Monday 30 September 2013

'షావుకారు' చెంగయ్య మనస్తత్వం.. కొన్ని ఆలోచనలు


మంచి సినిమా అనగానేమి? దాని రంగు, రుచి, వాసన ఎట్లుండును? ఈ ప్రశ్నలకి నాకు తోచిన సమాధానం రాస్తాను. చాలాసార్లు ఒక సినిమాని casual గా చూట్టం మొదలెడతాం. కొద్దిసేపటికి సినిమా చూస్తున్న సంగతి మర్చిపోతాం. ఇంకొద్దిసేపటికి సినిమా కథలో పూర్తిగా engross అయిపోతాం. ఎదురుగా జరుగుతున్న సన్నివేశాలు మన చుట్టూతా జరుగుతున్నట్లుగా ఉంటాయి. అంటే సన్నివేశాల్లో పాత్రల మధ్య (passive గా) మనం కూడా ఉంటాం. ఈ అనుభూతి కలిగించే ఏ సినిమా అయినా మంచి సినిమానే అవుతుంది. ఈ విషయంలో సలహా కోసం మనం సినీపండితుల వైపు చూడనవసరం లేదు.

నా దృష్టిలో మంచి సినిమా అంటే ఏంటో చెప్పాను కదా! ఈ నిర్వచనం ఫాలో అయితే విజయావారి 'షావుకారు' ఒక మంచి సినిమా అవుతుంది. ఈ సినిమా చూస్తుంటే.. ప్రశాంత నదీ తీరాన చెలి చెంతన ఫిల్టర్ కాఫీ తాగుతూ sweet nothings (అంటే చెలితో మాట్లాడేప్పుడు nothing is sweet అని అర్ధం కాదు) మాట్లాడుకున్నంత హాయిగా ఉంటుంది. ఒక పల్లెటూర్లో కొన్నిగంటలపాటు బస చేసిన భావన కూడా కలుగుతుంది. సినిమాలో కనబడే సహజ పల్లెవాతావరణం.. పాత్రలు, పాత్రధారుల ప్రతిభల గూర్చి చాలా రాయొచ్చు. ఇప్పుడంత ఓపిక లేదు కావున.. ప్రస్తుతానికి షావుకారు చెంగయ్యకి పరిమితమవుతాను.

చెంగయ్య షావుకారు. వడ్డీవ్యాపారం చేస్తూ చాలా డబ్బు కూడబెడతాడు (ఈ వడ్డీవ్యాపారం సర్వకాల సర్వావస్థల యందు గిట్టుబాటుగానే ఉంటుంది). చెంగయ్యకి పక్కింటి అమ్మాయి సుబ్బులు (షావుకారు జానకి) అంటే ఎంతో ప్రేమ, ఆప్యాయం. ఒకరకంగా సుబ్బులు, చెంగయ్యలు స్నేహితులు కూడా (సుబ్బులు చెంగయ్యని ఆట పట్టిస్తుంటుంది). డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే చెంగయ్య.. సుబ్బులుకి బంగారు నగ బహుమతిగా ఇస్తాడు. ఇటువంటి దృశ్యాలతో చెంగయ్యకి సుబ్బులు పట్ల గల ప్రేమాభిమానాల్ని చక్కగా establish చేస్తాడు దర్శకుడు.


చెంగయ్య దగ్గర లౌక్యం కూడా బాగానే ఉంది. కాబట్టే సున్నం రంగడు (ఎస్వీరంగారావు), పంతులు (వంగర వెంకట సుబ్బయ్య) మాట కాదనలేకపోతున్నట్లుగా.. వరాలు (రేలంగి) తండ్రి శెట్టికి సత్రంలో అంగడి నడుపుకోడానికి మౌనంగా అంగీకరిస్తాడు. వాస్తవానికి సత్రంపై చెంగయ్యకి హక్కు లేదు. అది ఊరుమ్మడి. ఆ విషయం చెంగయ్యకి కూడా తెలుసు. సుబ్బులు తండ్రి రామయ్య (శ్రీవాత్సవ) ఆ నిజాన్నే సాక్ష్యంగా చెబుతాడు. అందుకు రామయ్యపై కక్ష పెట్టుకుంటాడు. సుబ్బులు అన్న నారాయణ (వల్లభజోశ్యుల శివరాం) తనపై నోరు చెసుకున్నందుకు అవమానంగా భావిస్తాడు. అందువల్ల తప్పుడు కేసు బనాయించి నారాయణని జైలు పాలు చేస్తాడు.

తను చేస్తున్నదని సరికాదనీ, తప్పు కూడాననే భావన చెంగయ్యని ఇబ్బంది పెడుతుంటుంది. చెంగయ్యలోని ఈ మంచిచెడుల conflict ని దర్శకుడు చాలా జాగ్రత్తగా maintain చేసుకుంటూ వస్తాడు. అందుకే తనలోని guilt feelings లోంచి బయటపడేందుకు.. జరుగుతున్నదానిలో తన తప్పేమీ లేదనీ, ఈ తతంగం మొత్తానికి రామయ్య, నారాయణల ప్రవర్తనే కారణం అనుకుంటూ.. rationalization చేసుకుంటాడు చెంగయ్య.

తీరా తన కొడుకు సత్యం (ఎన్టీరామారావు) కూడా చెయ్యని నేరానికి జైలు పాలయినందుకు తల్లడిల్లిపోతాడు. ఇక్కణ్నించి చెంగయ్యలో self introspection మొదలవుతుంది. తీవ్రమైన నిరాశ, నిస్పృహలకి లోనవుతాడు. అందుకే ఊరివాళ్ళతో మానసికంగా సంబంధాలు తెంచేసుకుని isolation కోరుకుంటాడు. తన అవసరం ఎవరికీ లేదనీ, తనకీ శాస్తి జరగవలసిందేనని self-reproach కి లోనవుతాడు. depressed state of mind ఉన్నవారిలో ఈ రకమైన ఆలోచన సహజం.


'దొంగలు వచ్చి చంపేస్తారు మామా!' అంటూ సుబ్బులు ఏడుస్తూ వచ్చి చెబుతుంది. తప్పించుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ.. తప్పు చేసిన తనకి శిక్ష పడవలసిందేనని భావిస్తాడు. అపరాధ భావంలోంచి బయటపడ్డానికి శిక్షకి మించిన పరిహారం మరొకటి లేదు. అందుకే బలవంతంగా సుబ్బులుని పంపేస్తాడు. చివరికి సుబ్బులు ప్రాణానికి ముప్పు ఏర్పడ్డప్పుడు మాత్రమే దొంగలకి తాళం చెవులు సంగతి చెబుతాడు. ఇవి షావుకారు చెంగయ్య వైపు నుండి కథలోని కొన్ని ముఖ్యమైన పాయింట్లు .

ఇంతకీ చెంగయ్య ఎవరు? 'షావుకారు' కథకి నాయకుడా? ప్రతినాయకుడా? రంగడు ద్వారా దొంగబంగారం కొంటాడు. కొడుకులాంటి నారాయణపై కక్షతో దొంగ సాక్ష్యం చెప్పాడు. అందువల్ల చెంగయ్య చెడ్డవాడే అయి ఉండాలి. మరైతే.. రామి (కనకం) దగ్గర చిన్నపిల్లాళ్ళా బావురుమంటాడెందుకు? కావున మంచివాడే అయ్యుంటాడు. అర్ధం కావట్లేదు కదూ?

ఏ మనిషీ పూర్తిగా మంచివాడుగానో, చెడ్డవాడు గానో ఉండడు. పరిస్థితుల బట్టి ప్రవర్తన ఉంటుంది. మంచి చెడ్డలూ మారుతుంటాయి. సుబ్బులుని చిన్నప్పట్నుండి ప్రేమగా పెంచిన చెంగయ్య చెడ్డవాడయ్యే అవకాశం లేదు. పిల్లల్ని, పుస్తకాల్ని ప్రేమించేవారు ఎప్పుడూ మంచివారే (ఈ అభిప్రాయం మాత్రం పూర్తిగా వ్యక్తిగతం.. biased కూడా).

రామయ్య సాక్ష్యం వల్ల తన పరువు పోయిందనే ఉక్రొశం, నారాయణ పెడ మాటల వల్ల కోపం తప్ప (చెంగయ్యది egocentric personality కాదుగానీ.. ఆ traits కొన్ని ఉన్నాయి).. చెంగయ్య మనసులో వేరే దుష్ట భావనలు ఉన్నట్లు తోచదు. జరుగుతున్న పరిణామాల పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా ఉంటాడు చెంగయ్య. ఏ క్షణంలోనైనా రామయ్య వచ్చి "ఏంటి బావా ఇదంతా?" అని ఒక చిన్న మాటన్నా జరిగిందంతా మర్చిపోదామన్న ఆత్రుతతో ఉన్నవాడిలా కూడా కనిపిస్తాడు. అయితే రామయ్య చెంగయ్యకి అంత అదృష్టం పట్టనివ్వడు!

నేను షావుకారు చెంగయ్య మనసు చదివేసినట్లు.. ఆయన తరఫున వకాలత్ పుచ్చుకున్నట్లు రాసేస్తున్నాను. ఎందుకంటే నాకు చెంగయ్య మనసు చక్కగా అర్ధమైంది. ఇందుకు కారకులు ఇద్దరు. షావుకారు చెంగయ్య పాత్రని ఎల్వీప్రసాద్ అనే శిల్పి ఎంతో శ్రద్ధగా ఒక అద్భుతమైన శిల్పంగా మలిస్తే.. గోవిందరాజుల సుబ్బారావు ప్రాణం పోశాడు. మహానటుడు ఎలా ఉంటాడు? అచ్చు గోవిందరాజుల సుబ్బారావులా ఉంటాడు!


అవును. గోవిందరాజుల సుబ్బారావు మహానటుడే! కన్యాశుల్కంలో నశ్యం పీల్చుకుంటూ, జంధ్యం సరిచేసుకుంటూ లుబ్దావధానులుగా ఒక పరమలోభిని మనముందు ఆవిష్కరించాడు (గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!). ఇప్పుడీ షావుకారు సినిమాలో సంక్లిష్టమైన చెంగయ్యని మనముందు నిలబెట్టాడు. ఒక పాత్రకి.. ఆ పాత్ర గుణగణాలని దుస్తులుగా తొడిగి.. పాత్రోచితంగా ప్రవర్తిస్తూ.. మనని కథలో లీనమయ్యేట్లు చెయ్యడమే ఒక మంచి నటుడి బాధ్యత. ఆ బాధ్యతని అత్యంత ప్రతిభావంతంగా నెరవేర్చేవాడే మహానటుడు.

నాకీ మధ్య ఒక అనుమానం పట్టుకుంది. నాకు పాతతరం నటుల ప్రతిభ సరీగ్గా తెలీదు. ఏ అంచనా లేకుండా ఒక సినిమా చూస్తాను. ఆ సినిమా బాగా నచ్చుతుంది. నటీనటులు ఇంకా బాగా నచ్చుతారు. అంచేత ఆ సినిమానీ. నటుల్నీ ఆకాశానికెత్తేస్తూ రాసేస్తున్నానా? అని. చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి మొదలైన నటుల విషయంలో నాలో ఈ surprise element  పనిచేసిందా?

కావున నేను ఇకనుండి ఏ నటుడికైనా మార్కులు వేసేప్పుడు పిసినిగొట్టుగా వ్యవహరించవలసిందేనని నిర్ణయించుకున్నాను. షావుకారు సినిమా నచ్చింది. చెంగయ్య పాత్రధారణ చాలా బాగా నచ్చింది. కానీ.. ఇకపై ఇట్లాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలనే సంగతీ గుర్తుంది. అంచేత సినిమాలో గోవిందరాజుల సుబ్బారావు అభినయాన్ని లెక్కల మేస్టర్లా గుచ్చిగుచ్చి చూస్తూ.. చూశాను.

అయితే 'షావుకారు'ని ఇలా చూడ్డం వల్ల నాకు ఒక నష్టం కలిగింది. చెంగయ్య సుబ్బులుపై వాత్సల్యం కురిపిస్తున్నప్పుడు (సుబ్బులు నా బంగారుకొండ).. రామయ్య ఖచ్చితమైన సాక్ష్యం చెప్పి చెంగయ్య పరువు తీసినప్పుడు (ఏం? ఆమాత్రం నాకు మాట సాయం చెయ్యడా?).. నారాయణ చెంగయ్యపై నోరు పారేసుకుంటున్నప్పుడు (నా కళ్ళ ముందే పెరిగాడు.. వెధవకి ఎంత అహంకారం?).. చెంగయ్య కలిగిన భావాలన్నీ నాక్కూడా కలిగినయ్.

కొడుకు తనని అసహ్యించుకున్నప్పుడు.. 'అనవసరంగా పట్టుదలకి పోయి స్నేహితుని కుటుంబాన్ని కష్టాలు పెట్టానే' అనే అపరాధ భావంతో చెంగయ్య దహించుకుపోతున్నప్పుడు నాక్కూడా బాధగా అనిపించింది. అందుకే ఆయన రామి దగ్గర భోరున విలపించినప్పుడు నాక్కూడా కన్నీరు ఆగలేదు (నేనెందుకిలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాను? ఇందర్ని ఏడిపించి ఏం బావుకుందామని? ఏమిటీ నాకీ ఖర్మ?).


ఇలా సినిమా అంతా నన్ను తనతో పాటు ప్రతి సన్నివేశంలో చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఎంతో ఉద్వేగానికి గురిచేశాడు గోవిందరాజుల సుబ్బారావు. ఒక ప్రేక్షకునికి ఇంత అనుభూతిని కలిగించడం ఒక గొప్ప నటుడి ప్రతిభకి తార్కాణం అని అనుకుంటున్నాను. కావున షావుకారు చెంగయ్య పాత్రపోషణ తెలుగు సినిమా చరిత్రలో గొప్ప నటనకి కొండగుర్తుగా భావిస్తున్నాను.

ఇప్పుడు నన్ను నేను ఒక ప్రశ్న వేసుకుంటున్నాను. నాకు పల్లెటూరు వాతావరణం తెలీదు. జీవితంలో ఒక్కరోజు కూడా పల్లెజీవితాన్ని అనుభవించి ఎరుగను. వ్యవసాయం తెలీదు. వడ్డీవ్యాపారం అంటే అసలే తెలీదు. అయినా నేను చెంగయ్యతో పూర్తిగా empathize అయ్యాను. (సరీగ్గా ఇలాగే ఫీలవుతూ గుండమ్మ తరఫున 'సైకోఎనాలిసిస్ ఆఫ్ గుండమ్మ' రాశాను). కారణం? నేను ప్రధానపాత్రతో identify అయ్యేలా చెయ్యటం అనేది దర్శకుడి ప్రతిభ, నటుడి గొప్పదనం. మంచి సినిమా అంటే ఇలాగే ఉంటుంది.. ఉండాలి కూడా.

ఒక మంచినటుడికి మంచివాడిగానో, చెడ్డవాడిగానో నటించడం పెద్ద కష్టం కాకపోవచ్చు (నటన తెలీనివాడికి ఏదైనా కష్టమే). అటు మంచీ కాకుండా, ఇటు చెడూ కాకుండా.. సందర్భాన్ని బట్టి react అయ్యే 'మామూలు మనిషి'గా different shades చూపిస్తూ నటించాలంటే మాత్రం అసాధారణ ప్రతిభ కావాలి. ఈ ప్రతిభ గోవిందరాజుల సుబ్బారావు దగ్గర పుష్కలంగా ఉందని తెలుస్తుంది.

ఈ సినిమా చూసిన తరవాత నాకనిపించింది.. గోవిందరాజుల సుబ్బారావు నటన ఒక అద్భుతమైన పూలతోట వంటిది. ఈ తోటకి అనేక ద్వారాలు ఉన్నాయి. కన్యాశుల్కం ఒక ద్వారం.. షావుకారు ఇంకో ద్వారం. ఆ తోటలో ఒక్కో ద్వారం నుండి వెళ్తే ఒక్కోరకమైన పూలు.. అన్నిరకాల పూలూ చూడ్డానికే కాదు.. ఆఘ్రూణించడానిక్కూడా భేషుగ్గా ఉంటాయి.

సందేహం లేదు - ఈ గోవిందరాజుల సుబ్బారావు గొప్ప నటయోధుడు. ఆయన అసమాన నటనా ప్రతిభకి గులామునైపోయి సలాము చేస్తున్నాను.

(photos courtesy : Google)

35 comments:

  1. డాకటారు బాబు గారు,

    గోవింద రాజుల వారిని పొగడందే మీకు సినిమా రివ్యు పూర్తి కాదనుకుంటా !జేకే
    షావుకారు లో రావు గారిది రియల్లీ సూపెర్బ్ పెర్ఫార్మెన్స్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi ji,

      గోవిందరాజుల వారిని పొగడటానికి ఇంకో కారణం కూడా ఉందిలేండి.. ఆయన వైద్యుడు కూడా. అదీ సంగతి!

      Delete
    2. ఆయనా దాక్టరే అనె కారణం కూడా కలిస్తే మీ తీర్పుకి చిల్లు పడినట్టే గదా. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు కొత్తగా జడ్గెమెంట్లు ఇవ్వడం మొదలెడితే ఇలాగే ఉంటుంది మరి :-)

      Delete
    3. @harisbabu,

      మీకు నా పోస్ట్ అర్ధమైనట్లు లేదు. just ignore it.

      Delete
    4. డాక్టరు గారూ, పోస్టు బాగుంది, అర్ధమైంది, కామెంటు సర్దాగా వేశాను స్మైలీ చూడలేదా సార్.

      Delete

  2. Meeru inka Guna Sundari Katha cinema chooda leda? Andulo meeku inko moodu nalugu konala Govindarajula Subbarao garu kanabadataaru.

    ReplyDelete
    Replies
    1. @neelima,

      వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      మీరు epalaka.com సహాయంతో తెలుగు లిపిలో రాయొచ్చు. ప్రయత్నించండి.

      Delete
    2. ధన్యవాదలు రమణ గారు. ఈమధ్య మీ బ్లాగ్లన్నీ చదువుతున్నాను. గొవిందరజులవారి నటన నేను మొదట గుణసుందరి కథ సినిమా లో చూసాను. కేవలం ఆయన కొసమే ఆ సినిమా ఇప్పటికి ఒక 25 సార్లు చూసి వుంటా. మీరు కూడా ఒక సారి చూసి ఆ సినిమా గురించి రాయాలని నా విన్నపం.

      Delete
  3. "షావుకారు" చెంగయ్యను చాలా ఉన్నతంగా ఆవిష్కరించారు. నిజంగా అద్భుతంగా రాశారు. పిల్లలు, పుస్తకాలతో పాటు, ఆణిముత్యాల్లాంటి పాత సినిమాల్ని ప్రేమించేవాళ్లు కూడా ఎప్పుడూ మంచివాళ్లే... అని అనొచ్చంటారా?! :)

    ReplyDelete
    Replies
    1. నాగరాజ్ గారు,

      థాంక్యూ.

      (ఇటువంటి పోస్టులు రాసేప్పుడు కొంచెం శ్రద్ధ పెడతాను.)

      ఇంకో విషయం. మన తెలుగు పాత్రల్ని Freudian psychodynamic principles తో అంచనా వెయ్యబూనడం ఎంతమేరకు సరైనది? నాకీ సందేహం ఉంది కాబట్టే సైకోఎనాలిసిస్ ఆఫ్ గుండమ్మ రాసిన యేడాది దాకా ఈ పోస్ట్ రాయలేదు.

      Delete
    2. మీరు యే మాత్రమూ సందేహించాల్సిన అవసరం లేదు. షేకెస్పియర్నాటకాల లోని పాత్రల గురించిన వ్యఖ్యానాలు నేను చాలా కాలం క్రితమే చదివాను. పాత్రలు అలా సజీవంగా రూపు దిద్దుకున్నప్పుడు అందుకు తగినది శాస్త్ర పరిజ్ఞానం ఉన్న మీలాంటి వళ్ళు మాత్రమే అందుకు సమర్ధులు. గుండమ్మ అగురించిన అనాలిసిస్ నాకు నచ్చింది. ఇది కూడా.

      Delete
    3. రమణ గారు,
      ఫ్రాయిడ్ గురించి మాలాంటి నార్మల్ బ్లాగర్లందరికంటే, ఒక సైకియాట్రిస్టుగా మీకే బాగా తెలిసే అవకాశముంటుంది. హిస్టీరియా; కాన్షియస్ & సబ్ కాన్షియస్ మైండ్; ఇడ్, ఈగో, సూపర్ ఈగో... ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి సైకియాట్రీకి గొప్ప కాంట్రిబ్యూషన్స్ చేసిన వైద్యునిగా, ఫాదర్ ఆఫ్ మోడ్రన్ సైకియాట్రీగా ఫ్రాయిడ్ ను ప్రపంచమే అంగీకరించింది. మీ కామెంటులో ఫ్రాయిడ్ ప్రిన్సిపుల్స్ ద్వారా తెలుగు పాత్రల్ని అంచనా వేయబూనడం సరైందేనా అని రాశారు. రెండు కండీషన్స్ అప్లై అయితే అది సరైందేననేది నా అభిప్రాయం. ఒకటి- ఫ్రాయిడన్ సైకాలజీ అనేది సైంటిఫిక్ మెథడాలజీ అయ్యుండాలి. రెండోది- మన తెలుగు జాతి కూడా ఈ భూగ్రహానికే చెందిన మానవాళిలో అంతర్భాగమే అయ్యుండాలి. ఈ రెండు నిజమైతే ఫ్రాయిడ్ ను తెలుగు పాత్రలను అంచనా వేయడానికి భేషుగ్గా వాడుకోవచ్చేమో :)

      Delete
  4. అప్పటి షావుకారునే ఈమధ్య బిజినెస్ మేన్ గా రీమేక్ చేసారు డాక్టరుగారూ! మీకు తెలీదా :-)

    ReplyDelete
  5. గోవిందరాజుల సుబ్బారావు నటన ఒక అద్భుతమైన పూలతోట వంటిది. ఈ తోటకి అనేక ద్వారాలు ఉన్నాయి. కన్యాశుల్కం ఒక ద్వారం.. షావుకారు ఇంకో ద్వారం. ఆ తోటలో ఒక్కో ద్వారం నుండి వెళ్తే ఒక్కోరకమైన పూలు.. అన్నిరకాల పూలూ చూడ్డానికే కాదు.. ఆఘ్రూణించడానిక్కూడా భేషుగ్గా ఉంటాయి.
    -------------------------------------------
    ఈ నాలుగు వాక్యాలూ ఒక ఎత్తూ మిగతా దంతా ఒక ఎత్తూ. మీలాగా మెచ్చుకుంటూ రెండు వాక్యాలు వ్రాయలేక పోతున్నాను. ఆయన నటనను చూసి ఆనందించినా, ఆయన నాకు చిన్నప్పుడు మందిచ్చి రక్షించారు కాబట్టి డాక్టరు గానే ఆయన్ని చూడటం నాకిష్టం.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ లక్కరాజు గారు.

      మీ డాక్టరుగారి ఇంటిపేరు గూర్చి చిన్న సమాచారం.

      నా ఆత్మీయ మిత్రుడి ఇంటిపేరు 'గోవిందరాజు'. మావాడి వాదన 'గోవిందరాజుల' ఇంటిపేరు తప్పు. ఆ extra 'ల' ఉండరాదు. మీ ఇంటిపేరులో కూడా 'రాజు' ఉంది కాబట్టి తెలుసుకోడానికి ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నాను.

      Delete
  6. ఐదో ఫోటో చూడండి. ఒకరిని మించినవారొకరు. నాగయ్య వంతయ్యింది, గోవిందరాజులవారి వంతూ అయ్యింది. ఇక నెక్స్ట్ పై వారిలో ఎవరివంతో...

    ReplyDelete
    Replies
    1. పూర్ణప్రజ్ఞాభారతి గారు,

      ప్రస్తుతానికైతే ఎవరూ లేరు.

      (యోగి వేమన, గుండమ్మ, షావుకారు చెంగయ్యలు నన్ను వెంటాడారు, వేధించారు. వారి గూర్చి పోస్ట్ రాసేదాకా నన్ను వదల్లేదు. ఒకరకంగా 'కూలిపని' చేసినట్లుగా ఈ పోస్టులు రాసి నా బరువు తగ్గించుకున్నాను.)

      Delete
  7. ఎన్నో సార్లు ఈ సినిమా పై నా ఇష్టం వ్రాసి బ్లాగులో పెడదామని అనుకున్నాను కానీ, ఎప్పటికప్పుడు సినిమా చూసి సంతోషపడి ఊరుకుంటాను. పైగా మీలాగా సైకోఎనాలసిస్ చెయ్యడం అంత తేలిక కాదు. చాలా బాగా రాశారు.
    నేను చాలా సార్లు చూసిన తెలుగు సినిమా 'షావుకారు.'
    చెంగయ్య, సుబ్బులు మధ్య ఉన్న స్నేహం ప్రేక్షకుడికి ఎంతో సంతృప్తినిస్తుంది. ఓ సారి సుబ్బులు అన్నం వడ్డిస్తుంటే చెంగయ్య " చాల్లేవే" అంటాడు. అసలా మాట కోసమే నేనా సీన్ చాలా సార్లు చూశాను. ఒక మాట ఏముంటుంది అని మీరనుకోవచ్చు. ఆ అమ్మాయి మీద ఆప్యాయతంతా ఆ చాల్లేవే లో కూర్చేసి అన్నారా అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ పరిస్థితులవల్ల దూరమైనందుకు దిగులు పుడుతుంది.

    ఒక్కో సినిమా చూస్తుంటే, పాత్ర చిత్రీకరణ మీద దర్శకుడు పెట్టిన శ్రద్ధ తెలుస్తూ ఉంటుంది. అది తెలుస్తున్న కొద్ది మనం మురిసిపోతుంటాం. ఉదా: తాకట్టు వ్యాపారం చేసే బంగారయ్య.

    షావుకారు, పట్నం నుండి వచ్చి నిరాశా నిస్పృహలతో వరండాలో కూర్చుంటాడు. పక్కనే రంగడు. కొడుకు జైలు పాలయ్యాడు. స్నేహితుడి కుటుంబంతో సంబంధాలు చెడిపోయాయి. దీనంతటికీ కారణమైన రంగడి మీద కోపం రాజుకుంటుంటూ ఉన్న సమయంలో బంగారయ్య వస్తాడు. పట్నం వెళ్ళబోయే ముందు షావుకారుకు తెలియకుండా ఓ వంద తీసుకుంటాడేమో. అంతటి గంభీరం గా ఉన్న పరిస్థితిలోనూ 'మొన్న నా దగ్గర తీసుకున్న వంద 'అయ్యగారికిచ్చావా రంగన్నా' అని అయ్యగారిముందే అడుగుతూనే, 'అయ్యా ఆ వందా పద్దులో రాయమంటారా?' అని షావుకారిని అడుగుతాడు. ఎటూ రంగన్న స్వంతంగా వాడేసుకుని వుంటాడని తెలుసు. మరి అలా అడగకపోతే ఆ వందా ఇతని చేతికొచ్చేదెలా
    రౌడీ రంగడు కసురుకుంటే, ' అయ్యగారిని పలకరిద్దామని వచ్చా,డబ్బేడికి పోతుంది రంగన్నా.' అంటాడు.
    ఆ డబ్బు జాగ్రత్త, ఆ లౌక్యం ఒలకబోయడం అబ్బబ్బా ఒక పాత్ర ప్రవర్తన అంత చక్కగా అంత శ్రద్ధగా, తీరిచి దిద్దిన ఎల్వీ ప్రసాద్ గార్ని తలుచుకుని 'అబ్బ ఏం చేశారండీ' అనుకోకుండా ఉండలేను.

    రామి, రౌడీ రంగణ్ణి కూపీ లాగడం కోసమని అతన్ని ఆశపెట్టి ఇంటికి తీసుకెళ్తుంది. ఎంతో ఆశతో మంచం మీద కూర్చోబోతే వారించి బల్ల మీద కూర్చోబెట్టి తేగలు తింటావా అని అడుగుతుంది. అతను విసుక్కుంటూ నా మొహం తేగలు అంటాడు. అతని డిజప్పాయింట్మెంట్ అంతా ఆ డైలాగ్ లో ప్రతిధ్వనిస్తుంది. అలా ప్రతి చిన్న విషయాన్నీ డిజైన్ చేసిన పద్ధతికి ఆశ్చర్యపడుతూ ఎంత బాగా చేశారీ సినిమా అనిపిస్తుంది.

    రామారావు- జానకి . వాళ్ళిద్దరూ ఎప్పుడూ డైరెక్ట్ గా మాట్లాడుకున్నట్లు కనబడదు. కానీ ఇద్దరి మధ్యా లేత రొమాన్స్ నడుస్తూ ఉంటుంది కానీ. ఓ సారి రౌడి రంగడితో పోట్లాడుతుంటే రామారావుని అప్రయత్నంగా చెయ్యి పట్టి ఆపుతుంది. ఆమె అలా ఆపడం సగటు ప్రేక్షకుడికి అంటే నాకు సంతోషాన్ని కలిగించింది.
    ఎంతో సహజంగా ఉంటుంది.
    అన్నింటినీ మించి క్లైమాక్స్ సీన్. నేను చూసిన సినిమాల్లో అన్నింటికన్నా నచ్చిన క్లైమాక్స్ అంటే షావుకారే .
    చాలా జాగ్రత్తగా తయారుచేసిన హారం లాంటిది ఈ సినిమా.
    రకరకాల చక్కటి రాళ్ళ అందంగా అమర్చి శ్రద్ధగా చేసిన హారాన్ని ఎంతో సేపు చూస్తాము. హారం పైనే కాదు, ఎంత కష్టపడి చేసి ఉంటాడోనని దాన్ని చేసిన వారిపైకూడా ఇష్టమూ, అభిమానం కలుగుతుంది. అలాగే సినిమా చూస్తున్నంత సేపూ ఎల్వి ప్రసాద్ గారి మీద అభిమానం, ఇష్టం కలుగుతుంది.

    ReplyDelete
    Replies
    1. @Chandu S,

      అమ్మయ్య! నిన్నట్నుండి ఒక 'షావుకారు అభిమాని' కామెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. థాంక్యూ!

      నాకు నేను చెంగయ్యకి పరిమితం చేసుకున్నాను కావున సినిమా గూర్చి రాయడం కుదర్లేదు.

      చక్కటి వ్యాఖ్య రాశారు. భవిష్యత్తులో 'షావుకారు' గూర్చి సమగ్రంగా ఒక పోస్ట్ రాయమని నా విన్నపం.

      Delete
    2. రమణ గారు, Chandu S గారు...
      నిజానికి ఈ సినిమా గురించి అక్కడక్కడ వినటం, అప్పుడప్పుడు ఒకటి అరా పాటలు చూట్టమే తప్ప పూర్తిగా చూసింది లేదు. ఇక్కడ మీ ఇద్దరి వ్యూస్ చదివాక ఈ చిత్రరాజాన్ని చూడక తప్పలేదు. ఈ పోస్టు, దానిపై స్పందనగా రాసిన కామెంట్లు చదివి, చూట్టం చేత షావుకారు నిజంగా హృదయానికి మరింత హత్తుకుంది. సినిమా ఆద్యంతం ఎక్కడా బిగి (టెంపో) సడలకుండా కథకు తగ్గ కథనాన్ని అల్లుకోవడం నిజంగా ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతం. సినిమా మొదటి గంట దాకా వాహ్... అనిపించే ఛమక్కులతో, వ్యంగ్యంతో, హాస్యంతో సెలయేటిపై వీచే పైరగాలిలా గిరికీలు కొడుతూ అలా సాగిపోతుంది. ఆపై మెల్లగా సినిమా గంభీరంగా తయారై క్లైమాక్స్ దాకా మనల్ని పట్టి లాక్కెళుతుంది. సినిమాలో ఎక్కడా ఒక్క పాత్రగానీ, ఒక్క డైలాగు గానీ వృథాగా పెట్టారనిపించదు. పాత్రధారులు కూడా ఎంత సహజంగా, అత్యద్భుతంగా నటించారో! ముఖ్యంగా చెంగయ్య, సుబ్బులు, రంగడు, నారాయణ, రామయ్య, కనకం ఎంతగా ఒదిగిపోయారో పాత్రల్లో. సినిమా సాంతం పాత్రలే తప్ప, పాత్రధారులు కనిపించకపోవడం అబ్బురపరుస్తుంది. ఎల్వీ ప్రసాద్ గారి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సింప్లీ సూపర్బ్ & ఎక్సలెంట్! చక్రపాణి గారి డైలాగులు మొదటి అర్ధభాగంలో హాయిగా చెక్కిలిగిలి పెడితే, ఆ తర్వాత భారంగా మనసుకు హత్తకుంటాయి. ముఖ్యంగా ‘‘ధనరుణం తీరిపోయింది గానీ, దయారుణం ఇంకా తీరిపోలేదు, బావా’’ అన్న డైలాగ్. ఇదే డైలాగుతో సినిమా ఎండ్ అవడం చాలా బాగా అనిపిస్తుంది. ఇక, పోరా పోలయ్, పోరా గబ్బిలాయ్ మొగమోడా... అన్న ఛలోక్తులు చెవులకింపుగా ఎంత బావున్నాయో! అలాగే, సముద్రాల సాహిత్యం, ఘంటసాల సంగీతం కూడా ఎంత చక్కగా కుదిరాయో. ఎన్టీఆర్, జానకిలపై చిత్రించిన పలుకరాదటే చిలుకా, ఏమనెనే... చిన్నారి ఏమనెనే- అనే రెండు పాటలు ఆహ్లాదంగా సాగిపోతాయ్. నాకు బాగా నచ్చిన పాటలు భైరాగిపై (ఈ పాత్రకు వేరే పేరు పెట్టుంటే బావుండేదేమో) చిత్రించిన... ఇంతేనన్నా నిజమింతేనన్నా; మారిపోవురా కాలం.. మారుట దానికి సహజం- అనే రెండు పాటలు ఎంత డెప్తుగా, ఫిలసాఫికల్ గా ఉన్నాయో. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు రామయ్య-నారాయణల మధ్య, వాళ్లింట్లో సన్నివేశాలు చాలా హృద్యంగా, రసస్ఫోరకంగా ఉండి కంటతడి పెట్టిస్తాయి. ఆ సన్నివేశాల్లో సినిమా నాకు మరింత బాగా నచ్చింది. కథ, కథనాన్నే నమ్ముకుని ’’షావుకారు‘‘ సినిమాని చిరస్థాయిగా నిలిచిపోయే ఆణిముత్యంగా తీర్చిదిద్దిన ఎల్వీ ప్రసాద్ గారికి హ్యట్సాఫ్ అని చెప్పడం చాలా చిన్నమాటేమో! థాంక్యూ!!

      Delete
    3. నాగరాజ్ గారు,

      పోస్ట్ చదివిన తరవాత మళ్ళీ సినిమా చూసినందుకు అభినందనలు. సినిమాని చక్కగా రివ్యూ చేశారు. మీర్రాసిన పాయింట్లతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

      Delete
  8. Can you review the movie Chakrapani. I really like the chemistry between Bhanumati and Suryakantham.

    ReplyDelete
    Replies
    1. @Sunitha,

      I'll try.

      (but, i don't write reviews. I write my view / opinion only.)

      Delete
    2. Sorry did not mean to say movie review but your views and the way you write which make an interesting read.

      Delete
  9. You are right. It's not a movie review per se. It's your view and the way you write make it such an interesting read.

    ReplyDelete
  10. "ఇప్పుడు నన్ను నేను ఒక ప్రశ్న వేసుకుంటున్నాను. నాకు పల్లెటూరు వాతావరణం తెలీదు. జీవితంలో ఒక్కరోజు కూడా పల్లెజీవితాన్ని అనుభవించి ఎరుగను. వ్యవసాయం తెలీదు. వడ్డీవ్యాపారం అంటే అసలే తెలీదు. అయినా నేను చెంగయ్యతో పూర్తిగా ఎంపతైస్ అయ్యాను."
    నేను ఎన్నడు పసలపూడి వెళ్లలేదు కానీ, వంశీ గారి మా పసలపూడి కధలు చదివినప్పుడు కూడా నాకు ఇలాంటి అనుభవమే కలిగింది. చదవడం మొదలుపెట్టిన కొన్ని క్షణాల్లోనే మనం ఆ కాలంలోకి, ఆ పసలపూడి గ్రామంలోకి పరకాయ ప్రవేశం చేస్తాము.

    ReplyDelete
    Replies
    1. అవునా!

      నాకు 'అమరావతి కథలు' నచ్చాయి.

      'పసలపూడి కథలు' కొన్ని చదివాను.

      Delete
  11. కాని నేటి తరం రాజకీయ నాయకుల నటనా కౌశల్యం ముందు మరియు స్వలాభ కేంద్రిత రాక్షస క్రీడాచతురత ముందు మీ త్యాగయ్య మరియు వేమన అర్ధ్రతా బరిత మరియు గొవిందరాజుల పరకాయ ప్రవేశ ప్రతిభా పాటవాలు యేపాటివి.

    ఒకరు తన అధికార కాంక్షతొ ఒక జాతిని నిలువున చీల్చ గలిగితే...
    ఇంకొకరు చీలిన ప్రజలలొ అధికారన్ని వెతుకుంటున్నారు...

    ఛ.. నేను ఇలాంటి వాల్ల మధ్యన బ్రతుకుతుంధి.....

    ReplyDelete
    Replies
    1. విడిపోయింది రాష్ట్రమే కదండీ?

      (రాజకీయాలు అలాగే ఉంటాయి. take it easy.)

      Delete
    2. మీకు కరెంట్ లేదంటగదండీ?

      Delete
    3. @Bullabbai,

      అవును. సామాన్యులు అల్లాడిపోతున్నారు.

      నీళ్ళు వాడకుండా కాలకృత్యాలు తీర్చుకుందాం. ఆ గబ్బు ఢిల్లీ దాకా వెల్టుంది. అది భరించలేక సోనియాగాంధీ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది. ఇది జోక్ కాదు. ఇక్కడ చాలామంది గట్టిగా నమ్ముతున్న నిజం.

      Delete
  12. మీ పుణ్యమా అని షావుకారు సినీమా యూ ట్యూబ్ లో మళ్ళా చూశాను. యాభై ఏళ్ళ క్రిందట మొదట తాడేపల్లి గూడెంలో చూసినప్పుడూ ఇప్పుడూ నా ఆలోచనలలో ఏమన్నా తేడా ఉందేమోనని. లేదుగాక లేదు. షావుకారు జానకి లాంటి పెళ్ళా మొస్తే ఎంత బాగుంటుంది!.

    ReplyDelete
    Replies
    1. Rao S Lakkaraju గారు,

      సావిత్రి, జానకి వంటి భార్యలు కేవలం సినిమాల్లో మాత్రమే కనిపిస్తారు.

      (తెలుగు సినిమా బొత్తిగా అసహజంగా ఉంటుంది.)

      Delete
    2. అమ్మో అమ్మో ఎన్ని సైకియాట్రీ పదాలు, ఒక్క విశ్లేషణ కే ఇన్ని అయితే, మీతో సినిమా చూసే మీ ఇంటివాళ్ళ పాట్లు ఎలా ఉంటాయో కదా!!..

      నా పేరు
      సీతారామం

      Delete

comments will be moderated, will take sometime to appear.