Friday, 1 March 2013

టెర్రరిజం - కొవ్వొత్తిజం


"రమణ మామ! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"కూర్చో సుబ్బు! దేశంలో టెర్రరిస్టులు పెట్రేగిపోతున్నారు. దుష్టులు. దుర్మార్గులు. దున్నపొతులు. నా కడుపు మండిపోతుంది. ఇవ్వాళ సాయంకాలం సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన ఉంది. వెళ్దాం రాకూడదూ?" అడిగాను.

"టెర్రరిస్టు దాడుల్ని కొవ్వొత్తులతో నిరసించడం ఎప్పుడూ ఉండేదేలే! దీన్నే 'కొవ్వొత్తిజం' అందురు. నాకు 'వేలెంటైన్స్ డే' అంటే ఏంటో తెలీదు. అట్లాగే ఈ కొవ్వొత్తులకీ, నిరసనలకీ సంబంధం కూడా తెలీటల్లేదు. తెలీని విషయాల్ని తెలుసుకునే ఓపిక లేదు. కొవ్వొత్తి పట్టుకునేంత ఓపిక అస్సలు లేదు. మరోసారెప్పుడైనా 'కొవ్వొత్తిజం'కి వస్తాన్లే!" అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

"దుర్మార్గుడా! నీకోసం మళ్ళీమళ్ళీ దాడులు జరగాలని కోరుకుంటావా? నీకా అవకాశం లేదు. ఉప్పల్ క్రికెట్ మ్యాచ్ కి ఎంతటి భారీ భద్రత ఉందో పేపర్లో చదివావుగా?" అడిగాను.

"ఆ క్రికెట్ మ్యాచ్ లో ఏమీ జరగదు. ఆ విషయం ప్రభుత్వానికీ తెలుసు. ఇది సామాన్య ప్రజల ఆగ్రహం నుండి రక్షించుకోడానికి ప్రభుత్వం వేస్తున్న ఎత్తు. ఎంత బుర్ర తక్కువ దొంగెదవైనా ఓ ఇంట్లో దొంగతనం చేస్తే.. కొన్నాళ్ళదాకా ఈ వీధి మొహం చూడడు. అట్లాంటిది బాంబులు పెట్టేవాడు.. ఇంకెంత తెలివిగా ఉంటాడు?" అన్నాడు సుబ్బు.

"అంటే నిఘా వద్దంటావా?" చికాగ్గా అన్నాను.
"కావాలి. మనకి చాలా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ కావాలి. అయితే.. ప్రస్తుతం ఉన్న నిఘా ఒక స్పెషల్ డ్రైవ్ వంటిది. ఆ క్రికెట్ మ్యాచ్ రోజు ఉప్పల్ ఏరియా తప్పించి, హైదరాబాద్ లో మిగిలిన అన్ని ప్రాంతాలు చాలా వల్నరబుల్ గా ఉంటాయి. మనకిది అలవాటేగా!" అంటూ నవ్వాడు సుబ్బు.

ఇంతలో కాఫీ వచ్చింది. సిప్ చేస్తూ.. ఆలోచిస్తూ.. నిదానంగా చెప్పసాగాడు.

"స్కూల్ బస్ ప్రమాదం జరిగితే.. కొన్నాళ్ళపాటు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై తీవ్ర నిఘా. అలాగే ప్రైవేటు బస్సులపై ఇంకొంతకాలం. జోకేంటంటే.. లంచం తీసుకుని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన ఉద్యోగులే ఈ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తారు! అసలు డ్రైవ్ సరీగ్గా లేనప్పుడే స్పెషల్ డ్రైవ్ లు అవసరం. లోగుట్టు ఏమనగా.. మన రాజకీయ వ్యవస్థ తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు.. తాము భద్రతగా ఉన్నామనే భ్రమలో ప్రజల్ని ఉంచేందుకు.. తమ యత్రాంగంతో ఇట్లాంటి ఓవరేక్షన్లు చేయిస్తుంటుంది!"

"మన పోలీసు బలగాల సంఖ్యాబల ప్రదర్శన ఉగ్రవాదుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తాయి." నవ్వుతూ అన్నాను.

"అలాగా! నాకు తెలీదులే! అందుకనేనా? మనవాళ్ళు రైళ్ళ సంఖ్య పెంచమని గోల చేస్తుంది?" సుబ్బు కూడా నవ్వాడు.

"సుబ్బు! నీ వాదన నీదే కదా. దీనికి సమాధానం చెప్పు. అమెరికాలో 9/11 తరవాత మళ్ళీ ఉగ్రవాద దాడులు జరగలేదు. అదెలా సాధ్యం?" బాగా అరిగిపోయిన ప్రశ్నని సంధించాను.

"అందుకు అమెరికాని అభినందించి తీరాలి. అయితే మన దేశాన్ని అమెరికాతో ఎలా పోలుస్తావ్? ఆ మాటకొస్తే ఏ దేశాన్నీ అమెరికాతో పోల్చలేవు. అమెరికా చరిత్ర నిన్నమొన్నటిది. ఆ దేశమే ఒక ఆక్రమిత ప్రాంతం. బ్రతుకుతెరువు కోసం ఎందరో, ఎన్నో దేశాల నుండి వెళ్లి అక్కడ సెటిలయ్యారు. అందుకే వారికి ప్రతి పౌరుడిపై నిఘా పెట్టగల అవకాశం ఉంది. వనరులూ ఉన్నాయి." అన్నాడు సుబ్బు.

"ఆ మాత్రం మనం చెయ్యలేమా?" అడిగాను.

"చెయ్యలేకేం? భేషుగ్గా చెయ్యొచ్చు. అప్పుడు మన చిదంబరం బజెట్ లో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికి నిధులుండవు. ఉన్న సొమ్మంతా పోలీసు, రక్షణ శాఖలకి కేటాయించాలి. పోలీసు స్టేషన్లు ఫైవ్ స్టార్ హోటళ్ళలా ఉంటాయి. స్కూళ్ళు మూతబడతాయి. గవర్నమెంట్ హాస్పిటళ్ళు పాడుబడిపోతాయి. సాధారణ జ్వరాలు, దగ్గులకి కూడా చస్తుంటాం. దరిద్రంలో మగ్గిపోతుంటాం. ఒకరకంగా ఈ చావుల కన్నా ఆ నష్టమే అధికం. అప్పుడు ఉగ్రవాదుల లక్ష్యం పూర్తిగా నెరవేరినట్లే." అన్నాడు సుబ్బు.

"అదెలా?" ఆశ్చర్యంగా అడిగాను.

"ఉగ్రవాదం అసలు లక్ష్యం ఒక దేశ ఆర్ధిక మూలాలు దెబ్బ తీసి.. ఆ దేశ ఆర్ధిక ప్రగతిని నిరోధించడమే. ఒక అసమర్ధ రాజకీయ నాయకత్వం మాత్రమే ప్రజల సొమ్ముని దేశరక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం సింహభాగం ఖర్చు పెడుతుంది. అప్పుడు ప్రధాన మంత్రి కన్నా రక్షణ మంత్రి, హోం మంత్రి ముఖ్యులైపోతారు." అన్నాడు సుబ్బు.

"మరప్పుడు అమెరికాకి కూడా ఇదే సమస్య రావాలి గదా." కుతూహలంగా అడిగాను.

"న్యాయంగా అయితే రావాలి. అలా రాకుండా ఉండేందుకు అమెరికా తెలివిగా ఆయుధ వ్యాపారం చేస్తుంటుంది. ఆయుధాల్ని అమ్ముకోడానికి దేశాల మధ్య తగాదాలు, యుద్ధవాతావరణం సృష్టిస్తుంది. వనరుల సమీకరణ కోసం చమురు యుద్ధాలూ చేస్తుంది. అమెరికా కోటి విద్యలూ ఆయుధాల వ్యాపారం కొరకే!" అంటూ నవ్వాడు సుబ్బు.

"అమెరికా మోడెల్ కరెక్ట్ కాదని చెప్పడానికి.. "

"అమెరికా మోడెల్ నీకూ, నాకూ కరెక్ట్ కాదేమో గానీ.. అమెరికన్లకి మాత్రం కరెక్టే అని అనుకుంటున్నాను. అందుకేగా.. మనం రకరకాల కారణాలతో చస్తుంటే.. అమెరికా పౌరులు మాత్రం హాయిగా బీరు తాగుతూ.. నరాలు తెగేంత ఉత్కంఠతో.. బాస్కట్ బాల్ (NBA) ని ఫాలో అవుతుంటారు." అన్నాడు సుబ్బు.

"మరప్పుడు మనమేం చెయ్యాలి? ఒకపక్క డబ్బులు లేవంటావు. ఇంకోపక్క టెర్రరిస్టు దాడుల్ని ఆపాలంటావు." విసుగ్గా అన్నాను.

"ఉగ్రవాద దాడుల్ని నిరోధించేందుకు కావలసింది ప్రజల పట్ల, దేశం పట్లా కమిట్మెంట్ ఉండి.. గొప్ప విజన్ కలిగి ఉండే రాజకీయ నాయకత్వం. ఇందుకు ఏ బజెట్ కేటాయింపులు అవసరం లేదు. అందుకే ఇందుకు బాధ్యత వహించాల్సింది రాజకీయ నాయకత్వం. ఏ దేశంలోనైనా టెర్రరిస్టు దాడులు ముమ్మాటికీ ఆ దేశ రాజకీయ వ్యవస్థలోని వైఫల్యమే." అంటూ ఖాళీ కప్ టేబుల్ పై పెట్టాడు సుబ్బు.

"ఏమిటోయ్ నీ గోల? రాజకీయ నాయకుల్ని ఆడిపోసుకోడం ఒక ఫేషనైపోయింది." KFC లో చికెన్ రుచి చూసిన వాడిలా మొహం పెట్టి విసుక్కున్నాను.

"హోటల్ వాడు చల్లారిన ఇడ్లీలిస్తేనే పోట్లాడతాం. అట్లాంటి మనం ఓట్లేసి రాజకీయ పార్టీలకి అధికారం కట్టబెడుతున్నాం. వీళ్ళు కాశ్మీర్ సమస్య పరిష్కరించరు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లతో ఎలా వ్యవహరించాలో స్పష్టత లేదు. కనీసం శ్రీలంకతో ఎలా ఉండాలో కూడా అర్ధం కాదు. ఈ రాజకీయ వ్యవస్థ తన పని నిజాయితీతో చేస్తే.. అప్పుడు వైఫల్యం ఎదురైనా ప్రజల మద్దతు ఉంటుంది. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా?" అన్నాడు సుబ్బు.

ఆనందభవన్ పెసరట్టు మహత్యం! మా సుబ్బు అంతర్జాతీయ రాజకీయాలు అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు!

"సర్లే! సాయంకాలం కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం ఉంది. నే వెళ్తున్నా. భాధ్యత గల భారతీయుడిగా, ఒక దేశభక్తుడిగా నా నిరసన తెలియజేస్తా!" నొక్కి పలుకుతూ అన్నాను.

"అయితే మీ 'కొవ్వొత్తిజం' వాళ్ళకి నా తరఫున ఓ సలహా ఇవ్వు." నొసలు వెక్కిరిస్తున్నట్లు పెట్టాడు సుబ్బు.

"సలహానా!?" ఆశ్చర్యపోయాను.

"అవును. ఆ 'కొవ్వొత్తిజం' లో డాక్టర్లుంటారు.. రోగుల్ని మోసం చెయ్యొద్దని చెప్పు. ప్లీడర్లుంటారు.. సాక్ష్యాలు తారుమారు చెయ్యొద్దని చెప్పు. వ్యాపారస్తులుంటారు.. ట్యాక్సులు సక్రమంగా కట్టమని చెప్పు. ప్రభుత్వోద్యోగులుంటారు.. లంచాలు మెయ్యొద్దని చెప్పు. జర్నలిస్టులుంటారు.. నిజాయితీగా రిపోర్ట్ చెయ్యమని చెప్పు. సినిమా యాక్టర్లుంటారు.. వెకిలి పాత్రలు వెయ్యొద్దని చెప్పు. ఇవన్నీ టెర్రరిజం అంత ఎమోషనల్ ఇష్యూస్ కాదు. అయితే ఇవి మన దేశానికి ఉగ్రవాదం కన్నా ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి." అంటూ రిస్ట్ వాచ్ లో టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు సుబ్బు.

తలుపు తెరుచుకుని.. ఏదో గుర్తొచ్చినవాడిలా ఆగి.. వెనక్కి చూస్తూ నవ్వుతూ అన్నాడు.

"నాకో అనుమానం. బంగారం వ్యాపారస్తులు 'అక్షర తృతీయ' అంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే కొవ్వొత్తుల వ్యాపారస్తులు ఈ టెర్రరిస్టు వ్యతిరేక దేశభక్తులతో 'కొవ్వొత్తిజం' మొదలెట్టించి సొమ్ము చేసుకుంటున్నారా?" అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు మా సుబ్బు!

వర్షం వెలిసినట్లైంది!

(photos courtesy : Google)