Wednesday 3 April 2013

రావిశాస్త్రి పూజావిధానం


వర్షం జల్లుగా కురుస్తుంది. పేషంట్లని చూడ్డం అయిపోయింది. విసుగ్గా వుంది. ఏం చెయ్యాలి? తెలుగు టీవీ వార్తలు చూసే ధైర్యం లేదు. పోనీ ఏదైనా ఒక తెలుగు కథ చదివితే ఎలా వుంటుంది? ఏమో! కష్టపడి కథంతా చదివాక.. తీరా అదో చెత్త కథైతే? ఇప్పుడంత రిస్క్ తీసుకునే అవసరముందా? లేదు కదా! మరైతే ఈ విసుగుని అధిగమించుట ఎట్లు? సింపుల్! చదివిన రచయితనే మళ్ళీ చదివేద్దాం.

ఎదురుగా టేబుల్ మీద రావిశాస్త్రి నవ్వుతూ నన్నే చూస్తున్నట్లుగా అనిపించింది. 'బాకీ కథలు' తీసుకున్నాను. 'ద్వైతాద్వైతం' కథ చదవడం మొదలెట్టాను. ఇప్పటికీ కథ ఎన్నిసార్లు చదివుంటాను? గుర్తు లేదు. కథ మొదటి భాగం పులి చెబుతుంది. రెండో భాగం నల్లమేక చెబుతుంది. క్రమంగా కథలో లీనమైపోయ్యాను. రావిశాస్త్రి సిమిలీల వర్షంలో తడిసి ముద్దైపోసాగాను. రావిశాస్త్రి శిల్ప చాతుర్యానికి అబ్బురపడుతూ (ఇది నాకలవాటు).. హోరున ప్రవహిస్తున్న వాక్యాల సుడిగుండంలో గింగరాలు తిరుగుతూ మునిగిపోతూ (ఇదీ నాకలవాటే) -

'ఆహాహా! ఏమి ఈ రావిశాస్త్రి రచనా చాతుర్యము! అయ్యా శాస్త్రిబాబు! నువ్వేగనక రాయకపోయినట్లైతే - తెలుగు సాహిత్యం గుడి మెట్ల మీద అడుక్కు తింటుండేది! అరిగిపోయిన సైకిల్ ట్యూబులకి పంచర్లు వేసుకుంటుండేది! దెబ్బ తగిలిన గజ్జికుక్కలా బీదగా, దీనంగా, బాధగా ఏడుస్తుండేది! నువ్వు తెలుగు కథకి రాజువి, రాజాధిరాజువి. నువ్వు మనిషివా? కాదు, కానే కాదు. దేవుడవు, దేవదేవుడవు. పూర్వజన్మలో నువ్వు మోపాసావి! కాదు కాదు చెహోవ్‌వి! కాదు కాదు ఇంకా అంతకన్నా వందరెట్లు ఎక్కువగా.. " అనుకుంటూ ఆనందడోలికలలో తేలియాడుచుండగా -

"రవఁణమావా! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"రా సుబ్బూ! సమయానికోచ్చావ్! రావిశాస్త్రి అక్షరాన్ని ఆనందంగా అనుభవించేస్తున్నాను, మనసారా మజా చేస్తున్నాను! రావిశాస్త్రి ఈజ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్! కాదన్నవాణ్ణి కత్తితో కసకసా పొడిచేస్తాను. ఔనన్నవాడిని హృదయానికి ఘాట్టిగా హత్తుకుంటాను." కవితాత్మకంగా అన్నాను.

రావిశాస్త్రి సుబ్బుక్కూడా ఇష్టం. అంచేత ఎప్పట్లా నాతో వాదనలకి దిగలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. నాలో మాత్రం ఉత్సాహం ఉరకలు వేస్తుంది.

"సుబ్బూ! మనం మన రావిశాస్త్రికి ఏదైనా చెయ్యాలి. ఒక సొవనీర్.. ఒక కథల వర్క్ షాప్.. ఒక శిలావిగ్రహం.. ఏదైనా పర్లేదు. ఏదోటి చేసేద్దాం. ఏవఁంటావ్?" ఎక్సైటింగ్‌గా అన్నాను.

"రవణ మావా! రావిశాస్త్రికి నువ్వు చేసేదేముంది? ఆయన పోయి చాలా కాలమైంది. బ్రతికున్నట్లయితే మన దినకర్ పంపించిన సింగిల్ మాల్ట్ సీసాలు ఆయన కాళ్ళ దగ్గర పెట్టి, ఆ కాళ్ళకి నమస్కారం చేసి - 'మా రాచకొండకి మంగళారతులు! మా కథల తండ్రికి సీసాల దండలూ' అంటూ పాడి మన భక్తిని చాటుకునేవాళ్ళం." అన్నాడు సుబ్బు.

సుబ్బు మాటలకి నాకు నవ్వొచ్చింది.

"ఒరే నాయనా! రావిశాస్త్రికి ఏదైనా చెయ్యాలంటే ఆయనకి వ్యక్తిగతంగా చెయ్యాలని కాదు. ఆయన జ్ఞాపకార్ధం ఏదైనా చెయ్యాలని! అర్ధమైందా?" అన్నాను.

సుబ్బు నవ్వుతూ అన్నాడు.

"అంటే ఇష్టమైన వాళ్ళకి ఏదోటి చేసి ఋణం తీర్చుకోవాలంటావ్! అంతేనా? అప్పుడు మన లిస్టులో చాలా వచ్చి చేరతాయి. ఉప్మా పెసరట్టు, ఫిల్టర్ కాఫీ, సింగిల్ మాల్ట్.. ఇలా చాలానే ఉన్నాయి. మరి ఇవేం పాపం చేశాయి?"

ఇంతలో పొగలు గక్కుతూ కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు.

"రుచిగా ఉండటం ఉప్మాపెసరట్టు ధర్మం. ఆ రుచికి మనం బానిసలం. ప్రతిరోజూ ఆ పెసరట్టు ముండని ప్రేమగా కొబ్బరిచట్నీతో నంజుకు తినుటయే దానికి నువ్విచ్చే గ్రేటెస్ట్ ట్రిబ్యూట్. అంతేగానీ ఉప్మా పెసరట్టుకి శిలావిగ్రహం పెట్టిస్తావా? పెట్టించవు గదా!"

"రావిశాస్త్రి రచనల్ని ఉప్మా పెసరట్టుతో పోలుస్తున్నావు. చాలించు నీ వితండ వాదం. నీతో ఇదే సమస్య. విషయాన్ని కాంప్లికేట్ చేసేస్తావు." విసుక్కున్నాను.

సుబ్బు నా మాట పట్టించుకోలేదు. చెప్పడం కొనసాగించాడు.

"రావిశాస్త్రి అత్యున్నత రచయిత. బుద్ధున్నవాడైనా కాదంటాడా? అంచేత ఆయన రాసి పడేసిన సాహిత్యం చదువుకో. తనివి తీరకపోతే మళ్ళీ చదువుకో, మళ్ళీమళ్ళీ చదువుకో, కళ్ళు నొప్పులు పుట్టేలా చదువుకో, కళ్ళజోడు అరిగిపొయ్యేలా చదువుకో! అయితే ఆయన ఎవరి కోసం, ఏ సమాజం కోసం రాశాడో వారి గూర్చి ఆలోచించు. అంతేగానీ - తెలుగు సినిమా హీరో అభిమానిలా వెర్రిగా ఆలోచించకు."

"ఇప్పుడు నన్నేం చెయ్యమంటావ్?" డిజప్పాయింటింగ్‌గా అడిగాను.

"'ద్వైతాద్వైతం' చదవడం అయిపోయాక 'రాజు-మహిషి' చదువుకో. నా దృష్టిలో 'రాజు-మహిషి' రావిశాస్త్రి ఆల్ టైమ్ బెస్ట్." అన్నాడు సుబ్బు.

"కానీ - రావిశాస్త్రి 'రాజు-మహిషి' కథ పూర్తి చెయ్యలేదుగా?" నిరాశగా అన్నాను.

"కథ ఎవడిక్కావాలోయ్! కథలే కావాలనుకుంటే చందమామ చదువుకో! అసలు రావిశాస్త్రి కలం నుండి జాలువారిన ప్రతివాక్యం ఒక అద్భుతం. రావిశాస్త్రి రచనల్లో కథ వెతుక్కునే నీలాంటి నిర్భాగ్యులు ఉండటం మన తెలుగు సాహిత్య దౌర్భాగ్యం."

"నాకదంతా తెలీదు సుబ్బు! నేను రావిశాస్త్రికి నివాళులు అర్పించాల్సిందే. ఏదైనా మార్గం చెప్పు." పట్టుదలగా అన్నాను.

ఒకక్షణం ఆలోచించాడు సుబ్బు.

"ఓకే! రాత్రికి మళ్ళీ కలుద్దాం. ఈలోపు నీ దగ్గరున్న రావిశాస్త్రి పుస్తకాలన్నీ ఒకచోటకి చేర్చు. అ పుస్తకాలన్నింటికి పసుపు రాయించి కుంకుమతో బొట్లు పెట్టు. నీదగ్గర రావిశాస్త్రి పటం ఉందిగా! దానికో పేద్ద పూలదండ వేయించు, అంబికా దర్బార్ బత్తి వెలిగించి.. "

"అర్ధమైంది. కొబ్బరికాయలు కొట్టి గంట గణగణ లాడించి ప్రసాదం పంచాలి." విసుక్కున్నాను.

"చెప్పేది పూర్తిగా విను మిత్రమా! దేవుళ్ళకి నైవేద్యం పెడతాం. విఘ్నేశ్వరుడుకి ఉండ్రాళ్ళు, వెంకటేశ్వరుడుకి లడ్లు. అంటే ఏ దేవుడికి ఇష్టమైన పదార్ధం ఆ దేవుడికి నైవేద్యంగా పెడతాం. కదా? ఇక్కడ మన దేవుడెవరు? రావిశాస్త్రి. కదా? మరి రావిశాస్త్రికి నైవేద్యంగా ఏం పెడతావు?"

"నువ్వే చెప్పు."

"మనం రావిశాస్త్రికి నైవేద్యంగా 'గ్లెన్‌ఫెడిచ్' పెడదాం. ఆ పక్కనే బిస్లరీ సోడాలు, గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్ సిగరెట్లు పెడదాం." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు.

"తరవాత?" ఆసక్తిగా అడిగాను.

"ఇప్పుడు మనం వినాయక చవతి పూజ మోడల్‌ని ఫాలో అవుదాం! అయితే ఈ పూజలో మనం చదివబొయ్యేది రావిశాస్త్రి సాహిత్యం."

"నేను అల్పజీవి చదువుతాను." ఉత్సాహంగా అన్నాను.

"నీ ఇష్టం. అల్పజీవి కాకపొతే సారాకథలు చదువుకో! దీన్నే 'రావిశాస్త్రి పూజావిధానం' అందురు. పూజా సమయంలో గ్లెన్‌ఫెడిచ్ బాటిల్, సిగరెట్ పెట్టెలు రావిశాస్త్రి పటం ముందుంచాలి. చివర్లో - 'ఓం! గ్లెన్‌ఫెడిచ్ సమర్పయామి! ఓం! గోల్డ్‌ఫ్లేక్ సమర్పయామి!' అని మూడుసార్లు అనాలి. అప్పుడవి ఆటోమేటిగ్గా ప్రసాదంగా మారిపోతాయి."

"మారిపోతే?"

"పిచ్చివాడా! దేవుని ప్రసాదాన్ని ఏం చేస్తాం? అవతల పడేస్తామా? అది మహాపాపం. ఆరగిస్తేనే పూజాఫలం దక్కేది. అందునా ఆ ప్రసాదం ఎవరిది? మన ఇష్టదైవమైన శాస్త్రిబాబుది!"

"అంటే ఆ విస్కీ తాగేయ్యాలా?"

"అవును. విస్కీ తాగేయ్యాలి. సిగరెట్లు ఊదేయ్యాలి. ఆ విధంగా సుబ్బయ్య, ముత్యాలమ్మ, సార్వభౌమరావు, రత్తాలు-రాంబాబు, మరిడి మహాలక్ష్మి, వియత్నాం విమల-బంగారి గాడు, దూదిపులి, సూర్రావెడ్డు సాక్షిగా.. ఆ మహానుభావునికి నివాళులర్పిద్దాం." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! దీన్ని నివాళి అనరు. రావిశాస్త్రి పేరు చెప్పుకుని మందు కొట్టడం అంటారు. గ్లెన్‌ఫెడిచ్ వరకు ఓకే, కానీ సిగరెట్ మాత్రం నా వల్లకాదు. ఒక సిగరెట్ ఏడు రోజుల జీవితాన్ని తగ్గిస్తుంది."

"త్యాగయ్య, అన్నమయ్యలు జీవించిన కర్మభూమి మనది. ఏం? నీ దైవం కోసం ఓ మూణ్ణెల్లు ముందు చావలేవా? నువ్వసలు భక్తుడివేనా!? నేన్నీలా స్వార్ధపరుణ్ణి కాదు! ఎంత కష్టమైనా సరే! ఆ సిగెరెట్లన్నీ కాల్చిపడేస్తాను."

"ఈ నివాళి నాకు సమ్మతం కాదు. నీ ప్రపోజల్ నేనొప్పుకోను." స్థిరంగా అన్నాను.

సుబ్బు లేచాడు.

"నీ ఖర్మ! మంచి మాటలు నువ్వెప్పుడు ఆలకించావు గనక! ఇప్పటికే మాతృభాషా ప్రేమికుల సంఘం, గురజాడ భజన మండలి అంటూ పనికి మాలిన సంస్థలు చాలానే ఉన్నాయి. నువ్వు కూడా 'రావిశాస్త్రి అభిమాన సంఘం' అంటూ ఒకటి పెట్టుకో. ఆయన పుట్టిన్రోజు, పోయిన్రోజుల్ని పండగల్లా జరిపించు. ధర్మాసుపత్రిలో యాపిల్సు పంచు. రక్తదాన శిబిరం పెట్టు. నీలాంటి చౌకబారు అభిమాని రావిశాస్త్రికి ఉండటం ఆయన దురదృష్టం. ఏం చేస్తాం? పోయినవాళ్ళకి హక్కులుండవు గదా!" అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

విన్నపం -

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. పూజలు వ్యక్తిగతం. ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు. రావిశాస్త్రిని తలచుకుంటూ సరదాగా రాసేశాను. సో.. టేకిట్ ఈజీ! 

(pictures courtesy : Google)

34 comments:

  1. మన ఛాత్రి బాబు పూజా విధానం చాలా బాగుందిస్మండీ ...ఛాత్రి బాబు అష్టోత్తర నామావళి రాస్తే బావుండేది కదా.

    ReplyDelete
    Replies
    1. జోగారావు గారు,

      ఈ టపా బోల్డంత బెరుకుతో పబ్లిష్ చేశాను.. అందుకే చివర్లో ఆ disclaimer.

      ఇప్పుడు తమవంటి పెద్దలు బాగుందనడంతో.. చాలాచాలా సంతోషంగా ఉంది.

      (అమ్మయ్య! వాటే రిలీఫ్!)

      Delete
  2. Keep writing Ramana, May be on some day we will have "Ramana Pooja Vidhanam too". Cheers

    ReplyDelete
    Replies
    1. ఈ పూజావిధానం బానే ఉందిగా బ్రదర్! కొంతకాలానికి నన్ను కూడా నువ్వు ఇలానే పూజించుకోవచ్చు.

      Delete
  3. పోస్ట్ చాల బావుంది అండి . నాకు చదవటం వచ్చేటప్పటికి రావి శాస్త్రి గారు స్వర్గస్తులయ్యారు . అందువలన నాకు అయిన గురుంచి తెలుసుకొనే అవకాశం కలగలేదు . మీరు అయిన గురుంచి అంత గొప్పగా చెబుతుంటే చదువుదాము అని ఇంటర్నెట్ లో వెతుకొంటే ఆయిన పుస్తకాలు ఒక్కటి కూడా దొరకటం లేదు . ఈ సారి గుంటూరు వచ్చి నప్పుడు అయిన పుస్తకాలు తప్పకూండ కొని చదివి మీతో పాటు పూజ చేస్తాను .

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      ప్రస్తుతం రావిశాస్త్రి పుస్తకాలు అలభ్యం. కాబట్టి కొనడం సాధ్యం కాదు. బహుశా రావిశాస్త్రిని చదవడానికి మీరు మరికొంత కాలం ఆగాలేమో!

      సంగీతం, సాహిత్యం పూర్తిగా సబ్జక్టివ్. నాకు బాగా నచ్చిన కొన్ని విషయాలు నా స్నేహితులకి కొద్దిగా మాత్రమే నచ్చేవి. కొన్నైతే అసలు నచ్చేవి కూడా కాదు. ఒకే వయసు / నేపధ్యం కలిగిన నా స్నేహితులలోనే అనేక వైరుధ్యాలు! మరిప్పుడు తరాలు మారిపోయ్యాయి.. ఇంకెన్ని వైరుధ్యాలుండాలి!?

      రావిశాస్త్రి సమగ్ర సాహిత్యం త్వరలోనే వస్తుందని రెండేళ్లుగా వింటున్నాను. ఎప్పుడొస్తుందో తెలీదు. మారిపోయిన ప్రపంచంలో.. మీలాంటి ఫ్రెషర్స్ రావిశాస్త్రిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలనే ఆసక్తితో ఉన్నాను.

      (బ్లాగ్ పూర్తిగా నా ఇస్టాయిస్టాలకి సంబంధించిన వ్యవహారం. కాబట్టి నా ఆలోచనలని హాయిగా, ప్రశాంతంగా రాసేస్తున్నాను.)

      Delete
  4. భలే ఉంది ఆ పూజా విధానం, ప్రసాదం.
    మిమ్మల్ని పుజించాలంటే, ప్రసాదంగా ఏం పెట్టాలి.
    ఏం రాసినా, అంతర్లీనంగా కొంతమంది మీద / కొన్ని విషయాల మీద మీ విమర్శలు పెసరట్టు లో దాక్కున్న ఉప్మా లా వెల్లిపోతుంటాయి.

    ReplyDelete
    Replies
    1. అవును. మీరన్నది నిజం.

      నాక్కూడా ఆశ్చర్యంగా ఉంటుంది.. 'కొన్ని విషయాల / వ్యక్తుల పట్ల నాకింతటి అయిష్టత ఉందా!' అని.

      Delete
  5. సుబ్బుకి వందేళ్ళు, ఉదయాన్నే గుర్తుచేసికొన్నా .. ఏం లేదండీ రమణ గారు కాస్తో కూస్తో స్త్రీ వాది అయితే సుబ్బు పురుషవాది కదా అనిపించింది.



    ఈ సారి ఇండియా వచ్చినపుడు మీ ఇంట్లో ఉప్మా పెసరట్టు తినాల్సిందే, ఆ చేత్తో నే రావిశాస్త్రి పుస్తకాలు కాసిని అప్పివ్వండి ( ఈ మధ్య ఒకటి రెండు అద్దెకి తప్ప తెలుగు పుస్తకాలు కొని చదవలేదు, మీకు కావాలంటే ఏవైనా పుస్తకాలు కొనిస్తా ) ఇవ్వంటే చెప్పండి, మీ ఇంట్లో ఒక్క పెంపుడు జీవి ఎలాను కరవదు కాబట్టి కొట్టెయ్యడం చాలా ఈజీ



    వ్రతం అంటే గుర్తొచ్చింది, ఇక్కడ ఒక కమ్యునిటీ (అంటే భావన సముదాయం) లో ఎక్కువగా వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ఒక ఇంటాయన చెప్పిన కధ ,వ్రతం అంటే ఏ దేవుడైనా ఒకటే నండీ. ఖాళీ గా ఉన్న వాళ్ళందరూ వస్తారు. శుభ్రంగా హడావిడి చేసి తిని. ఇక చర్చల్లో పడతారు.షాపింగు, వంటలు , జిమ్ము, బ్యూటీషియన్స్ కబుర్లు గట్రా. మగవాళ్ళ వ్రతం అంటే అచ్చు అలానే మీక్కావల్సినవి చెప్పారు.



    మా అంటీ ఒకరు ఏదో పండక్కి చేసే వ్రతం లో దేవుడికి గంజాయి తెప్పించి మరీ పెడతారు. ప్రసాదం లో గంజాయి తింటుంటే (విశాఖ వైపు ఆచారం ఏమో) అమ్మయ్య ఒక పనై పోయింది అనిపించింది .



    PS :విశాఖలో ఉండే అనాగరికులెవరైనా ఈ వ్యాఖ్య చూస్తె మాత్రమె ఈ మనవి. మా అంటీ విశాఖ వాస్తవ్యులు. అనవసరంగా అవ్వేసపడి బీపీ తెచ్చుకోకండి . ఆరోగ్యమే మహా భాగ్యం.

    ReplyDelete
    Replies
    1. నాకు తెలిసి సుబ్బు స్త్రీవాదో, పురుషవాదో కాదు. అసలేవాదీ కాదు. సుబ్బు నోటికేదొస్తే అదనేస్తాడు. చాలాసార్లు తనని తనే contradict చేసుకుంటాడు.

      (Don't take him seriously!)

      Delete
  6. ఇక్కడ చాలామందికి రావిశాస్త్రి గారిమీదకంటే, ఆయన వ్రతం మీదే ఎక్కువ అభిమానం ఉన్నట్టు కనపడుతోంది.

    ReplyDelete
    Replies
    1. నాకూ అలానే అనిపిస్తుంది!

      (అయినా పర్లేదు. అందర్నీ మా 'చాత్రిబాబు' అభిమానుల ఖాతాలో జమ వేసేస్తున్నాను.)

      Delete
  7. దగ్గర్లో ఉంటే మీ కాళ్ల మీద పడి పోయే దాన్ని అండీ, అంటే పోవడం ..ఎక్కడికి ,నా కాళ్లు లాగి పడేస్తావా అమ్మా ? అని అలా ఉరిమి ఉరిమి చూడకండి , నేను కూడా రావి శాస్త్రి గారి, ఫాను ,ఏ సి ...పంకా వగైరాలు అండీ, విశాపట్నం లో మా ఇంటికి కూసింత దూరం లోనే ,అలా బుష్ షర్ట్ తొడిగి, పంట్లాం మీద, చేతులు మడిచి ,దూరం గా ఓడలు, అల్లా జాలారి ఆడోళ్లు ఫెళ్లు ,ఫెళ్లున నవ్వుకుంటూ వెళ్లిపొతారా ,ఇలా రామ్మా, ఓ కత రాస్తాను ఇలా కూకోండి ఓ పాలి ..
    అంటూ సారో కథలు, సారా కథలు కి సారాంశం ఆలొచిస్తూ అలా నిల్చోబెట్టేసారు.. పాపం..కాళ్లు పీకి ,ఓ దమ్ము కొడదామన్నా లేదు, చాలా బాధ వచ్చేస్తుంది ' గోవులు వస్తున్నాయి జాగ్రత్త " అన్నిటి కన్నా సూపెర్ అండి.. ఎవరయినా సినెమా తీస్తారా ? అని ఎదురు చూస్తూ ఉంటాను.. అంటె,, అల్లా టప్పా దర్శకులు కాదు లెండి, ఇలా ఎన్నయినా సెప్పగలను.. ఆయన కవుర్లు..

    వసంతం.

    ReplyDelete
    Replies
    1. vasantham గారు,

      మీ రావిశాస్త్రి అభిమానాన్ని అద్భుతంగా రాశారు. మీ అభిప్రాయమే నాది కూడా! అయితే మా సుబ్బు ఇంత వీరాభిమానం సరి కాదంటాడు.

      'రావిశాస్త్రి బెస్ట్ ఏది?' అన్నదానికి ఇప్పటిదాకా ఏ ఇద్దరూ ఒకే అభిప్రాయం చెప్పిన దాఖలా లేదు. నేనైతే కొన్ని పేజీలు రిపీటెడ్ గా చదువుతుంటాను. ఉదాహరణకి.. బంగారం కోసం బంగారి గాడి చెల్లెల్ని వాడి మేనమామ పీక పిసికి బావిలో పడేసినప్పుడు.. రావిశాస్త్రి రాసిన లిరికల్ ప్రోజ్ ఎన్నిసార్లు చదివినా నా కళ్ళు చెమర్చుతాయి.

      'తెలుగు సాహిత్యంలో రావిశాస్త్రి ఒక అద్భుతం.' అన్న నా అభిప్రాయం గత ముప్పైయ్యేళ్ళుగా ఏ మాత్రం మారకుండా.. నిలకడగా, స్థిరంగా ఉంది.

      Delete
  8. ఓం శ్రీ రమణా యన మహ
    వేంకట రమణా యన మహ

    గుంటూరు వాసాయన మహా
    బ్రాడీపేట నివాసాయన మహా

    గీతా కేఫ్ ఇష్టమాయన మహా
    శంకర్ విలాస్ కష్టమాయన మహా

    మెంటల్ కేసు లిస్ట మాయన మహా
    యొగాసనాల్ కష్టమాయన మహా

    నాగయ్యంటే ఇష్టమాయను మహా
    బాలయ్యంటే కష్టమాయన మహా

    అమ్మా టైము అయింది మహా ప్రసాదం తెండి

    మిర్చి బజ్జీలంటే ఇష్టమాయను మహా
    గారెలంటే కష్టమాయను మహా

    ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టమాయన మహా
    దోస అట్టు అంటే కష్టమాయన మహా


    ఇంక మీరందుకొండమ్మా ఇప్పటికే ఆలేస్యమైంది
    ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాలి

    ReplyDelete
    Replies
    1. లక్కరాజు గారు,

      నా టపాలకి పూజ బహుచక్కగా చేయించారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు.

      (ఇంతకన్నా చెప్పటానికి మాటలు దొరకడం లేదు.)

      Delete
    2. మీరు కాఫీ తీర్థం ఇవ్వడం మర్చిపోయారు.

      Delete
  9. అలభ్యం ఈ మాట చదవగానే .......మా తరం దౌర్భాగ్యం పట్ల కోపం వచ్చింది,ఎప్పటిలానే సుబ్బు అదుర్స్!

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      (నాకున్న సమాచారం మేరకు రావిశాస్త్రిగారబ్బాయి తన తండ్రి సాహిత్యాన్ని ముంద్రింపజేసే పనిలోనే ఉన్నారు.)

      Delete
  10. ఎవరండీ ఈ రావి శాస్త్రి గారు?

    అబ్బా, మరీ పొగిడేస్తున్నారు ? సుబ్బూ కూడా పొగిడేస్తున్నాడు ? మామూలు గా సుబ్బు కౌంటరు వెయ్యాలి కదా మీరు చెప్పిందానికి ? అంతా గందరగోళం గా ఉంది !

    రావి శాస్త్రి గందరగోళం మనీషేమో మరి ?!



    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. >>ఎవరండీ ఈ రావి శాస్త్రి గారు?<<

      జిలేబి జీ,

      ఎంత మాట! ఎంత మాట! అన్నది మీరేనా? విన్నది నేనేనా?

      ఇప్పుడు నేనేమి చేయవలె? చేయునదేమున్నది? మేము కర్తవ్య నిష్టాగరిస్టులము.

      "ఎవరక్కడ?"

      "చిత్తం మహారాజా"

      "భటులారా! రావిశాస్త్రి ఎవరో తెలీని ఈ జిలేబి గారితో రావిశాస్త్రి సాహిత్యాన్ని సంపూర్ణంగా పారాయణం చేయించండి. అంతవరకూ.. ఏ బ్లాగులోనూ కామెంటెట్టకుండా కాపలా కాయండి. వెళ్ళండి!"

      Delete
    2. జిలేబి జీ,

      ఇందాక కామెంట్ ఏదోలా రాశాను. అయాం సారీ!

      రావిశాస్త్రి తెలుగు సాహిత్యంలో ప్రముఖుడు. ఉత్తరాంధ్ర యాసలో గొప్ప కథలు, నవలలు రాశాడు. ఆయన మొదటి నవల 'అల్పజీవి'.. అరవైయ్యేళ్ళ క్రితం పబ్లిష్ అయ్యింది.

      మీరు రావిశాస్త్రిని చదవకపోడం వల్ల ఈ పోస్టుకి 'కనెక్ట్' కాలేకపొయ్యారు. అంతే! ఫర్గెట్ ఇట్!

      Delete
  11. హాట్సాఫ్ రమణ గారు.
    ఓం! రావి శాస్త్రి ! నమోనమః !----- ఇది రమణ గారి గొప్పతనం.....
    prathiudayam.blogspot.com

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ! ఒక క్రేజీ ఐడియా వచ్చేసి బరబరా రాసిపడేశాను. రాసింతరవాత అర్ధమైనదేమనగా.. నాకు రావిశాస్త్రి పిచ్చి బాగా ముదిరిందని.

      (ఒక మంచి సైకియాట్రిస్ట్ ని సంప్రదించాలి!)

      Delete
  12. రావిశాస్రి సిమిలీల ప్రత్యేకత గురించి కొంచెం వివరంగా రాయగలరా?

    ReplyDelete
    Replies
    1. శ్రీరాం గారు,

      ఇప్పటిదాకా బుర్రలో ఒక ఐడియా రాంగాన్లే ఒక టపా రాసేస్తూ.. మీవంటి విజ్ఞుల కామెంట్లు చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. మీరు నాకు పెద్దపనే చెబుతున్నారు. నేను సీరియస్ / ప్రొఫెషనల్ రైటర్ని కాదు. మీ ప్రశ్నకి జవాబు.. ఒక తెలుగు PhD థీసిస్ కి సరిపడా రాయగలిగినంత పెద్ద విషయం.

      రావిశాస్త్రి రచనా శైలి గూర్చి వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రారా, చేరా, కేతు విశ్వనాథరెడ్డి, బాలగోపాల్, ఓల్గా, కోడూరి శ్రీరామ్మూర్తి, రంగనాథాచార్యులు, కాత్యాయని విద్మహే.. ఇలా చాలామంది విశ్లేషించారు.

      రావిశాస్త్రి సిమిలీల వల్లనే నాలాంటి నేలక్లాసు అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఆ సిమిలీల వల్లనే ఆయనంటే మాలాంటివారికి హీరో వర్షిప్!

      Delete
  13. రమణ గారూ!,
    రావిశాస్ర్తి సాహిత్యసర్వస్వం ఆల్‌ రెడీ వచ్చేసింది. మనసు ఫౌండేషన్‌ వారు వేశారు.అది లభ్యమో అలభ్యమో తెలీదు.వచ్చి మహా అయితే మూడేళ్లు అయిఉంటుందేమో! కాకపోతే ఆ పుస్తకం సైజ్‌ ఇబ్బందికరంగా ఉంటుంది. సరస్వతీ పీఠం మీదో, రిహాల్‌మీదో పెట్టుకుని బాసింపట్లు వేసుకుని చదవాల్సిందే. నవలల్లాగా ఎలాగంటే అలా చదవుదామంటే కుదరదు. లేకపోతే భక్తిపూర్వకంగా చదవరని అలా వేశారేమో తెలీదు. కానీ మనలాంటి రావిశాస్ర్తి ప్రేమికులకు మృష్టాన్న భోజనం.

    ReplyDelete
    Replies
    1. రామ్మోహన్ గారు,

      అవును. మనసు ఫౌండేషన్ వారు 'రచనా సాగరం' అంటూ రావిశాస్త్రిని ఒక పెద్ద దిండుగా పబ్లిష్ చేశారు. అయితే అదిప్పుడు దొరకదు. పబ్లిషర్స్ కి, రావిశాస్త్రి గారి పిల్లలకి డబ్బు విషయంలో తేడా వచ్చింది. పుస్తకాలు మొత్తంగా withdraw చేసి విశాఖపట్నం పంపబడ్డాయి. ఈ లోగా మనలాంటివాళ్ళు కాపీలు సంపాదించేశారు. (పుస్తకం పట్టుకుని చదువుకోడానికి ఇబ్బందిగా ఉన్నా.. రిఫెరెన్స్ కాపీగా బాగా పనికొస్తుంది.)

      (ఏది ఏమైనా రావిశాస్త్రి మార్కెట్లో లేకపోవడం దురదృష్టం. నాకు రావిశాస్త్రి సాహిత్యం ఎక్కడ దొరుకుతుందంటూ మెయిల్స్ వస్తుంటాయి. వారి కోసం కూడా ఈ సమాధానం.)

      Delete
  14. చాలా బావుంది! మీ టపా చదవగానే బాకీ కథలు ఏకబిగిన మళ్లీ చదివేశా! పిపీలకం కథలో పాము 'బుసబుసమని' నవ్వడం గుర్తుచేసుకుని ఎంత కిక్కిరికిక్కిరిగా నవ్వుకున్నానో!! చాలా రోజులకి రావిశాస్త్రి గారితో కలిసి గ్లెన్ఫిడిచ్ తాగే అవకాశం కల్పించారు. థ్యాంక్యూ డాక్టరు గారు.

    ReplyDelete
    Replies
    1. ఇసాపట్నానికి చెందిన సీనియర్ డాక్టరొకాయన తను రావిశాస్త్రితో కలిసి మందు కొట్టానని గర్వంగా చెప్పుకుంటాడు (అందులో నిజమెంతో నాకు తెలీదు). అయితే.. ఆయన్ని చూసి కుళ్ళుకుంటుంటాను.

      లవకుశ (పాతది) సినిమాలో వశిష్టుడి సలహాపై రాముడు బంగారు సీతతో అశ్వమేధయాగం చేస్తాడు. నాకీ పాయింట్ నచ్చింది. అదే విధంగా.. 'రావిశాస్త్రి భక్తజనకోటి కూడా ఆయన పటంతో 'వ్రతం' చెయ్యవచ్చుగదా!' అనే ఐడియా నుండి ఈ పోస్ట్ పుట్టింది.

      'పిపీలికం' పాము బుసబుసల సాక్షిగా మీరు రావిశాస్త్రికి 'నివాళులు' అర్పించారు. (మీ జన్మ ధన్యమైంది.) మీకు నా అభినందనలు!

      Delete
  15. ఒకసారి రైల్లో మాగజైన్ తిరగేస్తుండగా రావి శాస్త్రి చిన్న కథలు అని ఒక బాక్స్ ఐటెం కనిపించింది. ఛదివిన తర్వాత చాలసేపు అలోచనలో పడిపోయాను..అంత చిన్న కథ - కనీసం 1/4 పేజి కూడా లేదు, తర్వాత చాలా సేపు నాతో ప్రయాణం చేసింది.

    ReplyDelete
  16. BOMMAKANT KRISHNAKUMARI31 July 2013 at 11:23

    డియర్ రమణ,

    మణిరత్నం ‘బొంబాయి’ సినిమా గుర్తుందా? హిందూ, ముస్లిం మత కల్లోల గురించి తీసాడు. అది చూసినపుడు బాగానే అనిపించింది. రకరకాల కామెంట్స్ వచ్చినాయి. ఆనంద్ పట్వర్ధన్ మాత్రం ఆ సినిమా ‘కుట్ర’ అన్నాడు. ప్రెస్ తో పాటు, నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎనిమిది నుంచి పదిహేను శాతం వున్న ముస్లింలను హిందువులతో సమానంగా చూపించటమే పెద్ద కుట్ర. అతి తక్కువగా వున్నవాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళతో సమానంగా ఎలా కలబడతారు అన్నాడు (డైలాగులు ఇవి కావేమోకాని, అర్థం అదే.)

    తెలిసో, తెలియకో,రా.వి.శాస్త్రి విషయంలో మీరీపని చేశారు రమణా. ఆయన గురించి రాసిన (చాలా ?) పోస్ట్ లలో తాగుడు రిఫరెన్స్ ఉంది. ఆయన బలహీనతని అర్ధం చేసుకోవచ్చేమో, కాని తప్పు కాదన్న ఆ సౌండ్ ఎందుకు? పైగా టెంప్ట్ అయ్యేలా సింగల్ మాల్ట్ విజువల్స్ ఎందుకు?

    నేను ఉద్యోగానికి వచ్చిన కొత్తల్లో ఒకరోజు ఆఫీస్ లో సాయంత్రం పని ఎక్కువగావుండి సెక్షన్ లో అందరం పని చేస్తున్నాం. ఈక్వల్ రైట్స్ కోసం కొట్లాడుతున్న వయసు కదా! ఈక్వల్ responsibilities తీసుకోవటానికి సిద్ధపడిపోయాం, మా ఆఫీసర్ వచ్చి కూచుని ‘ఇంకా ఎంత సేపు పడుతుంది.’ అంటే, ‘అరగంటలో అయిపోతుంది’ అని చెప్పి పక్కనే వాటర్ బాటిల్ లో నీళ్లుంటే గ్లాసుల్లో పోసి తాగటానికి సునందకిచ్చి నేను తాగాను.

    ఆ ఆఫీసర్ సెక్షన్ లోంచి వెళ్ళిన పావుగంటకి, ఆఫీసర్ ఆ చుట్టుపక్కల లేడని నిర్ధారించుకున్నాక , మా colleag ‘మీకసలు బుద్ది లేదు కృష్ణ కుమారి’ అన్నాడు. నామానాన నేను పనిచేసుకుంటుంటే, ఈ గోలేవిటి అని సర్రున కోపం వచ్చింది. ఏదో అనబోయేంతలో ‘వాడు రోజు ఈపాటికి బార్ లో కూర్చుంటాడు. మీరు అలా గ్లాసుల్లో నీళ్ళు పోస్తోంటే గుటకలు మింగలేక చస్తున్నాడు. కొంచెం చూసుకోవఖ్ఖర్లేదా!’ అన్నాడు. దాంతో నాకు, సునందకి మాట రాలేదు.

    నాకైతే ‘ఇదెక్కడి తద్దినం’ అనిపించింది. ఏదో మా అమ్మని కంగారు పెట్టటం ఇష్టం లేక సింపుల్ గా ఉద్యోగానికి వస్తున్నాను కాని, (పదిమంది మగాళ్ళ లోకి ఆడపిల్లలు చక్కగా అలంకరించుకుని వెడితే ఎవరు ఏమంటారో అని మా అమ్మకి భయం.) ప్రతీవాడి అలవాట్లు, etc. కూడా చుసుకోవాలా దేవుడా! అనిపించింది. ఇది 30 ఏళ్ల క్రితం నాటి మాట. ఇపుడు సమాజంలో ఆ తాగుడు ఆక్టోపస్ లాగా విస్తరించింది గా. మీ ‘సింగల్ మాల్ట్’ విజుయల్స్ ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తాయో వేరే చెప్పాలా!

    రత్న మాణిక్యాల రా.వి.శాస్త్రిని, వజ్ర vydhuryala రా.వి.శాస్త్రిని, వస్తున్నా కాసుకోండి అంటూ వేగంగా వచ్చేసి, చల్లగా కాళ్ళు తడిపి వెళ్ళిపోయే సముద్రపు అల లాంటి రా.వి.శాస్త్రిని మరుగు పరిచేలాగ, ఆ visuals, పూజాకార్యక్రమాలు ఏంటి స్వామీ?

    ‘నా బ్లాగ్, నా ఇష్టం..’ అనచ్చు. కాని, ఆ బ్లాగుల్లో రాతలు కొన్ని, మీ పట్ల గౌరవం పెరిగేలా ఉండటంవల్ల, కొన్ని రాతలు మేం గౌరవించే వాళ్ళ గురించి ఉండటం వల్ల ఈ kantha (కంప్యూటర్) శోష.

    కృష్ణకుమారి

    ReplyDelete
    Replies
    1. డియర్ కృష్ణకుమారి,

      నేను మణిరత్నం 'బొంబాయి' చూళ్ళేదు. కాబట్టి ఆ సినిమా గూర్చి మీర్రాసిన విషయం అర్ధం కాలేదు.

      తాగుడు ఆరోగ్యానికి మంచిదని నేనెప్పుడూ రాయలేదు. పైగా హానికరం అంటూ చివర్లో ఒక disclaimer కూడా పడేశాను.

      తాగుడు నిజంగా చెడ్డదా? 'రోజూ పీకల్దాకా తాగి రోగాలు తెచ్చుకోవటం 'ఆరోగ్యరీత్యా' చెడ్డది. అప్పుడప్పుడు ఒకట్రెండు డ్రింకులు పుచ్చుకోవటం శరీరానికి హానికరం కాదు.' అని మెడికల్ సైన్స్ చెబుతుంది.

      నాకు రావిశాస్త్రి ఇష్టం. glenfiddich కూడా ఇష్టం. అందుకే ఆ ఫోటోలు పెట్టాను. ఇట్లాంటి ఫోటోలు, రాతలు పాపులర్ పత్రికల్లో పబ్లిష్ చెయ్యడానికి కుదరకపోవచ్చు. కానీ బ్లాగ్ రీడర్స్ different గా ఉంటారు.

      నాకిప్పడిదాకా ఎవరూ ఈ విషయంలో (మీరు తప్పించి) feedback ఇవ్వలేదు. కావున ఆలోచించి.. అవసరం అనుకుంటే glenfiddich ఫోటోలు తీసేస్తాను.

      Delete
  17. మా చాత్ర్త్రి బాబు గురింసి మా బాగా రాసినావు బావు..
    ఎవ్వురేటన్నీ ఒకాల్తా ఆయన్లాగా మరెవ్వరు సేయనేరు బావు.సదవబోతే ఒక్కోసోట నవ్వు,దుఖవూ కలిసిపోయి జవిలిగా డబ్బుగలోళ్లంటే కోఫం ఒస్తాది.శ్రీశ్రీ బాబు రసన అనంటాడు సూడు..అనాగన్నమాట.చెబాసో!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.