Showing posts with label సినిమా ఆలోచనలు. Show all posts
Showing posts with label సినిమా ఆలోచనలు. Show all posts

Monday, 30 September 2013

'షావుకారు' చెంగయ్య మనస్తత్వం.. కొన్ని ఆలోచనలు


మంచి సినిమా అనగానేమి? దాని రంగు, రుచి, వాసన ఎట్లుండును? ఈ ప్రశ్నలకి నాకు తోచిన సమాధానం రాస్తాను. చాలాసార్లు ఒక సినిమాని casual గా చూట్టం మొదలెడతాం. కొద్దిసేపటికి సినిమా చూస్తున్న సంగతి మర్చిపోతాం. ఇంకొద్దిసేపటికి సినిమా కథలో పూర్తిగా engross అయిపోతాం. ఎదురుగా జరుగుతున్న సన్నివేశాలు మన చుట్టూతా జరుగుతున్నట్లుగా ఉంటాయి. అంటే సన్నివేశాల్లో పాత్రల మధ్య (passive గా) మనం కూడా ఉంటాం. ఈ అనుభూతి కలిగించే ఏ సినిమా అయినా మంచి సినిమానే అవుతుంది. ఈ విషయంలో సలహా కోసం మనం సినీపండితుల వైపు చూడనవసరం లేదు.

నా దృష్టిలో మంచి సినిమా అంటే ఏంటో చెప్పాను కదా! ఈ నిర్వచనం ఫాలో అయితే విజయావారి 'షావుకారు' ఒక మంచి సినిమా అవుతుంది. ఈ సినిమా చూస్తుంటే.. ప్రశాంత నదీ తీరాన చెలి చెంతన ఫిల్టర్ కాఫీ తాగుతూ sweet nothings (అంటే చెలితో మాట్లాడేప్పుడు nothing is sweet అని అర్ధం కాదు) మాట్లాడుకున్నంత హాయిగా ఉంటుంది. ఒక పల్లెటూర్లో కొన్నిగంటలపాటు బస చేసిన భావన కూడా కలుగుతుంది. సినిమాలో కనబడే సహజ పల్లెవాతావరణం.. పాత్రలు, పాత్రధారుల ప్రతిభల గూర్చి చాలా రాయొచ్చు. ఇప్పుడంత ఓపిక లేదు కావున.. ప్రస్తుతానికి షావుకారు చెంగయ్యకి పరిమితమవుతాను.

చెంగయ్య షావుకారు. వడ్డీవ్యాపారం చేస్తూ చాలా డబ్బు కూడబెడతాడు (ఈ వడ్డీవ్యాపారం సర్వకాల సర్వావస్థల యందు గిట్టుబాటుగానే ఉంటుంది). చెంగయ్యకి పక్కింటి అమ్మాయి సుబ్బులు (షావుకారు జానకి) అంటే ఎంతో ప్రేమ, ఆప్యాయం. ఒకరకంగా సుబ్బులు, చెంగయ్యలు స్నేహితులు కూడా (సుబ్బులు చెంగయ్యని ఆట పట్టిస్తుంటుంది). డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే చెంగయ్య.. సుబ్బులుకి బంగారు నగ బహుమతిగా ఇస్తాడు. ఇటువంటి దృశ్యాలతో చెంగయ్యకి సుబ్బులు పట్ల గల ప్రేమాభిమానాల్ని చక్కగా establish చేస్తాడు దర్శకుడు.


చెంగయ్య దగ్గర లౌక్యం కూడా బాగానే ఉంది. కాబట్టే సున్నం రంగడు (ఎస్వీరంగారావు), పంతులు (వంగర వెంకట సుబ్బయ్య) మాట కాదనలేకపోతున్నట్లుగా.. వరాలు (రేలంగి) తండ్రి శెట్టికి సత్రంలో అంగడి నడుపుకోడానికి మౌనంగా అంగీకరిస్తాడు. వాస్తవానికి సత్రంపై చెంగయ్యకి హక్కు లేదు. అది ఊరుమ్మడి. ఆ విషయం చెంగయ్యకి కూడా తెలుసు. సుబ్బులు తండ్రి రామయ్య (శ్రీవాత్సవ) ఆ నిజాన్నే సాక్ష్యంగా చెబుతాడు. అందుకు రామయ్యపై కక్ష పెట్టుకుంటాడు. సుబ్బులు అన్న నారాయణ (వల్లభజోశ్యుల శివరాం) తనపై నోరు చెసుకున్నందుకు అవమానంగా భావిస్తాడు. అందువల్ల తప్పుడు కేసు బనాయించి నారాయణని జైలు పాలు చేస్తాడు.

తను చేస్తున్నదని సరికాదనీ, తప్పు కూడాననే భావన చెంగయ్యని ఇబ్బంది పెడుతుంటుంది. చెంగయ్యలోని ఈ మంచిచెడుల conflict ని దర్శకుడు చాలా జాగ్రత్తగా maintain చేసుకుంటూ వస్తాడు. అందుకే తనలోని guilt feelings లోంచి బయటపడేందుకు.. జరుగుతున్నదానిలో తన తప్పేమీ లేదనీ, ఈ తతంగం మొత్తానికి రామయ్య, నారాయణల ప్రవర్తనే కారణం అనుకుంటూ.. rationalization చేసుకుంటాడు చెంగయ్య.

తీరా తన కొడుకు సత్యం (ఎన్టీరామారావు) కూడా చెయ్యని నేరానికి జైలు పాలయినందుకు తల్లడిల్లిపోతాడు. ఇక్కణ్నించి చెంగయ్యలో self introspection మొదలవుతుంది. తీవ్రమైన నిరాశ, నిస్పృహలకి లోనవుతాడు. అందుకే ఊరివాళ్ళతో మానసికంగా సంబంధాలు తెంచేసుకుని isolation కోరుకుంటాడు. తన అవసరం ఎవరికీ లేదనీ, తనకీ శాస్తి జరగవలసిందేనని self-reproach కి లోనవుతాడు. depressed state of mind ఉన్నవారిలో ఈ రకమైన ఆలోచన సహజం.


'దొంగలు వచ్చి చంపేస్తారు మామా!' అంటూ సుబ్బులు ఏడుస్తూ వచ్చి చెబుతుంది. తప్పించుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ.. తప్పు చేసిన తనకి శిక్ష పడవలసిందేనని భావిస్తాడు. అపరాధ భావంలోంచి బయటపడ్డానికి శిక్షకి మించిన పరిహారం మరొకటి లేదు. అందుకే బలవంతంగా సుబ్బులుని పంపేస్తాడు. చివరికి సుబ్బులు ప్రాణానికి ముప్పు ఏర్పడ్డప్పుడు మాత్రమే దొంగలకి తాళం చెవులు సంగతి చెబుతాడు. ఇవి షావుకారు చెంగయ్య వైపు నుండి కథలోని కొన్ని ముఖ్యమైన పాయింట్లు .

ఇంతకీ చెంగయ్య ఎవరు? 'షావుకారు' కథకి నాయకుడా? ప్రతినాయకుడా? రంగడు ద్వారా దొంగబంగారం కొంటాడు. కొడుకులాంటి నారాయణపై కక్షతో దొంగ సాక్ష్యం చెప్పాడు. అందువల్ల చెంగయ్య చెడ్డవాడే అయి ఉండాలి. మరైతే.. రామి (కనకం) దగ్గర చిన్నపిల్లాళ్ళా బావురుమంటాడెందుకు? కావున మంచివాడే అయ్యుంటాడు. అర్ధం కావట్లేదు కదూ?

ఏ మనిషీ పూర్తిగా మంచివాడుగానో, చెడ్డవాడు గానో ఉండడు. పరిస్థితుల బట్టి ప్రవర్తన ఉంటుంది. మంచి చెడ్డలూ మారుతుంటాయి. సుబ్బులుని చిన్నప్పట్నుండి ప్రేమగా పెంచిన చెంగయ్య చెడ్డవాడయ్యే అవకాశం లేదు. పిల్లల్ని, పుస్తకాల్ని ప్రేమించేవారు ఎప్పుడూ మంచివారే (ఈ అభిప్రాయం మాత్రం పూర్తిగా వ్యక్తిగతం.. biased కూడా).

రామయ్య సాక్ష్యం వల్ల తన పరువు పోయిందనే ఉక్రొశం, నారాయణ పెడ మాటల వల్ల కోపం తప్ప (చెంగయ్యది egocentric personality కాదుగానీ.. ఆ traits కొన్ని ఉన్నాయి).. చెంగయ్య మనసులో వేరే దుష్ట భావనలు ఉన్నట్లు తోచదు. జరుగుతున్న పరిణామాల పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా ఉంటాడు చెంగయ్య. ఏ క్షణంలోనైనా రామయ్య వచ్చి "ఏంటి బావా ఇదంతా?" అని ఒక చిన్న మాటన్నా జరిగిందంతా మర్చిపోదామన్న ఆత్రుతతో ఉన్నవాడిలా కూడా కనిపిస్తాడు. అయితే రామయ్య చెంగయ్యకి అంత అదృష్టం పట్టనివ్వడు!

నేను షావుకారు చెంగయ్య మనసు చదివేసినట్లు.. ఆయన తరఫున వకాలత్ పుచ్చుకున్నట్లు రాసేస్తున్నాను. ఎందుకంటే నాకు చెంగయ్య మనసు చక్కగా అర్ధమైంది. ఇందుకు కారకులు ఇద్దరు. షావుకారు చెంగయ్య పాత్రని ఎల్వీప్రసాద్ అనే శిల్పి ఎంతో శ్రద్ధగా ఒక అద్భుతమైన శిల్పంగా మలిస్తే.. గోవిందరాజుల సుబ్బారావు ప్రాణం పోశాడు. మహానటుడు ఎలా ఉంటాడు? అచ్చు గోవిందరాజుల సుబ్బారావులా ఉంటాడు!


అవును. గోవిందరాజుల సుబ్బారావు మహానటుడే! కన్యాశుల్కంలో నశ్యం పీల్చుకుంటూ, జంధ్యం సరిచేసుకుంటూ లుబ్దావధానులుగా ఒక పరమలోభిని మనముందు ఆవిష్కరించాడు (గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!). ఇప్పుడీ షావుకారు సినిమాలో సంక్లిష్టమైన చెంగయ్యని మనముందు నిలబెట్టాడు. ఒక పాత్రకి.. ఆ పాత్ర గుణగణాలని దుస్తులుగా తొడిగి.. పాత్రోచితంగా ప్రవర్తిస్తూ.. మనని కథలో లీనమయ్యేట్లు చెయ్యడమే ఒక మంచి నటుడి బాధ్యత. ఆ బాధ్యతని అత్యంత ప్రతిభావంతంగా నెరవేర్చేవాడే మహానటుడు.

నాకీ మధ్య ఒక అనుమానం పట్టుకుంది. నాకు పాతతరం నటుల ప్రతిభ సరీగ్గా తెలీదు. ఏ అంచనా లేకుండా ఒక సినిమా చూస్తాను. ఆ సినిమా బాగా నచ్చుతుంది. నటీనటులు ఇంకా బాగా నచ్చుతారు. అంచేత ఆ సినిమానీ. నటుల్నీ ఆకాశానికెత్తేస్తూ రాసేస్తున్నానా? అని. చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి మొదలైన నటుల విషయంలో నాలో ఈ surprise element  పనిచేసిందా?

కావున నేను ఇకనుండి ఏ నటుడికైనా మార్కులు వేసేప్పుడు పిసినిగొట్టుగా వ్యవహరించవలసిందేనని నిర్ణయించుకున్నాను. షావుకారు సినిమా నచ్చింది. చెంగయ్య పాత్రధారణ చాలా బాగా నచ్చింది. కానీ.. ఇకపై ఇట్లాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలనే సంగతీ గుర్తుంది. అంచేత సినిమాలో గోవిందరాజుల సుబ్బారావు అభినయాన్ని లెక్కల మేస్టర్లా గుచ్చిగుచ్చి చూస్తూ.. చూశాను.

అయితే 'షావుకారు'ని ఇలా చూడ్డం వల్ల నాకు ఒక నష్టం కలిగింది. చెంగయ్య సుబ్బులుపై వాత్సల్యం కురిపిస్తున్నప్పుడు (సుబ్బులు నా బంగారుకొండ).. రామయ్య ఖచ్చితమైన సాక్ష్యం చెప్పి చెంగయ్య పరువు తీసినప్పుడు (ఏం? ఆమాత్రం నాకు మాట సాయం చెయ్యడా?).. నారాయణ చెంగయ్యపై నోరు పారేసుకుంటున్నప్పుడు (నా కళ్ళ ముందే పెరిగాడు.. వెధవకి ఎంత అహంకారం?).. చెంగయ్య కలిగిన భావాలన్నీ నాక్కూడా కలిగినయ్.

కొడుకు తనని అసహ్యించుకున్నప్పుడు.. 'అనవసరంగా పట్టుదలకి పోయి స్నేహితుని కుటుంబాన్ని కష్టాలు పెట్టానే' అనే అపరాధ భావంతో చెంగయ్య దహించుకుపోతున్నప్పుడు నాక్కూడా బాధగా అనిపించింది. అందుకే ఆయన రామి దగ్గర భోరున విలపించినప్పుడు నాక్కూడా కన్నీరు ఆగలేదు (నేనెందుకిలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాను? ఇందర్ని ఏడిపించి ఏం బావుకుందామని? ఏమిటీ నాకీ ఖర్మ?).


ఇలా సినిమా అంతా నన్ను తనతో పాటు ప్రతి సన్నివేశంలో చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఎంతో ఉద్వేగానికి గురిచేశాడు గోవిందరాజుల సుబ్బారావు. ఒక ప్రేక్షకునికి ఇంత అనుభూతిని కలిగించడం ఒక గొప్ప నటుడి ప్రతిభకి తార్కాణం అని అనుకుంటున్నాను. కావున షావుకారు చెంగయ్య పాత్రపోషణ తెలుగు సినిమా చరిత్రలో గొప్ప నటనకి కొండగుర్తుగా భావిస్తున్నాను.

ఇప్పుడు నన్ను నేను ఒక ప్రశ్న వేసుకుంటున్నాను. నాకు పల్లెటూరు వాతావరణం తెలీదు. జీవితంలో ఒక్కరోజు కూడా పల్లెజీవితాన్ని అనుభవించి ఎరుగను. వ్యవసాయం తెలీదు. వడ్డీవ్యాపారం అంటే అసలే తెలీదు. అయినా నేను చెంగయ్యతో పూర్తిగా empathize అయ్యాను. (సరీగ్గా ఇలాగే ఫీలవుతూ గుండమ్మ తరఫున 'సైకోఎనాలిసిస్ ఆఫ్ గుండమ్మ' రాశాను). కారణం? నేను ప్రధానపాత్రతో identify అయ్యేలా చెయ్యటం అనేది దర్శకుడి ప్రతిభ, నటుడి గొప్పదనం. మంచి సినిమా అంటే ఇలాగే ఉంటుంది.. ఉండాలి కూడా.

ఒక మంచినటుడికి మంచివాడిగానో, చెడ్డవాడిగానో నటించడం పెద్ద కష్టం కాకపోవచ్చు (నటన తెలీనివాడికి ఏదైనా కష్టమే). అటు మంచీ కాకుండా, ఇటు చెడూ కాకుండా.. సందర్భాన్ని బట్టి react అయ్యే 'మామూలు మనిషి'గా different shades చూపిస్తూ నటించాలంటే మాత్రం అసాధారణ ప్రతిభ కావాలి. ఈ ప్రతిభ గోవిందరాజుల సుబ్బారావు దగ్గర పుష్కలంగా ఉందని తెలుస్తుంది.

ఈ సినిమా చూసిన తరవాత నాకనిపించింది.. గోవిందరాజుల సుబ్బారావు నటన ఒక అద్భుతమైన పూలతోట వంటిది. ఈ తోటకి అనేక ద్వారాలు ఉన్నాయి. కన్యాశుల్కం ఒక ద్వారం.. షావుకారు ఇంకో ద్వారం. ఆ తోటలో ఒక్కో ద్వారం నుండి వెళ్తే ఒక్కోరకమైన పూలు.. అన్నిరకాల పూలూ చూడ్డానికే కాదు.. ఆఘ్రూణించడానిక్కూడా భేషుగ్గా ఉంటాయి.

సందేహం లేదు - ఈ గోవిందరాజుల సుబ్బారావు గొప్ప నటయోధుడు. ఆయన అసమాన నటనా ప్రతిభకి గులామునైపోయి సలాము చేస్తున్నాను.

(photos courtesy : Google)

Saturday, 20 July 2013

సినిమాలు చిన్నప్పుడే ఎందుకు బాగుంటయ్?


మిత్రులారా! ఈరోజు మీకో రహస్యం చెప్పాలి. నాగూర్చి నేను గొప్పలు చెప్పుకోకూడదు గానీ.. నేను చిన్నప్పట్నించే గొప్పఆలోచనాపరుణ్ని. మానవ సమాజం, సమాజ మనుగడ, వినోదం, విజ్ఞానం, భవిష్యత్తు కార్యాచరణ వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలపై తలమున్కలుగా ఆలోచిస్తుండేవాణ్ని. స్కూల్లో కూర్చుని నేచేసిన నా ఆలోచనలు మచ్చుకు కొన్ని రాస్తున్నాను. చదివి ఆనందించండి.

'సినిమా'.. ఎంత గొప్ప పదం! వినుటకు కడు ఇంపుగా, సొంపుగా యున్నది! అసలీ సినిమా అనునది మానవునికి దేవుడు ప్రసాదించిన ఒక వరం. ఒక గొప్ప అదృష్టం. సినిమాలు చూడ్డం అన్నది నాగరికతకి చిహ్నం. సినిమా అనేది ఒక జాతికి జీవగర్ర (జీలకర్ర కాదు). సినీవీక్షణం ఒక పవిత్ర కార్యం, జీవన పరమావధి. సినిమాలు చూడనివాడి జీవితం వృధా.

అసలీ పురప్రజలు రోడ్ల మీద తిరుగుతూ టైమెందుకిలా వేస్ట్ చేసుకుంటున్నారు? ఊరంతా సినిమా హాళ్ళు కట్టించేస్తే హాయిగా అందరూ సినిమాలు చూసేస్తూ సినిమా హాళ్ళల్లోనే జీవించేవారు గదా! నాన్న జేబునిండా డబ్బులున్నా కూడా రోజుకో సినిమా చూడ్డేంటి? నేను మాత్రం పెద్దైంతరవాత బోల్డంత డబ్బు సంపాదించి రోజంతా సినిమాలు చూస్తూ బతికేస్తాను.

మిత్రులారా! నా ఆలోచనలు ఇంకా రాయాలంటారా? విజ్ఞులు. ఈపాటికి మీకు అర్ధమైపొయ్యుంటుంది. చిన్నట్నించి నేనెంతటి అచంచల ఆలోచనాపరుణ్నో!

ఇప్పుడు కొంచెంసేపు నా సినిమా ముచ్చట్లు. నా చిన్నతనంలో మాకు సినిమా చూడటం అనేది ఏకైక వినోద సాధనం. అందునా మా మధ్యతరగతి జీవితాల్లో సినిమా అనేది ఒక లక్జరీ కూడా. రిక్షాకి, సినిమా టిక్కెట్లకి, అవుట్ బెల్లులో (intermission) తాగే గోళీ సోడా ఖర్చుతో సహా బజెట్ ముందుగానే నిర్ణయించబడేది (సినిమా తియ్యడానికే కాదు, చూడ్డానిక్కూడా బజెట్ కావాలి).

నేను తెలివైనవాణ్నని మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను. సినిమాలో ఏమీ కొనుక్కోనని (ఇంటి దగ్గర) అమ్మని నమ్మబలికిన నేను.. సినిమా మొదలవ్వంగాన్లే చక్రాలు కొనిపెట్టమని బ్రతిమాలేవాణ్ని, ఏడిచేవాణ్ని (ఏడుపుని ఎఫెక్టివ్ గా వాడుకోవటం ఒక ఆర్ట్). అమ్మ దగ్గర రిజర్వులో బ్లాక్ మనీ (నాన్నకి తెలీకుండా ఇంటిఖర్చుల్లో మిగిల్చుకున్న చిల్లర) ఉంటుందని నాకు తెలుసు.

ఒకవైపు సినిమా తెరపై నడుస్తుండగానే క్యాంటీన్ కుర్రాళ్ళు చక్రాలబుట్టతో హాలంతా తిరుగుతుండేవాళ్ళు (ఎక్కువగా పిల్లలున్నచోటనే తచ్చాడుతుండేవాళ్లు). పదిపైసలకి ఐదు చక్రాలొచ్చేవి. మొత్తానికి చక్రాలు సాధించి, చొక్కా జేబులో (నా లూజు చొక్కా గూర్చి "నాన్న పొదుపు - నా చిన్నికష్టాలు"  అంటూ ఓ పోస్టు రాశాను) వేసుకుని.. అటు తరవాత బుల్లిబుల్లి తుంపులుగా చేసుకుని.. కొద్దికొద్దిగా చప్పరిస్తూ, నముల్తూ (చక్రాలు హడావుడిగా తినరాదు. తొందరగా అయిపోవును) సినిమా చూసేవాణ్ని.

అసలు ఇంట్లోవాళ్ళు సినిమా ప్రోగ్రాం పెట్టుకోంగాన్లే ఒకరకమైన ఉద్వేగం, ఆనందం. సినిమా తెర తీస్తున్నప్పట్నించే చాలా fascinating గా ఉండేది. ఆ తెర అటూఇటూ పట్టుకు లాగేది మనుషులా? లేక కరంటు మిషనా? అన్నవిషయం గూర్చి చాలా తీవ్రంగా ఆలోచించేవాణ్ని (ఈ విషయంపై స్నేహితులతో మేధోచర్చలు కూడా జరిపేవాణ్ని).

సినిమాకి ముందు న్యూస్ రీళ్ళు వేసేవాళ్ళు. కరువు, వరదలు అంటూ ఏవో వార్తలు చూపించేవాళ్ళు (వీటిని మేం ట్రైల్ పార్టీ అనేవాళ్ళం). అసలు సినిమాకి ముందు కొసరులాగా వచ్చే ఈ రీళ్ళు కూడా నాకు భలే ఇష్టం (ఎంతైనా ఫ్రీ కదా).

ఆ రోజుల్లో నా జీవితంలో మధురానుభవం సినిమా చూడ్డం. అందులో ఇంకా మధురాతి మధురానుభవం రామారావు, రాజనాల కత్తియుద్ధ సన్నివేశాల్ని కనులారా వీక్షించడం. వాళ్ళిద్దరూ లోకేషన్లు మార్చుకుంటూ, (చేతులు పడిపొయ్యేలా) గంటలసేపు యుద్ధం చేసుకునేవాళ్ళు. వాళ్ళెంతసేపు యుద్ధం చేసుకున్నా.. ఇంకొంచెంసేపు చేసుకుంటే బాగుండుననిపించేది.

ఈరోజున నేనా సినిమాలు చూస్తే ఎలా ఉంటుంది? నాకా రోజుల్లో అమితానందాన్నిచ్చిన ఆ సినిమాల్ని చూడ్డానికి మొన్నామధ్య ప్రయత్నించాను. కొద్దిసేపు కూడా చూళ్లేకపొయ్యాను. కారణమేమై యుండును? నేను విజ్ఞానవంతుడనయ్యానా? వివేకవంతుడనయ్యానా? మేధావినైపొయ్యానా? బాకుల్లాంటి ఈ ప్రశ్నలకి (ఒకే ప్రశ్నని ఎఫెక్టు కోసం మూడురకాలుగా రాశాన్లేండి) సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.

చిన్నప్పుడు నాకు సినిమాలు 'తీస్తారని' తెలీదు. తెరమీద కనిపిస్తున్నదే నిజమనుకునేవాణ్ని. రామారావు సావిత్రిలు నిజంగానే భార్యాభర్తలు. సూర్యకాంతం నిజంగానే గయ్యాళి. రాజనాల నిజంగానే చెడ్డవాడు. వాళ్ళమధ్య జరుగుతున్న సంఘటనలన్నీ వాస్తవం. ఇంకో ఆలోచనకి తావు లేదు.

నేను హైస్కూల్లో చదివేప్పుడు నాపక్కన శాస్త్రి కూర్చునేవాడు. వాడు సినిమా విషయాలు చాలా చెప్పేవాడు.

"ఎన్టీరామారావు, సావిత్రి నిజంగానే మొగుడూపెళ్ళాలు. అందుకే రామారావు సావిత్రిని అంత గట్టిగా వాటేసుకుంటాడు. అదే నాగేస్సర్రావుని చూడు.. సావిత్రిని ముట్టుకోవాలంటే బయ్యం. దూరందూరంగా ఉంటాడు. సావిత్రిని ముట్టుకుంటే.. నాగేస్సర్రావు తన పెళ్ళాన్ని ముట్టుకున్నాడని రామారావుకి కోపం వస్తుంది. అప్పుడింక నాగేస్సర్రావు పని ఔట్."

"నిజంగా?"

"నిఝం. తల్లితోడు. మా అన్నయ్య చెప్పాడు." మా శాస్త్రిగాడికి ప్రతిదానికీ ఒట్లెయ్యడం అలవాటు.

నా వెనక బెంచిలో వీరయ్య ఉండేవాడు. వాడి భాష మొరటు. తెలుగు సినీతెర వెనుక రహస్యాలు చూసినట్లే చెప్పేవాడు.

"ఎన్టీవోణ్ని చంపెయ్యడానికి నాగ్గాడు అట్టకత్తి కాంతారావుతో కలిసి ప్లానేశాడు. ఈ సంగతి ముందే కనిపెట్టిన ఎన్టీవోడు కత్తి తీసుకోని గుర్రం మీద స్రీడుగా వస్తంటే బయపడి నాగ్గాడు పారిపోయ్యాడు. కాంతారావు ఎన్టీవొడి కాళ్ళ మీద పడ్డాడు."

నా ముందు బెంచిలో సూరి కూర్చునేవాడు. వాడిక్కూడా గొప్ప సినిమా నాలెడ్జ్ ఉండేది.

"ఉరేయ్! నీకీసంగతి తెలుసా? రామారావు కిష్టుడి వేషం వేసేముందు పూజ చేస్తాడు. అప్పుడు కిష్టుడు రామారావులోకొచ్చేస్తాడు. ఇంకాతరవాత రామారావు చేసేదేముండదు. అంతా ఆ కిష్టుడే చేసేస్తాడు."


సినిమా నటులకీ, పాత్రలకీ తేడా మాకు తెలీదు. మేం చూసే సినిమాలు మద్రాసులో తీస్తారని, సినిమాలో మేం చూస్తున్న ప్రతి సన్నివేశాల్ని క్షుణ్ణంగా ప్లాన్ చేస్తారని మాకు తెలీదు. రామారావు, రాజనాల విఠలాచార్య చెప్పింది శ్రద్ధగా విని.. కత్తియుద్ధం చేసినట్లు నటించి.. ఎవరిళ్ళకి వాళ్ళెల్తారనీ, వాళ్లక్కూడా భార్యాపిల్లలుంటారనేది మా ఊహకందని విషయం.

ఇవన్నీ తెలీదు కనుకనే రాజనాల (పనీపాట లేకుండా) పొద్దస్తమానం హీరోయిన్లని కిడ్నాప్ చేసే పన్లో ఉంటాడని నమ్మేవాళ్ళం. ఈ విలన్ల కుట్రల్ని భగ్నం చేస్తూ హీరోలు ఎంతటి కష్టాలు పడుతున్నారో కదా అని బోల్డు బాధ పడుతుండేవాళ్ళం. విలన్ల పన్నాగాలు హీరోలు ఎక్కడ తెలుసుకోలేరోనని ఆందోళన చెందేవాళ్ళం. కత్తియుద్ధంలో రాజనాల రామారావుని ఎక్కడ లోయలోకి తోసేస్తాడోనని భయపడేవాళ్ళం. రామారావు రాజనాలని ఓడించంగాన్లే ఆనందంతో చప్పట్లు కొట్టేవాళ్ళం.

కాలచక్రం గిర్రున (ఎందుకో అనాదిగా ఈ కాలచక్రం 'గిర్రు'మనే తిరుగుతుంటుంది) తిరిగింది. నేను పెద్దవాడనైనాను. సినిమా చూసి చాలా యేళ్ళయింది. ఇప్పుడు నాకు సినిమా ఎట్లా తీస్తారో తెలుసు. అంచేత అందులో మజా పోయింది. సినీఅభిమానులు ఫొటోగ్రఫీ బాలేదనీ, సంగీతం బాగుందని ఏంటేంటో మాట్లాడుతుంటారు. నాకెందుకే ఇట్లాంటి సంభాషణ రుచించదు.

పాండవవనవాసంలో రామారావు ఆవేశంగా ఊగిపోతూ తొడగొట్టి పాడిన 'ధారుణి రాజ్యసంపద.. ' రామారావు పాళ్లేదనీ, వెనుకనుండి ఘంటసాల పాడాడనీ నాకు తెలీదు. నాకా పద్యం ఎందుకంత ఇష్టమో "ధారుణి రాజ్యసంపద.. ! (బీడీలబాబు కథ)" అనే  టపాలో రాశాను. ఇప్పటితరం పిల్లలు మా అంత అమాయకులుగా ఉన్నారో లేదో తెలీదు (సినిమా ఎంజాయ్ చెయ్యడానికి కొంత అమాయకత్వం అవసరం).

నేను అప్పుడప్పుడు నా అభిమాన నటులంటూ వెనకటి తరం నటుల గూర్చి రాస్తుంటాను. వాళ్ళు గొప్పనటులని మెచ్చుకుంటూ ఉంటాను. నా రామారావు అభిమానంతో "బిరియానీయేనా? కాదు.. కాదు.. పులిహోరే.. !" అంటూ ఒక టపా కూడా రాశాను. ఎన్టీరామారావుకి సాధ్యం కానిదేది లేదని బలంగా నమ్మినవాణ్ని. ఎన్టీఆర్ నా మనసులో ఒక భాగం. అమ్మానాన్నల్లగా ఈ బంధం కూడా ఒక emotional bonding.

ఎన్టీరామారావు సినిమాలు చూసినప్పటి నా మానసికస్థితి వేరు. అప్పుడు నాకు రామారావు ఇచ్చిన మజా.. ఈరోజుల్లో పిల్లలకి మహేశ్ బాబు వంటి పాపులర్ హీరోలు ఇస్తున్నారని నా నమ్మకం. వయసురీత్యా ఒక సినిమా చూసి ఆనందించే స్థితి నేను ఎప్పుడో దాటిపొయ్యాను (ఈ స్థితి నాకేమీ సంతోషకరంగా లేదు).

సినిమా నటుల తరం మారినట్లే ప్రేక్షకులతరం కూడా మారుతుంది. ఏ తరంవారికి ఆతరం సినిమాలు నచ్చుతాయి. ఒకవయసు దాకా మన జీవితాల్లో సినిమా అనేది చాలా ముఖ్యమైనది. అటుతరవాత జీవితంలో సినిమా ప్రాముఖ్యత తగ్గడం మొదలై.. కొంతకాలానికి సినిమా అనే పదమే కనుమరుగైపొతుంది.

అందుకే వయసుడిగినవారు సినిమా ప్రసక్తి వచ్చినప్పుడల్లా తమ చిన్నప్పటి హీరోల్నే ప్రస్తావిస్తుంటారు. అసలు విషయం.. వాళ్ళు సినిమాలు చూడ్డం ఎప్పుడో మానేశారు. ఒకరకంగా ఇదో fixation. ఏసీ హోటళ్ళలకి అలవాటు పడ్డ ఈతరం కుర్రాళ్ళకి మా ఆనందభవన్ నచ్చదు. అట్లాగే మా సినిమాలూ నచ్చావు. మేం కూడా vice versa.

అమ్మాయ్య! ఇప్పుడు నాకు 'సినిమాలు చిన్నప్పుడే ఎందుకు బాగుంటయ్?' అన్న ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. మీక్కూడా వచ్చేసుంటుంది (కష్టపడి ఇక్కడదాకా రాసుకుంటూ వచ్చాను. కాబట్టి మీ తరఫున కూడా నేనే చెప్పేస్తున్నా).

ముగింపు -

గత కొంతకాలంగా నా పిల్లలకి ఏదైనా పాతసినిమా చూపిద్దామని (కనీసం గుండమ్మకథ) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాను. నావల్ల కావట్లేదు. వారిని బలవంతం చేస్తుంటే.. 'సావిత్రేంటి ఇంతలావుగా ఉంది? రామారావెందుకలా నిక్కరేసుకున్నాడు?' లాంటి చెత్తప్రశ్నలతో నాపై ఎదురుదాడి చేస్తున్నారు. వళ్ళు మండిపోతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చన్నీళ్ళ స్నానం చెయ్యడం మించి నే చెయ్యగలిగిందేమీ లేదు.

(ఏవిటో! 'సినిమాలు చిన్నప్పుడే బాగుంటయ్' అనే నా థియరీ కరెక్టనే సంతోషం ఒకవైపు.. నా హీరో ఎన్టీరామారావుని నా పిల్లలకే చూపించలేకపోతున్నాననే దుఃఖం మరోవైపు.. ఎలా రియాక్టవ్వాలో తేల్చుకోలేకున్నాను.)

(photos courtesy : Google)