Showing posts with label మా సుబ్బు సుభాషితాలు. Show all posts
Showing posts with label మా సుబ్బు సుభాషితాలు. Show all posts

Wednesday, 5 March 2014

మోడీ.. ద సూపర్ మేన్


టీవీలో ఇంగ్లీష్ న్యూస్ చానెల్ చూస్తున్నాను. నరేంద్ర మోడీ హిందీలో అనర్ఘళంగా ఉపన్యసిస్తున్నాడు. ఇంతలో సుబ్బు వచ్చాడు.

"కూర్చో సుబ్బూ! మొత్తానికి మోడీ చాలా ఘటికుడు సుమా!" టీవీలో మోడీని చూస్తూ అన్నాను.

"అంతేలే! సూపర్ మేన్ కూడా ఘటికుడే." అన్నాడు సుబ్బు.

"అబ్బబ్బా! మోడీకీ, సూపర్ మేన్ కి పోలికేంటి సుబ్బూ?" చికాగ్గా అన్నాను.

"మిత్రమా! నువ్వు సూపర్ మేన్ సినిమాలు చూశావుగా? సూపర్ మేన్ కి సాధ్యం కానిదేదీ ఉండదు. ఒక్క గుద్దుతో వందమందిని మట్టి కరిపిస్తాడు. గాల్లోకెగురుతాడు, భూమి చుట్టూ చక్కర్లు కొడతాడు, భూకంపాల్ని ఆపుతాడు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! నేను సూపర్ మేన్ సినిమాలన్నీ చూశాను, నువ్వు మరీ అంత వివరంగా చెప్పనవసరం లేదు." అసహనంగా అన్నాను.

ఇంతలో కాఫీ వేడిగా పొగలు గక్కుతూ వచ్చింది. కాఫీ నిదానంగా సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.

"సూపర్ మేన్ అనేది ఓ పాపులర్ కార్టూన్ కేరక్టర్. ఓ హాలీవుడ్ స్టూడియో ఆధ్వర్యంలో కొన్ని డజన్ల మంది కొన్ని వందల గంటలు పాటు సూపర్ మేన్ కేరక్టర్ గూర్చి చర్చించుకుని, మరిన్ని మెరుగులు దిద్ది, సినిమా పాత్రగా తీర్చిదిద్దారు. తదనుగుణంగా ఓ నటుడు సూపర్ మేన్ పాత్ర పోషించాడు. ఇందుకోసం ఆ నటుడు ఆకుపచ్చని స్క్రీన్ ముందు వైర్ల సహాయంతో వేళ్ళాడుతూ, గాల్లో ఫైటింగులు చేశాడు."

"అవును, ఈమధ్య స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాలన్నీ ఇట్లాగే తీస్తున్నారు." నవ్వుతూ అన్నాను.

"అలా షూట్ చేసుకున్న ఫిల్మ్, ఆ తరవాత పోస్ట్ ప్రొడక్షన్లో రకరకాల హంగులతో ఆకర్షణీయంగా తయారవుతుంది. ఆ విధంగా ఎంతోమంది, ఎన్నోరకాలుగా కష్టపడి ఒక ఎండ్ ప్రోడక్ట్ ని తయారు చేస్తారు. ఆ ప్రోడక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం ఇంకో దశ. మళ్ళీ ఎంతోమంది కూడి, ఆలోచించుకుని.. రిలీజ్ టైమింగ్ ప్లాన్ చేసుకుని, సరైన పబ్లిసిటీ కోసం కృషి చేస్తారు. వీళ్ళందరూ ఆయా రంగాల్లో శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్." అన్నాడు సుబ్బు.

"అవును, పబ్లిసిటీక్కూడా భారీ బజెట్ ఉంటుంది." అన్నాను.

"తెరపై సూపర్ మేన్ని చూసేవారికి ఇవేవీ పట్టవు, అనవసరం కూడా. వారు సూపర్ మేన్ చేసే అద్భుత విన్యాసాల్ని సంభ్రమంగా, ఆశ్చర్యంగా మైమరచి చూస్తారు. మిలియన్ల కొద్దీ డాలర్లని ఖర్చు పెట్టిన స్టూడియో వారికి కావాల్సింది కూడా అదే. ఎంత ఎక్కువమంది మైమరచిపోతే స్టూడియోకి అంత లాభం." అన్నాడు సుబ్బు.

"అవును, ఒప్పుకుంటున్నాను. కానీ మోడీకీ, సూపర్ మేన్ తో గల పోలిక ఏమిటి?" ఆసక్తిగా అడిగాను.

"సింపుల్. నిన్నటిదాకా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పాపులర్. అందుకే ఇవ్వాళ బీజేపీ అనే స్టూడియో మోడీని హీరోగా పెట్టి 'ప్రధానమంత్రి' సినిమా తీస్తుంది. ఇందుకు గాను కొన్ని వేలమంది, లక్షల కోట్ల బజెట్ తో, చర్చోపచర్చలు జరుపుతూ, అందుబాటులో ఉన్న అన్నిరకాల ప్రచార సాధనాలు ఉపయోగించుకుంటూ వ్యూహాలు రచిస్తున్నారు. మోడీ ఈ దేశ దరిద్రాన్ని, నిరుద్యోగాన్ని ఉఫ్ మంటూ ఉదేస్తాడు. అభివృద్ధిలో దేశాన్ని అమెరికా కన్నా ముందుకు నడిపించేస్తాడు. పాకిస్తాన్, చైనాల్ని గడగడలాడించేస్తాడు." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"గో ఆన్ సుబ్బూ! ఇంటరెస్టింగ్." అన్నాను.

"మోడీ రాకతో దేశం రామాయణం నాటి పుణ్యభూమిగా మారిపోతుంది. ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు, ఆనంద పారవశ్యంతో నృత్యాలు చేస్తారు. ఈ సినిమా బీజేపి పార్టీ తీస్తున్న ఓ మేగ్నమ్ ఓపస్. మనకి కనిపిస్తుంది మాత్రం నరేంద్ర మోడీ అనే ఓ నటుడు. కానీ అతని వెనక స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నవాళ్ళ బుర్రలు మాత్రం పనిభారంతో వేడెక్కి సెగలు పొగలు కక్కుతున్నాయి." అన్నాడు సుబ్బు.

"వర్కౌట్ అవుతుందంటావా?" అడిగాను.

"అది మనమెలా చెప్పగలం? ఎన్నికల సంఘం అన్ని పార్టీలకి, వారి సినిమాల విడుదల తేదీ ప్రకటిస్తుంది. కరెక్టుగా ఆ సమయానికి మోడీ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ పూర్తి చేసుకుని రెడీగా ఉంటుంది, ఉండాలి కూడా. ఆ సినిమా బాగుందా, లేదా అనే సంగతి ప్రజలు నిర్ణయిస్తారు." అన్నాడు సుబ్బు.

"మరి కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీని సూపర్ మేన్ గా ప్రమోట్ చేసుకోవచ్చుగా?" అడిగాను. 

"వచ్చు. కానీ సినిమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ.. బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం. ఎన్టీఆర్ తో 'దేవదాసు' తీస్తే అట్టర్ ఫ్లాపయ్యేది. ఎఎన్నార్ తో 'బందిపోటు' తీస్తే నిర్మాతకి పోస్టర్ల డబ్బులు కూడా వచ్చేవి కావు. రాహుల్ గాంధీది చాక్లెట్ ఫేస్, లవర్ బాయ్ ఇమేజ్. కాబట్టి అతన్తో కాంగ్రెస్ పార్టీ అనే స్టూడియో 'రాముడు మంచి బాలుడు' టైపు పాత్రతో ఓ సినిమా తీస్తుంది. అందుకే ఆయన దళితుల పూరిపాకల్లో నిద్ర చేస్తాడు, గిరిజన మహిళల్తో ముద్దు పెట్టించుకుంటాడు. అధికారం అంటే ఇష్టం లేనట్లుగా, మనలో ఒకడుగా ప్రవర్తిస్తుంటాడు. ఇవన్నీ ఇమేజ్ బిల్డింగ్ ఎక్సెర్సైజులు." అన్నాడు సుబ్బు.

"మరి రాహుల్ సినిమా హిట్టవుతుందా?" ఆసక్తిగా అడిగాను.

"తెలీదు. కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లొచ్చినా వాళ్ళ సినిమా సూపర్ హిట్టే. అయినా ప్రస్తుత పరిస్థితుల్లోఇంతకన్నా కాంగ్రెస్ పార్టీ కూడా చెయ్యగలిగిందేమీ లేదు." అంటూ రిస్ట్ వాచ్ చూసుకుంటూ నిలబడ్డాడు సుబ్బు.

"సుబ్బూ! కొన్ని కోట్ల మంది జీవితాల్తో ముడిపడున్న ఎన్నికల్ని నువ్విట్లా సినిమా భాషలో విశ్లేషించడం నాకు నచ్చలేదు, సిల్లీగా ఉంది." అన్నాను.

"అంతేనంటావా? సర్లే! నువ్వు సీరియస్ గా ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకో. ఏం చేసేది? నాకు నీ అంత ఓపిక లేదు." అంటూ హడావుడిగా నిష్క్రమించాడు మా సుబ్బు.


(photos courtesy : Google)

Monday, 18 November 2013

సచిన్ టెండూల్కర్ - ఆవకాయ


"సుబ్బూ! సచిన్ టెండూల్కర్ కి భారతరత్న రావడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది, రిటైర్ అయినందుకు బాధగానూ ఉంది. దీన్నే కవుల భాషలో ఒక కంట కన్నీరు, ఇంకో కంట పన్నీరు అంటారనుకుంటా!" అన్నాను.

"ఈ యేడాది అమ్మ ఆవకాయ పట్టదుట. నా జీవితంలో ఆవకాయ లేని రోజు వస్తుందనుకోలేదు. నాకు మాత్రం రెండు కళ్ళల్లోనూ కన్నీళ్ళొస్తున్నాయి." కాఫీ సిప్ చేస్తూ భారంగా అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! నీతో ఇదే గోల. నేనిక్కడ ద గ్రేట్ టెండూల్కర్ గూర్చి చెబుతుంటే నువ్వు ఆవకాయ అంటూ ఏదో చెత్త మాట్లాడుతున్నావు." విసుక్కున్నాను.

"ఆవకాయ అనేది చెత్తా! నువ్వా ఆవకాయనే కుంభాలకి కుంభాలు లాగించావ్. ఇవ్వాళ ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నావ్. ఆవకాయ ద్రోహి. నీ కోసం నరకంలో సలసల కాగుతూ నూనె రెడీగా ఉందిలే." కసిగా అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! సుత్తి కొడుతున్నావ్."

"లేదు లేదు. నువ్వు ఆవకాయని అర్ధం చేసుకుంటేనే సచిన్ని కూడా ఈజీగా అర్ధం చేసుకుంటావు." అన్నాడు సుబ్బు.

"అదెలా?" కుతూహలంగా అడిగాను.

"ఆవకాయ. ఈ సబ్జక్టు మీద ఎంతైనా రాయొచ్చు. ఆవకాయని ఇష్టపడనివాడు డైరక్టుగా దున్నపోతుల లిస్టులోకి పోతాడని వేదాల్లో రాయబడి ఉంది. వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుని లాగిస్తే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుంటుంది. నీకు ఐశ్వర్యారాయ్ కావాలా? ఆవకాయ జాడీ కావాలా? అని నన్నడిగితే నూటికి నూరుసార్లూ ఆవకాయ జాడీనే కావాలంటాను." అంటూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు సుబ్బు.

"హలో సుబ్బూ! కొద్దిగా ఆ ఆవకాయ జాడీలోంచి బయట పడి విషయంలోకి రా నాయనా!" అన్నాను.

"సారీ! ఆవకాయ ప్రస్తావనొస్తే ఒళ్ళు తెలీదు నాకు. ఒక్కసారి అమ్మ పట్టే ఆవకాయ గుర్తు తెచ్చుకో. ఆవకాయ పట్టిన మొదట్లో పచ్చడి ఆవఘాటుతో అద్భుతంగా ఉంటుంది. ఆ తరవాత గుజ్జుకి మామిడి ముక్కల పులుపు పట్టి రుచి మారుతుంది. ఆ సమయంలో ఆవఘాటు, పులుపు, కారం త్రివేణి సంగమంలా కలిసిపోయుంటాయి. ఆవకాయ తినడానికి బెస్ట్ టైం ఇదే."

"అవును. ఒకసారి ఆవకాయ దెబ్బకి నీ పొట్ట సోరకాయలా ఉబ్బింది. డాక్టర్ వాడపల్లి వెంకటేశ్వర రావు గారు నీ కడుపు కక్కుర్తికి బాగా తిట్టి మందిచ్చారు. గుర్తుంది కదూ?" నవ్వుతూ అన్నాను.

"ఆవకాయని ఆవురావురుమంటూ లాగించడం మన పని, కడుపునోప్పికి మందివ్వడం డాక్టర్ల పని. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. సరే, ఆవకాయలోకి వద్దాం. కొన్నాళ్ళ తర్వాత ఆవకాయలో ఘాటు తగ్గుతుంది, పులుపు తగ్గుతుంది, ముక్కలు మెత్తబడతాయి. పచ్చడి కొద్దిగా ఉప్పగా కూడా మారుతుంది. ఇట్లాంటి పచ్చడి ఇంట్లో ఉన్నా లేనట్లే. అదొక వెలిసిపోయిన బొమ్మ. చూడ్డానికి ఆయుర్వేద లేహ్యము వలే ఉంటుంది. ఈ వయసు మళ్ళిన ఆవకాయ నాకస్సలు ఇష్టం ఉండదు." మొహం వికారంగా పెట్టాడు సుబ్బు.

"అందుకే ఆ సమయానికి మాగాయ రెడీగా ఉంటుంది. ఇంతకీ నీ ఆవకాయ భాష మర్మమేమి?"

"ఇప్పుడు టెండూల్కర్ని ఆవకాయతో పోలుద్దాం. కుర్రాడు కెరీర్ మొదట్లో అద్భుతమైన ఆటతో అద్దరగొట్టాడు. నాకతని ఆటలో ఘాటైన ఆవ ఘుమఘుమలు కనిపించాయి. ఆ తరవాత స్పీడు తగ్గినా స్టడీగా చక్కగా ఆడాడు. ఆటలో కొంచెం ఘాటు తగ్గి పులుపెక్కాడు. ఆ రోజుల్లో సచిన్ ఆట ఒక అద్భుతం." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"నే చెప్పేది అదే కదా?" 

"పూర్తిగా విను. ఆవకాయ కొన్నాళ్ళకి రుచి తగ్గినట్లే.. సచిన్ ఆటలో కూడా పవర్ తగ్గిపోయింది.. వెలిసిపోయింది. చాలా యేళ్ళ క్రితమే సచిన్ ఆట ఆయుర్వేద లేహ్యంలా అయిపొయిందని నా అభిప్రాయం." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! ఈమాట బయటెక్కడా అనకు. జనాలు నిన్ను సిక్సర్ కొడతారు."

"ఎందుకంటాను? నాకా మాత్రం జ్ఞానం లేదనుకున్నావా? మనవాళ్ళు సచిన్ని దేవుడి స్థానంలో కూర్చుండబెట్టారు. మన దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువ. అక్షరాస్యులు ఉన్నా వారు కూడా దురభిమానంలో నిరక్షరాస్యుల్తో పోటీ పడుతుంటారు. ఈ దేశంలో నచ్చినవారికి వెర్రి అభిమానంతో గుడి కూడా కట్టిస్తారు. అందువల్ల ఇప్పుడు మిగిలింది సచిన్ కి గుడి కట్టి, కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడమే." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"అవుననుకో. అట్లా చేస్తేగాని మనవాళ్ళకి తృప్తిగా ఉండదు. కానీ సచిన్ గొప్ప క్రికెటర్"

"కాదన్నదెవరు? కాకపొతే మన దేశంలో క్రికెట్ అనే ఆట ఒక వ్యాపారంగా మారి.. క్రమేణా ఒక కార్పోరేట్ స్థాయికి ఎదిగింది. అందువల్లనే సచిన్ అనేక బ్రాండ్లకి ఎండార్స్ చేసి గొప్ప సంపాదనపరుడిగా మారాడు. ఇక్కడ క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే అయినట్లైతే సచిన్ తన సమకాలికులతో ఎప్పుడో రిటైర్ అయ్యేవాడు. ఇందుకు కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనుకో." అన్నాడు సుబ్బు.

"రాజకీయాలా!" ఆశ్చర్యపోయాను.

"అవును. భారత క్రికెట్ బోర్డ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది, అత్యంత అవినీతిపరమైనది కూడా. అందుకే రాజకీయ నాయకులు బోర్డులో భాగస్వామ్యులవడానికి తహతహలాడతారు. వారికి సచిన్ లాంటి ఐకానిక్ ఫిగర్ ఉండటం కుషనింగ్ లాగా ఉపయోగపడుతుంది." అన్నాడు సుబ్బు.

"అవును. BCCI ఒక దొంగల ముఠా."

"ఇక దేశ రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్, బిజెపి ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అందుకే సచిన్ పాపులారిటీ క్యాష్ చేసుకోడానికి కాంగ్రెస్ పార్టీ సచిన్ కి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. 'భారతరత్న'ని కూడా హడావుడిగా ఇచ్చేసింది. ఎంతైనా ఎన్నికల సమయం కదా! సచిన్ యువరాజావారికి స్నేహితుడు అన్న సంగతి కూడా మర్చిపోరాదు." అన్నాడు సుబ్బు.

"ఛ.. మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు."

"నీకలా అనిపిస్తుందా? సర్లే - ఇప్పుడు మరొక ఆసక్తికరమైన అంశమేమనగా.. ఇప్పటివరకూ ఎన్నడూ వ్యాపార ప్రకటనల్లో విచ్చలవిడిగా సంపాదిస్తున్న సెలెబ్రిటీకి భారతరత్న ఇవ్వబడలేదు. ఇప్పుడీ భారతరత్న పిల్లల్ని పెప్సీ త్రాగమని చెప్పవచ్చునా? క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత లాంటి డబ్బు సంపాదించుకునే ఉద్యోగాలు చేసుకోవచ్చునా? వీటికి సమాధానం వెండితెరపై చూడాలి." అన్నాడు సుబ్బు.

"అదంతా ఇప్పుడు అప్రస్తుతం. అయినా సుబ్బూ! దేశమంతా టెండూల్కర్ని పొగడ్తలతో ముంచెత్తుతుంది. నువ్వు మాత్రం చాలా నెగెటివ్ గా మాట్లాడుతున్నావ్." విసుగ్గా అన్నాను.

"అలాగా? అయాం సారీ. అసలీ గోలకి కారణం నువ్వే. తెలుగువాడికి తల్లి లాంటి ఆవకాయని తక్కువ చేశావ్. నా దృష్టిలో ఆవకాయని కాదన్నవాడు దేశద్రోహి. అంచేత మిత్రమా! నేరం నాది కాదు, ఆవకాయది." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)

Friday, 11 October 2013

తెలంగాణా! ఎందుకు?


"సుబ్బూ! కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని నిట్టనిలువుగా చీల్చి చాలా తప్పు చేసింది." బాధగా అన్నాను.

కాఫీ తాగుతున్న సుబ్బు చిన్నగా నవ్వాడు.

"నేనైతే అలా అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లుండి తెలంగాణా ప్రాంతంపై ప్రేమ పుట్టుకురాలేదు. ఆ పార్టీకి తెలంగాణా ఇవ్వకుండా ఉండలేని రాజకీయ అనివార్యత ఏర్పడింది." అన్నాడు సుబ్బు.

"అంటే రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని చీలుస్తుందా?" అన్నాను.

"ముందు నువ్వా 'తెలుగు జాతి' అంటూ పరుచూరి బ్రదర్స్ మార్కు డైలాగులు కొట్టడం ఆపు. రాజకీయాలు మాట్లాడేప్పుడు రాజకీయ భాషనే వాడు. సినిమా భాష వాడకు. అవును ఏ పార్టీకైనా రాజకీయ లబ్దే అంతిమ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ. డాక్టర్లు వైద్యం చేస్తారు. వంటవాడు వంటే చేస్తాడు. రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఇంకోటి చెయ్యవు. దేశంలో రాజకీయ లబ్ది చూసుకొని రాజకీయ పార్టీ ఏదన్నా ఉందా?" అడిగాడు సుబ్బు.

"అవుననుకో. కానీ నాకెందుకో బాధగా ఉంది." అన్నాను.

"అవును. కొద్దిగా బాధగానే ఉంటుంది. కానీ రాష్ట్ర విభజన ఒక రాజకీయ అంశం. రాజకీయ అంశాలని emotional గా చూడరాదు మిత్రమా! ఒకరకంగా కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వటానికి నరేంద్ర మోడీ ముఖ్యకారకుడు. కాంగ్రెస్ పార్టీ 2014 లో రాహల్ గాంధీని ప్రధానిగా చెయ్యడానికి రోడ్ మేప్ వేసుకుంది. బిజెపి నరేంద్ర మోడీతో రోడ్ మేప్ సిద్ధం చేసుకుంటుంది. ఈ రెండు మ్యాపుల్లో ఒక మ్యాప్ మాత్రమే సక్సస్ అవుతుంది. మోసగాళ్ళకి మోసగాడు సినిమాలో నిధి కోసం వేసుకునే ఎత్తులు, పైయ్యెత్తులు జ్ఞాపకం ఉందా? ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్, బిజెపిల మధ్య ఈ వాతావరణమే నెలకొని ఉంది. అందువల్ల దేశంలోని ప్రతి పార్లమెంటు సీటు కీలకంగా మారింది." అన్నాడు సుబ్బు.

"అందువల్ల రాష్ట్రం విడగొట్టాలని దుర్మార్గమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటావ్?" అడిగాను.

"మళ్ళీ సినిమా భాషలో మాట్లాడుతున్నావ్. ఇక్కడ దుర్మార్గం, సన్మార్గం ఏముంది? అంతా రాజకీయ  మార్గమే! నువ్వు రాష్ట్ర రాజకీయాల్ని ఢిల్లీ వైపు నుండి చూట్టం నేర్చుకో. విషయం చాలా తేలికగా అర్ధమవుతుంది." అన్నాడు సుబ్బు.

"నేను నిఖార్సైన తెలుగువాణ్ని. సమస్యని నా ప్రాంతం నుండి మాత్రమే చూస్తాను. ఇంకేవైపు నుండి చూడను." చికాగ్గా అన్నాను.

సుబ్బు ఖాళీ కాఫీకప్పు టేబుల్ పై పెట్టి కుర్చీలోంచి లేచాడు. నా ఎదురుగా నించొని.. నా నుదిటిపై తన కుడిచేతి చూపుడు వేలు ఆనించాడు.

"ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది.. వస్తుంది. హాయిగా నిద్ర పోతున్నావ్. నిద్ర పోయ్యావ్. నిద్ర పో.. య్యా .. వ్." అన్నాడు.

ఆశ్చర్యం! నాకు నిజంగానే నిద్రోచ్చింది. అలాగే కుర్చీలో ఒరిగిపొయ్యాను.

"మిత్రమా! ఇప్పుడు నువ్వు సాధారణ పౌరుడివి కాదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడవి. నువ్విప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగులో ఉన్నావు. నేను సోనియా గాంధీని. అదిగో చూడు.. ఎదురుగా అహ్మద్ పటేల్, మన్మోహన్ సింగ్, ఆంటోని.. కనిపిస్తున్నారా?"

"అవును. స్పష్టంగా కనిపిస్తున్నారు మేడం." అన్నాను.

"మీరు CWC లో ఆంద్రప్రదేశ్ వ్యవహారాల బాధ్యులు. పార్టీ అధ్యక్షురాలిగా ఏపీలో మన పార్టీ పరిస్థితిపై మీ నివేదిక అడుగుతున్నాను. ఏం చెబుతారో చెప్పండి." అన్నాడు సుబ్బు.

నేను గొంతు సరి చేసుకుని చెప్పటం మొదలెట్టాను.

"నమస్తే మేడం! ఏపీలో మన పార్టీ పరిస్థితి అస్సలు బాలేదు మేడం. సీమాంధ్రలో జగన్ పార్టీ దూసుకుపోతుంది. తెలంగాణా కెసిఆర్ కోటగా మారిపోయింది. తెలంగాణలో బిజెపి కూడా చాప కింద నీరులా విస్తరిస్తుంది. రాష్ట్రంలో ఉపఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిచోటా మన పార్టీ డిపాజిట్టు కోల్పోయింది. కాబట్టి మన రాష్ట్ర నాయకుల మాటలకి విలువనివ్వడం శుద్ధదండగ." అన్నాను.

"అలాగా? సరే! మీరేం చేస్తారో నాకనవసరం. ఎట్లాగైనా సరే అక్కడ మన పార్టీ పరిస్థితి ఇంప్రూవ్ అవ్వాలి. మనకి ఏపీ నుండి మేక్జిమం పార్లమెంటు సీట్లు రావాలి. ఏం చేద్దామంటారు?" అడిగాడు సుబ్బు.

ఒక్క క్షణం ఆలోచించాను.

"మేడం! మనం అర్జంటుగా తెలంగాణా ఇచ్చేద్దాం. అందువల్ల ఇరవై మూడు జిల్లాల్లో పది జిల్లాలు మన ఖాతాలో పడతయ్. ఈ దెబ్బకి తెలంగాణలో బిజెపి అవుట్. కెసిఆర్ ఎలాగూ మనతో కలిసిపోతాడు. కాబట్టి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాని స్వీప్ చేసేస్తాం." ఉత్సాహంగా అన్నాను.

"వెరీ గుడ్. మరప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో ఏం చేద్దాం?" అడిగాడు సుబ్బు.

"అక్కడ రాజకీయం చెయ్యడానికి మనకి వెసులుబాటు ఉంది మేడం. జగన్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని రంగం సిద్ధం చేశాను. ద డీల్ ఈజ్ జగన్ బాబు CM, మన రాహుల్ బాబు PM."

"ఇప్పుడు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నడుస్తుంది. మరి తెలంగాణా ఆపేద్దామా?" అడిగాడు సుబ్బు aka సోనియా గాంధీ.

"అదెలా కుదురుతుంది. ఇప్పుడు రాష్ట్ర విభజనని పెండింగ్ లో పెడితే అన్నింటికి చెడతాం మేడం. దీన్నే మా తెలుగు భాషలో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదంటారు. మనకి ముందుకు పోవడం మించి వేరే దారి లేదు మేడం." అన్నాను.

"అంతేనంటారా?"

"అంతే మేడం. మీరు తెలంగాణా ఇస్తానని ఒకసారి ఎలక్షన్ మీటింగులో చెప్పారు. ఇప్పుడు తెలంగాణా ఇచ్చేస్తే మాట నిలబెట్టుకున్నట్లూ ఉంటుంది.. రాజకీయంగా లాభమూ చేకూరుతుంది. తెలంగాణా ఇవ్వకుండా రాష్ట్రం మొత్తం నష్టపొయ్యేకన్నా.. ఇచ్చి ఒక భాగాన్ని మన ఖాతాలో వేసుకోవడం ఉత్తమం."

"మరి రాష్ట్రవిభజన విషయంలో నిదానంగా వ్యవహరిస్తున్నారేమిటి?" అడిగాడు సుబ్బు.

"చూడండి మేడం! ఎదురుగా మసాలా దోశ విత్ అల్లం పచ్చడి అండ్ కొబ్బరి చట్నీలతో రెడీగా ఉంది. మన ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినట్లు తిందాం. హడావుడిగా తినవలసిన అవసరం మనకేంటి?" అన్నాను.

"అర్ధం కాలేదు." అన్నాడు సుబ్బు.

"కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో మనమే ఉన్నాం గదా మేడం. ఎన్నికల సమయానికి క్లైమేక్స్ వచ్చేట్లుగా మనం రాజకీయాలు నడిపిద్దాం. మా  తెలుగు సినిమాల్లో పదోరీల్లోనే పోలీసులు వస్తే హీరో ఫైటింగు చెయ్యని అసమర్ధ వెధవగా మిగిలిపోతాడు. కాబట్టి దర్శకుడు పద్నాలుగో రీలు దాకా పోలీసుల్ని ఆపుతాడు. అంచేత తెలంగాణా ఇవ్వాల్సిన టైమింగ్ మన ఇష్టప్రకారం మాత్రమే ఉంటుంది. చివరిదాకా ఎవరికీ ఇంకే అవకాశం లేకుండా చెయ్యడమే మన మాస్టర్ ప్లాన్." అన్నాను.

కుర్చీలోంచి లేచాడు సుబ్బు. తన కుడిచేతి చూపుడు వేలుతో నా నుదురు తాకాడు.

"ఇప్పుడు నువ్వు నిద్ర లోంచి లేస్తున్నావు. నిదానంగా కళ్ళు తెరుస్తున్నావు. ఇప్పుడు నేను సోనియా గాంధీని కాను. నువ్వు CWC సభ్యుడవి కాదు.. సభ్యుడవి కాదు. నువ్వొక సాధారణ పౌరుడివి." అన్నాడు సుబ్బు.

నిద్రలోంచి మెలకువ వచ్చినట్లు నిదానంగా కళ్ళు తెరిచాను. వెలుగు భరించలేక ఒక్కసారిగా కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచాను. ఎదురుగా నవ్వుతూ సుబ్బు.

ఇందాక ఏదో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను? ఆఁ.. గుర్తొచ్చింది. రాష్ట్ర విభజన గూర్చి సుబ్బుతో చర్చిస్తున్నాను.

" సుబ్బూ! కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని నిట్టనిలువుగా చీల్చి చాలా తప్పు చేసింది." అన్నాను.

"అవునా? అయితే ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఒక్కటే! రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని తెలంగాణా జిల్లాల్లో ఉద్యమం చెయ్యడం. బెస్టాఫ్ లక్." అంటూ నవ్వుతూ గదిలోంచి నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)

Friday, 6 September 2013

నీకెందుకు?


సుబ్బు తాపీగా కాఫీ తాగుతున్నాడు.

"సుబ్బు! రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది." దిగులుగా అన్నాను.

"ఆ బాధేదో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు పడతార్లే. నీకెందుకు?"

"కాంగ్రెస్ పార్టీ విషయం తేల్చకుండా నానుస్తుంది సుబ్బూ!" నిష్టూరంగా అన్నాను.

"దాని ఫలితం దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీ అనుభవిస్తార్లే. నీకెందుకు?"

"రేపు హైదరాబాదులో మీటింగ్ ఎలా జరుగుతుందో!" ఆందోళనగా అన్నాను.

"APNGO లు జరిగేట్టు చూస్తారు. తెలంగాణావాదులు ఆపడానికి ప్రయత్నిస్తారు. చివరికి ఏదోటి జరుగుతుందిలే. నీకెందుకు?"

"బొగ్గు ఫైళ్ళు మాయమయ్యాయి సుబ్బూ!" అసహనంగా అన్నాను.

"ఆ సంగతి ప్రతిపక్షాలు చూసుకుంటాయిలే. నీకెందుకు?"

నాకు చిరాకేస్తుంది. ఒక్క క్షణం ఆలోచించాను. ఐడియా!

"రూపాయి విలువ పడిపోతుంది సుబ్బూ!"

"ఆ సంగతి రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ చూసుకుంటాళ్ళే. నీకెందుకు?"

"అవుననుకో. కానీ ద్రవ్యోల్పణం మూలంగా కాఫీ రేటు విపరీతంగా పెరుగుతుంది సుబ్బూ!"

ఒక్కసారిగా ఉలిక్కిపడి ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు. అటుపై ఆవేశంతో ఊగిపోయ్యాడు.

"ఎంత ఘోరం! కాఫీ రేటు పెరిగితే సామాన్య ప్రజానీకం ఎలా బ్రతికేది? పాలకుల అన్యాయం నశించాలి. కాఫీ రేటు తగ్గేదాకా పోరాటం ఆగదు. ఉద్యమం వర్ధిల్లాలి. ప్రతి ఇంటికి ఇద్దరు చొప్పున నా దగ్గరకి పంపించండి. ఢిల్లీని గడగడలాడిస్తా. ప్రభుత్వానికి బుద్ధొచ్చేలా చేస్తా!"

నేను ముసిముసిగా నవ్వుకున్నాను.

(photo courtesy : Google)

Thursday, 29 August 2013

మహానాయకులు - ట్రాఫిక్ సిగ్నళ్ళు

"సుబ్బూ!"

"ఊఁ"


"మన రాజకీయా పార్టీలకి గొప్ప ఎజెండా ఉంటుంది. మరెంతో గొప్ప నాయకులుంటారు. అయినా మన బ్రతుకులు ఎందుకిలా తగలడ్డయ్యంటావ్?"

"సిటీల్లో ప్రతి కూడలిలో ట్రాఫిక్ లైట్లుంటాయ్. అయినా యాక్సిడెంట్లు ఎందుకు జరుగున్నయ్యంటావ్?"

"సుబ్బూ! అర్ధం లేకుండా మాట్లాడి విసిగించకు."

"మనూళ్ళో ముఖ్యమైన కూడళ్ళలోనూ ట్రాఫిక్ సిగ్నళ్ళు ఉంటాయి. కానీ వీటిని ఎవరూ పట్టించుకోరు. వాటి మానాన అవి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు చూపిస్తుంటాయి. మన మానాన మనం వాహనాల్ని అడ్డదిడ్డంగా నడిపేస్తుంటాం. పొరబాటున ఎవడన్నా అమాయకుడు ఎర్రలైటు చూసి ఆగినట్లైతే.. వెనకనుండి వాణ్ని గుద్దేస్తారు. అనగా ట్రాఫిక్ లైట్లని పట్టించుకోకపోవడంలో మన జనాలకి ఒక యూనిటీ ఉంది, క్రమశిక్షణా ఉంది."

"అవును సుబ్బూ!"

"జనాలు ట్రాఫిక్ సిగ్నళ్ళని లెక్కచెయ్యక పోవడంలో చూపించిన యూనిటీ, క్రమశిక్షణా నాకు మన రాజకీయ పార్టీ కార్యకర్తల్లోనూ కనిపిస్తుంది. అన్ని కూడళ్ళల్లోనూ ట్రాఫిక్ లైట్లు ఉన్నట్లే అన్ని రాజకీయ పార్టీలకి ఒకప్పటి మహానాయకులు ఉంటారు. ఆ పాతతరం నాయకులకి గొప్ప సిద్ధాంతాలూ ఉండేవి. కానీ మన జనాలు ట్రాఫిక్ లైట్లని పట్టించుకొనట్లే ఆ నాయకుల సిద్ధాంతాల్ని సొంత పార్టీ కార్యకర్తలే పట్టించుకోరు."

"సుబ్బూ ! మరీ జనరలైజ్ చేస్తూ చెబుతున్నావ్. అర్ధం కావట్లేదు."

"ఓకే. ఉదాహరణకి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో బ్యాక్ గ్రౌండులో మహాత్మా గాంధి, నెహ్రూ బొమ్మలు ప్రముఖంగా కనిపిస్తుంటయ్. కానీ ఆ నాయకుల బొమ్మలకి, అక్కడ జరుగుతున్న సమావేశాలకి ఏ మాత్రం పొందిక ఉండదు. ఆ బొమ్మలు మన ట్రాఫిక్ లైట్లలాగే నిస్సహాయ సాక్షులుగా ఉండిపోతాయి."

"నిజమే సుబ్బూ!"

"తెలుగు దేశం పార్టీ మహానాడు సమావేశాల్లో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ కటౌట్లు, పోస్టర్లు దర్శనమిస్తుంటాయి. ఆ బొమ్మల సాక్షిగా, తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన అనేక ప్రజాసంక్షేమ పథకాల్ని ఎత్తేసింది. మొన్న మహానాడులో రాష్ట్ర విభజనకి అనుకూలంగా TDP తీర్మానం చేసింది. బ్యాక్ గ్రౌండులో ఎన్టీఆర్ బొమ్మ వెలవెలపోయింది. అనగా అక్కడ ఎన్టీఆర్ స్పూర్తి ఉండదు. బొమ్మ మాత్రమే ఉంటుంది."

"మరప్పుడు ఆ బొమ్మలెందుకు సుబ్బూ?"


"పిచ్చివాడా! ఆ బొమ్మలే లేకపోతే ఈ పార్టీలకి credibility crisis వస్తుంది. మనం పట్టించుకోవట్లేదని ట్రాఫిక్ సిగ్నల్స్ అవతల పడేస్తే ఊరికి ఎంత నష్టం! పనికిరాని ఆ ట్రాఫిక్ సిగ్నళ్ళు, ఉత్సవ విగ్రహాల్లా ప్రపంచానికో గొప్ప సందేశాన్ని ఇస్తాయి. ఈ సెంటర్లో ట్రాఫిక్ ఒక పద్దతిగా, క్రమశిక్షణ పాటిస్తుందన్న అభిప్రాయాన్ని కలిగిస్తాయి. దూరం నుండి చూసేవాళ్ళకి కన్నుల పండుగగా కూడా ఉంటుంది. ఆ విధంగా ట్రాఫిక్ లైట్లు పురజనులకి మానసికానందాన్ని కలిగిస్తాయి."

"అంటే ట్రాఫిక్ సిగ్నళ్ళూ, దివంగత పార్టీ నాయకుల బొమ్మలు ఒకటే నంటావా సుబ్బూ?"

"నేనైతే మాత్రం అవుననే అనుకుంటున్నాను. "

(picture courtesy : Google)

Friday, 23 August 2013

స్త్రీల పట్ల వివక్ష


సుబ్బు కాఫీ త్రాగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు.

"సుబ్బూ! స్త్రీ శక్తి స్వరూపిణి. ఆదిపరాశక్తి." అన్నాను.

"గాడిద గుడ్డేం కాదు? దీన్నే 'లిప్ సర్విస్' అంటారు మిత్రమా." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"అనగానేమి?" అడిగాను.

"పెదాలపై మాట ఒకటి, మనసులో భావం మరొకటి అని అర్ధం. భావజాలాన్ని మార్చుకోకుండా వాగాడంబరాన్ని ప్రదర్శిస్తే ప్రయోజనమేమి?" అన్నాడు సుబ్బు.

"కొంచెం అర్ధమయ్యేట్లు చెప్పవా?" చికాగ్గా అన్నాను.

"ఇవ్వాళ ఉద్యమాల్లో తమకి నచ్చని పురుష రాజకీయ నాయకులకి స్త్రీ వేషాలు వేసి ఊరేగిస్తున్నారు. అంటే సమాజంలో స్త్రీ స్థానం తక్కువ అని బహిరంగంగా ప్రకటించటమే." అన్నాడు సుబ్బు.

"దాందేముంది సుబ్బు! వాళ్లకి ఆ రాజకీయ నాయకుని పట్ల ఉన్న కోపంతో జెండర్ మార్చి వేషధారణ చేసి ప్రదర్శిస్తున్నారనుకోవచ్చు." అన్నాను.

"మరప్పుడు సోనియా గాంధీకి ప్యాంటూ, చొక్కా వేసి నిరసన తెలియజెయ్యాలి గదా? ఎందుకలా చెయ్యరు?" అడిగాడు సుబ్బు.

"నిజమే! ఎందుకలా చెయ్యరు?" ఆశ్చర్యపొయ్యాను.

"ఎందుకనగా.. మన సమాజంలో ఈ నాటికీ స్త్రీ కన్నా పురుషుడు అధికుడు అన్న భావం ఉండటం చేత. అందుకే పురుష రాజకీయ నాయకులకి పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి తమ అసంతృప్తిని తెలియజేస్తారు. రాజకీయాల్లో ఉన్న స్త్రీకి సిగరెట్ ప్యాకెట్ ఇచ్చి నిరసన తెలియజెయ్యడం మాత్రం ఇంతవరకూ జరగలేదు." అన్నాడు సుబ్బు.

"నిజమే సుబ్బూ! మరి ఈ విషయంలో ఇంతమటుకూ స్త్రీ సంఘాలు నిరసన తెలియజెయ్యలేదే?" అడిగాను.

"ఎవరి వాదన వారు చేసుకోవాలనుకోడానికి ఇదేమీ ఆస్థి తగాదా కాదు. ఒక సమాజ భావజాలానికి సంబంధించిన అంశం. స్త్రీలకి చదువులు, ఉద్యోగాలు అనవసరం అని కొందరు స్త్రీలే వాదిస్తారు. అలాగే స్త్రీల సమస్యల గూర్చి తపన పడ్డ గుడిపాటి చలం స్త్రీ కాదు. ఎవరి ఉద్యమం వాళ్ళే చేసుకోవాలంటే.. అప్పుడు పసిపిల్లలు, వృద్ధుల తరఫున ఎవరు ఉద్యమిస్తారు?" అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! నువ్వు చెప్పింది ఒప్పుకుంటున్నాను." అన్నాను.

"మన చిన్నప్పటితో పోలిస్తే ప్రజల తలసరి ఆదాయం పెరిగిందే గాని.. తలలో ఆలోచనలు పెరగలేదనిపిస్తుంది. అతి చిన్న విషయమే అయినా.. ఒక చర్య ద్వారా తమలోని వికృత భావాజాలాన్ని బయట పెట్టుకుంటున్నారు." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! ఈ విషాదాన్ని నేను తట్టుకోలేను. రాత్రికి దినకర్ పంపిన glenfiddich తో ఈ సమాజం పట్ల మన నిరసన తెలియజేద్దాం." నవ్వుతూ అన్నాను.

"ఓ! తప్పకుండా." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)

Thursday, 22 August 2013

కాకిగోల


"రవణ మావా!"

"ఊఁ"

"ఈ మధ్య కాకులు పెద్దగా కనబడట్లేదేంటి?'


"నేనూ నిన్నటిదాకా అలాగే అనుకున్నాను సుబ్బు. కానీ పొద్దున్న టీవీ చూశాక కాకుల ఎడ్రెస్ తెలుసుకున్నాను."

"టీవీల్లో కాకులా!"

"అవును. ఏ తెలుగు టీవీ చానెల్ చూసినా ఈ మధ్య ఒకటే కాకిగోల. టీవీల వాళ్లకి వార్తలు లేక ఏవో పనికిమాలిన చర్చా కార్యక్రమాలు పెడుతుంటారు. అక్కడ చర్చ ఉండదు. ఏవో పిచ్చికేకలుంటాయి. మనకి ఏవీ అర్ధం కాదు."

"వాళ్ళ ఉద్దేశ్యం కూడా మనకి అర్ధం కాకూడదనే రవణ మావా!"

"తెలుగు టీవీల్లో చర్చా కార్యక్రమాలు చాలా నాసిగా ఉంటాయి. రాజకీయాల్లో, మీడియాలో పన్లేని నిరుద్యోగులతో ఇవి నిర్వహిస్తున్నట్లుగా అనిపిస్తుంది."

"నేనైతే ఈ ప్రోగ్రాములు చూడను. కాబట్టి నాకు తెలీదు. అయితే ఈ వాగుళ్ళకి, కాకిగోలకీ కల సంబంధమేమి?"

"కాకులు కూడా టీవీ చర్చల్లాగే గోలగోలగా అరుస్తుంటాయి సుబ్బూ."

"నీ పోలిక సరికాదు. కాకులు కష్టజీవులు. కాకి అనే జీవి లేకపోతే మన పర్యావరణం దెబ్బ తింటుంది. కాకుల భాష మనకి అర్ధం కాదు కాబట్టి మనం వాటి అరుపుల్ని 'కాకిగోల' అని హేళనగా అనుకుంటాం. కానీ కాకుల అరుపుకి చాలా స్పష్టమైన అర్ధం ఉంటుంది. అవి వాటి భాషలో ఒకదానికొకటి హెచ్చరించుకుంటాయి. తమలో ఒకరు చనిపోతే సామూహికంగా సంతాప సందేశాన్ని ప్రకటిస్తాయి."

"అవును. కాకుల్లాగే జంతువులు కూడా సంఘజీవులే సుబ్బూ."

"అంతేకాదు. మనుషుల్లో మంచితనం ఉండదు. అయినా 'మానవత్వం' అనే పదం సృష్టించుకున్నాం. కాకులకి మంచితనం అనేది ఒక సహజగుణం. అయినా తెలుగు భాషలో 'కాకిత్వం' అనే పదం లేదు. తెలుగు భాషలో తమకి జరిగిన అన్యాయం కాకులకి తెలీదు. తెలిసినట్లైతే అవి మనని ముక్కుతో పొడిచి చంపేసేవి!" అన్నాడు సుబ్బు.

"ఓకే. ఒప్పుకుంటున్నాను. మరప్పుడు కాకిగోల అని ఎందుకంటాం సుబ్బూ?"

"ఇట్లాంటి పదప్రయోగాలు తెలుగు భాషలో ఒక పెద్ద లోపం. ఉదాహరణకి 'క్రూరమృగం' అంటాం. నిజానికి ఏ మృగం కూడా క్రూరమైంది కాదు. ఒకరకం జాతి జంతువులు, ఆకలి వేసినప్పుడు ఇంకోరకం జాతి జంతువుల్ని కష్టపడి వేటాడి చంపుకుని తింటాయి. అది ప్రకృతి ధర్మం. అలా చెయ్యకపోతే అవి ఆకలితో చస్తాయి. ఇందులో క్రూరత్వం ఏముంది? చంపడం అనే ఒక్క అంశాన్ని తీసుకుని, దానికి మన value judgement జోడించి 'క్రూరమృగం' అంటున్నాం."

"అవున్నిజం."

"ఈ మధ్య జర్నలిస్టులకి సైతం పైత్యం ఎక్కువైంది. అందుకే రేపిస్టులకి 'మృగాడు' అని బిరుదులిస్తున్నారు. ఇట్లా నీచోపమానాలకి జంతువుల పేర్లు వాడుకోవటం వాటి మనోభావాలు దెబ్బ తియ్యడమే కాదు.. వాటి  హక్కుల ఉల్లంఘన క్రిందకి కూడా వస్తుంది."

"ఓకే. నా 'టీవీ చర్చలు ఒక కాకిగోల' స్టేట్మెంటుని వెనక్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు నీ ప్రశ్న నేనడుగుతున్నాను. కాకులు ఎందుకని పెద్దగా కనబట్లేదు? ఏమై ఉంటాయి సుబ్బూ?"

"నాకైతే ఫ్రిజ్ లొచ్చి కాకుల్ని దెబ్బకొట్టాయని అనిపిస్తుంది."

"ఎలా?"

"సింపుల్. ఇంతకుముందు అంట్లు కడిగేప్పుడు మిగిలిన అన్నం అవతల పడేసేవాళ్ళం. కాకులకి అలా విసిరేసిన మెతుకులే విందుభోజనం. ఇప్పుడు చద్దన్నాలు ఫ్రిజ్జుల్లొ పెట్టుకుని మనమే తినేస్తున్నాం. ఇది గ్రహించిన కాకులు, మన దరిద్రానికి జాలిపడి, మన ఇళ్ళ వైపు రావడం మానేశాయి."

"అవునా సుబ్బూ!"

"అవును. కానీ కాకులు మనవైపు రాకపోతే నష్టపొయ్యేది మనమే. కాకులు కాదు. ఇంతటితో మన కాకిగోల ఆపేద్దాం."


(photos courtesy : Google)

Thursday, 15 August 2013

టూత్ ఏక్.. టూ మెనీ డౌట్స్

"సుబ్బూ! అడ్డమైన గడ్డీ అడ్డదిడ్డంగా మేస్తావు. పెట్టెడు సిగరెట్లు సునాయాసంగా ఊది పడేస్తావు. ఆ పాడు వక్కపొడి పలుకులు బఠాణీల్లాగా నముల్తుంటావు. వద్దురా బాబూ అని చిలక్కి చెప్పినట్లు చెబుతూనే ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మాత్రం కుక్కతోకే. అనుభవించు." ఒక్కో పదం నొక్కి పలుకుతూ అన్నాను.

అంతలోనే దిగాలుగా కూర్చునున్న సుబ్బుని చూస్తే జాలేసింది. రెండ్రోజులుగా సుబ్బు పంటినొప్పితో బాధ పడుతున్నాడు. ఇవ్వాళ మావాడికి నొప్పి భరింపరానిదిగా తయారైంది. అదీ విషయం.

"సర్లే పద. డెంటల్ డాక్టర్ దగ్గర కెళ్ళొద్దాం. నాకు ఆట్టే టైం లేదు." టైం చూసుకుంటూ అన్నాను.

"నీతో నేన్రాను. నువ్వూ, ఆ డాక్టరు నా పంటి గూర్చి డిసైడ్ చేసేసి ఏదో చేస్తారు. హడావుడిగా పన్ను పీకించినా పీకేంచేస్తావు." నిదానంగా అన్నాడు సుబ్బు.

"అర్ధం కాలేదు. అంటే నామీద నీకు నమ్మకం లేదా?" అడిగాను.

"లేదు. నిన్ను నమ్మి నా పన్ను నీ చేతిలో పెట్టలేను." సన్నగా నవ్వుతూ అన్నాడు సుబ్బు.

నాకు చికాగ్గా అనిపించింది.

"సుబ్బు! ఎక్కువ మాట్లాడకు. న్యాయంగానైతే నీమీద జాలి చూపకూడదు."

"చూడబోతే నా టూత్ ఏక్ నీకు సంతోషంగా ఉన్నట్లుంది ." అంటూ అరచెయ్యి దవడపై ఆనించి బాధగా కళ్ళు మూసుకున్నాడు.

పాపం! బిడ్డడికి నొప్పి బాగా ఉన్నట్లుంది. అందుకే తలతిక్కగా మాట్లాడుతున్నాడు.

"సరే. నా ఫ్రెండ్ డాక్టర్ సుబ్బానాయుడుకి ఫోన్ చేసి చెబుతాను. ఇక్కడతనే టాప్ డెంటల్ డాక్టర్. కార్లో వెళ్లి నీ పన్ను నువ్వే చూపించుకో మిత్రమా." అన్నాను.

"నేనా డాక్టరు దగ్గరకి పోను. ఆయన చాలా బిజీ. హడావుడిగా చూస్తాడు." అన్నాడు సుబ్బు.

"పోనీ నీ పంటిని నిదానంగా, స్పెషల్ గా, ఓ పది నిమిషాల పాటు చూడమని చెబుతాను. ఓకేనా?" నవ్వుతూ అన్నాను.

"అసలు నాకో అనుమానం. పళ్ళ డాక్టర్లు ఒకడి నోట్లో పెట్టిన instrument సరీగ్గా కడక్కుండా ఇంకోళ్ళ నోట్లో పెట్టరని గ్యారంటీ ఏంటి?" అన్నాడు సుబ్బు.

"ఇన్ని డౌట్లు గుండె ఆపరేషన్ చేయించుకునే వాడిక్కూడా రావు సుబ్బు." అసహనంగా అన్నాను.

"పన్ను నాది. నొప్పి కూడా నాదే. నాకీ వివరాలు చాలా అవసరం." నొప్పిగా నవ్వాడు సుబ్బు.

"సర్లే. పోనీ డాక్టర్ రెడ్డి దగ్గరకి వెళ్తావా? ఆయన దగ్గర జనం తక్కువగా ఉంటారు. శ్రద్ధగా చూస్తాడు." అన్నాను.

"అంత శ్రద్ధగా చూసేవాడైతే ప్రాక్టీసు లేకుండా ఖాళీగా ఎందుకుంటాడు? ఆయన వైద్యంలో ఏదో లోపం ఉండుంటుంది. నేను పోను." స్థిరంగా అన్నాడు సుబ్బు.

"నీకు నీ పంటినొప్పికి ట్రీట్మెంట్ కావాలా? డాక్టర్ల బయోడేటా కావాలా?" సుబ్బు అనుమానాల్తో చికాకనిపిస్తుంది.

"పిచ్చివాడా! ఎవడైనా పళ్ళ డాక్టర్ల గూర్చే బాగా విచారించాలి. కాళ్ళూచేతులు రెండు రెండుంటాయి. కావున పెద్దగా కన్ఫ్యూజనుండదు. కానీ నోట్లో పళ్ళు 32. అంచేత డాక్టర్ కన్ఫ్యూజ్ అయ్యే చాన్స్ ఎక్కువ. పొరబాటున ఒకదాని బదులు ఇంకోటి పీకేసే ప్రమాదం మెండుగా ఉంటుంది." అన్నాడు సుబ్బు.

"ఒరే నాయనా! నీకో నమస్కారం. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు." అన్నాను.

"నువ్వు ఏమీ చెయ్యనక్ఖర్లేదు. బాబా రామ్ దేవ్ పళ్ళపొడి మూడు పూటలా వేసి తోమితే పంటినొప్పి చిటికెలో మాయమౌతుందని మన పుచ్చాగాడు చెప్పాడు. అసలీ ఇంగ్లీషు డాక్టర్ల వైద్యం నరకానికి అడ్డదారి." అంటూ లేచాడు సుబ్బు.

"పోనీ నొప్పి తగ్గడానికి ఏదైనా పెయిన్ కిల్లర్ ఇవ్వమంటావా?" అడిగాను.

"అవసరం లేదు. మీ సైకియాట్రిస్టులు ఇచ్చే మందులు నేను వాడను." అంటూ హడావుడిగా వెళ్ళాడు సుబ్బు.

'ఈ జన్మకి సుబ్బుకి బుద్ధొచ్చే అవకాశం లేదు.' అనిపించింది. దీర్ఘంగా నిట్టూర్చి నా పనిలో పడ్డాను.

సాయంకాలం సుబ్బు మదర్ ఫోన్.

"ఒరే రమణా! ఇక్కడ సుబ్బు పరిస్థితి ఏమీ బాగాలేదు. అదేదో పళ్ళ పొడి తెచ్చుకుని మధ్యాహ్నం అంతా పళ్ళకేసి రుద్దాడు. ఇప్పుడేమో నోరంతా పోక్కి ఎర్రగా అయిపొయింది. మూతి కూడా వాచిపోయింది. మాట్లాళ్ళేకపోతున్నాడు. సైగలు చేస్తున్నాడు. నీ దగ్గరకి పొమ్మంటే పోనంటున్నాడు." అన్నారావిడ.

"అమ్మా! వాణ్ని నోరు మూసుకుని నే చెప్పినట్లు చెయ్యమను." అన్నాను.

"వాడిప్పుడు నోరు మూసుకునే ఉన్నాడు గదరా. తెరవలేడు. మళ్ళీ మూసుకొమ్మని చెప్పడం దేనికి?" ఈవిడ అన్నివిధాలా సుబ్బుకి తల్లే.

"సరేనమ్మా. నేనిప్పుడే కారు పంపుతున్నాను. ఆ దరిద్రుణ్ని అర్జంటుగా రెడీ కమ్మను. కారెక్కనంటే కర్ర తీసుకుని నాలుగు బాది కార్లోకి నెట్టు." అంటూ ఫోన్ పెట్టేసి డ్రైవర్ కోసం బెల్ నొక్కాను.

(picture courtesy : Google)

Friday, 21 June 2013

మధుబాల డార్లింగ్


"సుబ్బు!"

"ఆఁ!"

"ఈ వెన్నెల ఎంత హాయిగా యున్నది!"

"ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవాల్సింది ప్రేమికులు. మనం కాదనుకుంటాను."

"ఈ చల్లని వెన్నెల సమయాన మధుబాల గుర్తోస్తుందోయి?"

"glenfiddich అడుగంటుతుంది. సరిపోదేమోనని భయంగా ఉందోయి."

"మొగలే ఆజమ్ లో మధుబాల ఎంతందంగా ఉంది! ఈ సృష్టిలో మధుబాల అద్భుత సౌందర్యానికి  గులాము కాని వెధవ ఎవడన్నా ఉంటాడా! మొగలే ఆజాం సినిమా చూడనివాడు గాడిద. మధుబాల అందాన్ని మెచ్చనివాడు పంది."

"సర్లే! ఇప్పుడు కాదన్నదెవరు? ఊరికే ఆయాసపడకు."

"పాపం! తొందరగా వెళ్ళిపోయింది సుబ్బు! అక్బర్ కొడుకేం ఖర్మ! సాక్షాత్తు బ్రహ్మదేవుడే తను సృష్టించిన అపరంజిబొమ్మ అందానికి దాసుడయ్యుంటాడు. అందుకనే తొందరగా తీసుకుపోయ్యాడు."

"అంతేనంటావా? పాపి చిరాయువు అన్నారు పెద్దలు. కాబట్టి మనం సేఫ్."




"ఆహాహా.. ఏం పాట సుబ్బు! 'ప్యార్ కియా తో డర్నా క్యా?' అంటూ పంచరంగుల్లో మెరిసిపోయింది. నా కళ్ళల్లోకళ్ళు పెట్టి చూస్తూ 'ప్రేమిస్తే తప్పేంటి? ఈ లోకంలో ప్రేమని తప్ప దేన్నీ లెక్క చేయను.' అంటుంటే ఆనందంతో ఏడుపొచ్చేసింది."

"వచ్చే ఉంటుంది. ఇప్పుడు నీ ఎమోషన్ చూస్తుంటే అర్ధమౌతుందిలే."

"గుండెలనిండా నిఖార్సైన ప్రేమభావం నింపుకున్న నిజాయితీ.. ఎవ్వరినీ లెక్కచేయ్యనీదేమో! స్వచ్చమైన ప్రేమ ముందు చావు చాలా చిన్నది. ఏంటి సుబ్బూ! అలా చూస్తున్నావ్!"

"ఏం లేదు. glenfiddich ని హడావుడిగా సేవిస్తే కలిగే దుష్పరిణామాలు గాంచుతున్నాను. అందుకే నిదానం ప్రధానం అన్నారు పెద్దలు."
             
"పాటకి అర్ధం తెలుసా సుబ్బూ! ప్రేమించటానికి భయం దేనికి? ప్రేమ తప్పెలా అవుతుంది? తప్పవటానికి ఇది దొంగతనం కాదు. ఈరోజు నా గుండెకధ చెపుతా. నన్ను చంపినాసరే, నా ప్రేమజ్యొతి వెలుగుతూనే ఉంటుంది. ఈ పరదాల చాటున నా ప్రేమని దాచలేను."

"ప్రేమ విషయంలో నేను వీక్. హిందీలో ఇంకా వీక్. కాబట్టి నువ్వు  చెప్పింది ఒప్పుకోక తప్పదు."

"ఆహా లతా దీది! నమస్కార్. నౌషాద్ భయ్యా! అదా బర్సే. ఆసిఫ్ భాయ్! ధన్యవాద్."

"మధుబాలని మర్చిపోయ్యావ్."

"ఛ ఊరుకో సుబ్బు! ఇంట్లో మనుషులకి ఎవరైనా థాంక్సులు చెబుతారా? అలా చెబితే మధుబాల డార్లింగ్ ఫీలవదూ!"


(pictures courtesy : Google)

Tuesday, 11 June 2013

అద్వాని - ఆస్పత్రి


సమయం ఉదయం పది గంటలు. హిందు పేపర్లో అద్వానిపై రాసిన ఎడిటోరియల్ చదువుతున్నాను.

"రవణ మామా! కాఫీ." అంటూ హడావుడిగా లోపలకొచ్చాడు సుబ్బు.

చాలా రోజుల తరవాత వచ్చిన సుబ్బు రాక ఆనందం కలిగించింది.

"రా సుబ్బు! కూర్చో. పాపం! అద్వానికి ఎంత అవమానం జరిగిపోతుంది." దిగులుగా అన్నాను.

"ఇందులో నువ్వు బాధ పడేదేముంది? రాజకీయాలలో ఇది మామూలే. ఇక్కడ దయాదాక్షిణ్యాలు, మమతానురాగాలకి తావు లేదు మిత్రమా!" అన్నాడు సుబ్బు.

"సుబ్బు! అద్వాని భారత రాజకీయాల్ని దశాబ్దాలుగా ప్రభావితం చేసిన మహానాయకుడు." అన్నాను.

"కాదన్నదెవరు? ఆయన వాజపేయితో కలిసి ఒక గొప్ప ఆస్పత్రిని ఎంతో విజయవంతంగా నడిపిన మహానాయకుడు!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"ఏంటి! అద్వాని వాజపేయితో కలిసి ఆస్పత్రి నడిపాడా!" ఆశ్చర్యంగా అడిగాను.

"రవణ మావా! చాలా ఊళ్ళల్లో డాక్టర్లైన భార్యాభర్తలు ఆస్పత్రి నడుపుతుంటారు. ఇద్దర్లో ఒకరు పేషంట్ల పట్ల చాలా సౌమ్యంగా, స్నేహంగా ఉంటారు. ఇంకొకరు డబ్బు దగ్గర కఠినంగా, ఖచ్చితంగా ఉంటారు. 'డాక్టరయ్య దేవుడు! పేదోళ్ళంటే ఎంత కనికరం! డాక్టరమ్మకే ఎక్కళ్ళేని డబ్బాశ. నిలబెట్టి వసూలు చేస్తది.' అని పేషంట్లు అనుకుంటుంటారు."

ఇంతలో పొగలు గక్కుతూ వేడి కాఫీ వచ్చింది.

కాఫీ సిప్ చేస్తూ నిదానంగా చెప్పసాగాడు సుబ్బు.

"వాస్తవానికి ఫీజు వసూళ్లు డాక్టరయ్య కనుసన్నల్లోనే జరుగుతుంటుంది. ఇదే వారి విజయ రహస్యం. ఇది చాలా సింపుల్ బిజినెస్ టెక్నిక్. ఆస్పత్రిలో డాక్టరయ్య మాత్రమే ఉంటే కనీస ఫీజులు కూడా వసూలు కాక ఆస్పత్రి మూత పడుతుంది. ఒక్క డాక్టరమ్మే ఉన్నా కూడా పేషంట్లు రాక మూత పడుతుంది."

"అవును సుబ్బు! మనూళ్ళో కూడా ఈ టెక్నిక్ నడుస్తుంది. నీ అబ్జర్వేషన్ కరెక్ట్." అన్నాను.

"ఒప్పుకుంటున్నావుగా? ఓకే! ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీ గూర్చి మాట్లాడుకుందాం. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నడిచినప్పుడు వాజపేయి, అద్వానిలు డాక్టరయ్య, డాక్టరమ్మల పాత్రలు పోషించారు. హిందుత్వవాదులు అద్వానిలో తమ ప్రాతినిధ్యాన్ని చూసుకుని తృప్తినొందారు. చంద్రబాబు, నితీష్ లు వాజపేయిని చూపిస్తూ పని కానిచ్చుకున్నారు. వాస్తవానికి వాజపేయి, అద్వానిలు ఒకటే. వారిద్దరూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడానికి ఇట్లాంటి సర్దుబాటు చేసుకున్నారు."

"ఇంటరెస్టింగ్ సుబ్బు!" అన్నాను.

"ఒకరకంగా ఇప్పుడు ప్రజలకి మంచే జరిగింది." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"ఎలా?" ఆసక్తిగా అడిగాను.

"ఇప్పుడు పేషంట్లకి ఏ కన్ఫ్యూజనూ లేదు. డాక్టరయ్య మంచాన పడ్డాడు. కావున ఆస్పత్రికి పేషంట్లు తగ్గారు. అందువల్ల ఆస్పత్రికి పూర్వవైభవం తెప్పించే పనిని మోడీ అనే కొత్త డాక్టరుకి అప్పజెప్పారు. ఇది నచ్చని డాక్టరమ్మ అలిగి వెళ్ళిపోయింది. ఈ కొత్త డాక్టరు అనుభవం లేనివాడేమీ కాదు. వాళ్ళ ఊరైన గుజరాత్ లో రాష్ట్రప్రభుత్వం అనే ఓ చిన్నఆస్పత్రిని లాభసాటిగా నడుపుతున్నాడు."

"మరి మోడీ ఇంత పెద్ద ఆస్పత్రిని నడపగలడంటావా?"

"అది మనం వెండి తెరపై చూడాలి. ఇప్పుడే ఎలా చెబుతాం? అయితే తన చిన్న ఆస్పత్రిలో మోడీ చేస్తున్న వైద్యం గూర్చి ప్రజలకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. అంచేత ఇష్టమైతే మోడీ ఆస్పత్రిలోకి వెళ్తారు. లేకపోతే లేదు. ప్రజాస్వామ్యంలో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం." అంటూ టైం చూసుకుంటూ లేచాడు.

"మరిప్పుడు అద్వాని పరిస్థితేంటి సుబ్బు?"

"అద్వానికి పెద్దగా ఆప్షన్స్ లేవు. పార్టీవాళ్లు ఆయనకో ఉచితాసనం ఇచ్చి ధృతరాష్ట్రుడిలా కూర్చోమంటున్నారు. ఆయన అలా కూర్చోనైనా కూర్చోవాలి. లేదా బయటకి వెళ్లిపోవాలి. నిర్ణయించుకోవలసింది అద్వాని. మనం కాదు. వస్తాను. నాకు టైమైంది." అంటూ హడావుడిగా వెళ్ళాడు సుబ్బు.

(photo courtesy : Google)

Wednesday, 3 April 2013

రావిశాస్త్రి పూజావిధానం


వర్షం జల్లుగా కురుస్తుంది. పేషంట్లని చూడ్డం అయిపోయింది. విసుగ్గా వుంది. ఏం చెయ్యాలి? తెలుగు టీవీ వార్తలు చూసే ధైర్యం లేదు. పోనీ ఏదైనా ఒక తెలుగు కథ చదివితే ఎలా వుంటుంది? ఏమో! కష్టపడి కథంతా చదివాక.. తీరా అదో చెత్త కథైతే? ఇప్పుడంత రిస్క్ తీసుకునే అవసరముందా? లేదు కదా! మరైతే ఈ విసుగుని అధిగమించుట ఎట్లు? సింపుల్! చదివిన రచయితనే మళ్ళీ చదివేద్దాం.

ఎదురుగా టేబుల్ మీద రావిశాస్త్రి నవ్వుతూ నన్నే చూస్తున్నట్లుగా అనిపించింది. 'బాకీ కథలు' తీసుకున్నాను. 'ద్వైతాద్వైతం' కథ చదవడం మొదలెట్టాను. ఇప్పటికీ కథ ఎన్నిసార్లు చదివుంటాను? గుర్తు లేదు. కథ మొదటి భాగం పులి చెబుతుంది. రెండో భాగం నల్లమేక చెబుతుంది. క్రమంగా కథలో లీనమైపోయ్యాను. రావిశాస్త్రి సిమిలీల వర్షంలో తడిసి ముద్దైపోసాగాను. రావిశాస్త్రి శిల్ప చాతుర్యానికి అబ్బురపడుతూ (ఇది నాకలవాటు).. హోరున ప్రవహిస్తున్న వాక్యాల సుడిగుండంలో గింగరాలు తిరుగుతూ మునిగిపోతూ (ఇదీ నాకలవాటే) -

'ఆహాహా! ఏమి ఈ రావిశాస్త్రి రచనా చాతుర్యము! అయ్యా శాస్త్రిబాబు! నువ్వేగనక రాయకపోయినట్లైతే - తెలుగు సాహిత్యం గుడి మెట్ల మీద అడుక్కు తింటుండేది! అరిగిపోయిన సైకిల్ ట్యూబులకి పంచర్లు వేసుకుంటుండేది! దెబ్బ తగిలిన గజ్జికుక్కలా బీదగా, దీనంగా, బాధగా ఏడుస్తుండేది! నువ్వు తెలుగు కథకి రాజువి, రాజాధిరాజువి. నువ్వు మనిషివా? కాదు, కానే కాదు. దేవుడవు, దేవదేవుడవు. పూర్వజన్మలో నువ్వు మోపాసావి! కాదు కాదు చెహోవ్‌వి! కాదు కాదు ఇంకా అంతకన్నా వందరెట్లు ఎక్కువగా.. " అనుకుంటూ ఆనందడోలికలలో తేలియాడుచుండగా -

"రవఁణమావా! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"రా సుబ్బూ! సమయానికోచ్చావ్! రావిశాస్త్రి అక్షరాన్ని ఆనందంగా అనుభవించేస్తున్నాను, మనసారా మజా చేస్తున్నాను! రావిశాస్త్రి ఈజ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్! కాదన్నవాణ్ణి కత్తితో కసకసా పొడిచేస్తాను. ఔనన్నవాడిని హృదయానికి ఘాట్టిగా హత్తుకుంటాను." కవితాత్మకంగా అన్నాను.

రావిశాస్త్రి సుబ్బుక్కూడా ఇష్టం. అంచేత ఎప్పట్లా నాతో వాదనలకి దిగలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. నాలో మాత్రం ఉత్సాహం ఉరకలు వేస్తుంది.

"సుబ్బూ! మనం మన రావిశాస్త్రికి ఏదైనా చెయ్యాలి. ఒక సొవనీర్.. ఒక కథల వర్క్ షాప్.. ఒక శిలావిగ్రహం.. ఏదైనా పర్లేదు. ఏదోటి చేసేద్దాం. ఏవఁంటావ్?" ఎక్సైటింగ్‌గా అన్నాను.

"రవణ మావా! రావిశాస్త్రికి నువ్వు చేసేదేముంది? ఆయన పోయి చాలా కాలమైంది. బ్రతికున్నట్లయితే మన దినకర్ పంపించిన సింగిల్ మాల్ట్ సీసాలు ఆయన కాళ్ళ దగ్గర పెట్టి, ఆ కాళ్ళకి నమస్కారం చేసి - 'మా రాచకొండకి మంగళారతులు! మా కథల తండ్రికి సీసాల దండలూ' అంటూ పాడి మన భక్తిని చాటుకునేవాళ్ళం." అన్నాడు సుబ్బు.

సుబ్బు మాటలకి నాకు నవ్వొచ్చింది.

"ఒరే నాయనా! రావిశాస్త్రికి ఏదైనా చెయ్యాలంటే ఆయనకి వ్యక్తిగతంగా చెయ్యాలని కాదు. ఆయన జ్ఞాపకార్ధం ఏదైనా చెయ్యాలని! అర్ధమైందా?" అన్నాను.

సుబ్బు నవ్వుతూ అన్నాడు.

"అంటే ఇష్టమైన వాళ్ళకి ఏదోటి చేసి ఋణం తీర్చుకోవాలంటావ్! అంతేనా? అప్పుడు మన లిస్టులో చాలా వచ్చి చేరతాయి. ఉప్మా పెసరట్టు, ఫిల్టర్ కాఫీ, సింగిల్ మాల్ట్.. ఇలా చాలానే ఉన్నాయి. మరి ఇవేం పాపం చేశాయి?"

ఇంతలో పొగలు గక్కుతూ కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు.

"రుచిగా ఉండటం ఉప్మాపెసరట్టు ధర్మం. ఆ రుచికి మనం బానిసలం. ప్రతిరోజూ ఆ పెసరట్టు ముండని ప్రేమగా కొబ్బరిచట్నీతో నంజుకు తినుటయే దానికి నువ్విచ్చే గ్రేటెస్ట్ ట్రిబ్యూట్. అంతేగానీ ఉప్మా పెసరట్టుకి శిలావిగ్రహం పెట్టిస్తావా? పెట్టించవు గదా!"

"రావిశాస్త్రి రచనల్ని ఉప్మా పెసరట్టుతో పోలుస్తున్నావు. చాలించు నీ వితండ వాదం. నీతో ఇదే సమస్య. విషయాన్ని కాంప్లికేట్ చేసేస్తావు." విసుక్కున్నాను.

సుబ్బు నా మాట పట్టించుకోలేదు. చెప్పడం కొనసాగించాడు.

"రావిశాస్త్రి అత్యున్నత రచయిత. బుద్ధున్నవాడైనా కాదంటాడా? అంచేత ఆయన రాసి పడేసిన సాహిత్యం చదువుకో. తనివి తీరకపోతే మళ్ళీ చదువుకో, మళ్ళీమళ్ళీ చదువుకో, కళ్ళు నొప్పులు పుట్టేలా చదువుకో, కళ్ళజోడు అరిగిపొయ్యేలా చదువుకో! అయితే ఆయన ఎవరి కోసం, ఏ సమాజం కోసం రాశాడో వారి గూర్చి ఆలోచించు. అంతేగానీ - తెలుగు సినిమా హీరో అభిమానిలా వెర్రిగా ఆలోచించకు."

"ఇప్పుడు నన్నేం చెయ్యమంటావ్?" డిజప్పాయింటింగ్‌గా అడిగాను.

"'ద్వైతాద్వైతం' చదవడం అయిపోయాక 'రాజు-మహిషి' చదువుకో. నా దృష్టిలో 'రాజు-మహిషి' రావిశాస్త్రి ఆల్ టైమ్ బెస్ట్." అన్నాడు సుబ్బు.

"కానీ - రావిశాస్త్రి 'రాజు-మహిషి' కథ పూర్తి చెయ్యలేదుగా?" నిరాశగా అన్నాను.

"కథ ఎవడిక్కావాలోయ్! కథలే కావాలనుకుంటే చందమామ చదువుకో! అసలు రావిశాస్త్రి కలం నుండి జాలువారిన ప్రతివాక్యం ఒక అద్భుతం. రావిశాస్త్రి రచనల్లో కథ వెతుక్కునే నీలాంటి నిర్భాగ్యులు ఉండటం మన తెలుగు సాహిత్య దౌర్భాగ్యం."

"నాకదంతా తెలీదు సుబ్బు! నేను రావిశాస్త్రికి నివాళులు అర్పించాల్సిందే. ఏదైనా మార్గం చెప్పు." పట్టుదలగా అన్నాను.

ఒకక్షణం ఆలోచించాడు సుబ్బు.

"ఓకే! రాత్రికి మళ్ళీ కలుద్దాం. ఈలోపు నీ దగ్గరున్న రావిశాస్త్రి పుస్తకాలన్నీ ఒకచోటకి చేర్చు. అ పుస్తకాలన్నింటికి పసుపు రాయించి కుంకుమతో బొట్లు పెట్టు. నీదగ్గర రావిశాస్త్రి పటం ఉందిగా! దానికో పేద్ద పూలదండ వేయించు, అంబికా దర్బార్ బత్తి వెలిగించి.. "

"అర్ధమైంది. కొబ్బరికాయలు కొట్టి గంట గణగణ లాడించి ప్రసాదం పంచాలి." విసుక్కున్నాను.

"చెప్పేది పూర్తిగా విను మిత్రమా! దేవుళ్ళకి నైవేద్యం పెడతాం. విఘ్నేశ్వరుడుకి ఉండ్రాళ్ళు, వెంకటేశ్వరుడుకి లడ్లు. అంటే ఏ దేవుడికి ఇష్టమైన పదార్ధం ఆ దేవుడికి నైవేద్యంగా పెడతాం. కదా? ఇక్కడ మన దేవుడెవరు? రావిశాస్త్రి. కదా? మరి రావిశాస్త్రికి నైవేద్యంగా ఏం పెడతావు?"

"నువ్వే చెప్పు."

"మనం రావిశాస్త్రికి నైవేద్యంగా 'గ్లెన్‌ఫెడిచ్' పెడదాం. ఆ పక్కనే బిస్లరీ సోడాలు, గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్ సిగరెట్లు పెడదాం." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు.

"తరవాత?" ఆసక్తిగా అడిగాను.

"ఇప్పుడు మనం వినాయక చవతి పూజ మోడల్‌ని ఫాలో అవుదాం! అయితే ఈ పూజలో మనం చదివబొయ్యేది రావిశాస్త్రి సాహిత్యం."

"నేను అల్పజీవి చదువుతాను." ఉత్సాహంగా అన్నాను.

"నీ ఇష్టం. అల్పజీవి కాకపొతే సారాకథలు చదువుకో! దీన్నే 'రావిశాస్త్రి పూజావిధానం' అందురు. పూజా సమయంలో గ్లెన్‌ఫెడిచ్ బాటిల్, సిగరెట్ పెట్టెలు రావిశాస్త్రి పటం ముందుంచాలి. చివర్లో - 'ఓం! గ్లెన్‌ఫెడిచ్ సమర్పయామి! ఓం! గోల్డ్‌ఫ్లేక్ సమర్పయామి!' అని మూడుసార్లు అనాలి. అప్పుడవి ఆటోమేటిగ్గా ప్రసాదంగా మారిపోతాయి."

"మారిపోతే?"

"పిచ్చివాడా! దేవుని ప్రసాదాన్ని ఏం చేస్తాం? అవతల పడేస్తామా? అది మహాపాపం. ఆరగిస్తేనే పూజాఫలం దక్కేది. అందునా ఆ ప్రసాదం ఎవరిది? మన ఇష్టదైవమైన శాస్త్రిబాబుది!"

"అంటే ఆ విస్కీ తాగేయ్యాలా?"

"అవును. విస్కీ తాగేయ్యాలి. సిగరెట్లు ఊదేయ్యాలి. ఆ విధంగా సుబ్బయ్య, ముత్యాలమ్మ, సార్వభౌమరావు, రత్తాలు-రాంబాబు, మరిడి మహాలక్ష్మి, వియత్నాం విమల-బంగారి గాడు, దూదిపులి, సూర్రావెడ్డు సాక్షిగా.. ఆ మహానుభావునికి నివాళులర్పిద్దాం." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! దీన్ని నివాళి అనరు. రావిశాస్త్రి పేరు చెప్పుకుని మందు కొట్టడం అంటారు. గ్లెన్‌ఫెడిచ్ వరకు ఓకే, కానీ సిగరెట్ మాత్రం నా వల్లకాదు. ఒక సిగరెట్ ఏడు రోజుల జీవితాన్ని తగ్గిస్తుంది."

"త్యాగయ్య, అన్నమయ్యలు జీవించిన కర్మభూమి మనది. ఏం? నీ దైవం కోసం ఓ మూణ్ణెల్లు ముందు చావలేవా? నువ్వసలు భక్తుడివేనా!? నేన్నీలా స్వార్ధపరుణ్ణి కాదు! ఎంత కష్టమైనా సరే! ఆ సిగెరెట్లన్నీ కాల్చిపడేస్తాను."

"ఈ నివాళి నాకు సమ్మతం కాదు. నీ ప్రపోజల్ నేనొప్పుకోను." స్థిరంగా అన్నాను.

సుబ్బు లేచాడు.

"నీ ఖర్మ! మంచి మాటలు నువ్వెప్పుడు ఆలకించావు గనక! ఇప్పటికే మాతృభాషా ప్రేమికుల సంఘం, గురజాడ భజన మండలి అంటూ పనికి మాలిన సంస్థలు చాలానే ఉన్నాయి. నువ్వు కూడా 'రావిశాస్త్రి అభిమాన సంఘం' అంటూ ఒకటి పెట్టుకో. ఆయన పుట్టిన్రోజు, పోయిన్రోజుల్ని పండగల్లా జరిపించు. ధర్మాసుపత్రిలో యాపిల్సు పంచు. రక్తదాన శిబిరం పెట్టు. నీలాంటి చౌకబారు అభిమాని రావిశాస్త్రికి ఉండటం ఆయన దురదృష్టం. ఏం చేస్తాం? పోయినవాళ్ళకి హక్కులుండవు గదా!" అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

విన్నపం -

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. పూజలు వ్యక్తిగతం. ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు. రావిశాస్త్రిని తలచుకుంటూ సరదాగా రాసేశాను. సో.. టేకిట్ ఈజీ! 

(pictures courtesy : Google)

Friday, 1 March 2013

టెర్రరిజం - కొవ్వొత్తిజం


"రమణ మామ! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"కూర్చో సుబ్బు! దేశంలో టెర్రరిస్టులు పెట్రేగిపోతున్నారు. దుష్టులు. దుర్మార్గులు. దున్నపొతులు. నా కడుపు మండిపోతుంది. ఇవ్వాళ సాయంకాలం సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన ఉంది. వెళ్దాం రాకూడదూ?" అడిగాను.

"టెర్రరిస్టు దాడుల్ని కొవ్వొత్తులతో నిరసించడం ఎప్పుడూ ఉండేదేలే! దీన్నే 'కొవ్వొత్తిజం' అందురు. నాకు 'వేలెంటైన్స్ డే' అంటే ఏంటో తెలీదు. అట్లాగే ఈ కొవ్వొత్తులకీ, నిరసనలకీ సంబంధం కూడా తెలీటల్లేదు. తెలీని విషయాల్ని తెలుసుకునే ఓపిక లేదు. కొవ్వొత్తి పట్టుకునేంత ఓపిక అస్సలు లేదు. మరోసారెప్పుడైనా 'కొవ్వొత్తిజం'కి వస్తాన్లే!" అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

"దుర్మార్గుడా! నీకోసం మళ్ళీమళ్ళీ దాడులు జరగాలని కోరుకుంటావా? నీకా అవకాశం లేదు. ఉప్పల్ క్రికెట్ మ్యాచ్ కి ఎంతటి భారీ భద్రత ఉందో పేపర్లో చదివావుగా?" అడిగాను.

"ఆ క్రికెట్ మ్యాచ్ లో ఏమీ జరగదు. ఆ విషయం ప్రభుత్వానికీ తెలుసు. ఇది సామాన్య ప్రజల ఆగ్రహం నుండి రక్షించుకోడానికి ప్రభుత్వం వేస్తున్న ఎత్తు. ఎంత బుర్ర తక్కువ దొంగెదవైనా ఓ ఇంట్లో దొంగతనం చేస్తే.. కొన్నాళ్ళదాకా ఈ వీధి మొహం చూడడు. అట్లాంటిది బాంబులు పెట్టేవాడు.. ఇంకెంత తెలివిగా ఉంటాడు?" అన్నాడు సుబ్బు.

"అంటే నిఘా వద్దంటావా?" చికాగ్గా అన్నాను.
"కావాలి. మనకి చాలా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ కావాలి. అయితే.. ప్రస్తుతం ఉన్న నిఘా ఒక స్పెషల్ డ్రైవ్ వంటిది. ఆ క్రికెట్ మ్యాచ్ రోజు ఉప్పల్ ఏరియా తప్పించి, హైదరాబాద్ లో మిగిలిన అన్ని ప్రాంతాలు చాలా వల్నరబుల్ గా ఉంటాయి. మనకిది అలవాటేగా!" అంటూ నవ్వాడు సుబ్బు.

ఇంతలో కాఫీ వచ్చింది. సిప్ చేస్తూ.. ఆలోచిస్తూ.. నిదానంగా చెప్పసాగాడు.

"స్కూల్ బస్ ప్రమాదం జరిగితే.. కొన్నాళ్ళపాటు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై తీవ్ర నిఘా. అలాగే ప్రైవేటు బస్సులపై ఇంకొంతకాలం. జోకేంటంటే.. లంచం తీసుకుని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన ఉద్యోగులే ఈ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తారు! అసలు డ్రైవ్ సరీగ్గా లేనప్పుడే స్పెషల్ డ్రైవ్ లు అవసరం. లోగుట్టు ఏమనగా.. మన రాజకీయ వ్యవస్థ తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు.. తాము భద్రతగా ఉన్నామనే భ్రమలో ప్రజల్ని ఉంచేందుకు.. తమ యత్రాంగంతో ఇట్లాంటి ఓవరేక్షన్లు చేయిస్తుంటుంది!"

"మన పోలీసు బలగాల సంఖ్యాబల ప్రదర్శన ఉగ్రవాదుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తాయి." నవ్వుతూ అన్నాను.

"అలాగా! నాకు తెలీదులే! అందుకనేనా? మనవాళ్ళు రైళ్ళ సంఖ్య పెంచమని గోల చేస్తుంది?" సుబ్బు కూడా నవ్వాడు.

"సుబ్బు! నీ వాదన నీదే కదా. దీనికి సమాధానం చెప్పు. అమెరికాలో 9/11 తరవాత మళ్ళీ ఉగ్రవాద దాడులు జరగలేదు. అదెలా సాధ్యం?" బాగా అరిగిపోయిన ప్రశ్నని సంధించాను.

"అందుకు అమెరికాని అభినందించి తీరాలి. అయితే మన దేశాన్ని అమెరికాతో ఎలా పోలుస్తావ్? ఆ మాటకొస్తే ఏ దేశాన్నీ అమెరికాతో పోల్చలేవు. అమెరికా చరిత్ర నిన్నమొన్నటిది. ఆ దేశమే ఒక ఆక్రమిత ప్రాంతం. బ్రతుకుతెరువు కోసం ఎందరో, ఎన్నో దేశాల నుండి వెళ్లి అక్కడ సెటిలయ్యారు. అందుకే వారికి ప్రతి పౌరుడిపై నిఘా పెట్టగల అవకాశం ఉంది. వనరులూ ఉన్నాయి." అన్నాడు సుబ్బు.

"ఆ మాత్రం మనం చెయ్యలేమా?" అడిగాను.

"చెయ్యలేకేం? భేషుగ్గా చెయ్యొచ్చు. అప్పుడు మన చిదంబరం బజెట్ లో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికి నిధులుండవు. ఉన్న సొమ్మంతా పోలీసు, రక్షణ శాఖలకి కేటాయించాలి. పోలీసు స్టేషన్లు ఫైవ్ స్టార్ హోటళ్ళలా ఉంటాయి. స్కూళ్ళు మూతబడతాయి. గవర్నమెంట్ హాస్పిటళ్ళు పాడుబడిపోతాయి. సాధారణ జ్వరాలు, దగ్గులకి కూడా చస్తుంటాం. దరిద్రంలో మగ్గిపోతుంటాం. ఒకరకంగా ఈ చావుల కన్నా ఆ నష్టమే అధికం. అప్పుడు ఉగ్రవాదుల లక్ష్యం పూర్తిగా నెరవేరినట్లే." అన్నాడు సుబ్బు.

"అదెలా?" ఆశ్చర్యంగా అడిగాను.

"ఉగ్రవాదం అసలు లక్ష్యం ఒక దేశ ఆర్ధిక మూలాలు దెబ్బ తీసి.. ఆ దేశ ఆర్ధిక ప్రగతిని నిరోధించడమే. ఒక అసమర్ధ రాజకీయ నాయకత్వం మాత్రమే ప్రజల సొమ్ముని దేశరక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం సింహభాగం ఖర్చు పెడుతుంది. అప్పుడు ప్రధాన మంత్రి కన్నా రక్షణ మంత్రి, హోం మంత్రి ముఖ్యులైపోతారు." అన్నాడు సుబ్బు.

"మరప్పుడు అమెరికాకి కూడా ఇదే సమస్య రావాలి గదా." కుతూహలంగా అడిగాను.

"న్యాయంగా అయితే రావాలి. అలా రాకుండా ఉండేందుకు అమెరికా తెలివిగా ఆయుధ వ్యాపారం చేస్తుంటుంది. ఆయుధాల్ని అమ్ముకోడానికి దేశాల మధ్య తగాదాలు, యుద్ధవాతావరణం సృష్టిస్తుంది. వనరుల సమీకరణ కోసం చమురు యుద్ధాలూ చేస్తుంది. అమెరికా కోటి విద్యలూ ఆయుధాల వ్యాపారం కొరకే!" అంటూ నవ్వాడు సుబ్బు.

"అమెరికా మోడెల్ కరెక్ట్ కాదని చెప్పడానికి.. "

"అమెరికా మోడెల్ నీకూ, నాకూ కరెక్ట్ కాదేమో గానీ.. అమెరికన్లకి మాత్రం కరెక్టే అని అనుకుంటున్నాను. అందుకేగా.. మనం రకరకాల కారణాలతో చస్తుంటే.. అమెరికా పౌరులు మాత్రం హాయిగా బీరు తాగుతూ.. నరాలు తెగేంత ఉత్కంఠతో.. బాస్కట్ బాల్ (NBA) ని ఫాలో అవుతుంటారు." అన్నాడు సుబ్బు.

"మరప్పుడు మనమేం చెయ్యాలి? ఒకపక్క డబ్బులు లేవంటావు. ఇంకోపక్క టెర్రరిస్టు దాడుల్ని ఆపాలంటావు." విసుగ్గా అన్నాను.

"ఉగ్రవాద దాడుల్ని నిరోధించేందుకు కావలసింది ప్రజల పట్ల, దేశం పట్లా కమిట్మెంట్ ఉండి.. గొప్ప విజన్ కలిగి ఉండే రాజకీయ నాయకత్వం. ఇందుకు ఏ బజెట్ కేటాయింపులు అవసరం లేదు. అందుకే ఇందుకు బాధ్యత వహించాల్సింది రాజకీయ నాయకత్వం. ఏ దేశంలోనైనా టెర్రరిస్టు దాడులు ముమ్మాటికీ ఆ దేశ రాజకీయ వ్యవస్థలోని వైఫల్యమే." అంటూ ఖాళీ కప్ టేబుల్ పై పెట్టాడు సుబ్బు.

"ఏమిటోయ్ నీ గోల? రాజకీయ నాయకుల్ని ఆడిపోసుకోడం ఒక ఫేషనైపోయింది." KFC లో చికెన్ రుచి చూసిన వాడిలా మొహం పెట్టి విసుక్కున్నాను.

"హోటల్ వాడు చల్లారిన ఇడ్లీలిస్తేనే పోట్లాడతాం. అట్లాంటి మనం ఓట్లేసి రాజకీయ పార్టీలకి అధికారం కట్టబెడుతున్నాం. వీళ్ళు కాశ్మీర్ సమస్య పరిష్కరించరు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లతో ఎలా వ్యవహరించాలో స్పష్టత లేదు. కనీసం శ్రీలంకతో ఎలా ఉండాలో కూడా అర్ధం కాదు. ఈ రాజకీయ వ్యవస్థ తన పని నిజాయితీతో చేస్తే.. అప్పుడు వైఫల్యం ఎదురైనా ప్రజల మద్దతు ఉంటుంది. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా?" అన్నాడు సుబ్బు.

ఆనందభవన్ పెసరట్టు మహత్యం! మా సుబ్బు అంతర్జాతీయ రాజకీయాలు అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు!

"సర్లే! సాయంకాలం కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం ఉంది. నే వెళ్తున్నా. భాధ్యత గల భారతీయుడిగా, ఒక దేశభక్తుడిగా నా నిరసన తెలియజేస్తా!" నొక్కి పలుకుతూ అన్నాను.

"అయితే మీ 'కొవ్వొత్తిజం' వాళ్ళకి నా తరఫున ఓ సలహా ఇవ్వు." నొసలు వెక్కిరిస్తున్నట్లు పెట్టాడు సుబ్బు.

"సలహానా!?" ఆశ్చర్యపోయాను.

"అవును. ఆ 'కొవ్వొత్తిజం' లో డాక్టర్లుంటారు.. రోగుల్ని మోసం చెయ్యొద్దని చెప్పు. ప్లీడర్లుంటారు.. సాక్ష్యాలు తారుమారు చెయ్యొద్దని చెప్పు. వ్యాపారస్తులుంటారు.. ట్యాక్సులు సక్రమంగా కట్టమని చెప్పు. ప్రభుత్వోద్యోగులుంటారు.. లంచాలు మెయ్యొద్దని చెప్పు. జర్నలిస్టులుంటారు.. నిజాయితీగా రిపోర్ట్ చెయ్యమని చెప్పు. సినిమా యాక్టర్లుంటారు.. వెకిలి పాత్రలు వెయ్యొద్దని చెప్పు. ఇవన్నీ టెర్రరిజం అంత ఎమోషనల్ ఇష్యూస్ కాదు. అయితే ఇవి మన దేశానికి ఉగ్రవాదం కన్నా ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి." అంటూ రిస్ట్ వాచ్ లో టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు సుబ్బు.

తలుపు తెరుచుకుని.. ఏదో గుర్తొచ్చినవాడిలా ఆగి.. వెనక్కి చూస్తూ నవ్వుతూ అన్నాడు.

"నాకో అనుమానం. బంగారం వ్యాపారస్తులు 'అక్షర తృతీయ' అంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే కొవ్వొత్తుల వ్యాపారస్తులు ఈ టెర్రరిస్టు వ్యతిరేక దేశభక్తులతో 'కొవ్వొత్తిజం' మొదలెట్టించి సొమ్ము చేసుకుంటున్నారా?" అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు మా సుబ్బు!

వర్షం వెలిసినట్లైంది!

(photos courtesy : Google)