Sunday 31 March 2013

బీరువాల్లో పుస్తకాలు - బీభత్స అనుభవాలు


పై ఫోటో చూడండి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. సోనియా గాంధి వెనక ఎన్ని పుస్తకాలో!

'అక్కడున్న పెద్ద మనుషులకి కనీసం ఆ పుస్తకాల టైటిల్స్ అయినా తెలుసునా?'

'ఓయీ అజ్ఞాని! వాళ్ళంతా ఎవరనుకున్నావ్? ఈ దేశాన్ని నడిపిస్తున్న మహామేధావులు. వారికి ఆ పుస్తకాలన్నీ కొట్టిన పిండి. దంచిన కారం. వండిన కూర. పిండిన రసం.'

అలాగంటారా! అయితే మీరు నన్ను క్షమించాలి. ప్రతి మనిషి తన అనుభవాల నుండే జీవిత పాఠాలు నేర్చుకుంటాడు. ఆ దృక్కోణంతోనే జీవితాన్ని చూస్తుంటాడు. ఈ బీరువాలు, పుస్తకాలు పట్ల అనుమానాలు, అపార్ధాలు కలగడానికి చిన్నతనంలో నాక్కలిగిన కొన్ని బీభత్స అనుభవాలే కారణం.

కేస్ నంబర్ 1. ఎదురింటి ప్లీడరుగారు.


చిన్నప్పుడు మా ఇంటెదురు ఒక ప్లీడరుగారు ఉండేవారు. ఇంటి నిండా బీరువాలే! బీరువాల్నిండా దున్నపోతుల్లాంటి పుస్తకాలే! ఆయనెప్పుడూ వాటి మొహం చూసిన పాపాన పోలేదు. పొద్దస్తమానం ఇంటి ముందున్న మామిడి చెట్టు కాయలు ఎవరు కోసేసుకుండా కుక్క కాపలా కాస్తుండేవాడు. ఆయనకి బెయిల్ పిటిషన్ వెయ్యడం కూడా రాదని నాన్న చెప్పేవాడు. మరాయనకి అన్ని పుస్తకాలెందుకబ్బా!

కావున బీరువాల్లో పుస్తకాలకి, ఆ పుస్తక సొంతదార్లకీ సంబంధం ఉండవలసిన అవసరం లేదనే అనుమానం నాలో మొదలైంది. సంబంధం లేకపోతే మానె.. అసలీ బీరువా పుస్తకరాయుళ్ళ శీలాన్నే శంకించాల్సిన సంఘటనలు అటు తరవాత నా జీవితంలో చోటు చేసుకున్నాయి.

కేస్ నంబర్ 2. మామా! ఇదా నీ అసలు రహస్యం!


నా మేనమామ ఒకాయన మంచి ఇల్లు కట్టించాడు. ఇంట్లో టేకు బీరువాలు. వాటి నిండా సాహిత్య పుస్తకాలు! షేక్స్పియర్, మిల్టన్, కీట్స్.. గురజాడ, శరత్ చంద్ర చటర్జీ.. అన్ని పుస్తకాలు నీటుగా, ముద్దొచ్చేలా సర్ది ఉండేవి. ఏ యాంగిల్లో చూసినా నాకాయన ఓ గొప్ప మేధావిలా అనిపించేవాడు. తీరిక సమయాల్లో ఆ పుస్తకాల్ని సర్దుకుంటూ ఆయన కాలక్షేపం చేసేవాడు.

అయితే.. ఆయన అత్తతో ఒక విషయంలో తీవ్రంగా గొడవ పడుతుండేవాడు. మా మేనమామ మామ.. అనగా మా అత్త తండ్రి.. ఇస్తానన్న కట్నం పూర్తిగా ఇవ్వలేక బాకీ పడ్డాట్ట. ఆ బాకీకి వడ్డీ, ఆ వడ్డీకి చక్రవడ్డి వసూలు చేసాడు మా మామ మహానుభావుడు. ఆ బాకీ వసూలు నిమిత్తం మా అత్తని అప్పడంలా వణికించేవాడు. ఇంట్లో దుర్భర వాతావరణాన్ని సృష్టించేవాడు.

ఆంగ్లాంధ్ర సాహిత్యాలని నమిలి మింగేసిన నా మేనమామ ఇంత ఘోరానికి తలపడుతున్నాడేమి? ఎక్కడో ఏదో తేడాగా ఉంది. ఏమది? ఈ అనుమానం కలిగిన మీదట ఆయన సాహిత్య జ్ఞానంపై డిటెక్టివ్ యుగంధర్ లా పరిశోధన చేశాను.

దరిమిలా దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిశాయి. మా మేనమామ ఆ పుస్తకాలేవీ చదవలేదు. చదవని ఆ పుస్తకాల పట్ల ఏల ఆయనకీ మమకారం! ఆయన పోయిన నాల్రోజులకే ఆ పుస్తకాలన్నీ కిలోల్లెక్కన అమ్మేసి మా అత్త తన కసి తీర్చుకుంది. అది వేరే విషయం.

కేస్ నంబర్ 3. పుస్తకం రూముకే భూషణం!


డిగ్రీ చదివే రోజుల్లో నాకో స్నేహితుడున్నాడు. అతగాడికి ఆంగ్ల భాషయన్న మిక్కిలి ఎలర్జీ. అంచేత వెర్బులు, నౌన్లు లేకుండా.. ఆంగ్లభాషని ఖండఖండములుగా ఖండించి మాట్లాడుతూ కసి తీర్చుకునేవాడు.

ఉన్నట్టుండి అతగాడి హాస్టల్ రూములో ఆంగ్ల పుస్తక దిండ్లు! విశాలాంధ్ర పుస్తకాల షాపు నుండి టన్ను పుస్తకాలు కొనుక్కొచ్చాడు. పెత్రోవ్, తీస్తొనాస్కీ.. అంటూ అర్ధం కాని పేర్లతో రచయితలు. అన్నీ కలిపి వంద రూపాయలు కూడా అవలేదుట!

'వామ్మో! మనోడిలో ఇంత విషయం ఉందా!' అని కంగారు పడ్డా.

నా కంగారు చూసి మావాడు చిద్విలాసంగా నవ్వాడు. కొద్దిసేపటికి అసలు రహస్యం చెప్పాడు.

'మనం తెలివైన వాళ్ళం. ఆ విషయం నీకూ నాకూ తెలుసు. కానీ ఎదుటి వాడికి ఎలా తెలుస్తుంది? మన గొప్ప మనమే చెప్పుకోలేం గదా! ఆ పని ఈ పుస్తకాలు చేస్తాయి.' అన్నాడు.

'నిజవే! కానీ ఇవి చదవాలంటే కష్టం కదా?' అన్నాను.

'ఓరి అమాయకుడా! ఇవి చదవడానికి కాదు. ఎదుటి వాణ్ని భయపెట్టడానికి. రూములో టేబుల్, టీపాయిల్లాగా ఈ పుస్తకాలూ ఫర్నిచర్లో భాగవే!' అన్నాడు.

దుర్మార్గుడు! పుస్తకం హస్త భూషణం అన్నారు పెద్దలు. వీడు పుస్తకాన్నిరూముకే భూషణంగా మార్చాడు.

కేస్ నంబర్ 4. పుస్తకాలు చేసిన పెళ్లి!


అతను నా జూనియర్. ఓ రోజు హడావుడిగా వచ్చాడు.

"గురూ గారు! మీ ఇంగ్లీష్ నవల్స్ ఓ రెండ్రోజులు అప్పివ్వాలి."

"అన్నీ ఒక్కసారిగా ఎందుకు! ఒకటొకటిగా తీసుకెళ్ళి చదువుకో."

"భలేవారే! అవన్నీ చదవడానికి నాకు పనీపాటా లేదనుకున్నారా! నాకు అమెరికా సంబంధం వచ్చింది. పిల్ల US సిటిజన్. పెళ్లివారు రేపు మా ఇంటికి వస్తున్నారు. నా దగ్గర మన్లెవలుకి తగ్గట్లుగా మధుబాబు, మల్లాది నవల్స్ ఉన్నాయి. నిన్నవన్నీ కట్టగట్టి అటక మీద పడేశాను. ఇప్పుడు మీరిచ్చే ఇంగ్లీషు పుస్తకాలు అద్దాల బీరువాలో నీటుగా సర్దాలి. పెళ్లి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టెయ్యాలి." అన్నాడు.

"అన్నీ ఇంగ్లీషు పుస్తకాలైతే నమ్మరేమో! అంచేత పన్లో పని.. రావిశాస్త్రిని కూడా తీసుకెళ్ళు."

"రావిశాస్త్రా! ఎవరాయన?"

"ఆయన తెలుగు సాహిత్యవనంలో రావి వృక్షం వంటివాడు."

"వామ్మో! నాకు వృక్షాలు వద్దు. పుస్తకాలు చాలు. అయినా ఆ అమెరికా వాళ్ళ ముందు నేను తెలుగు పుస్తకాలు చదువుతున్నట్లు కనిపించకూడదు. చీప్ గా ఉంటుంది." అన్నాడు.

నా ఇంగ్లీషు నవల్స్ అట్టపెట్టెలో తీసుకెళ్ళాడు. ప్లాన్ విజయవంతంగా అమలు చేశాడు. అదే అట్టపెట్టెలో జాగ్రత్తగా పుస్తకాలు తీసుకొచ్చి థాంక్సులు తెలిపి వెళ్ళాడు. ఒక్క పుస్తకం కూడా మిస్సవ్వలేదు! పుస్తకాలు చదివేవాడైతే పుస్తకాలు కొట్టేస్తాడు గానీ.. చదవనివాడు నిజాయితీగా తిరిగిచ్చేస్తాడన్న సత్యం బోధపడింది. ఇప్పుడతను అమెరికాలో ఓ పెద్ద డాక్టరు. ఆ విధంగా పుస్తకాల వల్ల పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకోవచ్చని నిరూపించిన మేధావి.

ఇన్ఫరెన్స్ :-


అటు తరవాత పుస్తక ప్రియుల్ని రెండు రకాలుగా విభజించుకున్నాను. మొదటిరకం పుస్తకాలు కొంటారు. లేదా సంపాదిస్తారు. కానీ చదవరు. వారికి పుస్తకాలు కేవలం అలంకార ప్రాయం. స్టేటస్ సింబల్.

రెండోరకం వాళ్ళు పుస్తకాలు చదువుతారు. కొని చదువుతారా, కొనకుండా చదువుతారా సెకండరీ.. మొత్తానికి చదువుతారు. కానీ చదివినట్లు కనపడరు. వారి దగ్గర పుస్తక వాతావరణం కూడా ఉండదు. ISI ఏజంట్ల వలె గుంభనంగా ఉంటారు.

డిస్కషన్ (చర్చ) :-


ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ విషయంకి వద్దాం. పార్టీని గానీ, ప్రభుత్వాన్ని గానీ నడపడానికి ఆ పుస్తకాల అవసరం ఉందా? ఉండదని నా అభిప్రాయం.

'రాహుల్ ని ప్రధాని పదవికి ఒప్పించుట ఎలా? కరుణ లేని కరుణానిధి కరుణా కటాక్షములు తిరిగి సంపాదించుట ఎలా? మూలాయం మూలములేమి? మమత మమతానురాగములను ఏ విధమున పొందవలయును? మాయావతిని మాయలో పడవేయుట ఎట్లు?'

ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆ పుస్తకాల్లో ఉండవు. ఆ సమాధానాల్లేని పుస్తకాలతో కాంగ్రెస్ పార్టీకి పన్లేదు. మరైతే అన్నేసి పుస్తకాలు ఆ పార్టీ మీటింగ్ హాల్లో ఎందుకు?!

మన మైండ్ అనేక విషయాలకి ట్యూన్ అయిపోయి ఉంటుంది. రోజువారి పనులకి అనుగుణంగా అనేక ప్రతీకలు మెదడు రిజిస్టర్లో ముద్రించుకుని ఉంటాయి. వాటిననుసరించి యాంత్రికంగా బ్రతికేస్తుంటాం. తేడా వస్తే మెదడులో రిజిస్టర్ ఒప్పుకోదు.

ఉదాహరణకి కాఫీ హోటల్లో గుడి గంట ఉందనుకోండి. కాఫీ పట్ల అనుమానం కలుగుతుంది. అదే విధంగా గుళ్ళో ప్రసాదంగా ఉప్మా పెసరట్టు పెడితే.. ఆ దేవుడి మహిమ పట్ల లేనిపోని అనుమానాలొస్తాయి. అంటే మనకి తెలీకుండానే.. ఒక గదిలో సామాను సర్దినట్లుగా.. మెదడులో రొటీన్ సమాచారం స్టోర్ అయి ఉంటుంది. అందుకే కొద్దిగా తేడా వచ్చినా బుర్రలో తికమక!

కంక్లూజన్ (ముగింపు) :-


అంచేత.. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ హాల్లో బీరువాలు, వాటి నిండా పుస్తకాలు ఉండటం చాలా సబబు. వెనకాల ఆ బీరువాలు, పుస్తకాల ఉండటం మూలానే వాళ్ళంతా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది. అవే లేకపోతే వాళ్ళు మేధోమధనం చేస్తున్నట్లుగా ఉండదు. మసాలా దోశలు ఆర్డరిచ్చి.. తినడం కోసం ఆశగా, ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది.

అప్పుడు దేశ ప్రజలకి కోపం వస్తుంది. పిమ్మట ప్రభుత్వాలు పడిపోతాయి. అలా జరగకుండా ఉండాలనే ఆ హాలు నిండా బీరువాలు, పుస్తకాలు ఉంచి.. పార్టీలు, ప్రభుత్వాలు ప్రజాక్షేమం గూర్చి సీరియస్ గా 'ఆలోచిస్తున్న' వాతావరణం కల్పిస్తుంటాయి. చూశారా! బీరువాలకి.. బీరువాల్లో పుస్తకాలకి ఉన్న పవర్!

చివరి తోక.. 

'అవునురే! పుస్తకాల బీరువాల గూర్చి ఇన్ని ఎదవ ఆలోచనలు రాశావు గదా! ఇంతకీ నువ్వే జాతి?'

'అదేందన్నా! ఇదంతా ఎలా రాశాననుకున్నావ్? ఒకప్పుడు నేను పుస్తకాలు చదివేవాణ్ని. ఇప్పుడు పుస్తకాలు కొని బీరువాల్లో 'దాచుకుంటున్నాను'. దొంగతనాల గూర్చి దొంగే చక్కగా రాయగలడు. ఆ మాత్రం తెలీదా!'


(photos courtesy : Google)

40 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ఆ విధంగా పుస్తకాల వల్ల పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకోవచ్చని నిరూపించిన మేధావి.
    ------------------------------------------------
    మా ఆవిడ మాచ్ మేకర్. ఇది చెప్పాలి. చాలా పెద్ద టిప్. అందులో పనిచేసింది కూడా. అవసరమైన విధంగా వాడుకుంటే క్వాలిఫికేషన్స్ ని యన్ హాన్స్ చేసుకోవచ్చు.

    ReplyDelete
    Replies
    1. ఈ టిప్ మీ భార్యగారికి చెబుతున్నారు సరే! మరి అంత పెద్ద టిప్పిచ్చిన నాకేమన్నా.. హీహీహీ.. నా టిప్ సంగతి చూడండి సార్.. ఏదో మీ అభిమానం.. హీహీహీ!!

      Delete
    2. ఇలాగే ఇంకొక వెయ్యి బ్లాగ్ పోస్టులు వెయ్యమని ఆశీర్వదిస్తున్నాను.

      Delete
    3. ఆహా! ఇప్పుడు తట్టింది. రహస్యంగా రెజుమీ పంపండి. రికమండ్ చేస్తాను. తర్వాత మీ లక్కు.

      Delete
    4. @Rao S Lakkaraju గారు

      మీరు భలే పట్టేస్తారండీ :D


      Delete
  3. పుస్తకాల లైబ్రరీ కూడా ఒక లగ్జరీ. అందమైన, ఖరీదైన ఫర్నిచర్ తో జతకలిస్తే ఇంకా అందం . అవన్నీ వచ్చేసరికి చదవాలంటే ఆసక్తి ఉండదు.

    ReplyDelete
    Replies
    1. 'మంచిపుస్తకం అనగా.. మనం చదవకుండానే చదివినట్లు చెప్పుకునేది!' అని ఎక్కడో చదివాను (ఇట్లాంటివి Oscar Wilde చెబుతుంటాడు).

      Delete




  4. మరొక్క కేటగిరీ ని మరిచిపొయ్యారు.వాళ్ళ బీరువాలో చాలా పుస్తకాలు వుంటాయి.కాని అందులో కొన్నవి ఉంటే బహుస్వల్పం.అరువు తీసుకొని మరి యివ్వకుండా ఉంచుకున్నవి;లైబ్రరీలనుంచి కొట్టేసినవి ;కాంప్లిమెంటరీగా సంపాదించినవి.వీళ్ళు మంచి పుస్తకప్రియులుగాను,మేధావులుగాను పేరుపొందుతారు.

    ReplyDelete
    Replies
    1. సాధారణంగా 'మంచిపుస్తకాలు' కొట్టేసినవాడు తెలివైనవాడు. వాటిని display చెయ్యకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు.

      (ఇక కాంప్లిమెంటరీలంటారా.. ఈ మధ్య పుస్తకాలు కొనేవాళ్ళ కన్నా పబ్లిష్ చేసేవాళ్ళే ఎక్కువైపొయ్యారు. అవి ఎలాగూ అమ్ముడుపోవు కనుక.. బఠాణీల్లా పంచేస్తున్నారు.)

      Delete
  5. డాటేరు గారు,

    ఎవ్వరికీ చెప్పకండేమ్ ! ఈ బ్లాగు లోకం లో కూడా సంవత్సరానికో మారు ఓ టపా మేమందరం రాస్తామండీ ! ' ఫలానా సంవత్సరం లో నేను చదివిన కొన్న పుస్తకాలు ' అన్న టపా శీర్షికన !

    అవి చదివి బెజారైన కొందరు బ్లాగ్ చదువరీ చదువర్మణులు హడలెత్తి పోయి బ్లాగు టపా లు చదవకుండా పారి పోయి నారు కూడాను !!

    (ఈ టపాలు పెట్టిన కోవలో జిలేబీ కూడా ప్రతి సంవత్సరం ఆఖర్లో టపా పెట్టును !)

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. అలాగా! నాకు తెలీదండి! ఈసారి మీర్రాసినప్పుడు నేను కూడా రాస్తాలేండి!

      (నా దగ్గర మంచి కేటలాగ్ ఉంది!)

      Delete
  6. Inference and the conclusions are the highlights - loved the part - looks as if waiting for the "masala Attu" Is priceless! Keep it up! - Gowtham (not the borrower of your English books)

    ReplyDelete
    Replies
    1. మిత్రమా,

      పుస్తకాల గూర్చి రాసేప్పుడైనా ఉప్మాపెసరట్టు, మసాలాదోశల ప్రస్తావన లేకుండా రాయలేకపోతున్నాను.

      (ఇదేదో బలహీనత వలె తోచుచున్నది!)

      Delete
  7. "అవే లేకపోతే వాళ్ళు మేధోమధనం చేస్తున్నట్లుగా ఉండదు. మసాలా దోశలు ఆర్డరిచ్చి.. తినడం కోసం ఆశగా, ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది."
    lolll. super post!

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      (పోస్ట్ గొప్పదనం నాది కాదు. మసాలాదోశది!)

      Delete
  8. బాగుందండి ..పుస్తకాలు కూడా ఫర్నిచర్ లో బాగమన్నమాట

    ReplyDelete
    Replies
    1. చివర్లో చెప్పినట్లు.. ఈ టపా నా ఆత్మకథాత్మక కథ!

      ('ఆత్మకథాత్మక' అంటే ఏంటో నాకూ తెలీదు. పదం గంభీరంగా ఉందని వాడేశాను.)

      Delete
  9. పుస్తక రాయుళ్ళతో మీ బీభత్స అనుభవాలు అదరగొట్టేసారు. ముఖ్యంగా కంక్లూజన్.

    ReplyDelete
    Replies
    1. థాంక్సండి!

      (టపా పబ్లిష్ చేసేముందు చదివితే మొనాటనస్ గా అనిపించింది. అంచేత సైంటిఫిక్ పేపర్ కి మల్లే ఉపశీర్షికలతో విభజించాను. మీకు నచ్చినందుకు సంతోషం.)

      Delete
  10. రమణ గారూ..
    చాలా బాగా రాశారు.
    కొన్ని చోట్ల బాగా నవ్వుకున్నాను.
    మీ పాత పోస్ట్ లు కొన్ని చదివానండీ..
    చక్కటి హాస్యం మాకందరికీ పంచుతున్నారు.
    కొద్ది రోజుల్లోనే మీ బ్లాగ్ కి పంకా అయిపోయాను.


    ReplyDelete
    Replies
    1. మీరిలా పంకా అయిపోతే నాకు ఇబ్బంది లేదు గానీ.. ఎలెక్ట్రిసిటీ బోర్డ్ వారు బిల్లు పంపితే మాత్రం మీరే కట్టుకోవాలి సుమండీ!

      Delete
  11. "మసాలా దోశలు ఆర్డరిచ్చి.. తినడం కోసం ఆశగా, ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది."
    హ హ భలే నవ్వొచ్చింది.

    "ఒకప్పుడు నేను పుస్తకాలు చదివేవాణ్ని. ఇప్పుడు పుస్తకాలు కొని బీరువాల్లో 'దాచుకుంటున్నాను'"
    ష్..గప్ చుప్ :)

    Case No. 2 లో మామ గారు "తలపడిన ఘోరానికి" "ఇంట్లో సృష్టించిన దుర్భర వాతావరణం" కీ, పుస్తకాలు చదవకపోవడానికి నేరుగా సంబంధం లేదేమో రమణ గారూ :) చదివినా కూడా అలానే చేసుండేవారేమో :) మంచి పుస్తకాలు "చదవటం" కీ, మంచి "ప్రవర్తన" కీ direct relation నిజంగానే ఉందంటారా? ఏమో నాకనుమానమే.

    ReplyDelete
    Replies
    1. మంచి పుస్తకాల వల్ల ఆలోచనలు refine చేసుకోవచ్చును. అది కూడా optional.

      "మంచి ప్రవర్తన"! ఈ మాటకి అర్ధం మనం ఇచ్చుకునే నిర్వచనం బట్టి మారిపోతుంటుంది.

      'అఆ' లు రాకపోయినా ఉన్నతంగా ఆలోచించగలిగిన ఉత్తములు.. కులం పరిధి దాటి ఆలోచించలేని యూనివర్సిటీ ప్రొఫెసర్ మేధావులు.. మనకి కనిపిస్తూనే ఉంటారు.

      Delete
  12. beeruva pustaka raayullekaadu pustakaala beeruva poster goda meeda athikinchukoni (goppaki)gambheeramga mahaa medhavilaa photolu digi patrikallo attahaasamga patrikalalo prachurimpa chesukunevaallanu kooda choosaanandoi RAMANAgaru.Meerante parama chedda asooyagaa undi,20 vella pustakalu kala swanta grandhaalayam unna nenu vraayaali kaani meerelaa vraasaaru!Mee aatma kathaatmaka katha bhale baagaa navvinchindi.nenadi vraayananduku lolopala aedustu pyki navvutoo abhinandistunna oka Thelugu vaadu!

    ReplyDelete
    Replies
    1. సూర్య ప్రకాష్ గారు,

      lekhini.org తో మీరు తెలుగు రాయవచ్చును. ప్రయత్నించగలరు.

      మీదగ్గర 20 వేల పుస్తకాలున్నాయా! మీరు మామూలు మేధావి కాదు.. మహామేధావి!

      మీర్రాద్దామనుకున్న టపా నే రాసినందుకు సంతోషించండి సార్!

      (నా దృష్టిలో టపా రాయడం వంట చెయ్యడం వంటిది. చదవడం ఆ వంట ఆరగించడం వంటిది. వండడం కన్నా తినడం హాయిగా ఉంటుంది కదా!)

      Delete
  13. ఈ నెలాఖరుకు మేము ఇల్లు మారాలి . ఆ ప్రయత్నం విరమించుకుoటున్నాము , కారణం ఈ పుస్తకాలే రెండు అలమార్లు రెండు బీరువాల నిండా ఉన్నాయి . అయితే అన్ని పుస్తకాలు కూడా చదవడానికి కాదు కొన్ని రిఫర్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాను. నిజానికి ఇప్పుడు కొనడం ఎక్కువ చదవడం తక్కువ , కాని మీ రచనలన్నీ చదువుతాను.

    ReplyDelete
    Replies
    1. అయ్యో! పుస్తకాల కోసం ఇల్లు మారడం త్యాగం చేశారా!

      (కొన్న పుస్తకాలు.. కట్టుకున్న భార్యకి మల్లే.. కొన్నాళ్ళకి కడు భారంగా మారతాయని మీ వ్యాఖ్య వల్ల అర్ధమవుతుంది.)

      Delete
  14. రమణ గారు,
    చాలా బాగా చెప్పారు. నిజంగానే పుస్తక పఠనానికీ మేధోశక్తికీ, మంచితనానికీ యేమాత్రం లంకె లేదు. ఎదుటి వారు వీరిని మేధావులుగా అపోహ పడటానికి మాత్రం భలేగా ఉపయోగిస్తాయి. కాంగ్రెస్ పార్టీ - మసాలా దోసె simply superb comedy. lol

    ReplyDelete
    Replies
    1. లెస్స బలికితిరి. మీ observation కి బెస్ట్ ఉదాహరణ నేనే! నాకు పుస్తక పఠనమన్న ఎలర్జీ. కానీ నేను అతి మంచివాడిననీ, సునిశిత మేధావిననీ అని నా నమ్మకం!

      Delete
  15. చాలా మంది హిందూ పేపర్ వేసుకుంటారు కానీ పేపర్ అలానే ఉంటుంది చదవరు .. పుస్తకాల వలెనె ఇలాంటి అలంకరణ కోసమే అని విన్నాను

    ReplyDelete
    Replies
    1. హిందూ పేపర్ చందాదారుల్లో.. అంగుళం కూడా వదలకుండా చదివేవాళ్ళు.. అంగుళం కూడా చదవనివాళ్ళు.. రకరకాలవాళ్ళు ఉంటారు. అదే ఆ పేపర్ ప్రత్యేకత!

      Delete
  16. చాలామంది ఇళ్లలో పుస్తకాల బీరువాల ఫోటోలు,నిజంగానూ కూడా చూసి నిజంగా వీళ్లు ఈ పుస్తకాలు చదువుతారా? అంత టైమ్ ఉంటుందా అని అనుకునేదాన్ని. అది కూడా ఒక షో (కు) అని తెలుసుకుని అమ్మో వీళ్లెన్ని పుస్తకాలు చదివేస్తున్నారు. ఎంత మేధావులో అని బోల్డు ఆశ్చర్యపోవడం మానేసా.. కాని నాకు తెలిసిన కొందరు మాత్రం వాళ్లింట్లో ఉన్న వందల పుస్తకాలను పేజీలు వదలకుండా చదివేసారు. మహానుభావులు.. వాళ్లు మా ఇంటి చుట్టుపక్కల ఉంటే ఎంత బావుండు. రోజుకో పుస్తకం చదివి ఇచ్చేదాన్ని కదా అని ఫీలైపోతుంటాను..

    నేను మాత్రం మీరు చెప్పిన ఏ లిస్టులో రానండి డాక్టర్ గారు.. :)

    ReplyDelete
    Replies
    1. అవును. పుస్తకాలు బాగా చదివినవారితో స్నేహం లాభదాయకంగానే ఉంటుంది. అప్పుడు చెత్తపుస్తకాల గూర్చి ముందే తెలుసుకుని.. వాటి జోలికి వెళ్ళకుండా, బోల్డంత సమయం ఆదా చేసుకోవచ్చు.

      Delete
  17. Enjoyed your writing once again Ramana. Perhaps, we Indians are quick to see things in negative light. If books are wonderful and lovely, the bookshelves are our special personal museums where you can present your favorite authors, topics and interests and the stories behind the books. They initiate conversations, let a glimpse into your tastes and make your guests discover new interests and genres.
    I liked this blog post on the Importance of Bookshelves:
    http://santacruz.patch.com/blog_posts/the-importance-of-bookshelves

    If you don't like a traditional bookshelf, there are alternatives after all!
    http://www.core77.com/blog/object_culture/q_why_do_you_have_this_bookshelf_a_because_thats_how_i_roll_16449.asp

    Here is a medieval helpdesk for people transitioning from scrolls to books.
    http://www.youtube.com/watch?v=xFAWR6hzZek

    Imagine the new world of e-books! No way to present your books physically anymore. No stories behind the book buying experience to share. Definitely no autographed copies to gloat about and no dogeared pages to reflect your passion for a book.

    ReplyDelete
    Replies
    1. పుస్తకాలు చదివే అలవాటు కలిగి ఉండి.. చదివిన / చదువుదామనుకున్న పుస్తకాల్ని అందంగా బీరువాల్లో అమర్చుకునే విజ్ఞులు నన్ను క్షమించాలి. మీరంటే నాకు గౌరవం. ఈ టపా మిమ్మల్ని ఉద్దేశించి రాయలేదు.

      మన సమాజంలో కొన్ని హాబీలున్నాయి. స్టాంప్స్, కాయిన్స్, బాటిల్స్.. ఇలాంటివాటిని సేకరిస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తుంటారో నాకైతే తెలీదు.

      సరే! వాళ్ళ గోలని వదిలేస్తే.. పుస్తకాల్ని 'సేకరించే' వారి గూర్చి మాత్రమే ఈ టపా రాశాను. పుస్తకం చదివే అలవాటు లేకుండా (అసలు చదివే ఉద్దేశం కూడా లేకుండా).. ఆర్ధిక స్తోమత వల్ల.. బీరువాల కొద్దీ పుస్తకాల్ని 'ప్రదర్శిస్తూ'.. పుస్తక ప్రియులుగా చలామణి అవుతున్న పెద్దమనుషులు గూర్చి కూడా ప్రస్తావించాను. స్టాంప్ కలెక్షన్ లా ఇదొక హబీ.. లేదా ఒక తీట.

      ఇక మీరు ఇచ్చిన యూట్యూబ్ లింక్ గూర్చి. అది తెరుచుకోవట్లేదు. బహుశా పుస్తక బంధువు (కళా బంధువుకి చుట్టం) ని విమర్శించి ఫలితమేమో!

      Delete
    2. Ha ha ha. Yes, you pissed off the book gods!
      I know where you are coming from. Unfortunately some do exhibit books as an image thing or status symbol. Hopefully, they are in the minority. As you can tell from the defense of the bookshelves, I have a few of my own. I can assure you that I read most if not all in my collection. I have had a serious challenge from my daughter, Sunita who read off every classic and some. I thought I had an edge on others with my insomnia, but, so does she! She worked part time in Barnes and Nobles book store just to get discounts on books. Now that she went off to New York for college I can read at my own pace.
      Ramana, I checked the links. They do work. Try again.
      Let me stop before Jilebi garu reminds me of my devouring column inches!
      BSR

      Delete
  18. హల్లొ మాష్తారు,
    పుస్తకాల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. చాలా బాగా రాసారు.
    మహెష్

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు తెలుసుకున్నారుగా! ఆల్ ద బెస్ట్!

      Delete
  19. కంక్లూజన్ భలే ఉందండీ :)
    అసలు పోస్టే కేక!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.