Showing posts with label లీల. Show all posts
Showing posts with label లీల. Show all posts

Friday, 29 November 2013

పి.లీల.. నాకు భలే ఇష్టం!


నాకు చిన్నప్పట్నుండి చాలా ఇష్టాలున్నాయి, కొన్ని అయిష్టాలూ ఉన్నాయి. అయితే - ఇష్టమైనవి ఎందుకిష్టమో, ఇష్టం లేనివి ఎందుకయిష్టమో చెప్పగలిగే తెలివి అప్పుడు లేదు.

'ఇప్పుడు చిన్నవాణ్ణి కదా! పెద్దయ్యాక వీటన్నింటికీ కారణాలు తెలుస్తాయిలే.' అని సరిపుచ్చుకునేవాణ్ని. దురదృష్టం! పెద్దయ్యాక్కూడా జ్ఞానానికి సంబంధించి నా పరిస్థితిలో మార్పు రాలేదు.

నా జీవితంలో మొట్టమొదటగా నే విన్న పాట అమ్మ పాడింది. కావున నాకు తెలిసిన మొదటి గాయని అమ్మే. ఇదేమంత విశేషం కాదు. చాలామందికి వారి తల్లులే మొదటి గాయకులు. అయితే నే చెప్పేది 'చందమామ రావే, జాబిల్లి రావే!' టైపు పాట కాదు, చక్కటి సినిమా పాట. ఎలా? ఎప్పుడు?

చిన్నప్పుడు రోజూ అమ్మ పక్కలో పడుకునేవాణ్ని. అందుకొక బలమైన కారణం ఉంది. అమ్మ తప్ప ఇంట్లో ఎవరూ నన్ను తమ పక్కలో పడుకోబెట్టుకోడానికి సాహసించేవాళ్ళు కాదు. నేను వారి పక్కలో పడుకునే హక్కుని కోల్పోయాను, ఇది నా స్వయంకృతాపరాధం. 

స్కూల్లో అవుట్ బెల్లు కొట్టేవాళ్లు.. స్నేహితుల్తో కలిసి పరిగెత్తుకుంటూ వెళ్లి రోడ్డు పక్కన పాసు పోసుకుంటుండగా.. కొద్దిసేపటికి చల్లగా అనిపించి మెళకువ వచ్చేది. చూసుకుంటే నిక్కరు, దుప్పటి ముద్దగా తడిసిపోయుండేవి. అంటే ఇదంతా కలా? నిజం కాదా?!

ఈ కల నాకు రాకుండా చెయ్యాలని ప్రతిరాత్రి దేవుడికి దణ్ణం పెట్టుకుని పడుకునేవాణ్ని. కానీ కల నుండి మాత్రం తప్పించుకోలేకపొయ్యేవాణ్ని. ఈ విధంగా ఆ కల నన్ను ప్రతి రాత్రీ వెంటాడగా.. నిద్రలో పక్క తడిపే కార్యక్రమం క్రమబద్ధంగా, నిర్విఘ్నంగా కొనసాగించాను. ఘోరమైన ఈ అలవాటు నాకు ఇంట్లో ఎవరి పక్కలోనూ స్థానం లేకుండా చేసింది!

అక్కైతే నన్ను తిట్టిపోసేది.

'ఒరే దున్నపోతా! నీకు మంచం ఎందుకురా? వెళ్లి ఆ బాత్రూములోనే పడుకుని చావు. నీకదే సరైన ప్లేసు.' ఎంత దారుణం! సినిమాల్లో తమ్ముడి కోసం అక్క పాట పాడుతుంది, నన్ను మాత్రం అక్క అన్యాయంగా తిడుతుంది! అయితే అక్క కోపానికో కారణం వుంది. మర్నాడు ఆ కంపుకొట్టే బట్టల్ని బక్కెట్లో ముంచేది అక్కే, అదీ సంగతి!

నాకేమో ఒక్కణ్ణే పడుకోడానికి బయ్యం. తెల్లచీర కట్టుకుని, జుట్టు విరబోసుకున్న ఓ ఆడమనిషి కిటికీలోంచి తొంగి చూస్తున్నట్లుగా అనిపించేది. అన్నట్లు ఆడదెయ్యాలు రంగు చీరలు ఎందుక్కట్టుకోవు? జడెందుకేసుకోవు? ఎందుకో ఇవ్వాల్టికీ నాకు తెలీదు.

ఈ విధంగా అందరి పక్కల నుండి బహిష్కృతుడనైన నేను.. నెమ్మదిగా అమ్మ పక్కలోకి చేరేవాణ్ని. అమ్మ నన్నెప్పుడూ ఏమీ అన్లేదు. 'కొన్నాళ్ళకి ఆ అలవాటు పోతుందిలే' అని ధైర్యం కూడా చెప్పేది. అమ్మ నాకు నిద్రోచ్చేదాకా పాట(లు) పాడేది. ఈ (లు) ఎందుకంటే - మొదటి పాట పూర్తయ్యేలోపే నిద్రపొయ్యేవాణ్ణి. కాబట్టి నేను నిద్ర పోయింతర్వాత అమ్మ ఇంకే పాటైనా పాడేదో లేదో నాకు తెలీదు.

అమ్మ రోజూ పాడే ఆ పాట - 'ఓహో మేఘమాల! నీలాల మేఘమాల! చల్లగా రావేలా, మెల్లగా రావేల'. అమ్మ గానం గొప్పగా అనిపించేది. పాట వింటూ నిద్రోలోకి జారుకునేవాణ్ని. రేడియోలో, సినిమాల్లో.. ఎక్కడా, ఎవరూ అమ్మ పాడినంత బాగా పాడేవాళ్ళు కాదని నా నిశ్చితాభిప్రాయం.

ఇక్కడో సందేహం. ఇంత బాగా పాడే అమ్మ మరి సినిమాల్లో ఎందుకు పాడట్లేదు? బహుశా వంటకి ఇబ్బందవుతుందని నాన్న వద్దనుంటాడు. అప్పటికీ అమ్మకోసారి సలహా ఇచ్చాను. 'అమ్మా! నువ్వు సినిమాలకి పాడు.' అమ్మ చాలా సంతోషిస్తూ 'ఈ పాట లీల పాడింది, గొప్ప సింగర్.' అంది. 

అందువల్ల - అమ్మకి ఎంతగానో నచ్చిన 'ఓహో మేఘమాలా!' పాటంటే నాక్కూడా ఎంతో అభిమానం ఏర్పడిపోయింది. అమ్మకి ఇష్టమైన లీల నాక్కూడా అభిమాన గాయని అయిపొయింది. నాకు లీల గొంతు మృదువుగా, దయగా, ఆత్మీయంగా, లోతుగా, మార్దవంగా వినబడుతుంది. 'ఒకే గొంతు ఇన్ని "గా"లుగా ఎలా వినిపిస్తుంది?' అని అడక్కండి, నాదగ్గర సమాధానం లేదు!

సినిమా పాటల పండితులు తమ పాండిత్య ప్రావీణ్యంతో తూకం వేసి.. లీల కన్నా లతా మంగేష్కర్, సుశీల గొప్పగా పాడతారని తేల్చినా.. నేనస్సలు పట్టించుకొను. ఎందుకంటే నాకు సంగీతం తెలీదు, గొప్పగా పాడటం అంటే ఏంటో తెలీదు. అంచేత లీల పర్ఫెక్ట్ గాయని అని వాదించి యెవర్నీ ఒప్పించలేను. కానీ - లీల ఎక్కాల పుస్తకంలో రెండో ఎక్కాన్ని కూడా మధురంగా పాడుతుందని నా నమ్మకం!

నాకు ఇష్టమైన అమ్మకి లీల ఇష్టం, ఎవరికైనా ఇష్టమైనవారికి ఇష్టమైనది ఇష్టంగా కాకుండా ఎలా వుంటుంది? నేను లీలని ఇష్టపడటంలో నా బాల్యం, నా కుటుంబం, అమ్మ.. అనేక తీపి జ్ఞాపకాలు కలగలిపి వున్నాయి. 

అందుకే - పి.లీల.. నాకు భలే ఇష్టం!



(photos courtesy : Google)