Sunday 4 December 2011

అమృత మూర్తులు

"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ కుర్చీలో కూలబడ్డాడు సుబ్బు. తాపీగా టేబుల్ మీదున్న న్యూస్ పేపర్ని తిరగెయ్యసాగాడు.

"అమృతమూర్తికి అశ్రునివాళి. హి.. హి.. హీ! వెరీ గుడ్!" అంటూ పెద్దగా నవ్వాడు సుబ్బు. 

"సుబ్బు! అందులో నవ్వడానికేముంది?" అడిగాను.

"ఇంగ్లీషులో సింపుల్‌గా 'హోమేజ్' అనేసి ఊరుకుంటారు. కానీ తెలుగులో అక్షరాలు ఎక్కువ, భావాలూ ఎక్కువే. అమృతమూర్తిట, అశ్రునివాళిట! ఏదో నాటకంలో పద్యంలా లేదూ?"

ఇంతలో వేడికాఫీ పొగలుగక్కుతూ వచ్చింది.

"సుబ్బు! ఆయనెవరో పొయ్యాడు. పోయినాయన కోసం డబ్బుపోసి కుటుంబ సభ్యులు పత్రికల్లో ప్రకటన ఇచ్చుకున్నారు. వాళ్ళేం రాసుకుంటే మనకెందుకు?" అన్నాను. 

"నిజమే, మనకెందుకు? కావాలంటే కారణజన్ముడు, పురుషోత్తముడు, లోకోద్ధారకుడు అని ఇంకో నాలుగు తోకలు తగిలించుకోమందాం. సర్లే గానీ, అశ్రునివాళి దాకా ఓకే. కానీ 'అమృతమూర్తి' పదం రిలెటివ్ కదా!" అన్నాడు సుబ్బు. 

"ఎలా?" అడిగాను. 

"అమృతం అనగా తీయగా నుండునది, మేలు చేయునది. ఎవరికి తియ్యగా ఉంటుంది? ఎవరికి మేలు చేస్తుంది? అది తాగేవాడిబట్టి వుంటుంది. రాజకీయ నాయకుడో, డాక్టరో, ఉన్నతాధికారో.. నిజాయితీగా, సమాజహితంగా జీవిస్తే వాళ్ళు సమాజానికి అమృతమూర్తులు. కానీ అతని నిజాయితీ మూలంగా ఇంట్లోవాళ్ళు కొన్నిసుఖాలు కోల్పోతారు, కాబట్టి అతగాడు ఇంట్లోవాళ్లకి అమృతమూర్తి కాదు. ఇంకా చెప్పాలంటే వాళ్లకి అతనో గరళమూర్తి కూడా అవ్వొచ్చు." అన్నాడు సుబ్బు. 

"అవును." అన్నాను.

"మా పక్కింటి వడ్డీల వెంకటయ్య సంగతేమయ్యింది? వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీలు వసూలు చేసేవాడు. గడ్డితిని ఆస్తులు పోగేసాడు. చివర్రోజుల్లో ఎంత తీసుకున్నాడు! ఆయన ఆస్తి కోసం కొడుకులు తన్నుకు చచ్చారు, అంతా కలిసి తండ్రికి తిండి పెట్టకుండా చంపేశారు. చావంగాన్లే వెంకటయ్య కొడుకులకి అమృతమూర్తయిపోయాడు. అందుకే రోజుల తరబడి పేపర్లల్లో ప్రకటనల ద్వారా కొడుకులు తమతండ్రి అమృతమూర్తని ఘోషించారు!" అన్నాడు సుబ్బు. 

ఖాళీ కప్పుని టేబుల్ మీద పెట్టాడు.

"గాలి జనార్ధనరెడ్డి ఆయన కుటుంబానికి అమృతమూర్తి, సమాజానికి కాదు. గాంధీ రిజిడ్ ఫిలాసఫీ వల్ల ఆయన కుటుంబం ఇబ్బంది పడింది. వారి దృష్టిలో గాంధీ అమృతమూర్తి కాకపోవచ్చు." అన్నాడు సుబ్బు.

"ఓ పన్జేద్దాం. మనం చచ్చేముందు మన ఫోటోల కింద ఈ అమృతమూర్తిని తగిలించొద్దని మనవాళ్లకి చెప్పి చద్దాం. సరేనా?" నవ్వుతూ అన్నాను.

"మనకాభయం లేదు. నువ్వూ నేనూ చస్తే మనకి పేపర్ ప్రకటన కూడానా! మనకంత స్థాయి లేదు. అందుకు మనం భారీగా నాలుగు తరాలకి సరిపడా సంపాదించాలి. అది మనవల్ల కాదు కాబట్టి మనం చచ్చాక అమృతమూర్తులం అయ్యే ప్రమాదం లేదు!" అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! నీకు బొత్తిగా పని లేకుండా పోతుంది. ఆయనెవరో పోయ్యాడని వాళ్ళవాళ్ళు ఏదో రాసుకుంటే దానికింత విశ్లేషణ అవసరమా?"

"అస్సలు అవసరం లేదు. కానీ కబుర్లు చెప్పకుండా కాఫీ తాగితే తాగినట్లుండదు నాకు. ఇదో రోగమేమో. సర్లే! సాయంకాలం క్లబ్బులో పార్టీ వుంది, వస్తున్నావుగా?""

"మర్చిపొయ్యాను. మన మూర్తి వచ్చాడు కదూ!"

"వార్నీ దుంపదెగ, మూర్తిగాడి పార్టీ మర్చిపోయ్యావా!? మూర్తి ఫ్రమ్ అమెరికా విత్ గ్లెన్ ఫిడిచ్. అమెరికా నుండి అమృతం తెచ్చిన మన మూర్తే అసలైన అమృతమూర్తి!" అంటూ పెద్దగా నవ్వుతూ నిష్క్రమించాడు సుబ్బు.  

24 comments:

  1. Man, even dead are not immune from you, er, Subbu!

    ReplyDelete
  2. Dear GIdoc..

    i have come across many people who never cared their parents when they are alive, but make lot of noise after their death.

    Subbu is always critical of using grandeur language. he is poor in telugu.

    ReplyDelete
  3. యుగ ధర్మం మాస్టారు!
    అమ్మో! సెటైర్ సుబ్బు గార్కి పెద్ద పెద్ద తెలుగు పదాలు నచ్చవు(రావు) కదా ..సింపుల్ గా చెప్పాలంటే 'ట్రెండ్' అన్నమాట!

    ReplyDelete
  4. మీ సుబ్బు గొప్పదనం మరోటుంది వాష్టారు. ( మీరేనా డాక్టర్ రమణ అంటే? లేక వేరే ఎవరైనా వున్నారా? ఈ బ్లాగ్ లోకం లోకం లో?) అదేమిటంటే, సుబ్బు తన మీద కూడా జోక్ వేసుకోగలడు. ఇతరుల మీద వెయ్య గలడు. ఇతరులు తన మీద వేసినా దానికి నవ్వేసి రిటార్టు ఇవ్వగలడు! ఆలోచింప జేసే, పునరాలోచింప జేసే సుబ్బు ! ఆ మధ్య ఒక రెండు సంవత్సరాల క్రితం, అరిపిరాల గారు, గుర్నాధం మావయ్య ని పరిచయం చేసారు - వారు ఫైనాన్స్ లో సుబ్బు. ఈ సుబ్బు జీవితం లో (లేక సినిమా ఫీల్డ్ కి మాత్రమె పరిమితమా?) ఫైనాన్సు చదివిన వాడు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. Krishna గారు..

    ధన్యవాదాలు.

    మా సుబ్బు కొంచెం తిక్కమనిషి లేండి!

    మర్యాదస్తులకీ, పెద్దమనుషులకీ దూరంగా ఉంటాడు.

    ReplyDelete
  6. నా ఫేరు సి. ఎస్. రాంబాబు. ఎ.ఐ.ర్.లో పని చేస్తున్నాను...నేను చెన్నూరి ప్రసాద్ కజిన్ ని. మీ బ్లాగ్ అద్భుతం సర్.. .రెండు పొస్ట్లు చూశాను.ఈ పంచ్ లు ప్రింటు లొ వస్తే బావుంటుంది.....

    ReplyDelete
  7. Zilebi గారు..

    నా పేరు రమణ. నేను డాక్టర్నే.

    బ్లాగ్లోకంలో ఈ పేరుతో ఇంకెవరైనా ఉన్నారేమో నాకు తెలీదు.

    సుబ్బు మీకు నచ్చినందుకు సంతోషం.

    సుబ్బు చాలా విషయాల్లో తల దూర్చాడే..

    అన్నాహజారే, తెలుగు భాష, సినిమాలు మొ||

    సుబ్బు సీతయ్యలా ఎవ్వడి మాటా వినడు.

    నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు!

    ReplyDelete
  8. csrambabu గారు..

    నా పోస్టులు మీకు నచ్చినందుకు సంతోషం.

    మీరు మా చెన్నూరి ప్రసాద్ cousin కావున నాకు ఆత్మీయులు.

    నా రాతలు సీరియస్ గా plan చేసుకుని రాసినవి కావు.

    రోజంతా సైకియాట్రీ నా జీవితం.

    రాత్రికి బోరు కొడుతూ.. చికాగ్గా ఉంటుంది.

    బ్లాగులు రాయటం కేవలం రిలాక్స్ అవ్వటానికి మాత్రమే.

    (ఈ బ్లాగులన్నీ అర్ధరాత్రిళ్ళు రాసినవే!)

    ReplyDelete
  9. టపా కోసం పోస్టర్ పెట్టారు, ఇంతకూ మీ సుబ్బు ఆ సినిమాను తెగిడాడో పొగిడాడో,మట్టిబుర్ర, అర్ధం కావట్లా :(
    క్లబ్బులో కలుసుకున్నప్పుడు ఓసారి అడిగి చెప్పండే.

    క్రితంసారి లాగే సుబ్బు సూపర్‌గా చెప్పాడు.

    ReplyDelete
  10. డియర్ య ర,

    దీన్లో ఆలోచిస్తే ఎంతోలోతుంది. Even the best president or leader can not make everyone happy. Unless you tax, you can't get monies to run...so if you do you are అమ్రుతమూర్తి for them !

    చిన్నప్పటి చందమామ కథొకటి గొర్తుకొస్తొంది మిత్రమా! తండ్రీకొడుకొలు, ఒక గాడిద. గుర్తుండే ఉంటుంది!
    గౌతం

    ReplyDelete
  11. మొత్తానికి చెప్పాలనుకున్న విషయానికి కాస్త ధైర్యం కావలసి వచ్చినపుడల్లా వాటిని సుబ్బు అనే కల్పిత పాత్ర చేత చెప్పిస్తూ (బాపు రామాయణం తిప్పి తిప్పి తీసి పాత చింత కాయ పచ్చడి చేశాడని.., ఆ నలుగురు సినిమా నాసిరకం సినిమా అనీ)మీరు సేఫ్ సైడ్ ఉంటున్నారు. మంచి గేమే!

    కానీ ఒక విషయాన్ని, వ్యక్తిని విమర్శించడానికి ఒక సెకను చాలు! ఈ సంగతి తెలీక కాబోలు బాపు, ఇంకా ఆ నలుగురు దర్శకుడు లాంటి వాళ్ళు సినిమాలు తీస్తుంటారు.

    మీ బ్లాగుకి పేరు బాగా కుదిరింది. :-))

    ReplyDelete
  12. హమ్మయ్య, మీరేనన్న మాట డాక్టర్ రమణ గారు. ఆ మధ్య భారారె జిలేబి మీరు డాక్టర్ రమణ ని కలవడం మంచిది అంటే , మరీ భయపడి పోయాను. సుబ్బు ఫ్రెండు అని ఉంటె అంత భయ పడి ఉండను. భారారె, దవా , డాక్టర్ రామనగారిని పరిచయం చేసినందులకు. !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  13. Kiran kumar గారు..

    మీకు నచ్చినవి నాకు నచ్చాలని లేదు. ఎందుకు నచ్చాలి?

    నా బ్లాగులో నా అభిప్రాయాలు రాసుకోటానికి కావలిసినంత ధైర్యం ఉంది (దీనికి ధైర్యం దేనికి!).

    ఈ ఫార్మాట్ లో రాస్తే ఆసక్తికరంగా ఉంటుందని రాస్తున్నాను. అంతే!

    'ఆ నలుగురు' అనే సినిమా సినిమా కాదనీ, సినిమా రూపంలో తీసిన నాటకం అనీ నేను అనుకుంటున్నాను. ఆ విషయం సుబ్బు స్పష్టంగానే చెప్పాడుగా! ఎవరూ మిస్ కాకూడదని బొమ్మ కూడా పెట్టానందుకే!

    నా బ్లాగు పేరు మీకు నచ్చినందుకు 'ధన్యవాదాలు'!

    ReplyDelete
  14. బాగుంది. ఆ నలుగురు సిన్మా బాగా తేలిపోయినట్లనిపించింది అ౦డీ.

    ReplyDelete
  15. “అబ్బబ్బా ఈ సుబ్బు ఓఠ్ఠి నస మనిషిలా ఉన్నాడే... అమృతమూర్తి రెలెటివ్ ఏంటీ ఆ ప్రకటన ఇచ్చినవాళ్ళకి పోయిన వారు అమృతమూర్తి అంతే పీరియడ్.. దానికి కూడా ఈయన ఈకలు పీకాలా” అని అనుకున్నాను కానీ చివరికొచ్చేసరికి ఆయన చెప్పాలనుకున్న పాయింట్ (బ్రతికినవాళ్ళను పట్టించుకోకుండా పోయాక చేసే హడావిడి గురించి) చూసాక ఎప్పటిలానే “ఎంతైనా సుబ్బూ కఠోర వాస్తవాలను చెప్తాడు కాదనలేం..” అనుకున్నానండీ :-)

    ReplyDelete
  16. Dear TJ"gowtham"Mulpur..

    తెలుగు బ్లాగర్లు బుద్ధిమంతులు. మర్యాదస్తులు. కాంట్రవర్సీల జోలికి పోరు.

    "చావు భాష" మీద పోస్ట్ రాస్తే కోపం తెచ్చుకుంటారేమోననిపించింది.

    కానీ.. పెద్దగా బొప్పిలేమీ కట్టకుండానే బయటపడ్డాను.

    ReplyDelete
  17. వేణూ శ్రీకాంత్ గారు..

    ధన్యవాదాలు.

    ఒక పాయింట్ దగ్గర మొదలెట్టి ఇంకో పాయింట్ దగ్గర తేలాను.

    సరదాగా తీసుకోండి.

    ReplyDelete
  18. "నువ్వు చెప్పేది రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా గూర్చేనా? చాలా నాసిరకం సినిమా. "

    చప్పట్లు, చప్పట్లు.

    మన ఆంధ్రదేశంలో కొంతమంది దర్శకులున్నారు. మంచి దర్శకులే కానీ, చాలా ఓవర్ రేటెడ్ బై పీపుల్. వాళ్ళ పేర్లు చెపితే, జనాలు నా నడ్డి విరగ్గొడతారు కానీ :-)), మీ విశ్లేషణలు భలే నచ్చుతున్నాయి నాకు అని సరిపెడతానిప్పటికి.

    ReplyDelete
  19. KumarN గారు..

    థాంక్యూ.. థాంక్యూ.

    ReplyDelete
  20. దర్శకరత్న తీసిన సినేమాలు చాలా మటుకు కె.బాలచందర్ గారి పంథాను అనుకరించేవి. బాల చందర్ గారు చాలా రకాల సినేమాలు తీస్తే, దాసరిగారు ఒక రేండు మూడు రకాలను మొదటి నుంచి (తాతామనవడు)చివరి దాకా (సూరిగాడు) తిప్పి తీసేవారు. వీరిద్దరు ఊపుగా సినేమాలు తీసిన 1970 దశాబ్ద కాలం లో స్వాతంత్ర పోరాట స్పూర్తి సన్నజిల్లుతూ, సోషలిజం ఆర్ధికవ్యవస్థ మధ్యతరగతి వారికి భారమైన కాలంలో, ఆ ఫీలాసఫిని తప్పు పట్టకుండా, రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకతింట్టున్నారు అని, తప్పంతా వారిదే అని నిరుద్యోగుల కొరకు ఆకలిరాజ్యం సినేమాను తీశారు. ఆరోజులలొ పెద్ద కుటుంబాలు, సోషలిజ సమాజం వలన ఆర్ధిక ప్రగతి లేక, మధ్య తరగతి వారు కూనరిల్లు తుంటే ఆ వెనుక బాటుతనానికి ప్రధాన కారణం ఆచార వ్యవహారాలు అని, అందువలననే దేశం వెనుకబడి పోయిందన్నట్లు సినేమాలలో చూపించేవారు. మరో చరిత్ర సినేమా, ఇంకా కొన్ని ఎర్ర సినేమాలు ఆరోజులలో విరివిగా వస్తూండేవి. ఈ ఇద్దరు ప్రముఖ దర్శకులు ప్రేక్షకులకు కళ్ళనీళ్ళను తెప్పించి, సమాయానికనుగుణంగా సినేమాలు తీసి కాసులను చేసుకొన్నారు.

    మరి ఈ సినేమాలకు, ఆనలుగురు సినేమాకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఆనలుగురు లో హీరో గారి పిల్లలు, గ్లోబలైసేషన్ తరువాత కాలనికి చెందినవారు. ఇద్దరు పిల్లలు, చిన్న సంసారం. కష్ట్టపడి పైకి వచ్చాడు కనుక ఉన్నదానిలో పోదుపుగా ఉంట్టు, తనకాళ్లమీద తాను నిలబడుతూ, చేతనైనంత ఇతరులకు సహాయం చేయలనుకొనే తత్వం. గ్లోబలైసేషన్ కాలం లో పక్కన ఉన్నవారందరు, అందరు అభివృద్ది చెందుతున్నట్లు, ముందుకు దూసుకు పోతున్నట్లు కనిపిస్తున్నా, దానివేనుకాల గల అసలు సంగతి గుర్తించిన హీరోగారు అలా దూసుకు వేళ్లటానికి ఇష్టపడడు. ఆర్ధిక పరంగా ప్రస్తుత ఉన్నస్థాయి నుంచి ఇంకొంచెం పైకి పోవాలంటే గ్లోబలైసేషన్ తరువాత ఇతరుల నెత్తిన తప్పక చేయి పేట్టాలి అని పిల్లల పాత్రల ద్వారా,వారు చేసే వ్యాపారలద్వార చూపిస్తాడు . ముందర అభివృద్ది అయినట్లు కనుపించినా, దాని ఫలితం మనం ఈనాడు, ప్రతి రోజు సాక్షి లో స్కాంల గురించి, ఆస్థుల గురించి ఇరువర్గాల వారు కొట్టుకోవటం చదువుతున్నాం కదా! కనుక హీరోగారు అటువంటి ప్రయత్నాలు చేయకుండా, తన ఆర్ధిక స్థాయికి తగ్గట్టు జీవితాన్ని జీవించి, సమాజంలో మనిషిగా గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉంట్టుంది. డబ్బులు ఉన్నవారైనా లేని వారైనా పేరు తెచ్చుకోవటానికి,ఇతరులను ప్రభావితం చేయటానికి ఎప్పుడు తమ పరిధిలో ప్రయత్నిస్తూ ఉంటారు. నాకర్ద్దమైనది ఎమనంటే ఎంత చేట్టుకంత గాలి అన్నట్లు, ఒక ఆర్ధీక స్థాయి వారు పైకి పోవాలనే ఆరటపడకుండా ఉన్నస్థాయిలో, కుటుంబసభ్యులు సహకరిస్తే తప్పక గుర్తింపు తెచ్చుకోవచ్చు అని రాజేంద్రప్రసాద్ పాత్రను ప్రజలు గుర్తుపేట్టుకోవటం ద్వారా చూపిస్తారు. ఈ సినేమా ఎక్కడా దాసరి సినేమాలు ఎక్కడా?

    Sri

    ReplyDelete
  21. అందుకే అన్నారు, "పోయినోళ్ళు అందరు మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు" అని . బతికున్నప్పుడు ఎంత వెధవైన పొతే అమృత మూర్తే అవుతాడు మరి, వెధవ మానవ నైజం.
    గో వె ర

    ReplyDelete
  22. @Sri..

    నా పోస్టులో 'ఆ నలుగురు' సినిమా కంటెంట్ గూర్చి విమర్శించలేదు.

    సినిమాని వీధినాటకంలా తీశారని మాత్రమే రాశాను.

    ఆ నలుగురు సినిమాని 'చూడనవసరం' లేదు! 'విన్నా' సరిపోతుంది!!

    ఒక పాత్ర తరవాత ఇంకో పాత్ర హడావుడిగా డైలాగులు చెప్పేస్తుంటాయి. cartoon క్యారెక్టర్లలా ఫ్లాట్ గా ఉంటాయి.

    ఈ తరహా సినిమాలకి దాసరి ప్రసిద్ధుడు.

    బాలచందర్ కానే కాదు.

    ఒక సినిమా మనకి నచ్చటం, నచ్చకపోవటం అనేది అనేక variables మీద ఆధారపడి ఉంటుంది.

    చాలా మందికి 'ఆ నలుగురు' కంటెంట్ అద్భుతంగా అనిపించింది. నాకు నాటకసినిమాలా అనిపించింది! అంతే.

    ReplyDelete
  23. గో వె ర..

    లెస్స పలికితివి.

    పెద్దవాడివైనా చిన్నమాట చెప్పావు!

    ReplyDelete
  24. సుబ్బు కి నేను రాను రాను ఫేన్ ని అయిపోతున్నానండీ!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.