పొద్దున్నుండీ ఒకటే వర్షం. మా అమ్మాయిని కాలేజిలో దించడానికి హడావుడిగా వెళ్తున్నాను. ఇంతలో కారుకి అడ్డంగా ఒక పంది.. దాని పిల్లలు. పాపం! ట్రాఫిక్ లో తికమక పడుతూ రోడ్డు దాటలేకపోతున్నాయి. కారు ఆపేశాను. వెనక ఆటో వాళ్ళు 'కీ' మంటూ ఒకటే రోద.
మా అమ్మాయి విసుక్కుంది. "అబ్బా! నాన్నా! అసలే టైమై పొయ్యింది. పందే కదా! పోనివ్వచ్చుగా. ఆపేశావే?"
"తప్పు తల్లీ! అలా అనరాదు. పంది చాలా ఉత్తమ జీవి. పందుల్ని గౌరవించడం మన సంప్రదాయం." అంటూ చివరి పంది పిల్ల రోడ్డు దాటే దాకా ఆగి.. ఆ తరవాతే కారు ముందుకు పోనించాను. నా కూతురు నన్ను విచిత్రంగా చూసింది. నేను చిన్నగా నవ్వుకున్నాను.
జంతువులు రకరకాలు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో జంతువంటే ఇష్టం. చాలామందికి కుక్కలంటే ఇష్టం, కొందరికి పిల్లుల్ని పిల్లల్లా పించుకుంటారు. మా గుంటూర్లో మానసిక వైద్యానికి పితామహుడైన డా.అమంచర్ల శంకరరావు గారింట్లో ఉన్న జంతువుల్ని చూసి ఆశ్చర్యపొయ్యాను. ఆయన దగ్గర జంతువుల మందే ఉండేది. డెబ్భయ్యేళ్ళ శంకరరావుగారు వాటితో చిన్నపిల్లాళ్ళా ఆడుకోటం అన్ను అబ్బురపరిచేది.
నాకు పంది ఇష్టమైన జంతువు. ఈ ఇష్టానికి అనేక కారణాలున్నాయి. నేను అయిదేళ్ళ పాటు మాజేటి గురవయ్య హై స్కూల్ లో చదువుకున్నాను. స్కూల్ ముందు పెద్ద బురద గుంట ఉండేది. దాన్నిండా అనేక పందులూ, పంది పిల్లలు సకల బంధు జన సమేతంగా కాపురం ఉండేవి.
నాకు పంది ఇష్టమైన జంతువు. ఈ ఇష్టానికి అనేక కారణాలున్నాయి. నేను అయిదేళ్ళ పాటు మాజేటి గురవయ్య హై స్కూల్ లో చదువుకున్నాను. స్కూల్ ముందు పెద్ద బురద గుంట ఉండేది. దాన్నిండా అనేక పందులూ, పంది పిల్లలు సకల బంధు జన సమేతంగా కాపురం ఉండేవి.
నాకు చిన్నప్పట్నించి చదువు తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఆసక్తి మెండు. అంచేత ఆ పందులూ, పంది పిల్లలూ సహజంగానే నా దృష్టిని మిక్కిలి ఆకట్టుకున్నాయి. అ విధంగా ఒక behavioral scientist వలె పందుల్ని నిశితంగా పరిశీలించి మిక్కిలి జ్ఞానాన్ని మూట గట్టుకొంటిని.
పంది కేరాఫ్ ఎడ్రెస్ బురద గుంట. బురదగుంటలో, అర్ధ నిమీలి నేత్రాలతో, బుల్లి తోకతో ఈగలు, దోమల్ని తోలుకొంటూ.. బద్దకంగా.. విశ్రాంతిగా.. ప్రశాంతమూర్తిగా జీవించే పందిలో నాకు ఒక విశ్వవిజేత కనిపించేవాడు. ప్రశాంతత లేకుండా నిత్యం ఆశాంతితో జీవించే ఏకైక జంతువు మనిషి అని నా నమ్మకం. నీకు తింటానికి, ఉంటానికి ఉందిగా? ఇంకా ఏడుపెందుకు? నా సంతానానికి ఈ సుఖం ఉంటుందో ఉండదో? తల్చుకుంటుంటేనే ఏడుపొచ్చేస్తుంది బ్రదర్.
'పిచ్చివాడా! నువ్వెంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం? చివరాకరికి ఏదో రోజు నువ్వు కూడా మా బురదలో కలిసిపోవలసినవాడవే!' అని నాతో అంటున్నట్లు కానవచ్చే పంది ముఖంలో నాకు పెద్ద ఫిలాసఫర్ కూడా కనిపించేవాడు! కాకపోతే పైసా ఖర్చు లేకుండా చెప్పే ఫిలాసఫీని మనిషి పట్టించుకోడు. అతనికి ఇట్లాంటి విషయాలు బోధపర్చడానికి కాషాయ వస్త్రధారి కావాలి.. చింపిరి తల, బారెడు గెడ్డంతో శిష్యపరివేష్టితుడైయ్యుండాలి.. అర్ధం కాని లాజిక్కుతో, మాటల్తో బురిడీ కొట్టించగలవాడైయ్యుండాలి. ఇవేవీ లేని కారణాన పంది ఫిలాసఫీని పట్టించుకునేవాడు లేకపొయ్యాడు.
పంది పిల్లలు ఎంత ముద్దుగా ఉంటాయి! బుజ్జి ముండలు. మూతి cut చేసిన కేకులా గమ్మత్తుగా ఉంటుంది. అర డజనుకు తక్కువ కాకుండా.. తల్లి పొదుగు వద్ద పాల కోసం కుమ్ముకుంటూ.. అప్పుడప్పుడూ 'కీ' అని అరుస్తూ.. ఆ దృశ్యం చూడ ముచ్చటగా ఉంటుంది. తల్లి వెంట సుశిక్షితులైన సైనికులవలె తిరుగాడుతుంటాయి. పంది, పంది పిల్లల బంధం ప్రకృతిలోని తల్లీపిల్లల అనుబంధానికి గొప్ప చిహ్నం. ఈ బంధం తల్లిని అనుకరిస్తూ పిల్లలు నేర్చుకునే 'learned behavior' కి మంచి ఉదాహరణ.
పంది పిల్లలు ఎంత ముద్దుగా ఉంటాయి! బుజ్జి ముండలు. మూతి cut చేసిన కేకులా గమ్మత్తుగా ఉంటుంది. అర డజనుకు తక్కువ కాకుండా.. తల్లి పొదుగు వద్ద పాల కోసం కుమ్ముకుంటూ.. అప్పుడప్పుడూ 'కీ' అని అరుస్తూ.. ఆ దృశ్యం చూడ ముచ్చటగా ఉంటుంది. తల్లి వెంట సుశిక్షితులైన సైనికులవలె తిరుగాడుతుంటాయి. పంది, పంది పిల్లల బంధం ప్రకృతిలోని తల్లీపిల్లల అనుబంధానికి గొప్ప చిహ్నం. ఈ బంధం తల్లిని అనుకరిస్తూ పిల్లలు నేర్చుకునే 'learned behavior' కి మంచి ఉదాహరణ.
ఒంటి నిండా బురద, ముక్కు బద్దలయ్యే కంపూ పందికి సహజ కవచాలు. తనంతట తాను ఎవరి జోలి కెళ్ళదు. ఎవడన్నా తన జోలి కొచ్చాడా.. వాడు వంద లైఫ్ బాయ్ సబ్బులు వాడినా పోని కంపూ.. బురదా.. ప్రాప్తిరస్తు! ఎంత గొప్ప ఫిలాసఫి! ఎంత గొప్ప సెల్ఫ్ డిఫెన్స్!
జిమ్ కార్బెట్ ఎన్ని పులుల్ని చంపాడో నాకు తెలీదు. కానీ ఒక్క పందిని కూడా చంపలేడనీ.. కనీసం పందిని బురద నుండి కూడా వేరు చేయలేడని ఘంటాపధంగా చెప్పగలను! ఎలాచెప్పగలవ్? సింపుల్! ఆయన పులుల్ని ఎలా చంపాడో రాసుకున్నాడుగానీ, పందుల్ని ఎలా చంపాడో ఎక్కడా రాసుకోలేదు!
పందిలా తిని పడుకుంటున్నాడని తిడతారు. కానీ.. ఎక్కువ తిని అస్సలు పని చేయకపోవడం పంది తెలివికి నిదర్శనం. అనగా జంతువుల్లో లేబర్ లా ఉల్లంఘన ఒక్క పందికే చాతనయింది. ఈ మాత్రం తెలివి లేని దద్దమ్మలు గానుగెద్దులు. అందుకే గొడ్డు చాకిరీ చేస్తుంటాయి. పందులలోని ఈ తెలివిని జార్జ్ ఆర్వెల్ కూడా గమనించాడు. అందుకే తన 'ఏనిమల్ ఫామ్' లో పీడించే వర్గానికి ప్రతినిధిగా పంది జాతిని ఎన్నుకున్నాడు.
అసలు పందికి బురదంటే ఎందుకంత ఇష్టం? పంది చర్మంలో స్వేద గ్రంధులు ఉండవు. కావున శరీర ఉష్ణోగ్రతని కాపాడుకోవడానికి చర్మానికి ఎల్లప్పుడూ తేమ కావాలి. ఆ తేమ తొందరగా ఆరకుండా ఉండటం కోసం బురదలో పొర్లుతుంటుంది. అంటే బురద వల్ల శరీరం తడి ఆరకుండా ఉంటుంది. ఆ విధంగా పందికి సైన్స్ మీద కూడా పట్టుంది! ఈ సంగతి తెలిసిన తరవాత నాకు పందిపై గౌరవం మరింత పెరిగింది.
పంది వైద్య శాస్త్ర అభివృద్ధికి కూడా తోడ్పడింది. తోడ్పడుతుంది. అనాదిగా మానసిక వైద్యంలో ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ECT విధానానికి (కరెంట్ షాకులిచ్చే వైద్యం) పందుల ఫ్యాక్టరీలో జరిగిన పరిశీలనే కారణం. ఇప్పుడు పంది గుండెని మనుషులకి అమర్చడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి.
దశావతారాల్లో తొమ్మిది అవతారాల గూర్చి నాక్కొన్ని అనుమానులున్నయ్. కానీ వరాహావతారాన్ని మాత్రం అర్జంటుగా ఒప్పేసుకుంటున్నాను. మొన్నామధ్య ఓ పంది దేవుడి చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణాలు చేసింది. నమ్మక తప్పదు!
ఈ మధ్య పందుల పెంచే వృత్తిలో వున్న ఓ పేషంట్ చెప్పిన లాభాలు విని కళ్ళు తేలేశాను. ఈ రహస్యాలు ఎవ్వరికీ చెప్పకురా అబ్బీ! నీకు ఏ అంబానీ గాడో పోటీదారుడవుతాడని సలహా ఇచ్చి పంపేసాను.
మిత్రులారా! పంది విశిష్టత గూర్చి నాకు తెలిసిన వివరాలన్నీ మీతో పంచుకున్నాను. పంది గొప్పదనం ఈ పాటికి మీక్కూడా అర్ధమైపోయుంటుంది. చివరగా ఒక విజ్ఞప్తి. ఇక ముందు ఎప్పుడైనా మీకు పంది తారసపడితే ముక్కు మూసుకుంటూ ఈసడించుకోకండి. గౌరవంగా పక్కకి తప్పుకోండి! ఎందుకంటే - బురద పంది ఒక అద్భుతజీవి!