Wednesday 18 September 2013

ఎండే డొక్కల ఘోష



మిత్రులారా! గత నెల రోజులుగా సీమాంధ్ర వార్తాపత్రికలు (ఇప్పుడు పత్రికలు ప్రాంతాల వారిగా ఎడిషన్లు వేస్తున్నాయి), సీమాంధ్ర చానెళ్ళు (ఇక్కడ cable network వాళ్ళు తెలంగాణా వార్తలు చూపించే టీవీ చానెళ్ళని తీసేశారు) చూసిన మీదట ఎంతో విజ్ఞానవంతుడినయ్యాను.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాదులో చార్మినార్, గోల్కొండ మాత్రమే ఉండేవి. ఆ ఊరంతా రాళ్ళూరప్పలు, కొండలు గుట్టలు. అట్లాంటి దిక్కుమాలిన హైదరాబాదును మన సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు అహోరాత్రులు కష్టించి, శ్రమించి (తమతమ నియోజక వర్గాల్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ) ఎంతగానో అభివృద్ధి చేశారు.

మనం సినిమా స్టూడియోలు కట్టాం, IMAX సినిమా హాళ్ళు కట్టాం, నెక్లెస్ రోడ్డు నిర్మించాం.. ఇలా ఎన్నని చెప్పను? తినటానికి తిండి కూడా లేని తెలంగాణా వాళ్లకి KFC రుచి కూడా చూపించాం. తెలంగాణా నాయకులు కృతజ్ఞత లేనివారు. అందుకే అభివృద్ధి అంతా అయ్యేదాకా వేచి చూసి.. ఇవ్వాళ మనని వెళ్లిపొమ్మంటున్నారు. ఎంత అన్యాయం! ఇలా చూస్తూ ఊరుకోవలసిందేనా? కుదరదు. కుదరదు కాక కుదరదు. నేను సైతం.. నేను సైతం సమైక్యాంధ్రకి సమిధ నౌతాను.

ఇవ్వాళ మా ఊళ్ళో 'మండే గుండెల ఘోష' ఏర్పాటయ్యింది. మండే గుండె అంటే హార్ట్ ఎటాక్ అనుకునేరు! కాదు.. కోపంతో గుండె మండుతుంది అని అర్ధం. సమైక్యాంధ్ర కోసం మొక్కవోని దీక్షతో పోరాడుతున్న, అలుపెరుగని ప్రజానాయకుడు పరకాల ప్రభాకర్. ఆయన మన తెలుగు వాడవటం మనం చేసుకున్న అదృష్టం. ఇవ్వాళ సభకి ఆయన కూడా వస్తున్నాట్ట. అంతటి గొప్పనాయకుణ్ణి దర్శించుకునే భాగ్యం జీవితంలో నాకింత తొందరగా వస్తుందనుకోలేదు. ఏమి నా భాగ్యము!

'తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది' అని పాడుకుంటూ.. ఆత్రంగా, హడావుడిగా, వడివడిగా మండే గుండెల ఘోష సభ వద్దకి వెళ్లాను. అక్కడ విపరీతంగా జనం ఉన్నారు. వేదిక మరీ చిన్నదిగా ఉంది. కళ్ళజోడు మర్చిపోయ్యాను. సరీగ్గా కనపడి చావట్లేదు. కొద్దిగా ముందుకెళ్తాను. ఇక్కడ జనాలందరూ బక్కగా, పీలగా ఉన్నారు. పాపం! హైదరాబాదు పోతుందేమోనన్న బాధలో వీరంతా ఆహారం మానేసినట్లున్నారు.

తమ్ముళ్ళూ! చెల్లెళ్ళూ! మీ సమైక్య స్పూర్తికి నా కడుపు తరుక్కుపోతుంది. మీ కోరిక నెరవేరుతుంది. మీ కష్టాలు ఈడేరుతాయి. ఏడవకండేవకండి.. చింత యేల? మన చెంత ముఖ్యమంత్రి ఉన్నాడు, గజల్ శ్రీనివాస్ ఉన్నాడు, పరకాల ప్రభాకర్ ఉన్నాడు, అశోక్ బాబు ఉన్నాడు.

వేదిక ఇంకా సరీగ్గా కనపడి ఛావట్లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్తాను. అబ్బా! ఏమిటీ బీద వాసన? ఛీ.. ఛీ.. ఇదేదో ఆకలి కంపులా ఉందే! అందుకే చాలా రోతగా ఉంది. ఎంత హైదరాబాదు కోసం అయినా.. ఇంత దరిద్రపుగొట్టు వాతావరణాన్ని తట్టుకోడం నా వల్ల కావట్లేదు. వేదికపై ఎవడో బక్కచిక్కిన నాయకుడు ఆవేశంగా ఉపన్యాసం చెబుతున్నాడు. వేదికపై నా అభిమాన నాయకుడు పరకాల ప్రభాకర్ లేడేమిటి? కొంపదీసి ఆయన ఉపన్యాసం చెప్పేసి వెళ్ళిపోయాడా ఏమిటి? అయ్యో! ఏమి నా దౌర్భాగ్యం!

అప్పుడు పడింది నా దృష్టి వేదికపైనున్న banner పై. ఆ banner పై 'మండే గుండెల ఘోష' అని లేదు. 'ఎండే డొక్కల ఘోష' అని రాసి ఉంది. సభ పేరు మార్చారా? ఖర్మ.. ఖర్మ. అడ్రెస్ సరీగ్గా తెలుసుకోకుండా వస్తే ఇదే తంటా.

పక్కనున్న చింకిపాతరగాణ్ని అడిగాను.

"ఇది సమైక్యాంధ్ర సభ కాదా?"

వాడు నావైపు నీరసంగా చూశాడు.

"బాబూ! అన్నం తిని చాల్రోజులయ్యింది. నీరసంతో చచ్చేట్లున్నాను. ప్రభుత్వానికి మా ఘోష వినిపించరూ?"

"ఆ సంగతి తర్వాత చూద్దాంలే. ముందు నేనడిగిందానికి సమాధానం చెప్పు. ఇది సమైక్యాంధ్ర సభ కాదా?" మళ్ళీ అడిగాను.

"కాదు బాబు! కాదు. ఇది 'ఎండే డొక్కల ఘోష' సభ. మా సభలో రైతులున్నారు. రైతు కూలీలున్నారు. ఈ సభని మేం సంవత్సరం పొడుగూతా జరుపుకుంటూనే ఉంటాం. కాకపొతే మీడియావాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు." అన్నాడు.

"సర్లే! మీరెందుకు సభ జరుపుకుంటే నాకెందుకు? ఇంతకీ గుండె మంట ఘోష సభ ఎక్కడ?" విసుగ్గా అడిగాను.

నేనడిగిన ప్రశ్న ఆ బక్క వెధవకి నచ్చినట్లు లేదు. కొద్దిసేపు ఆలోచించాడు. ఆ తరవాత నీరసంగా నవ్వాడు.

"బాబూ! నా కుటుంబం వీధిన పడ్డానికి కారణం ఎవరనుకుంటున్నావు? ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు, డాక్టర్లు. వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. ఏ యేటికా యేడు రెక్కలు ముక్కలవుతున్నాయే గానీ రూపాయి రాబడి లేదు. రైతు పని పూర్తిగా అయిపొయింది బాబు. అందుకే నా కొడుక్కి నా గతి పట్టకూడదనుకున్నాను. అప్పు చేసి మరీ వాణ్ని ప్రైవేటు స్కూల్లో చదివించాను. స్కూలువాళ్ళు పరీక్షలనీ, పుస్తకాలనీ వాయిదాల పద్ధతిలో వేలకివేలు వసూలు చేశారు బాబు."

ఎవడు వీడు? కొంపదీసి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దెబ్బ తియ్యడానికి కోదండరాం పంపించిన గూఢచారి కాదు గదా?

చింకిపాతర చెబుతూనే ఉంది.

"నాది పాడు జన్మ బాబు! నాలాంటోడు పుట్టినప్పుడే చావాల. దరిద్రం వదిలిపోద్ది. పోయినేడాది నా కొడుక్కి జరం వచ్చింది. అదేదో డెంగూ జరమన్నారు. బిల్లు లక్ష రూపాయలైంది. ఉన్న ఒక్క ఎకరవూ అయినకాడికి అమ్మేసి ఆస్పత్రి ఫీజులు కట్టా. ఒక్క ఎయ్యి రూపాయలైనా తగ్గించమని డాక్టర్ల కాళ్ళ మీద పడ్డా. కసాయోడికైనా జాలి గుండె ఉంటదేమో గానీ.. డాక్టర్లకి ఉండదని అర్ధమైంది. అన్నీ పొయ్యి ఇదిగో ఇలా ఒట్టి మనుషులం మిగిలాం బాబు!" అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.

వీడెవడో తలతిక్క వెధవలా ఉన్నాడు. నేనదిగిందేమిటి? వీడు చెప్పేదేమిటి?

"సమైక్యాంధ్ర సభ ఎక్కడ?" అసహనంగా, తీవ్రంగా అడిగాను.

ఆతను హఠాత్తుగా ఎర్రటి కళ్ళతో నన్ను చూశాడు.

"నా కొడుకు చదివిన స్కూల్ ఓనరు, అతని స్నేహితులైన ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు.. నా కొడుక్కి వైద్యం చేసిన డాక్టర్లు ఆ పక్క వీధిలో పొట్టి శ్రీరాములు బొమ్మ పక్కన సభ పెట్టుకున్నారు. అదేదో గుండె మంటంట. అటుగా పో!" ఈసడించుకున్నట్లుగా అన్నాడు వాడు.

నాక్కోపమొచ్చింది. గాలొస్తె ఎగిరిపోయ్యేట్లు ఉన్నాడు. వీడికెంత రోషం! దౌర్భాగ్యుడు. అందుకే తినడానికి తిండి కూడా లేకుండా ఛస్తున్నాడు. అయినా ఈ అలగా వెధవని పట్టించుకునేదెవరు?

నేను నా 'మండే గుండెల ఘోష సభ' కోసం పరుగుపరుగున బయల్దేరాను.. ఆలస్యమైతే నా అభిమాన నాయకుడు పరకాల ప్రభాకర్ ఉపన్యాసం తప్పిపోతానేమోనన్న ఆదుర్దాతో!

(picture courtesy : Google)

21 comments:

  1. డాక్టరు గారూ,

    సమైక్యాంధ్ర ఉద్యమం ఊసు ఎక్కడా దొరకక ఈమధ్యన ఈనాడు పేపరు వారు ఎండే డొక్కల ఘోష సభల ఫోటోలు కూడా సమైక్యాంధ్ర ఉద్యమం అకౌంట్లో కలిపి వాడేసుకుంటున్నారు.

    http://kotiratanalu.blogspot.in/2013/09/blog-post_5.html

    ReplyDelete
  2. //నేను నా 'మండే గుండెల ఘోష సభ' కోసం పరుగుపరుగున బయల్దేరాను.. ఆలస్యమైతే నా అభిమాన నాయకుడు పరకాల ప్రభాకర్ ఉపన్యాసం తప్పిపోతానేమోనన్న ఆదుర్దాతో!//

    డాక్టర్ రమణా.... అసలు మీకెంత ధైర్యం...(కొంచె కోపంగా) అసలు మీకెందుకింత స్వార్థం. అన్నీ అంతా అందరూ మీకేనా... మాకేమీ దక్కనివ్వరా... ఈ యుగయుగాల దోపిడీ ఇంకెంతకాలం... పరకాల మీ అభిమాన నాయకుడా... కానే కాదు.... ఆయన మా అభిమాన నాయకుడు... అంతే... ఆయన మాకే సొంతం... ఈ విషయంలో మీరేం క్లెయిం చెయ్య్డానికి లేదు... ఖబడ్దార్...
    ఇట్లు
    అన్ని రిజిస్టర్డ్ పార్టీల కార్యకర్తల జె.ఎ.సి.
    వివిధ సిద్ధాంతాల సమైక్యతావాద కార్యకర్తలు

    ReplyDelete
    Replies
    1. ఇది అన్యాయం.

      మా హైదరాబాద్ మాక్కాకుండా చేస్తున్నారు.

      ఇప్పుడు మా ప.ప్ర.ని కూడా లాగేసుకుంటే మాకు మిగిలేదేమిటి?!

      Delete
    2. అసలికి మీదగ్గర ఉన్నదేటి?

      Delete
    3. @UG SriRam,

      భలేవాళ్ళే! అసలు మా దగ్గరే ఎక్కువున్నాయి! ఇది చదవండి.

      కొలంబస్ ను మరిపించే నారా బాబు .. అగస్త్య మహాముని లాంటి జగన్ బాబు

      Delete
    4. "మేరె పాస్ చంద్రబాబు హై, జగన్ హై, అశోక్ బాబు హై, పరకాల ప్రభాకర్ హై" అంటారా? అట్లే (పెసరట్టు కాదండి బాబు) కానిండు

      Delete
    5. రమణ గారు
      అంతేనా, మీదగ్గర నట సామ్రాట్ , యువ సామ్రాట్, ఆంధ్రా మన్మధుడు, మెగా పవర్ స్టార్,, మువీ మొగల్, ప్రజల ఆందోళనని, ఆక్రోశాన్ని , వాళ్ల మూడ్ ను తెలుసుకోకుండా, పుండు మీద కారం చల్లినట్లు, అవహేళన చేస్తూ పొగరుతో సినేమాలు తీసె పూరిలుసమయం సందర్భం లేకుండా నోరుజారే
      కలెక్షన్ కింగ్ లు ఇలా రాస్తూ పొతే ఎంతో మంది వస్తారు. :)

      Delete
  3. అయ్యో, పొరపాటున ఇంకో సభకు వెళ్ళారా :(

    ReplyDelete
  4. మిత్రులారా,

    ఈ పోస్ట్ నేను ఇంతకుముందు రాసిన ఎందుకు? పోస్టుకి కొనసాగింపుగా రాశాను.

    కామెంటినవారికి ధన్యవాదాలు.

    ReplyDelete
  5. నిజంగా తెలంగాణా ఇవ్వక తప్పదు . తెలంగాణా ఇవ్వకపోతే కోస్తా లో ఎవరైతే సమైక్య ఉద్యమం అంటున్నారో వాళ్ళు తెలంగాణా లో గెలవా లేరు .
    కాబట్టే ఇక్కడ జగన్ పార్టి సమైక్య నినాదంతో తెలంగాణా ని వదిలెసిన్ది. చంద్రబాబు మాత్రం రెండు చోట్ల సమంగా ఉన్నా సీమాంధ్ర నాయకుడు కావటం వలన అయన పార్టీ రెండు చోట్ల కష్టమే . కాంగ్రెస్స్ డ్రామా వలన తెలంగాణా చీలకపోతే అక్కడా ఇక్కాడా రాదు .సమైక్య ఉద్యమం సాధించేది ఏమిటి ?
    తాత్కాలికంగా 2014 ఎన్నికలవరకు విభజన వరకు ఆపగలరు తరువాత కేంద్రం లో ఏర్పడే ప్రభుత్వం కొన్నాళ్ళు ఆపిన ,రాష్ట్రం లో ఏర్పడే ప్రభుత్వం
    కర్నూలు ,అనతపురం జిల్లాల MLA లను కలుపుకొని తెలంగాణా MLA లు తీర్మానం చేయరా ?
    రాజకీయ నాయకులకి అన్ని తెలుసు ,ఎందుకంటే వాళ్ళు అన్నీ ముందే జాగ్రత్త పడతారు .తెలంగాణా విభజన వార్త రాగానే వెంటనే జగన్ పార్టి తెలంగాణా ని వదిలేసింది .తెలంగాణ వాళ్ళ ఇష్టం లేకుండా ఆంధ్రా కలిసి ఉండటం కష్టం . ఎవరు చెప్పకుండా ఉద్యమం జరగదు .యువ రాజకీయ వారసులను తయారుచేయడానికి ,మరుగున పడిపొఇన రాజకీయ నాయకులకు కావలసిన ప్రచారానికి ,మీడియా వ్యాపారానికి ,ఉద్యోగుల ముందు ముందు అవసరాలికి ,పిల్లల సెలవలకి మాత్రమే ఉద్యమాల ఉపయొగమ్. మనం తీవ్రం గా నష్టపోతున్న ఎన్నో విషయాలి కి స్పందించని మనం దీనికి స్పందిస్తున్నమంటే ప్రజల్లో ఒకరకమైన అసంత్రిప్తి ఈవిధంగా బయట పడేసి ,చల్లార్చి ,ఎన్నికలకు వెళ్ళాలనేది రాజకీయం కావచ్చు. జీతం రాకపొఇనా ఉద్యమం చేస్తామంటే ,మాట మీద నిలబడి ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినా CM సహాయ నిధికి జమ చేస్తామని చెప్తే అప్పుడు ఇది నిజమైన ఉద్యమమ్. ప్రైవేటు కాలేజీ ల కు పిల్లలని పంపిస్తోన్న తల్లితండ్రులు మా పిల్లలికి కూడా సెలవలిచ్చి పంపిచండి అని అంటే అది నిజమైన ఉద్యమమ్.
    1973 లో మనకి జై ఆంధ్రా అవసరమైనప్పుడు ఇప్పుడు ఎందుకు అవసరం లేదు ? అప్పటికి ఇప్పటికి సీమ కాని ఆంధ్రా కానీ ఏమైనా అభివ్రిద్ది సాధించిందా ?ఉద్యోగస్తులు ,రాజకీయ నాయకులూ మాత్రమే అడిస్తోన్న్జ ఈ అట లో ప్రజలు నిజం గా ఉన్నారా ? హైదరాబాద్ తప్ప ఆంధ్రా ఏమి బాగుపడింది ?ఇప్పుడు కూడా కలిసుంటే కొన్ని లక్షల కోట్లు తెలంగాణా కి ఇస్తారు ,మనం రాష్ట్రం కలిసున్నందుకు ఏడవలేక నవ్వూదామ్ .

    ReplyDelete
    Replies
    1. బాబూ, అక్కడున్న 119 అసెంబ్లీ సీట్ల లో 40 సీట్లు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నాయ్..

      వీటిలో తెలంగాణా హవా ఎంత?
      మీ ఖర్మ కాలితే, ఈ 40 సీట్లు జగనన్న తొక్కేసి బొక్కేస్తే?

      ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్!

      Delete
  6. రమణ గారూ, మీ అభిమాన నాయకుడు రామారావు కదా? ఆయనను ఆ స్థానం నుండి తొలగించి ఆ బిరుదు పరకాల ప్రభాకర్ గారికి కట్టపెట్టడం బాలేదు. అంతకన్నా గొప్ప నటుడా ఈయన?

    ReplyDelete
    Replies
    1. @Jai,

      నేనైతే రామారావు కన్నా పరకాల ప్రభాకరే గొప్పనటుడని అనుకుంటున్నాను!

      Delete
  7. రమణ గారూ, మీ సెటైర్ బావుంది. మండే గుండెల నాయక(దుష్ట)గణాన్ని మరింత కుళ్లబొడవాల్సింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మొదట్నుండీ నిరాదరణకు గురవుతున్న ఎండే డొక్కల కష్టాల్ని అంతర్లీనంగా బాగా స్పృశించారు. ఖరీదైన విద్య, కార్పొరేట్ వైద్యం (మీరూ వైద్యులైనప్పటికీ) బారిన పడి పొలం-పుట్రా అన్నీ తెగనమ్ముకుని దివాళా తీస్తున్న జనం కష్టాల్ని చింకిపాతరవాణ్ని అడ్డం పెట్టుకుని బాగా ఏకరవు పెట్టించారు. దగ్దయోగం పట్టిన రాష్ట్ర జాతకచక్రం మునుముందు ఎలా తగలడినా, మండే గుండెలు త్వరగానే చల్లారుతాయేమోగానీ, అన్ని ప్రాంతాల్లో ఎండే డొక్కలు మాత్రం మరింత కుంగి కృశించి పోతాయనడంలో ఏమాత్రం సందేహం లేదనే అనిపిస్తోంది ప్రస్తుతానికి.

    ReplyDelete
    Replies
    1. నాగరాజ్ గారు,

      థాంక్యూ!

      ఆశ్చర్యకరం ఏమంటే.. తమ స్కూళ్ళూ, కాలేజిలకి ఒక్కరోజు కూడా సెలవివ్వకుండా.. సమైక్య ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తున్నవారిని జనాలు ఎలా భరిస్తున్నారనేది!

      Delete
  8. ఇది అన్యాయం డాట్రు గారు...
    ఒక్క రోజు డాక్టర్ల సమ్మెకే మీరు ఎండే డొక్కలైపోయారా?

    see: Docs join Telangana stir; Private hospitals closed in AP
    http://www.deccanchronicle.com/130918/news-current-affairs/article/docs-join-telangana-stir-private-hospitals-closed-ap

    ReplyDelete
  9. వై.వి.రమణగారు మంచి డాక్టరో కాదో నాకు తెలియదు కనుక చెప్పలేను కాని వారు మంచి బలమైన వ్యంగ్య రచయిత అని మాత్రం ఘంటాపధంగా చెప్పగలను!వారి వ్యంగ్యానికి పదును ఎక్కువ!చంద్రబాబుగారి రెండుకళ్ళ సిద్ధాంతం తెలంగాణా లోనూ,సీమా౦ద్రలోనూ కుదేల్!తెలుగు జాతి మనది రెండుగ వెలుగు జాతి మనది!వీర తెలంగాణా నాది!వేరు తెలంగాణా నాది!

    ReplyDelete
  10. ఇవ్వాళ రాష్ట్రం ఉన్న పరిస్తితి చూస్తుంటే చాలా ఆందోళనగా ఉంది.ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఇప్పటిది కాదు. ఇదివరకటి ఉద్యమాల్ని తవ్వకుండా ఇప్పటి ఉద్యమం గురించి పరిశీలిస్తే ఈ సారి వాళ్ళు ఆర్టికిల్ 3 మీదనే పూర్తిగా ఆధార పడి ఒక తెలివైన వ్యూహం తో ఒక్కొక్క అడుగూ వేస్తున్నారనేది తెలుస్తుంది. యే సమయంలో యే నిర్ణయం తీసుకోవలో తెలియక పోవటం, ముఖ్యంగా తమ స్వంత ప్రయోజనాలకోసం యెటువంటి నీచానికైనా ఒడిగట్టే వాళ్ళు నాయకు లవడం ఆంధ్రుల దురదృష్టం, అంతే.

    ఇప్పుడు రాష్ట్రం లోని రాజకీయ పరమైన గందరగోళానికి ఫలితం యెలా ఉంటుంది? సమైక్య వాదులు తొమ్మిదేళ్ళ నుంచి యేం చెస్తున్నరు. విభజన ప్రక్రియ మొదలయ్యాక దాన్ని నిజంగానే వెనక్కి తిప్పగలమనే అనుకుంటున్నారా? సభలో వోటింగు జరిగేటప్పుడు వ్యతిరేకంగా వొటు చెయ్యడం అనే వ్యూహం నిజంగా తెలివైనదేనా? ప్రాక్టికల్గా అది సాధ్యపడుతుందా? తనే పూనుకుని ప్రక్రియను మొదలు పెటిన కాంగ్రెసు పార్టీ తన సభ్యుల్ని ఆ ప్రతిపాదనకి వ్యతిరేకంగా వోటు చెయ్యనిస్తుందా?ఇక తెలుగు దేసం - ఒకప్పుడు విభజనకు ఇష్టపది తెరాస తో యెన్నికల్లో కలిసి పోటీ చేసి, తన పార్టీ లెటర్ హెడ్ మీద విభజనకు సమ్మతిస్తూ అధికారికమైన అనుమతి నిచ్చి సభలో తన సభ్యుల్ని అందుకు భిన్నంగా వోటు చెయ్యమంటే అది తన మాటని తనే వెక్కిరించుకోవడం కాదా? అది మంచి నాయకుడి లక్షణమేనా? కాదని నాకూ మీకూ కూడా తెలుసు.

    ఒకవేళ అలా జరిగితే అది రాజ్యాంగాన్నే అపహాస్యం చెయ్యడం అవుతుంది కదా? ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమని గొప్పలు చెప్పుకుంటున్నాం, ఆ గొప్పతనం పోయి ప్రపంచం ముందు నవ్వుల పాలవుతాం కదా? ఆత్మ ప్రబోధం అనేది ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు అలా జరగడం లేదు, బహుశా యే దైనా రాజ్యాంగ సవరణ తోనో దాన్ని యెత్తేసినట్టున్నారు.ఇప్పుడు కేవలం ఈ వొక్క దాని కోసం దాన్ని వాడుకోవటం అంత మంచిది కాదు.

    సాంకేతికంగా చూస్తే అంతా అయిపోయాక మొదలైన ఈ సమైక్య ఉద్యమం వల్ల మంచి కన్నా చెడే యెక్కువ జరుగుతుందనిపిస్తుంది.తెలంగాణా ఉద్యమకారులు ఆ రెండు సభల్లో జరిగే వోటింగుకీ తరవాత రాష్ట్రపతి నుంచి పంపబడే ప్రతిపాదనకీ అంతా ప్లాను చెసుకునే ఉన్నారని వాళ్ళ ధోరణిని బట్టి తెలుస్తుంది.ఆ సాంకేతికమైన ప్రణాళిక సమైక్య వాదులలో లేదు. అశోక్ బాబు అదిగుతున్న ఆత్మ ప్రబోధం అనేది పని చెస్తుందనే గ్యారెంటీ లేదు. అది ఆయా పర్టీ అధినేతల రాజకీయ పరిణితిని బట్టి నిర్ణయించ బడుతుంది.

    సాంకేతికమైన అడ్దంకుల్ని అధిగమించతానికి కేవలం ఉద్వేగాలు పనికి రావు కడా! సమయం మించి పోయాక జరిగే ఇలా పక్కదారి పట్టటం కన్నా వాస్తవాన్ని తెలుసుకుని విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూసుకోవటం మంచిదేమో?

    ReplyDelete
  11. మీలాంటి అభిమానుల కోసం పరకాల వారు తన సభ వీడియో మరియు ఫోటోలు ప్రచురించారు. చూసి తరించండి. ఇంకెప్పడూ ఆ మహానీద్యుడి సభలకు డుమ్మా కొట్టకండి

    http://parakala.org/2013/09/19/guntur-public-meeting-pictures/
    http://parakala.org/2013/09/19/guntur-public-meeting-video/

    ReplyDelete

  12. ఏమో..మనము కూడ 'మండే గుండెల ఘోష' గురుంచి చర్చించే అవకాశం వచ్చింది కాబట్టి 'ఎండే డొక్కల ఘోష' గురుంచి మాట్లడుతున్నాం కాని.... లేకపొతె.....నిజం కదా...

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.