Showing posts with label తెలంగాణా. Show all posts
Showing posts with label తెలంగాణా. Show all posts

Friday, 11 October 2013

తెలంగాణా! ఎందుకు?


"సుబ్బూ! కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని నిట్టనిలువుగా చీల్చి చాలా తప్పు చేసింది." బాధగా అన్నాను.

కాఫీ తాగుతున్న సుబ్బు చిన్నగా నవ్వాడు.

"నేనైతే అలా అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లుండి తెలంగాణా ప్రాంతంపై ప్రేమ పుట్టుకురాలేదు. ఆ పార్టీకి తెలంగాణా ఇవ్వకుండా ఉండలేని రాజకీయ అనివార్యత ఏర్పడింది." అన్నాడు సుబ్బు.

"అంటే రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని చీలుస్తుందా?" అన్నాను.

"ముందు నువ్వా 'తెలుగు జాతి' అంటూ పరుచూరి బ్రదర్స్ మార్కు డైలాగులు కొట్టడం ఆపు. రాజకీయాలు మాట్లాడేప్పుడు రాజకీయ భాషనే వాడు. సినిమా భాష వాడకు. అవును ఏ పార్టీకైనా రాజకీయ లబ్దే అంతిమ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ. డాక్టర్లు వైద్యం చేస్తారు. వంటవాడు వంటే చేస్తాడు. రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఇంకోటి చెయ్యవు. దేశంలో రాజకీయ లబ్ది చూసుకొని రాజకీయ పార్టీ ఏదన్నా ఉందా?" అడిగాడు సుబ్బు.

"అవుననుకో. కానీ నాకెందుకో బాధగా ఉంది." అన్నాను.

"అవును. కొద్దిగా బాధగానే ఉంటుంది. కానీ రాష్ట్ర విభజన ఒక రాజకీయ అంశం. రాజకీయ అంశాలని emotional గా చూడరాదు మిత్రమా! ఒకరకంగా కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వటానికి నరేంద్ర మోడీ ముఖ్యకారకుడు. కాంగ్రెస్ పార్టీ 2014 లో రాహల్ గాంధీని ప్రధానిగా చెయ్యడానికి రోడ్ మేప్ వేసుకుంది. బిజెపి నరేంద్ర మోడీతో రోడ్ మేప్ సిద్ధం చేసుకుంటుంది. ఈ రెండు మ్యాపుల్లో ఒక మ్యాప్ మాత్రమే సక్సస్ అవుతుంది. మోసగాళ్ళకి మోసగాడు సినిమాలో నిధి కోసం వేసుకునే ఎత్తులు, పైయ్యెత్తులు జ్ఞాపకం ఉందా? ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్, బిజెపిల మధ్య ఈ వాతావరణమే నెలకొని ఉంది. అందువల్ల దేశంలోని ప్రతి పార్లమెంటు సీటు కీలకంగా మారింది." అన్నాడు సుబ్బు.

"అందువల్ల రాష్ట్రం విడగొట్టాలని దుర్మార్గమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటావ్?" అడిగాను.

"మళ్ళీ సినిమా భాషలో మాట్లాడుతున్నావ్. ఇక్కడ దుర్మార్గం, సన్మార్గం ఏముంది? అంతా రాజకీయ  మార్గమే! నువ్వు రాష్ట్ర రాజకీయాల్ని ఢిల్లీ వైపు నుండి చూట్టం నేర్చుకో. విషయం చాలా తేలికగా అర్ధమవుతుంది." అన్నాడు సుబ్బు.

"నేను నిఖార్సైన తెలుగువాణ్ని. సమస్యని నా ప్రాంతం నుండి మాత్రమే చూస్తాను. ఇంకేవైపు నుండి చూడను." చికాగ్గా అన్నాను.

సుబ్బు ఖాళీ కాఫీకప్పు టేబుల్ పై పెట్టి కుర్చీలోంచి లేచాడు. నా ఎదురుగా నించొని.. నా నుదిటిపై తన కుడిచేతి చూపుడు వేలు ఆనించాడు.

"ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది.. వస్తుంది. హాయిగా నిద్ర పోతున్నావ్. నిద్ర పోయ్యావ్. నిద్ర పో.. య్యా .. వ్." అన్నాడు.

ఆశ్చర్యం! నాకు నిజంగానే నిద్రోచ్చింది. అలాగే కుర్చీలో ఒరిగిపొయ్యాను.

"మిత్రమా! ఇప్పుడు నువ్వు సాధారణ పౌరుడివి కాదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడవి. నువ్విప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగులో ఉన్నావు. నేను సోనియా గాంధీని. అదిగో చూడు.. ఎదురుగా అహ్మద్ పటేల్, మన్మోహన్ సింగ్, ఆంటోని.. కనిపిస్తున్నారా?"

"అవును. స్పష్టంగా కనిపిస్తున్నారు మేడం." అన్నాను.

"మీరు CWC లో ఆంద్రప్రదేశ్ వ్యవహారాల బాధ్యులు. పార్టీ అధ్యక్షురాలిగా ఏపీలో మన పార్టీ పరిస్థితిపై మీ నివేదిక అడుగుతున్నాను. ఏం చెబుతారో చెప్పండి." అన్నాడు సుబ్బు.

నేను గొంతు సరి చేసుకుని చెప్పటం మొదలెట్టాను.

"నమస్తే మేడం! ఏపీలో మన పార్టీ పరిస్థితి అస్సలు బాలేదు మేడం. సీమాంధ్రలో జగన్ పార్టీ దూసుకుపోతుంది. తెలంగాణా కెసిఆర్ కోటగా మారిపోయింది. తెలంగాణలో బిజెపి కూడా చాప కింద నీరులా విస్తరిస్తుంది. రాష్ట్రంలో ఉపఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిచోటా మన పార్టీ డిపాజిట్టు కోల్పోయింది. కాబట్టి మన రాష్ట్ర నాయకుల మాటలకి విలువనివ్వడం శుద్ధదండగ." అన్నాను.

"అలాగా? సరే! మీరేం చేస్తారో నాకనవసరం. ఎట్లాగైనా సరే అక్కడ మన పార్టీ పరిస్థితి ఇంప్రూవ్ అవ్వాలి. మనకి ఏపీ నుండి మేక్జిమం పార్లమెంటు సీట్లు రావాలి. ఏం చేద్దామంటారు?" అడిగాడు సుబ్బు.

ఒక్క క్షణం ఆలోచించాను.

"మేడం! మనం అర్జంటుగా తెలంగాణా ఇచ్చేద్దాం. అందువల్ల ఇరవై మూడు జిల్లాల్లో పది జిల్లాలు మన ఖాతాలో పడతయ్. ఈ దెబ్బకి తెలంగాణలో బిజెపి అవుట్. కెసిఆర్ ఎలాగూ మనతో కలిసిపోతాడు. కాబట్టి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాని స్వీప్ చేసేస్తాం." ఉత్సాహంగా అన్నాను.

"వెరీ గుడ్. మరప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో ఏం చేద్దాం?" అడిగాడు సుబ్బు.

"అక్కడ రాజకీయం చెయ్యడానికి మనకి వెసులుబాటు ఉంది మేడం. జగన్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని రంగం సిద్ధం చేశాను. ద డీల్ ఈజ్ జగన్ బాబు CM, మన రాహుల్ బాబు PM."

"ఇప్పుడు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నడుస్తుంది. మరి తెలంగాణా ఆపేద్దామా?" అడిగాడు సుబ్బు aka సోనియా గాంధీ.

"అదెలా కుదురుతుంది. ఇప్పుడు రాష్ట్ర విభజనని పెండింగ్ లో పెడితే అన్నింటికి చెడతాం మేడం. దీన్నే మా తెలుగు భాషలో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదంటారు. మనకి ముందుకు పోవడం మించి వేరే దారి లేదు మేడం." అన్నాను.

"అంతేనంటారా?"

"అంతే మేడం. మీరు తెలంగాణా ఇస్తానని ఒకసారి ఎలక్షన్ మీటింగులో చెప్పారు. ఇప్పుడు తెలంగాణా ఇచ్చేస్తే మాట నిలబెట్టుకున్నట్లూ ఉంటుంది.. రాజకీయంగా లాభమూ చేకూరుతుంది. తెలంగాణా ఇవ్వకుండా రాష్ట్రం మొత్తం నష్టపొయ్యేకన్నా.. ఇచ్చి ఒక భాగాన్ని మన ఖాతాలో వేసుకోవడం ఉత్తమం."

"మరి రాష్ట్రవిభజన విషయంలో నిదానంగా వ్యవహరిస్తున్నారేమిటి?" అడిగాడు సుబ్బు.

"చూడండి మేడం! ఎదురుగా మసాలా దోశ విత్ అల్లం పచ్చడి అండ్ కొబ్బరి చట్నీలతో రెడీగా ఉంది. మన ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినట్లు తిందాం. హడావుడిగా తినవలసిన అవసరం మనకేంటి?" అన్నాను.

"అర్ధం కాలేదు." అన్నాడు సుబ్బు.

"కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో మనమే ఉన్నాం గదా మేడం. ఎన్నికల సమయానికి క్లైమేక్స్ వచ్చేట్లుగా మనం రాజకీయాలు నడిపిద్దాం. మా  తెలుగు సినిమాల్లో పదోరీల్లోనే పోలీసులు వస్తే హీరో ఫైటింగు చెయ్యని అసమర్ధ వెధవగా మిగిలిపోతాడు. కాబట్టి దర్శకుడు పద్నాలుగో రీలు దాకా పోలీసుల్ని ఆపుతాడు. అంచేత తెలంగాణా ఇవ్వాల్సిన టైమింగ్ మన ఇష్టప్రకారం మాత్రమే ఉంటుంది. చివరిదాకా ఎవరికీ ఇంకే అవకాశం లేకుండా చెయ్యడమే మన మాస్టర్ ప్లాన్." అన్నాను.

కుర్చీలోంచి లేచాడు సుబ్బు. తన కుడిచేతి చూపుడు వేలుతో నా నుదురు తాకాడు.

"ఇప్పుడు నువ్వు నిద్ర లోంచి లేస్తున్నావు. నిదానంగా కళ్ళు తెరుస్తున్నావు. ఇప్పుడు నేను సోనియా గాంధీని కాను. నువ్వు CWC సభ్యుడవి కాదు.. సభ్యుడవి కాదు. నువ్వొక సాధారణ పౌరుడివి." అన్నాడు సుబ్బు.

నిద్రలోంచి మెలకువ వచ్చినట్లు నిదానంగా కళ్ళు తెరిచాను. వెలుగు భరించలేక ఒక్కసారిగా కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచాను. ఎదురుగా నవ్వుతూ సుబ్బు.

ఇందాక ఏదో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను? ఆఁ.. గుర్తొచ్చింది. రాష్ట్ర విభజన గూర్చి సుబ్బుతో చర్చిస్తున్నాను.

" సుబ్బూ! కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని నిట్టనిలువుగా చీల్చి చాలా తప్పు చేసింది." అన్నాను.

"అవునా? అయితే ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఒక్కటే! రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని తెలంగాణా జిల్లాల్లో ఉద్యమం చెయ్యడం. బెస్టాఫ్ లక్." అంటూ నవ్వుతూ గదిలోంచి నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)

Monday, 5 August 2013

నేను మేధావిని కాదు


"అమ్మయ్య! ఇప్పుడు నాకు రిలీఫ్ గా ఉంది. లగడపాటి అమ్ములపొదిలోంచి పాశుపతాస్త్రం బయటకి తీస్తున్నాడు.. ఇంక తెలంగాణా వెనక్కి పోయినట్లే." ఇవ్వాళ ఉదయాన నా స్నేహితుని ఫోన్.

నాకు అర్ధం కాలేదు. అదే అడిగాను.

"నీదో రోగం.. తెలుగు పేపర్లు చదవ్వు. తెలుగు చానెల్స్ చూడవు. హాస్పిటల్లోంచి బయటకి రావు. ఇక్కడ రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది." అన్నాడు.

"ఈ ఉద్యమం టూ లేట్, టూ లిటిల్. ఇవన్నీ బంతి కాంగ్రెస్ హై కమాండ్ కోర్టులో ఉన్నప్పుడు జరగవలసిన కార్యక్రమాలు. నాకున్న అవగాహన ప్రకారం తెలంగాణా రాష్ట్రం ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంక ప్రాసెస్ మాత్రమే మిగిలుంది. ఎప్పుడైనా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడమే ఆలస్యం. తీసుకున్న తరవాత పెద్దగా చేసేదేమీ ఉండదు. ఇంతదాకా వచ్చిన తరవాత కేంద్రం వెనక్కి ఎలా పోతుంది?" అన్నాను.

నా స్నేహితుడు పెద్దగా నవ్వాడు.

"నీకు దీవార్ సినిమా గుర్తుంది కదూ! అందులో 'మేరా పాస్ గాడీ హై, బంగ్లా హై, తుమ్హారా పాస్ క్యా హై? క్యా హై?' అని అమితాబ్ శశికపూర్ని అడుగుతాడు. శశికపూర్ కూల్ గా 'మేరా పాస్ మా హై' అంటాడు. ఇప్పుడు నేను కూడా అదే సమాధానం చెబుతాను. హమారా పాస్ KVP హై, ఉండవల్లి హై, కావూరి హై. డిసెంబర్ తొమ్మిది ప్రకటన వెనక్కి పోలేదా? అందుకే తెలుగు పేపర్లు చదవమని చెప్పేది."

"తెలుగు న్యూస్ పేపర్లు ఇరుప్రాంతాల మనోభావాలకి తగ్గట్లుగా రెండురకాల ఎడిషన్లు వేస్తున్నాయి. రెండు ప్రాంతాల ఎడిషన్లకి వేరువేరు బేనర్లతో, కేప్షన్లతో, కంటెంట్ తో పబ్లిష్ చేసుకుంటున్నాయి. ఇరుప్రాంతాల్ని రెచ్చగొడుతూ తమ సర్క్యులేషన్ పెంచుకుంటున్నాయి. వారిది వార్తల్ని అమ్ముకునే వ్యాపారం. వారి రోడ్ మేప్ వారికి ఉంటుంది కదా." అన్నాను.

"అదంతా నాకు తెలీదు. TG వెంకటేష్ కూడా నిరాహార దీక్ష చేస్తున్నాడు. NGO లు సమ్మెకి దిగుతున్నారు. దెబ్బకి దిమ్మతిరిగి ఢిల్లీ దారికొస్తుంది. తెలంగాణా ప్రకటన వెనక్కి తీసేసుకుంటుంది. ఏదీ కుదరకపోతే పార్లమెంటుని ఎలాగూ లగడపాటి స్తంభింపజేస్తాడు." అన్నాడు నా మిత్రుడు.

ఒక్క క్షణం ఆలోచించాను.

"అంతేనంటావా?"

"అంతే! జరగబోయ్యేది ఖచ్చితంగా ఇదే." కాన్ఫిడెంట్ గా అన్నాడు నా స్నేహితుడు.

"చూద్దాం. ఎలా జరగబోతుందో." అంటూ ఫోన్ కట్ చేశాను.


కొద్దిసేపు ఆలోచనలో పడ్డాను. నా రాజకీయ అవగాహన మరీ ఇంత అధ్వాన్నంగా ఉందేమిటి? జరుగుతున్న పరిణామాలు నేనెందుకు అర్ధం చేసుకోలేకపోతున్నాను?

నేనింతకు ముందు "నేను మేధావినే!.. నా?"  అంటూ ఒక పోస్ట్ రాశాను. ఇప్పుడు నాకా డౌట్ లేదు. నేను ఖచ్చితంగా మేధావిని కాదు. అంతేకాదు.. నేను అజ్ఞానిని కూడా అనే అనుమానం కలుగుతుంది.

(photo courtesy : Google)

Thursday, 1 August 2013

జై సమైక్యాంద్రా



"ఉరే సుబ్బిగా! ఎప్పుడూలేంది ఇయ్యాల పొద్దుగూకులు బజార్లెంట బొచ్చెపోలీసులు తిరుగుతా వుండారేందిరా?"

"వార్నీ! నీకింకా తెలవదా? తెలంగాణా ఇచ్చేసారుగా."

"తెలంగాణానా! అంటే యేంది?"

"సోనియాగాందీ మన్దేసాన్ని నిలువునా సీల్చేసి తెలంగాణా ఇచ్చేసింది. ఐదరాబాదుని మనకాణ్నించి ఇడగొట్టింది."

"ఐదరాబాదా! అంటే యేంది?"

"ఐదరాబాదంటే రాజదాని నగరం. మన పెద్దోళ్ళు ఆల్డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడ పెట్టారంట. ఇప్ప్డడా తెలంగాణావోళ్ళు అయ్యన్ని నూకి మన్ని ఎనక్కి పంపించేస్తన్నారు."

"అమ్మ నీయమ్మ. మరీ ఇంతన్నేయమా! అయితే ఆళ్ళిప్పుడు నా బియ్యం కారుడు లాక్కుంటారా?"

"లాక్కోరు"

"ఆపరేసినీ కారుడు?"

"ఆరోగ్యస్రీ కార్డా? లాక్కోరు."

"కూల్డబ్బులు తగ్గిస్తారా?"

"అయ్యెందుకు తగ్గిస్తారు. తగ్గీరు."

"మరి నా డొక్కు సైకిలు?"

"దాన్నెవడు తీసుకుంటాడ్రా పిచ్చనాయాలా! దానికసలు సైనే సరీగ్గా లేదు!"

"ఓసోస్. పిచ్చనాయాలువి నువ్వేరా! నీదంతా అత్తిరిబిత్తిరి యవ్వారం. బొచ్చెపోలీసుల సంగతేందిరా అనడిగితే ఏందో తెలంగాణా అంటావు, ఐదరాబాదంటావు. మళ్ళీ మనయ్యన్నీ మనకాడే ఉంటయ్యంటావు. తెలీకపోతే తెలీదని సెప్పు. అంతేగానీ యెదవ కబుర్లు సెప్పమాక."

"నీయమ్మ నీతో మాట్టాడితే మెంటలెక్కుద్దిరా బాబూ! అరేయ్ ఎవుడ్రా అక్కడా? కూసింత ఆగండి.. నేనూ వస్తన్నా. జై సమైక్యాంద్రా!"

(photo courtesy : Google)

Tuesday, 11 September 2012

తెలంగాణా.. ఒక సవర్ణదీర్ఘసంధి!


అబ్బబ్బ! మొన్నటిదాకా చిదంబరం. ఇప్పుడు షిండే. మనుషులు మారారుగానీ.. పద్ధతులు మారలేదు. అందరిదీ మా తెలుగు మాస్టారి విధానమే!

'ఎవరా తెలుగు మాస్టారు? ఏమా విధానం?'

నాకు మా మాజేటి గురవయ్య హైస్కూల్లో ఎనిమిది నుండి పది వరకు.. మూడేళ్ళపాటు తెలుగు సబ్జక్టుకి ఒక టీచరే continue అయ్యారు. ఆయన మాకు సంధులు చెప్పేవారు. సంధులలో మొదటిది సవర్ణదీర్ఘసంధి. అది వివరంగా చెప్పేవారు. అందరికీ సూత్రం కంఠతా రావాలి. అది ఆయన policy. మాస్టారు క్లాసుకి రాంగాన్లే అందరం చేతులు కట్టుకుని నించొని.. ఒకళ్ళ తరవాత ఒకళ్ళం సవర్ణదీర్ఘసంధి అప్పచెప్పేవాళ్ళం.

క్లాసుల్లో ఒకళ్ళిద్దరు నిద్ర పొయ్యేవాళ్ళు. కొందరు కిటికీలోంచి కాకుల్ని, కుక్కల్ని చూస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు. వాళ్ళల్లో ఏదోక దరిద్రుడు సూత్రం సరీగ్గా అప్పచెప్పేవాడుకాదు. ఇంక చచ్చామన్నమాటే! మేస్టారు మళ్ళీ సవర్ణదీర్ఘసంధి వివరంగా చెప్పేవాడు. మళ్ళీ అప్పజెప్పించుకోవడం మొదలు. ఈవిధంగా మాకు భూమి గుండ్రంగా ఎందుకుందో అనుభవపూర్వకంగా అర్ధమైంది. రెండోసంధి గుణసంధి. అది సగంలో ఉండగానే పదోతరగతి పరీక్షలొచ్చాయి. అమ్మయ్య!

ఈ సవర్ణదీర్ఘసంధి బాధ భరించలేక ఒకసారి మా సత్తిగాడు గుణసంధిలోకి రమ్మని మాస్టారుకి మొరపెట్టుకున్నాడు. 'వెధవా! నాకే పాఠాలు చెబుతావా?' అంటూ మాస్టారు సత్తిగాడి వీపు సాపు చేశారు. అప్పట్నించి ఎవరూ నోరెత్తే సాహసం చెయ్యలేకపోయారు. మన తెలుగు మాస్టారుకి సవర్ణదీర్ఘసంధి మాత్రమే వచ్చునని.. అందుకే ఇట్లా manage చేశారని మా సుబ్బు అంటాడు.

నాకీమధ్య మళ్ళీ సవర్ణదీర్ఘసంధి గుర్తొస్తుంది. రాష్ట్రవిభజన గూర్చి కేంద్ర హోమ్ మినిస్టర్లు చేసే ప్రకటనలు 'అప్పురేపు'లా ఒకేవిధంగా ఉంటాయి. వాళ్ళు 'ఏకాభిప్రాయ సాధన' అన్నపుడల్లా నాకు 'సవర్ణదీర్ఘసంధి' అన్నట్లు వినిపిస్తుంది!

రేపోమాపో చంద్రబాబు ఉత్తరం ఇస్తాట్ట. మరి ఒవైసీ ఎప్పుడిస్తాడో? ఎవరోకళ్ళు ఇవ్వకపోయినా సమస్య మళ్ళీ మొదటికే. అందరూ ఉత్తరాలిచ్చినా.. సంతకాలు సరీగ్గా లేవనో, స్టాంపులు సరిపడా అతికించలేదనో తిప్పి పంపొచ్చు. మళ్ళీ fresh గా ఇమ్మని అడగొచ్చు! దటీజ్ సవర్ణదీర్ఘసంధి!

'సమస్య సున్నితమైనది.' కాదన్నదెవరు?

'లోతైనది.' ఒప్పుకున్నాం.

అయితే ఏంటి? ఎక్కడైనా, ఎప్పుడైనా రాజకీయ నిర్ణయాలు, పరిష్కారాలు ప్రజల జీవితాలతోనే ముడిపడే ఉంటాయి. అందుకేగదా మీకు ఓట్లేసి గెలిపించి మా భవిష్యత్తు మీచేతిలో పెట్టింది. సున్నితం, లోతు అంటూ కాకమ్మ కబుర్లు చెప్పే బదులు తప్పుకోవచ్చుగా!

షిండేగారికి ఎవరో చిన్న రాష్ట్రాల వల్ల నక్సలైట్ల సమస్య పెద్దదైపోతుందని చెప్పారట! మూడేళ్ళనుండి సీమాంధ్ర నాయకులు ఈసంగతి ఇల్లెక్కి అరుస్తున్నారు. దానికి ప్రతిగా తెలంగాణా నాయకులు ఎలుగెత్తి సమాధానం చెబుతున్నారు. కానీ home department కి మాత్రం ఇప్పుడే వినబడుతుందిట! ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఒకే రాష్ట్రంగా కలిపేసి నక్సలైట్ సమస్యని అంతమొందిస్తారేమో!

ఏమిటో! అంతా సవర్ణదీర్ఘ సంధి మయం! ఇంతకీ కాంగ్రెస్ దగ్గర గుణసంధి సూత్రం ఉందా? లేక మా తెలుగు మాస్టారిలా....

(photo courtesy : Google)

Thursday, 6 October 2011

సున్నిత సమస్యాపురం


"జోగినాధం! కళ్ళెట్టుకు సూడు. ఆకాశంలో ఏదో మర్డర్ జరినట్టుంది కదూ!" అన్నాడు ప్రెసిడెంటు.

రావు గోపాల్రావు లాంటి ప్రెసిడెంటు ఆఊరికి మహారాజే. ప్రెసిడెంటుది ఆరడగుల భారీవిగ్రహం. అతని దర్జా అంతా ఆ కోరమీసంలోనే ఉందంటారు. అతనికి జోగినాధం నమ్మిన బంటు. పొట్టిగా, బక్కగా, మాసిన గడ్డం, పాత కోటు, బూతద్దాల కళ్ళజోడూ.. చూట్టానికి అచ్చు అల్లు రామలింగయ్యలా ఉంటాడు.
                   
"మహాప్రభో! ఇవ్వాళేం జరుగుతుందోననీ.. మన కనెక్సన్ కట్టయిపోద్దేమొనని నాకు కాలూ చెయ్యీ ఆడట్లేదు. మీరేమో ఆకాశమంటూ, మర్డరంటూ ఏవేమో శెలవిస్తున్నారు." భయంగా అన్నాడు జోగినాధం.

సిగరెట్ దమ్ము లాగుతూ విలాసంగా చిర్నవ్వు నవ్వాడు ప్రెసిడెంటు.
                   
జోగినాధం చెప్తున్న ఆ సమస్య గతకొన్నాళ్ళుగా ఆఊరిని అగ్నిగుండంగా మార్చేసింది. ఏ ఇద్దరు కలిసినా ఆసమస్య గూర్చే చర్చ. ఇంతకీ ఏమా సమస్య? ఏంటా కథ?


రంగి, రంగడు గత పాతికేళ్ళుగా భార్యాభర్తలు. మొదట్లో వారి కాపురం సజావుగానే సాగింది. కానీ.. గతకొన్నేళ్లుగా రంగడు ఫుల్లుగా తాగి రంగిని బాదిపడేస్తున్నాడు. ఈ రోజువారీ దెబ్బలు భరించలేని రంగి విడిపోవాలని నిర్ణయించుకుంది. రంగి చుట్టాలు కూడా రంగడికి చెప్పీచెప్పి విసిగిపొయ్యి.. ఈ ఎదవ ఇంక మారడనీ, రంగి విడిపోవాల్సిందేననే అభిప్రాయానికి వచ్చేశారు.
                   
కానీ.. విడిపోటం అనేది పెద్దసమస్యగా మారింది. రంగి పుట్టింటి తరఫున కట్నంగా తెచ్చుకున్న అరెకరా మాగాణి సమస్యంతటికీ మూలకారణం.

'నా అరెకరా నాకెచ్చియ్. నా సావు నే సస్తా.' అంది రంగి.

'మీ పుట్టింటోళ్ళ బీడు బూమి నా రెక్కల కట్టంతో బాగు చేశాను. ఇన్నాళ్ళూ దున్నాను. కాబట్టి పొలం నాదే.' అన్నాడు రంగడు.  

'దున్నేవోడిదే బూమి.' అని రాజకీయాలు కూడా మాట్లాడాడు.

రంగికి నలుగురు అన్నదమ్ములు. ముగ్గురు అప్పచెల్లెళ్ళు. రంగడికి ముగ్గురు అన్నలు. ఇద్దరు తమ్ముళ్ళు.
                   
వ్యవహారం ప్రెసిడెంటు దాక పొయ్యింది. మొదట్లో రంగి పరివారం ఆ అరెకరా పొలం గూర్చి అడిగినప్పుడల్లా ప్రెసిడెంటుకి అందులో చాలా న్యాయం కనిపించేది.

"అయినా మీపొలంతో వాడికేంటి సమ్మందం? మీకెందుకు. నే మాట్లాడతా. మీరు పోండి." అని పంపించేసేవాడు.

అసలే ఎలక్షన్లు రాబోతున్నాయ్. ఈతీర్పుతో రాబోయే ఎలక్షన్లలో కలిగే లాభనష్టాల బేరీజులో ఉన్నాడు ప్రెసిడెంటు.
                   
జోగినాధం ద్వారా ఈ సంగతి గ్రహించిన రంగడి పటాలం.. ఆరెకరా కోసం తెలివైన వాదన ఎత్తుకుంది.

'మనది ఇందూ దేశం. ఇక్కడంతా ఇందూ దరమం. పెళ్ళంటే నూరేళ్ళపంట. మొగుడెంత ఎదవైనా.. ఎంత తాగుబోతు సన్నాసైనా.. మొగుడు మొగుడే. ఇడాకులు మహాపాపం. మాకు ఇందూ నాయం గావాల.' అంటూ మతం సెంటిమెంటుతో కొట్టారు.

'ఈఇదాన పెతి ఆడముండా పొలం పుట్రా తీసేస్కుని పుట్టింట జేర్తే పాపం మగోడి బెతుకేం గావాల్న?' అంటూ ఆర్ధికసామాజికాంశాలతో కొట్టారు.

'అయినా .. కలిసుంటే కలదు సుకం అని ఎన్టీవోడు సేప్పాడు గందా. ఆ బాబు సెప్పినంక ఇంక ఏరే నాయమేంది?' అని చరిత్రతోనూ కొట్టారు.
                   
ఈ దెబ్బలకి ఆలోచనలో పడ్డాడు ప్రెసిడెంటు. ఏదో నాలుగు కేకలేసి యవ్వారం సెటిల్ చేద్దామనుకున్నాడు. కానీ ఇందులో లోతెక్కువుందని గ్రహించాడు. ఆవిధంగా ఈ మొగుడూపెళ్ళాల గోల్లో ప్రెసిడెంటు కూడా అడ్డంగా ఇరుక్కుపొయ్యాడు. ఆఊళ్ళో వీళ్ళ కులపోళ్ళ వోట్లు లేకుండా ప్రెసిడెంటుగిరీ అసాధ్యం. అటూఇటూ కలిపి ఓ ఆరొందల ఓట్లు నికరంగా ఉన్నయ్. అదీగాక.. ఊరంతా రంగీ, రంగడి పార్టీలుగా విడిపోయుంది.
                   
ఆడంగులంతా కూడా రెండు పార్టీలుగా విడిపొయ్యారు.

'ఎంతన్నేయం! తాగుబోతు సచ్చినోడు పొలాన్ని కూడా ఇడిసిపెట్టడా!' అంది రంగి పార్టీ.

'ఈ రంగిముండకి పొయ్యేకాలమొచ్చింది. మొగుడన్నాక ఆమాత్రం తన్నడా? నా మొగుడు రోజూ తాగి మక్కెలిరగదంతన్నా, ఎంతమంది ముండలెనకాల బోయినా.. ఒక్కరోజయినా చూడకుండా ఉండలేనమ్మా.' అంది రంగడి పార్టీ.
                   
ప్రెసిడెంటు బుర్ర గోక్కున్నాడు. రాజకీయాల్లో కులం, మతంలాంటి ఈక్వేషన్లు ఆయనకి తెలుసు. ఈ కొత్తసమస్య ఎటుపొయ్యి ఎటొస్తుందో.. చివరాకరికి ఎగస్పార్టీవాడికి లాభిస్తుందేమోననే అనుమానం కలిగింది. చట్టం తన పని తను చేసుకుపోతుందని తప్పించుకోటానికి ఇది కోర్టుకేసు కాదాయె!

అంచేత.. "ఇదంత అర్రీబర్రీగా తేలే యవ్వారం గాదు." అంటూ వాయిదాల మీద వాయిదాలు వేయసాగాడు.

రంగడు తాగుడు ఎక్కువ చేశాడు. ఆపై పెళ్ళాన్ని బాదుడూ ఎక్కువ చేసాడు. అతనికి 'ఇందూ నాయం' బాగా కలిసొచ్చింది. రంగి అలిగి అన్నం తినడం మానేసింది.

ఒకరోజు రంగి అన్న పీకల్దాకా తాగి 'ఏందీ అన్నేయం?' అంటూ ప్రెసిడెంటుని నిలేసాడు.
                   
ప్రెసిడెంటు ఆలోచనలో పడ్డాడు. మూడ్రోజులు ఏకధాటిగా మందుకొట్టి ఆలోచించాడు.

'పొరబాటున ఈ రొచ్చులో కాలుపెట్టా. ఇప్పుడు కాలు జాగ్రత్తగా కడుక్కొకపొతే నా ప్రెసిడెంటుగిరీకే ఎసరొచ్చేట్లుంది. ఈ అరెకరా ఆరుచెరువుల నీళ్ళు తాగిస్తుందనుకోలేదు. అయినా.. ఈ ముష్టిపొలం ఆ తాగుబోతెదవకి పొతే నాకేంటి? పిచ్చిముండ రంగికి పొతే నాకేంటి? సత్తెం జెప్పడానికి నేనేమన్నా అరిచ్చంద్రుణ్ణా? కాదుగదా! మరెందుకు నాకీ ధర్మసంకటం?'

మందు బాగా పనిచేసింది. ప్రెసిడెంటుకి కత్తిలాంటి ఐడియా తట్టింది.
                   
మర్నాడు.. అప్పుడెప్పుడో కోర్టు డఫేదారుగా పనిచేసిన తాగుబోతు కిట్టయ్యని పోరుగూర్నించి పిలిపించాడు. విషయం వివరించాడు. అతనికి సహాయంగా పదోక్లాసు పదిసార్లు తప్పి.. రోడ్లెంట జులాయిలుగా తిరుగుతున్న ఓ నలుగురు కుఱ్ఱాళ్ళనీ అదే ఊర్నించి పిలిపించాడు.

'ఈళ్ళందరూ ఓ కమిటీ.' అన్నాడు ప్రెసిడెంటు.

'కమిటీ అంటే ఏంది?' అనడిగారు ఊరిజనం.

'ఈళ్ళు మీరు జెప్పేది రాసుకుంటారు. ఆ తరవాత నాకు సలహా ఇస్తారు. అప్పుడు మీకు నేన్నాయం జేస్తాను.' అన్నాడు ప్రెసిడెంటు.
                   
కిట్టయ్య తన నలుగురు అసిస్టెంట్లతో కలిసి రంగీ, రంగడి బంధువులందర్నీ కలిశాడు. వాళ్లందరూ చెప్పింది రాసుకున్నాడు. ఎవరేం చెప్పినా రాసుకున్నాడు. తాము చెప్పే సోదంతా కమిటీ రాసుకోవటం ఊళ్ళోవాళ్ళకి భలే నచ్చింది. ఒక్కోడు చేటభారతాలు చెప్పాడు. కమిటీ మెంబర్లు బస్తాల కొద్దీ కాయితాలు నింపేశారు. ఊళ్ళో ఉన్న జనంకన్నా అభిప్రాయాలు ఎక్కువున్నై!
                   
తనకి అనుకూలంగా తీర్పు రావాలని వేడుకుంటూ.. కమిటీకి ఆరంగారంగా విస్కీ, బ్రాందీలు పోయించాడు రంగడు. రకరకాల మాంసాలతో వేపుళ్ళు వడ్డించాడు. బొమ్మిడాయిల పులుసు ఇళ్ళకి పంపించాడు. 'టీ' ఖర్చులకంటూ కొంతపైకం జేబులో కుక్కాడు.

రంగి కూడ అప్పోసప్పో చేసి బాగానే ఖర్చు పెట్టింది. ఆవిధంగా ఇరువైపులా తినీ, తాగీ.. తాగీ, తినీ.. ఆయాసం, రొప్పు రాగా మత్తుగా నిద్రపొయ్యారు. ఆపై నిద్రలేచి.. బద్దకంగా ఒళ్ళిరుచుకుంటూ.. నివేదిక అంటూ జోగినాధానికి ఒక 'సీల్డ్ కవర్' ఇచ్చాడు తాగుబోతు కిట్టయ్య.


ఊరి జనమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ప్రెసిడెంట్ సమక్షంలో సీల్డ్ కవర్ విప్పాడు జోగినాధం. అక్షరాలు కూడబలుక్కుంటూ పెద్దగా చదవసాగాడు.
                   
"ఆప్షన్ 1.రంగీ, రంగడు కలిసుండాలి. ఇది హిందూధర్మం."

రంగడు వైపోళ్ళు ఈలలేస్తూ డ్యాన్సు చెయ్యనారంభించారు. కళ్ళజోడు సరిచేసుకుంటూ ఆపమన్నట్లు చెయ్యి పైకెత్తి సైగ చేసాడు జోగినాధం.
                   
"ఆప్షన్ 2.తప్పనిసరైతే.. రంగీ, రంగడూ విడిపోవచ్చు. రంగి తనపొలం పుట్టింటికి తీసుకుపోవచ్చు."

ఈసారి రంగివైపు హర్షధ్వనాలు. మళ్ళీ చెయ్యెత్తాడు జోగినాధం!
                     
"ఆప్షన్ 3.రంగీ, రంగడు కలిసి విడిపోవచ్చు. విడిపోయి కలిసుండొచ్చు. కొన్నాళ్ళు కలిసి ఇంకొన్నాళ్ళు విడిపోవచ్చు."
                     
జనాలకి విషయం అర్ధమైంది. కిట్టయ్య కోసం వెతికారు. ఇంకెక్కడి కిట్టయ్య? ఎప్పుడో జారుకున్నాడు. జనాలు కిట్టయ్యని బూతులు తిడుతుంటే.. మీసాలచాటున ముసిముసిగా నవ్వుకున్నాడు ప్రెసిడెంట్.

షరా మామూలే. మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు.

మళ్ళీ రంగి అన్న తాగి తూలుకుంటూ ప్రెసిడెంటు మీదకెళ్ళాడు.
                       
ప్రెసిడెంటు ఆలోచించాడు.

"ఇప్పుడు మన ఇస్కూలు పంతులుతో ఒక ఏకసభ్య కమిటీ వేస్తున్నా." అంటూ ఆ ఊరి ప్రాధమిక పాఠశాల ఏకైక టీచరుకి కమిటీ బాధ్యతలప్పచెప్పాడు.

అసలే కూతురి పెళ్లి ఇబ్బందుల్లో ఉన్న పంతులు వణికిపొయ్యాడు. ఆరాత్రి మందుకొట్టే సమయంలో పంతులు చక్కబెట్టాల్సిన రాచకార్యాన్ని గీతోపదేశం చేశాడు ప్రెసిడెంటు. 'హమ్మయ్య' అనుకున్నాడు పంతులు.                


కొన్నాళ్ళకి అందరూ ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ఉదయం నుండి జోగినాధం టెన్షన్ తో చస్తుంటే.. ప్రెసిడెంటు ఆకాశమంటూ, మర్డరంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. అదీ కథ.

ఇప్పుడు విషయంలోకి వద్దాం.
                   
పంచాయితీ మొదలయ్యింది. పంతులు ఏవో చాలా పుస్తకాలు ప్రెసిడెంటు ముందుంచాడు. అవ్వన్నీ స్కూలు పిల్లల పరీక్షల తాలూకా నోటు పుస్తకాలు. ఆ సంగతి ఊర్లోవాళ్ళకి తెలీదు.

ఆ పుస్తకాల్ని చూసి 'అబ్బో! ఏదో అనుకున్నాం. ఇస్కూలు పిల్లకాయల నోటు బొక్కుల్నిండా పంతులు కూడా శానా రాసాడే!' అని మెచ్చుకున్నారు.

ఒక సీల్డ్ కవర్ జోగినాధానికి ఇచ్చాడు పంతులు.
                   
జోగినాధం ఆత్రంగా కవరు చించి ఒక పెద్ద కాగితం బయటకి  తీసాడు.

"ఇది సున్నిత సమస్య"

అని కాగితం మధ్యలో తాటికాయంత అక్షరాలతో రాసుంది.

తెల్లమొహంతో వెర్రిచూపులు చూస్తున్న జోగినాధానికి కన్ను కొట్టాడు ప్రెసిడెంటు.
                   
అర్ధం చేసుకున్న జోగినాధం "అయ్యబాబోయ్! సున్నిత సమస్యే!" అంటూ గుడ్లు తేలేశాడు.
                   
జోగినాధం చేతిలోని కాగితాన్ని తీసుకుని ఊరందరికీ చూపిస్తూ గంభీరంగా అన్నాడు ప్రెసిడెంటు.

"విన్నారుగా. ఇది సున్నిత సమస్య. అయినా తీర్పు చెప్పమంటే చెబుతా. కానీ.. ఆపై జరిగే అరిష్టానికి నేను బాధ్యణ్ణి కాను."  
                   
ఊళ్ళోవాళ్ళు అరిష్టం అనంగాన్లే భయపడిపోయారు. ఈమధ్యనే ఊర్లో అమ్మోరు పోసి నలుగురు చచ్చారు. కంగారుగా 'వద్దు, వద్దు, మాకు ఏ నాయం అక్కర్లేదు.' అంటూ పారిపోయారు.
                   
రంగి అన్నకి ఇందులో కుట్ర కనిపించింది. సున్నిత సమస్యంటే ఏందో చెప్పాల్సిందేనని తాగి ప్రెసిడెంటుని నిలదీశాడు. చిత్రం! ఆ అర్ధరాత్రి అతని గుడిసె పూర్తిగా ఎవరో కావాలని తగలబెట్టినట్లు కాలిపోయింది. ఆవిధంగా రంగి తాగుబోతు అన్నకి కూడా సున్నిత సమస్యంటే ఏంటో అర్ధమైపోయింది.
                   
ఆరోజు నుండి ఎవరూ రంగికి న్యాయం కావాలని అడగలేదు.

'పాపం! పెసిడెంటుబాబు దరమపెబువు. రంగికి నాయం చేద్దామని మాలావు పెయత్నం జేశాడు. కానీ.. ఆ ఇస్కూలు పంతులు ముందర కాళ్ళకి బందం ఏసాడు. ఆ బాబు ఊరి మేలు కోరేవాడు కాబట్టి నోరిప్పలేకపోతున్నాడు.' అనుకుని రంగివైపువాళ్ళు ఉసూరుమన్నారు.

'పెసిడెంటు మన మడిసి కాబట్టే చక్రం అడ్డేసాడు.' అని రంగడిముఠా సంతోషించింది.

ఈతీర్పు దెబ్బతో ప్రెసిడెంటు బంపర్ మెజారిటీతో ఎలక్షన్లో మళ్ళీ గెలిచాడు.


ఇంతకీ రంగీరంగళ్ళు ఏమయ్యారు?

ఈ సున్నిత సమస్య డ్రామా తన సమస్య తీర్చటం కోసం కాదనీ, ప్రెసిడెంటు ఓట్ల డ్రామా అని అర్ధమైన రంగికి పిచ్చెక్కింది. ఆ తరవాత ఇల్లిడిచి ఎటో పోయింది.

ఈ అన్యాయం తట్టుకోలేక రంగి అన్న తాగి రంగణ్ణి పొడిచేశాడు. రంగి అన్నని రంగడి తమ్ముడు పొడిచేశాడు. ఈ కత్తిపోట్ల పరంపర నేటికీ సాగుతూనే ఉంది. ఆఊళ్ళో సగంమంది యువకులు జైళ్ళల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన సగంమంది మందుకొట్టి రోడ్లమీద పొర్లుతున్నారు.
                   
ఒకప్పుడు పచ్చని చేలతో కళకళ్ళాడిన ఆఊరు నేడు వల్లకాడయ్యింది. ఆ తరవాత ప్రెసిడెంటుని ఎదురొడ్డేవాడే లేకుండాపొయ్యాడు. చచ్చేదాకా ఆయనే ఆఊరిని ఏలాడు. ఒక రోడ్డుగానీ, ఒక ప్రభుత్వ పథకంగానీ.. ఆఊరు చేరదు. అడిగే దిక్కు లేదు. అడిగినా.. సున్నిత సమస్యంటూ ప్రెసిడెంటు తీర్పు చెప్తాడనే భయం!
                   
అప్పట్నించీ ఆఊరుకి 'సున్నిత సమస్యాపురం'గా పేరొచ్చింది.

ఇప్పుడు బస్సుల మీద కూడా పేరు కుదించి 'ఎస్.ఎస్.పురం' అని రాస్తున్నారు."  

(picture courtesy : Google)