Saturday 17 September 2011

సబ్బుబిళ్ళ


"కాదేది కవితకనర్హం, కుక్కపిల్లా సబ్బుబిళ్ళా అగ్గిపుల్లా" అన్న మహాకవి శ్రీశ్రీ స్పూర్తితో 'ఋక్కులు' రాశాడు రావిశాస్త్రి. ఆవిధంగా  తెలుగు సాహిత్యంలోకి శ్రీశ్రీ పరిచయం చేసిన సబ్బు స్థానాన్ని పదిలం చేశాడు రావిశాస్త్రి.  వీళ్ళు గొప్పరచయితలు, మేధావులు. నేనేదీ కాదు. అంచేత డైరక్టుగా సబ్బు గూర్చే రాసేస్తున్నాను! 

"నాన్నా! నా సబ్బెందుకు రుద్దుకున్నావు? అది లేడీస్ సోప్." ఇవ్వాళ ఉదయం నే స్నానం చెయ్యంగాన్లే మా అమ్మాయి గద్దింపు. మొదట తెల్లబోయ్యి పిమ్మట ఆశ్చర్యపోయ్యా. సబ్బుల్లో ఆడామగలు ఉంటాయన్న సంగతి నాకీ క్షణం దాకా తెలీదు.   

స్నానాన్ని కనిపెట్టిన వాణ్ని పట్టుకుని తన్నాలనే కోరిక నాకు చిన్నప్పట్నుండీ వుంది. నేను ప్రతిరోజూ ఏడుస్తూ చేసే పని స్నానం చెయ్యటం. కొన్ని జీవితాలంతే! ఇష్టముండదు, కానీ చెయ్యక తప్పదు. పరీక్షలప్పుడూ ఏడుస్తూ చదివేవాణ్ని. ఏ పనయినా ఇష్టపడి చేస్తే కష్టముండదంటారు. నాకీ సుభాషితం అర్ధం కాదు. తిండంటే ఇష్టపడతాంగానీ - స్నానాన్నీ, చదవడాన్నీ ఎలా ఇష్టపడతాం! 

సరే! మళ్ళీ సబ్బులోకొద్దాం. స్నానాన్నే ఏడుస్తూ చేసేవాణ్ణి కాబట్టి నేనేనాడూ సబ్బు గూర్చి ఆలోచించలేదు. ఫలానా సబ్బు వాడితే భలే ఫ్రెష్షుగా ఉంటుందనీ, ఇంకేదో సబ్బు వాడితే ఇంకేదో అయ్యిందనీ చెప్పుకుంటుండగా విన్నాను. సబ్బంటే స్నానమే కాదు, ఆనందాన్నీ కలుగజేస్తుందని నాకప్పుడు అర్ధమైంది. నా కోపం స్నానం మీదే గానీ, సబ్బు మీద కాదు కాబట్టి సబ్బు గూర్చి క్రికెట్ ఎంపైర్లా నిస్పక్షపాతంగా రాస్తానని మనవి చేసుకుంటున్నాను. ఆలోచించగా - రోజూ మన వంటిమీద తను కరిగిపోతూ కూడా గబ్బుని వదిలించే సబ్బు నిస్వార్ధమైనది మరియూ పవిత్రమైనదిగా తోస్తుంది.

కొందరు సబ్బులోళ్ళు తమ సబ్బు వాడితే వొంటిరంగు పాలకన్నా తెల్లగా అయిపోతుందంటున్నారు. అసలీ తెల్లతోలూ, నల్లతోలు ప్రకటనలు వర్ణవివక్ష కిందకొస్తాయి. ఒకప్పటి దక్షణాఫ్రికాలో కన్నా ఇవ్వాళ మన్దేశంలోనే వర్ణవివక్షత ఎక్కువుందని నా నమ్మకం, అందుకే ఈ రంగులు మార్చే సబ్బులు బాగా అమ్ముడుపోతున్నయ్. 

ఆమధ్య సబ్బుల వ్యాపారం చేసే ఓ పెద్దాయన సబ్బురహస్యమొకటి విప్పాడు. 'నాల్రోజులు వాడిన్తర్వాత ఏ సబ్బైనా ఒకటే. వాసనుండదు, నురగ రాదు.' అంటే మామిడిపండుకి గుజ్జుపోయి టెంక మిగిలినట్లన్నమాట! ఇక్కడ మన కార్పొరేట్ కాలేజీల రుద్దుళ్ళకి కుర్రాళ్ళు గుజ్జులేని టెంకలయిపోతున్నారు. 

సబ్బు లేని సమాజాన్ని ఊహించుకోవడం కష్టం. రెండ్రోజులు స్నానం చెయ్యకపోతే ప్రపంచ సుందర్నైనా భరించలేం. ముక్కు మూసుకుని దౌడ్ తియ్యాల్సిందే! మా మేనమామ స్నానాలగదిలోకి ఇలావెళ్ళి అలా వచ్చేసేవాడు. ఒక చెంబు ఒంటిమీదా, రెండు చెంబుల గోడమీదా పోసి స్నానమైందనిపించేవాడు. 

ఒకప్పుడు ఇన్ని సబ్బుల్లేవ్. అనాదిగా సినీతారల అందాలకి కారణం ఒక్క లక్స్ సబ్బు మాత్రమే. తళుకుతళుకు తారలు మా సౌందర్య రహస్యమిదేనని నొక్కి వక్కాణించేవాళ్ళు. 

ఆరొగ్యానికి రక్షా ఇస్తుంది లైఫ్‌బాయ్ (దీనికి కుక్కసబ్బని కూడా అంటారు). లైఫ్‌బాయ్ మన ఆరోగ్యానికి ఎంత రక్షనిచ్చిందో తెలీదుగానీ యెన్నో యేళ్ళుగా హిందుస్తాన్ లీవర్ వారి లాభాలకి మాత్రం రక్షనిస్తుంది. 

గుండ్రటి 'మోతి' సబ్బు పెళ్ళివాళ్ళకి విడిదిలో ప్రత్యేకం. మోతీ రాయికన్నా, పో్లీసువాడి హృదయం కన్నా కఠినమైనది. కొంచెమైనా వాసనుండదు, చచ్చినా నురగ రాదు. వందలమంది స్నానం చేసినా చెక్కు చెదరదు. అరగకుండా కరగకుండా మన్నికకి పేరు గాంచినది మోతీ సబ్బు. 

ఘుమఘుమలాడే సువాసన మైసూర్ శాండల్ సొంతం. లక్స్ కన్నా ఒక పావలా రేటెక్కువని మైసూరు శాండల్ మాఇంట్లో విలాసవస్తువైపోయింది. అక్క పెళ్ళయిన కొత్తలో బాత్రూము్లో మైసూరు శాండల్ సబ్బు చూశాను. హడావుడిగా బట్టలిడిచేసి ఆ సబ్బుని వొంటికేసి రుద్దీరుద్దీ అరగదీసేశాను. 

మా ఇంట్లో ఎక్కువగా లక్స్ సబ్బు వాడేవాళ్ళం. వాసన బాగానే ఉంటుంది, కాకపోతే తొందరగా నానిపోతుంది, మెత్తగా పేస్టులాగా అయిపొతుంది. అది గుర్తున్న నాకు వెనిల్లా ఐస్ క్రీం తినడం ఇష్టం వుండదు, ఎవరన్నా తింటున్నా చూడలేను. రుద్దుకునేప్పుడు చేతిలోంచి జారిపొయ్యే పియర్స్ సబ్బంటే నాకు చిరాకు. 

మాపక్కింటాయన యేదైనా లెక్కగా వుంటాడు. ఆయన హమాం సబ్బుని కత్తితో రెండుగా కోసి, ఆ ముక్కల్ని వన్ బై వన్‌గా వాడేవాడు. ఒకసారి అరిగిపోయిన సగం ముక్కని కాకెత్తుకెళ్ళింది. కాకికి సబ్బెందుకు! తను కూడా తెల్లబడాలనా! కాకిని వెంబడిస్తూ ఆయన వీధులకి వీధులు పరుగులెత్తాడు.

కాబట్టి - మన స్నానం కోసం అరిగిపోతున్న సబ్బుని గౌరవిద్దాం. సబ్బు యొక్క గొప్పదనాన్ని గొంతెత్తి చాటుదాం. సబ్బు గూర్చి రాత ఇంతటితో సమాప్తం.  

(picture courtesy : Google)

22 comments:

  1. Iragadeestunnaru mastaaru.mana gunturollaa majaka..

    ReplyDelete
  2. Blaagullo mana gunturollu inta mandi unnaru,prati idaarilo okkaru gunturu vaalle ee blaagu lokam lo,manollaki talent ekkuva antaara? leka pani leka antaaraa ramana gaaru???

    ReplyDelete
  3. mana gunturolla majaakaa?? bhesho ramana gaara..

    --Rustum Reddy

    ReplyDelete
  4. నా చిన్నప్పుడు మా పక్కింటాయన హమాం సబ్బు రెండుగా కోసి లెక్కగా వాడేవాడు.
    ------------------
    పాత సంగతులు గుర్తుకొస్తున్నాయి.

    @అజ్ఞాత గుంటూరోళ్ళు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. లేక పోతే తోచదు.

    ReplyDelete
  5. Wonderful Post.....

    ReplyDelete
  6. మీ తర్వాతి టపా అగ్గిపెట్టె గురి౦చి కదా :)

    ReplyDelete
  7. హహహ కాదేది రచనకనర్హం అని మరోసారి నిరూపించారండీ! అయినా ఇన్ని సబ్బులూ రాసి హమామ్, సింథాల్, మెడిమిక్స్ ల గురించి రాయకపోవడం అన్యాయం సుమండీ :)))

    "తిండి విషయంలో ఇష్టపడతాంగానీ.. చదువుకోటం ఎలా ఇష్టపడతాం?"

    "సబ్బంటే కేవలం ఒంటి మురికిని మాత్రమే వదిలించేదే కాదు.. ఆనందాన్నీ కలుగజేసేదని అప్పుడు నా కర్ధమైంది."

    "అయినా కాకికి సబ్బు ముక్కెందుకు? తను కూడా తెల్లబడాలనా!"

    హహహ బాగా నవ్వించారు. కొసమెరుపుపయితే సూపరు :D
    మైసూరు శాండిల్ విలాసవస్తువులలో ఒకటని మా ఇంట్లోనూ పరిగణించేవాళ్ళు.
    మా మావయ్య ఒకరు లైఫ్‌బాయ్ ని రెండు ముక్కలుగా కోసి వాడేవారు.
    మీ టపా నాస్టాలజిక్ గా అనిపించింది. ఆ సబ్బులు, వాటి ఏడ్స్ కళ్ళ ముందు కదిలాయి....బావుంది!

    ReplyDelete
  8. తోమి అరగదీసి పాడేసే సబ్బు వెనక్కాల ఇంత కధ ఉందా. కళ్ళు తెరిపించారు మాష్టారూ.

    ReplyDelete
  9. బాగా చతురంగా రాసారు. నేను కూడా సౌమ్య గారితో ఏకీభవిస్తున్నా సింథాల్ సబ్బు గురించి రాయలేదు!

    ReplyDelete
  10. కామెంటిన అతిథులందరికీ ధన్యవాదాలు.
    @అజ్ఞాత.. బ్లాగుల్లో మన గుంటూరు వాళ్ళం ఎక్కువమందిమి ఉన్నామని మీరు రాస్తేనే తెలిసింది. చాలా సంతోషం. గుంటూరువాళ్ళకి "పని లేక" మరియూ Rao S Lakkaraju గారు అన్నట్లు ఏదో పని చెయ్యకపోతే తోచక కావచ్చు.
    @క్రిష్ణప్రియగారు, Rao S Lakkaraju గారు, harephala గారు.. థాంక్సండి.
    @ఆ.సౌమ్యగారు, రసజ్ణగారు.. సింథాల్, మెడిమిక్సుల గూర్చి కూడా రాస్తే నన్ను బ్లాగుల్లో సబ్బులమ్ముకునేవాడిగా భావిస్తారని భయమేసి రాయలేదు.
    @బులుసుగారు.. అమ్మయ్య! మీ కళ్ళు తెరిపించాను. ఇక నుంచయినా సబ్బుని గౌరవిస్తూ తోమి అరగదీసి పడెయ్యండి.
    @Mauli గారు.. మీ సలహా బాగుంది. ప్రయత్నిస్తా.

    ReplyDelete
  11. ఇంతకీ రావిశాస్త్రి గారు సబ్బు గురించి ఏమి వ్రాసారో మీరు వ్రాయలేదు.
    నేనూ చదవలెదు కాబట్టి అడుగుతున్నాను.

    లైఫ్ బాయ్ సబ్బు రెండు ముక్కలుగా కోయకపోతే చేతిలో పట్టదు కదా.

    కాకినాడకి చెందిన మా చుట్టాలావిడ ఇలా వాపోయేది.
    "మా అమ్మ గారు సబ్బులా అరిగిపోతున్నారండి."

    బ్లాగర్లలో గుంటూరోళ్ళే కాదండి గోదారోళ్ళే ఎక్కువ ఉంటారు.

    ReplyDelete
  12. డింగ్! డింగ్!! నాకు నచ్చిన సబ్బు మైసూర్ శాండలే! డింగ్! డింగ్!!

    షారూకుడు, నలుగురు పట్టి బలవంతాన చేయిస్తే గాని చేయడా!!! ఆయనకు జలగండమా? లేదా వారానికి ఓ సారైనా స్నానం చేసే అలవాటు లేదా?! ఫోటో వేశారు కాని సస్పెన్స్‌లో వుంచేశారు.

    ReplyDelete
  13. @Snkr గారు, "మడిసన్న తర్వాత కూసింత కలాపోసనుండాల! ఊరికే తింతొంగుంటే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏటుంటాది." షారుకుని అదృష్టానికి కుళ్ళుకోలేక చస్తున్నా. పోస్టుకి సంబంధం లేకపోయినా.. నాకీ పుటోనే నచ్చింది. ఆ నలుగురు స్నానం చేయించాలే గానీ, నేను రోజంతా స్నానాల తొట్టిలోనే గడపటానికి రెడీ!

    ReplyDelete
  14. :) అవుననుకో... మరీ ఎంత గొడ్డయినంత మాత్రాన అలా రోజంతా తొట్లో నానేస్తామంటే ఏంబావుంటుంది? నాకైతే సిగ్గేస్తుంది బాబూ ... గొడ్డును కాలేను. :D
    Snkr

    ReplyDelete
  15. @bonagiri గారు.. ధన్యవాదాలు. రావిశాస్త్రి రాసిన సబ్బుబిళ్ళ "సబ్బంటే సివిలిజేషన్." అని నమ్మే లక్షింపతి కథ. అద్భుతంగా ఉంటుంది. చదవాల్సిన కథ.
    @Snkr గారు.. హ.. హ.. హా.. thanks for the funny comment.

    ReplyDelete
  16. ఓ ఇటుకరాయి ముక్క, ఓ బస్తాడు పీచు, ఇస్తే బాగా రుద్ది రుద్ది తోముతారు

    ReplyDelete
  17. "లైఫ్ బాయ్ సబ్బుని కుక్క సబ్బని కూడా అంటారు."
    అధ్యక్షా! ఇది చాలా అభ్యంతరకరం.
    లైఫ్ బాయ్ సబ్బు మాజీ వినియోగదారుడిగా ఈ స్టేట్మెంటుని తీవ్రంగా ఖండిస్తున్నాను.

    ReplyDelete
  18. "అక్కా, బావా సినిమాకెళ్ళాక, అమ్మ వంట చేస్తున్నప్పుడు ఆ మైసూరు శాండల్ని వొంటికేసి రుద్దీ, రుద్దీ సగం అరగదీసేశాను. అదో తుత్తి."

    lolll :)
    simply superb post

    ReplyDelete
  19. @జీడిపప్పు..
    థాంక్యూ.

    ReplyDelete
  20. నాక్కూడా పియర్స్ అంటే చికాకు. ఒకనాడెప్పుడో ఆస్పత్రిలో ఉండగా ఇదే సబ్బు తో స్పాంజీ బాత్ ఇచ్చేవాళ్ళు. అందుకే ఆ వాసనంటే చికాకు. SriSri - కాదేదీ 'అనర్హం' అన్న మాట ప్రూవ్ చేసారు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.