Showing posts with label పుస్తకావిష్కరణ. Show all posts
Showing posts with label పుస్తకావిష్కరణ. Show all posts

Sunday, 28 December 2014

పుస్తకావిష్కరణ సభలు! ఇవి చాలా గొప్పవి!!


"సభకి నమస్కారం. 'పక్కింటావిడ' పుస్తకావిష్కరణ సభకి విచ్చేసిన సాహిత్యాభిమానులకి స్వాగతం. ఇన్నాళ్ళూ తెలుగు సాహిత్యంలో తల్లీ, చెల్లి గూర్చి రాసినవారున్నారు. కానీ - మన రచయితగారు పక్కింటావిడని ప్రధానపాత్రగా చేసుకుని రచన చెయ్యడం గొప్పవిశేషం. ఇలా పక్కింటి స్త్రీ పట్ల స్పందించి సాహిత్యం సృష్టించినవారు మరే భాషలోనూ లేరనీ, ఇది తెలుగు సాహిత్యం చేసుకున్న అదృష్టం అనీ.. "

"బావా! బావోఁయ్! ఈడేం జరుగుతుంది" 

"ష్! బయట తాటికాయంత అక్షరాల్తో బేనర్ రాసుంది - చూళ్ళేదా? ఇది పుస్తకావిష్కరణ సభ."

"పుస్తకావిష్కరణా! అంటే?"

"రచయితలు పుస్తకాలు రాస్తారు."

"ఆఁ! రాస్తే?"

"ఆ పుస్తకం మార్కెట్లోకి వదిలేముందు పుస్తకావిష్కరణ చేస్తారు."

"అర్ధం కాలా!"

"సినిమా పబ్లిసిటీ కోసం ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేస్తారే? ఇదీ అట్లాంటిదే!"

"అర్ధమయ్యేట్టు చెప్పు బావా!"

"సరే! నువ్వో పుస్తకం రాశావనుకో! ఆ పుస్తకం రాసినందుకు నీకో మీటింగు పెట్టి అభినందిస్తారు. ఖర్చులు నీవే!"

"అబినందనా! అంటే?"

"అంటే - రచయితకి కావలసినవాళ్ళు, రచయిత కావాలసినవాళ్ళూ - అందరూ ఒకచోట కూడి ఆ రాసినాయన గూర్చి మైకులో తలా నాలుగు మంచి ముక్కలు చెబుతారు."

"ఎందుకు?"

"ఎందుకేమిటి!?"

"మంచో చెడ్డో - ఆ ముక్కలేదో పుస్తకం చదివినోడు జెప్పాలి గానీ - మధ్యలో ఈళ్ళందుకు చెప్పడం?"

"ఎందుకంటే - రేపు నీలాటి ముక్కుసూటిగాడు పుస్తకం పరమ చెత్తగా వుందని - వున్నది వున్నట్లుగా చెప్పొచ్చుగా! ఆ ప్రమాదం లేకుండా వీళ్ళు ముందుగానే మంచిగా మాట్లాడేసుకుంటారు."

"అదేంటి!"

"అదంతే!"

"బావా! ఇప్పుణ్ణాకు అర్ధమైంది. తెలుగు రచైతలు ఆళ్ళల్లోఆళ్ళు స్నేహితులు. ఆళ్ళే పుస్తకాలు రాసుకుని - ఆళ్ళే మీటింగులెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటా వుంటారు. ఇదోరకంగా ఒకళ్ళనొకళ్ళు వీపు గోక్కడం లాంటిది!"

"ష్! నెమ్మదిగా మాట్లాడు. నీకు బుర్ర లేదు బామ్మర్దీ! పుస్తకావిష్కరణ సభలు గొప్ప సాహిత్యసేవ చేస్తున్నాయి. పవిత్రమైన ఈ పుస్తకావిష్కరణ సభల గూర్చి ఘోరంగా మాట్లాడకు!"

"సర్లే బావా! అయినా మోటోణ్ని! నాకిసుమంటి పెద్దిషయాలు ఎందుగ్గానీ - నువ్వు మీటింగు ఇనుకో బావా! నేబోతా!"

"నీదే ఆలస్యం!"

ఉపన్యాసాలు ఇంకా కొన'సాగుతూ'నే వున్నయ్ -

"ఈ రచయిత తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం, ఆయన దురదృష్టం. 'పక్కింటావిడ' వంద నోబెల్ పైజులకి అర్హమైన గొప్ప రచన అని నా ప్రగాఢ విశ్వాసం. రచయితగారు నాకు బాగా తెలుసు. ఆయన ఉత్తముడు, నిగర్వి, నిరాడంబరజీవి, నిరంతర సత్యాన్వేషి..... " 

(picture courtesy : Google)