Showing posts with label రావిశాస్త్రి కథ. Show all posts
Showing posts with label రావిశాస్త్రి కథ. Show all posts

Monday, 13 May 2013

రావిశాస్త్రి కథ 'తలుపు గొళ్లెం'.. కొన్ని ఆలోచనలు


ఇది ఒక పైడిరాజు కథ. అప్పుడే పుట్టిన (ఒక గంట వయసులో) పైడ్రాజు మురిక్కాలవ పక్కన ఓ ముష్టి దంపతులకి దొరుకుతాడు. పైడ్రాజు రాకతో ముష్టి దంపతులకి 'రాజయోగం' పట్టింది. వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడే ముష్టి. వీరి ముష్టి భోగానికి కన్నుకుట్టిన ఇంకో ముష్టి జంట నాలుగేళ్ల పైడ్రాజుని దొంగిలిస్తారు.

అయితే ఈ రెండో ముష్టి జంట ప్రధానవృత్తి దొంగతనం. పైడ్రాజు కొత్త తలిదండ్రులు వీధుల్లో అడుక్కుంటూనే దొంగతనాలు చేస్తుంటారు. వీరి మోడస్ ఒపరాండి ఏమనగా.. ఒక వీధిలో 'అమ్మా! లచ్చిం తల్లి, బిచ్చవమ్మా' అంటూ కొడుకుతో తల్లి యాచిస్తుండగా.. తండ్రి వారికి రెండిళ్ళ ముందుగా నడుస్తూ.. తాళం వేసున్న ఇళ్ళ తలుపుల గొళ్లెం క్షణంలో తీసేసి.. అడుక్కుంటూనే ముందుకెళ్తాడు.

"గదిలో కెల్లి గిన్నెలొట్టుకురా!" అని తల్లి పైడ్రాజుని లోపలకి పంపి అడుక్కుంటున్నట్లు బయట కాపలా ఉంటుంది. గిన్నెలు తీసుకొచ్చి తల్లి జోలెలో వేసేవాడు పైడ్రాజు. ఆ విధంగా ముష్టి ముసుగులో దొంగతనాలు చేస్తూ హాయిగా జీవించసాగారు. అందుకే ఎక్కడైనా 'తలుపు గొళ్లెం' చూస్తే పైడ్రాజు కి వళ్ళంతా పులకరింపుల్తో నిండిపొయ్యేది.

ఒకసారి జోలెలో చెంబులతో 'దొంగ' తల్లి పట్టుబడుతుంది. మనిషి కష్టాన్ని దోచుకునే దొంగని ఒక వెర్రి కుక్కని కొట్టినట్లు వాళ్ళంతా తన తల్లిని కళ్ళముందు కొడుతుంటే అతను గజగజ లాడేడు. చిల్లరపాముని వాకిట్లో నిర్దయగా మనుషులు కొడుతుంటే, వాకిట కాలవ కన్నం లోంచి పిల్లల తాచు ఆ దృశ్యం చూసినట్లు, అతను జనాన్ని అతిభయంతోనూ పరమ దుర్మార్గంగానూ చూసేడు. ఆ దెబ్బలకి ఆ మర్నాడు ఆ దొంగ తల్లి ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది.

అటు తరవాత నేలమీద ఇళ్ళ బేరం కంటే నీటి మీద ఓడల బేరం ఎక్కువ లాభసాటిగా ఉందని అనుభవం మీద తెలుసుకుని, ఊర్లోంచి హార్బర్లోకి పైడ్రాజు తన సాహస రంగాన్ని మార్చేడు. దొంగతనం చెయ్యడం పైడ్రాజు డ్యూటీ. దొంగసొత్తుని డబ్బుగా మార్చడం దొంగతండ్రి డ్యూటీ.

ఒకసారి హార్బర్లో కొత్త ఓడొకటి వచ్చింది. దాని కడుపు నిండా ఇంగ్లీషు మందులే. పినిసిలిన్ గొట్టాల పాకేజీ పెట్టెల్ని కొట్టుకొస్తాడు పైడ్రాజు. వాటిని ఆప్యాయంగా బిడ్డల్లా కావిలించుకుని,

"చావుకారు కాడికి ఒట్టుకెల్దాం, రా" అన్నాడు దొంగ తండ్రి.

"ఏ చావుకారు?" అని ప్రశ్నించాడు దొంగకొడుకు.


"మందుల్చావుకారు, ఈ మందుల బేరాలన్నీ ఆడియే!"


'చావుకారు' తో బేరం కుదిరి.. కొత్త కన్నెపిల్లలా కరకరలాడిపొతున్న పది పదుల్ని జోబులో వేసుకుని కులాసాగా ఇంటికెళ్ళిపోయారు తండ్రీకొడుకు.

దొంగ తండ్రికి చాల్రోజులుగా దాంపత్య సుఖం లేని కారణాన.. సంచుల సూరిగాడి కంపెనీలో పాతిక ఖర్చు చేసి అమర సౌఖ్యం అనుభవించీసేడు. తద్వారా పోలీసువారి దృష్టిలో పడి.. ఆర్నెల్లు జైలు చేస్తాడు.

జైల్ల్లోంచి బయటకొచ్చాక 'చావుకారు'ని కలిసి.. సంగతి బయట పెడతానని అతన్ని బెదిరిస్తాడు. షావుకారు భార్య భారీ మెరుపు తీగ. షావుకారు మంచి సరసుడైతే ఆవిడ మంచి సరసురాలు. అతను వేరేగా సరసుడు. ఆమె వేరేవేరేగా సరసురాలు. ఒకరి యెడల ఒకరికి ఉండే కోపాలకే గాని రూపాలొస్తే అవి పులులుగా మారి ఒకదాని మీదొకటి విరుచుకుపడి దెబ్బలాడతాయి. ఆ రోజు షావుకారు ఖూనీ చెయ్యబడతాడు. ఆ కేసులో దొంగ తండ్రి ఇరుక్కుంటాడు.

కోర్టు హాల్లోకి వెళ్ళడం, కోర్టు వ్యవహారం దగ్గర్నుండి చూడ్డం అదే ప్రధమం పైడిరాజుకి.

"ఏటీ ఈ ఓసన?" అనుకున్నాడు.


అది కోర్టు వాసనని అతనికి తెలీదు.


"మద్దినాలపేళ దీపాలెట్టుకున్నారేటి?" అనుకున్నాడు.


ఆ గదులు కట్టినప్పుడే చీకటిగా కడతారని అతనికి తెలీదు.


"ఆలీబాబా చినీమాల్లో దొంగల్లా ఇంతమందున్నారు! ఈళ్ళెవుళ్ళు?" అని ప్రశ్నించుకున్నాడు.


"ఓహో! ఈళ్ళే కావోలు పీడర్లు!" అని సమాధానం చెప్పుకున్నాడు.


జడ్జీ పైడ్రాజు సాక్ష్యం నమ్మడు. జడ్జీగారు చాలా విట్టీగానూ, విపులంగానూ రాసిన జడ్జిమెంటు కొనావరకు అలా మెరుపుతీగలా సాగి, ఆఖర్న దొంగతండ్రికి ఉరిశిక్ష విధిస్తూ భగ్గున ముగిసింది.

పుట్టగానే ఏడ్చేడు. వాతలు వేసిన్నాడు ఏడ్చేడు. తల్లిని కొట్టిననాడు ఆమె చనిపోయిననాడూ ఏడ్చేడు. ఆ తీర్పు రోజున ఏడ్చేడు. ఆ తండ్రిని ఉరితీసిన రోజున ఏడ్చేడు - మరింక జీవితంలో ఏడవకూడదని భీకరంగా నిశ్చయించుకున్నాడు పైడ్రాజు.

అప్పుడు పైడ్రాజు దీర్ఘంగా ఆలోచిస్తాడు. పెద్దల్లా దోచుకుతినడం బెస్టు అన్న నిశ్చయానికి అతను రావడానికి అట్టేసేపు పట్టలేదు.

దోచుకు తినడం బెస్టు!!..

అనేటటువంటి పరమ ఘోరమైన నిశ్చయానికి ఏ మానవుడైనా వచ్చి సాహసంతో రంగంలోకి ఉరికి, మెలకువతో వ్యవహరించి పట్టుదలతో పనిచేస్తే!! - వాణ్ణి మరింక ఆపడం చాలా కష్టం. వాడు చాలా దూరం వెళ్తాడు, చాలా పైకి వెళ్తాడు. పాపభీతి, దైవభీతి, సంఘభీతి, ఏ భీతీ ఉండదు వాడికి. వాడు పెద్దపులిలా ఉంటూనే పరమ ధర్మరాజులా కనిపించగలడు. తన బాగు కోసం వాడు తల్లి గొంతు నొక్కగలడు, తండ్రి వెన్ను పొడవగలడు, తమ్ముడి నెత్తురు తాగ్గలడు. లొంగిన వాళ్ళని వాడు అణుస్తాడు, లొంగని వాళ్ళలో కలుస్తాడు. అవసరం తీరిపోయాక నివురంతా కప్పేసుకుంటాడు. దైవం, ధర్మం, అర్ధం, కామం, సంఘం, స్వర్గం అన్నీ తనకోసమే ఉన్నాయి కాని తనెవరికోసమూ ఉండనంటాడు. చెదలా తినేస్తాడు. పులిలా విరుచుకుపడతాడు. దేశాన్ని అమ్ముతాడు, ధర్మాన్ని చంపుతాడు. వాడు చాలా దూరం వెళ్తాడు.

పైడ్రాజు ఆ తరవాత చాలా మెట్లు పైకెక్కి చాలా దూరం వెళ్ళేడు. బ్యాంక్ లొంచి బయటకొచ్చిన ఒక వృద్ధుణ్ణి హత్య చేశాడు. బంగారం కాజెయ్యడం కోసం ఒక మేస్త్రమ్మని చేరదీశాడు. అవసరం తీరాక ఆమెని తన్ని తగలేశాడు. రిక్షా తొక్కిన పైడ్రాజు టీ కొట్టు, ఆపై ఓటేలు, ఒక ఫేక్టరీ, ఆపై చిన్న కాంట్రాక్టరు.. క్రమేణా అత్యంత ధనవంతుడు ఐపోయ్యాడు.

పైడ్రాజు ఇప్పుడెక్కడున్నాడు?

చాలా దూరంలో ఉన్నాడు.


ఆపై పైడ్రాజు భార్య, కొడుకు గురించి కొంత ప్రస్తావించి కథ ముగుస్తుంది.

(ఎర్రరంగు అక్షరాలు రావిశాస్త్రివి)

1965 లో రాయబడ్డ ఈ కథని మొదటిసారిగా ముప్పైయ్యేళ్ళ క్రితం 'ఋక్కులు' సంకలనంలో చదివాను. ఇప్పటిదాకా మొత్తం ఓ నాలుగైదుసార్లు చదివుంటాను. రావిశాస్త్రిని ఇలా మళ్ళీమళ్ళీ చదవడానికి నాకో కారణం ఉంది. నాకు ఉత్తరాంధ్ర మాండలికం సరీగ్గా అర్ధం కాదు. పైపెచ్చు రావిశాస్త్రి శైలి పదాలని కలిపేస్తూ గమ్మత్తుగా ఉంటుంది. అందుకే నేను రావిశాస్త్రిని మార్కర్ తో అండర్ లైన్ చేస్తూ.. మార్జిన్లో అర్ధాలు రాసుకుంటూ.. ఒక టెక్స్ట్ బుక్ చదివినట్లు శ్రద్ధగా చదువుతాను.


బాలగోపాల్ సాహిత్య వ్యాసాల సంపుటి 'రూపం - సారం' గూర్చి ఇంతకు ముందో టపా రాశాను. ఈ సంపుటిలో 'రావిశాస్త్రి రచనల్లో రాజ్యాంగ యంత్రం' అని ఒక వ్యాసం ఉంది. నాకు తెలిసి రావిశాస్త్రిని ఇంత ప్రతిభావంతంగా విశ్లేషించిన వ్యాసం మరొకటి లేదు. "తలుపు గొళ్లంలో కోర్టు వర్ణన చాలా అద్భుతమైనది." అంటూ తన వ్యాసంలో ఈ కథని ప్రస్తావించాడు బాలగోపాల్. చాలామంది విమర్శకుల అభిప్రాయమూ ఇదే.

ఈ కథలో కోర్టుని వర్ణిస్తూ దాదాపు రెండు పేజీలు రాశాడు రావిశాస్త్రి. ప్రతి వాక్యమూ అపురూపమే (కోర్టు వర్ణన టపాకి అనుబంధంగా చివర్లో ఇచ్చాను). తెలుగు భాషలో మరి ఏ ఇతర రచయిత ఇంత అద్భుతంగా ఒక్క వాక్యం కూడా రాయలేడని నా విశ్వాసం. దటీజ్ 'చాత్రిబాబు'! చదివినప్పుడల్లా గొప్ప 'కిక్' వస్తుంది!

ఈ దేశంలో కఠిన చట్టాలు ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని వాదించేవారు ఈ కథ చదివి తీరాలి. ఈ సమాజంలో అన్యాయం ఎంతగా వ్యవస్థీకృతమై ఉందో రావిశాస్త్రి చాలా నిశితంగా చెబుతాడు. మంచి డాక్టర్ రోగాన్ని అసహ్యించుకోడు. రోగ కారణం గూర్చి ఆలోచిస్తాడు. అప్పుడే అతనికి రోగ నివారణ ఎలాగో తెలుస్తుంది. మంచి రచయిత కూడా అంతే.

రావిశాస్త్రి రచనల్లో రాజ్యాంగ యంత్రం గూర్చి వివరిస్తూ బాలగోపాల్ ఇంకా ఇలా అంటాడు.

'రాజ్యాన్ని గురించీ రాజ్యాంగ యంత్రాన్ని గురించీ వకీళ్ళకి అర్ధమైనంతగా మరెవ్వరికీ కాదేమో! నేరానికీ రాజ్యాంగ యంత్రానికీ మధ్యనున్న సంక్లిష్టమైన పరస్పరత రెండురకాల అమాయకులకి అర్ధం కాదు. అమాయకులైన అమాయకులు (వీళ్ళు మొదటిరకం) నేరాన్ని అరికట్టడం, నిరోధించడం రాజ్యాంగ యంత్రం పని అనుకుంటారు. ఈ కోవకు చెందినవాళ్ళు బడిపంతుళ్ళు, కుర్ర ఐ.ఎ.ఎస్ ఆఫీసర్లు. రెండవ రకంది దుస్సాహసిక అమాకత్వం. రాజ్యాంగ యంత్రం నేరాన్నసలు అరికట్టనే అరికట్టదని, నేరం మీద బలవడమే ప్రభుత్వ 'కార్యనిర్వాహకుల' పని అనీ అనుకుంటుంది. ఈ కోవకి చెందినవాళ్ళు సాధారణంగా కవిత్వం రాస్తారు.'

బాలగోపాల్ రావిశాస్త్రి పరిమితుల గూర్చి కూడా వివరంగా రాశాడు. లంపెన్ వర్గాల జీవితాన్ని ఎంత వాస్తవికంగా చిత్రించినా అది కేవలం వాస్తవిక దృక్పధంగా మాత్రమే మిగిలి పోతుందంటాడు బాలగోపాల్. ఆ రకంగా అంచనా వేసినా.. రావిశాస్త్రి ఎమిలీ జోలా, మొపాసా, చెహోవ్, దోస్తోవస్కీల సరసన ఒక బంగారు పీట వేసి కూర్చోపెట్టేంత గొప్ప రచయిత అని గట్టిగా నమ్ముతున్నాను.

చివరి తోక..

ఈ మధ్య టపాలు రాసే ఉత్సాహం తగ్గిపోయింది. ఇక నా బ్లాగ్జీవితం చరమదశలోకొచ్చిందనే అనుకుంటున్నాను. అయితే మొన్నో పీడకలొచ్చింది. తెలుగు సాహిత్యంలో 'గీకుడురాళ్ళు' రాసిన  ప్రముఖ రచయితకి తరవాత రావిశాస్త్రికి అదేదో ఒక పీట (ఇది కూర్చునే పీట కాదు) వచ్చిందిట.

ఆ సందర్భంగా ఓ ప్రముఖ కళాబంధువు.. నిలువెత్తు రావిశాస్త్రి బొమ్మకి సన్మానం చేయుచుండగా.. 'పాడుతా తీయగా' అనే ఓ ప్రముఖ గాయకుడు రావిశాస్త్రి గూర్చి శంకరాభరణం స్టైల్లో పాడుచుండగా.. వందేళ్ళ తెలుగు కథల వందనాలయ్య రావిశాస్త్రి గూర్చి తనకి మాత్రమే సొంతమైన భయానక బీభత్స వాగ్దాటితో కీర్తించుచుండెను.

ఆ దృశ్యము గాంచి.. భీతి చెందాను, వణికిపొయ్యాను, తల్లడిల్లిపొయ్యాను, దుఃఖించాను. ఫినాయిల్ తో నోరు పుక్కిలించినట్లుగా, గజ్జికుక్క చెక్కిలి నిమిరినట్లుగా, చెవిలో పిశాచాలు పాళీ భాషలో పాట పాడుతూ.. మెదడు పీక్కు తింటున్నట్లుగా అనిపించింది.

ఒక్కసారిగా మెళకువొచ్చింది. మనసంతా దిగులుగా అనిపించసాగింది. తెల్లవారు ఝాము కలలు నిజమవుతాయంటారు. ఏమో! గురజాడ, శ్రీశ్రీలకి లేని రక్షణ రావిశాస్త్రికి ఎక్కణ్నుంచి వస్తుంది? నా పీడకలకి విరుగుడుగా ఏదైనా ఓ రావిశాస్త్రి కథపై టపా రాసి ప్రక్షాళన చేద్దామనిపించింది. ఆ ఫలితమే ఈ పోస్ట్.

అనుబంధం (కొర్టు వర్ణన) :

ఏ దేశంలోనైనాసరే ఎక్కడైనాసరే ఏ ఖుషీ కుర్చీల్లో ఎంత గంభీరంగా ఉండ ప్రయత్నించినాసరే నునుమెత్తని పులుల్లా ఉంటారు. అందమైన తోడేళ్ళలా ఉంటారు. లేదా దుక్కబలిసిన గుంటనక్కల్లా ఉంటారే తప్ప జడ్జీలెవరూ దయగల మనుషుల్లా ఉండరు (అనిన్నీ);

ఏ దేశంలో ఎక్కడికి వెళ్లి చూసినాసరే, సరసరలాడే తాచులాగో పడగెత్తిన నాగులాగో లేక తోక మీద నిలబడి నడిచే జెర్రిపోతులాగో ఉంటాడే తప్ప ఏ ప్లీడరూ కూడా మనిషిలా మాత్రం ఉండడు.. ఛస్తే ఉండడు (అనిన్నీ);

ఏ దేశంలో ఏ మారుమూల ఏ కోర్టుకి వెళ్లి చూసినప్పటికీ అక్కడ కనిపించే పోలీసులూ బంట్రోతులూ గుమాస్తాలూ అంతా కూడా పీడించడానికి యముడు పంపిన స్పెషల్ టైపు పిశాచాల్లా ఉంటారే తప్ప మనుష్యుల్లా కనిపించరు, మనుషుల్లా ప్రవర్తించరు (అనిన్నీ);

ఏ దేశంలోనైనాసరే ఎంత ఉన్నత న్యాయస్థానమైనాసరే దాని ఆవరణలో ఎంత మంచి పూలమొక్కలు పెంచినా వాటికి విషపుష్పాలు తప్ప వేరేమీ వికసించవు (అనిన్నీ);

అక్కడ ఎంత మంచి చెట్టు ఎంత బాగా ఎదిగినప్పటికీ ఆకొక నాలికగా గల వింత రాక్షసిలా ఉంటుంది తప్ప చల్లని చెట్టులా ఉండదు (అనిన్నీ);

అక్కడ ఏ పచ్చని తీగె సాగినా అది పసిరికపాములా ఉంటుందే తప్ప నును లేత పూతీగెలా ఉండదు (అనిన్నీ);

అక్కడ పచ్చటి పచ్చిక పరిస్తే అది పచ్చటి నివురుగప్పిన నిప్పుల తివాచీలా ఉంటుందే తప్ప మరో విధం గా ఉండదు (అనిన్నీ);

అక్కడ మానస సరోవరంలాంటి మంచినీటి చెరువు తవ్వితే అది అభాగ్యుల్ని మింగేసే ముసలి మొసలి గొయ్యిగా కుంచించుకుపోతుందే తప్ప చెరువుగా నిలవదు (అనిన్నీ);

అన్నెంపున్నెమెరుగని అమాయకపు చిలకల్ని అక్కడికి తెచ్చి పెంచితే అవి అక్కడ గెద్దలుగా ఎదుగుతాయి, చిలకలనే చంపుతాయి (అనిన్నీ);

అక్కడ తెల్లని మల్లెపూల మనసులు నాటితే అవి బ్రహ్మజెముడుడొంకలు గా ముళ్ళుముళ్ళుగా చావుచీకటిగా పెరుగుతాయి (అనిన్నీ);

నాలికలతో నిజం తప్ప వేరేదీ ముట్టని వారికి అక్కడికి వచ్చీ రాగానే వెయ్యి విషజిహ్వలొస్తాయి (అనిన్నీ);

అక్కడ చల్లటి నీడ ఉన్నప్పటికీ అది ఎండని మింగిన కొండచిలవలా ఉంటుందే తప్ప, తాపమార్చి ప్రాణమిచ్చే నీడలా ఉండదు (అనిన్నీ);

అక్కడ ఎండ ఉన్నప్పటికీ అది నీడని చంపి నిప్పులు చిమ్మే రక్కసి డేగలా పెనురెక్కల విసురులా ఉంటుందే తప్ప, దివాకరుని దివ్యాతి దివ్యమైన అనుగ్రహం లా ఉండదు (అనిన్నీ);

అక్కడ భగవంతుడు పుట్టించిన దేదీ భగవంతుడు పుట్టించినట్టుగా ఉండదు (అనిన్న్నీ);

అక్కడ దేముడే వెలిస్తే అతను ఠారున చచ్చి అక్కడ తప్పక దెయ్యమే అవుతాడు (అనిన్నీ);

ఏ దేశంలో ఏ కోర్టులో అయినా సరే తడిగుడ్డలు చల్లగా గొంతుకులు పిసుకుతాయి ప్రాణాలు తీస్తాయి తప్ప బాహాటంగా కత్తులు రాపాడవు గదలు ఢీకోవు (అనిన్నీ);

ఏ దేశంలో ఏ కోర్టులో ఎవరు నవ్వినప్పటికీ ఆ నవ్వు రాక్షస వృశ్చికాలు తోకలతో నవ్వినట్లుంటుందే కాని మానవత్వాన్ని సూచించే మనిషి నవ్వుగా సహజంగా నిర్మలంగా నిష్కల్మషంగా ఉండదు (అనిన్నీ);

ఏ దేశంలో ఏ కోర్టయినా సరే అది ఎంత చక్కగా ఎంత మంచి పాలరాతితో ఇంద్రభవనంలా స్వర్గహర్మ్యంగా మలిచినప్పటికీ అది వెన్వెంటనే గుండె లేని గోరీగా మారితీరుతుంది (అనిన్నీ);

ఆ కోర్టు ఎంత "కళ"గా ఉన్నప్పటికీ ఎప్పుడూ తొడతొక్కిడిగా శవాల హడావిడిగా ఉండే శ్మశానంలా ఉంటుందే తప్ప ఇంకో విధంగా ఉండదు (అనిన్నీ);

ఏడ్చే దౌర్భాగ్యులు తప్ప అక్కడ వేరెవరూ మనుషుల్లా ఉండరు (అనిన్నీ);

(photos courtesy : Google)

Tuesday, 21 August 2012

రావిశాస్త్రి 'పక్కింటి అబ్బాయి' - పరిచయం


నిరంజనరావుకి తండ్రి లేడు. భూమ్మీద పడగానే అతనికి అమ్మా, ఆకలి తప్ప మరేం దక్కలేదు. అందుకే పరిస్థితుల్ని జయించి పైస్థాయికి వెళ్ళాలనే కసి కూడా అప్పుడే కలిగింది. 

అతని మాటలు వేసవికాలంలో మల్లెపువ్వుల్లా మధురంగా ఉండవు. చలికాలంలో వానచినుకుల్లా చురుక్కుమంటాయి... నిశ్చలంగా ఉన్నప్పటికీ అతను ధ్యానంలో ఉన్న యోగిలా నిర్మలంగా కనిపించడు. సత్రంలో బైరాగిలా చవగ్గా కూడా కనిపించడు. పుట్టలో పాములా భయంకరంగా కనిపిస్తాడు.

నిరంజనరావుకి తనచుట్టూ ఉండే దారిద్ర్యపు వాతావరణం అన్నా, తనచుట్టూ ఉండే తనలాంటివారన్నా తెగ ద్వేషం ప్రబలింది... అంతా ఒకే జెయిల్లో ఉన్నప్పటికీ అమెరికాలో తెల్లఖైదీలు నల్లఖైదీలని చూసినట్లు సాటివారిని చూసి అసహ్యించుకోనారంభించాడు... జీవితంలో అమరసౌఖ్యాలున్నాయనీ, వాటిని "చదువు" ద్వారా సంపాదించుకోవచ్చని అతను గ్రహించాడు.

పోటీ పరీక్షకి ప్రిపేర్ అవ్వటం కోసం చేస్తున్న చిన్నఉద్యోగాన్ని వదులుకొని.. పట్నంలో ఒక గది అద్దెకి తీసుకుంటాడు. ఇంటి ఓనర్ పక్కగదిని దగ్గర్లోనే ఉన్న ధర్మాసుపత్రి వైద్యనిమిత్తం వచ్చేవారికి రోజువారి అద్దె పద్ధతిన ఇస్తుంటాడు. పరీక్షల కోసం నిరంజనుడు భీకరంగా చదువుతుండగా పక్కగదిలోకి ఒక పేదకుటుంబం అద్దెకొస్తుంది.

ఆ కుటుంబంలోని భర్తకి చర్మం, దంతం, ఎమిక, దగ్గు తప్ప అతన్లో ఇంకేమి ఉన్నట్లులేవు... ఆ ఆడమనిషి పుల్లలా ఉంది. ఆమె గుండెలు అర్చుకుపోయాయి. ఆమె ముఖం పీక్కుపోయింది. ఆమె కళ్ళు పిల్లిని చూసిన ఎలక కళ్ళల్లా లేవు! పులిని చూసిన లేడి కళ్ళల్లా వున్నాయి. ఆ లేడైనా అర్నెల్లనించీ ఏఆకూ, అలమూ దొరక్క ఉప్పునీళ్ళు తాగి బతుకుతున్న లేడన్నమాట... ఆవిడ పెద్దడాక్టర్ల ముందు నగ్నంగా నిల్చున్న జబ్బుమనిషిలా చాలా దీనంగా కనిపిస్తుంది. ఆ పిల్లవాడి ఏడుపు చాలా ఘోరంగానూ, భయంకరంగానూ ఉంది.

ఆ పిల్లవాడి ఏడుపు తన చదువుకి తీవ్రఆటంకంగా పరిణమిస్తుంది. భర్త ధర్మాసుపత్రిలో చేరతాడు. ఓ అర్ధరాత్రి ఆ పిల్లవాడికి ప్రాణం మీదకొస్తుంది. ఆ ఆడమనిషి నిరంజనరావుని ఆస్పత్రి దాకా తోడు రమ్మని దీనంగా అర్ధిస్తుంది. అప్పటికే చిర్రెత్తిపోయున్న నిరంజనం గావుకేకలు వేస్తాడు.

"పిలవను. రిక్షా పిలవను! రాను. ఆస్పత్రికి రాను. చెయ్యను. సహాయం చెయ్యను. మీకోసం నేను పూచికపుల్ల మొయ్యను. నా చూపుడువేలు చూపిస్తే చాలు మీరంతా బాధల బురదల్లోంచి బైటపడి బంగారులోకాల్లో విహరిస్తానంటే నేను చూపుడువేలు చూపించను! ఎందుకు చూపించాలి?" అంటూ తలుపులు ఫెడిల్మంటూ మూసేసుకున్నాడు.

తెల్లారి చూస్తే ఆ ఆడమనిషి గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కధని రావిశాస్త్రి తనకి అలవాటైన ధోరణిలో ఈ విధంగా ముగిస్తాడు.

"ఇదంతా జరిగి ఎన్నాళ్ళయిందండీ?"

"పదిహేనేళ్ళయింది సార్!"

"మరైతే - రంజనుడో నిరంజనుడో - అతనేం చేస్తున్నాడండీ ఇప్పుడు?"

"వాడిప్పుడు ప్రజలపై పన్నులు విధించే ప్రభుత్వ ప్రత్యేకశాఖలో ప్రధానోద్యోగిగా ఉంటున్నాడు సార్!"

తొలి ప్రచురణ - ఆంధ్రజ్యోతి వారపత్రిక (14 - 07 - 1967)

పుస్తక రూపం - బాకీ కధలు

జీవితంలో అమరసౌఖ్యాలని సంపాదించుకోవటానికి "చదువు" మార్గన్నెంచుకున్న నిరంజనరావుని.. చదువులు, పోటీపరీక్షలు ద్వారా ఉద్యోగాలు సంపాదించుకుని.. సమాజం పట్ల పూర్తి బాధ్యతారాహిత్యంగా ఉండే ప్రభుత్వోద్యోగులకి ప్రతీకగా తీసుకున్నాడు.

నిరంజనమంటే మనకి అసహ్యం కలిగేట్లు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా.. అనుమానం వచ్చిందేమో!.. వెంకట్రావనే చిన్ననాటి స్నేహితుడిని నిరంజనుడు ఎలా చంపేశాడో చెప్పి.. మనకి నిరంజనుడి పట్ల రోత కలిగేట్లు రాశాడు. బహుశా.. మంచికి చెడు చెయ్యరాదు. చెడుకు మంచి చెయ్యరాదనే తన రచనా పాలసీననుసరించి.. ఈ (అతి) జాగ్రత్త తీసుకునుంటాడు. 

చదువు లేనివాడు చదువుకున్నవాడిని ఎందుకు గౌరవిస్తాడు? చదువు జ్ణానాన్నిస్తుందని. సమసమాజ కాంక్షని పెంచుతుందని. కానీ.. కేవలం ఉన్నత స్థానాల కోసం, ఉద్యోగాల కోసం, డబ్బు సంపాదించుకునేందుకు 'చదువు' ఒక మార్గంగా ఎంచుకునేవారు సమాజానికి కీడే చేస్తారని ఈ కధలో రావిశాస్త్త్రి చెబుతాడు.

నేనీ కథని ఇరవైసార్లు చదివుంటాను. తన పాయింట్ ని కథారూపంలో మలచడానికి రావిశాస్త్రి  ఎంచుకున్న శైలి అనితర సాధ్యం. అందుకే ఎన్నిసార్లు చదివినా.. 'ఇంత గొప్పగా ఎలా రాశాడబ్బా!' అని ఆశ్చర్యపోతూ చదువుతుంటాను.

రావిశాస్త్రి ఈ కధ రాసి 45 సంవత్సరాలు నిండాయి. ఇప్పుడు నిరంజనుడి వారసులు ఉద్యోగాలేం ఖర్మ! అన్ని రంగాల్లో చెలరేగిపోతున్నారు. రోజురోజుకీ వీరి సంఖ్య పెరిగి పోతుందేమోనన్న భయాందోళనలు చెందవలసిన పరిస్థితులు ప్రస్తుతం మనకున్నాయి. 

(photos courtesy : Google)

Friday, 27 July 2012

రావిశాస్త్రి 'వేతనశర్మ కథ'.

పూర్వం మగధ దేశాన్ని సుందరసేనుడనే మహారాజు పాలిస్తుండేవాడు. అతను ప్రజలని దోచుకుంటూ అన్యాయాలు, అక్రమాలు చేయసాగాడు. పన్నుల భారంతో ప్రజలనడ్డి పూర్తిగా వంచేశాడు.

ఆ కాలంలో ఈ రోజుల్లో భారతదేశంలోలాగే నిరక్షరాస్యులు ఎక్కువ. చదువుకున్న అతికొద్దిమందీ.. ఈ దినాల్లో ఉద్యోగస్తులవలె కరణాలుగా పనిచేసేవారు. పల్లెసీమల్లో పన్నులన్నీ వసూలు చేసి భటుల ద్వారా రాజధానికి పంపిస్తుండేవారు. అయితే కరణాలు చిన్నజీతాలతో బతుకుతుండేవారు. వారికి వేతనశర్మ అనేవాడు నాయకుడు.

మగధ దేశంలో ఓసారి క్షామపరిస్థితి ఏర్పడింది. ఆ క్షామంలో చాలామంది పేదలు పిట్టల్లా రాలిపోయేరు. అన్యాయాలు, అత్యాచారాలు చాలా ఎక్కువయేయి. రాజబంధువులంతా చాలా బాగుపడ్డారు.

ఆ రాజ్యంలో మార్కండేయులు అనే ఋషిసత్తముడు ఉండేవాడు. ప్రజలే రాజులైతే తప్ప ప్రజలు మరింక బాగుపడరని ఆ మహర్షి గ్రహించేడు. "రాజుని పారదోలండి. మీ రాజ్యం మీరేలుకోండి!" అంటూ ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తాడు. ఆ తిరుగుబాటులో రాజు తరఫున గ్రామాల్లో పన్నులు వసూలు చేస్తుండే కరణాలు కూడా పాల్గొంటారు. రాజు కుయుక్తులతో మార్కండేయుణ్ణి దోషిగా చిత్రించి చంపించివేస్తాడు.

ఆ వెంటనే, తిరుగుబాటుదార్లందరినీ ఏ విచారణా అవసరం లేకుండానే హింసించి చంపమని సుందరసేనుడు తన సైన్యానికి ఆజ్ఞ జారీ చేసేడు. నేలంతా నెత్తురుమయమయింది. గాలంతా హాహాకారమయింది. ఆకాశం చేతగాని సాక్షిగా మిగిలిపోయింది.

సైన్యం అందర్నీ వేటాడినట్లే కరణాలని కూడా వేటాడనారంభించింది. చదువుకున్న గాడిద కొడుకులకి బుద్ధి చెప్తే మిగతావాళ్ళక్కూడా బుద్ధొస్తుందనే నమ్మకం వల్ల మహారాజు సైన్యం కరణాలని ఎక్కువగా హింసించసాగింది.
                 
ఆ పరిస్థితుల్లో, కరణాల నాయకుడైన వేతనశర్మ ఓ పగలూ, ఓ రాత్రీ కూర్చొని ఆత్మవిమర్శ చేసుకొని "నేనెవర్ని?" అని ప్రశ్నించుకొని  "నేను కరణాన్నే కాని మరెవణ్నీకాను." అని ఖచ్చితంగా తేల్చుకొని, అందువల్ల ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి, తన కరణపు అనుయాయుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తాడు.
               
"ఈ దోపిడీ అనేది ఉండటం వల్ల మనకి ఏం నష్టం ఉంది? ఈ దోపిడీ నశిస్తే మనకి ఏమి లాభం చేకూరుతుంది? ఈ దోపిడీ రాజ్యం నశించిపోయి ప్రజారాజ్యం వచ్చిందనే అనుకుందాం. అప్పుడు మనకి వచ్చేదేముంది? ఏ మనిషయినా, సంఘమైనా తనకి కావలసినదేమిటో తెలుసుకుని మరీ వ్యవహరించాలి. సమాజాలు పూర్తిగా మారితేనేగానీ జీవితాలు బాగుపడనివాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు విప్లవాలు తెస్తారు. చావుకి తెగిస్తారు. మనం ఆ కోవకి చెందుతామా? చెందం. మాకు వేతనాలతోనే సంబంధం ఉంది, కానీ విప్లవాలతో సంబంధం లేదు అని రాజుకి స్పష్టంగా చెప్పినట్లయితే వారు మనకి ఓ పిడెకెడు జీతం పెంచుతారు." అంటూ తోటికరణాల్ని 'ఎడ్యుకేట్' చేస్తూ సాగుతుంది వేతనశర్మ ఉపన్యాసం.
                 
ఉపన్యాసం విన్న కరణాల కళ్ళన్నీ జ్ణానకిరణాలతో మెరిసిపోయేయి. జీవితంలో వారు సాధించుకోవలసిన లక్ష్యాలని వేతనశర్మ స్పష్టంగా తెలియజేసినందుకు మురిసిపోయేరు. వేతనశర్మని ఆశీర్వదించి.. రాజవర్గంతో తమ తరఫున సంప్రదింపులకి పంపారు. చర్చలు సఫలం అయ్యాయి. అందరికీ తలా చిటికెడు చొప్పున జీతాలు పెరిగాయి.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రభుత్వోద్యోగులంతా ప్రభువు నుండి జీతాలు తీసుకోడమే కాకుండా, వారికి ప్రజల నుండి పారితోషకాలు కూడా పొందే హక్కు కలదని ఆనాటి నుండి గుర్తింపబడింది. ఇది వేతనశర్మ సాధించిన విజయాల్లో చాలా ఘనవిజయం.  

రావిశాస్త్రి కథని ఈ మాటలతో ముగిస్తాడు.
                 
"ప్రభుత్వోద్యోగులకి వేతనశర్మే మొట్టమొదటి పీఠాధిపతి. ఆ తరవాత వేతనశర్మలే కార్మికనాయకులుగా కూడా రూపొందడంతో ప్రభువులంతా సకల ధనకనకవస్తువాహనాలతో తులతూగుతూ ప్రశాంతంగా జీవించుకు వస్తున్నారు. ఎక్కువ జీతాల కోసం సమ్మెలే తప్ప, సమసమాజం కోసం విప్లవాలు వద్దంటారు ప్రభువులు. అవునంటారు ప్రభుత్వోద్యోగులు."
  
1971లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ కధని.. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి జరిగిన ప్రభుత్వోద్యోగుల సమ్మె సందర్భంగా అదే ఆంధ్రజ్యోతిలో అప్పటి సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మ పునర్ముద్రించారు.

'అసలేం జరుగుతుంది? మనం ఎవరం? ఎటువైపు? ఎందుకు?' అంటూ చిన్నచిన్న లాజిక్ లతో సాగే వేతనశర్మ ఉపన్యాసం.. ఈ కథకి హైలైట్. ఈ కధలో రావిశాస్త్రి ట్రేడ్మార్కైన సిమిలీలు తక్కువ. అయినప్పటికీ.. చదువరిని కట్టిపడేసే ఆయన మాటల మాయాజాలం, 'కిక్'.. షరా మామూలే!  
                 
ఈ చిన్నకథ రాజ్యం, రాజ్యస్వభావం గూర్చి చర్చిస్తుంది. ప్రజలని దోపిడీ చేసే వర్గసమాజంలో ఉద్యోగులు ఎటు ఉంటారో వివరిస్తుంది. ఒక క్లిష్టమైన రాజకీయ అంశాన్ని సరళతరం చేస్తూ, కధారూపంగా మలచటానికి రావిశాస్త్రి జానపద నేపధ్యాన్ని ఎన్నుకున్నాడు. ఈ కధ 'బాకీ కధలు' సంపుటంలో ఉంది. వేతనశర్మ కథాశిల్పాన్నే.. ఇదే సంపుటంలోని 'పిపీలికం' లో కూడా రావిశాస్త్రి అనుసరించాడు.
              పురాణం సుబ్రహ్మణ్యశర్మ 

(photos courtesy : Google)   

Wednesday, 11 January 2012

రావిశాస్త్రి 'పిపీలికం'

"ఒరే పిపీలికాధమా! నేనవరిననా అడిగేవు? నేను సుఖభోగిని. నీ పాలిట మాత్రం కాలయముణ్ణి! ఇప్పుడు తెలిసిందా నేనెవరో? తెలిసింది కదా! మరి, నువ్వెవరో నీకు తెలుసునా? నీ ముఖం చూస్తే నీకింకా ఏమీ తెలియనట్టే ఉందిలే. నువ్వు ఈ లోకంలో ఒకానొక తుచ్ఛపు కష్టజీవివి. కష్టజీవులు కష్టపడాలి. సుఖభోగులు సుఖించాలి. అలా జరుగుతుందనేది ప్రకృతి ధర్మం. అలా జరగాలనేది భగవదాదేశం. అందుచేత, మీ చీమ వెధవలంతా కష్టపడవలసిందే! మీ కష్టమ్మీద మేం సుఖించవలసినదే! మాకు అదే న్యాయం. అదే ధర్మం! కాదన్నవాణ్ణి కాటేసి చంపుతాం. ఇది మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లే. బాగానే ఉంది. మీ నిర్మాణ కౌశలానికి ముగ్ధుణ్ణయేను. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. చాలు నీకిది. పొండి. మరింక దీని సౌఖ్యం అనుభవించే భాగ్యం అంటారా? అది మాది. అది మా హక్కు. ఆ హక్కు మాకు వాడూ వీడూ ఇచ్చింది కాదు. భగవంతుడే ఇచ్చాడు. ఇది ఇప్పట్నించీ నా ఇల్లు. బోధపడిందిరా చిన్నోడా. నీకేదో చదువులు చదివి పాఠాలు నేర్చుకోవాలని కుతూహలంగా ఉన్నట్టుంది. ఈ దినానికి నీకీ పాఠం చాలు! మరో పాఠానికి మళ్ళీ రాకు. వచ్చేవంటే మిగతా పాఠాలన్నీ మరో లోకంలో నేర్చుకోవలసి ఉంటుంది. మరందుచేత వేగిరం నడువిక్కణ్నించి."

ఇది తనేవరో తెలుసుకోవాలని తపించిపోయిన చీమ(పిపీలికం)కి, దాని శత్రువయిన పాము చేసిన జ్ఞానోపదేశం. 'పిపీలికం'ని రావిశాస్త్రి 1969 లో రాశాడు. కథని జంతుపాత్రలతో, జానపదశైలిలో అద్భుతంగా నడిపిస్తాడు రావిశాస్త్రి. కథలో కష్టజీవిగా చీమనీ, శ్రమదోపిడీ చేసే వర్గశత్రువుగా పామునీ ప్రతీకలుగా ఎంచుకున్నాడు రావిశాస్త్రి.

కథాంశం 'బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి.' అన్న సుమతీ శతకం పద్యపాదం నుండి వచ్చింది. పురాతనమైన జంతుపాత్రల కథనం మనకి 'పంచతంత్రం' వల్ల బాగా పరిచయం. చందమామలో కూడా చాలా కథలు వచ్చాయి. అయితే ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇంత ప్రసిద్ధమైన ఈ తరహా రచన (నాకు తెలిసి) మరొకటి లేదు.

పూర్వం కృతయుగంలో శ్యామవనంలో నివసించే ఒకానొక చీమకి "నేనెవర్ని?" అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది. తోటి చీమ సలహాపై గోపన్నపాలెం చేరుకుని నిగమశర్మ అనే బ్రాహ్మణుణ్ణి కలిసి "నేనెవర్ని?" అని అడుగుతుంది. బ్రాహ్మణులకి మాత్రమే చదువు చెప్పాలనుకుని పేదరికంలో మగ్గుతున్న నిగమశర్మ, చదువుకుంటే చీమ సందేహం తీరుతుందంటాడు. అందుకు రోజూ ఒక గిద్దెడు నూకలు ఫీజుగా అడుగుతాడు. ఆ క్షణం నుంచీ ఎద్దులా కష్టపడి గింజగింజ చొప్పున గిద్దెడు గింజలూ ప్రతిదినం గురువుకి సమర్పించి చదువు నేర్చుకుంటుంది. చదువయిపోయిన తరవాత "నువ్వు చీమవి" అని సెలవిస్తాడు నిగమశర్మ.

కొంతకాలానికి చీమకి "అసలు చీమంటే ఏమిటి?" అని మళ్ళీ సందేహం వస్తుంది. నిగమశర్మ సలహాపై జన్నాలపల్లెలో చతుర్వేది అని పిలవబడే వేదవేదాంగవేద్యుడు వద్దకి చేరుకుంటుంది. చతుర్వేదులువారు చీమకి శుద్ధి చేసి, బ్రాహ్మణ్యం ఇప్పించి, తను చేయదలచుకున్న యజ్ఞానికి బంగారం ఫీజుగా ఇమ్మంటాడు. నిగమశర్మ ఫీజు గిద్దెడు నూకలైతే, చతుర్వేదిగారి ఫీజు బంగారం. నిగమశర్మది వీధి చివరి ఇంగ్లీషు మీడియం స్కూలయితే, చతుర్వేదిది కార్పొరేట్ విద్యాసంస్థ! సంవత్సరాల పాటు శ్రమించి రేణువు రేణువు చొప్పున హిరణ్యం సమర్పించుకుంటూ వేదాలు నేర్చుకుంటుంది మన పిచ్చిచీమ. చివరికి వేదసారం 'సోహం' అన్న ఒక్కమాటలో ఉందని చెబుతాడు చతుర్వేది.

బ్రహ్మజ్ఞానం పొంది కూడా తృప్తి నొందని చీమ ఒక మహాఋషిని దర్శిస్తుంది. ఆయన "యోగసాధన చేసి తపస్సు చెయ్యి. జన్మరాహిత్యం సంపాదించి మోక్షం సంపాదించు." సలహా ఇస్తాడు.

"ఏ జీవికైనా జన్మరాహిత్యం ఎందుకు? మోక్షం ఎందుకు?" అని అడిగితే సమాధానం రాదు.

నిరాశతో శ్యామవనంలోని తన పుట్టకి తిరిగొస్తుంది. అక్కడ తమ ఇంటిని ఒక రాక్షసాకారం (పాము) ఆక్రమించుకుని తన సోదర చీమలని తరిమేయ్యటం చూస్తుంది.

"ఇది అన్యాయం. అక్రమం. ఇలా మా ఇంటిని ఆక్రమించటం నీకు న్యాయమేనా?" అని పాముని గౌరవపూర్వకంగానే అడుగుతుంది చీమ.

అప్పుడు పాము బుసబుస నవ్వి చెప్పే మాటలు ఈ కథకి హై లైట్. పాము మాటలతో చీమకి తనెవరో జ్ఞానోదయం కలుగుతుంది.

"నువ్వు తుచ్ఛపు కష్టజీవివి."

తనెవరో పాము ద్వారా గ్రహించిన చీమ.. తన తోటి చీమలకి హితబోధ చేసి, ధైర్యం చెప్పి, వారిని వీరులుగా మార్చి, "రాక్షసాకారపు భగన్న్యాయం" మీద తిరుగుబాటు చేసేందుకు అందర్నీ కూడగట్టుకుని రంగంలోకి దిగుతుంది.

తత్ఫలితంగా, శ్యామవనంలో ఓ రాక్షసాకారం విలవిల తన్నుకుని నెత్తురు కక్కుకుని చచ్చింది. భూభారం కొంత తగ్గింది.  

(ఇంతటితో కథ అయిపోతుంది)

శాస్త్రాలు చెప్పని సత్యం, పండితులు దాచిన అసలు విషయం దాని శ్రమని దోపిడీ చేసిన పాము చెబుతుంది. జ్ఞానకాంక్ష కన్నా ఆకలి ఎంత శక్తివంతమైనదో చీమకి తెలిసివస్తుంది. 

వల్లంపాటి వెంకటసుబ్బయ్య తన 'కథాశిల్పం'లో ఈ కథని విశ్లేషిస్తూ, 'శ్రమదోపిడీని చిత్రించటంతో పాటు భారతీయ వేదాంతం శ్రమదోపిడీకి ఎలా సహకరించిందో, దాన్ని ఎలా ప్రోత్సాహించి, ఒక వ్యవస్థగా తయారుచేసిందో కూడా ఈ కథ సూచిస్తుంది.' అని అభిప్రాయపడ్డారు.

రావిశాస్త్రి 'పిపీలికం' కథావస్తువుని ఈ శైలిలో ఎందుకు రాసి ఉంటాడు? 'మిత్రబేధం'లో కుట్రలకీ, కుతంత్రాలకి నక్కలని, రాజుగా సింహాన్ని ప్రతీకలుగా వాడుకున్నట్లు, తన కథకి అవసరార్ధం కష్టజీవికి ప్రతీకగా చీమనీ, దోపిడీదారుకి సంకేతంగా పామునీ ఎంచుకుని ఉండొచ్చు. 

పాములు చీమల పుట్టని సొంతం చేసుకుంటాయి. ప్రకృతిలో ఇదో సహజ ప్రక్రియ. కాబట్టి రావిశాస్త్రి చెప్పదలచుకున్న విషయానికి ఈ చీమ, పాము సారూప్యం అతికినట్లు సరిపోతుంది. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. కాబట్టే ఈ కథ మన మనసుకి బలంగా హత్తుకుపోయింది.

అసలు రావిశాస్త్రి సరదాగా చందమామకి ఒకకథ రాసి పంపాడనీ.. దాన్ని కొడవటిగంటి కుటుంబరావు చదివి, 'ఇంత పెద్దకథని మా చందమామలో వేసుకోం.' అని పురాణం సుబ్రహ్మణ్యశర్మకి పంపి ఆంధ్రజ్యోతిలో అచ్చేయించాడనీ, మా సుబ్బు గాలివార్త చెబుతుంటాడు. నేను సుబ్బు మాటలు పట్టించుకోను. 

సుబ్బు మాత్రం 'మిత్రమా! యూ టూ బ్రూటస్! ఈ టెల్గు పీపుల్ ద్రౌపది మనసులో ఏముందో రాస్తే జ్ఞానపీఠమిస్తారు. నిన్నగాకమొన్నదాక మన్తో వున్న కుటుంబరావు మనసులో మాట చెబితే నమ్మరు!' అని చిరాకు పడతాడు.

సాహితీ విమర్శకులు, ప్రేమికులు ఈ కథని అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తుంటారు. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి వున్నవాళ్ళు ఈ కథని చదనట్లయితే, అర్జంటుగా చదివెయ్యండి, మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. ఈ కథ చదవనివారిని చదివించే దిశగా మళ్ళించటమే ఈ పోస్ట్ లక్ష్యం.