Showing posts with label ఫ్రాయిడ్. Show all posts
Showing posts with label ఫ్రాయిడ్. Show all posts

Monday, 18 June 2012

సైకోఎనాలిసిస్ ఆఫ్ గుండమ్మ

'గుండమ్మకథ' సినిమా యాభయ్యేళ్ళ క్రితం విడుదలైంది. అయినా ఇప్పటికీ తెలుగువాళ్ళ హృదయాల్లో గుండమ్మ స్థానం పదిలం. ఒకప్పటి సామాజిక స్థితిగతులు అంచనా వెయ్యడానికి ఆనాడు వచ్చిన సాహిత్యం ఒక కొలమానం. ఇందుకు మంచి ఉదాహరణ గురజాడ 'కన్యాశుల్కం'. ఒక సినిమాకి సాహిత్యం స్థాయి లేకపోయినా, ఆనాటి సమాజాన్ని అర్ధం చేసుకోడానికి యెంతోకొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.    

ఒక సినిమా యెలా పుడుతుంది? రచయిత తన ఆలోచనలతో ఒక పాత్ర సృష్టిస్తాడు. ఆ పాత్రకి దర్శకుడు - టెక్నీషియన్లు, నటీనటుల సహకారంతో ప్రాణం పోస్తాడు. ఇక్కడ అందరూ కలిసి చేసేది ఒకటే వంటయినా, ఎవరి వాటా వారికి ఉంటుంది. ఏ పాత్రనైనా ఒక సాధారణ ప్రేక్షకుడు identify చేసుకోకపోతే.. ఎవరూ చెయ్యగలిదేమీ ఉండదు. ఇప్పుడు గుండమ్మ పాపులారిటీకి కారణాలు ఆలోచిద్దాం. 

ఈ సమాజం అనేక వ్యక్తుల, విభిన్న వ్యక్తిత్వాల సమాహారం. భిన్నఆలోచనల సంక్లిష్ట కలయిక. ప్రతి వ్యక్తి తన ప్రవర్తనని (అది ఎంత అసంబద్దమయినప్పటికీ) conscious mind తో సమర్ధించుకుంటాడు. కానీ అతని అసలు ఆలోచనల మూలాలు unconscious mind లో నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఈ unconscious mind ని బయటకి రానీకుండా అనేక defense mechanisms తొక్కిపెట్టి ఉంచుతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని 'సైకోఎనాలిసిస్'గా ప్రాచుర్యం కల్పించాడు.

మానవ మేధస్సు సంక్లిష్టంగా ఉంటుంది. మన ఆలోచనాధోరణి నలుపు తెలుపుల్లో (flat గా) ఉండదు. పరిస్థితులు, సందర్భాలు, వ్యక్తుల మధ్యగల సంబంధాలు.. ఇలాంటి అనేక variables ఒకవ్యక్తి యొక్క ఆలోచనలని నిర్ణయిస్తాయి. ఆ ఆలోచనే మన ప్రవర్తననీ శాసిస్తుంది. ఈ నేపధ్యంలో గుండమ్మని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి.

గుండమ్మకి కూతురంటే చాలా అభిమానం, ఒకరకంగా గుడ్డిప్రేమ. ఎందుకు? మధ్యతరగతి కుటుంబాల్లో భర్త చనిపోయిన తరవాత ఒక స్త్రీ పడే social and emotional trauma దారుణంగా ఉంటుంది. ఆ తరవాత వాళ్ళు చాలా insecurity కి కూడా గురవుతారు. తమని ప్రేమించే తోడులేక, మనసులోని భావాల్ని వ్యక్తీకరించుకునే అవకాశంలేక, మానసికంగా ఒంటరిగా మిగిలిపోతారు.

'ప్రేమ' అనేది ప్రతివ్యక్తికీ ఒక మానసిక అవసరం. దేన్నీ ప్రేమించనివారికి బ్రతకాలనే ఆశ చచ్చిపోతుంది. మానసికంగా ఏకాకిగా మిగిలిపోయినవారు.. తమ ప్రేమకి ఒక symbol గా ఒక వ్యక్తినో, జంతువునో, వస్తువునో ఎన్నుకుని తమ శక్తియుక్తులు ధారబోస్తూ అమితంగా ప్రేమిస్తారు. ఆ symbol పట్ల చాలా possessive గా కూడా ఉంటారు. ఆ సింబల్ని వదులుకోడానికి అస్సలు ఒప్పుకోరు. ఆ symbol చేజారితే depression లోకి వెళ్ళిపోతారు.

ఈ నేపధ్యంలో కూతురంటే గుండమ్మకి ఎందుకంత ప్రేమో అర్ధం చేసుకోవచ్చు. అందుకనే తనకి ఇల్లరికపుటల్లుడు కావాలనుకుంటుంది గుండమ్మ. కూతురు భర్తని ఇంట్లోనే ఉంచుకోటంలో జమున సుఖం కన్నా, గుండమ్మ అవసరమే ఎక్కువన్నది మనం గుర్తించాలి. 

గుండమ్మని గయ్యాళి అంటారు. అసలు ఈ 'గయ్యాళి' అన్న పదమే అభ్యంతరకరం. ఇది నోరున్న ఆడవారిని defame చెయ్యడానికి సృష్టించిన పదం అయ్యుండొచ్చు. గుండమ్మకి సంపద విలువ తెలుసు. సంపద ఎవరి దగ్గరుంటే వారిదే అధారిటీ అన్న కేపిటలిస్టు ఫిలాసఫీ కూడా తెలుసు! అందుకే తాళంచెవుల గుత్తి బొడ్లో దోపుకుని పెత్తనం చలాయిస్తుంటుంది. 

గుండమ్మ సవతి కూతురి పట్ల కఠినంగా ఎందుకు ప్రవర్తించింది? ఈ సమాజం తనకి చేసిన అన్యాయానికి ప్రతిగా సవతి కూతుర్ని రాచిరంపాన పెట్టడం ద్వారా కసి తీర్చుకుని sadistic pleasure పొందిందా? ఆనాటి సామాజిక పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటే ఇందుకు సమాధానం దొరుకుతుంది. 

ఆరోజుల్లో కుటుంబ నియంత్రణ లేదు. స్త్రీలు ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్ళు. చాలాసార్లు కాన్పు కష్టమై తల్లి చనిపోవడం (maternal deaths) జరుగుతుండేది, అందుకే పిల్లల్ని కనడం స్త్రీకి పునర్జన్మ అనేవారు. వితంతువైన భర్త (నాకు ఇంతకన్నా సరైన పదం తోచట్లేదు) మరణించిన భార్య కన్న పిల్లల్ని సాకడనికి (బయటకి ఇలా చెప్పేవాళ్ళు గానీ, కుర్రపిల్లతో సెక్సు దురదే అసలు కారణం అని నా అనుమానం) రెండోపెళ్ళి చేసుకునేవాడు. ముసలి వెధవలు చిన్నపిల్లల్ని రెండోభార్యగా చేసుకోవటం ఆరోజుల్లో నిరాటంకంగా సాగిన ఒక సామాజిక అన్యాయం.

రెండోపెళ్ళివాడిని చేసుకునే అమ్మాయిలకి వేరే చాయిస్ లేదు, గతిలేని పరిస్థితుల్లో compromise అయ్యి  ముసలాణ్ని చేసుకునేవాళ్ళు. ఈ అసంతృప్త అభాగినుల గూర్చి సాహిత్యంలో బోల్డన్ని ఆధారాలు ఉన్నయ్. (అయితే 'దేవదాసు'లో పార్వతి గంపెడు పిల్లల్ని 'చక్కగా' చూసుకుంటుంది. శరత్ కథల్లో మనలా నేలమీద నడిచే మనుషులకి తావులేదు. అందరూ ఆదర్శమూర్తులు, త్యాగధనులే).

తీవ్రమైన అసంతృప్తితో కాపురానికొచ్చిన యువతికి దిష్టిపిడతల్లాగా మొదటిభార్య సంతానం కనబడతారు, ఇంక తన కోపాన్ని పిల్లల మీదకి మళ్ళిస్తుంది. దీన్నే సైకాలజీ పరిభాషలో frustration - aggression - displacement  theory అంటారు. అంటే మనలోని నిస్పృహ, నిస్సహాయత క్రోధంగా మారుతుంది. ఆ aggression ని ఎదుటి మనిషిపై చూపే అవకాశం లేనప్పుడు.. అమాయకుల వైపు, అర్భకుల వైపు మళ్ళించబడుతుంది.

ఈ థియరీ ప్రకారం మనం గుండమ్మని అంచనా వేస్తే ఆమె సవతి కూతురు పట్ల యెందుకంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో అర్ధమవుతుంది. ఇక్కడ victim సవతి కూతురు. గుండమ్మని పుట్టింటివారు, భర్త కలిసి చేసిన అన్యాయానికి సవతి కూతురు బలయ్యింది. గుండమ్మని ఆపడానికి భర్త లేడు, సవతి కూతురు నిస్సహాయురాలు. ఇంతకన్నా soft target గుండమ్మకి ఎక్కడ దొరుకుతుంది? అందుకే తన aggression కి ventilation కోసం సవతి కూతురు అనే soft target ని ఎంచుకుంది.

aggression theory లో ventilation కోసం soft targets ఎంచుకోవటం అనేది మనం చూస్తూనే ఉంటాం. భార్య తాగుబోతు భర్తపై కోపంతో, ఏంచెయ్యాలో తోచక - పిల్లల్ని చావగొడుతుంది. 'అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు' అనే సామెత ఉండనే ఉందిగదా!

సరే! గుండమ్మ ముసలి మొగుడు ఇద్దరు పిల్లల్ని పుట్టించి వెళ్ళిపోయాడు. మరప్పుడు భర్తమీద కోపం తన కూతురు, కొడుకుల మీద కూడా వుండాలి గదా? కానీ అలా ఉండదు. ఎందుకని? గుండమ్మది narcissistic personality. తాను, తన పిల్లలు మాత్రమే మనుషులు. 'తనది' అన్నదేదైనా అత్యంత ప్రీతిపాత్రం. 

అసలు గుండమ్మ ఎందుకలా నోరు పారేసుకుంటుంది? ఇక్కడ మనం ఫ్రాయిడ్ చెప్పిన reaction formation అనే defense mechanism ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో 'మగదిక్కు' లేని సంసారం అంటే అందరికీ అలుసు. గుండమ్మ తన ఆస్తిపాస్తులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ అభద్రతా భావంలోంచి పుట్టుకొచ్చిన ప్రవర్తనే 'గయ్యాళితనం'. తన అశక్తతని, అమాయకత్వాన్ని బయటి ప్రపంచానికి తెలీకుండా ఉండటం కోసం.. పరిస్థితుల్ని తట్టుకుని నిలబడటానికి గుండమ్మ 'గయ్యాళితనం' అనే ఆభరణం ధరించింది! 

ఆ రోజుల్లో సమాజంలో గల సవతి లేక మారుతల్లి అనే stereotyping కూడా గుండమ్మ 'గయ్యాళి'తనానికి కారణం కావచ్చు. తెలిసోతెలీకో మనంకూడా ఒక్కోసారి ఈ సమాజంలో stereotypes గా మారతాం. మతం, కులం పట్ల కొందరి భావాలు ఒకే మూసలో ఉండటం ఈ stereotype కి ఒక ఉదాహరణ. గుండమ్మ కూడా చక్కగా ఈ stereotype లోకి దూరిపోయింది.

గుండమ్మలో మనకి projection కూడా కనిపిస్తుంది. 'సవతితల్లి రాచిరంపాన పెడుతుందంటారు గానీ.. నేను ఈ పిల్ల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నానో!' అని గంటన్నతో అంటుంది. అంటే తన కఠినత్వానికి కూడా కారణం సావిత్రేననేది గుండమ్మ థియరీ! ఈ రకంగా తనకున్న అవలక్షణాలని, వికృత ఆలోచనలని ఎదుటివారికి ఆపాదించి సంతృప్తి చెందడాన్ని projection అంటారు. 

సవతి కూతుర్ని ఆర్ధికంగా తక్కువ స్థాయిలో వున్న పనివాడికిచ్చి పెళ్ళి చేస్తూ కూడా.. తనేదో ఆ తల్లిలేని పిల్లని ఉద్దరిస్తున్నట్లు పోజు కొడుతుంది. వాస్తవానికి గుండమ్మ సవతి కూతురికి చేసింది అన్యాయం. తాము చేసే తప్పుడు పనుల్ని అసంబద్ధ వాదనలతో సమర్ధించుకోవడాన్ని ఫ్రాయిడ్ భాషలో rationalization అంటారు. మన రాజకీయ నాయకులు ఈ కోవకి చెందినవారే!

గొప్ప సంబంధం అనుకుని నాగేశ్వరరావుని అల్లుడుగా చేసుకుంటుంది. అతనొట్టి తాగుబోతని, తాను మోసపోయ్యానని తెలుసుకుని హతాశురాలవుతుంది. మోసపోయిన కూతురి బాధ చూసి తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు గుండమ్మ చాలా conflict కి గురవుతుంది. మామూలుగానయితే గుండమ్మ నాగేశ్వరరావుని ఉతికి ఆరేసేది, కానీ అతనంటే కూతురికి ఇష్టం.

ఇందాక చెప్పిన projection గుర్తుందికదూ? అల్లుడిని తిడితే కూతురు బాధ పడుతుంది. అది గుండమ్మకి ఇష్టం లేదు, కాబట్టి ఏమీ అనలేకపోతుంది. అల్లుడి పట్ల కఠినంగా ఉండాలా? కూతురు భర్త కాబట్టి, కూతురు బాధపడుతుంది కాబట్టి, సహించి ఊరుకోవాలా? ఈ ద్వైదీభావాన్ని ambivalence అంటారు. ఈ ambivalent state లో ఉండి, నాగేశ్వరరావుని మందలిస్తున్న రామారావుని ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. వాస్తవానికి గుండమ్మ కోపం రామారావుపై కాదు, నాగేశ్వరరావు మీద. మళ్ళీ displacement!

కూతురు దూరమై సగం చచ్చిన గుండమ్మని చాయాదేవి కొట్టి గదిలో బంధిస్తుంది. అప్పుడు గుండమ్మలో realization వస్తుంది. సావిత్రి పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు guilt complex తో బాధ పడుతుంది. సావిత్రిని చూడంగాన్లే ఎటువంటి భేషజాలకి పోకుండా క్షమించమని అడుగుతుంది. 'నీకు చేసిన అన్యాయానికి దేవుడు నాకు శిక్ష విధించాడు.' అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.

గుండమ్మ వంటి egocentric personality ని catharsis స్థాయికి తీసుకెళ్ళడానికి దర్శకుడు మంచి ఎత్తుగడలతో సన్నివేశాల్ని సృష్టించాడు. అందుకోసం చాయాదేవిని (నాకు ఈపాత్ర కూడా చాలా ఇష్టం) చక్కగా వాడుకున్నాడు. అందుకే గుండమ్మతో కూతుర్ని క్షమాపణ అడిగించిన మరుక్షణం ప్రేక్షకులంతా గుండమ్మ పక్షం వహిస్తారు. ఇది గుండమ్మ పాత్రపోషణలో నటిగా సూర్యకాంతం సాధించిన విజయం.

ఇంతకీ గుండమ్మ నెగటివ్ క్యారెక్టరా? పాజిటివ్ క్యారెక్టరా? ఏదీ కాదు. మన మధ్యన తిరుగుతూ, మనతో పాటు జీవించిన ఒక సజీవ క్యారెక్టర్. మనలో, మన సమాజంలో ఉన్న అవలక్షణాలన్నీ గుండమ్మకి కూడా ఉన్నాయి, అందుకే ఈపాత్ర అంతలా పాపులర్ అయింది.

ఈ సినిమా సమయానికి సూర్యకాంతం గయ్యాళి అత్తగా career peak లో ఉంది, కోడళ్ళని పీడించే అత్తగార్లూ వీధివీధికీ ఉండేవారు. అంచేతనే - మనం సూర్యకాంతంతో identify చేసుకోగలిగాం, అత్తగా సూర్యకాంతానికి ఒక stardom ఇచ్చేశాం.

అయితే మనకిప్పుడు గుండమ్మలు కనిపిస్తారా? కనిపించరు. కారణం - ఇప్పుడు  వైద్యం, వైద్య సదుపాయాలు మెరుగయ్యాయి. మధ్యతరగతి వాళ్లకి అందుబాటులోకొచ్చాయి. అందువల్ల స్త్రీలు కాన్పు సమయంలో చనిపోవడం లేదు. 

ఆ రోజుల్లో ఆడామగా మధ్య భారీవయసు తేడాతో పెళ్ళి జరిగేది, ఇప్పుడలా జరగట్లేదు. ఒకప్పుడు మగవారి సగటు జీవితం ఆడవారి సగటు జీవితం కన్నా తక్కువ. ఇప్పుడు జీవితకాలాన్ని పెంచేసుకుని మగవారు కూడా ఆడవారితో సమానత్వం సాధించారు! అందువల్ల కూడా క్రమేణా గుండమ్మలు కనుమరుగయ్యారు.

'కన్యాశుల్కం' మొదటిసారి చదివినప్పుడు కన్యాశుల్కం అంటే ఏమిటో అర్ధం కాదు. అట్లాగే - వేగంగా మారుతున్న మన సమాజ పరిణామంలో కొంతకాలానికి మన ఉమ్మడి కుటుంబాలకి ట్రేడ్మార్క్ అయిన గయ్యాళి అత్తలు కనుమరుగై.. అస్తిత్వాన్ని కోల్పోవచ్చు. ఇది సమాజానికి మంచిది కూడా!

Wednesday, 25 April 2012

చిత్తూరు నాగయ్య.. ద సైకోథెరపిస్ట్

"ఒకే విషయం ఎన్నిసార్లని చెప్పాలి? చెప్పేప్పుడు బుద్ధిగా తలూపుతారు, పని మాత్రం చెయ్యరు. అసలు మీ సమస్యేమిటి? వినపడదా? అర్ధం కాదా?" విసుగ్గా అన్నాను.

నా హాస్పిటల్లో స్టాఫ్ అవడానికి సీనియర్లే. కానీ వాళ్లకి ప్రతిరోజూ, ప్రతివిషయం కొత్తే! మా సుబ్బు సరదాగా అంటుంటాడు - 'యధా వైద్యుడు, తధా స్టాఫ్.' 

కానీ ఇవ్వాళ మరీ చిరాగ్గా ఉంది - 'వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్!' అని పదోసారి అనుకున్నాను.

ఇంతలో - గదిలో ఏదో అలికిడి. విసుగ్గా తలెత్తి చూశాను. ఎదురుగా ఒక ఆజాను బాహుడు, ధవళ వస్త్రాల్లో ధగధగ మెరిసిపోతున్నాడు. ఈయన్ని ఎక్కడో చూసినట్లుందే? ఎవరబ్బా! ఈయన.. ఈయన.. చిత్తూరు నాగయ్య! ఆయన ప్రశాంత వదనంతో, దరహాసంతో నన్నే చూస్తున్నాడు.

అంతే కాదు - 'నువ్విక మారవా?' అని నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నిస్తున్నట్లుగా కూడా అనిపించింది.

'అబ్బా! ఈయన్తో చచ్చేచావుగా ఉంది, ప్రశాంతంగా కోపాన్ని కూడా తెచ్చుకోనివ్వడు గదా! వేలకి వేలు జీతాలిస్తున్నాను. ఏం? నా స్టాఫ్ ని ఆమాత్రం మందలించేంత హక్కు నాకుండదా? సినిమా చూస్తున్నప్పుడు లక్షాతొంభై అనుకుంటాం. అంతమాత్రానికే ఈయన అప్పులాళ్ళా వచ్చెయ్యడమేనా?'

అంతలోనే నా చికాకు, కోపం, అసహనం అన్నీ ఒక్కసారిగా ఆవిరైపొయ్యాయి. సిగ్గుతో తల దించుకున్నాను.

నేనెందుకు ఇంత చెత్తగా ఆలోచిస్తున్నాను! దిసీజ్ నాట్ కరెక్ట్. చిత్తూరు నాగయ్యని నా థెరపిస్ట్‌గా ఎప్పాయింట్ చేసుకున్నది నేనే. ఈ థెరప్యూటిక్ ఎలయెన్స్‌తో నాగయ్యకి ప్రమేయం లేదు. నాకూ, చిత్తూరు నాగయ్యకి పేషంట్ డాక్టర్ రిలేషన్‌షిప్ కొన్నాళ్ళుగా నడుస్తుంది. ఒక విషయం చెప్పేప్పుడు ఎత్తుగడగా ముందు కొంత సంభాషణతో మొదలెట్టి, అటుతరవాత అసలు కథలోకి వచ్చే నా ఓ.హెన్రీ అనుకరణ మార్చుకోలేకున్నాను. ఇవ్వాళ కూడా నా అరిగిపోయిన స్టైల్లోనే రాస్తున్నాను, మీరు నన్ను మన్నించాలి.

చిత్తూరు నాగయ్య గొప్ప నటుడు, గొప్ప గాయకుడు అని నా నమ్మకం. అయన మరీ అంత గొప్పేం కాదు అని ఎవరైనా అంటే నాకస్సలు అభ్యంతరం లేదు. నా అభిప్రాయాలేవో నాకున్నాయి, అవి ఇతరుల్తో సరిపోలాలని నేనెప్పుడూ అనుకోను. అయితే నాగయ్య పట్ల నా అభిమానం స్వార్ధపూరితమైనది. వాడ్డూయూ మీన్ బై - 'స్వార్ధాభిమానం'!? 

వృత్తిరీత్యా నేను సైకియాట్రిస్టుని, ఫీజుచ్చుకుని కోపాన్ని పోగొట్టడానికి కౌన్సెలింగ్ చేస్తాను. కానీ నాకు కోపం ఎక్కువ! ఎదుటివారి కోపం ఎలా తగ్గించాలో తెలిసిన నాకు, నా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు. ఈ కన్ఫెషన్‌ని  నా మోడెస్టీగా భావించనక్కర్లేదు, శిక్ష పడదంటే హంతకుడు కూడా నేరాన్ని ఒప్పుకుంటాడు!

అది అర్ధరాత్రి, ఇంట్లోవాళ్ళు హాయిగా నిద్ర పోతున్నారు. నాకు మొదట్నుండీ సరీగ్గా నిద్ర పట్టదు. దూరదర్శన్‌లో నాగయ్య నటించిన 'యోగి వేమన' వేస్తున్నారు. సుఖమయ నిద్ర కోసం ఈ పురాతన సినిమాకి మించిన మంచి సాధనమేముంది అని ఆ సినిమా చూడ్డం మొదలెట్టాను. క్రమేపి సినిమాలో లీనమైపోయ్యాను.

వేమారెడ్డికి అన్నకూతురంటే ఎంతో ప్రేమ. ఆ పాప జబ్బుచేసి చనిపోతుంది. నిర్వేదనగా స్మశానంలో తిరుగుతున్నాడు. ఒక మనిషి పుర్రెని చేతిలోకి తీసుకుని 'ఇదేనా, ఇంతేనా' అంటూ పాడుతున్నాడు. వెచ్చగా బుగ్గల మీద యేదో స్పర్శ! అవి నా కన్నీళ్ళూ! అర్ధరాత్రి కాబట్టి నా కన్నీళ్ళని ఎవరూ గమనించే ప్రమాదం లేదు కాబట్టి నేనా కన్నీళ్ళని ఆపుకోవటానికి ప్రయత్నించలేదు. నా ప్రమేయం లేకుండానే కళ్ళల్లోంచి కన్నీళ్ళు ధారగా కారిపోతున్నయ్! ఈ అనుభూతి నాకు కొత్త, నాలో ఇన్ని కన్నీళ్ళున్నాయా! సినిమా చివరిదాకా గుడ్లప్పగించి అలా చూస్తూ కూర్చుండిపొయ్యాను. 

ఆశ్చర్యం! ఆ మరుసటి రోజు నాకు కోపం రావాల్సిన సందర్భంలో కూడా పెద్దగా కోపం రాలేదు. ఆ తరవాత నాగయ్య నటించిన సినిమాల్ని వరసగా చూశాను. నా కోపం క్రమేపి ఇంకాఇంకా తగ్గసాగింది. నాగయ్యది ప్రశాంత వదనం. మృదువుగా, మార్ధవంగా నటిస్తాడు. నాగయ్యని నిశితంగా గమనిస్తాను, పాటల్ని ఏకాగ్రతతో వింటాను. అప్పుడే నాకు కోపం వచ్చినప్పుడు నాగయ్యని గుర్తు చేసుకోవడం ఈజీగా ఉంటుంది.

ప్రతిరోజూ పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది, ఉదయాన్నే నడక కూడా మంచిది. నాగయ్య చిత్రాలు చూస్తూ ఉండటం కూడా ఇదే  కోవలోకి వస్తాయని నమ్ముతున్నాను. ఫైటింగ్ సినిమాలు చూసేవాడిలో నేరప్రవృత్తి ఉంటుందట. సెక్స్ సినిమాల ప్రేమికుడికి లోకమంతా బూతుమయంగా ఉంటుందట. అలాగే - నాగయ్య సినిమాలు చూసినవాడు ప్రశాంత చిత్తంతో సాత్వికుడుగా మారిపోతాడు.

'పాండురంగ మహత్యం'లో నాగయ్య ఎన్టీఆర్‌కి తండ్రి, భోగలాలసుడైన కొడుకు వృద్ధులైన తలిదండ్రులపై దొంగతనం మోపి అర్ధరాత్రివేళ ఇంట్లోంచి వెళ్ళ గొడతాడు. అప్పుడు నాగయ్యని చూస్తే నాకు దుఃఖం ఆగలేదు. కొడుకు పట్ల ప్రేమ, అవమాన భారం, నిర్వేదం, నిర్లిప్తత.. ఇన్నిభావాల్ని అలవోకగా ప్రదర్శిస్తాడు.

ఈ పాత్రని పృధ్వీరాజ్ కపూర్ వంటి నటుడు ఇంకా బాగా నటించవచ్చునేమో కానీ, నాగయ్యంత కన్విన్సింగ్‌గా వుండదు. ఎందుకు? నాగయ్యది నిజజీవితంలో కూడా పుండరీకుని తండ్రివంటి మనస్తత్వం, అందుకని! మానవ జీవితంలో అత్యంత విలువైనది డబ్బు. ఎవరెన్ని కబుర్లు చెప్పినా డబ్బు విలువని గుర్తించకుండా జీవించగలగడం ఎంతో కష్టం. ఇది అతికొద్దిమందికి మాత్రమే సాధ్యమైంది. అర్ధరాత్రి ఇంటిని కొడుక్కి తృణప్రాయంగా వదిలేసి అడవి బాట పట్టిన పాండురంగని తండ్రి లాగే, నాగయ్య కూడా సిరిసంపదల్ని వదిలేశాడు.

కోపానికి నాగయ్య సినిమాలు యాంటిడోట్‌గా పనిచేస్తాయి, అందుకే నా కోపాన్ని జయించటానికి తెలివిగా నాగయ్యని వాడుకుంటున్నాను. సైకోథెరపీ ప్రిన్సిపుల్స్ ప్రకారం నాగయ్య నా థెరపిస్ట్. సైకియాట్రిస్టులకి సొమ్ము తగలేసే కన్నా ఇది సుఖమైన మార్గం అని నా అభిప్రాయం!

Wednesday, 7 December 2011

స్వర్గంలో భానుమతి, సావిత్రి.. నేను కూడా!

అదొక విశాలమైన హాలు. పొడవాటి రంగురంగుల కర్టెన్లు. జమీందార్ల కొంపల్లో మాత్రమే కనిపించే సింహాసనం సోఫాలు, సోఫాలాంటి కుర్చీలు. అందమైన చీరల్లో మరింత అందమైన ఆడవాళ్ళు, తెల్లటి వస్త్రాల్లో మగవాళ్ళు. ఆ వాతావరణం సందడి సందడిగా, హడావుడి హడావుడిగా ఉంది.

హాలు మధ్యన పెద్ద పట్టుతివాచీ. దానిపై మందపాటి ముఖమల్ పరుపు. ఆ పరుపుపై కూర్చున్న ఒక స్త్రీ అచ్చు భానుమతి గొంతుతో గీతం ఆలపిస్తుంది. ఆమె చుట్టూతా కూర్చున్నవారు శ్రద్ధగా ఆమె గానాన్ని వింటూ తల పంకిస్తున్నారు.

'సావిరహే తవదీన.. '

ఏవిటిదంతా? నేనిక్కడికెలా వచ్చాను? అటుగా వెళ్తున్న ఒక తెల్లబట్టల పెద్దమనిషిని వాకబు చేశాను. ఆయన సమాధానం విని హతాశుడనయ్యాను. 

ఇది భూలోకం కాదు - స్వర్గంట! ఐదునిమిషాల క్రితమే నేను బాల్చీ తన్నేశాన్ట! యేమిటీ దారుణం? ఇది కల కాదు గదా? అసలేమైంది చెప్మా? కళ్ళు మూసుకుని ఓ క్షణం ఆలోచించాను.

ఆ! గుర్తొచ్చింది. ఇవ్వాళ అరికాలు దురద పెడుతుంటే ఓ కార్పోరేట్ ఆస్పత్రి డాక్టరు దగ్గరకెళ్ళాను. ఆ డాక్టరు నా అరికాలుని ఆరు నిమిషాలు పరీక్షించి, ఆరువేల రూపాయల టెస్టులు చేసి, ఆరువందల రూపాయల ఇంజెక్షను పొడిచాడు. ఆ ఇంజెక్షను వికటించిందా? వికటించే వుంటుంది, లేకపోతే ఇక్కడికెలా వొచ్చి పడతాను? అయ్యో! అంటే.. అంటే.. ఇప్పుడు నేను చచ్చిపోయానా!

బాధతో గుండె బరువెక్కింది. దుఃఖంతో కొంచెంసేపు విలపించాను. అయ్యో! చావడంలో కూడా నాదెంత దరిద్రపుగొట్టు చావు! ఏదో గుండెజబ్బులాంటి రోగంతో చస్తే గౌరవం గానీ, మరీ చీప్‌గా అరికాలు దురదకి చావటం ఎంత సిగ్గుచేటు! నా శవాన్ని చూడ్డనికొచ్చిన వారి ముందు నా పరువు పోయుంటుంది. సర్లే! ఎట్లాగూ చచ్చానుగా, ఇంక పరువుతో పనేముంది!

'కానీ - పుట్టి బుద్ధెరిగి ఎప్పుడూ పాపాలే చేశాను గానీ, పుణ్యం ఎప్పుడూ చెయ్యలేదే! యమభటులేమైనా పొరబాటున స్వర్గంలో పడేశారా?' అనే సందేహం కలిగింది. కొంతసేపటికి దుఃఖం తగ్గి, మనసు తేలికయ్యింది. ఇక్కడేదో బాగానే ఉన్నట్లుంది. పరిసరాలు పరికించి చూశాను. అక్కడి వాతావరణానికి నిదానంగా అలవాటు పడసాగాను. 

ఇంతకీ అంత మధురంగా పాడే ఆ గాయని ఎవరబ్బా!

'దగ్గరకెళ్ళి చూస్తే తెలుస్తుందిగా' అనుకుంటూ అలా వెళ్ళాను. ఆవిడ నిజంగానే భానుమతి! మనిషి మీగడ తరగలా ఎంతందంగా ఉంది! మహారాణిలా ఠీవీగా, విలాసంగా, హుందాగా.. మంద్రస్థాయిలో పాడుతుంది. ఆవిడ పాటలకి అందరూ మైమరచి, అరమోడ్పు కన్నులతో తల పంకిస్తూ ఆనంద పరవశులవుతున్నారు. భానుమతి ఒక పాట తరవాత మరో పాట పాడుతూనే ఉంది.

'ఒహొహొ! పావురమా'

'పిలచిన బిగువటరా'

'ఎందుకే నీకింత తొందర'

'మనసున మల్లెల మాలలూగెనే'

'ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన'

'ఓ బాటసారి"

'నేనే రాధనోయి'

అహాహా! ఏమి ఈ గాత్రమాధుర్యము! జన్మ ధన్యమైంది! పోన్లే - చస్తే చచ్చాగానీ, గారెల బుట్టలో పడ్డా! అన్నట్లు ఈ స్వర్గంలో గారెలు దొరుకుతాయా? అసలిక్కడ వంటిల్లు అంటూ వుందా? ఆకలేస్తే ఉగ్గిన్నెతో అమృతం తాగిస్తాఆ!

ఇంతలో ఒక బూరె బుగ్గల చిన్నది - అక్కడున్న ఆడవాళ్ళని పేరుపేరునా పలకరిస్తూ, కాఫీ, టీ ఏర్పాట్లు పర్వవేక్షిస్తుంది. అబ్బా! ఎవరీ అందాలరాశి? ఎంత సుందరముగా యున్నది! కొంచెం దగ్గరగా వెళ్లి చూద్దాం. ఆఁ.. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఆ అమ్మాయి.. ఆవిడ.. సా.. వి.. త్రి!

ఆనందంతో ఒళ్ళు పులకరించింది. నా శశిరేఖ, మేరా పార్వతి, మై మిస్సమ్మ.. వావ్! చచ్చిపోతే సావిత్రి కనిపిస్తుందంటే ఎప్పుడే చచ్చేవాణ్ణిగా! బొద్దుగా, ముద్దుగా, అమాయకంగా ఎంత బాగుంది! ఒరే అరికాలు డాక్టరు! థాంక్స్ రా బాబు థాంక్స్!

ఇంతలో పిడుగు పడ్డట్లు ఒక పెద్ద అరుపు.

"వొసే సావిత్రీ! నా కాఫీలో చక్కెర ఎక్కువెయ్యమని చెప్పానా లేదా? ఈ కాఫీ నీ మొహంలేగే వుంది, ఏడుపుగొట్టు మొహమా! తెలివితక్కువ దద్దమ్మ!"

పుఱ్ఱచేత్తో విసెనకర్రతో టపాటపా విసురుకుంటూ రుసరుసలాడింది సూర్యకాంతం. సావిత్రి భయంతో వణికిపోయింది.

"ఆ కాఫీ మీక్కాదు, అది కన్నాంబగారి కాఫీ." అంటూ కళ్ళనీళ్ళెట్టుకుంది.

నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఇంత కోపం నాకు భూలోకంలో కూడా ఎప్పుడూ రాలేదు. స్వర్గంలో మర్దర్ కేసుకి శిక్షలున్నాయా? ఈ సూర్యకాంతాన్ని మర్దర్ చెయ్యటానికి - ఏ రాజనాలకో, ఆర్.నాగేశ్వర్రావుకో సుపారీ ఇవ్వాలి. ఏరీ వాళ్ళు?

చప్పట్లతో హాలంతా మారుమోగింది. భానుమతి కచేరీ పూర్తయింది. శ్రోతలు భానుమతిని మెచ్చుకుని, నమస్కరిస్తూ ఒక్కొక్కళ్ళే హాలు బయటకెళ్ళారు. ఇప్పుడు హాల్లో కొద్దిమందిమి మాత్రమే మిగిలాం.

"నమస్కారం భానుమతమ్మగారు! నేను మీకున్న కోట్లాది అభిమానుల్లో ఒక రేణువుని. మీ 'మల్లీశ్వరి' లెక్కలేనన్నిసార్లు చూశాను. ఆ సినిమాలో మీరు హీరో, మీ పక్కన ఎన్టీరామారావు హీరోయినని మా స్నేహితులు అంటారు." వినయంగా అన్నాను.

భానుమతి నన్ను ఆపాదమస్తకం పరికించింది. ఆనక గంభీరంగా తల పంకించింది. ఆవిడకి నేను తన అభిమానిగా పరిచయం చేసుకోటం చాలా సంతోషాన్నిచ్చినట్లుంది. మనసులోని ఆనందాన్ని బయటకి కనబడనీయకుండా గుంభనంగా నవ్వుకుంది.

"మల్లీశ్వరి సినిమాకి హీరోని, హీరోయిన్ని కూడా నేనే! ఆ రామారావు కేవలం సహాయనటుడు." గర్వంగా తలెగరేస్తూ అన్నది భానుమతి.

అవునన్నట్లు తలూపుతూ అర్జంటుగా వొప్పేసుకున్నాను.

"అమ్మా! మీ అత్తగారి కథలు లేకపోతే చక్రపాణి, కుటుంబరావులు దీపావళి యువ సంచికలు అమ్ముకునేవాళ్ళా? మీ కథలు పంచదార గుళికలు." మరింత ఒంగిపోతూ అన్నాను. 

భానుమతి బహుత్ ఖుష్ హువా! ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ -

"ఒరే బడుద్దాయ్! మాటలు బాగానే నేర్చావు. నాకు పొగడ్తలంటే నచ్చవు. కానీ నువ్వన్నీ నిజాలే చెబుతున్నావనుకో!" అన్నది భానుమతి.

ఇంతలో సావిత్రి భానుమతికి తళతళలాడుతున్న గాజు గ్లాసులో బత్తాయి రసం ఇచ్చింది. నేను గుడ్లప్పగించి సావిత్రికేసి చూస్తుండిపోయాను. భానుమతి ఒక క్షణం నన్ను గమనించింది.

"సావిత్రీ! రా చెల్లీ! ఇలా నాకు దగ్గరగా వొచ్చి కూర్చో. వీడు ఇప్పటిదాకా నన్ను పొగిడాడు. నువ్వు రాంగాన్లే నిన్ను చూస్తూ నీలుక్కుపొయ్యాడు. మళ్ళీ చచ్చాడేమో వెధవ! వీడికి నువ్వంటే చచ్చేంత ఇష్టంట. అందుకే నీకోసం ఒక ప్రేమలేఖ రాశాడు."

"నిజమా! నాకు తెలీదక్కా!" ఆశ్చర్యంగా అంది సావిత్రి.

"ఓసి మొద్దుమొహమా! నీకు ఏం తెలిసి చచ్చింది గనక! ఆ దేవుడు నీకు గొప్ప నటనా ప్రతిభనిచ్చాడు గానీ, మట్టిబుఱ్ఱనిచ్చాడే బంగారం." అంటూ ముద్దుముద్దుగా సావిత్రిని విసుక్కుంది భానుమతి.

చటుక్కున తల ఎత్తి, నావైపు సూటిగా చూస్తూ "ఏమిరా! నా గూర్చి ఎప్పుడు రాస్తున్నావ్?" అంటూ హూంకరించింది భానుమతి.

"చి.. చి.. చిత్తం. త్వరలోనే.. తప్పకుండా.. ర.. రాస్తాను." వణికిపొయ్యాను.

భానుమతి కిలకిల నవ్వింది.

"నీ మొహం, నువ్వు రాయలేవులే. మీ మగవాళ్ళకి నా నటన ఇష్టం. నా పాటంటే చెవి కోసుకుంటారు. నా రచననల్ని అమితంగా ఇష్టపడతారు. కానీ నన్ను ప్రేమించే దమ్ములేని పిరికిసన్నాసులు. మీకు సావిత్రిలా అమాయకంగా, సబ్మిసివ్‌గా ఉండే వెర్రిమొహాలంటేనే ఇష్టం. సావిత్రిలో కనిపించే వల్నరబిలిటీ మీ మగాళ్ళకి ఇష్టం. నేను వీరనారీమణిని. నా దగ్గర మీరు సావిత్రి దగ్గర వేసే వేషాలేస్తే గుడ్లు పీకేస్తాను, పీక పిసికి చంపేస్తాను. అందుకే మీకు నాపాట మాత్రమే కావాలి. నాకు ప్రేమలేఖ రాయాలంటే వెన్నులో వణుకు."

భానుమతి చెబుతుంటే సావిత్రి కుందనపు బొమ్మలా, చెక్కిలిపై అరచెయ్యి ఆనించి, శ్రద్ధగా వింటూ తన చక్రాల్లాంటి కళ్ళతో 'నిజమా!' అన్నట్లు సంభ్రమంగా చూస్తూంది.

ఇంతలో మళ్ళీ ఇంకో పెద్ద పిడుగు!

"వొసే సావిత్రీ! కాఫీ నా మొహాన పడేసి ఏమిటే నీ మంతనాలు? పెత్తనాలు పక్కన పెట్టి నాకు నిద్రొచ్చే దాకా కాళ్ళొత్తు, నిద్రమొహం దానా! చూశావా ఛాయాదేవొదినా! నన్ను ఇక్కడ కూడా చెడ్డదాన్ని చెయ్యాలని కాకపోతే ఒక్కపనీ సరీగ్గా చేసేడవదు." పక్కనున్న చాయాదేవితో నిష్టూరంగా అంది సూర్యకాంతం. చాయదేవి మూతి వంకర్లు తిప్పుతూ ఆ పక్కకి వెళ్ళిపోయింది.

సూర్యకాంతం గావుకేకలతో స్వర్గం దద్దరిల్లింది. సావిత్రి ఉలికిపాటుతో ఎగిరిపడి సూర్యకాంతం దగ్గర పరిగెత్తుకెళ్ళింది.

భానుమతి నవ్వుతూ అంది. "ఇక్కడికి రాకముందు నాకూ అర్ధమయ్యేది కాదు - ఎందుకీ మగవాళ్ళు సావిత్రంటే పడి చస్తారు? నన్ను చూసి భయంతో వణికిపోతారు? మొన్నామధ్య ఒక గడ్డపాయన.. అదేనోయ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త.. దీంట్లోని మతలబు విడమర్చి చెప్పాడు."

"ఫ్రాయిడ్ మీతో మాట్లాడాడా!" ఆశ్చర్యపొయ్యాను.

"ఏంటోయ్ వెర్రి పీనుగా! అంత ఎక్స్‌ప్రెషనిచ్చావ్! నా పాటలు వినటానికి ఫ్రాయిడేం ఖర్మ! ఎరిక్ ఎరిక్సన్, ఎడ్లెర్, ఎరిక్ ఫ్రామ్, సార్త్ర్ కూడా ఎగబడతారు. ఫ్రాయిడుకి నా 'దులపర బుల్లోడా' పాట ఎంత ఇష్టమో తెలుసా? నిన్న సూర్యకాంతం పెట్టిన దొసావకాయ తిని, ఆవఘాటుకి ఉక్కిరిబిక్కిరై చచ్చాడు." అంటూ పెద్దగా నవ్వింది.

ఇంతలో హడావుడిగా లూజు చొక్కా ఇన్ షర్ట్ చేసుకుని కుర్రాళ్ళా కనిపిస్తున్న పెద్దాయన లోపలకొచ్చాడు. అతను.. ఆయన దేవానంద్! తల పైకికిందకీ ఊపుతూ, పల్చటి పెదాల్లోంచి నవ్వీ నవ్వనట్లుగా నవ్వుతూ అడిగాడు.

"నమస్కార్ భానుమతి బెహన్! ఆప్ జర మేరా సురయా కా ఎడ్రెస్ బతాయియే!"

భానుమతి దేవానంద్‌తో హిందీభాషలో ఏదో మాట్లాడుతుంది. చడీచప్పుడు చెయ్యకుండా చల్లగా అక్కణ్ణుంచి జారుకున్నాను. 

Thursday, 24 November 2011

ఫ్రాయిడ్ కష్టాలు

"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

ఎదురుగా వున్న టేబుల్‌పై పుస్తకాల్ని ఆసక్తిగా చూడ్డం మొదలెట్టాడు. ఆవి సిగ్మండ్ ఫ్రాయిడ్, బెర్ట్రండ్ రస్సెల్ పుస్తకాలు.

"ఏంటీ! ఈ రోజుల్లో కూడా ఇవి చదివేవాళ్ళున్నారా!" ఆశ్చర్యపోయాడు సుబ్బు.

"నేనున్నాను, నీకేమన్నా ఇబ్బందా?" అన్నాను.

"నాకేం ఇబ్బంది! కాకపోతే ప్రపంచం మారిపోతుంది. తెలుగునేలంతా జగన్, చంద్రబాబు అని కలవరిస్తుంది. నువ్వేమో జనజీవన స్రవంతికి దూరంగా ఏవో పురాతన పుస్తకాల్లో కొట్టుకుంటున్నావు." జాలిగా చూస్తూ అన్నాడు సుబ్బు.

"అంటే మనకి ఫ్రాయిడ్, రస్సెల్ ఇర్రిలెవెంట్ అంటావా?" అన్నాను.

"అవును. మన వూరు గుంటూరు, ఇక్కడ వుంటేగింటే చంద్రబాబు నాయుడుకి పనుంటుంది గానీ ఫ్రాయిడ్ కేమి పని! అసలీ ఫిలాసఫర్స్ గుంటూర్లో పుట్టుంటే వీళ్ళకథ వేరుగా ఉండేది. అదృష్టవంతులు కాబట్టి ఇంకేదో దేశంలో పుట్టి బతికిపొయ్యారు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! డోంటాక్ రబ్బిష్." విసుక్కున్నాను.

సుబ్బు మాట్లాడలేదు.

ఇంతలో కాఫీ వచ్చింది.

కాఫీ సిప్ చేస్తూ చెప్పడం మొదలెట్టాడు సుబ్బు.

"కొద్దిసేపు ఫ్రాయిడ్, రస్సెల్ గుంటూర్లో పుడితే ఏమయ్యేదో ఆలోచిద్దాం. ఇద్దర్నీ ఇంగ్లీషు మీడియం స్కూల్ అనే యేదోక దుకాణంలో చేర్పించేవాళ్ళు, పాఠాలు బట్టీ పట్టరు కాబట్టి మార్కులు తక్కువొచ్చేవి. ఇంక స్కూల్లో టీచర్లు, ఇంట్లో తలిదండ్రులు హింసించడం మొదలెట్టేవాళ్ళు."

"అంతేనంటావా?" సాలోచనగా అడిగాను.

"అంతే! టెన్త్ పాసయ్యాక ఇంటర్ చదువుకి ఇద్దరు మేదావుల్నీ కార్పొరేట్ కాలేజీలో పడేసేవాళ్ళు. అక్కడ ప్రతివారాంతం, ప్రతిదినాంతం, ప్రతి గంటాంతం, ప్రతి నిముషాంతం పెట్టే టెస్టులు రాయలేక చచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్లకి రెండే ఆప్షన్లు ఉండేవి." అంటూ ఆగాడు సుబ్బు.

"ఏంటవి?" ఆసక్తిగా అడిగాను.

"ఒకటి మనవాళ్ళ ఇంటర్ రుద్దుడుకి తట్టుకుని నిలబడి, ఇంజనీరింగ్‌లో కుక్కలా చదివి, అమెరికాలో ఉద్యోగం సంపాదించి, డాలర్లు సంపాదించి హైదరాబాద్ చుట్టుపక్కల పొలాలు, స్థలాలు కొనడం. ఆస్తుల్నిప్పుడు మనూళ్లోనే కొంటున్నార్లే - తెలంగాణా దెబ్బకి." అంటూ నవ్వాడు సుబ్బు.

"రెండో ఆప్షన్?"

"ఏముంది. ఒత్తిడికి తట్టుకోలేక ఇద్దరూ రోడ్లెమ్మడ తిరుగుతుండేవాళ్ళు. అప్పుడు మీ సైకియాట్రిస్టులు, విజయానికి వెయ్యిమెట్ల వ్యక్తిత్వ వికాసంగాళ్ళు పండగ చేసుకుంటారు." అంటూ కాఫీ తాగడం ముగించాడు సుబ్బు.

"సుబ్బూ! మనం పనికిరాని బడుద్దాయిల్ని తయారు చేస్తున్నామని నీ అభిప్రాయమా?" విసుక్కున్నాను.

"నేనా మాటన్లేదు. మనం విద్యార్ధుల్ని రొబోల్లాగా ఒకే షేప్‌లో వుండేట్లు ఒక సిస్టం తయారు చేసుకున్నాం. ఈ సిస్టం ఉద్యోగానికి తప్ప తెలివైనవాణ్ని ప్రోత్సాహించి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే మోడల్ కాదు. ఎందుకంటే మన విద్యకి పరమార్ధం ఉద్యోగం. ఆ ఉద్యోగం అమెరికాలో అయితే మరీ మంచిది. అందుకే అమెరికాలో డిమాండ్ ఉన్న కోర్సులకే ఇక్కడా డిమాండ్. చైనావాడు అమెరికాకి చౌకరకం బొమ్మల్ని అమ్ముతాడు, మనం చౌకగా మేన్ పవర్ని ఎగుమతి చేస్తున్నాం." అన్నాడు సుబ్బు.

"ఒప్పుకుంటున్నాను, నేనిలా ఆలోచించలేదు." అన్నాను.

"ఆలోచించి మాత్రం నువ్వు చేసేదేముంది? మళ్ళీ ఇంకో ఇంగ్లీషు పుస్తకం చదువుకుని బుర్ర పాడుచేసుకోటం తప్ప. మేధావులకి తమచుట్టూ జరుగుతున్న పరిణామాల పట్ల ఆసక్తి ఉండదు. ఎప్పుడో ఎక్కడో ఎవరో రాసిన అంశాలని అధ్యయనం చేస్తారు, తీవ్రంగా మధనపడతారు. వాళ్ళు కన్ఫ్యూజయ్యి, అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తారు. ఆరకంగా నువ్వు నిఖార్సైన మేధావివి." అంటూ పెద్దగా నవ్వాడు సుబ్బు.

నేనూ నవ్వాను.

టైమ్ చూసుకుని లేచాడు సుబ్బు. "నీకో విషయం చెబ్తాను. చంద్రబాబు ట్రై చేస్తే ఫ్రాయిడ్ అర్ధమవుతాడు. కానీ ఫ్రాయిడ్‌కి మాత్రం చచ్చినా చంద్రబాబు అర్ధం కాడు!"

"మరిప్పుడు ఏం చెయ్యాలి?" దిగులుగా అడిగాను.

"మనం చెయ్యడానికేముంది. అసలు ఏదన్నా చెయ్యాలని ముఖ్యమంత్రే అనుకోటల్లేదు. అందుకని నువ్వు హాయిగా పేషంట్లని చూసుకో. వస్తా, ఇప్పటికే లేటయింది." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

టేబుల్ మీద నుండి ఫ్రాయిడ్, రస్సెల్ నన్ను చూస్తూ వెక్కిరింతగా నవ్వుతున్నట్లనిపించింది!    

Wednesday, 20 July 2011

బిరుదులు - బరువులు


టీవీలో ఏదో సినిమా వేడుక చూపిస్తున్నారు. వేదికపై కళాతపస్వి, దర్శకేంద్రుడు, దర్శకరత్న, యువసామ్రాట్, మెగాస్టార్ మొదలైన పెద్దలు ఆశీనులైవున్నారు. ఈ బిరుదులు, విశేషణాలు ఎవరన్నా ఇచ్చారో, వాళ్ళే తగిలించుకున్నారో నాకు తెలీదు. 

'విశ్వవిఖ్యాత నటసార్వభౌమ' అని ఎన్టీరామారావుకి ఒక బరువైన బిరుదుంది. అయితే ఆంధ్రరాష్ట్రం దాటితే నటుడు ఎన్టీఆర్ అంటే ఎవరికీ తెలీదని నా నమ్మకం. 'నవరసనటనా సార్వభౌమ' అంటూ సత్యనారాయణకి కూడా ఒక మెలికల బిరుదుంది. నవరసాల సంగతెందుగ్గాని సత్యనారాయణ ప్రేమరసం అభినయిస్తే జనాలు పారిపోతారని నమ్ముతున్నాను.

మన తెలుగువాడికి పేరుకి ముందు ఏదో ఒక విశేషణ తగిలించుకుంటేగానీ తుత్తిగా ఉండదేమో! భౌతికశాస్త్ర భయంకర Newton, మనోకల్లోల Freud, చిత్తచాంచల్య Adler, కథకచక్రవర్తి Maupassant, శాంతివిభూషణ J.F. Kennedy, జగదోద్ధారక Karl Marx, నటనాడింఢిమ Marlon Brando, హాస్యవిశారద Charlie Chaplin - ఇట్లా పేర్లముందు నానాచెత్త చేర్చి పైశాచికానందాన్ని పొందుతాం. వాళ్ళు తెలుగువాళ్ళు కాదు కాబట్టి పెనుప్రమాదం తప్పించుకున్నారు!  

బిరుదుల విషయంలో ప్రభుత్వాలూ భలే ఉత్సాహంగా వుంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ్ వగైరా అవార్డుల పేర్లతో తెగ హడావుడి చేస్తాయి. సూర్యకాంతానికి ముందు పద్మశ్రీ అని చేర్చి - పద్మశ్రీ సూర్యకాంతం అని చదువుకోండి. అబ్బ, ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో! మరప్పుడు ఈ బిరుదులకి కల ప్రయోజనమేమి!? 

ప్రతిభకి అసలైన బిరుదు సామాన్యప్రజలే ఇచ్చేస్తారని నా అభిప్రాయం. 'ఎన్టీవోడు ఇరగదీసాడ్రా, నాగ్గాడు అదరగొట్టాడు, కైకాలోడికి తిక్క కుదిరింది. దరిద్రప్ముండ సూర్యకాంతం - పాపం! సావిత్రిని రాచిరంపాన పెడ్తుంది.' మెచ్చుకునేప్పుడు కూడా ముద్దుగా తిట్టుకుంటూ మెచ్చుకునే అలవాటు మనది. అసలైన బిరుదులు ఇవేనని నా అభిప్రాయం.

(picture courtesy : Google)