Showing posts with label గోఖలే. Show all posts
Showing posts with label గోఖలే. Show all posts

Thursday, 19 March 2015

మా గోఖలే


సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్.. ఇవన్నీ పండగలు. ఈ రోజులు ఆయా మతాలవారికి మాత్రమే పర్వదినాలు. నిన్న మా గుంటూర్లో అన్ని మతాలవారికి పండగ దినం. కారణం - గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటిసారిగా ఓపెన్ హార్ట్ సర్జరీ  జరిగింది!

హిమాలయ పర్వతం ఎక్కడం, సముద్రాల్ని ఈదడం లాంటివాటిని సాహస కార్యాలంటారు. వీటిల్లో రికార్డులు కూడా వుంటాయిట! అయితే ఆయా రికార్డుల్తో పేదప్రజలకి వొనగూరే ప్రయోజనమేంటో నాకు తెలీదు. కానీ - గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించడం మాత్రం ఖచ్చితంగా సాహసకార్యం, భవిష్యత్తులో పేదప్రజలకి ఎంతగానో ఉపయోగపడే కార్యం. ఈ సాహసానికి టీమ్ లీడర్ మిత్రుడు డాక్టర్ గోఖలే. ఈ లక్ష్యంలో గోఖలేకి సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరునా అభినందిస్తున్నాను.

'గుంటూరు మెడికల్ కాలేజి'. ఈ పేరు వినంగాన్లే నాతోసహా చాలామంది నా మిత్రులకి ఎంతో కృతజ్ఞతా భావం. మా కాలేజి నాలాంటి అనేకమంది పేదవార్ని వైద్యులుగా తయారుచేసింది. మా ట్యూషన్ ఫీజు సంవత్సరానికి అక్షరాలా నలభై రూపాయిలు! పొరబాటున - ఒక నాలుగు వేలు ఎడ్మిషన్ ఫీజుగా కట్టమన్నట్లైతే నేను డాక్టర్నైయ్యేవాణ్ని కాదు!

ఈ.ఎన్.బి.శర్మగారు, సి.మల్లిఖార్జునరావుగారు, సి.సావిత్రిగారు, వెంగళరావుగారు మొదలైన ప్రొఫెసర్లు మాకు విద్యాదానం చేసిన దాతలు. వారు గుర్తొచ్చినప్పుడు మా మనసు కృతజ్ఞతా భారంతో బరువైపోతుంది. వాళ్ళు ప్రభుత్వం నుండి తీసుకున్న జీతం అణువంతైతే, మాకు ఇచ్చిన శిక్షణ కొండంత. వారి నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావం నన్ను ఆశ్చర్యపరుస్తుంది (నాకు మా టీచర్ల గొప్పతనం చదువుకునేప్పుడు తెలీదు). 

సరీగ్గా ఇదే భావన - మా గుంటూరు మెడికల్ కాలేజి అనేకమంది పూర్వ విద్యార్ధులక్కూడా వున్నట్లుంది. అందుకే వాళ్ళు (ముఖ్యంగా అమెరికాలో స్థిరపడ్డవారు) మా కాలేజికి ఏదో రకంగా సేవ చేద్దామని తపన పడుతుంటారు. ఆ తపనలోంచి పుట్టిందే పొదిల ప్రసాద్ మిలినీయం బ్లాక్. ఈ బ్లాక్ తల్లికి పిల్లలు ఇచ్చిన బహుమతి వంటిది. 

ఇవ్వాళ గోఖలే టీమ్ ప్రభుత్వరంగంలో మొదటిసారిగా ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించడానికి ఎంతోమంది అనేక రకాలుగా కృషి చేశారు. ఈ కృషి ఏ ఒక్కరిదో, ఏ ఒక్కనాటిదో కాదు. ఎంతోమంది ఎన్నాళ్ళుగానో పడిన శ్రమ పురుడు పోసుకుని 'ఓపెన్ హార్ట్ సర్జరీ' అనే బిడ్డని కన్నాయని నా నమ్మకం.

ప్రజలకి సేవ చెయ్యాలంటే రాజకీయ రంగాన్ని మించింది మరేదీ లేదు. రాజకీయ నాయకులు నిజాయితీగా వుంటే దేశం బాగుపడుతుంది. అలాగే - ఏ రంగంలోనైనా కావల్సింది నిజాయితీ, పట్టుదల, కృషి. ఇవన్నీ కలిగిన వారు మాత్రమే మొక్కవోని దీక్షతో ముందుకెళ్తుంటారు. స్పీడ్ బ్రేకర్లని ఎదుర్కోడం, దాన్నించి పాఠం నేర్చుకోవడం.. ఇవన్నీ వారికో చాలెంజ్. ఈ లక్షణాలు నా మిత్రుడు గోఖలేలో పుష్కలంగా వున్నాయి. 

ఈ ప్రయాణంలో మా గోఖలేకి అతని భార్య డాక్టర్ లక్ష్మి సహకారం ఎంతో వుందని నాకు తెలుసు. ఆవిడకి అప్పుడే పుట్టిన పిల్లలకి వైద్యం చెయ్యడంలో నైపుణ్యం వుంది. అంతేకాదు - ఎప్పుడో పుట్టిన గోఖలే మనసుని ఆనందంగా, ప్రశాంతంగా వుంచడంలో కూడా నైపుణ్యం వుంది. డాక్టర్ లక్ష్మికి అభినందనలు!

చాలామందికి డబ్బు సంపాదించడంలో ఆనందం వుంటుంది. అతి కొందర్లో ప్రజలకి సేవ చెయ్యడంలో ఆనందం వుంటుంది. ఆ 'అతికొందర్లో' మా గోఖలే కూడా ఒకడు. గుండె ఆపరేషన్ల ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్ళని దాటేస్తున్న నా మిత్రుడు గోఖలే - ఇలాంటి అనేక ప్రజాహిత కార్యాలు తలపెట్టాలనీ, అందుగ్గానూ వాడికి తగినంత 'గుండె ధైర్యం' లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

(photo courtesy : FB - Alla Gokhale)

Sunday, 18 March 2012

"ఇంకా ఎంతదూరం ఉంది నాయనా?" (ఒక నడక మిషన్ కథ)

"ఇంకా ఎంత దూరం ఉంది నాయనా?"

దేవదాసు సినిమా క్లైమాక్స్ గుర్తుంది కదూ! దుర్గాపురం చేరేదాకా బతుకుతానో లేదో అనే దేవదాసు ఆర్తి, ఆతృత.. పారుని చూడకుండానే చనిపోతానేమోననే ఆవేదన.. గుండెని కరిగించి కన్నీటిని వరదలా ప్రవహింపచేసే ఉద్వేగపూరిత ఘట్టం. సీతారాం (బండి నడిపిన వ్యక్తి) నటన అపూర్వం. తెలుగుసినిమా చరిత్రలో నన్ను ఇంతకన్నా ఏడిపించిన సన్నివేశం మరోటి లేదు.
               
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే - ప్రతిరోజూ ఉదయం నేను కూడా దేవదాసులా ఫీలవుతుంటాను. దేవదాసుకి పార్వతి బాధ. నాకు ట్రెడ్‌మిల్ బాధ! ఈ డాక్టర్లు రాక్షసులకి తక్కువ, పిశాచాలకి ఎక్కువ. ఎక్సర్సైజులు చెయ్యకపొతే చస్తావని బెదిరిస్తుంటారు. ఆ డాక్టరే భార్య రూపేణా ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఎడారిలో ఎండమావి వంటిదని ప్రత్యేకంగా రాయనవసరం లేదనుకుంటాను.

కృష్ణకుమారి అక్కయ్యా! భార్యలకి భర్తల ఆరోగ్యం పట్ల తీవ్రమైన శ్రద్ధ ఎందుకు? మన పవిత్ర భారతదేశంలో భార్యలకి భర్తల పట్ల గల ఘోరప్రేమే కారణమని నేనూ, 'నీ బొంద! అది ప్రేమా కాదు, దోమా కాదు. మొగుడు చస్తే బాధ్యతలు నెత్తిమీద పడతయ్యనే బయ్యం! ప్రతిరోజూ నోరు  నొప్పెట్టేలా తిట్టుకోడానికి కొత్తమనిషి దొరకడనే అభద్రతా భావం!' అని నా స్నేహితుడూ వాదించుకుంటున్నాం. ఎవరు కరక్టో చెప్పండి. మీరు చెప్పేదాకా మేం వాదించుకుంటూనే ఉంటాం! చెప్పకపొతే కొట్టుకుని చచ్చిపోతాం!!

'ట్రెడ్‌మిల్ ఎందుకయ్యా? హాయిగా పొద్దున్నే గ్రౌండ్ లో వాకింగ్ చెయ్యొచ్చుగా?' అని మీకు అనుమానం రావొచ్చు. 'పొద్దున్నే నిద్రలేచి రోడ్డున పడకురోయ్! నిన్ను ఏ పేపరోడో, పాలపేకెట్లోడో అనుకుంటారు.' అని మా సుబ్బు భయపెడ్తాడు. కుక్కలు కరుస్తయ్యని కూడా బెదరగొడతాడు. అసలు విషయం - నేనెక్కడ వాకింగ్ చేసి ఆరోగ్యం మూట గట్టుకుంటామేమోనని సుబ్బు భయం! కానీ - నేను స్నేహితుల మాటకి విలువిచ్చే మనిషిని! అందుకే - ఉదయాన్నే లేవకుండా బారెడు పొద్దెక్కేదాకా నిద్రోవడం, పొరబాటున లేచినా వాకింగుకి దూరంగా ఉండడం చేస్తున్నాను. తప్పదు, స్నేహధర్మం!

అయితే అన్నిరోజులూ ఒకలా ఉండవు. నేను వాకింగ్ చెయ్యక తప్పని పరిస్థితులు వచ్చేశాయ్. కొన్నిరోజులు ఇంటికి దగ్గరగా వున్న గ్రౌండ్‌కి వెళ్లాను. అక్కడ నడిచేవాళ్ళని చూసి ఆశ్చర్యమేసింది. వాకింగ్ ట్రాక్ మీద క్రమబద్దంగా, హడావుడిగా నడుస్తున్న వారంతా గొర్రెల్లా కనిపించారు.

నడకలో కూడా ఒక్కోడిది ఒక్కో స్టైల్. ఒకరిది అడుగులో అడుగేస్తూ పెళ్లినడకయితే, ఇంకొకరిది 'పదండి ముందుకు పదండి తోసుకు' అన్నట్లు పరుగులాంటి నడక. అక్కడ చాలామంది వాకర్లు కాదు. టాకర్లు మాత్రమే! కొందరైతే మొక్కుబడిగా నాలుగు రౌండ్లు నడిచి పక్కనే ఉన్న హోటల్లో అరడజను నేతి ఇడ్లీలు ఆరగించి వెళ్తున్నారు! ఆరోగ్యంగా జీవించడానికి ఇన్ని కష్టాలు పడాలా? వామ్మో! నా వల్లకాదు.

కానీ 'నడక' లేని జీవితం గాలిలో దీపం వంటిదని డాక్టర్లు ఘోషిస్తున్నారు, భయపెడ్తున్నారు, అసలు వాళ్ళు పెట్టే ఈ భయంతో చచ్చేట్లున్నాం. అందువల్ల 'ట్రెడ్‌మిళ్ అని ఆంగ్లంలో పిలవబడుతున్న ఒక నడక మిషన్ని కొన్నాను.

ట్రెడ్‌మిల్ - బుజ్జిముండ! చూడ్డానికి అందంగా, గంభీరంగా ఉంటుంది. కానీ ఈ మిషన్ మీద నడవడం మాత్రం దుర్భరం. కింద పట్టా వెనక్కి కదిలి పోతుంటుంది. మనని వెనక్కి లాక్కెళ్ళి పోదామని, పడేద్దామని ఆ పట్టా తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. కింద పడితే మూతి పళ్ళు రాల్తాయి కావున, పడకుండా మనకి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ విధంగా కదిలే ఒక పట్టాతో మనం చేసే నిరంతర పోరాటన్నే 'ట్రెడ్‌మిల్ వాకింగ్' అంటారు!

మిషన్ ముందు ఒక బల్ల. దానిమీద ఎంత దూరం? ఎంత సమయం? ఎన్ని కేలరీలు? - ఇట్లా ఏవేవో లెక్కలు. 'జాగ్రత్త, ఇరువైపులా ఉన్న కడ్డీలని జాగ్రత్తగా పట్టుకోండి. ఈరోజుల్లో కరెంట్ యే క్షణాన్నైనా పోవచ్చును. మీ భద్రతకి మా బాధ్యత లేదు!' ఇలా అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ నడుస్తూ, అప్పుడప్పుడు పరిగెడుతూ- క్షణక్షణం ఆశగా ఎదురుగానున్న మీటర్లపై కాలము, దూరము అంకెలు చూసుకుంటూ - 'విధి ఒక విషవలయం, విషాద కథలకు అది నిలయం.' అని పాడుకుంటూ -

"ఇంకా ఎంతదూరం ఉంది నాయనా?"

నా ఏడుపు వాకింగ్ మా 'గుండెలు తీసిన బంటు' గోఖలేకి తెలిసింది. 'అలా ఏడుస్తూ ట్రెడ్‌మిల్ చెయ్యకు, ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి.' అన్నాడు. ఈ గోఖలేకి వొక్కటే పని - గుండె ఆపరేషన్లు చెయ్యడం. నేను మాత్రం చాలా బిజీ! అసలే దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ సమస్యలోంచి ఎలా బయటపడుతుంది? ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం చైనా ఇండియాకి సహకరిస్తుందా? లేదా? ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాల గూర్చి ఆలోచించాల్సిన గురుతర బాధ్యతలు నామీదున్నాయి.

అయినా ఎంజాయ్ చేస్తూ ట్రెడ్‌మిల్ చెయ్యడమేమిటి! ఎంజాయ్ చెయ్యడానికి ఇదేమన్నా జ్యోతిలక్ష్మి డాన్సా? లేక సింగిల్ మాల్ట్ విస్కీయా? ఒరే మందుల కంపెనీ బాబులూ! జలుబుకీ, గజ్జికీ కూడా వందల కొద్దీ మందుల్ని మార్కెట్ చేస్తారు. పొద్దున్నే ఈ వాకింగులు, పీకింగులు లేకండా ఏదన్నా మందులు కనిపెట్టి చావండ్రా! నడవలేక ఇక్కడ కువసాలు కదిలిపోతున్నాయ్! 

Thursday, 10 November 2011

గుండెలు మార్చు గోఖలే

అనుకున్నంతా అయ్యింది! మావాడు మళ్ళీ ఇంకోగుండె మార్చాడు. మనం సాధారణంగా కార్లు మారుస్తాం, ఇల్లు మారుస్తాం. కొద్దిమంది అదృష్టవంతులు భార్యల్ని కూడా మార్చేస్తారు. పాపం! ఇవేవీ మార్చలేని మా గోఖలే (మాధవపెద్ది గోఖలే కాదు) గుండెల్ని మారుస్తున్నాడు. కొంతమందంతే, మనం వాళ్ళని ఏమాత్రం మార్చలేం!

గుండెమార్పిడి ఆపరేషన్ చొక్కా మార్చినంత వీజీగా, విజయవంతంగా చేసేస్తున్నాడు. నిన్న ఆరోసారి గుండె మార్చాట్ట! గుండెలు తీసిన బంటు అంటారు, మా గోఖలే మాత్రం గుండెలు మార్చే బంటు! 

కంగ్రాచులేషన్స్ మై బాయ్!


డా.A.గోపాలకృష్ణ గోఖలే,
కార్డియాక్ సర్జన్,
నా క్లాస్ మేట్,
ఆత్మీయ మిత్రుడు,
గోఖలేకి అభినందనలతో..

(picture courtesy : Google)