Showing posts with label క్షౌరశాల. Show all posts
Showing posts with label క్షౌరశాల. Show all posts

Friday, 30 December 2011

ఈ ప్రపంచమే ఓ క్షౌరశాల

గంగిగోవు పాలు గరిటెడైననూ చాలు, ఆ గరిటెడు జుట్టు పెరుగుట చేత ఓ క్షౌరశాలలో అడుగెట్టాను. ఈ క్షౌరశాలల్లోకి అడుగెట్టాలంటే నాకు సిగ్గు, బిడియం. పూలమ్మిన చోటనే కట్టెలమ్మడం ఎవరికయినా తలవంపులే గదా! అందుకు నన్ను నేనే నిందించుకోవాలి.

అనగనగా నాకు ఒత్తుగా జుట్టున్నరోజుల్లో - మాఇంటి దగ్గర్లో ఒక బ్యాంక్ ఉద్యోగస్తుడొకాయన వుండేవాడు. పేరు శాస్త్రి, వయసు నలభైకి అటూఇటుగా. మన్‌మోహన్ దేశాయ్ సిన్మాల్లో తప్పిపోయిన సోదరుల్లా - అత్యంత కాకతాళీయంగా మేమిద్దరం తరచూ క్షౌరశాలలో తారసపడుతుండేవాళ్ళం.

శాస్త్రిది దాదాపు పూర్తి బట్టతల. అతగాడి తల - ఇత్తడి చెంబుపై చిత్తడి మొక్కలు మొలిచినట్లు అక్కడో వెంట్రుకా, ఇక్కడో వెంట్రుకగా వుండేది! క్షవరం చేయించుకున్నంతసేపూ, క్షురకునికి ఏవో జాగ్రత్తలు చెప్తుండేవాడు. ఆపై - చెప్పినట్లు చెయ్యట్లేదని ఒకటే సణుగుతుండేవాడు. 'నీ నాలుగు వెంట్రుకలకి అన్ని జాగ్రత్తలవసరమా? అసలు నీకిక్కడేం పని!' అన్నట్లు విచిత్రంగా, ఆశ్చర్యంగా, ప్రశ్నార్ధకంగా, చికాగ్గా అతన్ని చూస్తుండేవాణ్ని. నా చూపు శాస్త్రిని బాగా ఇబ్బంది పెట్టుండాలి. అందుకే అటు తరవాత నేనెప్పుడైనా కనిపించగాన్లే - ఏదో పనున్నట్లు హడావుడిగా వెళ్లిపొయ్యేవాడు.

కాలం కౄరమైనది, విధి విచిత్రమైనది, చెరపకురా చెడేవు. ఈ జీవిత సత్యాలు నాకు అర్ధమయ్యే సమయానికి నా తలక్కూడా శాస్త్రి స్థితొచ్చేసింది! అసలు మానవదేహమే అశాశ్వతము గదా! మళ్ళీ ఈ అశాశ్వత దేహానికి అంతకన్నా అశాశ్వతమైన ఈ జుట్టెందుకు? ఈ బట్టతల ఒక్క మానవ మగాళ్ళకేనా? దేవుడు మాగాళ్ళకుండదా? ఏమో! దేవుళ్ళకి మాత్రం బట్టతల్లేదని ఎలా తెలుస్తుంది? వాళ్ళెప్పుడైనా కిరీటాలు తీస్తేగదా!

సరే! మళ్ళీ విషయానికొస్తాను. పట్టపగలయితే కుర్రవెధవల వాడి చూపుల తాకిడి (ఈ చూపులకున్న నానార్ధాలు, పవర్ నాకు బాగా తెలుసు) తక్కువుంటుందని, మధ్యాహ్న సమయాల్లో - 'కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్!' అని పాడుకుంటూ చాటుమాటుగా నా క్షవర కార్యక్రమాలు కానించేస్తున్నాను.

తలపై కత్తిరించు ప్రదేశము తక్కువ కావున కత్తెరకి పని తక్కువ. కాబట్టి డబ్బులు కూడా తక్కువేమో అనుకున్నాను, కానీ కాదుట! నెత్తిమీద జుట్టుతో నిమిత్తం లేకుండా క్షవరానికింత అని స్టాండర్డ్ రేటు వుంటుంది. వాస్తవంగా జుట్టు ఎంత తక్కువుంటే, సొమ్ములు అంత ఎక్కువ వసూలు చెయ్యడం న్యాయమని మా క్షురకుని అభిప్రాయం! ఎందుకంటే - వున్న కొద్ది వెంట్రుకల్నీ అత్యంత ఏకాగ్రతతో, నిపుణతతో సర్దుబాటు చెయ్యాలి కదా!

ఈ సత్యం తెలిసుకున్న నాకు - అలనాడు శాస్త్రి క్షురకునికి అన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్పేవాడో, అంతలా ఎందుకు సణిగేవాడో అర్ధమయ్యింది. 'సారీ శాస్త్రి! క్షౌరశాలలో నా క్షుద్రదృక్కులతో నిన్ను క్షోభపెట్టితిని. అందువల్లనే నాకూ కేశక్షయము సంప్రాప్తించింది. క్షంతవ్యుడను, క్షమాహృదయంతో నన్ను క్షమింపుము.'
                     
నాకు క్షవరం చేయించుకోవటం భలే ఇష్టం! ఒక చేతిలోని దువ్వెనతో దువ్వుతూ, రెండోచేతిలోని కత్తెరని లయబద్దంగా ఆడిస్తూ, కొంచెం కొంచెం జుట్టు కత్తిరిస్తూ - నాకు ప్రతి క్షురకునిలోనూ ఒక అమరశిల్పి జక్కన కనిపిస్తాడు, ప్రతి కత్తెర శబ్దంలోనూ ఒక ఇళయరాజా వినిపిస్తాడు.

క్షురక వృత్తి ప్రత్యేకమైనది. ఎంతటి మారాజునయినా తలదింపే శక్తి ఈ వృత్తికుంది. పైగా వారిచేతిలో కత్తెరా, కత్తీ ఉంటాయి. అందువల్ల అందరూ భయభక్తులతో తల దించుకోవాలి. 'ఎవరికీ తల వంచకు' అంటూ ఘంటసాల స్టోన్లో గర్జించిన ఎన్టీవోడిక్కూడా క్షురకుని ముందు తలవొంపులు తప్పవు గదా!

'తల'కి మాసిన మానవాధములకు తైలసంస్కారాన్ని ప్రసాదించే ఈ వృత్తి ఎంతటి పవిత్రమైనది! క్షవరము అనగా జుట్టు కత్తిరించుట. పైకమునకు జుట్టు కత్తిరించుట క్షౌరవృత్తి. కానీ - జుట్టు కత్తిరించకనే క్షవరము చేయు వృత్తులు అనేకం. 

'జుట్టు కత్తిరించకుండా క్షవరమా! కొన్ని ఉదాహరణలిమ్ము.' 
           
డాక్టర్లు లేని రోగములకు ఇన్వస్టిగేషన్లు, ప్రొసీజర్ల పేరున క్షౌరము చేయుదురు. కొందరు అత్యాశపరులైన డాక్టరుబాబులైతే ఏకంగా గుండే గీసేస్తారు. ఆపై ఆ గుండే గీయకపోతే నువ్వు చచ్చేవాడివని దబాయిస్తారు. క్షమించాలి! నాక్కూడా ఒక క్షౌరశాల వున్న కారణాన - వ్యాపార రహస్యాల్ని ఇక్కడ ఇంతకన్నా బయటపెట్టలేను, ప్రొఫెషనల్ ఎథిక్స్!
               
రాజకీయ నాయకులు 'ప్రజాసేవ' అనే క్షవరం చేస్తారు. ఈ క్షురకర్మని నిర్వర్తించుటలో - 'స్కీములు, స్కాములు' అంటూ ఒక్కొక్కరిది ఒక్కో పధ్ధతి. గవర్నమెంటు ఉద్యోగులు 'అమ్యామ్య' పేరుతో క్షవరం చేస్తారు. వీరి క్షౌరశాల తిరుమలలోని కళ్యాణకట్ట కన్నా పెద్దదిగా యుండునని అభిజ్ఞువర్గాల భోగట్టా. వీరి లీలలు అనంతం. ఈ క్షురకాగ్రేశర చక్రవర్తుల చరిత్ర రాసుకొంటూ పోతే మన సమయం క్షవరం అవుతుంది!
           
మిత్రులారా, ఈ ప్రపంచమే ఓ పెద్ద క్షౌరశాల. అందు మనమందరమూ క్షురకులమే! ఇచ్చట నిరంతరముగా, అత్యంత లాఘవముగా 365 రోజులూ క్షౌరశాలలు నిర్వహించబడును. క్షురకర్మలు చేయబడును. ఇది కలియుగ ధర్మము! క్షవరం చెయ్యడం మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఆ తరవాత అలవాటైపోతుంది. 'సాధనమున సమకూరు ధరలోన' అన్నారు పెద్దలు. అయినా - 'క్షవరం చేయుటకు నీవెవ్వరు? చేయుంచుకొనుటకు వాడెవ్వడు? అంతా నేనే!' అని గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు (రిఫరెన్స్ అడగొద్దు)! 

ప్రపంచం విశాలమైందే కాదు, మోసాలపుట్ట కూడా! ప్రతిక్షణం ఒకళ్ళనొకళ్ళని క్షవరం చేసుకుంటూ జీవించడం మానవ నైజం. ఎటువంటి అన్యాయం చెయ్యకుండా ఫిక్సెడ్ ధరలకి క్షవరం చేస్తున్న క్షురకులకి అభినందనలు. మీరే లేకుంటే జుట్టు పెరిగిపొయ్యి దురదలు పుట్టి గోక్కోలేక చాలామంది చచ్చేవాళ్ళు. థాంక్స్ వన్సెగైన్!