Wednesday 7 December 2011

స్వర్గంలో భానుమతి, సావిత్రి.. నేను కూడా!

అదొక విశాలమైన హాలు. పొడవాటి రంగురంగుల కర్టెన్లు. జమీందార్ల కొంపల్లో మాత్రమే కనిపించే సింహాసనం సోఫాలు, సోఫాలాంటి కుర్చీలు. అందమైన చీరల్లో మరింత అందమైన ఆడవాళ్ళు, తెల్లటి వస్త్రాల్లో మగవాళ్ళు. ఆ వాతావరణం సందడి సందడిగా, హడావుడి హడావుడిగా ఉంది.

హాలు మధ్యన పెద్ద పట్టుతివాచీ. దానిపై మందపాటి ముఖమల్ పరుపు. ఆ పరుపుపై కూర్చున్న ఒక స్త్రీ అచ్చు భానుమతి గొంతుతో గీతం ఆలపిస్తుంది. ఆమె చుట్టూతా కూర్చున్నవారు శ్రద్ధగా ఆమె గానాన్ని వింటూ తల పంకిస్తున్నారు.

'సావిరహే తవదీన.. '

ఏవిటిదంతా? నేనిక్కడికెలా వచ్చాను? అటుగా వెళ్తున్న ఒక తెల్లబట్టల పెద్దమనిషిని వాకబు చేశాను. ఆయన సమాధానం విని హతాశుడనయ్యాను. 

ఇది భూలోకం కాదు - స్వర్గంట! ఐదునిమిషాల క్రితమే నేను బాల్చీ తన్నేశాన్ట! యేమిటీ దారుణం? ఇది కల కాదు గదా? అసలేమైంది చెప్మా? కళ్ళు మూసుకుని ఓ క్షణం ఆలోచించాను.

ఆ! గుర్తొచ్చింది. ఇవ్వాళ అరికాలు దురద పెడుతుంటే ఓ కార్పోరేట్ ఆస్పత్రి డాక్టరు దగ్గరకెళ్ళాను. ఆ డాక్టరు నా అరికాలుని ఆరు నిమిషాలు పరీక్షించి, ఆరువేల రూపాయల టెస్టులు చేసి, ఆరువందల రూపాయల ఇంజెక్షను పొడిచాడు. ఆ ఇంజెక్షను వికటించిందా? వికటించే వుంటుంది, లేకపోతే ఇక్కడికెలా వొచ్చి పడతాను? అయ్యో! అంటే.. అంటే.. ఇప్పుడు నేను చచ్చిపోయానా!

బాధతో గుండె బరువెక్కింది. దుఃఖంతో కొంచెంసేపు విలపించాను. అయ్యో! చావడంలో కూడా నాదెంత దరిద్రపుగొట్టు చావు! ఏదో గుండెజబ్బులాంటి రోగంతో చస్తే గౌరవం గానీ, మరీ చీప్‌గా అరికాలు దురదకి చావటం ఎంత సిగ్గుచేటు! నా శవాన్ని చూడ్డనికొచ్చిన వారి ముందు నా పరువు పోయుంటుంది. సర్లే! ఎట్లాగూ చచ్చానుగా, ఇంక పరువుతో పనేముంది!

'కానీ - పుట్టి బుద్ధెరిగి ఎప్పుడూ పాపాలే చేశాను గానీ, పుణ్యం ఎప్పుడూ చెయ్యలేదే! యమభటులేమైనా పొరబాటున స్వర్గంలో పడేశారా?' అనే సందేహం కలిగింది. కొంతసేపటికి దుఃఖం తగ్గి, మనసు తేలికయ్యింది. ఇక్కడేదో బాగానే ఉన్నట్లుంది. పరిసరాలు పరికించి చూశాను. అక్కడి వాతావరణానికి నిదానంగా అలవాటు పడసాగాను. 

ఇంతకీ అంత మధురంగా పాడే ఆ గాయని ఎవరబ్బా!

'దగ్గరకెళ్ళి చూస్తే తెలుస్తుందిగా' అనుకుంటూ అలా వెళ్ళాను. ఆవిడ నిజంగానే భానుమతి! మనిషి మీగడ తరగలా ఎంతందంగా ఉంది! మహారాణిలా ఠీవీగా, విలాసంగా, హుందాగా.. మంద్రస్థాయిలో పాడుతుంది. ఆవిడ పాటలకి అందరూ మైమరచి, అరమోడ్పు కన్నులతో తల పంకిస్తూ ఆనంద పరవశులవుతున్నారు. భానుమతి ఒక పాట తరవాత మరో పాట పాడుతూనే ఉంది.

'ఒహొహొ! పావురమా'

'పిలచిన బిగువటరా'

'ఎందుకే నీకింత తొందర'

'మనసున మల్లెల మాలలూగెనే'

'ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన'

'ఓ బాటసారి"

'నేనే రాధనోయి'

అహాహా! ఏమి ఈ గాత్రమాధుర్యము! జన్మ ధన్యమైంది! పోన్లే - చస్తే చచ్చాగానీ, గారెల బుట్టలో పడ్డా! అన్నట్లు ఈ స్వర్గంలో గారెలు దొరుకుతాయా? అసలిక్కడ వంటిల్లు అంటూ వుందా? ఆకలేస్తే ఉగ్గిన్నెతో అమృతం తాగిస్తాఆ!

ఇంతలో ఒక బూరె బుగ్గల చిన్నది - అక్కడున్న ఆడవాళ్ళని పేరుపేరునా పలకరిస్తూ, కాఫీ, టీ ఏర్పాట్లు పర్వవేక్షిస్తుంది. అబ్బా! ఎవరీ అందాలరాశి? ఎంత సుందరముగా యున్నది! కొంచెం దగ్గరగా వెళ్లి చూద్దాం. ఆఁ.. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఆ అమ్మాయి.. ఆవిడ.. సా.. వి.. త్రి!

ఆనందంతో ఒళ్ళు పులకరించింది. నా శశిరేఖ, మేరా పార్వతి, మై మిస్సమ్మ.. వావ్! చచ్చిపోతే సావిత్రి కనిపిస్తుందంటే ఎప్పుడే చచ్చేవాణ్ణిగా! బొద్దుగా, ముద్దుగా, అమాయకంగా ఎంత బాగుంది! ఒరే అరికాలు డాక్టరు! థాంక్స్ రా బాబు థాంక్స్!

ఇంతలో పిడుగు పడ్డట్లు ఒక పెద్ద అరుపు.

"వొసే సావిత్రీ! నా కాఫీలో చక్కెర ఎక్కువెయ్యమని చెప్పానా లేదా? ఈ కాఫీ నీ మొహంలేగే వుంది, ఏడుపుగొట్టు మొహమా! తెలివితక్కువ దద్దమ్మ!"

పుఱ్ఱచేత్తో విసెనకర్రతో టపాటపా విసురుకుంటూ రుసరుసలాడింది సూర్యకాంతం. సావిత్రి భయంతో వణికిపోయింది.

"ఆ కాఫీ మీక్కాదు, అది కన్నాంబగారి కాఫీ." అంటూ కళ్ళనీళ్ళెట్టుకుంది.

నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఇంత కోపం నాకు భూలోకంలో కూడా ఎప్పుడూ రాలేదు. స్వర్గంలో మర్దర్ కేసుకి శిక్షలున్నాయా? ఈ సూర్యకాంతాన్ని మర్దర్ చెయ్యటానికి - ఏ రాజనాలకో, ఆర్.నాగేశ్వర్రావుకో సుపారీ ఇవ్వాలి. ఏరీ వాళ్ళు?

చప్పట్లతో హాలంతా మారుమోగింది. భానుమతి కచేరీ పూర్తయింది. శ్రోతలు భానుమతిని మెచ్చుకుని, నమస్కరిస్తూ ఒక్కొక్కళ్ళే హాలు బయటకెళ్ళారు. ఇప్పుడు హాల్లో కొద్దిమందిమి మాత్రమే మిగిలాం.

"నమస్కారం భానుమతమ్మగారు! నేను మీకున్న కోట్లాది అభిమానుల్లో ఒక రేణువుని. మీ 'మల్లీశ్వరి' లెక్కలేనన్నిసార్లు చూశాను. ఆ సినిమాలో మీరు హీరో, మీ పక్కన ఎన్టీరామారావు హీరోయినని మా స్నేహితులు అంటారు." వినయంగా అన్నాను.

భానుమతి నన్ను ఆపాదమస్తకం పరికించింది. ఆనక గంభీరంగా తల పంకించింది. ఆవిడకి నేను తన అభిమానిగా పరిచయం చేసుకోటం చాలా సంతోషాన్నిచ్చినట్లుంది. మనసులోని ఆనందాన్ని బయటకి కనబడనీయకుండా గుంభనంగా నవ్వుకుంది.

"మల్లీశ్వరి సినిమాకి హీరోని, హీరోయిన్ని కూడా నేనే! ఆ రామారావు కేవలం సహాయనటుడు." గర్వంగా తలెగరేస్తూ అన్నది భానుమతి.

అవునన్నట్లు తలూపుతూ అర్జంటుగా వొప్పేసుకున్నాను.

"అమ్మా! మీ అత్తగారి కథలు లేకపోతే చక్రపాణి, కుటుంబరావులు దీపావళి యువ సంచికలు అమ్ముకునేవాళ్ళా? మీ కథలు పంచదార గుళికలు." మరింత ఒంగిపోతూ అన్నాను. 

భానుమతి బహుత్ ఖుష్ హువా! ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ -

"ఒరే బడుద్దాయ్! మాటలు బాగానే నేర్చావు. నాకు పొగడ్తలంటే నచ్చవు. కానీ నువ్వన్నీ నిజాలే చెబుతున్నావనుకో!" అన్నది భానుమతి.

ఇంతలో సావిత్రి భానుమతికి తళతళలాడుతున్న గాజు గ్లాసులో బత్తాయి రసం ఇచ్చింది. నేను గుడ్లప్పగించి సావిత్రికేసి చూస్తుండిపోయాను. భానుమతి ఒక క్షణం నన్ను గమనించింది.

"సావిత్రీ! రా చెల్లీ! ఇలా నాకు దగ్గరగా వొచ్చి కూర్చో. వీడు ఇప్పటిదాకా నన్ను పొగిడాడు. నువ్వు రాంగాన్లే నిన్ను చూస్తూ నీలుక్కుపొయ్యాడు. మళ్ళీ చచ్చాడేమో వెధవ! వీడికి నువ్వంటే చచ్చేంత ఇష్టంట. అందుకే నీకోసం ఒక ప్రేమలేఖ రాశాడు."

"నిజమా! నాకు తెలీదక్కా!" ఆశ్చర్యంగా అంది సావిత్రి.

"ఓసి మొద్దుమొహమా! నీకు ఏం తెలిసి చచ్చింది గనక! ఆ దేవుడు నీకు గొప్ప నటనా ప్రతిభనిచ్చాడు గానీ, మట్టిబుఱ్ఱనిచ్చాడే బంగారం." అంటూ ముద్దుముద్దుగా సావిత్రిని విసుక్కుంది భానుమతి.

చటుక్కున తల ఎత్తి, నావైపు సూటిగా చూస్తూ "ఏమిరా! నా గూర్చి ఎప్పుడు రాస్తున్నావ్?" అంటూ హూంకరించింది భానుమతి.

"చి.. చి.. చిత్తం. త్వరలోనే.. తప్పకుండా.. ర.. రాస్తాను." వణికిపొయ్యాను.

భానుమతి కిలకిల నవ్వింది.

"నీ మొహం, నువ్వు రాయలేవులే. మీ మగవాళ్ళకి నా నటన ఇష్టం. నా పాటంటే చెవి కోసుకుంటారు. నా రచననల్ని అమితంగా ఇష్టపడతారు. కానీ నన్ను ప్రేమించే దమ్ములేని పిరికిసన్నాసులు. మీకు సావిత్రిలా అమాయకంగా, సబ్మిసివ్‌గా ఉండే వెర్రిమొహాలంటేనే ఇష్టం. సావిత్రిలో కనిపించే వల్నరబిలిటీ మీ మగాళ్ళకి ఇష్టం. నేను వీరనారీమణిని. నా దగ్గర మీరు సావిత్రి దగ్గర వేసే వేషాలేస్తే గుడ్లు పీకేస్తాను, పీక పిసికి చంపేస్తాను. అందుకే మీకు నాపాట మాత్రమే కావాలి. నాకు ప్రేమలేఖ రాయాలంటే వెన్నులో వణుకు."

భానుమతి చెబుతుంటే సావిత్రి కుందనపు బొమ్మలా, చెక్కిలిపై అరచెయ్యి ఆనించి, శ్రద్ధగా వింటూ తన చక్రాల్లాంటి కళ్ళతో 'నిజమా!' అన్నట్లు సంభ్రమంగా చూస్తూంది.

ఇంతలో మళ్ళీ ఇంకో పెద్ద పిడుగు!

"వొసే సావిత్రీ! కాఫీ నా మొహాన పడేసి ఏమిటే నీ మంతనాలు? పెత్తనాలు పక్కన పెట్టి నాకు నిద్రొచ్చే దాకా కాళ్ళొత్తు, నిద్రమొహం దానా! చూశావా ఛాయాదేవొదినా! నన్ను ఇక్కడ కూడా చెడ్డదాన్ని చెయ్యాలని కాకపోతే ఒక్కపనీ సరీగ్గా చేసేడవదు." పక్కనున్న చాయాదేవితో నిష్టూరంగా అంది సూర్యకాంతం. చాయదేవి మూతి వంకర్లు తిప్పుతూ ఆ పక్కకి వెళ్ళిపోయింది.

సూర్యకాంతం గావుకేకలతో స్వర్గం దద్దరిల్లింది. సావిత్రి ఉలికిపాటుతో ఎగిరిపడి సూర్యకాంతం దగ్గర పరిగెత్తుకెళ్ళింది.

భానుమతి నవ్వుతూ అంది. "ఇక్కడికి రాకముందు నాకూ అర్ధమయ్యేది కాదు - ఎందుకీ మగవాళ్ళు సావిత్రంటే పడి చస్తారు? నన్ను చూసి భయంతో వణికిపోతారు? మొన్నామధ్య ఒక గడ్డపాయన.. అదేనోయ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త.. దీంట్లోని మతలబు విడమర్చి చెప్పాడు."

"ఫ్రాయిడ్ మీతో మాట్లాడాడా!" ఆశ్చర్యపొయ్యాను.

"ఏంటోయ్ వెర్రి పీనుగా! అంత ఎక్స్‌ప్రెషనిచ్చావ్! నా పాటలు వినటానికి ఫ్రాయిడేం ఖర్మ! ఎరిక్ ఎరిక్సన్, ఎడ్లెర్, ఎరిక్ ఫ్రామ్, సార్త్ర్ కూడా ఎగబడతారు. ఫ్రాయిడుకి నా 'దులపర బుల్లోడా' పాట ఎంత ఇష్టమో తెలుసా? నిన్న సూర్యకాంతం పెట్టిన దొసావకాయ తిని, ఆవఘాటుకి ఉక్కిరిబిక్కిరై చచ్చాడు." అంటూ పెద్దగా నవ్వింది.

ఇంతలో హడావుడిగా లూజు చొక్కా ఇన్ షర్ట్ చేసుకుని కుర్రాళ్ళా కనిపిస్తున్న పెద్దాయన లోపలకొచ్చాడు. అతను.. ఆయన దేవానంద్! తల పైకికిందకీ ఊపుతూ, పల్చటి పెదాల్లోంచి నవ్వీ నవ్వనట్లుగా నవ్వుతూ అడిగాడు.

"నమస్కార్ భానుమతి బెహన్! ఆప్ జర మేరా సురయా కా ఎడ్రెస్ బతాయియే!"

భానుమతి దేవానంద్‌తో హిందీభాషలో ఏదో మాట్లాడుతుంది. చడీచప్పుడు చెయ్యకుండా చల్లగా అక్కణ్ణుంచి జారుకున్నాను. 

33 comments:

  1. ఇదే మొదటి సారి చచ్చడం నచ్చడం :)). స్వర్గం ఇంత బావుంటుంది అంటే నేను రోజూ చచ్చుతా :)

    ReplyDelete
  2. Excellent. *************************************

    Sri

    ReplyDelete
  3. "నీ మొహం. నువ్వు రాయలేవులే. మీ మగవాళ్ళకి నా నటన ఇష్టం. నా పాటంటే చెవి కోసుకుంటారు. నా రచననల్ని అమితంగా ఇష్టపడతారు. కానీ నన్ను ప్రేమించే దమ్ము లేని పిరికిసన్నాసులు. మీకు సావిత్రిలా అమాయకంగా, సబ్మిసివ్ గా ఉండే వెర్రి మొహాలంటేనే ఇష్టం. సావిత్రిలో కనిపించే vulnerability మీ మగాళ్ళకి ఇష్టం. నేను వీరనారీమణిని. నా దగ్గర మీరు సావిత్రి దగ్గర వేసే వేషాలేస్తే పీక పిసికి చంపేస్తాను. గుడ్లు పీకేస్తాను. అందుకే మీకు నా పాట మాత్రమే కావాలి. నాకు ప్రేమలేఖ రాయాలంటే వెన్నులో వణుకు."

    మీరు సిన్సియర్ గా నిజాన్ని ఒప్పుకుంటారు సర్ !!

    ReplyDelete
  4. wow

    क्या post है?

    क्या seen है?

    superbbbbb

    nice

    thanks

    ?!

    ReplyDelete
  5. super super super super suuuuuuuuuuuuupar like :)

    "నీ మొహం. నువ్వు రాయలేవులే. మీ మగవాళ్ళకి నా నటన ఇష్టం. నా పాటంటే చెవి కోసుకుంటారు. నా రచననల్ని అమితంగా ఇష్టపడతారు. కానీ నన్ను ప్రేమించే దమ్ము లేని పిరికిసన్నాసులు. మీకు సావిత్రిలా అమాయకంగా, సబ్మిసివ్ గా ఉండే వెర్రి మొహాలంటేనే ఇష్టం. సావిత్రిలో కనిపించే వుల్నెరబిలిత్య్ మీ మగాళ్ళకి ఇష్టం. నేను వీరనారీమణిని. నా దగ్గర మీరు సావిత్రి దగ్గర వేసే వేషాలేస్తే పీక పిసికి చంపేస్తాను. గుడ్లు పీకేస్తాను. అందుకే మీకు నా పాట మాత్రమే కావాలి. నాకు ప్రేమలేఖ రాయాలంటే వెన్నులో వణుకు."

    అద్భుతం...ఇంకో మాట లేదంతే. ముఖ్యంగా నా ఆరాధ్యదేవత భానుమతిగారు చెప్పిన మాటలు...ఓహో ఓహోహో...అద్ది అద్ది భానుమతి అంటే...గర్వాన్ని సైతం ఆభరణంగా ధరించి భేష్ అనిపించుకున్న స్వాధీనపతిక, ధీశాలి, అనన్యసామాన్య ప్రతిభాశాలి.

    ఆహా మంచి కిక్ వచ్చిందండీ మీ పోస్ట్ చదివి. ఏంటో భానుమతి గారి పేరేత్తేసరికి నాకు ఒళ్ళు తెలియట్లేదు.

    అన్నట్టు భానుమతిగారి పాటల్లో నా most favorite పాటతో మొదలెట్టారు మీ పోస్టుని. ఆవిడ పాటల్లో top ten చెప్పమంటే నేను మొట్టమొదట చెప్పెది "సావిరహే తవదీనా" :) నాకావిడంటే పిచ్చి, ప్రేమ, ఆరాధన.....ఏంటో చెప్పలేకపోతున్నాను..తెలుగులో పదాల్లేవేమో!

    ఇంకా ఈ మత్తులో మునిగితేలుతుంటే సావిత్రిని తీసుకొచ్చి మొత్తం ముంచేసారు. ఇలా ఇద్దరినీ చెరోవైపు పెడితే ఎటు చూడను, ఎవరి మాట వినను! వేయి కళ్ళైనా చాలునా....ఆహా ఆ సంకట పరిస్థితి లో ఉండడానికైనా కొన్ని మంచి పనులు చేసి చచ్చి స్వర్గానికెళ్ళాలనుంది.

    మీ ఆలోచన బెమ్మాండం బెమ్మాండం. అసలు ఏం రాసారండీ! బాబోయ్...నా ఆవేశంలో, మత్తులో ఆనందంలో మీ పోస్ట్ కంటే పెద్ద కామెంటు రాసేలా ఉన్నాను. ఇంక ఆపేస్తా...ఈరోజుతో నేను మీకు పెద్ద పెద్ద పెద్ద అతి పెద్ద అభిమానిని అయిపోయాను.

    మీ క్రియేటివిటీకి hats off!

    ReplyDelete
  6. superga vundi. okka tapatho mahamahulandariki nivaali ichhesaru.

    ReplyDelete
  7. "చచ్చిపోతే సావిత్రి కనిపిస్తుందంటే ఎప్పుడో చచ్చేవాణ్ణిగా!"

    ఉష్. ఈ మాట గట్టిగా అనకండి.

    కొంపదీసి ఈ మాట కాస్తా ప్రచారం లోకి వచ్చిందంటే, ఈ వంక పెట్టుకుని స్వర్గానికి ప్రయాణం కట్టే వాళ్ళ సంఖ్య హఠాత్తుగా పెరిగిపోయే తీవ్రప్రమాదం ఉంది.

    ReplyDelete
  8. అబ్బ ఏం రాశారండీ.. భానుమతమ్మ గారి డైలాగులైతే నాకు అలా ఆవిడ స్వరంలో వినపడిపోతున్నాయ్.. ఇక సావిత్రి గారిని కూడా అచ్చంగా అలా నిలబెట్టేశారు కళ్లముందు... చాలా చాలా చాలా బాగుంది...

    ReplyDelete
  9. Dear Ramana, this is your best post so far! Superbly done!! This can easily be made into a movie. You wrote the dialogue for Bhanumati in such a fine fashion, she would have been proud of it. Great job! I don't know if there are awards for short stories and blogs in India, but, I would nominate you for a Pulitzer prize for short stories.

    ReplyDelete
  10. *I would nominate you for a Pulitzer prize for short stories*

    Ramana Gaarau,
    What GIdoc said, 100% TRUE. I read this Tapaa three times. First time I commented "Excellent ******** ."

    Sri

    ReplyDelete
  11. తల పైకి కిందకీ ఊపుతూ.. పల్చటి పెదాల్లోంచి నవ్వుతూ అడిగాడు.
    "నమస్కార్ భానుమతి బెహన్! ఆప్ జర మేరా సురయా కా ఎడ్రెస్ బతాయియే!" చడీ చప్పుడు చెయ్యకుండా చల్లగా అక్కణ్ణుంచి జారుకున్నాను..
    ____________________________________

    ముగింపు కూడా అదిరింది. చదివితేనె ఒక సినేమా చూసినంత ఎఫెక్ట్ వచ్చింది.


    Sri

    ReplyDelete
  12. "ఒరే బడుద్దాయ్! మాటలు బాగానే నేర్చావు. కానీ నువ్వన్నీ నిజాలే చెబుతున్నావనుకో!"

    ReplyDelete
  13. నేను మిమ్మల్ని ర్యాగింగ్ చేయలేదు. మీరు నా జూనియర్ కదా !!!

    రేపటికల్లా నీహారిక నాకు చెల్లెలు కాదు, నీహారిక నా గర్ల్ ఫ్రెండ్ అని వెయ్యి సార్లు రాసి చూపించకపోయారో, ఇక అంతే ?????

    ReplyDelete
  14. great post.
    continue your creative work.
    putcha

    ReplyDelete
  15. నీహారికాస్ నెక్స్ట్ టార్గెట్ డాక్టర్ రమణ గారన్న మాట !

    ReplyDelete
  16. రవణయ్య మావా!
    అదరగొట్టావ్.
    చాలా చాలా బాగుంది.

    ReplyDelete
  17. రమణా,

    భానుమతి, సావిత్రి, ఫ్రాయిడ్ లను కలగలిపి మాంచి పద్మనాభ హోటల్ సాంబారులాగా అద్భుతంగా కధ అల్లావు.

    ఇందులో భానుమతి రాజసఠీవి,ఆత్మస్థైర్యంతో వచ్చే ఆభిజాత్యం అపూర్వంగా వర్ణించావు.

    మన బీజీస్ అందరూ ఏకగ్రీవంగా ఈ పోస్టుకి అభినందనలు అందచేస్తూ "వేసుకో రెండు వీర తాళ్ళు" అంటున్నారు.

    బీ.ఎస్సార్ అయితే ఏకంగా "పులిట్జర్" పురస్కారం ఇవ్వాలంటున్నాడు.

    ఆయనతో ఏకీభవించక తప్పట్లేదు.

    ReplyDelete
  18. భానుమతి వినిపించింది మీ మాటల్లో. ఎలా రాయగలిగారు ఇంత బాగా? భానుమతి ఫోటోలు చాలా బాగున్నాయి. ఈ పోస్ట్ భలే నచ్చింది. ( కుళ్ళు పుట్టింది)

    ReplyDelete
  19. మిత్రులారా..

    ధన్యవాదాలు.

    నా కామెంట్లు పబ్లిష్ కావట్లేదు.

    ఈ కామెంట్ అయినా పబ్లిష్ అవుతుందనే ఆశ లేదు.

    ప్రయత్నిస్తున్నాను.

    ReplyDelete
  20. :) Bravo రమణ గారు! మీరు రెండు మూడు విషయాలు ఎంత అందంగా సహజం గా ఒక దగ్గర చేర్చారు? Too good!

    ReplyDelete
  21. రమణా,

    చచ్చినవాడివి చచ్చినట్టు ఇంకో రెండు బజార్లు తిరిగివస్తే ఘటోత్కచుడు బాబాయ్ కనిపించి ఆ రెండు వీరతాళ్ళు వేయించి పంపేవాడు కదా!

    ఎంతమందికి తెల్సు పులిట్జేర్ కంటే.. కొండొకచో నోబులు కంటే.. ఆ రెండు వీరతాళ్ళు గొప్పవని.

    చచ్చితే సావిత్రి కనిపిస్తుంది అన్న విషయం బయటకి వచ్చిన ఏం భయం లేదు.

    ఎందుకంటే ఎవరి అభిమానులు వారి వారి అభిమానుల దగ్గిరకే వెళ్తారు. అంటే నీలాంటి నాలాంటి అభిమానులు స్వర్గానికి వెళ్తారు.

    కానీ మిగతావారంతా నరకానికే వెళతారు.

    మనసులో ప్లాటు అనుకుని చూస్తూ ఉంటే అదే తీగెలు, కొమ్మలుగ విస్తరించి నవలగానో, నాటకంగానో రూపాంతరం చెందుతుంది అంటాడు కో.కు(వివరంగా రాయటానికి గ్రంధ విస్తరణ భీతి)

    అలా రెండు లైన్ల ప్లాటు చుట్టుతా ఓ అందమయిన కదా అల్లటమే కాకుండా
    స్రిపుట్, స్క్రీన్ ప్లే,సినేరియో కుడా అద్భుతంగా అల్లావు

    మన భాషలో ఈ ఒక్క టపాకి నువ్వు ఓ నల్ల కుక్కనో, తెల్ల గుర్రన్నో గెల్చుకున్నావు.

    వాటిని నేను ఆవైపు వచ్చేప్పుడు తోలుకోస్తాను.

    చివరగా నాకో అనుమానం - నిన్ను అప్పుడప్పుడు కో.కు ఆవహిస్తాడు. ఆ క్షణంలో ఇలాంటి అద్భుతమయిన టపాలు వస్తయ్యని!

    నిజాతినిజంగా "అద్భుతం"

    రవి

    ReplyDelete
  22. కామెంటిన మితృలందరికీ కృతజ్ఞతలు.

    మగవాళ్ళకి తెలివైన ఆడవాళ్ళంటే భయం.

    ఈ విషయాన్ని భానుమతి చేత చెప్పించటానికి ఫ్రాయిడ్ ని లాగాను.

    బయట పడటానికి దేవానంద్ ఉపయోగపడ్డాడు.

    ఇదీ కథ!

    ReplyDelete
  23. "చచ్చినవాడివి చచ్చినట్టు ఇంకో రెండు బజార్లు తిరిగివస్తే ఘటోత్కచుడు బాబాయ్ కనిపించి ఆ రెండు వీరతాళ్ళు వేయించి పంపేవాడు కదా!

    ఎంతమందికి తెల్సు పులిట్జేర్ కంటే.. కొండొకచో నోబులు కంటే.. ఆ రెండు వీరతాళ్ళు గొప్పవని."

    Excellent Ravi garu!

    ReplyDelete
  24. చాలా బాగుంది. మమ్మలని కూడా కొంతసేపు స్వర్గం లో విహరింపచేశారు. అద్భుతం.

    ReplyDelete
  25. మగవాళ్ళకి తెలివైన ఆడవాళ్ళంటే భయం.

    ఈ విషయాన్ని భానుమతి చేత చెప్పించటానికి ఫ్రాయిడ్ ని లాగాను.


    ------

    హ హ రమణ గారూ, మీ ఇంటెన్షన్ పోస్టులోనే అర్ధమయింది. మొన్నే కామెంట్ రాద్దామనుకున్నా, ఇది అందరికీ తెలిసిన చిన్న విషయమే కదండీ అని. కాని అనవసరంలే అని ఊరుకున్నా. మీరే చెప్పారు కాబట్టి ఒక చిన్న అబ్జర్వేషన్. మగాళ్ళకి తెలివైన ఆడవాళ్ళంటే భయం కాదు. ఆ తెలివితో పాటూ, ధైర్యం, ఎదురుచెప్పే తత్వం, చిన్ని పొగరూ ఉండే ఆడవాళ్ళంటే భయం.
    కేవలం తెలివి మాత్రమే ఉండి తనకు ఎదురు చెప్పకుండా నడుచుకుంటే చాలా ఇష్టం :-) అందుకే కదా, భానుమతి గారు ఎక్కడో రాసుకున్నట్లున్నారు, బయట ఉన్నంత దూకుడుగా నేను ఇంట్లో ఉండను, ఎందుకంటే మొగుళ్ళకి అది నచ్చదూ అని. ఇవే మాటలు కాదు, ఇలాంటి మాటలే

    ReplyDelete
  26. భానుమతి గారిని ఇన్ని రోజులు గుర్తు పెట్టుకొని ఇంత పెద్ద టపారాశారంటే మగవారు ఎంత ఎమోషనలో అర్థమౌథున్నాది. ఆడవారైయుంటే ఈ పాటికి ఎప్పుడో మరచి పోయివుంటారు. ఆమే పోటోలలో నాయకురాలి నాగమ్మ పోటొ పెట్టటం మరచినట్లున్నారు.

    ReplyDelete
  27. అమోఘం....అద్భుతం. ర‌మ‌ణ‌గారూ, వైద్యం చేస్తూ కూడా ఇలాంటి క్రియేటివ్ వ‌ర్క్స్ చేస్తున్నారంటే మీ బ్రెయిన్ మామూలుది కాదు బాబోయ్.

    ReplyDelete
  28. తాను తెలివైనదాన్నని అనుకోవడమే ఎవరూ పడి చావడానికి కారణం అని ఆమెకు స్వర్గానికెళ్ళినా అర్థం కాలేదన్నమాట! :)
    స్వర్గంలో దివ్యభారతి, సౌందర్య లను గాని చూశారా? అయితే మీ అరికాలు డాక్టర్ మిత్రుడి కాంటాక్ట్ ఇవ్వరూ. :))

    ReplyDelete
  29. పాటలు ఇచ్హారు, లింక్స్ మరిచారు...ఇప్పుడు ఎక్కడని వెతకాలి...ఈ బుర్ర ఆ పాటలు వినకపొతె..ఉరుకునెటట్టు లెదు...దయచేసి లింక్స్ ఒసగుడు

    ReplyDelete
  30. http://www.youtube.com/watch?v=dajvUguUfig

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.