Showing posts with label సినిమా. Show all posts
Showing posts with label సినిమా. Show all posts

Wednesday, 12 June 2013

కనకం


విజయ వారి 'షావుకారు' అనేక విధాలుగా విశిష్టమైనది. సినిమా చూస్తూ కథలో పూర్తిగా లీనమైపోతాం. ఈ సినిమాలో పల్లె వాతావరణాన్ని హాయిగా సహజంగా చిత్రీకరించారు. ఎంత సహజంగానంటే.. మనమే ఆ పల్లెటూరులో ఉన్నట్లుగాను, సినిమాలో పాత్రలు మన చుట్టూతా తిరుగుతూ మాట్లాడుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఒక మంచి నవల చదువుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది.

షావుకారు సినిమాలో చాకలి రామి పాత్రని పోషించిన నటి పేరు కనకం. చాలా ఈజ్‌తో సరదాసరదాగా నటించేసింది.  సున్నం రంగడు (ఎస్వీరంగారావు) దగ్గర వగలు పోతుంటుంది. అతన్ని ఆట పట్టిస్తుంటుంది, రెచ్చగొడుతుంటుంది. అందుకే - అంత లావు రౌడీ రంగడు రామి దెబ్బకి పిల్లిలా అయిపోతుంటాడు.

పాత సినిమాల్లో నటులు చాలా ప్రతిభావంతులని నా నమ్మకం. ఇట్లా నమ్మటానికి నాక్కొన్ని కారణాలున్నాయి. ఉదాహరణకి కన్యాశుల్కం సినిమాలో నటించిన గోవిందరాజుల సుబ్బారావు నిజజీవితంలో పురోహితుడనుకుని భ్రమపడ్డాను. ఈ సంగతి ఇంతకుముందు "గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!"  అనే పోస్టులో రాశాను.

ఆరుద్ర రాసిన 'సినీ మినీ కబుర్లు'లో కనకం గూర్చి ఒక చాప్టర్ వుంది. కనకం హీరోయిన్ పాత్రల కోసం ప్రయత్నిస్తూనే చాలా సినిమాల్లో కామెడీ వేషాలు వేసిందని.. సినిమాల్లో అవకాశాలు తగ్గాక కాంట్రాక్టు నాటకాల్లో కృష్ణుడు వేషాలు వేసిందని.. వృద్దాప్యంలో పేదరికంతో విజయవాడలో జీవిస్తుందని.. ఇట్లాంటి విశేషాలు, వివరాలు ఆ పుస్తకంలో చాలానే వున్నాయి.  

దర్శకులు హీరోయిన్ పాత్ర గూర్చి చాలా శ్రద్ధ తీసుకుని, సపోర్ట్ కేరక్టర్ల గూర్చి తక్కువ శ్రద్ధ తీసుకుంటారు అనుకునేవాణ్ని. ఈ సినిమా చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. దర్శకుడు ఎల్వీప్రసాద్ చాకలి రామి పాత్రని ఆకర్షణీయంగా, సహజంగా కన్సీవ్ చేశాడు. 

యూట్యూబ్ లో కనకం రేలంగిని పొగక్కాడ అడిగే సన్నివేశం కూడా ఉంది (ఆసక్తి కలవారు చూసుకోవచ్చు). రామి, రంగడు పాత్రల రూపకల్పనలో చక్రపాణి పాత్ర ఎంతో మనకి తెలీదు. కుటుంబరావు మాత్రం షావుకారు సినిమా మొత్తానికి చక్రపాణి కంట్రిబ్యూషన్ చాలానే ఉందంటాడు. కనకం తనే పాడుకుని నటించిన పాట ఇస్తున్నాను. చూసి ఆనందించండి.



(photo courtesy : Google)

Friday, 12 April 2013

భార్యే మాయ! కాపురమే లోయ!!

హెచ్చరిక : ఈ టపా మగవారికి ప్రత్యేకం. ఆడవారు చదవరాదు.


అతనో చిరుద్యోగి. మంచివాడు. మృదుస్వభావి. పుస్తక ప్రియుడు. తెల్లనివన్ని పాలు, నల్లనివన్ని నీళ్ళనుకునే అమాయకుడు. సాధారణంగా ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి ఏదోక దుర్గుణం కలిగి ఉంటాడు. మనవాడి దుర్గుణం.. కవిత్వం పిచ్చి!

స్నేహితుడి చెల్లెల్ని చూసి ముచ్చటపడి ప్రేమించాడు. పెద్దల అంగీకారంతో ప్రేమని పెళ్ళిగా మార్చుకున్నాడు. కొత్తగా కాపురానికొచ్చిన భార్యని చూసి 'జీవితమే సఫలము.. రాగ సుధా భరితము.. ' అనుకుంటూ తెగ ఆనంద పడిపొయ్యాడు.

భార్య కూడా భర్త కవిత్వానికి తీవ్రంగా మురిసిపోయింది. ఆవిడకి తన భర్త కవిత్వంలో శ్రీశ్రీ మెరుపు, దాశరధి విరుపు, ఆత్రేయ వలపు కనిపించాయి. ఆయనగారి కవితావేశానికి కాఫీలందిస్తూ తన వంతు సహకారం అందించింది.

ఆ విధంగా ఆవిడ అతనిలో విస్కీలో సోడాలా కలిసిపోయింది. ఇప్పుడు వారి జీవితం మల్లెల పానుపు, వెన్నెల వర్షం. ఆ విషయం ఈ పాట చూస్తే మీకే తెలుస్తుంది.



కొన్నాళ్ళకి.. భార్యకి భర్త తాలూకా కవితామైకం దిగిపోయింది. కళ్ళు తెరచి చూస్తే ఇంట్లో పనికిమాలిన సాహిత్యపు పుస్తకాలు తప్పించి.. పనికొచ్చే ఒక్క వస్తువూ లేదన్న నగ్నసత్యాన్ని గ్రహించింది.

'ఏమిటీ కవితలు? ఎందుకీ పాటలు?' అని ఆలోచించడం మొదలెట్టింది. తత్ఫలితంగా ఆవిడకి దాహం వెయ్యసాగింది. అంచేత.. చల్లని నీటి కోసం లేటెస్ట్ మోడెల్ ఫ్రిజ్ కొందామని భర్తనడిగింది.

"ఫ్రిజ్ ఎందుకె చిన్నాదానా.. కష్టజీవుల మట్టికుండ లుండగా.. " అంటూ పాటెత్తుకున్నాడు మన భావుకుడు. భార్య నొసలు చిట్లించింది.

భర్త ఆఫీసుకెళ్ళినప్పుడు బోర్ కొడుతుంది. అంచేత లేటెస్ట్ మోడెల్ సోని LED టీవీ కొందామని భర్తనడిగింది..

"టీవీలెందుకె పిల్లాదానా.. పచ్చని ప్రకృతి పురులు విప్పి ఆడగా.. " అంటూ కవితాత్మకంగా చెప్పాడు మన కవి. భార్యకి చిరాకేసింది.

ఎండలు మండిపోతున్నాయ్. ఉక్కపోతగా ఉంది. లేటెస్ట్ మోడెల్ ఏసీ కొందామని భర్తనడిగింది.

"వట్టివేళ్ళ తడికెల తడిలో.. చెలి చల్లని చెక్కిలిపై నా మది సేద తీరగా.. " అంటూ లలితగీతం పాడాడు. భార్యకి మండిపోయింది. అన్నకి కబురు చేసింది.

అన్న పీకల్లోతు అప్పుల్లో, తీవ్రమైన కరువులో ఉన్నాడు. పీత కష్టాలు పీతవి! లేటెస్ట్ మోడల్ ఫ్రిజ్, టీవీ, ఏసీ కొనటం లేదని.. అతనికి భార్య తిండి పెట్టకుండా వారం రోజులుగా కడుపు మాడ్చేస్తుంది. చెల్లి కబురందుకుని పరుగున వచ్చాడు. చెల్లి కష్టాలు విన్న అన్న గుండె తరుక్కుపోయింది. హృదయం కదిలిపోయింది. కడుపు మండిపోయింది.

హుటాహుటిన చెల్లిని బజారుకి తీసుకెళ్ళి పేద్ద ఫ్రిజ్, ఇంకా పెద్ద సోనీ LED టీవీ, అతి నిశ్శబ్దంగా పంజేసే అత్యంత ఖరీదైన ఏసీ.. ఇంకా చాలా.. 'జీరో' డౌన్ పేమెంట్, 'ఆల్ పేమెంట్ ఓన్లీ ఇన్ ఇన్స్టాల్మెంట్స్' అనబడే వాయిదాల పద్ధతి స్కీములో (దీన్నే ముద్దుగా EMI అంటారు).. బావగారి పేరు మీద కొనిపించాడు. పన్లోపనిగా చెల్లెలి ఖాతాలో అవన్నీ తనూ తీసేసుకున్నాడు ముద్దుల అన్న!

'ఏమిటివన్నీ?' అంటూ ఆశ్చర్యంగా అడిగిన భర్తకి కాఫీ ఇచ్చి.. "పయనించే మన వలపుల నావ.. " అంటూ పాడింది భార్యామణి. మొహం చిట్లించాడు కవి. ఏసీ ఆన్ చేస్తూ "నీ మది చల్లగా.. స్వామి నిదురపో.. " అంటూ ఇంకో పాటెత్తుకుంది భార్య. ఖిన్నుడైనాడు కవి! హృదయం మూగగా రోదించింది. గోలగా ఘోషించింది. ఘోరంగా ఘూర్ఘించింది.

తనకొచ్చే జీతంతో EMI లు, కరెంట్ బిల్లులు కట్టలేక విలవిలలాడిపొయ్యాడు మన కవి పుంగవుడు. దిక్కు తోచక అప్పులు చెయ్యసాగాడు. అప్పులు చెయ్యడమే కానీ.. తీర్చే మార్గం కనబడ్డం లేదు. ఏం చెయ్యాలో తోచట్లేదు. దిగులుతో చిక్కి.. చూడ్డానికి రోగిస్టివాడిలా కనిపించసాగాడు. సహజంగానే కవితా గానం గాయబ్ అయిపోయింది.

ఆర్ధిక బాధలు తట్టుకోలేక.. ఓ మంచిరోజు ఇంట్లోంచి వెళ్ళిపొయ్యాడు. ఊరవతల ఓ కుళ్ళు వీధిలో కరెంట్ స్థంభానికి అనుకుని.. వీధి కుక్కని నిమురుతూ తన దుస్థితికి కుమిలిపోసాగాడు. అరె! చాల్రోజులకి మళ్ళీ కవిత్వం పొంగింది! దిగులుగా, ఆవేదనగా, ఆర్తిగా, నిర్వేదంగా, నిస్సారంగా, నీరసంగా.. జీవత సారాన్ని నెమరు వేసుకుంటూ పాడటం మొదలెట్టాడు.. పాపం!

అతను పాడుకుంటున్న పాట చూడండి.

< />
భర్త కనపడక భార్య తల్లడిల్లింది. భయపడిపోయింది. 'తన భర్త లేకపోతే.. EMI కట్టేదెవరు? ఈ టీవీ, ఫ్రిజ్, ఏసీ.. మైగాడ్.. ఇవన్నీ ఏమైపోవాలి? షాపువాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతే నే బ్రతికేదెట్లా? అయ్యో! భగవంతుడా! ఏ ఆడదానికీ రాని కష్టాన్ని నాకు కల్పించావేమయ్యా? ఇది నీకు న్యాయమా? ధర్మమా?' అంటూ దేవుణ్ని వేడుకుంది.

పిమ్మట తేరుకుంది. తదుపరి.. ఓ జట్కాబండి బాడుగకి మాట్లాడుకుని.. పారిపోయిన ఖైదీ కోసం పోలీసులు వెతికినట్లు.. భర్త కోసం వీధులన్నీవెదకసాగింది. మొత్తానికి భర్త దొరికాడు. EMI కట్టించే నిమిత్తం.. అతగాణ్ణి బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళింది. కథ దుఃఖాంతం!

(photo courtesy : Google)

Friday, 5 April 2013

నందుని చరిత - ఘంటసాల ఘనత


నేను చిన్నప్పుడు ఘంటసాల పాటలు వింటూ పెరిగాను. అయితే ఆ పాటలు ఘంటసాల పాడినట్లు అప్పుడు నాకు తెలీదు. ఆ పాటలు రామారావు, నాగేశ్వరరావులే పాడుతుండే వాళ్ళనుకునేవాణ్ని. కొన్నాళ్ళకి ఆ గొంతు ఘంటసాలదని తెలుసుకున్నాను. ఇంకొన్నాళ్ళకి ఘంటసాల గొప్ప గాయకుడని అర్ధం చేసుకున్నాను. అయితే ఘంటసాల విశ్వరూప దర్శనం నాకు 'జయభేరి' సినిమా చూస్తుండగా కలిగింది.

సరే! 'జయభేరి' పాటల గొప్పదనాన్ని ఇవ్వాళ నేను ఇక్కడ రాసేదేమీ లేదు. దాదాపు అన్ని పాటలు (చివర్లో వచ్చే సౌందర్ రాజన్ పాట మినహాయింపు) బాగుంటాయి. బెస్ట్ ఆఫ్ జయభేరి? రకరకాల సమాధానాలు. క్లాసికల్ ప్రేమికులు 'రసికరాజ తగువారము కాదా.. ' చెబుతారు. విరహ ప్రేమికులు 'రాగమయి రావే.. ', 'యమునా తీరమున.. ' అంటుంటారు. నాకైతే 'నందుని చరితము.. ' పాట ఒక అద్భుతంగా తోస్తుంది.

'జయభేరి' చూడనివారి కోసం.. ఈ పాట సందర్భం బ్రీఫ్ గా రాస్తాను. హీరో పేరు కాశీనాథశాస్త్రి. గొప్ప సంగీత విద్వాంసుడు. కళకి క్లాస్ డిస్క్రిమినేషన్ ఉండరాదని నమ్ముతాడు. నమ్మిన సత్యాన్ని ఆచరించగలిగిన సాహసి. అందుకే గురువుని, అన్నావదినల్ని ఎదిరించి వీధి నాటాకాలాడే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.

మహారాజు కాశీనాథుని ప్రతిభని మెచ్చి ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తాడు. అతను ఇంత స్థాయి పొందడాన్ని సహించలేని రాజగురువు, రాజనర్తకిలు కుట్ర పన్ని తాగుబోతుగా మార్చేస్తారు. ఒకనాడు మహారాజు అజ్ఞాపించినప్పుడు కూడా పాడటానికి నిరాకరిస్తాడు. రాజాగ్రహానికి గురై వీధిన పడతాడు.

గుళ్ళో హరికథ జరుగుతుంటుంది. ఒక 'అంటరానివాడు' జ్వరంతో తీసుకుంటున్న తన కూతురితో కలిసి గుడి బయట నుండే దేవునికి మొక్కుతాడు. ఆగ్రహించిన గుళ్ళో బ్రాహ్మణులు అతన్ని నెట్టేస్తారు. మద్యం మత్తులో అటుగా వెళ్తున్న కాశీనాథశాస్త్రి ఆ తండ్రీకూతుళ్ళకి దేవుని దర్శనం చేయించడానికి విఫలయత్నం చేసి.. తను కూడా గెంటింపబడతాడు.

ఈ అరాచకానికి కాశీనాథశాస్త్రి కలత చెందుతాడు. ఆవేదన చెందుతాడు. మహారాజు కోరినా పాడనని మొరాయించిన ఆ స్వరం ఒక్కసారిగా జీవం పోసుకుంటుంది. ఆవేశంతో పరవళ్ళు తొక్కుతుంది. ఆగ్రహంతో కట్టలు తెంచుకుంటుంది. అందుకే ఆ మహాగాయకుడు గొంతెత్తి నందుని చరితాన్ని ఆలాపించడం మొదలెడతాడు. ఇదీ పాట సందర్భం. ఇక్కడీ పాట యూట్యూబులో చూడండి.



ఈ పాట సందర్భాన్ని పి.పుల్లయ్య పెండ్యాలకి వివరించి ఉంటాడు. పెండ్యాల నాగేశ్వరరావు వరసలు చక్కగా కట్టి ఉంటాడు. ఏ దర్శకునికైనా, సంగీత దర్శకునికైనా ఎన్నో కోరికలుంటాయి. కానీ గాయకులని దృష్టిలో ఉంచుకుని పరిమితులు ఏర్పరచుకుంటారు. డొక్కు కారుని వంద మైళ్ళ వేగంతో నడపితే యాక్సిడెంటవుతుంది.

ఘంటసాల వాయిస్ రేంజ్ అప్పుడే షో రూం డెలివరీ అయిన బెంజ్ కారు వంటిది. ఇక నడిపేవాడి ఓపిక. ఆకాశమే హద్దు. సంగీత దర్శకుడు ఏ బాణీనైనా, ఏ శృతిలోనైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 'ఘంటసాల లక్జరీ' ని ఎస్.రాజేశ్వరరావు దగ్గర్నుండీ అందరూ అనుభవించిన వారే!

మళ్ళీ 'అధికులనీ అధములనీ.. ' పాట దగ్గర కొద్దాం. ఈ పాట ఎత్తుగడే చాలా హై పిచ్ లో ఉంటుంది. అన్యాయానికి స్పందించిన ఒక మహాగాయకుని ఆవేదన, ఆర్ద్రత, ధర్మాగ్రహం.. అంతటినీ ఘంటసాల గీతాలాపనలో గాంచవచ్చు.

నటించింది అక్కినేని నాగేశ్వరరావయినా.. సన్నివేశానికి ఘంటసాల గొంతు పదిరెట్లు ఊపునిస్తుంది. ఈ పాటని నేను చాలాసార్లు చూశాను. ఎన్నిసార్లు చూసినా.. నాకీ పాట ఒక అద్భుతంగా తోస్తుంది. ('జయభేరి' మన మనసులో చిరస్థాయిగా మిగిలిపోడానికి ప్రధాన కారకుడు ఘంటసాల అని నా అభిప్రాయం.)

అయితే.. నాకు ఘంటసాలని ఫోటోల్లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతటి అసమాన ప్రతిభావంతుడు అతి సామాన్యుడిలా, అమాయకంగా కనిపిస్తుంటాడు. ఘంటసాలకి తనెంతటి ప్రతిభాసంపన్నుడో తనకే తెలీనంత అమాయకుడని నా అనుమానం! ఘంటసాల తెలుగు పాటని హిమాలయాలంత ఎత్తున ప్రతిష్టించాడు. ఇది తెలుగువారి అదృష్టం.

మా వేలు విడిచిన మేనమామ ఒకాయనకి పెళ్ళీపెటాకులు లేవు. ఉద్యోగం సద్యోగం లేదు. పనీపాటా లేదు. ఆస్తిపాస్తులు బానే ఉన్నాయి. సాధారణంగా ఇట్లాంటివాళ్లకి ఏదొక హాబీ ఉంటుంది. మా మేనమామకి సినిమా పాటల హాబీ. అదో పిచ్చి. పొద్దస్తమానం ఏవో గ్రామ్ ఫోన్ రికార్డులు వింటూ, వాటిని తుడుచుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. సినిమా పాటల పరిజ్ఞానం చాలానే ఉంది.

ఓ సారి ఆయన ఏదో పెళ్ళిలో కనిపిస్తే అడిగాను. కచేరీల్లో ప్రతి తలకి మాసిన వెధవ ఘంటసాలలా తెగ ఫీలైపోతూ.. 'రాగమయి రావే.. ', 'నీలిమేఘాలలో..' అంటూ సెలెక్టివ్ గా కొన్ని పాటల్నే హత్య చేస్తారేమి! ఆ గార్ధభోత్తములు 'నందును చరితము.. ' జోలికి ఎందుకు పోరు? అని. ఆయన ఒక క్షణం ఆలోచించాడు. ఆపై విషయం తేల్చేశాడు.

"ఆ పాట పాడటం చాలాచాలా కష్టం. శృతి చాలదు. నా లెక్క ప్రకారం 'నందుని చరితము' పాడ్డానికి ఎవడు సాహసించినా.. పాటయ్యేలోపు గిద్దెడు నెత్తురు కక్కుకుని చస్తాడు. చావుకి తెగించి ఎవడైనా ఎలా పాడతాడు?" అన్నాడు.

నిజమే కదా! ఎవరికైనా తమ గానంతో జనాల ప్రాణాలు తియ్యాలనే సరదా ఉంటుంది గానీ.. తమ గానంతో తమ ప్రాణాలకే ఎసరు ఎందుకు పెట్టుకుంటారు?! మామా! నువ్వు కరెక్టుగానే చెప్పావు!

(photos courtesy : Google)

Thursday, 14 February 2013

'ఓహో మేఘమాలా.. '! కొంప ముంచితివి గదా!!


"గురు గారు! నాకు దిగులుగా ఉంది. ఈ మధ్య నా బ్రతుకు మరీ ఆఫ్ఘనిస్తాన్ లా అయిపోయింది."

"అంత కష్టమేమొచ్చి పడింది శిష్యా!"

"నా భార్య పోరు పడలేకున్నాను. ఆవిడకి నా సంపాదన చాలట్లేదుట."

"పోనీ నచ్చజెప్పి చూడకపొయ్యావా?"

"ఆన్నీ అయిపొయ్యాయండీ. నాకు జీవితం మీద విరక్తి పుట్టేసింది. మీరు మరో శిష్యుణ్ణి వెతుక్కోండి. సెలవు."

"తొందరపడకు శిష్యా! నే చెంతనుండగా నీకు చింతనేలా? సంగీత చికిత్సతో నీ భార్యలో పరివర్తన కలిగిద్దాం."

"సంగీత చికిత్సా?!అంటే?"

"పాత తెలుగు సినిమాల్లో బోల్డన్ని మంచి పాటలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఒక్కో పాటకి ఒక్కో రకమైన వైద్య గుణం ఉంటుంది. మొన్నొక నిద్ర లేమి రోగం వాడొచ్చాడు. రాత్రిళ్ళు మంచం మీద పడుకుని 'నిదురపోరా తమ్ముడా.. ' పాట వినమని సలహా ఇచ్చా. అంతే! ఆ రోజు నుండి వాడు రాత్రింబవళ్ళు గురకలు పెట్టి మరీ నిద్రోతున్నాడు."

"నిజంగానా! నా భార్యకి మీ సంగీత వైద్యం పని చేస్తుందంటారా?"

"నిస్సందేహంగా. సంగీతానికి రాళ్ళే కరుగుతాయంటారు. ఆడవారి మనసు కరిగించేందుకు ఒక మంచి పాట చెబ్తాను. అది చూపి నీ భార్యని నీకు చరణదాసిగా చేసుకో. ఈ విడియో చూడు."



"పాట చాలా బాగుందండి."

"ఎస్.రాజేశ్వరరావు సంగీతంలో తిరుమల లడ్డంత తియ్యదనం ఉందోయి. సదాశివ బ్రహ్మం కవిత్వం కాకరకాయ వేపుడంత కమ్మగా ఉంటుంది. ఘంటసాల, లీలల గానంలో వైబ్రేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి మల్టిప్లై అయ్యి అణుక్షిపణి వలే శక్తివంతమవుతాయి. ఆ క్షిపణి నీ భార్య చెవులో కర్ణభేరిని తాకి మెదడులో ప్రకంపనలు కలిగిస్తుంది. అంతే! కఠినమైన ఆమె మనసు క్వాలిటీ ఐస్ క్రీములా కరిగిపోతుంది. పిమ్మట నీ భార్య గుండమ్మకథలో సావిత్రంత అనుకూలవతిగా మారిపోతుంది."

"గురు గారు! ఈ పాటని నాగేశ్వర్రావు, సావిత్రి  పాడుకున్నారు. వాళ్ళు పాడిన పాట నా భార్యనెట్లా మారుస్తుంది?"

"చూడు శిష్యా! ఇక్కడ ఎవరు ఎవరి కోసం పాడారన్నది కాదు పాయింట్. పాటలోని కంపనలు, ప్రకంపనలు ముఖ్యం. మనసులోని భూతులు, అనుభూతులూ ప్రధానం. అందుకే గత యాభయ్యారేళ్ళుగా ఈ పాట తెలుగు వారిని మందు కొట్టకుండానే మత్తెక్కిస్తుంది."

"మీరు చెప్పేది సరీగ్గా అర్ధం కావట్లేదు గానీ.. వింటానికి బానే ఉంది. వర్కౌట్ అవుతుందంటారా?"

"నా సలహా గురి తప్పదు శిష్యా! అయితే ఒక కండిషన్. నీ భార్యని ఇంటికి ఈశాన్యం మూలకి తీసుకెళ్ళి ఈ పాటని చూపించు. ఆ సమయంలో లాప్టాప్ తూర్పు దిక్కుకి తిప్పి ఉంచాలి. గుర్తుంచుకో. పొమ్ము. విజయుడవై రమ్ము!"


           *                                *                                 *                            *

"గురు గారు! కొంప మునిగింది."

"ఏమిటి నాయనా ఆ కంగారు? సత్తుబొచ్చెకి సొట్టల్లా వంటి నిండా ఆ దెబ్బలేమిటి?"

"మీ సలహా విన్న ఫలితం. మీరు కొండ నాలుక్కి మందేశారు.. ఉన్న నాలుక పోయింది."

"తిన్నగా చెప్పి అఘోరించు శిష్యా!"

"మీరు చెప్పినట్లే నా భార్యకి 'ఓహో మేఘమాల.. ' విడియో చూపించాను. ఆవిడ ఆ పాట చూసి ఎంతగానో ఆనందించింది. మీ వైద్యం పంజేసిందని సంతోషించాను. సావిత్రి మెళ్ళో నాగేశ్వరరావు పెట్టిన హారం ఆవిడకి బాగా నచ్చిందిట. అదిప్పుడు అర్జంటుగా కావల్ట."

"అంత సొమ్ము నీ దగ్గరెక్కడిది?"

"నేనూ అదే సమాధానం చెప్పాను. 'సినిమాలో నాగేశ్వరరావు మాత్రం ఆ హారం కొని సావిత్రికి పెట్టాడా? కొట్టుకొచ్చిందేగా. ఆ మాత్రం నీకు చేత కాదా?' అంది."

"దొంగతనం మహాపాపం శిష్యా!"

"నేనూ ఆ ముక్కే అన్నాను. ఫలితంగా వంటి నిండా ఈ దెబ్బలు. హబ్బా! ఒళ్ళంతా ఒకటే సలపరంగా ఉంది. ఇప్పుడు నాకు దిక్కెవరు గురు గారు?"

"దిక్కులేని వాడికి ఆ దేవుడే దిక్కు నాయనా! అయినా.. తన్నుటకు నీ భార్య యెవ్వరు? తన్నించుకొనుటకు నీవెవ్వరు? అంతా వాడి లీల! మొహం మీదే తలుపేస్తున్నందుకు ఏమీ అనుకోకు. అసలే చలికాలం. నాకు నిద్ర ముంచుకొస్తుంది."

"గురు గారు! గురు గారు.. "


(photos courtesy : Google)

Monday, 11 February 2013

'యోగి వేమన' ఆలోచనలు - అభిప్రాయాలు


'చిత్తూరు నాగయ్య.. గొప్ప సైకోథెరపిస్ట్'  అంటూ ఇంతకుముందో పోస్ట్ రాశాను. అందులో 'యోగి వేమన'లో నాగయ్య నటన గూర్చి కొంత రాశాను. అయితే - యోగి వేమన సినిమా గూర్చి ఒక పూర్తిస్థాయి పోస్ట్ రాద్దామనే నా ఆలోచన అలానే ఉండిపోయింది.

నాగయ్యపై పోస్ట్ రాసిన తరవాత కూడా ఈ సినిమా రెండుసార్లు చూశాను. మండుటెండలో చల్లని మజ్జిగ తాగినట్లు, యూట్యూబ్ లో పాటలు వింటూ ఆనందిస్తూనే ఉన్నాను. కానీ కొద్దిగా గిల్టీగా కూడా ఉంది - 'నేను మాత్రమే ఎంజాయ్ చేస్తున్న ఈ మధురానుభూతి గూర్చి ఎంతోకొంత రాసి నలుగురితో పంచుకుంటే బాగుండును కదా!' అనిపించి, 'యోగి వేమన' గూర్చి నా ఆలోచనల్ని రికార్ద్ చేస్తున్నాను. ఇది నాకోసం నేను రాసుకుంటున్న పోస్ట్. ఎవరికైనా నా ఆలోచనలు నచ్చితే సంతోషం. 

A.ప్రింట్ క్వాలిటీ బాగుంది. అరవైయ్యైదేళ్ళ క్రితం సినిమా ఈ క్వాలిటీలో ఉండటం ఆనందించదగిన విషయం. ఇందుకు ఎవరు కారకులో తెలీదు. CD లు మార్కెట్ చేసిన దివ్య విడియో వారు అభినందనీయులు (సినిమా పూర్తి నిడివి యూట్యూబులో లభ్యం). 

B.విజయా / వాహిని వారి అన్ని సినిమాలకి మల్లే ఈ సినిమాలో కూడా ఫొటోగ్రఫీ కాంతివంతంగా, బ్రైట్ గా ఉంది. (కొన్ని పాత సినిమాలు చీకట్లో చూస్తున్నట్లుంటాయి - 'జయభేరి' ఒక ఉదాహరణ.) ఇందుకు కారకుడైన ఛాయాగ్రహకుడు మార్కస్ బార్ట్లే ని ఆభినందిద్దాం.

C.సినిమా టైటిల్స్ ఇంగ్లీషులో ఉన్నాయి. ఆ రోజుల్లో స్క్రిప్ట్ కూడా ఇంగ్లీషులోనే రాసుకునేవారని ఎక్కడో చదివాను. కె.వి.రెడ్డి ఎక్కువ ఇంగ్లీషులోనే సంభాషిస్తాడని కూడా చదివాను. CD కవరుపై నిర్మాత B.N.రెడ్డి అని ఉంది, టైటిల్ కార్డ్స్ లో produced and directed by K.V.Reddi అని ఉంది (ఇట్లాంటి పొరబాట్లని కనుక్కోవడంలో VAK రంగారావు సిద్దహస్తులు).  

D.దర్శకుడు :- కె.వి.రెడ్డి

భోగలాలసుడైన వేమారెడ్డి, యోగి వేమనగా మారిన వైనం ఈ సినిమా సెంట్రల్ పాయింట్. కావున కథ పూర్తిగా వేమారెడ్డి వైపు నుండే నడుస్తుంది. వేమారెడ్డి విలాసపురుషుడు. అన్నగారు పెదవేమారెడ్డి (రామిరెడ్డి) రాచకార్యాలు చూస్తుంటాడు. వేమారెడ్డికి అన్న కూతురు జ్యోతి అంటే అంతులేని ప్రేమ. స్నేహితుడు అభిరాముడితో కలిసి బంగారం తయారుచేసే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. వేమారెడ్డి మోహనాంగి అనే వేశ్య మోజులో మునిగి తేలుతుంటాడు. మోహనాంగికి (కనకాభిషేకం చెయ్యడానికి) అన్నగారు వసూలు చేసిన శిస్తు సొమ్ము వాడేస్తాడు. ఫలితంగా పెదవేమారెడ్డి చెరసాల పాలవుతాడు. తనకెంతో ఇష్టమైన జ్యోతి జబ్బుచేసి 'చిన్నాన్న' అంటూ కలవరిస్తూ మరణిస్తుంది. విరక్తితో పిచ్చివాళ్ళా స్మశానాల వెంటా, గుళ్ళ వెంటా తిరుగుతాడు. శివయోగి (రాయప్రోలు) ఉపదేశంతో యోగిగా మారతాడు. చివరకి గుహప్రవేశం (సజీవ సమాధి?) చేస్తాడు. టూకీగా ఇదీ కథ.

సినిమా చూస్తుంటే ఒక నవల చదువుతున్నట్లుంటుంది. సన్నివేశాలు బిగువుగా, క్లుప్తంగా ఉంటాయి. సినిమా ప్రయాణం చాలా స్మూత్ గా, ఫోకస్డ్ గా ఉంటుంది, అనవసరమైన సన్నివేశం ఒక్కటి కూడా లేదు. నిడివి తగ్గిద్దామని ఎంత ప్రయత్నించినా, ఒక్క నిముషం కూడా ఎడిట్ చెయ్యలేం.

నాకు సినిమా గూర్చి సాంకేతిక పరిజ్ఞాం లేదు. అయితే ప్రతి సినిమా కథకి ఒక మూడ్ ఉంటుంది. సినిమా అసాంతం ఆ మూడ్ క్యారీ చెయ్యడం మంచి సినిమా లక్షణం అని నా అభిప్రాయం. ఆవారా, గాడ్ ఫాదర్ లాంటి క్లాసిక్స్ చూస్తున్నప్పుడు ఈ అభిప్రాయం బలపడింది. ఆ రకంగా చూస్తే కె.వి.రెడ్డి నూటికి నూరుపాళ్ళు విజయం సాధించాడు.

వేమారెడ్డి మోహనాంగితో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తుంటే మనక్కూడా హాయిగా ఉంటుంది. జ్యోతి మరణంతో ప్రేక్షకుడు కూడా వేమారెడ్డితో పాటు దుఃఖంలో కూరుకుపోతాడు. ఆపై హీరోతో పాటు మనకి కూడా జీవితం పట్ల అంతులేని విరక్తి, వైరాగ్యం కలుగుతాయి. ఈ విధంగా కె.వి.రెడ్డి మనల్ని తీసుకెళ్ళి హోల్సేల్ గా వేమనకి అప్పగించేస్తాడు.

ప్రేక్షకుణ్ని ఇలా గైడ్ చేస్తూ ప్రధానపాత్రతో మనని మనం ఐడెంటిఫై చేసుకునేట్లు చెయ్యడం గొప్ప దర్శకత్వ ప్రతిభకి తార్కాణం అని నా నమ్మకం. 'యోగి వేమన' గూర్చి ఆరున్నర దశాబ్దాల తరవాత కూడా నేను రాయడానికి ప్రధాన కారణం ఇదే.

సహకార దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత కమలాకర కామేశ్వరరావుకి కూడా అభినందనలు.

సందర్భం కనుక ప్రస్తావిస్తున్నాను, 'యోగి వేమన' సినిమా శ్రీశ్రీకి నచ్చలేదు (మాలి, మాసపత్రిక, మే 1947). 

"వేమన్న మూఢ విశ్వాసాలకి విరోధి. కానీ వేమన్న చిత్రాన్ని చూచిన తర్వాత మన ప్రజలలో మూఢవిశ్వసాలు మరింత పదిలమవుతాయి. వేమన జిజ్ఞాసి, సాధకుడు, మన అందరివంటి మానవుడు. అతనికి మానవాతీత శక్తులంటగట్టడం అనవసరం. గుడ్డిమనిషికి కళ్ళిచ్చాడని చూపించడం వల్ల వేమన్న ఆధిక్యం స్థాపించబడదు." (పేజ్ నంబర్ 329, శ్రీశ్రీ వ్యాసాలు, విరసం ప్రచురణ, 1990.)

శ్రీశ్రీ వేమన తత్వం గూర్చి మంచి అవగాహన కలిగినవాడు. ఆయన కె.వి.రెడ్డి దగ్గర్నుండి ఊహించినంత గొప్పగా సినిమా లేకపోవడంవల్ల చికాకుతో ఈ రివ్యూ రాశాడనుకుంటున్నాను.

E.నటీనటులు.

1.చిత్తూరు నాగయ్య :- వేమారెడ్డి / యోగి వేమన.

ఇంతకుముందు ఈ సినిమా చూసినప్పుడు వేమారెడ్డిగా నాగయ్య నటన ఏవరేజిగా అనిపించింది. నాకెందుకో ఆయన మోహనాంగి ఇంటికి వెళ్ళేప్పుడల్లా ఏదో శంకర విలాస్ లో కాఫీ తాగడానికి వెళ్తున్నట్లు అనిపించింది. వేశ్య దగ్గరకి వెళ్ళే వ్యక్తి విరహతాపంతో ఊగిపోవాలి, నాగయ్యలో నాకా ఫీలింగ్ కనబళ్ళేదు. 

వేమారెడ్డిగా నాగయ్య యాంత్రికంగా నటించాడనడానికి ఒక ఉదాహరణ.. కొలనులోంచి తడచిన దుస్తులతో బయటకొచ్చిన మోహనాంగి (M.V.రాజమ్మ) నుండి దృష్టి మరల్చుకోలేం. కానీ నాగయ్య ఆవిడని సరీగ్గా చూడడు! పట్టించుకోడు, పైగా చీర కట్టుకు రమ్మంటాడు, ఔరా! ఇదేమి రసికత్వం!!

మోహనాంగి దగ్గరకి హడావుడిగా బయల్దేరతాడు వేమారెడ్డి. 

అన్న కూతురు జ్యోతికి వళ్ళు బాగుండదు. 'నన్ను వదలి వెళ్ళకు చిన్నాయనా!' అంటుంది జ్యోతి. 

అంతే! చిన్నపిల్ల అడగంగాన్లే మోహనాంగిని మర్చిపోయి.. ఆనందంగా, మధురంగా "అందాలు చిందేటి నా జ్యోతి.. " అంటూ పాడేస్తాడు. 

పాప పట్ల ఎంత ప్రేమున్నా, సౌందర్యవతి సాంగత్యం కోసం తపించిపొయ్యేవాడి ముఖంలో డిజప్పాయింట్మెంట్ కనబడాలి. నాగయ్యలో నాకు లేశమాత్రమైనా ఆ భావం కనబడలేదు.

దాదాపు ఇవే సన్నివేశాలతో తీసిన ఎన్టీఆర్ 'పాండురంగ మహత్యం' గుర్తు తెచ్చుకోండి. బి.సరోజాదేవిపై మోహంతో ఎన్టీఆర్ తపించిపోతాడు. సినిమా మొదట్లో వేశ్యాసాంగత్యం కోసం ఎంతగా పరితపిస్తాడో.. తరవాత దైవభక్తిలో అంతగా చరితార్ధుడవుతాడు. మొదటి భాగంలో ఎంత నెగెటివ్ షేడ్స్ ఉంటే రెండో భాగం అంత బాగా పండుతుంది. ఇది సింపుల్ బ్యాలెన్సింగ్ యాక్ట్.

మళ్ళీ మనం 'యోగి వేమన' కి వచ్చేద్దాం. వేమారెడ్డి, మొహానాంగిల మీటింగ్స్ మరీ మెకానికల్ గా ఉండటానికి కారణం ఏమిటబ్బా! నాకు తోచిన కొన్ని కారణాలు.

a)బహుశా 1947 (స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం) లో స్త్రీ లోలత్వాన్ని నటించడానికి కొద్దిగా మొహమాటాలు / మోరల్ రీజన్స్ ఉండి ఉండొచ్చు.

b)ఈ సినిమా కె.వి.రెడ్డి, చిత్తూరు నాగయ్యలది. వీళ్ళు మరీ సాత్వికులు, పెద్దమనుషులు. స్త్రీలోలుని చూపులు ఎలా ఉంటాయో నాగయ్యకి తెలీదు, చెప్పి చేయించుకోడానికి కె.వి.రెడ్డికీ తెలీదు. అందుకే నాగయ్యకి M.V.రాజమ్మని 'ఎలా చూస్తూ' నటించాలో తెలిసుండకపోవచ్చు!

c)ఇంకో కారణం. హీరో, దర్శకుడు.. ఇద్దరికీ పూర్తి ఫోకస్ వేమన మీదే. వేమన పార్ట్ కోసం వేమారెడ్డిని హడావుడిగా చుట్టేసినట్లు అనిపించింది.

ఈ సినిమాలోని ఇంత గొప్పలోపాన్ని కనుగొన్న నేను మిక్కిలి సంతసించాను. ఒక గొప్ప సినిమాలో అతి పెద్ద లోపాన్ని కనిపెట్టాను. శెభాష్! ఆలస్యమేలా? పోస్ట్ రాసేద్దాం. ఇంతలోనే ఒక అనుమానం. ఆపాటి ఆలోచన కె.వి.రెడ్డికి తట్టలేదా? నా అవగాహనలో ఎక్కడో ఏదో తేడా ఉంది! ఏమిటది? కావున, సినిమా మొత్తం మళ్ళీ చూశాను. పిమ్మట జ్ఞానోదయం కలిగింది.

'పాండురంగ మహత్యం' పుండరీకుడు వెధవన్నర వెధవ, అర్ధరాత్రి తలిదండ్రుల్ని వెళ్ళగొట్టిన కామాంధుడు. వాడికి కాళ్ళు పోయినప్పుడు మాత్రమే బుద్ధొస్తుంది. చేసిన పాపాలకి పశ్చాత్తాపంతో దహించుకుపోతాడు. కాళ్ళొచ్చిన తరవాత భక్తుడిగా కంటిన్యూ అయిపోతాడు. పుండరీకునికీ, వేమనకీ అస్సలు సామ్యం లేదు.

వేమారెడ్డి సౌమ్యుడు, అభ్యుదయవాది. దేవుడి వస్త్రం తీసుకెళ్ళి చలికి వణుకుతున్న పేదవృద్ధురాలికి కప్పిన మానవతావాది. మోహనాంగిని కూడా నిజాయితిగానే ప్రేమిస్తాడు. అతనికి రాళ్ళనీ, రప్పల్నీ కొలవడం ఇష్టముండదు. అతనిలో జ్యోతి మరణం అంతులేని ఆవేదనని కలుగజేస్తుంది. చావుపుటకల మర్మం గూర్చి నిర్వేదంలోకి వెళ్ళిపోతాడు. తను పాపాలు చేశాననే భావం అతనికుండదు. అసలు పాపపుణ్యాల అస్థిత్వాన్నే ప్రశ్నించే యోగస్థాయికి చేరుకుంటాడు.

మరి - మొన్న ఈ సినిమాలో గొప్పలోపం కనిపెట్టాననుకుని గర్వించానే! కారణమేమి? అనాదిగా తెలుగు సినిమాల్లో పాత్రలు బ్లాక్ అండ్ వైట్ లో, స్టీరియోటైప్డ్ గా ఉంటున్నాయి. మనం వాటికే బాగా అలవాటయి ఉన్నాం. నేనూ ఆ ట్రాప్ లో పడ్డాను.

వేమారెడ్డి వేశ్యాలోలుడు. కాబట్టి చెడ్డవాడు. స్త్రీలోలులకి ఇంకే ప్రయారిటీస్ ఉండరాదు. నాకున్న ఈ చెత్త ఆలోచన మూలంగా.. వేమారెడ్డికి అన్నవదినల పట్ల గౌరవం, పసిదాని పట్ల అంతులేని ప్రేమ కలిగి ఉండటాన్ని అర్ధం చేసుకోలేకపొయ్యాను. వేమారెడ్డిలోని డిఫరెంట్ షేడ్స్ ని దర్శకుడు మొదట్నుండీ చూపుతూనే ఉన్నాడు. నాకే సరీగ్గా అర్ధం అయ్యి చావలేదు.

నేను వేమారెడ్డి పాత్రని అర్ధం చేసుకోడంలో పప్పులో కాలేశాను. కావున పై విషయాలు రాయకూడదనుకున్నాను. కానీ - ఈ పోస్ట్ యోగి వేమన సినిమా గూర్చి నా ఆలోచనలు. కావున అన్ సెన్సార్డ్ గా ఇన్ టోటో రాద్దామని నిర్ణయించుకుని, రాస్తున్నాను.

చిన్నారి జ్యోతి చనిపోయిన తరవాత నాగయ్య నటన గూర్చి వర్ణించడానికి నాదగ్గర భాష లేదు. అంధ బిక్షకురాలి (అంజనీబాయి - సినిమాల్లో నటీమణులకి మేకప్ ఆర్టిస్ట్) బొచ్చెలోంచి అన్నం తింటూ నాగయ్య అద్భుత నటన ప్రదర్శించాడు. వేమన పద్యాలు ఆలపించేప్పుడు నాగయ్య అభినయం అద్భుతం. ఇక చివరి సీన్ తరవాత మహానటుడు నాగయ్య నటనా ప్రతిభకి చేతులెత్తి నమస్కరించడం మినహా చెయ్యగలిగిందేమీ లేదు. నేనదే చేశాను!

2.లింగమూర్తి :- అభిరామ్.

ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందరూ నాగయ్య గూర్చే చెబుతుంటారు. వంకాయకూర బాగుంటే నాణ్యమైన వంకాయల్నీ, వంటమనిషిని మెచ్చుకుంటాంగానీ - ఉప్పూ, కారాల్ని మెచ్చుకోం. కానీ అవి లేకుండా కూరే లేదు. కానీ వాటికి అంత గుర్తింపు ఉండదు. అందుకే - చిత్తూరు నాగయ్య అనే మర్రిచెట్టు ఇతర పాత్రధారుల ప్రతిభని కప్పెట్టేసిందని సినిమా రెండోసారి చూస్తేగానీ తెలీదు.

అభిరాముడిగా ముదిగొండ లింగమూర్తి నటన సూపర్బ్. చాలా సహజంగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో నాగయ్యకి పోటీగా తట్టుకుని నిలబడ్డాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. నాకు మహామంత్రి తిమ్మరసు, పాండవ వనవాసం సినిమాల్లోని 'దుష్ట' లింగమూర్తి తెలుసు. 'సాత్విక' లింగమూర్తి తెలీదు.

'పెళ్లిచేసిచూడు' లో దొరస్వామి కూడా నాకిట్లాంటి షాకే ఇచ్చాడు. ఈ పాత సినిమాలు చూస్తుంటే క్రమంగా నాకొక విషయం అర్ధమవుతుంది. పాతతరం నటులైన లింగమూర్తి, దొరస్వామి వంటి గొప్ప ప్రతిభావంతులని మనకి తెలీదు. అందుకే సూపర్ హిట్టయిన సినిమాలు ఒకటో, రెండో చూసి ఏదో సాదాసీదా సపోర్టింగ్ ఆర్టిస్టుల్లే అనుకుంటాం.. కానీ కాదు.

3.M.V.రాజమ్మ :- మోహనాంగి.

రాజమ్మ గూర్చి ఎంత రాసినా తక్కువే! అందం, అభినయం, గానం, నాట్యం.. అన్నీ అద్భుతమే! ఐ యామ్ ఇన్ లవ్ విత్ దిస్ బ్యూటీ! అయితే అప్పటికి నేనింకా పుట్టలేదు. అందువల్ల బి.ఆర్.పంతులు ఆ చాన్స్ కొట్టేశాడు. రాజమ్మ తన ఆటపాటలతో దుమ్ము దులిపేసింది.

రాజమ్మ గుళ్ళో ఆడిన పాటలో వెనక నల్లగా, పీలగా, నెత్తి మీద (తల కన్నా పెద్దదైన) పాగ పెట్టుకుని తాళం వేస్తూ ఒకాయన ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఆయన మన ఘంటసాల మాస్టారు! ఘంటసాల పక్కన బక్కగా, పొట్టిగా ఉన్న అమ్మాయి సీత (దేవదాసులో పార్వతి స్నేహితురాలు మనోరమ). సినిమాలో మోహనాంగి చెల్లెలు 'కనకం' పాత్ర వేసింది.

4.కాంతామణి :- మోహనాంగి తల్లి.

ఈ సినిమాలో నన్ను ఆశ్చర్యపరచేంత సహజంగా నటించిన నటి. వేశ్యమాతగా నటించిన కాంతామణి సూర్యాకాంతం, చాయాదేవిలతో పోల్చదగినంతటి ప్రతిభావంతురాలు. ఆవిడ ఆంగికం, వాచకం గ్రేట్! ('దొంగరాముడు' లో 'నే చచ్చిపోతారా భద్రుడూ!' అంటూ రేలంగి తల్లిగా కూడా నటించింది.)

5.నరసమాంబ (వేమన వదిన) :- పార్వతీబాయి.

వేమారెడ్డి వదిన నరసమాంబగా పార్వతి బాయి చక్కగా ఉంది. వేమారెడ్డికి బాధ్యతల్ని గుర్తు చేస్తూ - ఒక పక్క అతనిపై ప్రేమ, అభిమానం.. ఇంకోవైపు చెడిపోతున్నాడన్న బాధ.. ఎంతో ఉదాత్తంగా, డిగ్నిఫైడ్ గా నటించింది.

6.జ్యోతి :- బేబీ కృష్ణవేణి.

ముద్దుగా చక్కగా చేసింది. ఈ పాపకి ఇప్పుడు డెబ్భైయ్యైదేళ్ళు దాటి ఉంటాయి. ఇప్పుడెవరైనా టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే బాగుండు. 

F.నేపధ్య గానం :-

1.నాగయ్య :-

నాగయ్య గానం గూర్చి రాసేంత శక్తిమంతుణ్ని కాదు.. శిరసు వంచి పాదాభివందనం చేయడం తప్ప! అయితే చిన్న పాయింట్.. అందరూ 'అందాలు చిందేటి నా జ్యోతి.. ' పాటని మెచ్చుకుంటారు. నాకు మాత్రం శ్మశానంలో వచ్చే నేపధ్యగానం 'ఇదేనా.. ఇంతేనా.. ' పాట చాలా ఇష్టం. ఇంత మంద్రస్థాయిలో పాడటం నాగయ్యకే చెల్లింది. (ఈ పాట నన్నెంతగా ఏడిపించిందో ఇంతకు ముందు రాశాను.)

2.బెజవాడ రాజారత్నం :-

నాకు ఈ సినిమా చూసేదాకా బెజవాడ రాజారత్నం గూర్చి తెలీనందుకు సిగ్గుపడుతున్నాను. చాలా క్లీన్ వాయిస్. అద్భుత గానం. 'మాయలు పడకే మనసా.. ' అంటూ స్పాంటేనియస్ గా, అలవోకగా పాడేసింది. నేను ఈవిడ గూర్చి తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉంది.

G.సంగీతం :- చిత్తూరు నాగయ్య

వేమన పద్యాలకి 'సంగీత దర్శకుడు' నాగయ్య చాలా భావయుక్తంగా ట్యూన్లు చేశాడు. 'గాయకుడు' నాగయ్యతో అద్భుతంగా పాడించాడు. ముఖ్యంగా 'గంగిగోవు పాలు చాలు.. ' సూపర్బ్.

సినిమా మూడ్ క్యారీ చెయ్యడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన పాత్ర వహించిందని నా అభిప్రాయం.. ముఖ్యంగా చివరి సీన్లో.

H. మాటలు, పాటలు :- సముద్రాల రాఘవాచార్య

మాటలు మనం మన ఇంట్లో మాట్లాడుకున్నట్లుగానే ఉన్నాయి. ఏ పాత్రా ఒక్క వాక్యం కూడా 'అతి'గా మాట్లాడలేదు.నాకు మాటలు ఇలా పొదుపుగా ఉంటేనే ఇష్టం. ఇక పాటల సాహిత్యం గూర్చి ఇవ్వాళ నే కొత్తగా చెప్పేదేముంటుంది?!

I.మేకప్ :- హరిబాబు.

యోగసిద్ధి సాధించిన వేమనని కె.వి.రెడ్డి వేమన పద్యాలతో క్రమేపి వృద్ధుడిగా మార్చేస్తాడు. అసలీ ఐడియా వచ్చినందుకే కె.వి.రెడ్డిని మనం అభినందించాలి. ఇంకో దర్శకుడైతే కథని ముందుకు నెట్టడానికి ఏం చెయ్యాలో తోచక గిలగిల్లాడి చచ్చేవాడు. కె.వి.రెడ్డి మాత్రం ఈ ఫీట్  హరిబాబు మేకప్ (మార్కస్ బార్ట్లే ఫొటోగ్రఫీ కూడా) సాయంతో అవలీలగా చెయ్యగలిగాడు. ఈ మేకప్ హరిబాబు 1947 లోనే వండర్స్ చేశాడు.. అసాధ్యుడులాగున్నాడు.

ఇంతటితో యోగి వేమన సినిమా 'కంటెంట్' గూర్చి నా ఆలోచనలు రాయడం అయిపోయింది.

J.సినిమాతో సంబంధం లేని ఆలోచన.

ఈ సినిమా ఎప్పుడు చూసినా రెండ్రోజుల దాకా వైరాగ్యం నన్ను వదలదు.జీవితంపై విరక్తి కలుగుతుంది. 'రోగి ఎవ్వడు? డాక్టరెవ్వడు? భార్య ఎవరు? జీవితమంతయూ మిధ్యయే కాదా? మరప్పుడు ఈ వెధవ జీవితానికి అర్ధమేమిటో విశ్వదాభిరామ వినురవేమ!' అనే మూడ్ లో ఉండిపోతాను. (గుంటూరులో గుహలు లేవు కాబట్టి బ్రతికిపొయ్యాను. లేకపోతే నేనూ ముమ్మిడివరం బాలయోగిలా అయిపొయ్యేవాణ్ణేమో!)

అరవయ్యైదేళ్ళ తరవాత సినిమా చూసిన నాకే ఇంత వైరాగ్యం కలుగుతుందంటే, నటించిన నాగయ్యకి ఇంకెలా ఉండాలి? అందుకే నాగయ్య నిజజీవితంలో కూడా బైరాగి అయిపొయ్యాడు. కష్టాలు పడ్డాడు. నాగయ్య ఇలా అయిపోవడం occupational hazard క్రిందకి వస్తుందా?!

చివరి మాట :-

ఈ సినిమా గూర్చి నా ఆలోచనలు మొత్తంగా మూట కట్టి దాచుకోవాలనే కోరికే నన్నీ పోస్ట్ రాయించింది. చదువుకోడానికి కొద్దిగా నిడివి ఎక్కువైందని తెలుసు. క్షమించగలరు.

(ఈ పోస్ట్ నా సైకోథెరపిస్ట్ చిత్తూరు నాగయ్యకి నేను సమర్పించుకున్న ఫీజు. హమ్మయ్యా! ఇప్పుడు ఋణ విముక్తుడనైనాను.)

(photos courtesy : Google)

Monday, 21 January 2013

అవే కళ్ళు!


భయంగా ఉంది. దడగా ఉంది. కాళ్ళల్లో వణుకు. అప్పటికీ భయమేసినప్పుడల్లా కళ్ళు మూసుకుంటూనే ఉన్నాను. అయినా లాభం లేకపోతుంది. భీతి గొలిపే శబ్దాలతొ హాలంతా మారుమోగుతుంది. సినిమాలో ఎప్పుడు ఎవడు చస్తాడోనని టెన్షన్తో వణికి చస్తున్నాను.

అసలు ఇంట్లోనే ఉండిపోతే హాయిగా ఉండేది. నాకు బుద్ధి లేదు. హాయిగా రాము గాడితో గోళీలాట ఆడుకుంటే పొయ్యేది. నా సినిమా పిచ్చే నా కొంప ముంచింది.  పోయిపోయి ఈ భయానక సినిమాలోకొచ్చి పడ్డాను. 'హే భగవాన్! ఈ సినిమా తొందరగా అయిపోయేట్లు చెయ్యి తండ్రి!'

నాకు సినిమాలంటే వెర్రి అభిమానం. సినిమా హాల్ గేట్ దగ్గర టిక్కెట్లు చించే వాళ్ళు నా హీరోలు. వెనక బొక్కల్లోంచి సినిమా వేసే ప్రొజక్షనిస్టులు నా దృష్టిలో గొప్ప ఇంజనీర్లు. వాళ్ళని కళ్ళార్పకుండా ఎడ్మైరింగ్ గా చూసేవాడిని. ఇంచక్కా రోజూ సినిమా అన్ని ఆటలు ఫ్రీగా చూస్తున్న అదృష్టవంతులు వారు.. కొద్దిగా కుళ్ళుగా ఉండేది.

ఆ రోజుల్లోనే పెద్దయ్యాక సినిమా హాల్లోనే ఏదోక ఉద్యోగం చెయ్యాలని నిర్ణయించేసుకున్నాను. అయితే ఎవరన్నా అడిగితే 'పెద్దయ్యాక డాక్టర్నవుతాను' అని గొప్ప కోసం అబద్దం చెప్పేవాడిని. ఏ ఉద్యోగం చేసినా.. ఎంత సంపాదించినా.. రోజుకి కనీసం మూడు సినిమాలు చూడాలని మాత్రం ఎప్పుడో డిసైడయిపొయ్యాను. జేబు నిండుగా డబ్బులుంచుకుని కూడా సినిమా చూడని ఈ పెద్దవాళ్ళు ఎంత అజ్ఞానులో కదా!

ఇంతటి సినిమా పిచ్చి గల నేను.. పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి సినిమా చూడ్డానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదని మనవి చేసుకుంటున్నాను. రోజుకో సినిమా చూసే అదృష్టాన్ని ప్రసాదించమని మా బ్రాడీపేట శివాలయంలో నుదుటిన అడ్డంగా విబూది రాసుకుని, ఎగ్గిరి గంట కొట్టి మరీ ప్రార్ధించేవాణ్ని.

దేవుడు దయామయుడు. బాలల పక్షపాతి. అందుకే నా సినిమా వీక్షక యజ్ఞం అవిచ్చిన్నంగా కొనసాగింది. అయితే అన్ని రోజులు మనవి కావు. నా జీవితంలో ఓ దుర్దినాన.. చిన్న మావయ్య, అన్నయ్య సినిమాకి బయలుదేరారు. మా బ్రాడీపేటలో గల ఏకైక సినిమా హాలు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్. అందులో ఏదో 'అవేకళ్ళు' అనే సినిమా అట. అందునా అది పంచ రంగుల చిత్రం. వదలివేయు నా తరమా! నేనూ బయల్దేరాను.

సినిమా అంతా రంగుల మయం. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎప్పుడూ చూసే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో తెల్లగా కనిపించే ఆకాశం ఇప్పుడు నీలంగానూ, నల్లగా కనబడే రక్తం ఎర్రగానూ కనిపిస్తుంటే.. చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. సినిమా సరదాగా మొదలైంది. కానీ క్రమేపి హత్యలతో సస్పెన్స్ గా మారిపోయింది. ఒక్కొక్క క్యారెక్టర్ చచ్చిపోసాగింది. సినిమా సరీగ్గా అర్ధమై చావట్లేదు గానీ.. బాగా భయం వెయ్యసాగింది.

ఉన్నట్లుండి సినిమా హాలు ఒక స్మశానంగానూ, ప్రేక్షకులంతా నన్ను పీక్కుదినబోయే రక్తపిశాచాల్లాగానూ కనిపించసాగారు. ఏమిటి నాకీ దుస్థితి? ఈ భీకర సినిమాలో ఇట్లా ఇరుక్కుపోయానేంటబ్బా! మొత్తానికి చివరకి హంతకుడెవరో తెలిసింది. (అందరూ అనుకున్నట్లు రాజనాల హంతకుడు కాదు.) ఆ హంతక విలన్ హీరో కృష్ణ చేతిలో చావను కూడా చచ్చాడు. ఇక్కడ భయంతో నేను చచ్చే చావు చస్తున్నాను. హాల్లో లైట్లేశారు. హమ్మయ్య! బ్రతుకు జీవుడా అనుకుంటూ హాల్లోంచి బయటపడ్డాను.

రాత్రి సరీగ్గా నిద్ర పట్టలేదు. పంచరంగుల సినిమా అని ముచ్చటపడ్డాను గానీ.. ఆ ఎర్రటి నెత్తురు గుర్తొస్తేనే భయమేస్తుంది. నిద్రలో ఒక పీడ కల. సినిమాలో కనిపించిన హంతకుడు నన్నూ చంపేశాడు. నా ఒళ్ళంతా ఒకటే నెత్తురు. ధారలుగా కారిపోతుంది. ఆ నెత్తురుతో పక్కంతా చల్లగా అయినట్లు అనిపించింది. ఆ తరవాత ఏమైందో గుర్తు లేదు!

తెల్లవారింది. ఎవరో అరుస్తున్నారు. ఎవరు చెప్మా? ఇంకెవరు? అక్క! ఎవర్నో తిడుతుంది. గుడ్లు నులుముకుంటూ, బాగా మెలకువ తెచ్చుకుని, కళ్ళు చిలికించి చూశాను. అక్క తిట్టేది ఎవర్నో కాదు. నన్నే! గదంతా బాత్రూం కంపు.

"అమ్మడూ! వాడి పక్కబట్టలు విడిగా ఒక బకెట్లో నానబెట్టవే. కనబడిన ప్రతి అడ్డమైన సినిమాకి పోవడం.. రాత్రుళ్ళు పక్క ఖరాబు చెయ్యడం. దొంగ గాడిద కొడుకు. ఆ ఉచ్చగుడ్డలు వాడితోనే ఉతికిస్తే గాని బుద్ధి రాదు." నాన్న ఎగురుతున్నాడు.

అమ్మ అన్నయ్యని కేకలేసింది. "చిన్నపిల్లల్ని అట్లాంటి సినిమాలకి ఎవరైనా తీసుకెళ్తారా? ఆ దరిద్రపుగొట్టు సినిమా చూసి బిడ్డ దడుచుకున్నాడు. పాపం! వాడు మాత్రం ఏం చేస్తాడు." అంటూ 'నేరం నాది కాదు.. సినిమాది' అని తేల్చేసింది.

సిగ్గుతో, లజ్జతో.. అవమాన భారంతో.. తేలు కుట్టిన దొంగవలె (దొంగలనే తేళ్ళు ఎందుకు కుడతాయో!) నిశ్శబ్దంగా అక్కణ్ణుంచి నిష్క్రమించాను. ఇదీ నా 'అవేకళ్ళు' కథ. మిత్రులారా! ఇక్కడ దాకా చదువుకుంటూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఆ కంటితోనే ఈ సూపర్ హిట్ సాంగ్ కూడా చూసి ఆనందించండి.

(

photo courtesy : Google)

Friday, 11 January 2013

ఘంటసాలా! ఓ ఘంటసాలా!


"ఘంటసాల గొప్పేంటో నాకర్ధం కాదు. ఆయన స్వరం ఒక అద్భుతం. ఎన్నో యేళ్ళు శాస్త్రీయ సంగీతం అభ్యసించాడు. మంచి సంగీత విద్వాంసుడు. ఆయనకి ఆ స్వరం దేవుడిచ్చిన వరం. అందులో పదో వంతు వాయిస్ నాకున్నా ఆంధ్రదేశాన్ని ఊపేసేవాణ్ణి." అనేవాడు నా స్నేహితుడు.

"నిజమే కదా!" అనుకునేవాణ్ణి.

మరి మన తెలుగువారిలో ఘంటసాలంతటి చక్కటి గాత్రం కలవారెవరూ లేరా? ఉండొచ్చు. ఘంటసాలకున్నంత శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం కలవారు ఇంకెవరూ లేరా? ఉండొచ్చు. మరి మనం ఘంటసాలనే ఇంకా ఎందుకు తలచుకుంటున్నాం? ఇందులో మతలబు ఏమిటి? విషయం నా స్నేహితుడు చెబుతున్నంత సింపుల్ కాదు.

సినిమా పాటలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమా అనేది ఒక దృశ్య రూపం. తెరపై ఒక సన్నివేశం నడుస్తుంటుంది. పాత్రధారులు నటిస్తుంటారు. ఒక పుస్తకం చదువుతున్నట్లుగా ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. ఉన్నట్లుండి పాట మొదలవుతుంది.

సినిమా పాట ప్రయోజనం ఆ సన్నివేశాన్ని మనసుకు హత్తుకు పోయేట్లు ముద్రించడం.. కథని ముందుకు నడిపించడం. అప్పటిదాకా తన గొంతుతో మాట్లాడిన పాత్రధారి హఠాత్తుగా గాయకుని గొంతులోకి మారిపోతాడు. వ్యవహారిక భాష గ్రాంధికంగా మారినట్లు.. గద్యం పద్యమైపోయినట్లు.. నటుని వాయిస్ గాయకుని స్వరంగా మారిపోతుంది.

ప్రధాన నటుడు సినిమా అంతా ఉంటాడు. తన హావభావాలతో క్యారెక్టర్ ని పండిస్తూ.. ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి అతనికి కావలసినంత సమయం ఉంటుంది. ఆ సౌలభ్యం గాయకుడికి ఉండదు. అతడు తన గొంతుతో పాత్రలోకి పరకాయ ప్రవేశం చెయ్యాలి. ఆ పాత్ర స్వభావం, సన్నివేశం.. 'ఫీల్' అవ్వాలి. సమయం చాలా పరిమితం. ఆ కొద్ది నిముషాల్లోనే నటుణ్ణీ, సన్నివేశాన్ని ఎలివేట్ చెయ్యగలగాలి.



నా వాదనకి ఉదాహరణగా పాండురంగ మహత్యం సినిమాని ప్రస్తావిస్తాను. కాళ్ళు కోల్పోయిన పుండరీకుడు 'అమ్మా అని అరచిన ఆలకించవేమమ్మా.. ఆవేదన తీరు రోజు ఈ జన్మకి లేదా?' అంటూ పిచ్చివాడిలా తలిదండ్రుల కోసం పరితపిస్తూ పాడతాడు. పాట చివర్లో ఘంటసాల తన హెవీ బేస్ వాయిస్ లో 'అమ్మా! నాన్నా!' అంటూ చేసే ఆర్తనాదాలు మన గుండెల్ని పిండేస్తాయి.

తలిదండ్రుల దర్శనం చేసుకున్న పుండరీకుడు 'ఏ పాదసీమ కాశీప్రయాగాది.. ' అంటూ ఆర్తిగా ఆలాపించే శ్లోకంలో ఘంటసాల స్వరం పుండరీకుని భావావేశాన్ని పూర్తిగా నింపుకుంది. సినిమాకి ఎంతో ముఖ్యమైన ఈ సన్నివేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంలో ఘంటసాల గాత్రం పాలు చాలా ఎక్కువ. మిగిలిన కొద్ది పని పూర్తి చెయ్యడం రామారావుకి చాలా ఈజీ అయిపోయింది. ఒక అత్యున్నత గాయకుడు సన్నివేశ స్థాయిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలడో ఈ ఉదాహరణ నిరూపిస్తుంది.

సినిమా పాటలు అనేక రకాలు. కొన్ని పాటలు కచేరీల్లో పాడుకోడానికి అనువుగా శ్రావ్యంగా ఉంటాయి. చక్కటి స్వరం, కొద్దిపాటి స్వరజ్ఞానం ఉన్నవారెవరైనా ఈ పాటలు పాడెయ్యవచ్చు. ఈ పాటలు ఘంటసాల కాఫీ తాగినంత సుఖంగా పాడెయ్యగలడు. పాడేశాడు కూడా. ఇంకొన్ని పాటలు సన్నివేశంలో మమేకమై.. ఆ సన్నివేశాన్ని ఎలివేట్ చేసే పాటలు. నా దృష్టిలో ఇవి బహుకష్టమైన పాటలు. ఈ 'బహుకష్టం' కేటగిరీ ఘంటసాల స్పెషాలిటీ.

మీరు యాభై, అరవైలలోని తెలుగు సినిమాల్ని జాగ్రత్తగా గమనిస్తే.. నే చెప్పే విషయం అర్ధమైపోతుంది. ఘంటసాల స్వరం కథలో ఇమిడిపోతుంది. కథని చెప్పేస్తుంది. ముందుకు నడిపిస్తుంది. ఇదేమి సామాన్యమైన విజయం కాదు. అయితే ఘంటసాల గానం ఈ పని చాలా అవలీలగా, అలవోకగా చేసేసింది. దటీజ్ ఘంటసాల!

(photo courtesy : Google)

Monday, 7 January 2013

దేవుడు చేసిన మనుషులు!


"అయాం సారీ! నేను వైజాగ్ రావట్లేదు." పొద్దున్నే మావాడి ఫోన్.

ఒక క్షణం మావాడు చెప్పేది అర్ధం కాలేదు. నా చిన్ననాటి స్నేహితులు అనేక దేశాల్లో స్థిరపడ్డారు. ఎవరు ఇండియా వచ్చినా రోజంతా ఏదోక ఊళ్ళో.. ఓ హోటల్ రూంలో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తాం.

సిగరెట్లతో, సింగిల్ మాల్ట్ తో.. కబుర్లు నిరంతరంగా అలా సాగిపోతుంటాయి. అవొక అరాచక దుష్ట దుర్మార్గ వికృత నికృష్ట పిశాచాల శిఖరాగ్ర సమావేశాలు. ఇవి మా స్నేహబృందానికి అత్యంత ఇష్టం. ఇటువంటి పరమ పవిత్రమైన ప్రోగ్రాం ఒకటి రేపు వైజాగ్ లో ఉంది.

"నిన్నటిదాకా వస్తానని ఎగిరావుగా. అంతలోనే ఏం రోగమొచ్చింది?" కోపంగా అన్నాను.

"అర్జంటుగా పనొకటి.. " నసిగాడు మా వాడు.

"నాకు తెలుసు. నీ భార్య వద్దనుంటుంది." నిష్టూరంగా అన్నాను.

"ఈ మధ్యనే గదా హైదరాబాదులో కలుసుకున్నారు. మళ్ళీ అంతలోనే ఎందుకని మా ఆవిడ అంటుంది." హత్యానేరం ఒప్పుకుంటున్న వాడిలా గొణిగాడు.

"అది ఆవిడ అభిప్రాయం. ఆవిడేమీ మనకి ప్రోగ్రాం డైరక్టర్ కాదు. నీ అభిప్రాయమేంటి? అది చెప్పు." గద్దించాను.

"మా ఆవిడని కాదని రావాలంటే నాకు భయంగా ఉంది." వణుకుతున్న కంఠంతో అన్నాడు మావాడు.

"అట్లా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదూ! ఒక పన్జెయ్యి. నీ భార్య మెళ్ళో మంగళ సూత్రం ఉంది కదా! దాన్ని నీ మెళ్ళో వేసుకో. పొద్దున్నే లేచి ఆవిడ కాళ్ళకి దణ్ణం పెట్టుకుని.. చీపురుతో వాకిలి చిమ్ముతూ 'ముత్యమంతా ఛాయ ముఖమంతా' అంటూ పాడుకో. ఆ తరవాత అంట్లు తోముకుంటూ తరించు." కసిగా అన్నాను.

"నువ్వలా అంటుంటే దిగులేస్తుంది. ఏదోక ఉపాయం ఆలోచించాలి.. " బేలగా అన్నాడు.

"చించకు. నువ్వు బాపు సినిమాలో సంగీతవి. విశ్వనాథ్ సినిమాలో జయప్రదవి. తాజ్ హోటల్లో కసబ్ వి." కర్కశంగా అన్నాను.

"ఏదోటి చెయ్యాలి. ఆలోచిస్తున్నాను." నీరసంగా అన్నాడు.

"అవును. తప్పకుండా చెయ్యాలి. నీ భార్య కాళ్ళ దగ్గర తోక ముడుచుకుని పడుకోవాలి!" అంటూ విసుగ్గా ఫోన్ కట్ చేశాను.

ఛీ.. ఛీ.. లోకంలో ఇట్లాంటి వెధవలు కూడా ఉంటారా! పనికిమాలిన సన్నాసి. ఇట్లాంటి దుష్టుల్ని దున్నపోతుల్తో కుమ్మించాలి. పూర్తిగా మూడాఫ్ అయిపొయింది.

ఇటువంటి సమయంలో.. మనశ్శాంతి కోసం యూట్యూబ్ లో పాత తెలుగు సినిమా పాటలు చూడటం నాకు అలవాటు, ఇష్టం. ఇప్పుడు ఒక మంచి పౌరాణిక చిత్రం పాట చూస్తాను. మరింత హాయిగా ఉంటుంది.

ఇంకెందుకాలస్యం? యూట్యూబ్ లోకి వెళ్లాను. నా అభిమాన నటుడు ఎన్టీఆర్. అన్నగారు! నమస్తే! నా అభిమాన గాయకుడు ఘంటసాల. మాస్టారు! మీకు పాదాభివందనం. ఏవిటబ్బా ఈ పాట? ఓహో! కృష్ణార్జున యుద్ధం. కె.వి.రెడ్డి కళాఖండం. కృష్ణుడి పాట. బాగుబాగు. ఇప్పుడే చూచెదను. ప్రశాంతత నొందెదను.




పాట చూస్తుంటే స్టార్ హోటల్లో పెసరట్టు తిన్నంత వికారంగా అనిపించింది. ఉన్న నాలుకకి మందేస్తే కొండ నాలుక పోయినట్లు.. ప్రశాంతత కోసం యూట్యూబ్ లో కెళితే.. అశాంతతతో మనసంతా అల్లకల్లోలమై పోయింది. కె.వి.రెడ్డి వంటి మహానుభావుడు కూడా ఇట్లాంటి పాటల్ని చిత్రీకరిస్తే ఇక మగవాడి మొర ఆలకించే వారెవరు?

అయినా ఈ కృష్ణుడి కిదేం బుద్ధి! పదహారు వేల మంది భార్యలున్నారు గదా. ఎవరోకరి ఇంటికెళ్ళి.. ఏ గుత్తొంకాయ కూరతోనో నాలుగు ముద్దలు తిని హాయిగా దుప్పటి కప్పుకుని బజ్జోవచ్చు గదా! తగుదునమ్మా అంటూ కిరీటాన్ని తన్నించుకున్నదే గాక.. సత్యభామ కాలు కందిపోయిందేమోనని ఆందోళన చెందుతున్నాడు. చూడబోతే మావాడి వంటి భార్యా బానిసలకి ఈ శ్రీకృష్ణుడే ఆది పురుషుని వలె గోచరించుచున్నాడు.

సర్లే! పొరబాటున ఓ పాట చూసితిని. అన్నీ అలాగే ఉండాలని లేదు. ఇప్పుడు ఇంకో విడియో చూసి సేద తీరెదను. ఎన్టీఆర్, ఘంటసాల కాంబినేషన్ గిట్టుబాటుగా లేదు. వీళ్ళని వదిలేసి వేరొకరి విడియో చూస్తే! నో.. నో.. అట్లా పార్టీలు మార్చడానికి నేనేమన్నా పొలిటీషియన్నా! కాదు గదా! అంచేత.. ఇంకొకటి చూద్దాం. కావున.. ఇంకో పాట..మళ్ళీ ఎన్టీఆర్, ఘంటసాల కాంబినేషన్ లోనే.




చచ్చితిని. ఈ పాటలో కూడా కృష్ణుడు మళ్ళీ సత్యభామతో కిరీటాన్ని తన్నించుకున్నాడు. దానికి తోడు పాట చివర్న నంది తిమ్మన 'పారిజాతాపహరణం' పద్యమొకటి! చిరాకేసింది. లాప్ టాప్ షట్ డౌన్ చేశాను. కాఫీ తాగుతూ.. ఆలోచించసాగాను. బుర్ర పనిచెయ్యడం మొదలెట్టింది.

ఈ భార్యలతో తన్నించుకోడంలో నాకు అర్ధం కాని మర్మమేదో దాగియున్నది. ఎన్టీఆర్ అంతటి వాడే ఒకసారి ఎస్.వరలక్ష్మి, ఇంకోసారి జమున.. కాళ్ళ దగ్గరకి చేరాడంటే.. నా అవగాహనలో లోపమేమన్నా ఉందా!

అందునా మావాడి భార్య గట్టిది. ఒకసారి పండక్కి పట్టుచీర కొన్లేదని ఉరేసుకోబోయింది. ఆవిడ స్థూలకాయురాలు కావున తాడు తెగి కిందబడింది గానీ.. లేకపోతే పోలీసుల చేతిలో మావాడి తాడు తెగేది! మావాడు అర్భకుడు. అమాయకుడు. వీధి కుక్కని చూస్తేనే వణికిపోతాడు. అట్లాంటిది.. భార్యకి ఎదురొడ్డి ఎలా పోరాడగలడు? అయ్యో! మిత్రమా! నీ సాధక బాధలు గుర్తించక ఎన్నేసి మాటలన్నాను! ఈ పాపిని క్షమించు.

ఇంతలో మావాడి ఫోన్.

"మిత్రమా! కాకిలా నీకు నూరేళ్ళాయుష్షు. నేనే ఫోన్ చేద్దామనుకుంటున్నా. నువ్వు వైజాగ్ రావద్దులే. నీ సమస్య నాకర్ధమైంది. ఇందాక నోరు చేసుకున్నాను. సారీ!" అన్నాను.

"నువ్వెందుకు సారీ చెబుతున్నావో నాకర్ధం కావట్లేదు. నువ్వు నా కళ్ళు తెరిపించిన జ్ఞానివి. నువ్వా మాత్రం నన్ను తిట్టకపోతే.. జీవితంలో స్నేహితులతో కలిసి మందు కొట్టడాన్ని మించిన ధర్మం వేరేది లేదనే జ్ఞానోదయం నాకు అయ్యేది కాదు. నాకు పట్టుదల పెరిగేదే కాదు. అందుకే రోశయ్య లాంటి నేను రాజశేఖరరెడ్డిలా అయిపోయ్యాను. నా భార్యని ఒప్పించేశాను."

"ఎలా?" ఆసక్తిగా అడిగాను.

"నీకు తెలుసుగా.. మా ఆవిడ నాగార్జున ఫ్యాన్. అంచేత కల్యాణ్ జ్యూయెలర్స్ లో హారం కొనిస్తానని ప్రామిస్ చేశాను. పనీపాట లేకుండా బేకార్ గా రోడ్లంట తిరిగే మా బావమరిదికి ఉద్యోగం చూపిస్తానని కూడా నొక్కి వక్కాణించాను. మన ప్రోగ్రాంకి పర్మిషన్ సంపాదించాను. నన్ను ఎంతో ప్రేమగా తిట్టి నా కళ్ళు తెరిపించావ్. నీకు థాంక్స్! మన వైజాగ్ టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయా?" ఉత్సాహంగా అడిగాడు.

"జాగ్రత్త. ఇబ్బందుల్లో పడతావేమో!" హెచ్చరించాను.

"అయితే ఏంటంటా?" అంటూ ఓ నిర్లక్ష్యపు నవ్వు నవ్వి..

"గాడిద గుడ్డేం కాదు. అంతోటి చంద్రబాబే ఎడాపెడా వాగ్దానాలు చేసేస్తుంటే ఆఫ్టరాల్ నేనెంత? అప్పుడు సంగతి అప్పుడే చూసుకోవచ్చులే! ఇంతకీ టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయో లేదో చెప్పలేదు." అన్నాడు.

"నిన్ననే అయ్యాయి. సాయంత్రం కలుద్దాం." అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేశాను.

అమ్మయ్య! ఇప్పుడు నా మనసు ప్రశాంతంగానే కాదు.. ఆనందంతో తుళ్ళితుళ్ళి పడుతుంది. ఉత్సాహంతో ఎగిరెగిరి పడుతుంది.

చివరితోక..

నాకు ఈ పోస్టులో ఉంచిన రెండు పాటలు చాలా ఇష్టం. ఆ ముక్క రాసి లింక్ ఇచ్చేసి ఊరుకొవచ్చు.

కానీ.. ఇంతలో ఎప్పుడో చూసిన లారల్ అండ్ హార్డీ మూవీ గుర్తొచ్చింది. తన భర్త ఆలివర్ హార్డి, స్టాన్ లారల్ తో తిరిగి చెడిపోతున్నాడని.. హార్డి భార్య అతన్ని బయటకి పోనివ్వకుండా కాపలా కాస్తుంది.

ఆ స్టోరీ ఐడియా.. కృష్ణుడి పాటలకి కలిపేసి సరదాగా రాసేశాను.

(photo courtesy : Google)

Saturday, 8 December 2012

'పెళ్ళి చేసిచూడు'.. చూసేశా!


గత మూడ్రోజులుగా విజయా వారి 'పెళ్లి చేసిచూడు' సినిమా చూశాను. కుదురుగా కూర్చుని సినిమా చూసే ఓపిక ఎప్పుడో నశించింది. ట్రెడ్మిల్‌పై నడుస్తూ సినిమాల్ని ముక్కలుగా చూట్టం నాకు అలవాటు. ముక్కలుగా చూసిన 'పెళ్లి చేసిచూడు' సినిమా గూర్చి కొన్నిముక్కలు.


నచ్చిన అంశాలు :-

1.ఎన్టీరామారావు పాత్ర పేరు వెంకటరమణ (తెలుగులో ఇంతకన్నా గొప్ప పేరు లేదని నా ధృఢవిశ్వాసం). అత్యున్నతమైన ఈ పేరుని హీరోకి ఇవ్వడం చక్రపాణి, ఎల్వీప్రసాదుల అత్యుత్తమ అభిరుచికి తార్కాణం! ఎస్వీరంగారావు, డా.శివరామ కృష్ణయ్య రామారావుని 'రమణా!' అంటూ పిలిచినప్పుడల్లా నా మనసు ఆనందంతో గంతులేసింది.

2.ఎస్వీరంగారావు పోషించిన వియ్యన్న పాత్ర. చాలా విలక్షణంగా ఉంది. సినిమాకి ఈ పాత్ర ఒక ఎస్సెట్. మహంకాళి వెంకయ్య సీన్లు కొన్ని తగ్గించి ఎస్వీరంగారావు పాత్ర నిడివి పెంచినట్లయితే బాగుండేది.

3.ఘంటసాల సంగీతం పెద్ద ప్లస్ పాయింట్. పాటల గూర్చి కొత్తగా చెప్పటానికేమీ లేదు. విజువల్స్, నేపధ్య సంగీతం పాలూ నీళ్ళలా కలిసిపొయ్యాయి. కొన్ని దృశ్యాలు ఘంటసాల వల్లే ఎలివేట్ అయ్యాయి.

4.సిసింద్రీగా నటించిన బాలనటుడు మాస్టర్ కుందు ప్రతిభ. చక్కటి ఈజ్‌తో సరదాగా నటించేశాడు. కొన్ని సన్నివేశాల్లో జోగారావుని డామినేట్ చేసేశాడు.

5.ఎన్టీరామారావు రూపం. నాకు యాభైలలోని రామారావు రూపం చాలా ఇష్టం. గొప్ప అందగాడు. ఈ సినిమాలో మరీమరీ బాగున్నాడు.



హాశ్చర్యపరిచిన అంశం :-

'మిస్సమ్మ' లో మేరీ తండ్రిగా ఓ ముసలాయన గడ్డం, టోపీతో కనబడతాడు. ఆయన్ని ఆ పాత్ర కోసం ఏదో చర్చి ప్రేయర్లోంచి పట్టుకోచ్చారనుకున్నా. ఆయనే ఈ 'పెళ్లి చేసిచూడు'లో విలన్! పేరు దొరైస్వామి. నక్కజిత్తుల వాడిగా చక్కగా నటించాడు. ఇట్లాంటి పాత్రల్ని తరవాత రోజుల్లో రమణారెడ్డి, అల్లు రామలింగయ్యలు పోషించారు.


నచ్చని అంశాలు :-


1.సినిమా మొదలైన చాలాసేపటి దాకా ఎన్టీరామారావు (రమణ) కనిపించడు. ఈ సినిమాకి హీరో జోగారావేనేమో అన్న సందేహం కలుగుతుంది.

2.ఎన్టీఆర్ (రమణ) కనిపించిన మొదటి సీన్ పెళ్లి పీటలపై. కట్నం దగ్గర పేచీ వస్తుంది. తండ్రి ఆజ్ఞపై మూడు ముళ్ళు వేసి కూడా.. పీటల మీద నుండి లేచి వెళ్ళిపోతాడు. రమణని కట్నకానుకలకు వ్యతిరేకిగా ఎస్టాబ్లిష్ చేస్తూ పెళ్ళికి ముందు ఒక సీన్ ఉన్నట్లయితే బాగుండేది (నే చూసిన డివిడిలో అటువంటి సీన్లు ఎగిరిపోయ్యాయేమో తెలీదు).

3.రమణ తండ్రిగా డా.శివరామ కృష్ణయ్య చక్కగా నటించాడు. మంచివాడు. కానీ కోపిష్టి. కథంతా ఈ పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. దొరైస్వామి చెప్పినవన్నీ అమాయకంగా నమ్మేస్తాడు. ఈయన్ని కొడుకు, కోడలు మరీ వెర్రివాడిని చేస్తారు. 'పాపం! ఈ అమాయకుడి కోసం ఇన్ని వేషాలు అవసరమా?' అనిపిస్తుంది. ఈ పాత్రని కొంత తెలివిగా చూపిస్తే కథ ఇంకా కన్విన్సింగ్‌గా ఉండేదేమో.

ధర్మసందేహం :-

సూర్యాకాంతం సన్నగా, చిన్నదిగా ఉంది. అందంగా కూడా ఉంది. దొరైస్వామికి భార్యగా వేసింది. ఇంత చిన్న వయసులో తల్లి పాత్ర ఎందుకు వేసిందబ్బా?! 'బావ' అన్నప్పుడల్లా కూతుర్ని పుర్ర చేత్తో 'ఫెడీ' మనిపిస్తుంటుంది. ఆ తరవాత కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులకి సూర్యకాంతం తన చేతి చురుకు రుచి చూపించింది!

(photos courtesy : Google)

Wednesday, 14 November 2012

గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!

                                                  - 1 -

అమ్మానాన్నలతో  సినిమాకి  రెడీ  అయిపొయ్యాను.

"అమ్మా! ఏం సినిమాకెళ్తున్నాం?"

"కన్యాశుల్కం."

"పేరేంటి అలా ఉంది! ఫైటింగులున్నాయా?"

"ఉండవు. నీకు నచ్చదేమో. పోనీ సినిమా మానేసి ఆడుకోరాదూ!"

ఫైటింగుల్లేకుండా సినిమా ఎందుకు తీస్తారో! నాకు చికాగ్గా అనిపించింది. అయితే నాకో నియమం ఉంది. సినిమా చూడ్డనికి వచ్చిన ఏ అవకాశమూ వదలరాదు. నచ్చినా, నచ్చకపోయినా సినిమా చూసి తీరాలి. ఇది నా ప్రతిజ్ఞ!

అమ్మానాన్నల మధ్య కూర్చుని సినిమా చూశాను. సినిమా హాల్లో  అమ్మానాన్నల మధ్యసీటు కోసం నాకు అక్కతో చాలాసార్లు తగాదా అయ్యేది. బొమ్మ తెరపై వెయ్యడానికి ముందు హాల్లో లైట్లు తీసేసి చీకటిగా చేస్తారు. ఆ చీకటంటే నాకు చచ్చేంత భయం. అటూఇటూ ఇంట్లోవాళ్ళుంటే.. మధ్యన కూర్చుని సినిమా చూడ్డానికి ధైర్యంగా ఉంటుంది. అదీ అసలు సంగతి!

'కన్యాశుల్కం' సినిమా ఎంతసేపు చూసినా ఒక్కముక్క కూడా అర్ధం కావట్లేదు. నాకస్సలు నచ్చలేదు. అయినా సావిత్రి ఉండవలసింది రామారావు పక్కన గదా? మరి ఎవరెవరితోనో చాలా స్నేహంగా మాట్లాడుతుందేమి! తప్పుకదూ!

పైపెచ్చు ఒక ముసలాయనకి పిలక దువ్వి, నూనె రాస్తుంది. నాకు ఇది మరీమరీ నచ్చలేదు. ఎన్టీరామారావు ఎంత పక్కన లేకపోతే మాత్రం సావిత్రి అంతగా సరదాలు చెయ్యాలా?

ఈ ముసలాయన్ని ఎక్కడో చూసినట్లుందే! ఎక్కడ చూశానబ్బా? ఆఁ! గుర్తొచ్చింది. ఈ ముసలాయన మా నందయ్యగారే! అదేంటి! నందయ్యగారు సినిమాల్లో వేషాలు కూడా వేస్తారా? ఉన్నట్లుండి నాకు సినిమా ఆసక్తిగా మారింది. బలవంతానా ఆపుకుంటున్న నిద్ర మాయమైంది. నందయ్యగారు యాక్షను బానే చేశారు. మరి సావిత్రితో తన పిలకకి నూనె ఎందుకు పెట్టించుకున్నాడబ్బా!

'ఎవరా నందయ్య గారు? ఏమాకథ?'

ఈ భూప్రపంచమందు అత్యంత సుందరమైన ప్రాంతం మా గుంటూరు. అందు మా బ్రాడీపేట మరింత సుందర ప్రదేశము. ఈ సంగతి మీకు ఇంతకుముందు కూడా బల్లగుద్ది చెప్పాను. మీరు మర్చిపోతారేమోనని అప్పుడప్పుడూ ఇలా మళ్ళీ బల్ల గుద్దుతుంటాను.

మా బ్రాడీపేట మూడవ లైను మొదట్లో.. అనగా ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో నందయ్యగారి ఇల్లు. పక్కన మాజేటి గురవయ్యగారి ఇల్లు. ఆ పక్కన ముదిగొండ భ్రమరాంబగారి ఇల్లు. చింతలూరివారి ఆయుర్వేద వైద్యశాల. దాటితే డాక్టర్ ఆమంచర్ల చలపతిరావుగారి ఇల్లు. ఎదురుగా ఇసుకపల్లి వేంకట కృష్ణమూర్తిగారి ఆయుర్వేద వైద్యశాల ఉంటుంది.

సాయంకాలం సమయానికి ఈ అరుగులన్నీ పురోహితులతో కళకళలాడుతుండేది. గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. వాతావరణం చాలా సందడిగా, కళకళలాడుతుండేది. ఊళ్ళో ఎవరికైనా పూజలు, వ్రతాలకి  పురోహితుల అవసరం వచ్చినప్పుడు అక్కడే ఎప్పాయింట్ మెంట్లు ఖరారయ్యేవి.

మంజునాథ రెస్టారెంట్ పక్కనే ఉన్న నశ్యం షాపు ఆ సమయంలో చాలా బిజీగా ఉండేది. పొడుంకాయ ఫుల్లుగా నింపడానికి ఐదు పైసలు. పొడుగ్గా ఉండే కాడ చివర బుల్లి గరిటె. ఆ గరిటెతో చిన్నజాడీలోంచి నశ్యాన్ని లాఘవంగా స్కూప్ చేస్తూ పొడుంకాయ నింపడం అద్భుతంగా ఉండేది. ఆ నశ్యం నింపే విధానం అబ్బురంగా చూస్తూ నిలబడిపొయ్యేవాడిని.

నశ్యం పట్టు పడుతూ.. సందడిగా, సరదాగా కబుర్లు చెప్పుకునే పురోహితులు ఒక వ్యక్తి కనపడంగాన్లే ఎలెర్ట్ అయిపోయేవారు. నిశ్శబ్దం పాటించేవారు. వినయంగా నమస్కరించేవారు. ఆయనే నందయ్య గారు.

నందయ్యగారింట్లో ఆడామగ అనేక వయసులవారు ఉండేవారు. ఇంటి వరండాలో చెక్కబల్లపై నందయ్యగారు కూర్చునుండేవారు. తెల్లటి తెలుపు. నిగనిగలాడే గుండు. ఒత్తైన పిలక. చొక్కా వేసుకొంగా ఎప్పుడూ చూళ్ళేదు. పంచె మోకాలు పైదాకా లాక్కుని, ఒక కాలు పైకి మడిచి కూర్చుని ఉంటారు. మెళ్ళో రుద్రాక్షలు. విశాలమైన నుదురు. చేతులు, భుజాలు, నుదుటిపైనా తెల్లటి వీభూది. పంచాంగం చూస్తూ వేళ్ళతో ఏవో లెక్కలు వేస్తుండేవారు.

ఇంటికి వచ్చినవారు నందయ్యగారికి వినయంగా నమస్కరించేవారు. పెద్దవాళ్ళు నాలాంటి పిల్లకాయల చేత ఆయన కాళ్ళకి నమస్కారం చేయించేవాళ్ళు. మహానుభావుల కాళ్ళకి నమస్కరిస్తే చదువు బాగా వంటబడుతుందని అమ్మ చెప్పింది. చదువు సంగతి అటుంచి.. కనీసం మా లెక్కల మాస్టారి తన్నులైనా తప్పుతయ్యేమోననే ఆశతో నందయ్యగారి కాళ్ళకి మొక్కేవాణ్ని.

మళ్ళీ మన 'కన్యాశుల్కం' లోకి వద్దాం. సినిమా అయిపొయింది. అమ్మానాన్న రిక్షాలో కూర్చున్నారు. యధావిధిగా నా ఉచితాసనంపై కూర్చున్నాను. ఏదో గొప్ప కోసం గంభీరంగా ఉంటుందని 'ఉచితాసనం' అని రాస్తున్నానుగానీ.. అసలు సంగతి రిక్షాలో నా ప్లేస్ కాళ్ళు పెట్టుకునే చోట.. అమ్మానాన్న కాళ్ళ దగ్గర.

మా ఇంట్లో అందరిలోకి నేనే చిన్నవాణ్ణి. అంచేత రిక్షా సీటుపై ఎవరు కూర్చున్నా.. నా పర్మనెంట్ ప్లేస్ మాత్రం వాళ్ళ కాళ్ళ దగ్గరే! ఆ విధంగా పెద్దయ్యేదాకా రిక్షా సీటుపై కూర్చునే అవకాశం పొందలేకపోయిన నిర్భాగ్యుడను.

"సినిమాలో మన నందయ్యగారు భలే యాక్టు  చేశారు." అన్నాను.

నాన్నకి అర్ధం కాలేదు.

"నందయ్యగారా! సినిమాలోనా!" అన్నాడు నాన్న.

"అవును. సావిత్రి ఆయన పిలకకేగా నూనె రాసింది." నాన్నకి తెలీని పాయింట్ నేను పట్టేసినందుకు భలే ఉత్సాహంగా ఉంది.

నాన్న పెద్దగా నవ్వాడు.

"నువ్వు చెప్పేది లుబ్దావధాని గూర్చా! ఆ పాత్ర వేసినాయన డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు. ఆయన గొప్పనటుడు. బాలనాగమ్మలో మాయల మరాఠీగా వేశాడు. దడుచుకు చచ్చాం." అన్నాడు నాన్న.

నమ్మలేకపోయాను. నాన్న నన్ను తప్పుదోవ పట్టిస్తున్నాడా? ఛ.. ఛ! నాన్న అలా చెయ్యడు. బహుశా నాన్న నందయ్యగారిని గుర్తుపట్టలేకపోయ్యాడా? అలాంటి అవకాశం లేదే! నాన్నకి నందయ్యగారు బాగా తెలుసు. నందయ్యగారు నాన్నని 'ఏమిరా!' అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు.

ఆలోచనలతోనే ఇంట్లోకొచ్చిపడ్డా. నాన్నకిష్టమైన, నాకు అత్యంత అయిష్టమైన కాకరకాయ పులుసుతో నాలుగు ముద్దలు తిన్నాను. నాన్న చాలా విషయాల్లో డెమాక్రటిక్ గా ఉండేవాడు. కానీ ఎందుకో కాకరకాయ పులుసు విషయంలో హిట్లర్ లా వ్యవహరించేవాడు. వారంలో ఒక్కసారైనా ఇంట్లోవాళ్ళం నాన్నకిష్టమైన కాకరకాయ పులుసుతో శిక్షించబడేవాళ్ళం.

కాకరకాయ పులుసు కడుపులో తిప్పుచుండగా.. నందయ్య గారి ఆలోచన మనసులో తిప్పుచుండెను. ఆలోచిస్తున్న కొద్దీ.. ఈ లుబ్దావధాని, గోవిందరాజుల సుబ్బారావు, నందయ్యగార్ల ముడి మరింతగా బిగుసుకుపోయి పీటముడి పడిపోయింది.

అటు తరవాత నందయ్యగారి సినిమా వేషం సంగతి నా అనుంగు స్నేహితుడైన దావులూరి గాడి దగ్గర ప్రస్తావించాను. వాడు నాకన్నా అజ్ఞాని. తెల్లమొహం వేశాడు. పరీక్షల్లో నాదగ్గర రెగ్యులర్ గా కాపీకొట్టే సాగి సత్తాయ్ గాడు మాత్రం నేనే కరక్టని నొక్కివక్కాణించాడు. ఏవిటో! అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది!

                                                     - 2 -

కాలచక్రం సినిమారీల్లా గిర్రున తిరిగింది. ఇప్పుడు నేను పెద్దవాడనైనాను. రిక్షాలొ కాళ్ళ దగ్గర కూచోకుండా సీటు మీదే కూర్చునే ప్రమోషనూ వచ్చింది. నా సాహిత్యాభిలాష చందమామ చదవడంతో మొదలై ఆంద్రపత్రిక, ప్రభల మీదుగా కథలు, నవలలదాకా ప్రయాణం చేసింది.

ఈ క్రమంలో కన్యాశుల్కం గురజాడ అప్పారావు రాసిన నాటకమనీ, అది సినిమాగా తీశారనీ తెలుసుకున్నాను. లుబ్దావధానిని నందయ్యగారిగా పొరబడ్డందుకు మొదట్లో సిగ్గు పడ్డాను. అటుతరవాత నవ్వుకున్నాను. నేనెందుకు తికమక పడ్డాను!?

కొన్నాళ్ళకి కన్యాశుల్కం నాటకం చదివాను. నాటకం గూర్చి అనేకమంది ప్రముఖుల వ్యాఖ్యానాలూ చదివాను. తెలుగు సాహిత్యంలో కన్యాశుల్కం ప్రాముఖ్యత గూర్చి ఒక అంచనా వచ్చింది. సినిమా మళ్ళీ చూడాలని.. పెరిగిన వయసుతో, పరిణిత మనసుతో హాల్లోకి అడుగెట్టాను.

సినిమా మొదలైన కొంతసేపటికి సినిమాలో పూర్తిగా లీనమైపొయ్యాను. కారణం.. గోవిందరాజుల సుబ్బారావు అద్భుత నటన. ఆంగ్లంలో 'స్పెల్ బౌండ్' అంటారు. తెలుగులో ఏమంటారో తెలీదు. లుబ్దావదానిగా గోవిందరాజుల సుబ్బారావు నటించాడనడం కన్నా..  ప్రవర్తించాడు అనడం కరెక్ట్.

గోవిందరాజుల సుబ్బారావు వృద్దుడయినందున లుబ్దావధాని ఆహార్యం చక్కగా కుదిరందని కొందరు అంటారు. వాస్తవమే అయ్యుండొచ్చు. అయితే ఇది నటుడికి కలసొచ్చిన ఒక అంశంగా మాత్రమే పరిగణించాలని నా అభిప్రాయం.

వృద్ధాప్యంలో 'డిమెన్షియా' అనే మతిమరుపు జబ్బు మొదలవుతుంది. ఎదుటివాడు చెప్పేది అర్ధం చేసుకుని చెప్పడానికి సమయం పడుతుంది. శరీర కదలికల వలె మానసికంగా కూడా నిదానంగా రియాక్ట్ అవుతుంటారు. ఎటెన్షన్ మరియు కాన్సంట్రేషన్ తగ్గడం చేత ఒక్కోసారి అర్ధం కానట్లు చేష్టలుడిగి చూస్తుండిపోతారు. ఇవన్నీ మనకి సినిమా లుబ్దావధానిలో కనిపిస్తాయి.

నా తికమక నటుడిగా గోవిందరాజుల సుబ్బారావు సాధించిన విజయం. అందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు. ఆయన మరీ అంత సహజంగా పాత్రలోకి దూరిపోయి అద్భుతంగా నటించేస్తే తికమక పడక ఛస్తానా! అంచేత 'నేరం నాదికాదు! గోవిందరాజుల సుబ్బారావుది.' అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను!

యూట్యూబులోంచి ఆయన నటించిన సన్నివేశం ఒకటి పెడుతున్నాను. చూసి ఆనందించండి.



చివరి తోక..

శ్రీ ముదిగొండ పెదనందయ్యగారు :  వేదపండితులు. ఘనాపాఠి. ఆరాధ్యులు. సంస్కృతాంధ్ర పండితులు.

కృతజ్ఞతలు..

ఈ పోస్టులో నేను రాసిన ఇళ్లేవీ ఇప్పుడు లేవు. అన్నీబహుళ అంతస్తుల బిల్దింగులుగా మారిపోయ్యాయి. పోస్ట్ రాస్తున్న సందర్భాన నా మెమరీని రిఫ్రెష్ చేసిన మిత్రుడు ములుగు రవికుమార్ (నందయ్యగారి మనవడు) కి కృతజ్ఞతలు.

(photos courtesy : Google)