Showing posts with label బాలకృష్ణ. Show all posts
Showing posts with label బాలకృష్ణ. Show all posts

Friday, 4 May 2012

చిరంజీవి, బాలకృష్ణల సమస్య


నేను చదువుకునే రోజుల్లో చిరంజీవి సినిమాలు చాలా చూశాను. అతని సినిమాల్లో కథ ఉండదు. పక్కన రాధిక అనే అరవమ్మాయి హీరోయిన్ గా చేస్తుండేది. నెలకి రెండు కొత్తసినిమాలు రిలీజ్ అయ్యేవి. దాదాపు అన్నీ 'ఢిషుం.. ఢిషుం' సినిమాలే. ఇట్లాంటి కథలేని సినిమాలు స్నేహితులతో మంచి కాలక్షేపం. నాకున్న స్నేహితులు కూడా కబుర్లు చెప్పుకుంటూ సరదా కాలక్షేపంగా సినిమా చూసేవాళ్ళేగానీ.. అంతకుమించి సినిమాల గూర్చి పట్టించుకునేవాళ్ళు కాదు. అంత టైమూ ఉండేది కాదు.

సరే! చిరంజీవి అన్నయ్య రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పట్నించి తెలుగు న్యూస్ చానెళ్ళలో తరచుగా కనబడటం మొదలెట్టాడు. ఆవిధంగా.. సినిమాలు చూడ్డం మానేసిన నావంటి దుష్టుల దృష్టిలో మళ్ళీ పడ్డాడు. చెప్పుల కొట్లో పని చేసేవాడు అప్రయత్నంగా అందరి కాళ్ళకేసి చూస్తుంటాడు. అటులనే (నా వృత్తిరీత్యా) నాక్కూడా ఎదుటివాడు చెప్పే విషయం కన్నా చెప్పు (కాలికి తొడుక్కునే చెప్పు కాదు) విధముపై ధ్యాస మెండు.

టీవీలో కనబడుతున్న చిరంజీవిని జాగ్రత్తగా గమనించండి. అతనికి జర్నలిస్టులు అడిగే ప్రశ్నలు అర్ధం కావు. అయినా సరే! మొండిగా సమాధానం చెప్పబోతాడు. thought process మొదలవ్వంగాన్లే.. సడన్ బ్రేక్ పడుతుంది. ఇంజన్ స్టార్ట్ చేసి గేరెట్లా వెయ్యాలో తెలీనివాడిలా తెల్లమొహం. మైండ్ బ్లాంకయిపోతుంది.

ఆలోచనాదారాన్ని అందుకోవడానికి desperate గా ప్రయత్నిస్తుంటాడు. కానీ.. సాధ్యం కాదు. ఏవో నాలుగు ముక్కలు గొణుగుతాడు. ప్రశ్నే అర్ధం కాలేదు కావున గొణిగిన ఆ నాలుగు ముక్కలకి ఏ అర్ధమూ ఉండదు. అసలు సంగతి తెలీని అతని తమ్ముళ్ళు .. అన్నయ్య చెప్పేదేంటో అర్ధం చేసుకోలేక జుట్టు పీక్కుంటుంటారు. అందుకే అన్నయ్య తమ్ముళ్ళందరికీ బట్టతల వచ్చేసింది.

paid news లాగా paid రిపోర్టర్లని చిరంజీవి ఎరేంజ్ చేసుకుంటే మంచిది. ఈ paid రిపోర్టర్లు అడగమన్న ప్రశ్నలే అడుగుతారు. నిదానంగా.. ఆలోచిస్తూ సమాధానం చెబుతున్నట్లు.. spontaneous interaction లాగా చిరంజీవి వీక్షకుల్ని నమ్మించాలి. కానీ అన్నయ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పేపర్ అవుటవరాదు. అలాగే.. శత్రుక్యాంపుదారులైన ఈనాడు, ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు పోర్షన్లో లేని ప్రశ్నలడిగి తికమక పెట్టొచ్చు. అప్పుడు అన్నయ్య పని ఇంటర్ ఫిజిక్స్ పేపరయిపోతుంది!"

ఇప్పుడు మనం బాలకృష్ణ గూర్చి చెప్పుకుందాం. బాలకృష్ణకి జర్నలిస్టులడిగే ప్రశ్న అర్ధమవుతుంది. ఆలోచన కూడా ఉన్నట్లుంది. కానీ మెదడులోంచి నోటికండరాలకి కనెక్షన్లొ ప్రాబ్లెం! చిరంజీవి సమస్య స్టార్టింగ్ ట్రబులైతే బాలకృష్ణ ది బ్రేకుల్లేని డ్రైవింగ్. స్టార్టింగే డైరక్ట్ గా టాప్ గేర్. అందుకే అతను మాట్లాడుతుంటే ఏదో speed race చూస్తున్నట్లుంటుంది. మాటల్లో సూపర్ స్పీడ్. కళ్ళు మూసుకుని, చెవులు రిక్కించి, తీవ్ర ఏకాగ్రతతో విన్నా ఒక్కముక్క కూడా అర్ధమయ్యిచావదు. మొన్నామధ్య మా సుబ్బు అరగంటపాటు బాలకృష్ణ స్పీచ్ విని రెండు మాటలు పట్టాడు. అవి.. నాన్నగారూ.. ఊ.. ఊ.. . ఇంకోటి నందమూరి వంశం.. ఊ.. ఊ.. ! మూడో మాట పట్టడం సుబ్బు వల్ల కాలేదు.

బాలయ్యబాబు స్పీడుకి బ్రేకులెయ్యడం ఎవరికీ సాధ్యంకాదు. అందుకని బాలకృష్ణ టీవీ చానెళ్ళ ఓనర్లతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది. అతని ఇంటర్వ్యూ ముందే రికార్డ్ చేసుకుని.. తరవాత స్లో మోషన్లో replay చేస్తే బెటర్. అప్పుడు మాట slow అయ్యి.. చూసేవాళ్లకి కొద్దోగొప్పో అర్ధం అవ్వొచ్చు. కానీ lip sync కుదరకపోవచ్చు. ఈ సాంకేతిక సమస్య అధిగమించడం అంత కష్టం కాకపోవచ్చు.

చిరంజీవి, బాలకృష్ణలు అమాయకులు కాదు. తాము చెప్పేది జనాలకి అర్ధం కావట్లేదని వాళ్ళకీ అనుమానం ఉన్నట్లుంది. అందుకే మీసాలు మెలేయ్యడం, తొడలు కొట్టడంలాంటి విన్యాసాలు చేస్తున్నారు.

నా కజినొకడు తెలుగు సినిమా వీరాభిమాని. రాజకీయాలు అస్సలు తెలీవు. అతగాడు చిరు, బాలయ్యలిద్దర్లో ఒకరు ముఖ్యమంత్రి, ఇంకొకరు కేంద్రమంత్రి కావాలని పూజలు చేస్తున్నాడు. నాక్కోపం వచ్చింది. "ఎంత సినిమా పిచ్చోడివైనా.. నీపిచ్చి సినిమాలతో ఆపెయ్యి. రాజకీయాల్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలని పూజలు చెయ్యడం టూ మచ్." అన్నా.

నా కోపానికి నొచ్చుకున్న నా కజిన్ "నిజంగా నాకు రాజకీయాలు తెలీవు. కానీ వాళ్ళు మినిస్టర్లు కాకపొతే మళ్ళీ సినిమాల్లో నటిస్తారనే భయమే నాతో ఈ పూజలు చేయిస్తుంది. వాళ్ళు లేకపోతే ఇప్పుడు తెలుగు సినిమా హాయిగా, ప్రశాంతంగా ఉంది." అన్నాడు!

నిన్న నా స్నేహితుడు నాదగ్గరకి తన కొడుకుతో వచ్చాడు. కుర్రాడు చాకులాగున్నాడు. తెలివైనవాడు. ఏవో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాట్ట.

నేను నా స్నేహితుడితో "మీ వాణ్ణి జర్నలిజం స్కూల్లో చేర్పించు. మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు ఇతనిలో  పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి కనిపిస్తున్నారు. ఇంత తెలివైనవాణ్ణి వెధవ జీతాల కోసం పనిచేసే ఉద్యోగాల్లో పడేసి వృధా చెయ్యకు." అన్నా.

అతగాడు నన్ను ఎగాదిగా చూశాడు. "నీ ప్రాక్రీస్ పెంచుకోవాలంటే వేరే మార్గాలు చూసుకో. నీకన్ను నాకొడుకు మీదే పడిందా!" నిష్టూరంగా అన్నాడు.

అర్ధం కాలేదు. బిత్తరపోయి చూస్తున్న నన్ను చూసి పెద్దగా నవ్వాడు.

"నువ్వు పెద్దగా టీవీ చూడవనుకుంటా. మా తమ్ముడు హైదరాబాదులో జర్నలిస్టు. ప్రస్తుతం తెలుగు జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు జానారెడ్డి, కేశవరావులే జర్నలిస్టుల్ని తికమక పెట్టేవాళ్ళు. జానారెడ్డి గంటసేపు మాట్లాడినా ఒకట్రెండు పాయింట్లు వెతికి పట్టుకుని దాన్నే సాగదీసి రాసి.. పని అయిందనిపించేవాళ్ళు. కేశవరావు ఏభాషలో ఏంచెబుతున్నాడో అర్ధం చేసుకోడానికి ప్రయత్నించిన ఇద్దరు రిపోర్టర్లు ఎర్రగడ్డలో తేలారు. ఉన్నవాళ్ళతోనే చస్తుంటే ఇప్పుడు కొత్తగా చిరంజీవి, బాలకృష్ణలు వచ్చి చేరారు. ఇప్పుడున్న జర్నలిస్టులే ప్రాణాలకి తెగించి.. యుద్ధ వార్తలు కవర్ చేస్తున్నట్లు పనిచేస్తుంటే.. నాకొడుకుని జర్నలిస్టు అవ్వమంటావేమిటి!" అన్నాడు.

"సారీ మిత్రమా! నాకు తెలీదు." అన్నాను.

నా మిత్రుడు చిన్నగా నవ్వాడు.

"ఇంత చిన్నదానికి సారీలు ఎందుగ్గానీ.. నా అభిమాన రాజకీయ నాయకులు మాత్రం జానా కేశవ చిరు బాలయ్యలే! రాజకీయనాయకులు తియ్యటి ప్రసంగాలు చేస్తారు. చక్కటి వాగ్దానాలు చేస్తారు. వాళ్ళు చెప్పేది విని మనం మోసపోతాం. దానికన్నా ఏవీ అర్ధం కాకుండా మాట్లాడేవాళ్ళే బెటర్." అన్నాడు.

(photos courtesy : Google)

Friday, 2 March 2012

గురువుగారి జ్ఞాపకాలు.. నా బాలకృష్ణ అభిమానం!

నాకు బాలకృష్ణ అంటే ఇష్టం, అట్లని నేను బాలకృష్ణ అభిమానిని కాను. బజ్జీలంటే ఇష్టమేగానీ, బజ్జీలు తినను అన్నట్లు కంఫ్యూజింగ్‌గా వుందికదూ! చదువరులు నన్ను మన్నించాలి, విషయం తెలియాలంటే నా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళాల్సిందే!

అవి నేను గుంటూరు మాజేటి గురవయ్య హైస్కూల్లో పదోక్లాసు చదువుతున్న రోజులు. సుబ్బారావు నాకు క్లాస్మేట్. బోర్లించిన మరచెంబు మొహంతో, గుండ్రంగా కార్టూన్ కేరక్టర్లా వుంటాడు. అప్పుడే నిద్ర లేచినట్లు మత్తుగా, బద్దకంగా వుంటాడు. రోజూ తలకి దట్టంగా ఆవఁదం పట్టిస్తాడు. నుదుటిమీదా, మెడవెనుకా ఆవఁదం మరకలు మరియూ ఆవఁదం కంపు. అంచేత సుబ్బారావు 'ఆవఁదం సుబ్బడు'గా ప్రసిద్ధుడయ్యాడు.

ఆవఁదం సుబ్బడికి చదువంటే అమితమైన ఆసక్తి. పొద్దస్తమానం పుస్తకంలోకి తీవ్రంగా చూస్తూంటాడు, సీరియస్‌గా వల్లె వేస్తుంటాడు. కానీ పాపం! సుబ్బడికి నత్రజనికీ, నక్షత్రానికీ తేడా తెలీదు. గాంధీ గోడ్సే అన్నదమ్ములంటాడు. అమీబాకీ అమెరికాకి యేదో సంబంధం వుందని అనుమానిస్తాడు. సహజంగానే సుబ్బడికీ యేనాడూ పదిమార్కులుకూడా రాలేదు.

డబుల్ డిజిట్స్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న మా సుబ్బడు, వున్నట్టుండి ఒకసారి సైన్స్‌లో పాసైపొయ్యాడు! నాపక్కనున్నవాడు కూపీలు లాగడంలో సిద్ధహస్తుడు. క్షణకాలంలో సుబ్బడి ఆన్సర్ షీట్‌ని స్కాన్ చేసేశాడు. సుబ్బడు ఆన్సర్ షీట్ పాసయ్యేంతగా లేదనే రహస్యాన్ని నాచెవిలో వూదాడు.

మాకు సైన్స్ టీచర్ పరిమి ఆంజనేయశర్మగారు. ఆయన తెల్లగా, లావుగా, చిరుబొజ్జతో.. తెల్లని పంచె, లాల్చీతో.. పొడుగుజుట్టుతో.. కూనిరాగాలు తీస్తుంటారు. ఆయన పిల్లల్లో పిల్లాడు. అంచేత సరదాగా, హాయిగా పిల్లలతో కలిసిపొయ్యేవారు. అయన విద్యార్ధుల పట్ల మొరటుగా ప్రవర్తించరు, కనీసం పరుషంగానైనా మాట్లాడరు.

ఆంజనేయశర్మగారు సైన్సు పాఠాన్ని ఒక కథలాగా చెప్తారు, ఆ విధానం చాలా అసక్తిగా వుంటుంది. వారు నోట్సులకి వ్యతిరేకి, టెక్స్ట్‌బుక్స్ మాత్రమే చదవాలి. పాఠం అయ్యాక మేం డౌట్లు అడగాలి, ఆ డౌట్ల నివృత్తి కోసం క్లాసు చివర్లో కొంతసమయం కేటాయించుకునేవారు. ఈ ప్రశ్నలు సమాధానాల సెషన్ చాలా ఉత్సాహభరితంగా, వివరణాత్మకంగా వుంటుంది. అంతే! పాఠం అయిపోయింది, ఇంకేం లేదు. ఇదే మా మాస్టారి బోధనాపధ్ధతి.

మాకాయన బెస్ట్ ఫ్రెండ్ కూడా. నేను ప్రభుత్వ గ్రంధాలయంలో చందమామ రెగ్యులర్‌గా చదివేవాణ్ని, అక్కడ పాత చందమామలు సంవత్సరాల వారిగా హార్డ్‌బౌండ్ చేసి ర్యాకుల్లో నీట్‌గా సర్ది వుంచేవాళ్ళు. ఆ చందమామలు నాకు విందుభోజనంతో సమానం. మాస్టారుకి నా చందమామల పిచ్చి తెలుసు. అంచేత క్లాసులో నాతో పిల్లలకి చందమామ కథలు చెప్పించేవారు. గమ్మత్తేమంటే పిల్లలతోపాటు ఆయనకూడా శ్రద్ధగా నా కథలు వినేవారు! ఒక కథని వినేవాళ్ళకి ఆసక్తిదాయకంగా వుండేందుకు నాటకీయంగా ఎలా చెప్పాలో కూడా టిప్స్ ఇచ్చేవారు.

సరే! మనం మళ్ళీ మన ఆవఁదం సుబ్బడి మార్కుల విషయానికొద్దాం. సుబ్బడికి పొరబాటున మార్కులు ఎక్కువేసిన విషయం ఆయన దృష్టికి తీసికెళ్ళాను. ఆయన చిన్నగా నవ్వారు, ఆ తరవాత ఒకక్షణం ఆలోచించారు. ఆపై రహస్యం చెబుతున్నట్లు లోగొంతుకతో ఇలా అన్నారు -

"ఒరే నానా! ఎప్పట్లాగే నీకు మంచిమార్కులు వచ్చాయిగదా. సుబ్బారావుతో నీకు పోటీ ఏంటి నానా? పాపం! ఆ వెధవాయ్ మార్కుల కోసం తెగ కష్టపడుతున్నాడు నానా. ఇంతకు ముందుకన్నా చాలా ఇంప్రూవ్ చేశాడు. వాడినిప్పుడు పాస్ చెయ్యకపోతే అసలు చదువు మీదే ఇంట్రస్ట్ పోతుంది. ఈ సంగతి వాడికి తెలీనీకు నానా, తెలిస్తే హర్టవుతాడు." ('నానా!' అనేది మాస్టారి ఊతపదం.)

నాకప్పుడర్ధమైంది. గురువుగారు పేపర్ దిద్దడంలో కేవలం పరీక్షల కోణం మాత్రమే కాకుండా ఇతర అంశాల్ని కూడా అలోచిస్తారని! నేను మా గురువుగారికి శిష్యుణ్ని. అంచేత ఆయన ఆలోచనా సరళిని అనుకరిస్తాను. సుబ్బడువంటి కష్టజీవులపట్ల సానుభూతి, ఆదరణ, ప్రేమ కలిగి ఉండాలని వారి దగ్గరే నేర్చుకున్నాను.

ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ దగ్గరకొద్దాం. బాలకృష్ణంటే నాకెందుకు ఇష్టమో ఇప్పుడు మీకర్ధమైయ్యుంటుంది. బాలకృష్ణ డాన్స్ చేసే విధానం చూడండి. అందులో నాకు ఎంతో సిన్సియారిటీ కనిపిస్తుంది. ఎంతో కష్టపడి శరీరభాగాల్ని కదుపుతూ, ఆయాసపడుతూ, చిన్నప్పుడు మనం డ్రిల్ క్లాస్‌లో పడ్డ కష్టాలన్నీ పడతాడు. అతని పట్టుదల చూడ ముచ్చటగా వుంటుంది.

సినిమా రంగంలో కమల్ హాసన్, ప్రభుదేవా వంటి మంచి డ్యాన్సర్లు వున్నారు. వాళ్ళు వంకర్లు తిరిగిపోతూ డ్యాన్సులేస్తారు. ఇదేమంత విశేషం కాదు, విశేషమంటే బాలకృష్ణ డ్యాన్సే. ఆవఁదం సుబ్బడు పదిమార్కులు దాటడానికి పడ్డ తపన, శ్రమ నాకు బాలకృష్ణ డ్యాన్స్ చేసే ప్రయత్నంలో కనిపిస్తుంది!
                               
బాలకృష్ణ డైలాగుల్ని గమనించండి. అతనిలో తండ్రి గంభీరత, స్పష్టత, నైపుణ్యతలు లేశమాత్రమైనా లేవు. కానీ ఎంతో కష్టపడతాడు, శ్రమిస్తాడు. హోటల్ కార్మికుడు  పిండి రుబ్బినట్లు, కూలీవారు రాళ్ళు పగలకొట్టేట్లు.. అత్యంత ప్రయాసతో సంక్లిష్టమైన పదాలు, వాక్యాలు పలుకుతుంటాడు. గుండె ఆపరేషన్లు చేసే తండ్రికి పుట్టినందువల్ల కనీసం కాలు ఆపరేషనైనా చేద్దామనే తపన, ఆరాటం నాకు బాలకృష్ణలో కనిపిస్తుంది. ఎవరిలోనైనా ఈ గుణాన్ని మనం మెచ్చుకోవలసిందే.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కొందరు మహానుభావులు తోటికళాకారుల ప్రతిభాపాటవాల్ని ఖచ్చితత్వంతో విమర్శిస్తారు. శంకరాభరణం శంకరశాస్త్రి 'శారదా!' అనే గావుకేకతో కూతురిపెళ్లిని చెడగొట్టుకున్నాడు. ఆయన చెప్పదలచుకున్న సంగతి గావుకేక లేకుండా కూడా చెప్పొచ్చు. కానీ ఆయనలా చెప్పడు, చెబితే శంకరశాస్త్రి ఎలాగవుతాడు!?

మరప్పుడు ఆ శంకరశాస్త్రి మన బాలకృష్ణతో ఏంచెబుతాడు? - "చూడు బాలయ్యా! కళ అనేది కమ్మని ఫిల్టర్ కాఫీ వంటిది. ఆ స్వచ్చమైన కమ్మని కాఫీలో నీ నటన అనబడే ఈగపడి తాగడానికి పనికిరాకుండా చెయ్యరాదు. కాఫీ ఈజ్ డివైన్ వెదర్ ఇటీజ్ ఫిల్టర్ ఆర్ ఇన్స్టంట్." అని నిక్కచ్చిగా, నిర్దయతో చెప్పేస్తాడు.

ఒక మంచిప్రయత్నాన్ని నీరుగార్చే ఎస్వీరంగారావు మార్కు ధోరణి నాకు నచ్చదు. అన్నట్లు ఎస్వీరంగారావు బాలకృష్ణ పౌరాణిక సినిమా చూస్తే ఏమంటాడు? గద పైకెత్తి పట్టుకుని, క్రోధంతో మీసం మెలిస్తూ, ఈవిధంగా గర్జిస్తాడు.

"తుచ్ఛఢింభకా! ఏమి నీ భాష? నీ భాషాహననము కర్ణకఠోరముగా యున్నది. యేమి నీ హావభావములు? వీక్షించుటకు మనసు రాకున్నది. దీన్ని నటన అందువా బాలకా? ఇది యేదైనా అగునేమో గానీ నటన మాత్రం కానే కాదు. ఓయీ భాషా హంతకా! నటనా శూన్యా! అద్భుత ప్రతిభాశాలియైన నీతండ్రి నా మదీయ మిత్రుడైన కారణాన నిన్ను ప్రాణములతో వదిలివేయుచున్నాను. నీవు ఇప్పుడే కాదు, భవిష్యత్తునందు కూడా ఎక్కడైనా ఎప్పుడైనా డైలాగులు చెప్పజూచితివా - నా గదాదండమున నీతల వేయిచెక్కలు గావించెద. నీకిదియే నాతుది హెచ్చరిక."

అదే మా గురువుగారైతే ఏం చేసేవారు? బాలకృష్ణకి షేక్‌హ్యాండ్ ఇస్తారు, ఆప్యాయంగా కౌగిలించుకుంటారు, మెచ్చుకోలుగా భుజం తడతారు. ఆ తరవాత సంతోషంగా ఇలా అనేవారు.

"నానా బాలయ్యా! చాలా బాగా చేశావ్. నాకు నీలో పెద్దాయన కనబడుతున్నారు నానా. నీకు తొంభై మార్కులు వేస్తున్నా, ఇంకొంచెం కష్టపడు నానా. నీ తండ్రిగారి స్థాయిని తప్పకుండా అందుకుంటావ్. నువ్వు ఈసారి వందమార్కులు తెచ్చుకోవాలి నానా!"

మా గురువుగారు సహృదయులు, అమాయకులు. అందువల్ల ఆయనకి ప్రతిభ ఒకాటే కాదు, ప్రయత్నం కూడా గుమ్మడికాయంత సంతోషాన్నిస్తుంది. గురువుగారి ప్రోత్సాహంతో ఆవదం సుబ్బడు తీవ్రంగా, ఘోరంగా, బీభత్సంగా తపస్సు చేసి అత్తెసరు మార్కులతో పదోక్లాసు గట్టెక్కాడు. అటుపిమ్మట ఉన్నతోద్యోగంలో ఉన్న తన మేనమామ సాయంతో ఒక ప్రభుత్వ చిరుద్యోగిగా రూపాంతరం చెంది జీవితంలో సెటిల్ అయిపోయ్యాడు.

మా గురువుగారి శిష్యులు డాక్టర్లు, ఇంజనీర్లు చీమల్లా, దోమల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మేం ఆంజనేయశర్మగారి దగ్గర పాఠాలు నేర్చుకోవడం మా జీవితాల్లో ఒక చెరగనిముద్ర వేస్తాయని మాకు అప్పుడు తెలీదు (కొన్ని అనందాలు అనుభవిస్తున్నప్పుడు తెలీదు). నాదృష్టిలో ఆయన మాఅందరికన్నా ఆవదం సుబ్బడికే ఎక్కువ సహాయం చేశారు.

ప్రతిభ అనేది యాంత్రికంగా పాఠ్యాంశాల మనన కార్యక్రమాల ద్వారా మాత్రమే నిర్ణయించకూడదనీ, కష్టపడే తత్వాన్ని ప్రోత్సాహించాలనీ, పరుగు పందెంలో కుందేలుకి, తాబేలుకి డిఫరెంట్ యార్డ్‌స్టిక్ వుండాలనీ మా గురువుగారి అభిప్రాయం.

ముగింపు -

శ్రీ పరిమి ఆంజనేయశర్మ గారు.
సైన్స్ మరియు లెక్కల అధ్యాపకులు.
శ్రీ మాజేటి గురవయ్య హై స్కూల్, గుంటూరు.
డెబ్భై మరియు ఎనభయ్యవ దశకంలో మాలాంటి ఎందరికో స్పూర్తిప్రధాత.

మా గురువుగారి గూర్చి రాస్తూపొతే చదువరులకి విసుగనిపించవచ్చు. అంచేత నాకిష్టమైన, అలవాటైన విద్య - సినిమా సంగతుల్ని కలిపి రాశాను. అందుకోసం ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ గూర్చి రాశాను, అతని అభిమానులు సరదాగా తీసుకోగలరని నా నమ్మకం.    

Saturday, 26 November 2011

శ్రీరామరాజ్యం

"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు. టీవీలో బాపు 'శ్రీరామరాజ్యం' కమర్షియల్ వస్తుంది. 

టీవీ చూస్తూ "ఈ బాపుకి ఎంత ఓపిక! అరిగిపోయిన రికార్డులా రామాయణాన్ని తీస్తూనే ఉన్నాడు గదా!" అంటూ ఆశ్చర్యపడిపొయాడు సుబ్బు.

"సుబ్బు! నేను బాపు అభిమానిని, చూజ్ యువర్ వర్డ్స్." స్థిరంగా అన్నాను.

"నాకు తెలుగు సినిమా దర్శకుల్ని చూస్తుంటే హోటల్లో అట్టుమాస్టర్లు గుర్తొస్తారు. ఆనందభవన్లో ముత్తు నలభయ్యేళ్ళుగా అట్టుమాస్టర్. మనిషి నల్లగా నిగనిగలాడుతూ కాలిన పెనంలా, బక్కగా ఎండిపోయిన చుట్టలా వుంటాడు. దించిన తల ఎత్తకుండా దీక్షగా బుల్లిగిన్నెలో పిండి తీసుకుని పల్చగా, గుండ్రంగా అట్లు పోస్తూనే ఉంటాడు." అన్నాడు సుబ్బు.

"అవును, అయితే?" అన్నాను.

"ముత్తు అట్లకాడతో స్టీలు మగ్గులోంచి నూనె అట్టుమీదకి జల్లటం ఎంతో కళాత్మకంగా వుంటుంది! పిండిచెయ్యిని నీళ్ళబొచ్చెలో ముంచి - కొన్నిట్లో బంగాళదుంప మసాలా, కొన్నిట్లో ఉల్లిపాయలు గుప్పిటతో ఎంతో పొందికగా పెడతాడు. మళ్ళీ నూనెని అట్లకాడతో ఇంకోరౌండ్ జల్లి, అట్టుని లాఘవంగా చుట్టి పక్కనున్న పెద్ద సత్తుప్లేట్ మీద పెట్టి, అట్లకాడతో టకటకమంటూ శబ్దం చేస్తాడు. అది - 'అట్టు రెడీ!' అని సర్వర్‌కి తెలియజేసే కోడ్." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! విషయానికి రా." విసుక్కున్నాను.

"వస్తున్నా! వస్తున్నా! అట్లు పోయ్యటంలో గొప్ప ప్రతిభాశీలి అయిన ముత్తుకి ఇడ్లీలు వెయ్యడం రాదు! పొద్దస్తమానం అట్లుపోస్తూ, పక్కనే ఉండే ఇడ్లీమాస్టర్‌తో కబుర్లాడుతుంటాడు, కానీ ముత్తుకి ఇడ్లీ గూర్చి తెలీదు!"

"ఆశ్చర్యంగా ఉందే!"

"ఇందులో ఆశ్చర్యమేముంది? నువ్వు కూడా ముత్తు సోదరుడివే! ఎప్పుడూ 'మానసిక వైద్యం' అనే అట్లు మాత్రమే పోస్తున్నావుకదా!"

"ఓ! నువ్వా రూట్లో వచ్చావా!" నవ్వుతూ అన్నాను.

ఇంతలో వేడిగా కాఫీ వచ్చింది, కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.

"తెలుగు సినిమారంగం మొత్తం ముత్తు సోదరులే! విఠలాచార్య ఒకేరకమైన సినిమాలు పుంజీలకొద్దీ తీశాడు. అన్నిసినిమాల్లో అవే గుర్రాలు, అవే కత్తులు! పులులు, పిల్లులు, కప్పలు రెగ్యులర్ ఆర్టిస్టులు. కథ చుట్టేయ్యటానికి దొరికితే రామారావు, దొరక్కపోతే కాంతారావు. ఆయన జానపద సినిమాలు అనే 'అట్లు' పోసీపోసీ కీర్తిశేషుడయ్యాడు." అన్నాడు సుబ్బు.

"సుబ్బు! మనం ఒక్క విఠలాచార్య సినిమాకూడా వదల్లేదుగదూ!" సంతోషంగా అన్నాను.

"కె.ఎస్.ఆర్.దాస్ అనే దర్శకుడు లెక్కలేనన్ని 'డిష్షుం డిష్షుం' సినిమాలు తీశాడు. దొరికితే కృష్ణ, దొరక్కపొతే విజయ లలిత! ఆయన దగ్గర ఇంకా పిండి చాలా ఉంది. కానీ - ఆయన అట్లు తినడానికి ప్రేక్షకులు అనే కస్టమర్లు మాయమయ్యారు, అంచేత నేచురల్‌గానే నిర్మాత అనే పెనం దొరకలేదు."

"ఆయన దాదాపు ఇంగ్లీషు సినిమాలన్నీ తెలుగులో తీసేశాడు!" ఉత్సాహంగా అన్నాను.

"ఇంక రాంగోపాల్ వర్మ! గాడ్‌ఫాదర్ సినిమాని తిరగేసి తీశాడు, బోర్లించి తీశాడు, మడతపెట్టి  తీశాడు, చితక్కొట్టి తీశాడు, పిసికి పిసికి తీసాడు, ఉతికి ఉతికి తీశాడు! ఒకే పిండి, ఒకే అట్టు. రకరకాలుగా పేర్లు మార్చి కస్టమర్లని మోసం చేస్తుంటాడు."

"ఐ అగ్రీ." నవ్వుతూ అన్నాను.

"బాపు రమణల స్పెషాలిటీ 'రామాయణం' అనే దోసెలు. రమణ తగుపాళ్ళలో పిండిరుబ్బి బాపుచేతికి అందిస్తే, ఇంక బాపు మన ముత్తులాగా రెచ్చిపోతాడు. ఒకసారి ముత్తుని 'అట్టు కొంచెం పెద్దదిగా, స్పెషల్‌గా వెయ్యి ముత్తు' అనడిగా. ముత్తు గారపళ్లన్నీ బయటపెట్టి నవ్వుతూ 'అదెట్టా కుదురుద్ది సుబ్బు బాబు! అట్టా సైజ్ మార్చాలంటే చెయ్యి వణుకుద్ది, వాటం కుదరదు.' అన్నాడు."

"నిజమా!" ఆశ్చర్యపోయాను.

"అవును. మలయాళం దర్శకుడు అరవిందన్ ఆంధ్రా అడవుల్లో చెంచుదొరల్తో 'కాంచనసీత' అనే సినిమా కొత్తదనంతో వెరైటీగా తీశాడు. కొత్తరకంగా ఆలోచించాడని విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. బాపురమణలు ముత్తుకి సోదరులు, వారికి కొత్తఐడియాలు వచ్చే అవకాశం లేదు." అన్నాడు సుబ్బు.

"సుబ్బు! బాపు రమణలు చాలా ప్రతిభావంతులు." అన్నాను.

"కాదని నేనలేదే! కానీ నువ్వో విషయం గ్రహించాలి. దోసెలన్నీ ఒకటే. అట్లే వృత్తులన్నీ ఒక్కటే. నీ వైద్యవృత్తి క్షురకవృత్తి కన్నా గొప్పదేమీకాదు. కానీ మనం కొన్ని ప్రొఫెషన్లకి లేని గొప్పదనాన్ని ఆపాదిస్తాం. అలాగే విఠలాచార్య, కె.ఎస్.ఆర్.దాస్, వర్మ, బాపురమణలు ఒకేగొడుగు క్రిందకొస్తారు. కానీ మనం దేవుడి సినిమాలు తీసేవాళ్ళనే గొప్పవారంటాం. ఇక్కడ మతవిశ్వాసాలు కూడా ప్లే చేస్తాయి." అన్నాడు సుబ్బు.

"నీ ఎనాలిసిస్ బాగానే ఉందిగానీ - రాత్రికి 'శ్రీరామరాజ్యం' వెళ్దామా?" అడిగాను.

"ఆ సినిమా తీసింది కుర్రాళ్ళ కోసం. మనలాంటి ముసలాళ్ళ కోసం ఎన్టీరామారావు 'లవకుశ' ఉందిగా. నీకు చూడాలనిపిస్తే మన లవకుశ ఇంకోసారి చూసుకో. నాదృష్టిలో లవకుశ సినిమాకి అసలు హీరో ఘంటసాల! రాముడిగా రామారావుని చూశాక ఇంకెవ్వర్నీ చూళ్ళేం!" అన్నాడు సుబ్బు.

"నువ్వెన్నయినా చెప్పు. బాపురమణలు తెలుగువాళ్లవడం మన అదృష్టం." నేనివ్వాళ సుబ్బుని ఒప్పుకోదల్చుకోలేదు.

"నేను మాత్రం కాదన్నానా? బాపురమణలకి రామాయణమే జీవనాధారం. అదే కథని నలభయ్యేళ్ళుగా నమ్ముకున్నారు. రామాయణాన్ని తీసేవాడు దొరక్కపొతే ఆ కథకే ప్యాంటూ, చొక్కా తొడిగి సోషల్ పిక్చర్లు చుట్టేశారు.. రామకోటి రాసినట్లు! ఫలితంగా దండిగా పుణ్యం మరియూ సొమ్ము మూట కట్టుకున్నారు."

"ఈ విషయం ఇంకెక్కడా అనకు, భక్తులు తంతారు." నవ్వుతూ అన్నాను.

సుబ్బు కాఫీ తాగటం పూర్తిచేసి కప్పు టేబుల్ మీద పెట్టాడు.

"బాపుకి ఫైనాన్స్ చేసేవాడు దొరికాడు, నటించేవాడూ దొరికాడు. అట్టు పోసేశాడు. చూసేవాడు చూస్తాడు, చూడనివాడు చూడడు. ఎవడి గోల వాడిది. ఉప్మాపెసరట్టు అందరికీ నచ్చాలని లేదుకదా." అన్నాడు సుబ్బు.

"అంతేగదా." అన్నాను.

"అయినా యే సినిమా గొప్పదనం ఆ సినిమాదే. ఇప్పటి శ్రీరామరాజ్యంని ఎప్పుడో సి.పుల్లయ్య తీసిన లవకుశతో తూకం వేద్దామనుకోవటం అశాస్త్రీయం కూడా. ఈ రోజుల్లో సినిమాలు టెక్నికల్‌గా ఎంతముందుకెళ్ళాయో, నటన విషయంలో అంత వెనక్కొచ్చాయి. ఇది అన్ని భాషల్లోనూ జరుగుతుందే." అన్నాడు సుబ్బు.

"మరి తియ్యటం దేనికో!" అడిగాను.

"ఏ భాషలోనయినా పాతక్లాసిక్స్ మళ్ళీ తియ్యటం జరుగుతుంది. అలా అనుకుంటే రామారావుతో లవకుశ తీసి వుండేవాళ్ళుకాదు. ఎన్టీరామారావు కొడుకు రాముడి వేషం వేస్తున్నాడని జనాలు ఆసక్తిగా ఉన్నారు. అసలు ఈ సినిమాకి పబ్లిసిటీ పాయింటే అది." అన్నాడు సుబ్బు.

"అవును."

"రాజులాగా యువరాజు, పెదరాయుడిలా చినరాయుడు, రాజీవ్ గాంధీలా రాహుల్ గాంధీ! రాచరిక వ్యవస్థని రద్దు చేసుకున్నాం గానీ - బానిస భావాలని బుర్రలోంచి రద్దు చేసుకోలేకపోతున్నాం. బహుశా మన సమాజం తగినంతగా ఎడ్యుకేట్ కాకపోవటం.. ప్రాంతం, కులం ప్రభావాల నుండి బయటపడలేకపోవటం కారణం కావొచ్చు." అన్నాడు సుబ్బు.

"మొత్తానికి నీ ముత్తు థియరీ బాగానే వుంది." నవ్వుతూ అన్నాను.

"థాంక్యూ! అవును - ముత్తు అట్లు పోస్తున్నట్లు బాపురమణలు రామాయణం తీస్తూనే వున్నారు. అందుకే నాకు ముత్తు, బాపురమణలు ఇష్టులు! వీరు తమకి తెలిసిన ఏకైక పనిని ఏమాత్రం విసుగు లేకుండా మళ్ళీమళ్ళీ చేస్తూనే వుంటారు!"  అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.