది గానీ, తెలుగు (మధ్యతరగతి) సమాజానికి మాత్రం నష్టం చేకూర్చింది.

మీరు 1960 సినిమాలు చూడండి. ఆ సినిమాల్లో మైనస్ సూర్యకాంతం పెద్దగా కథ ఉండదు. సావిత్రిని ముప్పతిప్పలు పెట్టటానికి దర్శకులు సూర్యకాంతాన్ని వాడుకున్నారు. ఆ రకంగా దుష్టత్వానికి ప్రతీకగా మారిన సూర్యకాంతం పాత్రలు మనకి అత్తల పట్ల భయం, ఏవగింపు కలిగించేట్లుగా చేశాయి. అలా ఒక మంచినటి ప్రతిభావంతంగా పోషించిన పాత్రల వల్ల తెలుగు సమాజంలో సోషల్ డైనిమిక్స్ ప్రభావితం అయ్యాయి.

సినిమా ఒక వినోద సాధనం. సగటు తెలుగు ప్రేక్షకుని చదువు హైస్కూల్ స్థాయి. వీరికి చిరంజీవి ఒక్క గుద్దుతో వందమందికి నెత్తురు కక్కిస్తే చూడ్డానికి కార్టూన్ సిన్మాలా సర్దాగా ఉంటుంది. ఈ నెత్తురు కక్కుడు నిజజీవితంలో సాధ్యమని అనుకునే అమాయకులెవరూ లేరు. 

శాస్త్రీయ సంగీతం నిర్లక్ష్యం చెయ్యబడిందని శంకరశాస్త్రి గొంతు చించుకుని కుంభవృష్టి తెప్పించాడు. సినిమా హాలు బయటకొచ్చిన మరుక్షణం ప్రేక్షక దేవుడు శంకరశాస్త్రి కురిపించిన భోరువర్షాన్ని మర్చిపోయాడు. ఈ శాస్త్రీయ సంగీత గోల చిరంజీవి ఫైటింగులా సినిమా హాలు వరకే పరిమితం. కానీ సూర్యకాంతం పాత్రల ప్రభావం సినిమా హాళ్ళని దాటుకుని తెలుగువారి ఇళ్ళల్లోకి వచ్చేసింది.

అత్తలు ప్రతి ఇంట్లో ఉంటారు. కోడళ్ళు అత్తలో సూర్యకాంతాన్ని దర్శిస్తారు. తలిదండ్రులు కూడా కూతుర్ని కాపురానికి పంపేప్పుడు 'మీ అత్త ముండతో జాగ్రత్త తల్లీ' అని మరీమరీ చెప్పి పంపిస్తారు. ఆ పిల్లకి ఈ హెచ్చరికల్తో టెన్షన్ మరింత పెరుగుతుంది. శత్రుదేశంలోకి అడుగెడుతున్న సిపాయిలా బిక్కుబిక్కున అత్తారింట్లోకి అడుగెడుతుంది.

అత్తకి కూడా కోడలంటే అభద్రత, అనుమానం. 'ఇన్నాళ్ళూ కొడుకు నా సొంతం. ఇవ్వాళ ఈ పిల్లకి కూడా వాటా వచ్చేసింది. నా ప్రాముఖ్యత తగ్గిపోనుందా?' మనసులో బోల్డన్ని సందేహాలు. కోడలి ప్రతి చర్యా నిశితంగా పరిశీలిస్తుంది. కఠినంగానూ ఉంటుంది. తన ప్రవర్తనని జస్టిఫై చేసుకోడానికి సూర్యకాంతాన్ని రిఫరెన్స్ పాయింటుగా తీసుకుంటుంది ('నేను' సూర్యకాంతంలా గయ్యాళిని కాదు).

అంటే - అత్తాకోడళ్లిద్దరూ తమకి తెలీకుండానే సూర్యకాంతం ప్రభావానికి లోనవుతున్నారు. తమని తాము స్టీరియో టైప్ చేసుకుని, ఎదుటివారిని కూడా అలానే చూడ్డానికి మైండ్‌ని కండిషన్ చేసుకుంటున్నారు. అందువల్ల ఒకరిపట్ల మరొకరు మనసులో ముందే 'ప్రీ ఫిక్స్' అయిపోయ్యారు. ఇందువల్ల ఇద్దరికీ నష్టమే.

చిన్న ఉదాహరణ. కోడలు ఇల్లు చిమ్ముతుంది. గచ్చుపై ఎక్కడో కొద్దిగా ధూళి ఉండొచ్చు. అది అత్తకి నచ్చదు. చిన్న విషయమే కదాని ఆ పెద్దావిడ ఊరుకోదు. అదేదో పని ఎగ్గొట్టడానికి కోడలు వేస్తున్న ఎత్తుగా భావిస్తుంది. అంచేత కొత్తకోడలుకి పని చేతకాదని తేల్చేస్తుంది. కోడలు ఆ విమర్శని తట్టుకోలేదు (మహామహా రచయితలే విమర్శల్ని తట్టుకోలేరు. ఇంక కోడలు కుంక ఏపాటి!). 'నేను పని బాగానే చేస్తున్నాను. అమ్మ చెప్పినట్లు ఈ ముసల్ది కేవలం తన ఆధిపత్య ప్రదర్శన కోసమే నానా యాగీ చేస్తుంది.' అనుకుని చిటపటలాడిపోతుంది.

నిందితుడికి శిక్ష పడేదాకా నిరపరాధే. మంచిదని నిరూపింపబడేదాకా ఏ అత్తైనా సూర్యకాంతమే. సోషల్ సైకాలజీలో 'ఒబీడియన్స్ కాన్సెప్ట్' అని ఒకటుంది. ఉదాహరణకి జైలు అధికారులు ఖైదీలు తమపట్ల మిక్కిలి వినయంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండకపోతే వారికి కోపం వస్తుంది. అప్పుడు వారు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారు (అత్యంత క్రూరమైన జైలుహింస గూర్చి కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి ఒక నవల్లో వొళ్ళు గగుర్పాటు కలిగేట్లు వివరంగా రాశాడు). దీన్నే 'ఏక్టింగ్ ఔట్' అంటారు. ఈ విషయాన్ని సోషల్ సైకాలజిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా.

వాస్తవానికి జైల్లో శిక్షననుభవించేవారు జైలు అధికారులకి శత్రువులు కారు, అలాగే అత్తాకోడళ్ళు కూడా. వారు మారుతున్న తరాలకి ప్రతీకలైన వేర్వేరు వయసుల స్త్రీలు. ఒకర్నొకరు అనుమానంగా చూసుకోవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఐతే సూర్యకాంతం తెలుగువారి కుటుంబ జీవితాల్లో అనుమానాలు రేకెత్తించి సమస్యలు సృష్టించిందని నా అభిప్రాయం.

(photo courtesy :Google)

Saturday, 20 April 2013

ఆనంద నిలయం.. ఎంతో ఆహ్లదకరం!


అతను బార్లో పూటుగా తాగాడు. నాటుగా తిన్నాడు. నీటుగా లేచాడు. తూలుతూ బార్ బయటకొచ్చాడు. ఆ పక్కగా ఆపి ఉన్న ఆటోని పిలిచాడు. ఆటోవాలా తెగ సంతోషించాడు. 'ఈ తాగుబోతెదవ దగ్గర ఫుల్లుగా నొక్కేద్దాం!' అనుకున్నాడు. ఆశ్చర్యం! అతగాడు తూలుతూనే ఆటోవాలాతో గీచిగీచి బేరం చెయ్యసాగాడు. చివరాకరికి ఆటోవాలానే ఓడిపొయ్యాడు. చచ్చినట్లు మామూలు రేటుకే బేరం ఒప్పుకున్నాడు. బార్లో బోల్డు ఖర్చు చేసిన ఒక తాగుబోతు ఆటో దగ్గర అంతలా బేరమాడేమిటి? ఆశ్చర్యంగా ఉంది కదూ!

మనిషి జిరాఫీలా అరున్నరడుగులున్నా.. దున్నపోతులా నూటరవై కిలోలున్నా.. అతన్ని శాసించేది మాత్రం కొబ్బరికాయంత మెదడు మాత్రమే! అందులోనే మన ఆలోచనల కంట్రోలింగ్ సెంటర్ నిక్షిప్తమై ఉంటుంది. అర్ధరూపాయి మాట కోసం అరవై కోట్ల ఆస్తులొదిలేసుకున్న పెదరాయుళ్ళూ.. అదే అర్ధరూపాయి కోసం కుత్తకలు కోసే కత్తుల రత్తయ్యలు.. ఇలా మనుషుల ఆలోచనలని రకరకాలుగా శాసించేది ఈ మెదడే! హిట్లర్ లాంటి దౌర్భాగుల్ని, గాంధీ (సోనియా గాంధి కాదు) వంటి ఉన్నతుల్ని సృష్టించింది కూడా ఈ మెదడే!


మెదడులో మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేందుకు 'ప్లెజర్ సెంటర్' ఉంటుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. బ్రహ్మ మన నుదుటిరాత రాసినట్లు.. ప్లెజర్ సెంటర్లలో కూడా ఫలానా అని 'రాసిపెట్టి' ఉంటుంది. మన తాగుబోతుకి ప్లెజర్ సెంటర్లో 'తాగుడు' అని రాసిపెట్టి ఉంది. కాబట్టే బార్లో బారెడు బిల్లు బోలెడు సంతోషంగా చెల్లించాడు. తాగుడికే అంత ఖర్చు చేసిన వాడికి డబ్బంటే లెక్కుండదనుకుని ఆటోవాలా పప్పులో కాలేశాడు! ఆ తాగువాడు తాగుడుకి మాత్రమే ఖర్చు చేస్తాడు. అంతా ప్లెజర్ సెంటర్ మహిమ! ఈ ప్లెజర్ సెంటర్ న్యూరో ఎనాటమి ఒక భారతం. అదిక్కడ అనవసరం (అసలు సంగతి.. సైన్స్ విషయాలు తెలుగులో రాయడం నాకు రాదు).

ఇందాకట్నుండి ప్లెజర్ సెంటర్ అని రాసినప్పుడల్లా.. నాకదేదో మసాజ్ పార్లర్లాగా, పబ్బులాగా ధ్వనిస్తుంది. అంచేత 'ప్లెజర్ సెంటర్' ని తెలుగులోకి అనువాదం చేసి రాస్తాను. 'ప్లెజర్' అనగా ఆనందం. 'సెంటర్' అనగా కేంద్రము. 'ఆనంద కేంద్రము'. నాకు ఇది కూడా నచ్చలేదు.. ఏదో 'పాలకేంద్రము'లా అనిపిస్తుంది. అంచేత ఇకనుండి 'ఆనంద నిలయం' అంటూ (పన్లోపని.. మా ఆనందభవన్ కూడా గుర్తొచ్చేలా) స్వేచ్చానువాదం చేసి రాస్తాను.

ప్రతి మనిషి మెదడులో ఈ ఆనంద నిలయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాగే.. ఒక్కో ఆనంద నిలయానికి ఒక్కో థీమ్ ఉంటుంది. అయితే ఈ థీమ్ యొక్క మంచీచెడూ, నైతికానైతికత అనేది చూసేవాడి దృష్టి, సమాజ విలువల్ని అనుసరించి ఉంటుంది. ఇప్పుడు మచ్చుకు కొన్ని ఆనంద నిలయాల థీమ్స్ పరిశీలిద్దాం.

సుఖమయ జీవనానికి డబ్బు చాలా అవసరం. అయితే.. అవసరాలకి మించి ఎంతో ఎక్కువగా సంపాదించిన తరవాత కూడా.. చాలామందికి డబ్బు సంపాదన పట్ల శ్రద్ధ తగ్గక పొగా.. ఇంకా పెరుగుతుంది! ఇలా మరింత శ్రద్ధగా డబ్బు సంపాదనకి పునరంకితమవ్వడం చూస్తే.. డబ్బు సంపాదన కూడా టెండూల్కర్ పరుగుల దాహం వంటిదని అర్ధమౌతుంది. అంటే వారి ఆనంద నిలయం డబ్బు సంపాదన!

మా మేనమామ మంచి ఆస్తిపరుడు. పిల్లలు అమెరికాలో సెటిలయ్యారు. ఆయన శరీరం డెబ్భైయ్యేళ్ళ క్రితంది. వేసుకునే బట్టలు పదేళ్ళ క్రితంవి. గీసుకునే బ్లేడు మూడేళ్ళ క్రితంది. రుద్దుకునే టూత్ బ్రష్షు రెండేళ్ళ క్రితంది. ఇప్పుడు మీకు జంధ్యాల సినిమా, కోట శ్రీనివాసరావు జ్ఞప్తికొస్తే అది మా మేనమామ తప్పేగానీ.. జంధ్యాలది కాదు. బుద్ధి లేక.. మొన్నామధ్య బ్లడ్ షుగర్ పరీక్ష చేయించుకోమని ఆయనకి సలహా ఇచ్చాను. 'ఎందుకు? డబ్బు దండగ. షుగరుంటే ఒంటేలుకి చీమలు పడతయ్యి గదా!' అన్నాడు. పిసినారితనమే మా మేనమామ ఆనంద నిలయం!


నాకో అన్నయ్య ఉన్నాడు. ఆయనకో ముఖ్యస్నేహితుడున్నాడు. అతను చాలా మంచివాడు. అయితే గత నాలుగున్నర దశాబ్దాలుగా ప్రతిరోజూ పేకాడతాడు. పేక లేని జీవితం ఉప్మా లేని పెసరట్టు వంటిదని అతని ప్రగాఢ నమ్మకం. అతని భాష కూడా పేక భాషే! ఎదైనా డబ్బు టాపిక్ వచ్చినప్పుడు ఐదు ఫుల్ కౌంట్లంటాడు. లేదా పది మిడిల్ డ్రాపులంటాడు. చంద్రునికో మచ్చలా ఆయనకి 'పేకాట' అనేది ఒక మచ్చ. కాకపోతే ఈయన మచ్చ పెద్ద సైజు పిడకంత ఉంటుంది. ఆ పిడకే ఆయనకి ఆనంద నిలయం.

నా స్నేహితుడొకడు మితభాషి. బాగా చదువుకున్నవాడు. ఒక ప్రభుత్వ శాఖలో ఉన్నతోద్యోగి. అయితే అతని ఆనందనిలయం 'పరాయి స్త్రీ' లలో దాగుంది. అతని పరాయి స్త్రీల సాంగత్య యత్నం ఒక యజ్ఞం స్థాయిలో ఉంటుంది. అందుకోసం ప్రాణాలకి కూడా తెగిస్తాడు. మొన్నామధ్య వడదెబ్బతో ఆస్పత్రిలో చేరాడు. ఎల్లప్పుడూ చల్లని ఏసీ (అదీ ప్రభుత్వ సొమ్ముతో) ఉండే మావాడికి వడదెబ్బ!

ఆస్పత్రికి పరామర్శగా వెళ్ళిన నాకు రహస్యంగా చెప్పాడు. అతగాడికి ఎప్పాయింట్మెంట్ ఇచ్చిన ఒక స్త్రీ రత్నం కోసం.. ఎర్రటి ఎండలో బస్టాండు ముందు తిండితిప్పలు మానేసి మరీ పడిగాపులు కాశాడు. ఆ స్త్రీ రత్నం రాలేదుగానీ.. మావాడికి జ్వరం మాత్రం వచ్చింది. నా స్నేహితుడికి ప్రేమగా, ఆప్యాయంగా పళ్ళరసం తాగిస్తున్న అతని భార్యని చూస్తే జాలేసింది!

ఆనంద నిలయాలు అంటూ వ్యసనాల్ని కూడా హైలైట్ చేస్తూ రాస్తున్నానని మీరనుకోవచ్చు. అయితే మన మెదడు.. సమాజం మంచిచెడ్డలు నిర్ణయించక ముందే అభివృద్ధి చెందింది. దానికి సభ్యత, సంస్కారం వంటి క్లిష్టమైన పదాలు అర్ధం కావు. కానీ అది మనని శాసిస్తుంది. ఫ్రాయిడ్ ఈడ్, సూపర్ ఈగో అంటూ కొంతమేరకు విశ్లేషించాడు గానీ.. ఇప్పుడెవరు ఆయన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు.

మనకి నచ్చని ఆనంద నిలయాల్ని వ్యసనం అన్న పేరుతో చిన్నచూపు చూస్తాం. స్టాంప్ కలెక్షన్, కాయిన్ కలెక్షన్ వంటి వాటిని ఏ చూపూ చూడం. అయితే సాహిత్యసేవ, ప్రజాసేవ, కళాసేవ వంటి వాటిని గ్లోరిఫై చేస్తాం. కొందరు వారిని ఆరాధిస్తారు కూడా. కానీ ఇవి కూడా వ్యసనాలకి 'ఆదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్' గా నాకు అనిపిస్తుంది.

శ్రీశ్రీని గుప్పిలి బిగించి దమ్ము లాగుతూ, పెగ్గు మీద పెగ్గు మీద బిగిస్తూ 'మహాప్రస్థానం' రాయమని మనం అడిగామా? లేదే! మరాయన ఎందుకంత కష్టపడిపోతూ 'మహాప్రస్థానం' రాశాడు? మనం వద్దన్నా శ్రీశ్రీ రాయడం ఆపేవాడా? ఖచ్చితంగా ఆపేవాడు కాదు. పైగా.. 'నీదీ ఒక బ్రదుకేనా? కుక్కా, నక్కా.. సందులో పంది!' అంటూ తన పాళీతో మన కంట్లో పొడిచేవాడు!


ఆ మాటకొస్తే గద్దర్ ని పాటలు పాడమని మాత్రం ఎవరడిగారు? పాడొద్దంటే మాత్రం ఆయన ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. ఆవేశం ఉప్పొంగగా.. 'అరెరె.. ఈ పాట నాదిరా.. ఆ గోచి నీదిరా! ఈ పల్లె నాదిరో.. ఆ బ్లాగు నీదిరో!' అంటూ స్టేజి ఊగిపొయ్యేట్లు చిందులెయ్యడా? దటీజ్ ఆనంద నిలయం!

ఆయన ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి నాయకుడు. తొమ్మిదేళ్ళపాటు కనీసం నిద్ర కూడా పోకుండా అలుపెరుగని ప్రజాసేవ చేశాడు. 'నాకు ప్రజాసేవలో తనివి తీరలేదు. ఇంకా చేస్తాను. ఇంకోక్క అవకాశం ఇవ్వండి. ప్లీజ్!' అంటూ ఈ వృద్ధాప్యంలో, ఈ మండుటెండలో వేల కిలోమీటర్లు నడవటమేమిటి! ఆ ప్రజానాయకుడి తపన కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఆయన చేతిలో ఏమీ లేదు. అంతా ఆనంద నిలయంలోనే ఉంది!

కావున మిత్రులారా! ప్రతి మెదడుకీ ఓ ఆనందనిలయం ఉంటుంది. అది ఆ వ్యక్తికి శిలాశాసనం. ఆయా సమాజాల్లోని కట్టుబాట్లు, సంస్కృతిని అనుసరించి ఆ ఆనందనిలయాల మంచిచెడ్డలు నిర్ణయించడతాయని మొదట్లోనే చెప్పాను. అయితే వ్యక్తి ఇష్టాయిష్టాల్ని గౌరవించడంలో సమాజానిక్కూడా కొన్ని సమస్యలుంటాయి. నా స్నేహితుడు స్త్రీ సేవ చెయ్యని యెడల.. సమాజసేవ చేసేవాడేమోనని నేననుకుంటుంటాను. అలాగే వైస్ వెర్సా.

మొన్నామధ్య నా వైద్య స్నేహితుడొకడు నన్ను వందోసారి అడిగాడు.

"నీ బ్లాగ్ చదవాలంటే ఏం చెయ్యాలి?"

"నీకో నమస్కారం. నా బ్లాగ్ చదవద్దు." అన్నాను.

స్నానం చెయ్యడానిక్కూడా టైమ్ లేనంత బిజీ ప్రాక్టీసున్న అతను నా బ్లాగ్ చదవడం అసంభవం. కానీ గత కొంతకాలంగా అతను నన్నలాగే పలకరిస్తున్నాడు.

నా సమాధానానికి అతను హర్టయ్యాడు. అంచేత తను చదవని నా బ్లాగ్వాపకం చెడ్డదని నిరూపించ నడుం కట్టాడు.

"అసలు నువ్వు బ్లాగులెందుకు రాస్తున్నావు?" సూటిగా చూస్తూ అన్నాడు.

"పని లేక.. " నాకీ సమాధానం చెప్పడం సంతోషాన్నిస్తుంది.

"నీకు పన్లేదంటే నేన్నమ్మను. చెప్పు. బ్లాగులెందుకు రాస్తున్నావు?" పోలీసువాడు 'లైసన్సుందా?' అనడిగినట్లు రెట్టించి అడిగాడు.

వదిలేట్టు లేడు. ఒక క్షణం ఆలోచించి "ఆనంద నిలయం!" అన్నాను.

"అంటే?" మొహం చిట్లించాడు.

"ఏం లేదు." అంటూ చిన్నగా నవ్వి ఊరుకున్నాను.


(photos courtesy : Google)

Monday, 19 November 2012

నేరము - శిక్ష (శునక శిక్షణ)


"ఓసి కుక్కమొహందానా.. బుద్ధిలేదా? ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కాదా?" కోపంగా అరిచాను. వెంటనే నవ్వొచ్చింది. కుక్కని పట్టుకుని కుక్కమొహమని అనడం తిట్టు కిందకొస్తుందా?

విషయమేమంటే.. మా ఇంట్లో ఒక కుక్కముండ ఉంది. మగకుక్క కాబట్టి ఆంగ్లంలో అయితే 'ఉన్నాడు' అనాలి. కానీ మనది తెలుగుభాష కాబట్టి 'ఉంది' అనే రాస్తున్నాను. 

ఈ శునకుడి నామధేయము స్నూపీ. కుక్కలకి ఇంగ్లీషు పేర్లు పెట్టడాన్ని తెలుగు భాషోద్యమకారులు ఎందుకు ignore చేస్తున్నారు? బహుశా గ్రామసింహాలకి ఇంగ్లీషు పేర్లు పెట్టుటయే కరెక్టని అనుకుంటున్నారేమో!  

స్నూపీకి క్రమశిక్షణ ఎక్కువ. ఠంచనుగా తింటుంది. సమయపాలనన్న మిక్కిలి మక్కువ. అందుకే అందరికన్నా ముందే AC బెడ్రూంలోకి దూరి గురకలు పెట్టి నిద్రబోతుంది. తెల్లారేదాకా బాంబులు పడ్డా నిద్ర లేవదు. 'జగమంతా కుటుంబం నాది!' అని నమ్ముతుంది. అంచేత ఇంట్లోకి ఎవరొచ్చినా పట్టించుకోదు.

ఆ మధ్య పక్కింట్లో దొంగలు పడ్డప్పుడు వీధివీధంతా మేల్కొంది. అంతా గోలగోల. స్నూపీ మాత్రం తన గాఢనిద్రలోంచి మేలుకోలేకపోయింది. ఇరుగుపొరుగుల ముందు పరువు పోయింది. తల కొట్టేసినట్లైంది. ఇక్కడదాకా నాకేం ఇబ్బంది లేదు. 

కానీ ఈమధ్య ఉదయాన్నే నాతోబాటు వెనకాలే బాత్రూంలోకి దూరి.. తను కూడా bladder empty చేసుకుంటుంది. నిద్రమత్తులో నా వెనకాలే నీడలా వచ్చే ఈ నాలుక్కాళ్ళ జీవిని గమనించలేకున్నాను.
                          
లాభం లేదు. ఈ శునకాధముని క్రమశిక్షణలో పెట్టవలె. కానీ కుక్కకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? కుక్కకి child psychology అప్లై అవుతుందని విన్నాను. పిల్లల్లో discipline కోసం ఉపయోగించే behavioral techniques నాకు తెలుసు. పిల్లల కోసం అమలు చేసే privilege stop అనే శిక్షణలాంటి శిక్ష కుక్కలకి పనికొస్తుందా? ట్రై చేస్తే పోలా! 

తప్పు చేసిన పిల్లలకి వారి ఆటవస్తువుల్లాంటివి దాచడం privilege stop అంటారు. స్నూపీకి ఆట సామాగ్రి లేదు కాబట్టి ఆహారమే ఒక privilege. అంచేత తిండి పెట్టకుంటే అదే దారికొస్తుంది. కొద్దిగా మొరటు పధ్ధతి. కానీ తప్పదు.

స్నూపీకి రోజూ breakfast అలవాటు. మాతోపాటే ఇడ్లీలు, అట్లు తింటుంది. ఇవ్వాళ దీనికి breakfast కట్ చేస్తాను. అప్పుడు కుక్కలా (కుక్కలా ఏమిటీ? కుక్కే గదా!) దారికి వస్తుంది. 

మేఘన కాలేజీకీ, బుడుగు స్కూలుకి వెళ్ళిపోయారు. treadmill చేసుకుంటూ స్నూపీకి breakfast ఇవ్వొద్దని నా భార్యకి చెప్పాను. ఆవిడ హడావుడిగా హాస్పిటల్ కి వెళ్ళిపోయింది. 

ఓరకంటతో స్నూపీని గమనిస్తూనే ఉన్నా. దానికి ఆకలేస్తుంది. ఎవరూ తనని పట్టించుకోకపోవడం దానికి అర్ధం కావట్లేదు. ఇంట్లోకి నేను ఎటు వెళితే అటే వచ్చి ఎదురుగా నిలబడి తీవ్రంగా తోక ఊపుతుంది.      

ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకుని.. కొబ్బరి పచ్చడి, అల్లం చట్నీ వేసుకున్నాను. కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ.. నిదానంగా ఇడ్లీలు ఆరగించడం మొదలెట్టా. టీవీలో ఏదో రాజకీయ చర్చ జరుగుతుంది. చర్చ పరమ నాసిగా ఉంది.

స్నూపీకి ఇడ్లీలంటే ఇష్టం. ఎదురుగా నించొని ఇడ్లీలకేసి ఆశగా చూస్తుంది. నేను పట్టించుకోలేదు. ఇంక ఆగలేకపోయింది. తనక్కూడా ఆకలేస్తుందన్నట్లుగా ముందు కాలుతో నాకాలుని గీరడం మొదలెట్టింది. 

యాహూ! నా punishment regime విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు నేను punishment ఎందుకు ఇచ్చానన్నది స్నూపీ మైండ్ కి కనెక్ట్ కావాలి. ఇది నా థెరపీలో important step. అందుకోసం కొంత verbal reinforcement చెయ్యవలసి ఉంది. 

"స్నూపీ! you are a good boy. బాత్రూముల్లో ఉచ్చ పొయ్యకూడదు. తప్పు. open place లో పోసుకో. అప్పుడు నీకు బోల్డెన్ని ఇడ్లీలు పెడతాను. అర్ధమైందా?" 

నా నీతిబోధనా కార్యక్రమం పూర్తి కాకముందే.. తల పైకీ, కిందకి ఊపుతూ.. 'ఖయ్.. ఖయ్.. ఖయ్' మంటూ గోళీసోడా కొడుతున్నట్లు.. మూలుగుతున్నట్లు.. ఏడుస్తున్నట్లు.. విచిత్రంగా మొరగడం ప్రారంభించింది. 
                                         
స్నూపీ విచిత్ర ప్రవర్తనకి ఆశ్చర్యపోయా. నా punishment వికటించి దీనికి పిచ్చిగానీ పట్టలేదు గదా! అర్జంటుగా ఇడ్లీ పెట్టకపోతే కరుస్తుందేమో! దీని మొహం. దీనికి పిల్లిని చూస్తేనే భయం. నన్ను బెదిరించి ఇడ్లీలు కాజేయ్యడానికి వేషాలేస్తుంది! కానీ.. ఏమో! ఎవరు చెప్పగలరు? basic animal instincts అంటూ ఉంటాయి గదా! 

ఒక్కక్షణం ఆలోచించా. నేనిప్పుడు దీని బెదిరింపులకి లొంగితే నన్ను పిరికిసన్నాసి అనుకుంటుంది. అప్పుడిక భవిష్యత్తులో నన్నసలు లెక్క చెయ్యదు. అంచేత స్నూపీకి ఇడ్లీలు పెడితే నేనోడి పోయినట్లే. ఎట్టి పరిస్థితుల్లో నేనోడిపోరాదు. స్నూపి గెలవరాదు. కానీ.. ఎలా? ఎలా? ఏం చెయ్యాలి?

మెరుపు మెరిసింది. ఐడియా. స్నూపీకి మనుషుల తిండంటేనే ఇష్టం. బిస్కట్లు, కేకులు, స్వీట్లు, నూడిల్స్, ఇడ్లీలు, దోసెలు బాగా లాగిస్తుంది. కుక్కల ఆహారంగా చలామణి అయ్యే branded dog foods దానికస్సలు ఇష్టం ఉండదు. 

సృష్టిలో అత్యంత దుర్వాసన వచ్చు పదార్ధ మేమి? 'pedegree' నామధేయ బహుళజాతి కుక్కల ఆహారం. నా ముక్కుకి రెండుసార్లు ఆపరేషన్ చేయించుకున్నాను. వాసన శక్తి బాగా తక్కువ. ఇదొకరకమైన అంగవైకల్యం. అటువంటి నాక్కూడా 'పెడిగ్రీ' దుర్వాసన భరింపరానిదిగా అనిపిస్తుంది. 

ఆ కంపుకొట్టే బహుళజాతి కుక్కల ఆహారం దాని ప్లేట్లో పోసాను. ప్లేట్లోని గుళికల్ని పైపైన వాసన చూసింది. ఆవదం తాగిన మొహం పెట్టింది. మళ్ళీ నా దగ్గరకొచ్చి ఆశగా ఇడ్లీల వైపు చూస్తుంది. అయితే ఇప్పుడా విచిత్ర ప్రవర్తన మానేసింది. 

ధైర్యం పుంజుకుని మళ్ళీ నా క్లాస్ మొదలెట్టాను. "బాత్రూములో ఉచ్చ పొయ్యకు. understand?" అంటూ ఇడ్లీ తుంచుకుని కొబ్బరి పచ్చడి అద్దుకుని నోట్లో పెట్టుకున్నాను. ఇడ్లీపై ఆశలొదిలేసుకున్న స్నూపీ నిరాశగా, దీర్ఘంగా నావైపు చూసింది. 

నిదానంగా దాని ప్లేట్ దగ్గరకి వెళ్ళింది. మళ్ళీ కొద్దిసేపు 'పెడిగ్రీ'ని వాసన చూసింది. 'ఇవ్వాల్టికి నాకిదే ప్రాప్తం. ఖర్మ!' అనుకున్నట్లుంది. దిగులుగా, అత్యంత నిదానంగా 'పెడిగ్రీ' తిని ఆకలిబాధ తీర్చుకుంది.

అమ్మయ్య! నా థెరపీ పూర్తయ్యింది. ఇక స్నూపీతో నాకే ఇష్యూ లేదు. అంచేత దాని ప్లేట్ లో రెండిడ్లీ వేశాను. స్నూపీ కళ్ళల్లో వెలుగు! ఆవురావుమంటూ ఆ ఇడ్లీలని క్షణంలో మింగేసింది. గిన్నెలో మంచినీళ్ళన్నీ గటగటా తాగేసింది.  

ఆపై నా దగ్గరకి వచ్చి తోకని విపరీతంగా ఊపుతూ, తన ఒళ్ళంతా నా కాళ్ళకేసి రుద్దుతూ.. నా ఎడమ చెయ్యిని నాకసాగింది. దాని కళ్ళనిండా ప్రేమ. కృతజ్ఞత. 'థాంక్యూ బాస్!' అన్న భావన!     
                
'అయ్యో పాపం! దీన్ని ఇంత ఇబ్బంది పెట్టానా?' అనిపించి జాలేసింది. 

అసలు స్నూపీ చేసిన తప్పేంటి? పిల్లలు గారాబం చేసి దీన్ని ఇట్లా తయరుచేసారు. ఇప్పుడిది తను కుక్కనన్న సంగతి మర్చిపోయింది. తను కూడా ఓ మనిషి ననుకుంటుంది. అందుకే బెడ్రూంలోంచి నేరుగా బాత్రూంలోకెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుంటుంది.  

పిల్లలు చేసిన తప్పుకి నోరులేని జీవిని శిక్షించడం న్యాయం కాదు. కాబట్టి నేను పోలీసు మార్క్ మొరటు శిక్షలు మాని.. ఏదైనా sophisticated పద్ధతి ఆలోచించాలి. ఆ పద్ధతులేంటబ్బా?! 


చివరి తోక.. ఇది ఒక యదార్ధ గాధ!

(photos courtesy : meghana & budugu)    

Thursday, 25 October 2012

కల చెదిరింది.. కధ మారింది.. కన్నీరే ఇక మిగిలింది!


ఉదయం  పదకొండు గంటలు. కన్సల్టేషన్  చాంబర్లో  నా  ఎదురుగా  ఓ  అందమైన  యువతి. సుమారు  ముప్పైయ్యేళ్ళు  ఉండొచ్చు. వడ్డాది పాపయ్య  బొమ్మలా  ఒద్దికగా, పొందికగా ఉంది. పాలరాతి శిల్పం, దొండపండు పెదాలు  అంటూ  అనాదిగా  ఆడవారి  అందాన్ని  పొగిడే  పడికట్టు  పదాలు  రాసే  ఓపిక  నాకు లేదు. బ్రీఫ్ గా  చెప్పాలంటే.. కాంచనమాల, మధుబాల, వైజయంతిమాలాల్ని  కలిపి  గ్రైండర్ లో  పడేసి.. రుబ్బి  అచ్చుపోస్తే.. అచ్చు ఆ  యువతి  రూపం  వస్తుంది!
                               
అట్టి  నారీమణికి  ఘోరమైన  ప్రేమ సమస్య. పాపం! ఆఫీసులో  తన  సహచరుడంటే  ఆమెకి  వెర్రి ప్రేమ. అందుకే  భార్యని  వదిలెయ్యమని  అతన్ని  ఒత్తిడి  చేస్తుంది. ఆ  సుందరీమణి  సమస్య  పట్ల  అవసరానికి  మించిన  ఆసక్తి  చూపుతూ, తీవ్రంగా  వింటూ  (అంతకన్నా  తీవ్రంగా  దొంగ చూపులు  చూస్తూ)  ఫ్రాయిడ్ వలే  (లేని) గడ్డాన్ని  నిమురుకుంటూ, అప్పుడప్పుడు  ప్రశ్నలడుగుతూ  కేస్  నోట్  చేసుకుంటున్నాను.

"ఎందుకు? ఎందుకు రవి? నన్నింతలా  వేధిస్తున్నావు? నీ  భార్యని  వదిలేసి  నాతో  లేచి రావటానికి  నీకున్న  ఇబ్బందేంటీ? నాతో  పెట్టుకోకు. నా  సంగతి  నీకింకా  తెలీదు. నీ  పేరు  మీద  ఉత్తరం  రాసి  మరీ  ఛస్తా! నిన్ను చచ్చి సాధిస్తా! నాకు  దక్కని  నిన్ను  ఎవరికీ  దక్కనివ్వను." అంటూ  ఆవేశంతో  నెత్తి  కొట్టుకుంటూ, దుఃఖంతో  భోరున  విలపించసాగింది.

ఆ  ముద్దుగుమ్మ  ఏడుస్తుంటే  నాక్కూడా  ఏడుపొచ్చింది!

'భగవంతుడా! ఎందుకయ్యా  ఈ  అపరంజి బొమ్మకి  ఇంత  కష్టం  సృష్టించావ్! ఆ  కష్టమేదో  పనీపాట  లేకుండా  ఖాళీగా  ఉన్న మా  సుబ్బు గాడికి  కల్పించొచ్చుగా! నో. ఈ  సౌందర్యవతికి  ఏ  కష్టమూ  రాకూడదు. రానివ్వను. వచ్చినా.. రక్షించడానికి  నేనున్నాగా. డార్లింగ్! వలదు వలదు. భయం వలదు. నేనున్నా. నేనున్నాగా  మై డియర్! వై  ఫియర్? ఆ  రవిగాడి  పెళ్ళాన్ని  లేపయ్యమంటావా? అసలా రవిగాణ్ణే  లేపేసి  నాకడ్డు  తొలగించుకుంటే  ఎలా  ఉంటుంది?'
                     
దాదాపు  అరగంటసేపు  ఆ కుందనపు బొమ్మకి  అత్యంత  శ్రద్ధాసక్తులతో  ధైర్యం  చెప్పా. 'అగాధమౌ  జలనిధిలోనా  ఆణిముత్యమున్నటులే.. శోకాల  మరుగున  దాగి  సుఖమున్నదిలే' అంటూ  వెలుగు నీడల్లో  శ్రీశ్రీ  రాసిన  పాటని  నా  మాటగా  మార్చుకుని  ధైర్యం  చెప్పా!

ఆవిడకి  ఎంత  ధైర్యం  వచ్చిందో  తెలీదు గానీ.. నా  మనసు  మాత్రం  తేలికయ్యింది. లోలోపల  నాకు  నేనే  ఒక  ఆమీర్ ఖాన్, మహేష్ బాబులా  ఫీలై పోవడం  మొదలయ్యింది. 'ముత్యాలజల్లు  కురిసె.. రతనాల  మెరుపు  మెరిసె.. వయసూ, మనసూ  పరుగులు  తీసె  అమ్మమ్మా!' అంటూ  మనసంతా  తలపుల  వర్షంతో  తడిసి  ముద్దైపోయింది!
                           
నా  డ్రీమ్ గాళ్  కుర్చీలోంచి  లేచి  నిలబడింది. సందేహిస్తున్నట్లు  నావైపు  చూసింది. (యండమూరి వీరేంద్రనాధ్ తన  నవలల్లో  వెయ్యి చోట్ల  రాసినట్లు) క్షణంలో  వెయ్యోవంతు సేపు  నా  దవడ కండరం  బిగుసుకుంది. ఏం  జరగబోతుంది? క్యా హోతా హై? వాట్  హేపెన్స్?

'పూవులాంటి  తన  మెత్తటి చేత్తో  షేక్ హ్యాండ్  ఇస్తుందా? ఆనందంతో  గట్టిగా  కౌగిలించుకుని  నాలాంటి  డాక్టరు  ఎందెందు వెదకినా  కానరాడు  అని  ఎమోషనల్  అయిపోతుందేమో! ఇవన్నీ  కావెహె. ఏకంగా  ముద్దు  పెట్టుకుని.. కమాన్  డార్లింగ్  లేచిపోదాం  అంటుంది. నో! నెవర్. నా  భార్యకి  అన్యాయం  చెయ్యలేను. చెయ్యను. ప్లీజ్! సమ్బడీ  హెల్ప్ మీ. హే భగవాన్! ఏమిటి  నాకీ  అగ్ని పరీక్ష! ఒక  నాస్తికుడిని  ఇంత  తీవ్రంగా  పరీక్షించుట  నీకు  న్యాయమా?'
                             
కుర్చీలోంచి  లేచిన  ఆ  యువతి  రెండు చేతులు  జోడించింది.

"నమస్కారం  బాబాయ్ గారు! మీరు  నాకు  కొండంత  ధైర్యం  ఇచ్చారు. మీ  మేలు  మర్చిపోలేను. మీరేమనుకోకపోతే  చిన్న మాట. మీరు  అచ్చు  మా  బాబాయిలా  వున్నారు. ఆయన  కూడా  మీకు మల్లే   పొట్టిగా, బట్టతలతో  ఉంటాడు. తెలివైనవాడే  కానీ  కొంచెం  తిక్కమనిషి. నాకు  చాలా  ధైర్యం  చెప్పేవాడు. తను మాత్రం  పిన్ని  పెట్టే  కష్టాలు  తట్టుకోలేక  ధైర్యం  కోల్పోయి.. ఇల్లొదిలి  పారిపోయ్యాడు. అందుకే  మిమ్మల్ని  బాబాయ్  అని  పిలవాలనిపించింది. నమస్తే!" అంటూ  డోర్  తెరచుకుని  నిష్క్రమించింది .        

అరిగిపోయిన  తెలుగు  భాషోపమానలతో  నా  దుస్థితిని  వర్ణిస్తూ.. మొహం మీద  ఈడ్చి తన్నినట్లు.. నెత్తి మీద  పిడుగు  పడినట్లు.. భూమి కంపించినట్లు.. గుండెల్లో  గునపాలు  దించినట్లు.. అంటూ  చాలా  రాయొచ్చు. కానీ  ప్రస్తుతం  నేను  దుఃఖించ వలసియుంది. అంచేత  ఇంతకన్నా  రాయలేను. పోస్ట్  రాస్తూ.. అర్ధాంతరంగా  ముగిస్తున్నందుకు  క్షమించండి (నేను  తీరిగ్గా  ఏడ్చుకోవాలి)!

చివరి తోక : ఈ  కథ  పూర్తిగా  కల్పితం!

(సైకాలజీ  పట్ల  ఆసక్తి  చూపే  నా  స్నేహితుడు  మొన్నామధ్య  కలిసినపుడు  'సైకోథెరపీలో  countertransference  అంటే  ఏమిటి?' అనడిగాడు. అతనికి  సమాధానంగా  కొన్ని  ఉదాహరణలు  చెబుతున్నప్పుడు  ఈ  కథ  ఐడియా  పుట్టింది.)

(picture courtesy : Google)      

Friday, 6 July 2012

తెల్లతోలు 'తెలుగు' హీరోయిన్లు.. ఒక పిచ్చిథియరీ!

'తెలుగు సినిమాల్లో తెలుగెప్పుడో చచ్చిపోయింది, కొన్నాళ్ళుగా హీరోయిన్‌గా తెలుగమ్మాయీ చచ్చిపొయ్యింది. ఇప్పుడు బొంబాయి నుండి దిగుమతైన తెల్లతోలు అమ్మాయిలు మాత్రమే హీరోయిన్లు.' 

అతగాడు నా చిన్ననాటి స్నేహితుడు, సినిమా ప్రేమికుడు. ఇప్పటి తెలుగు సినిమాల దుస్థితి గూర్చి బోల్డంత బాధ పడ్డాడు. నాకతని బాధ అర్ధం కాలేదు. నా దృష్టిలో - సినిమా చూడ్డం దురదేస్తే గోక్కోడంలాంటిది. సిగరెట్లు తాగనివాడికి సిగరెట్ రేటు ఎంత పెరిగితే మాత్రం లెక్కేంటి! అలాగే - సినిమాలు చూడ్డం నేనెప్పుడో మానేశాను. నేను చూడని సినిమా బ్రతికినా చచ్చినా నాకనవసరం.

'మేం సినిమాలు కళాపోషణ కోసం తియ్యట్లేదు, మిర్చివ్యాపారంలా మాదీ ఒక వ్యాపారం' అని సినిమావాళ్ళే చెబుతున్నారు - కాబట్టి వాళ్ళతో పేచీ లేదు. తెల్లతోలు అమ్మాయిల్ని తెలుగువాళ్ళు చూస్తున్నారు కాబట్టే వాళ్ళని బొంబాయి నుండి నిర్మాతలు దిగుమతి చేసుకుంటున్నారు. నిర్మాతలకి వ్యాపార ప్రయోజనం తప్ప ఇంకే ప్రయోజనం వుంటుంది? వాళ్ళెవరికైనా డబ్బులివ్వాల్సిందే గదా! తెలుగు అమ్మాయిలు ఫ్రీగా నటిస్తారా?

ఇప్పుడు - 'తెలుగు ప్రేక్షకుడు తెల్లతోలు అమ్మాయిల్ని ఎందుకంతగా ఇష్టపడుతున్నాడు?' అనే ప్రశ్నకి సమాధానం ఆలోచిద్దాం. 

సినిమా అంటే వెండితెరపై కథ చెప్పడం. రచయిత కథని కాగితంపై రాసినట్లే, దర్శకుడు సినిమాని వెండితెరపై రాస్తాడు. కొన్ని కథలు బాగుంటాయి, మరికొన్ని బాగోవు. ఈ బాగోగులు అనేది మనం కథతో కనెక్ట్ కావడంపై ఆధారపడి వుంటుంది. ఇలా కనెక్ట్ కావడం అనేది విజయానికి కీలకం.

ఇప్పుడు కొన్ని ఉదాహరణలు - డెబ్భయ్యో దశకంలో యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి మొదలగు రచయిత్రీమణులు తెలుగు నవలా ప్రపంచాన్ని యేలేశారు. పడవకార్లు + రాజ భవంతులు + ఉన్నిసూట్లతో ఆరడగుల ఆజానుబాహు హీరోల్ని పాపులర్ చేశారు. హీరోలు - కల్యాణ్, రాజేష్, అవినాష్, సునీల్.. ఇలా కళకళ్ళాడే పరభాషా పేర్లతో వెలిగిపొయ్యారు. వీళ్ళందరికీ గురువు శరత్‌చంద్ర చటర్జీ అనే బెంగాలీ రచయిత. 

ఖరీదైన హీరో ఒక మధ్యతరగతి అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మాయికేమో డబ్బున్నవాడు వెధవనీ, వాజమ్మనీ నమ్మకం. అంచేత హీరోగారి ఖరీదైన ప్రేమని కూడా గడ్డిపోచలా తిరస్కరిస్తుంది. ఆ అమ్మాయికి కావలసింది నీతి + నిజాయితీ +  ప్రేమించే స్వచ్చమైన మనస్సు!

ఆరోజుల్లో మధ్యతరగతి అమ్మాయిలు స్కూల్ ఫైనల్ (అంతకన్నా ఆడపిల్లలకి చదువెందుకు? ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేలాలా?) తరవాత తీరిగ్గా పెళ్లికోసం ఎదురుచూస్తూ వుండేవాళ్ళు. రాబోయే భర్త కోసం అందమైన కలలు కన్డానికి వాళ్ళోకో ముడిసరకు కావాలి. సరీగ్గా ఈ అవసరం కోసమే రచయిత్రుల నవలా సాహిత్యం పుట్టింది. అమ్మాయిలు ఆ నవలా హీరోయిన్లో తమని చూసుకుని మురిసిపోయ్యారు. దీన్నే 'ఐడెంటిఫికేషన్' అంటారు. 

హీరో అందగాడు, ధనవంతుడు. అతను తమవెంట పడటం అనే ఊహ (నిజజీవితంలో గుడికి వెళ్ళాలన్నా తమ్ముడు తోడు లేకుండా వెళ్ళలేని పరిస్థితి) ఆ అమ్మాయిలకి భలే 'కిక్' ఇచ్చి ఉంటుంది. ఇదీ ఐడెంటిఫికేషన్ గొప్పదనం. ఇట్లాంటి నవలలు రాయడం అనేది గుడి ముందు కొబ్బరికాయల వ్యాపారంలా మంచి గిట్టుబాటు వ్యవహారం.

మనమిప్పుడు 'ఐడెంటిఫికేషన్' పవర్ అర్ధం చెసుకున్నాం. ఇదే అవగాహనతో తెలుగు సినిమాల్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం. అనాదిగా తెలుగు సినిమాల పోషకులు ఆటోడ్రైవర్లు, మెకానిక్కులు, చేతిపనివాళ్ళు, రైతుకూలీలు మొదలైనవాళ్ళు. వీరిలో ఎక్కువమంది డార్క్ స్కిన్‌తో అయిదున్నర అడుగులు మించకుండా వుంటారు. ఈ వర్గాలవాళ్ళు హీరోతో ఐడెంటిఫై అవ్వగలిగితే హీరో విజయవంతంగా నిలబడగలడు. 

సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి హీరో స్థానంలో తనని ఊహించుకోవడం చాలా ఈజీ అవ్వాలి. అందుకే తమలో వొకడిగా కనపడే చిరంజీవిని తెలుగువాళ్ళు, రజనీకాంత్‌ని తమిళంవాళ్ళు పెద్ద హీరోలుగా మార్చేశారు. దీన్నే సినిమా పండితులు 'ఇమేజ్' అంటారు. చిరంజీవి సొఫెస్టికేటెట్‌గా ఉన్నా, రజనీకాంత్ నల్లగా లేకున్నా వారికిప్పుడున్న స్టార్‌డమ్ వచ్చేది కాదు. ఇలా తమకంటూ వొక ఇమేజ్ వున్న నటులతో కథ నడిపించడం దర్శకుడికి సులువు.  

సగటు సినిమా ప్రేక్షకుడి నిజజీవితం యెలా వుంటుంది? అతనికి గర్ల్ వుండదూ, ఫ్రెండూ వుండదు. యే అమ్మాయీ అతన్ని కన్నెత్తి చూడదు. తను కూలిపని చేస్తున్న ఇంటి యజమాని కూతురు.. రోజూ తన ఆటో ఎక్కే ఆంటీ.. తను కాలవలు క్లీన్ చేస్తుండే లేడీస్ హాస్టల్ అమ్మాయిలు.. వీరంతా అందంగా ఉంటారు (డబ్బుకీ అందానికి అవినాభావ సంబంధం వుంది). మనవాడికి వాళ్ళని తీరిగ్గా చూసే ధైర్యం ఉండదు. జీవితంలో వెలితి, అసంతృప్తి, చికాకు, అసహనం.

ఇప్పుడు 'ఫాంటసీ థింకింగ్' గూర్చి రెండుముక్కలు. మానవుడికి వాస్తవ ప్రపంచంలో అనేక సమస్యలు. ఈ సమస్యల ప్రపంచం నుండి గొప్పరిలీఫ్ ఫాంటసీ థింకింగ్! పేదవాడు పచ్చడి మెతుకులు తిని.. తన మహరాజా పేలెస్‌లో కన్యామణులు వింజామరలు వీచుచుండగా.. వైన్ సిప్ చేస్తూ బిరియానీ భోంచేస్తున్నట్లు ఈష్ట్‌మన్ కలర్లో (కనీసం గేవా కలర్లో) ఊహించుకోవచ్చు. దీనిక్కావలసిందల్లా దిండూ, దుప్పటి.. కించిత్తు ఇమాజినేషన్ (ఈ 'ఫాంటసీ థింకింగ్' ఒకస్థాయి దాటితే మానసిక రోగం అవుతుంది).

సినిమావాళ్ళు కలల వ్యాపారాలు. సామాన్యూల కలలకి అందమైన రంగులద్ది ఒక ఊహాప్రపంచం సృష్టించి ఆ ప్రపంచానికి ఎంట్రీ ఫీజు వసూలు చేసుకుంటారు. ఆ చీకటి గదిలో ప్రేక్షకుడే హీరో. ప్రేక్షకుది కలల ప్లాట్‌కి తగ్గట్టుగా చిరంజీవి, రజనీకాంత్‌లు భావాలు వ్యక్తీకరిస్తుంటారు. ఇదోరకమైన ప్లే స్టేషన్ విడియో గేమ్! 

ఈ ప్రేక్షకుడికి అర్జంటుగా ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. మనకి తెల్లతోలంటే పిచ్చి. ఇక్కడ తెల్లబడ్డానికి సబ్బులు, క్రీములకి మంచి గిరాకి. పెళ్ళప్పుడు పెళ్ళికూతుళ్ళకి మేకప్ తెల్లగా వేస్తారు. ఫొటోల్లో మొహం గొడకి కొట్టిన సున్నంలా తెల్లగా ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి హీరో పక్కన తెల్లతోలు పిల్లే కావాలి (రంగువిషయంలో రాజీపడే సమస్యే లేదు). ఆ తెల్లపిల్లతో విరగదీసుకుంటూ విచ్చలవిడిగా వొళ్ళంతా విరగదీసుకుంటూ భీభత్సంగా డ్యాన్సులు చెయ్యాలి. మన తెలుగువాళ్ళల్లో తెల్ల పిల్లలు తక్కువ, వున్నా వాళ్ళు exposing కి బిడియపడొచ్చు? ఈ సమస్యలేమీ లేకుండా అవకాశాల కోసం యెదురు చూస్తున్న తెల్ల పిల్లలు బొంబాయిలో బొచ్చదంతమంది. కాబట్టే హీరోయిన్లని దిగుమతి చేసుకోవడం!

సరే! మన ప్రేక్షకుడు (హీరో ద్వారా) హీరొయిన్‌తో డ్యూయెట్లు పాడేశాడు. కానీ.. ఇంకా ఏదో మిస్సవుతున్నాడు.. అదే ego satisfaction. ఇందుకోసం ఇద్దరు ఇద్దరు హీరోయిన్లుంటే బాగుంటుంది. హీరో 'నావాడంటే నావాడు' అంటూ ఆ ఇద్దరూ తన్నుకుచావాలి. అందుకోసం తమ చౌకబారు ప్రేమని వొలకబోస్తూ హీరోగారి కోసం వెంపర్లాడిపోవాలి. నడ్డి తిప్పుతూ, మెలికలు తిరిగిపోతూ హీరోగారితో పూనకం వచ్చినట్లు గంతులేయ్యాలి. అప్పుడా మజానే వేరు!

అంతేనా? ఇప్పుడు ఇంకొంచెం మసాలా! (ప్రేక్షకుల తరఫున 'నటన' అనబడే కూలి పని చేస్తున్న) హీరో ఆ అమ్మాయిల్ని గడ్డిపోచల్లా చూస్తాడు. ఛీ కొడుతూ humiliate చేస్తాడు. దీంతో పురుష దురహంకారం కూడా సంతృప్తి నొందుతుంది. అసలైన ego satisfaction అంటే ఇది! ఈ విధంగా - నిజజీవితంలో తనకి అందని ద్రాక్షపళ్ళయిన డబ్బున్న అందమైన ఆడపిల్లకి సినిమాహాల్లో రివెంజ్ తీర్చుకుంటాడు మన వర్కింగ్ క్లాస్ ప్రేక్షకుడు!      
                                           
మన సినిమా వ్యాపారస్తులు ఫ్రాయిడ్, ఎడ్లర్ కన్నా తెలివైనవాళ్ళు. అందుకే యెప్పుడూ నేలక్లాసు ప్రేక్షకుల కోసమే సినిమాలు తీశారు. హిందీ దర్శకుడు మన్‌మోహన్ దేశాయ్ 'క్లాస్' ప్రేక్షకులకి సినిమా నచ్చితే సినిమా ఫ్లాప్ అవుతుందేమోనని కంగారు పడేవాట్ట! సినిమావాళ్ళకి ఎవరికోసం ఏం తియ్యాలో ఖచ్చితమైన అవగాహన ఉంది. లేనిదల్లా నా స్నేహితుడులాంటి అమాయకులకే! 

Monday, 18 June 2012

సైకోఎనాలిసిస్ ఆఫ్ గుండమ్మ

'గుండమ్మకథ' సినిమా యాభయ్యేళ్ళ క్రితం విడుదలైంది. అయినా ఇప్పటికీ తెలుగువాళ్ళ హృదయాల్లో గుండమ్మ స్థానం పదిలం. ఒకప్పటి సామాజిక స్థితిగతులు అంచనా వెయ్యడానికి ఆనాడు వచ్చిన సాహిత్యం ఒక కొలమానం. ఇందుకు మంచి ఉదాహరణ గురజాడ 'కన్యాశుల్కం'. ఒక సినిమాకి సాహిత్యం స్థాయి లేకపోయినా, ఆనాటి సమాజాన్ని అర్ధం చేసుకోడానికి యెంతోకొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.    

ఒక సినిమా యెలా పుడుతుంది? రచయిత తన ఆలోచనలతో ఒక పాత్ర సృష్టిస్తాడు. ఆ పాత్రకి దర్శకుడు - టెక్నీషియన్లు, నటీనటుల సహకారంతో ప్రాణం పోస్తాడు. ఇక్కడ అందరూ కలిసి చేసేది ఒకటే వంటయినా, ఎవరి వాటా వారికి ఉంటుంది. ఏ పాత్రనైనా ఒక సాధారణ ప్రేక్షకుడు identify చేసుకోకపోతే.. ఎవరూ చెయ్యగలిదేమీ ఉండదు. ఇప్పుడు గుండమ్మ పాపులారిటీకి కారణాలు ఆలోచిద్దాం. 

ఈ సమాజం అనేక వ్యక్తుల, విభిన్న వ్యక్తిత్వాల సమాహారం. భిన్నఆలోచనల సంక్లిష్ట కలయిక. ప్రతి వ్యక్తి తన ప్రవర్తనని (అది ఎంత అసంబద్దమయినప్పటికీ) conscious mind తో సమర్ధించుకుంటాడు. కానీ అతని అసలు ఆలోచనల మూలాలు unconscious mind లో నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఈ unconscious mind ని బయటకి రానీకుండా అనేక defense mechanisms తొక్కిపెట్టి ఉంచుతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని 'సైకోఎనాలిసిస్'గా ప్రాచుర్యం కల్పించాడు.

మానవ మేధస్సు సంక్లిష్టంగా ఉంటుంది. మన ఆలోచనాధోరణి నలుపు తెలుపుల్లో (flat గా) ఉండదు. పరిస్థితులు, సందర్భాలు, వ్యక్తుల మధ్యగల సంబంధాలు.. ఇలాంటి అనేక variables ఒకవ్యక్తి యొక్క ఆలోచనలని నిర్ణయిస్తాయి. ఆ ఆలోచనే మన ప్రవర్తననీ శాసిస్తుంది. ఈ నేపధ్యంలో గుండమ్మని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి.

గుండమ్మకి కూతురంటే చాలా అభిమానం, ఒకరకంగా గుడ్డిప్రేమ. ఎందుకు? మధ్యతరగతి కుటుంబాల్లో భర్త చనిపోయిన తరవాత ఒక స్త్రీ పడే social and emotional trauma దారుణంగా ఉంటుంది. ఆ తరవాత వాళ్ళు చాలా insecurity కి కూడా గురవుతారు. తమని ప్రేమించే తోడులేక, మనసులోని భావాల్ని వ్యక్తీకరించుకునే అవకాశంలేక, మానసికంగా ఒంటరిగా మిగిలిపోతారు.

'ప్రేమ' అనేది ప్రతివ్యక్తికీ ఒక మానసిక అవసరం. దేన్నీ ప్రేమించనివారికి బ్రతకాలనే ఆశ చచ్చిపోతుంది. మానసికంగా ఏకాకిగా మిగిలిపోయినవారు.. తమ ప్రేమకి ఒక symbol గా ఒక వ్యక్తినో, జంతువునో, వస్తువునో ఎన్నుకుని తమ శక్తియుక్తులు ధారబోస్తూ అమితంగా ప్రేమిస్తారు. ఆ symbol పట్ల చాలా possessive గా కూడా ఉంటారు. ఆ సింబల్ని వదులుకోడానికి అస్సలు ఒప్పుకోరు. ఆ symbol చేజారితే depression లోకి వెళ్ళిపోతారు.

ఈ నేపధ్యంలో కూతురంటే గుండమ్మకి ఎందుకంత ప్రేమో అర్ధం చేసుకోవచ్చు. అందుకనే తనకి ఇల్లరికపుటల్లుడు కావాలనుకుంటుంది గుండమ్మ. కూతురు భర్తని ఇంట్లోనే ఉంచుకోటంలో జమున సుఖం కన్నా, గుండమ్మ అవసరమే ఎక్కువన్నది మనం గుర్తించాలి. 

గుండమ్మని గయ్యాళి అంటారు. అసలు ఈ 'గయ్యాళి' అన్న పదమే అభ్యంతరకరం. ఇది నోరున్న ఆడవారిని defame చెయ్యడానికి సృష్టించిన పదం అయ్యుండొచ్చు. గుండమ్మకి సంపద విలువ తెలుసు. సంపద ఎవరి దగ్గరుంటే వారిదే అధారిటీ అన్న కేపిటలిస్టు ఫిలాసఫీ కూడా తెలుసు! అందుకే తాళంచెవుల గుత్తి బొడ్లో దోపుకుని పెత్తనం చలాయిస్తుంటుంది. 

గుండమ్మ సవతి కూతురి పట్ల కఠినంగా ఎందుకు ప్రవర్తించింది? ఈ సమాజం తనకి చేసిన అన్యాయానికి ప్రతిగా సవతి కూతుర్ని రాచిరంపాన పెట్టడం ద్వారా కసి తీర్చుకుని sadistic pleasure పొందిందా? ఆనాటి సామాజిక పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటే ఇందుకు సమాధానం దొరుకుతుంది. 

ఆరోజుల్లో కుటుంబ నియంత్రణ లేదు. స్త్రీలు ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్ళు. చాలాసార్లు కాన్పు కష్టమై తల్లి చనిపోవడం (maternal deaths) జరుగుతుండేది, అందుకే పిల్లల్ని కనడం స్త్రీకి పునర్జన్మ అనేవారు. వితంతువైన భర్త (నాకు ఇంతకన్నా సరైన పదం తోచట్లేదు) మరణించిన భార్య కన్న పిల్లల్ని సాకడనికి (బయటకి ఇలా చెప్పేవాళ్ళు గానీ, కుర్రపిల్లతో సెక్సు దురదే అసలు కారణం అని నా అనుమానం) రెండోపెళ్ళి చేసుకునేవాడు. ముసలి వెధవలు చిన్నపిల్లల్ని రెండోభార్యగా చేసుకోవటం ఆరోజుల్లో నిరాటంకంగా సాగిన ఒక సామాజిక అన్యాయం.

రెండోపెళ్ళివాడిని చేసుకునే అమ్మాయిలకి వేరే చాయిస్ లేదు, గతిలేని పరిస్థితుల్లో compromise అయ్యి  ముసలాణ్ని చేసుకునేవాళ్ళు. ఈ అసంతృప్త అభాగినుల గూర్చి సాహిత్యంలో బోల్డన్ని ఆధారాలు ఉన్నయ్. (అయితే 'దేవదాసు'లో పార్వతి గంపెడు పిల్లల్ని 'చక్కగా' చూసుకుంటుంది. శరత్ కథల్లో మనలా నేలమీద నడిచే మనుషులకి తావులేదు. అందరూ ఆదర్శమూర్తులు, త్యాగధనులే).

తీవ్రమైన అసంతృప్తితో కాపురానికొచ్చిన యువతికి దిష్టిపిడతల్లాగా మొదటిభార్య సంతానం కనబడతారు, ఇంక తన కోపాన్ని పిల్లల మీదకి మళ్ళిస్తుంది. దీన్నే సైకాలజీ పరిభాషలో frustration - aggression - displacement  theory అంటారు. అంటే మనలోని నిస్పృహ, నిస్సహాయత క్రోధంగా మారుతుంది. ఆ aggression ని ఎదుటి మనిషిపై చూపే అవకాశం లేనప్పుడు.. అమాయకుల వైపు, అర్భకుల వైపు మళ్ళించబడుతుంది.

ఈ థియరీ ప్రకారం మనం గుండమ్మని అంచనా వేస్తే ఆమె సవతి కూతురు పట్ల యెందుకంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో అర్ధమవుతుంది. ఇక్కడ victim సవతి కూతురు. గుండమ్మని పుట్టింటివారు, భర్త కలిసి చేసిన అన్యాయానికి సవతి కూతురు బలయ్యింది. గుండమ్మని ఆపడానికి భర్త లేడు, సవతి కూతురు నిస్సహాయురాలు. ఇంతకన్నా soft target గుండమ్మకి ఎక్కడ దొరుకుతుంది? అందుకే తన aggression కి ventilation కోసం సవతి కూతురు అనే soft target ని ఎంచుకుంది.

aggression theory లో ventilation కోసం soft targets ఎంచుకోవటం అనేది మనం చూస్తూనే ఉంటాం. భార్య తాగుబోతు భర్తపై కోపంతో, ఏంచెయ్యాలో తోచక - పిల్లల్ని చావగొడుతుంది. 'అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు' అనే సామెత ఉండనే ఉందిగదా!

సరే! గుండమ్మ ముసలి మొగుడు ఇద్దరు పిల్లల్ని పుట్టించి వెళ్ళిపోయాడు. మరప్పుడు భర్తమీద కోపం తన కూతురు, కొడుకుల మీద కూడా వుండాలి గదా? కానీ అలా ఉండదు. ఎందుకని? గుండమ్మది narcissistic personality. తాను, తన పిల్లలు మాత్రమే మనుషులు. 'తనది' అన్నదేదైనా అత్యంత ప్రీతిపాత్రం. 

అసలు గుండమ్మ ఎందుకలా నోరు పారేసుకుంటుంది? ఇక్కడ మనం ఫ్రాయిడ్ చెప్పిన reaction formation అనే defense mechanism ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో 'మగదిక్కు' లేని సంసారం అంటే అందరికీ అలుసు. గుండమ్మ తన ఆస్తిపాస్తులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ అభద్రతా భావంలోంచి పుట్టుకొచ్చిన ప్రవర్తనే 'గయ్యాళితనం'. తన అశక్తతని, అమాయకత్వాన్ని బయటి ప్రపంచానికి తెలీకుండా ఉండటం కోసం.. పరిస్థితుల్ని తట్టుకుని నిలబడటానికి గుండమ్మ 'గయ్యాళితనం' అనే ఆభరణం ధరించింది! 

ఆ రోజుల్లో సమాజంలో గల సవతి లేక మారుతల్లి అనే stereotyping కూడా గుండమ్మ 'గయ్యాళి'తనానికి కారణం కావచ్చు. తెలిసోతెలీకో మనంకూడా ఒక్కోసారి ఈ సమాజంలో stereotypes గా మారతాం. మతం, కులం పట్ల కొందరి భావాలు ఒకే మూసలో ఉండటం ఈ stereotype కి ఒక ఉదాహరణ. గుండమ్మ కూడా చక్కగా ఈ stereotype లోకి దూరిపోయింది.

గుండమ్మలో మనకి projection కూడా కనిపిస్తుంది. 'సవతితల్లి రాచిరంపాన పెడుతుందంటారు గానీ.. నేను ఈ పిల్ల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నానో!' అని గంటన్నతో అంటుంది. అంటే తన కఠినత్వానికి కూడా కారణం సావిత్రేననేది గుండమ్మ థియరీ! ఈ రకంగా తనకున్న అవలక్షణాలని, వికృత ఆలోచనలని ఎదుటివారికి ఆపాదించి సంతృప్తి చెందడాన్ని projection అంటారు. 

సవతి కూతుర్ని ఆర్ధికంగా తక్కువ స్థాయిలో వున్న పనివాడికిచ్చి పెళ్ళి చేస్తూ కూడా.. తనేదో ఆ తల్లిలేని పిల్లని ఉద్దరిస్తున్నట్లు పోజు కొడుతుంది. వాస్తవానికి గుండమ్మ సవతి కూతురికి చేసింది అన్యాయం. తాము చేసే తప్పుడు పనుల్ని అసంబద్ధ వాదనలతో సమర్ధించుకోవడాన్ని ఫ్రాయిడ్ భాషలో rationalization అంటారు. మన రాజకీయ నాయకులు ఈ కోవకి చెందినవారే!

గొప్ప సంబంధం అనుకుని నాగేశ్వరరావుని అల్లుడుగా చేసుకుంటుంది. అతనొట్టి తాగుబోతని, తాను మోసపోయ్యానని తెలుసుకుని హతాశురాలవుతుంది. మోసపోయిన కూతురి బాధ చూసి తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు గుండమ్మ చాలా conflict కి గురవుతుంది. మామూలుగానయితే గుండమ్మ నాగేశ్వరరావుని ఉతికి ఆరేసేది, కానీ అతనంటే కూతురికి ఇష్టం.

ఇందాక చెప్పిన projection గుర్తుందికదూ? అల్లుడిని తిడితే కూతురు బాధ పడుతుంది. అది గుండమ్మకి ఇష్టం లేదు, కాబట్టి ఏమీ అనలేకపోతుంది. అల్లుడి పట్ల కఠినంగా ఉండాలా? కూతురు భర్త కాబట్టి, కూతురు బాధపడుతుంది కాబట్టి, సహించి ఊరుకోవాలా? ఈ ద్వైదీభావాన్ని ambivalence అంటారు. ఈ ambivalent state లో ఉండి, నాగేశ్వరరావుని మందలిస్తున్న రామారావుని ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. వాస్తవానికి గుండమ్మ కోపం రామారావుపై కాదు, నాగేశ్వరరావు మీద. మళ్ళీ displacement!

కూతురు దూరమై సగం చచ్చిన గుండమ్మని చాయాదేవి కొట్టి గదిలో బంధిస్తుంది. అప్పుడు గుండమ్మలో realization వస్తుంది. సావిత్రి పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు guilt complex తో బాధ పడుతుంది. సావిత్రిని చూడంగాన్లే ఎటువంటి భేషజాలకి పోకుండా క్షమించమని అడుగుతుంది. 'నీకు చేసిన అన్యాయానికి దేవుడు నాకు శిక్ష విధించాడు.' అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.

గుండమ్మ వంటి egocentric personality ని catharsis స్థాయికి తీసుకెళ్ళడానికి దర్శకుడు మంచి ఎత్తుగడలతో సన్నివేశాల్ని సృష్టించాడు. అందుకోసం చాయాదేవిని (నాకు ఈపాత్ర కూడా చాలా ఇష్టం) చక్కగా వాడుకున్నాడు. అందుకే గుండమ్మతో కూతుర్ని క్షమాపణ అడిగించిన మరుక్షణం ప్రేక్షకులంతా గుండమ్మ పక్షం వహిస్తారు. ఇది గుండమ్మ పాత్రపోషణలో నటిగా సూర్యకాంతం సాధించిన విజయం.

ఇంతకీ గుండమ్మ నెగటివ్ క్యారెక్టరా? పాజిటివ్ క్యారెక్టరా? ఏదీ కాదు. మన మధ్యన తిరుగుతూ, మనతో పాటు జీవించిన ఒక సజీవ క్యారెక్టర్. మనలో, మన సమాజంలో ఉన్న అవలక్షణాలన్నీ గుండమ్మకి కూడా ఉన్నాయి, అందుకే ఈపాత్ర అంతలా పాపులర్ అయింది.

ఈ సినిమా సమయానికి సూర్యకాంతం గయ్యాళి అత్తగా career peak లో ఉంది, కోడళ్ళని పీడించే అత్తగార్లూ వీధివీధికీ ఉండేవారు. అంచేతనే - మనం సూర్యకాంతంతో identify చేసుకోగలిగాం, అత్తగా సూర్యకాంతానికి ఒక stardom ఇచ్చేశాం.

అయితే మనకిప్పుడు గుండమ్మలు కనిపిస్తారా? కనిపించరు. కారణం - ఇప్పుడు  వైద్యం, వైద్య సదుపాయాలు మెరుగయ్యాయి. మధ్యతరగతి వాళ్లకి అందుబాటులోకొచ్చాయి. అందువల్ల స్త్రీలు కాన్పు సమయంలో చనిపోవడం లేదు. 

ఆ రోజుల్లో ఆడామగా మధ్య భారీవయసు తేడాతో పెళ్ళి జరిగేది, ఇప్పుడలా జరగట్లేదు. ఒకప్పుడు మగవారి సగటు జీవితం ఆడవారి సగటు జీవితం కన్నా తక్కువ. ఇప్పుడు జీవితకాలాన్ని పెంచేసుకుని మగవారు కూడా ఆడవారితో సమానత్వం సాధించారు! అందువల్ల కూడా క్రమేణా గుండమ్మలు కనుమరుగయ్యారు.

'కన్యాశుల్కం' మొదటిసారి చదివినప్పుడు కన్యాశుల్కం అంటే ఏమిటో అర్ధం కాదు. అట్లాగే - వేగంగా మారుతున్న మన సమాజ పరిణామంలో కొంతకాలానికి మన ఉమ్మడి కుటుంబాలకి ట్రేడ్మార్క్ అయిన గయ్యాళి అత్తలు కనుమరుగై.. అస్తిత్వాన్ని కోల్పోవచ్చు. ఇది సమాజానికి మంచిది కూడా!

Wednesday, 25 April 2012

చిత్తూరు నాగయ్య.. ద సైకోథెరపిస్ట్

"ఒకే విషయం ఎన్నిసార్లని చెప్పాలి? చెప్పేప్పుడు బుద్ధిగా తలూపుతారు, పని మాత్రం చెయ్యరు. అసలు మీ సమస్యేమిటి? వినపడదా? అర్ధం కాదా?" విసుగ్గా అన్నాను.

నా హాస్పిటల్లో స్టాఫ్ అవడానికి సీనియర్లే. కానీ వాళ్లకి ప్రతిరోజూ, ప్రతివిషయం కొత్తే! మా సుబ్బు సరదాగా అంటుంటాడు - 'యధా వైద్యుడు, తధా స్టాఫ్.' 

కానీ ఇవ్వాళ మరీ చిరాగ్గా ఉంది - 'వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్!' అని పదోసారి అనుకున్నాను.

ఇంతలో - గదిలో ఏదో అలికిడి. విసుగ్గా తలెత్తి చూశాను. ఎదురుగా ఒక ఆజాను బాహుడు, ధవళ వస్త్రాల్లో ధగధగ మెరిసిపోతున్నాడు. ఈయన్ని ఎక్కడో చూసినట్లుందే? ఎవరబ్బా! ఈయన.. ఈయన.. చిత్తూరు నాగయ్య! ఆయన ప్రశాంత వదనంతో, దరహాసంతో నన్నే చూస్తున్నాడు.

అంతే కాదు - 'నువ్విక మారవా?' అని నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నిస్తున్నట్లుగా కూడా అనిపించింది.

'అబ్బా! ఈయన్తో చచ్చేచావుగా ఉంది, ప్రశాంతంగా కోపాన్ని కూడా తెచ్చుకోనివ్వడు గదా! వేలకి వేలు జీతాలిస్తున్నాను. ఏం? నా స్టాఫ్ ని ఆమాత్రం మందలించేంత హక్కు నాకుండదా? సినిమా చూస్తున్నప్పుడు లక్షాతొంభై అనుకుంటాం. అంతమాత్రానికే ఈయన అప్పులాళ్ళా వచ్చెయ్యడమేనా?'

అంతలోనే నా చికాకు, కోపం, అసహనం అన్నీ ఒక్కసారిగా ఆవిరైపొయ్యాయి. సిగ్గుతో తల దించుకున్నాను.

నేనెందుకు ఇంత చెత్తగా ఆలోచిస్తున్నాను! దిసీజ్ నాట్ కరెక్ట్. చిత్తూరు నాగయ్యని నా థెరపిస్ట్‌గా ఎప్పాయింట్ చేసుకున్నది నేనే. ఈ థెరప్యూటిక్ ఎలయెన్స్‌తో నాగయ్యకి ప్రమేయం లేదు. నాకూ, చిత్తూరు నాగయ్యకి పేషంట్ డాక్టర్ రిలేషన్‌షిప్ కొన్నాళ్ళుగా నడుస్తుంది. ఒక విషయం చెప్పేప్పుడు ఎత్తుగడగా ముందు కొంత సంభాషణతో మొదలెట్టి, అటుతరవాత అసలు కథలోకి వచ్చే నా ఓ.హెన్రీ అనుకరణ మార్చుకోలేకున్నాను. ఇవ్వాళ కూడా నా అరిగిపోయిన స్టైల్లోనే రాస్తున్నాను, మీరు నన్ను మన్నించాలి.

చిత్తూరు నాగయ్య గొప్ప నటుడు, గొప్ప గాయకుడు అని నా నమ్మకం. అయన మరీ అంత గొప్పేం కాదు అని ఎవరైనా అంటే నాకస్సలు అభ్యంతరం లేదు. నా అభిప్రాయాలేవో నాకున్నాయి, అవి ఇతరుల్తో సరిపోలాలని నేనెప్పుడూ అనుకోను. అయితే నాగయ్య పట్ల నా అభిమానం స్వార్ధపూరితమైనది. వాడ్డూయూ మీన్ బై - 'స్వార్ధాభిమానం'!? 

వృత్తిరీత్యా నేను సైకియాట్రిస్టుని, ఫీజుచ్చుకుని కోపాన్ని పోగొట్టడానికి కౌన్సెలింగ్ చేస్తాను. కానీ నాకు కోపం ఎక్కువ! ఎదుటివారి కోపం ఎలా తగ్గించాలో తెలిసిన నాకు, నా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు. ఈ కన్ఫెషన్‌ని  నా మోడెస్టీగా భావించనక్కర్లేదు, శిక్ష పడదంటే హంతకుడు కూడా నేరాన్ని ఒప్పుకుంటాడు!

అది అర్ధరాత్రి, ఇంట్లోవాళ్ళు హాయిగా నిద్ర పోతున్నారు. నాకు మొదట్నుండీ సరీగ్గా నిద్ర పట్టదు. దూరదర్శన్‌లో నాగయ్య నటించిన 'యోగి వేమన' వేస్తున్నారు. సుఖమయ నిద్ర కోసం ఈ పురాతన సినిమాకి మించిన మంచి సాధనమేముంది అని ఆ సినిమా చూడ్డం మొదలెట్టాను. క్రమేపి సినిమాలో లీనమైపోయ్యాను.

వేమారెడ్డికి అన్నకూతురంటే ఎంతో ప్రేమ. ఆ పాప జబ్బుచేసి చనిపోతుంది. నిర్వేదనగా స్మశానంలో తిరుగుతున్నాడు. ఒక మనిషి పుర్రెని చేతిలోకి తీసుకుని 'ఇదేనా, ఇంతేనా' అంటూ పాడుతున్నాడు. వెచ్చగా బుగ్గల మీద యేదో స్పర్శ! అవి నా కన్నీళ్ళూ! అర్ధరాత్రి కాబట్టి నా కన్నీళ్ళని ఎవరూ గమనించే ప్రమాదం లేదు కాబట్టి నేనా కన్నీళ్ళని ఆపుకోవటానికి ప్రయత్నించలేదు. నా ప్రమేయం లేకుండానే కళ్ళల్లోంచి కన్నీళ్ళు ధారగా కారిపోతున్నయ్! ఈ అనుభూతి నాకు కొత్త, నాలో ఇన్ని కన్నీళ్ళున్నాయా! సినిమా చివరిదాకా గుడ్లప్పగించి అలా చూస్తూ కూర్చుండిపొయ్యాను. 

ఆశ్చర్యం! ఆ మరుసటి రోజు నాకు కోపం రావాల్సిన సందర్భంలో కూడా పెద్దగా కోపం రాలేదు. ఆ తరవాత నాగయ్య నటించిన సినిమాల్ని వరసగా చూశాను. నా కోపం క్రమేపి ఇంకాఇంకా తగ్గసాగింది. నాగయ్యది ప్రశాంత వదనం. మృదువుగా, మార్ధవంగా నటిస్తాడు. నాగయ్యని నిశితంగా గమనిస్తాను, పాటల్ని ఏకాగ్రతతో వింటాను. అప్పుడే నాకు కోపం వచ్చినప్పుడు నాగయ్యని గుర్తు చేసుకోవడం ఈజీగా ఉంటుంది.

ప్రతిరోజూ పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది, ఉదయాన్నే నడక కూడా మంచిది. నాగయ్య చిత్రాలు చూస్తూ ఉండటం కూడా ఇదే  కోవలోకి వస్తాయని నమ్ముతున్నాను. ఫైటింగ్ సినిమాలు చూసేవాడిలో నేరప్రవృత్తి ఉంటుందట. సెక్స్ సినిమాల ప్రేమికుడికి లోకమంతా బూతుమయంగా ఉంటుందట. అలాగే - నాగయ్య సినిమాలు చూసినవాడు ప్రశాంత చిత్తంతో సాత్వికుడుగా మారిపోతాడు.

'పాండురంగ మహత్యం'లో నాగయ్య ఎన్టీఆర్‌కి తండ్రి, భోగలాలసుడైన కొడుకు వృద్ధులైన తలిదండ్రులపై దొంగతనం మోపి అర్ధరాత్రివేళ ఇంట్లోంచి వెళ్ళ గొడతాడు. అప్పుడు నాగయ్యని చూస్తే నాకు దుఃఖం ఆగలేదు. కొడుకు పట్ల ప్రేమ, అవమాన భారం, నిర్వేదం, నిర్లిప్తత.. ఇన్నిభావాల్ని అలవోకగా ప్రదర్శిస్తాడు.

ఈ పాత్రని పృధ్వీరాజ్ కపూర్ వంటి నటుడు ఇంకా బాగా నటించవచ్చునేమో కానీ, నాగయ్యంత కన్విన్సింగ్‌గా వుండదు. ఎందుకు? నాగయ్యది నిజజీవితంలో కూడా పుండరీకుని తండ్రివంటి మనస్తత్వం, అందుకని! మానవ జీవితంలో అత్యంత విలువైనది డబ్బు. ఎవరెన్ని కబుర్లు చెప్పినా డబ్బు విలువని గుర్తించకుండా జీవించగలగడం ఎంతో కష్టం. ఇది అతికొద్దిమందికి మాత్రమే సాధ్యమైంది. అర్ధరాత్రి ఇంటిని కొడుక్కి తృణప్రాయంగా వదిలేసి అడవి బాట పట్టిన పాండురంగని తండ్రి లాగే, నాగయ్య కూడా సిరిసంపదల్ని వదిలేశాడు.

కోపానికి నాగయ్య సినిమాలు యాంటిడోట్‌గా పనిచేస్తాయి, అందుకే నా కోపాన్ని జయించటానికి తెలివిగా నాగయ్యని వాడుకుంటున్నాను. సైకోథెరపీ ప్రిన్సిపుల్స్ ప్రకారం నాగయ్య నా థెరపిస్ట్. సైకియాట్రిస్టులకి సొమ్ము తగలేసే కన్నా ఇది సుఖమైన మార్గం అని నా అభిప్రాయం!