Thursday 10 October 2013

తోక పేరు.. ఒక చల్లని నీడ



"హాయ్! ఐయాం ఫలానా చౌదరి. బాగున్నావా?" పొద్దున్నే ఫోన్లో ఒక లేడీ స్టోన్.

ఆశ్చర్యపొయ్యాను. ఈ లేడీ చౌదరి ఎవరబ్బా? నా PG రోజుల్లో 'చౌదరి' అనే తోకతో ఒక హర్యానా మనిషి ఉండేది. ఆవిడకి ఖచ్చితంగా తెలుగు రాదు. అందుకే నా పేరుని రకరకాలుగా పిలుస్తూ మూడేళ్ళపాటు నన్ను మానసిక అశాంతికి గురి చేసింది. ఇప్పుడు హర్యానాలోని రోహ్టక్ అనే ఊళ్ళో బిజీబిజీగా వైద్యం చేసుకుంటుంది. మరీ తెలుగు మాట్లాడే ఆడ చౌదరి ఎవరబ్బా?

"క్షమించాలి. నాకు మీరెవరో గుర్తు రావట్లేదు." అత్యంత వినయంగా అన్నాను.

'అతి వినయం ధూర్తలక్షణం' అన్నారు పెద్దలు. కాకపోతే ఇక్కడ నా వినయంలో ధూర్తత్వం ఏమాత్రం లేదని మనవి చేసుకుంటున్నాను. ఈ వినయం కేవలం ఒక ముందు జాగ్రత్త చర్య మాత్రమే. నాకు అపరిచిత ఆడవారితో ఫోన్లో మాట్లాడానికి గల భయానికో బలమైన కారణముంది.

గతంలో నాకో చేదు అనుభవం ఎదురైంది. కొన్నాళ్ళక్రితం నా స్నేహితుడొకడు అమెరికా నుండి అరుదెంచిన సందర్భంగా ఒక పార్టీ ఏర్పాటయ్యింది. ఆ పార్టీ విషయం చెప్పడానికి ఇంకో స్నేహితుడికి నంబర్లు నొక్కి ఫోన్ చేశాను.

'రాత్రి తొమ్మిదింటికల్లా ఫలానా హోటల్ కి వచ్చెయ్. కావాలంటే కారు పంపిస్తాను.' హడావుడిగా అన్నాను.

నా ఖర్మకాలి ఆ నంబర్ పొరబాటున ఇంకో నంబరుకి పోయింది. ఆ నంబర్ ఎవరో ఆడలేడీసుది. ఆవిడ నా హడావుడి ఆహ్వానానికి సమాధానం చెప్పకుండా 'ఏవండి' అంటూ ఒక మగజెంటుకి ఫోనందించింది.

ఆ మగజెంటు 'ఎవడ్రా నువ్వు నా పెళ్ళాన్ని హోటల్కి రమ్మంటున్నావ్?' అంటూ నన్ను దుర్భాషలాడ్డం మొదలెట్టాడు. పోలీస్ రిపోర్టిస్తానన్నాడు. పొరబాటుని క్షమించమని వేడుకుంటూ.. నేను ఫలానా అని చెప్పాను.

'డాక్టరైయ్యుండి ఇట్లాంటి పాడుపనులు చెయ్యడానికి సిగ్గులేదా?' అంటూ మళ్ళీ తిట్టాడు.

చివారకరికి పక్కనే ఉన్న నా భార్య మాట సాయంతో బయటపడ్డాను. ఆ రోజు నా భార్యే సాయం చెయ్యకపోతే నేనేమైపొయ్యేవాణ్ణోగదా అని ఇప్పటికీ అనుకుంటుంటాను (బహుశా 'మానసికి వైద్యుడి మనో వికారం' అంటూ మర్నాడు జిల్లా ఎడిషన్లోకెక్కేవాణ్ణేమో)!

ఈ భీభత్స సంఘటన నా మదిలో చెరగని ముద్ర వేసింది. దీన్నే మానసిక వైద్య పరిభాషలో PTSD అని అందురు. ఈ కారణాన.. ఆనాటి నుండి ఫోన్ నంబర్లు నొక్కడం మానేశాను. అవతల్నుండి మాట్లాడేది ఆడ స్టోనయినట్లైతే అత్యంత జాగ్రత్తగా ఉందును.

"You idiot. I will kill you. నేను నీ క్లాస్మేట్ని. నన్నే మర్చిపొయ్యావా?" అంటూ ఆ చౌదరమ్మ తన maiden name చెప్పింది.

"నువ్వా తల్లీ! పేరు చివర 'చౌదరి' విని జడుసుకున్నాను." అంటూ కబుర్లలో పడ్డాను.

ఈవిధంగా నాకు కొన్నిసార్లు నా క్లాసమ్మాయిలతో కొంత ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళల్లో చాలామంది ఇంటిపేరు మార్చేసుకున్నారు. కొందరికి పేరు చివర కులం పేరో, భర్త పేరో తగులుకుంది. మామూలుగానే నాకు తికమక.. ఇక ఈ కొత్తపేర్లు నా జ్ఞాపకశక్తికి పరీక్షలు పెట్టనారంభించాయి.

ఇప్పుడు నా చదువుకునేప్పటి ముచ్చటొకటి. మన ప్రాంతంలో రెడ్డి కులస్తుల్లో మగవారికి పేరు చివర్న 'రెడ్డి' అని ఉంటుంది (ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తమ పేరుకి ఈ 'రెడ్డి' తగిలిస్తున్నారనుకోండి). రెడ్లకి మాత్రమే ఉన్న ఈ ప్రత్యేక ప్రతిపత్తికి ఈర్ష్య చెందిన నా క్లాస్మేట్టొకడు తన పేరు చివర్న తన కులానికి చెందిన 'చౌదరి' అని తగిలించుకుని మిక్కిలి తృప్తినొందాడు. అక్కడతో ఆగాడా? లేదు. 'చౌదరి' చరణ్ సింగు కూడా తమ వాడేనని ప్రకటించుకున్నాడు.

'ఆ చౌదరి వేరురా నాయనా! చరణ్ సింగ్ ఉత్తర భారతీయుడు, జాట్ కులస్తుడు.' అంటే ఒప్పుకునేవాడు కాదు. వాదించేవాడు.

'చరణ్ సింగ్ కొడుకు మా మేనత్త తోడుకోడలి మేనమామకి బావమరిది.' అంటూ ఏదో చుట్టరికం కూడా చెప్పేవాడు.

సరే! ఈ పోస్టు ఉద్దేశ్యం కులాల పేర్ల గూర్చి రాసి.. అట్టి పేర్లు గల చదువరుల మనోభావాలు దెబ్బతియ్యడం కాదు కాబట్టి అసలు విషయంలోకొస్తాను.

డబ్బున్నవాడు ఖరీదైన దుస్తులు ధరిస్తాడు. ధనవంతులైన ఆడవారు విలువైన దుస్తులకి తోడుగా బరువైన ఆభరణాలు కూడా ధరిస్తారు. అంటే.. ఖరీదైన వేషధారణతో వాళ్ళు తమ ఆర్ధికస్థితి గూర్చి సమాజానికి ఒక బహిరంగ ప్రకటన చేస్తున్నారని మనం అర్ధం చేసుకోవాలి. ఈ ప్రకటన వారికి ఆనందాన్నీ, తృప్తినీ కలిగిస్తూ ఉండి ఉండాలి. ఏదోక ప్రయోజనం లేకుండా మన ఉక్కపోత వాతావరణంలో ఎవరూ అంతగా ఇబ్బంది పడరు గదా!

ఈ మధ్య సమాజంలో అనేక రకాలైన విశ్వాసాలు చూస్తున్నాం. ఫలానా రంగురాళ్ళు మీ భవిష్యత్తునే మార్చేస్తాయ్. ఈశాన్యం పెంచి, ఆగ్నేయం తగ్గిస్తే పట్టిందల్లా బంగారమే. ఫలానా బాబాగారి ఉంగరం, తాయెత్తు ధరిస్తే అష్టైశ్వర్యాలు గ్యారెంటీ. మీ పేరులో ఒక అక్షరం పీకేసి, ఇంకో అక్షరం కలిపితే ముఖ్యమంత్రి కూడా అవుతారు. ఈ రకమైన అదృష్టం, ఐశ్వర్యం కలిగించే వ్యాపారాలు మూడు పూవులు, ఆరు కాయలుగా సాగుతున్నాయ్. ఇవన్నీ నమ్మకాలకి సంబంధించిన వ్యవహారాలు. ఆచరించేవారికి ఆత్మస్తైర్యం కలిగిస్తాయి.

ఈ లాజిక్ ని తోక పేర్ల విషయంలోకి తీసుకొద్దాం. నేను ఫలానా కులంలో పుట్టాను. ఇది నాకు మిక్కిలి గర్వకారణం. కావున ఆ కులం పేరుని తోకగా తగిలించుకుందును. ఫలానా మా ఇంటిపేరు చాలా గొప్పది. కావున ఆ ఇంటిపేరుతో నాపేరు రాసుకుందును. ఫలానావాడు భర్తగా దొరకడం నా అదృష్టం.. అంచేత అతనిపేరు నా పేరుకి తోకగా జత చేసుకుంటాను. వీరందరికీ ఇట్లాంటి పేరు తోకల్ని చేర్చుకోవడం వల్ల అమితమైన ఆనందం, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మంచిదే కదా!


ఇలా కులం పేరుతోనో, భర్తల పేరుతోనో తోకలు ఉండొచ్చా? 'కూడదు' అంటూ సామాజిక కారణాలతో కొందరు వాదిస్తారు. ఈ కులం తొకలన్నీ ఇరవైయ్యేళ్ళల్లో మాయమైపోతాయని నా మిత్రుడు గోపరాజు రవి ముప్పయ్యేళ్ళ క్రితం బల్లగుద్ది వాదించేవాడు. అతనేమీ వీరబ్రహ్మేంద్రస్వామి కాదు. అంచేత ఈ ధోరణి తగ్గకపోగా.. మునుపటికన్నా ఇప్పుడు బాగా ఎక్కువైంది. ఇది ఒక సీరియస్ అంశం. అందుకే నేనీ పోస్టులో ఆ కోణం జోలికి పోవట్లేదు.

కొందరికి వారి కులం, వంశం, భర్త వగైరా వివరాలు తమ పేరు ద్వారా ప్రకటించుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. చల్లని నీడలో సేద తీరినట్లుగా కూడా అనిపిస్తుంది. మంచిది. కాదనడానికి మనమెవరం? మతవిశ్వాసాలు, ఆర్ధిక స్థితుల ప్రకటనల్లో లేని అభ్యంతరం తోకపేర్ల విషయంలో ఎందుకుండాలి? ఈ ప్రపంచంలో అందరూ తమ ఆనందం కోసం తమకిష్టమైన పనులు మాత్రమే చేస్తారు. ఇష్టం లేని పని అస్సలు చెయ్యరు. ఈ సంగతి ఆనంద నిలయం.. ఎంతో ఆహ్లదకరం!  అనే పోస్టులో నొక్కి వక్కాణించాను. 

పేర్లు అనేవి గుర్తుల కోసం పెట్టుకునే XYZ లాంటివని నా అభిప్రాయం. అంతకుమించి వీటికి ప్రాధాన్యం లేదు. ఈ సంగతి పేరులోనే అంతా ఉంది  అని ఇంతకుముందు రాశాను. అందువల్ల పేర్లకి కొత్త తగిలింపులు, పొడిగింపులకి పవిత్రతా లేదు, అపవిత్రతా లేదు. ఇన్ని కబుర్లు చెబుతున్న నేనూ నాపేరు గూర్చి మధనపడ్డ సందర్భం ఉంది. ఆ విషయాన్ని నాదీ ఒక పేరేనా?! హ్మ్.. ! అంటూ ఏడుస్తూ ఒక పోస్ట్ రాశాను

ఇప్పుడు నా మనసు విప్పి ఒక రహస్యం చెప్పదలిచాను. 'రమణ' అన్న పేరుయందు నాకు అమితమైన అభిమానం. అందువల్ల ఆ పేరు కల పేషంట్లని కొద్దిగా ప్రత్యేకంగా చూస్తాను. చాలాసార్లు ఫీజులో రాయితీ కూడా ఇస్తాను. అయితే ఇలా ఒక పేరు వినంగాన్లే మదిలో వీణలు మోగడాన్ని నేను సూత్రరీత్యా వ్యతిరేకిస్తాను. భాష, ప్రాంతీయ దురభిమానాల వలే.. ఇదికూడా ఒక రోగమేమోనన్న అనుమానం నన్ను పీడిస్తుంది.

ఒకానొకప్పుడు నా పేరుకి ముందు నాకెంతో ఇష్టమైన నా జన్మస్థలం 'బ్రాడీపేట' తగిలించి ప్రఖ్యాతి నొందుదామని ఒక మాస్టర్ ప్లానేశాను. అంచేత నాపేరు 'బ్రాడీపేట రమణ'గా మార్చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా.. కొన్ని కొత్తవిషయాలు తెలిశాయి. మావూళ్ళో కొత్తపేట శివ, సంగడిగుంట శీను, చుట్టుగుంట సాంబ, కొరెటిపాడు ఉమా.. అంటూ ఆల్రెడీ పేట పేర్లని తమ పేర్లకి prefix గా చేసుకున్న ప్రముఖులు కొందరు ఉన్నార్ట. అయితే వీరందరూ A+ రౌడీషీటర్లుట! అందువల్ల నాపేరు మార్చుకుని వారి సరసన చేరే సాహసం చెయ్యలేక నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను.

నా భార్య తన పేరు పదోతరగతి సర్టిఫికేట్లోని పేరునే కొనసాగిస్తుంది. ఇందుకు రెండు కారణాలు తోస్తున్నాయి. ఒకటి ఆవిడ నా పేరులోని ఎటువంటి శకలం అవసరం లేని అత్మవిశ్వాసి అయినా అయ్యుండాలి లేదా ఆవిడ దృష్టిలో నా పేరుకి అంత విలువైనా లేకుండా ఉండి ఉండాలి. నాపేరు నాకు విలువైనదే. కానీ నా భార్యకి కూడా విలువైనదై ఉండాలని రూలు లేదు. కారణం ఏదైతేనేం.. ఆవిడ నాపేరు జోలికి రాలేదు.

అంతే గదా? ఎక్కడైనా ఒకటి తరవాత సున్నాలకి విలువ ఉంటుంది గానీ.. ఒకటి ముందున్న సున్నాలకి విలువుండదు! ఇలా పైసా కూడా విలువ చెయ్యని పేరు కలవాడిని కాబట్టే.. కుళ్ళుబోత్తనంతో ఈ పోస్ట్ రాస్తున్నానని ఎవరైనా అనుకుంటే.. ఆ అనుకోడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను!

(photo courtesy : Google)

19 comments:

  1. Nice post on 'cultural nominclature'.
    Thank you Doctor Garu !

    ReplyDelete

  2. హమ్మయ్యా! ఇన్నాల్టికి మీ వేర్పాటువాద రాజకీయ చర్చలు మానేసి, మళ్ళీ మన పాత ధోరణిలోకొచ్చారు...

    మీ అభిమాన పాఠకుల కోసం ఇదే కంటిన్యూ చెయ్యండి, ప్లీజ్

    ReplyDelete
    Replies
    1. @bullabbai,

      >>వేర్పాటువాద రాజకీయ చర్చలు మానేసి, మళ్ళీ మన పాత ధోరణిలోకొచ్చారు...

      ఇంత ఇబ్బంది పెడుతున్నానా!

      Delete
  3. డాక్టరుగారూ.
    "హాయ్! ఐయాం ఫలానా చౌదరి. హౌఆర్యూ? " పొద్దున్నే ఫోన్లో ఒక లేడీ స్టోన్ వినగానే మీకు తెలుగు మాట్లాడే ఆడ చౌదరి ఎవరబ్బా? అనే సందేహం ఎలా వచ్చిందండీ?

    ఆవిడ మాటల్లో నాకు ఒక్క తెలుగుముక్క కూడా కనబడటం లేదు.
    లేదా కొంపదీసి నేనింకా పాతకాలం తెలుగుమాత్రమే తెలుగు అనుకుంటున్నా నంటారా?

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      అవునుకదా? ఈ పాయింట్ భలే మిస్సయ్యానే! ఇప్పుడే సరిచేస్తున్నాను.

      (మీ వ్యాఖ్యకి ప్రత్యేక ధన్యావాదాలు.)

      Delete
    2. శ్యామలీయం గారు,
      బలే point పట్టేసారు. ఇంతకుముందు కూడా ఇలాంటివి రెండు మూడు pointలు రమణ గారి టపాలలో మీరు పట్టడం గమనించాను. కొంపదీసి మీరు తెలుగు మాష్టారు కాదుకదా.
      మహెష్

      Delete
  4. ఈ తోకలనే నార్త్‌లో టైటిల్స్ అంటారు.
    మనకు అన్ని కులాల్లో ఈ తోకలు లేవు కాని, వాళ్ళకి ఇంచుమించుగా అందరికీ ఈ తోకలు ఉన్నాయి.
    మనలో చాలామంది తోకలు ఉన్నా కూడ పెట్టుకోవడం మానేసారు. ఇప్పుడిప్పుడే నార్త్‌లో కూడ తోకలు కట్ చేసుకుంటున్నారు.
    మనలో రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళు మాత్రం ఈ తోకలు ఉంచుకుంటున్నారు.
    మన "రావు" ని నార్త్‌లో ఒక కులానికి సంబంధించిన టైటిల్ అనుకుంటారు.
    అలాగే నార్త్‌లో "శర్మ" అన్న టైటిల్ బ్రాహ్మణులకే కాకుండా కొన్ని కులవృత్తులవారికి కూడ ఉంటుంది.

    ReplyDelete
  5. >> అంటూ ఏడుస్తూ ఒక పోస్ట్ రాశాను (ఇక్కడ నొక్కుము).

    Instead of putting another sentence (ikkaDa nokkumu) for link, you can make link to the word "pOsT" in the same sentence. Please try that.

    ReplyDelete
    Replies
    1. @DG,

      ఇంతకుముందు మీరు సూచించిన విధంగానే లింకులిచ్చేవాణ్ని. అది నా ఫ్రెండ్స్ కి అర్ధం కాలేదు. అంచేత 'ఇక్కడ నొక్కుము' మొదలెట్టాను!

      Delete
    2. bonagiri గారు,

      తలిదండ్రులు పెట్టిన పేర్లు కాకుండా.. పెద్దయ్యాక రాజకీయ / వ్యక్తిగత కారణాలతో పేర్లు మార్చుకునేవారి గూర్చి రాశాను. అయితే.. వీరిపట్ల నాకు వ్యతిరేకత లేదు.. కారణమేమై ఉంటుందనే ఆసక్తి తప్ప.

      Delete
  6. తోక కల్గిన వానరం నుండి నరుడిగా ఎదిగి చివరికి మరో తోక తగిలించుకుని మళ్లీ వెనక్కే వెళ్తున్నామంటారా, సివరాఖరికి! తోక పేరు.. అను థీసిస్ బహుచక్కగా సరదాగా యున్నది :-)

    ReplyDelete
    Replies
    1. నాగరాజ్ గారు,

      థాంక్యూ.

      Delete
  7. నాకు తెలిసినంత వరకు ఇంటి పేరు ఒక unique identifier. చిన్నప్పుడు మా క్లాసులో ఒకటే పేరుతో వున్న అమ్మాయిలు చాలామందే వుండేవారు. మా టీచర్లు వాళ్ళని వాళ్ళ ఇంటి పేర్ల తోనే పిలిచేవాళ్ళు. డాక్టరు గారూ, మీ చిన్నప్పుడు కూడా ఇంతేనని మీ పాత బ్లాగ్లు చెప్తున్నాయ్ మరి.

    ReplyDelete
    Replies
    1. అవును. ఒప్పుకుంటున్నాను.

      Delete
  8. ఇంటి పేరుతొ పిలిచే విధానం నేను పదో తరగతిలో ఒకస్సారి విజయవాడ వెళ్ళే వరకు తెలియదు. బాగుందండి మీ పోస్ట్.

    ReplyDelete
  9. //నా భార్య తన పేరు పదోతరగతి సర్టిఫికేట్లోని పేరునే కొనసాగిస్తుంది. ఇందుకు రెండు కారణాలు తోస్తున్నాయి. ఒకటి ఆవిడ నా పేరులోని ఎటువంటి శకలం అవసరం లేని అత్మవిశ్వాసి అయినా అయ్యుండాలి లేదా ఆవిడ దృష్టిలో నా పేరుకి అంత విలువైనా లేకుండా ఉండి ఉండాలి. నాపేరు నాకు విలువైనదే. కానీ నా భార్యకి కూడా విలువైనదై ఉండాలని రూలు లేదు. కారణం ఏదైతేనేం.. ఆవిడ నాపేరు జోలికి రాలేదు.//

    ఫర్లేదు, నాలాంటి జీవి మరొకరున్నారన్న మాట. నేను పనిచేసేది ఒక క్రైస్తవ డిగ్రీ కళాశాలలో. అక్కడ అందరు ఆడవాళ్ల పేర్ల వెనుక మగ తోక ఉంటుంది. వాళ్లని మిస్ మగ లేదా మిసెస్ మగ అనే పిలుస్తుంటారు. ఒక సారి మిసెస్ సంజీవరావ్ రిటైర్మంట్ అని ఓ ప్రిన్సిపల్ రిటైర్ అయితే, ఆ సభకు వెళ్లా. వేదికపై బోర్డు కూడా మిసెస్ సంజీవరావ్ అవే ఉంది. కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత లీలగా ఓ మగగొంతు మంజీరా అని పిలవడం విని వెనక్కి చూస్తే, ఓ పాత స్నేహితురాలు ఆమెను పేరు పెట్టి పిలుస్తోంది. దాదాపు 15 ఏళ్ల నా ఉద్యోగ జీవితంలో మొట్టమొటదిసారి ఆమె పేరు తెలిసింది. ఇది మా బాస్ కి అంటే భార్యకి చెప్పి, అలా ఉంటుంది, నా పేరు నువ్వు తోకలా పెట్టుకుంటావా అన్నా.. ఓ పదివేలు ఇవ్వు అన్నది. ఎందుకమ్మాయ్ అని అడిగా. మానాన్న పదివేలు ఖర్చుపెట్టి పేరు పెట్టాడు. నువ్వు మారిస్తే ఆయన ఖర్చులు వెనక్కి ఇవ్వద్దా అన్నది.. నాకు బోల్తీ బంద్...నా పేరు అంత విలువైంది కాదులే, నీ పేరు నువ్వే ఉంచుకో అని డబ్బు మిగుల్చుకున్నా.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.