Wednesday 6 February 2013

థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!


"ఎరక్కపోయి అన్నాను. ఇరుక్కుపోయ్యాను." అప్పటికి అరవై మూడోసారి అనుకున్నాడు రాంబాబు.

ఫిల్టర్ కాఫీ తాగుతూ, టీవీ చూస్తున్నాడన్న మాటే గానీ.. మనసు మనసులో లేదు.

అది ఆదివారం. సమయం సాయంత్రం నాలుగు గంటలవుతుంది. భార్య ఇందిర వంటింట్లో బిజీగా ఉంది.

రాంబాబు, ఇందిరల జంట "రంగమ్మ కథ" లో మనకి పరిచయమే. వారికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఎనిమిది, చిన్నవాడు ఆరో క్లాసు చదువుతున్నారు. పెద్దవాడిది తండ్రి పోలిక. కొంచెం మెతక. రెండోవాడిలో ఇందిర లక్షణాలు ఎక్కువ.

మొదట్నుండీ రాంబాబుకి పుస్తక పఠనం అనేది చాలా ఇష్టమైన కార్యం. అరిగిపోయిన తెలుగు భాషలో చెప్పాలంటే అతనో 'పుస్తకాల పురుగు.'

పెళ్ళైన కొత్తలో ఇందిరకి రాంబాబు హాబీ పెద్దగా ఇబ్బంది అనిపించ లేదు గానీ.. క్రమేణా ఆవిడకి చికాగ్గా అనిపించసాగింది. మొదట్లో చెప్పి చూసింది. ఆ తరవాత పొద్దస్తమానం పుస్తకాల మధ్యన బ్రతికేసే రాంబాబుని ఇందిర పట్టించుకోవడం మానేసింది.

పిల్లలు ఇందిరని అడుగుతుంటారు. "అమ్మా! నాన్నెందుకు ఎప్పుడూ అలా పుస్తకాలు చదువుతుంటాడు? పరీక్షలా?" అని. పరీక్షల్లేకపోయినా దీక్షగా పుస్తకాలు చదివే రాంబాబు కాన్సెప్ట్ పిల్లలకి అర్ధం కాలేదు.

ఈ విధంగా ఆ ఇంట్లో అందరికీ ఒక స్థిరమైన ప్రవర్తనా నియమావళి ఏర్పడిపోయింది. రాంబాబు ఉద్యోగం చేస్తాడు. పుస్తకాలు చదువుతాడు. ఇందిర వంట చేస్తుంది. పిల్లల చదువుల వ్యవహారం బాగా పట్టించుకుంటుంది. పిల్లలు స్కూలుకెళ్తారు. ఆడుకుంటారు. ఆకలేస్తే అన్నం తింటారు. చదువుకుంటారు. అప్పుడప్పుడు గొడవ చేస్తుంటారు. ఇదీ వరస.

నాల్రోజుల క్రితం ఆ ఇంట్లో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. కన్యాశుల్కంలో పూటకూళ్ళమ్మకి, మధురవాణిలకి గల సామ్యం గూర్చి రాంబాబు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతనికి గురజాడ పూటకూళ్ళమ్మ పాత్రని అద్భుతంగా తీర్చిదిద్దినట్లు అనిపించింది.

ఇంతలో రెండో బెడ్రూం లోంచి అరుపులు, కేకలు.. కొద్దిసేపటికి పెద్దగా శబ్దాలు. ఇందిర ఆవేశంతో రాంబాబు రూంలోకి వచ్చింది. కోపంతో మొహం కందిపోయి ఉంది. జుట్టు రేగిపోయింది. కళ్ళల్లో నీళ్ళు. కన్యాశుల్కం ముందేసుకుని తీవ్రంగా యోచించుచున్న రాంబాబుని చూడంగాన్లే ఆమెకి కోపం రెండింతలైంది.

"మహానుభావా! నువ్వు సాహిత్యసేవ చేసుకుంటూ తరించు. పేకాట, తాగుడు కన్నా దరిద్రపు వ్యసనం నీది. నీతో కాపురం చెయ్యడం నావల్ల కాదు. నేను మా పుట్టింటికి పోతున్నా." అంటూ ఆవేశంతో ఊగిపోయింది.

రాంబాబుకి విషయం అర్ధం కాలేదు. పిమ్మట పిల్లల్ని పిలిచి విచారించాడు. ఇందిరని బుజ్జగిస్తూనే విషయాన్ని రాబట్టాడు. పిల్లలు గొడవ చేస్తున్నారు. సరీగ్గా చదువుకోటల్లేదు. ఇందిరని అస్సలు లెక్క చెయ్యట్లేదు. ప్రస్తుతం పిల్లలిద్దరి మధ్యా టీవీలో ఏ చానెల్ చూడాలన్న విషయంలో ఘోరమైన తగాదా.. తన్నులాట జరిగింది.

రాంబాబు కొద్దిసేపు ఆలోచించాడు. సమస్యని ఎలా పరిష్కరించాలో తెలీలేదు. ఇందిర అసలు దోషివి నువ్వేనన్నట్లు రాంబాబునే కొరకొరా చూస్తుంది. రాంబాబుకి వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది. అర్జంటుగా ఈ సిట్యువేషన్ నుండి బయట పడే మార్గం బుర్రలోకి తట్టట్లేదు.

పిల్లల్ని మందలిస్తే హర్టవుతారు. ఇందిరని ఊరుకోమ్మంటే ఆవిడకి కోపం వస్తుంది. అదీగాక పిల్లల ముందు చులకనైపోతుంది. ఏం చెయ్యాలి? ఈ పరిస్థితి నుండి ఎలా బయట పడాలి? పోనీ పిల్లలకి ఏదో ఆశ పెట్టి.. తల్లి మాట వినేట్లు చేస్తే పోలా? ఇదేదో బానే ఉంది.

"పిల్లలూ! మీరు గొడవ చెయ్యకుండా బుద్ధిగా చదువుకోండి. అమ్మ చెప్పినట్లు వినండి. నే చెప్పినట్లు చేస్తే వచ్చే ఆదివారం మిమ్మల్ని మంచి సినిమాకి తీసుకెళ్తాను. సరేనా?" అన్నాడు రాంబాబు.

పిల్లలు ఆనందంతో గంతులేశారు. ఇందిర కొద్దిగా ఆశ్చర్యంగా, ఎక్కువగా అపనమ్మకంగా రాంబాబుని చూసింది.

"నీలో ఇంత మార్పు ఊహించలేదు. పిల్లల గూర్చి పట్టించుకున్నందుకు థాంక్స్! నాకు తెలుసు. నువ్వు చెబితే పిల్లలు వింటారు." అంటూ వంటగదిలోకి వెళ్ళింది.

'ప్రస్తుతానికి గండం గడిచింది. అమ్మయ్య!' అనుకున్నాడు రాంబాబు.

ఆ రోజు నుండి ఆ ఇంటి వాతావరణం మారిపోయింది. పిల్లలు శ్రద్ధగా చదవసాగారు. ఇద్దరూ గొప్ప సఖ్యతతో టీవీ చూడ్డం మొదలెట్టారు. ఇందిరకి చాలా సంతోషం వేసింది. 'ఎంతైనా రాంబాబు తెలివైనవాడు.' అనుకుంది.

మారిన రాంబాబుపై ఇందిరకి మిక్కిలి ప్రేమ పుట్టింది. సుబ్బిరామిరెడ్డి కోట్లు ఖర్చు చేసి కళాకారుల్ని సన్మానించి తన కళాతృష్ణని తీర్చుకున్నట్లు.. ఇందిర రాంబాబుకి అత్యంత ప్రియమైన వంటలు చేస్తూ.. తన ప్రేమని వంటల రూపంలో ప్రదర్శించసాగింది.

రాంబాబుకి గుత్తొంకాయ ఇష్టం. కందిపచ్చడంటే ప్రాణం. నిమ్మకాయ పప్పంటే పరమానందం. చింతపండు పులిహొరంటే చచ్చిపోతాడు. ఇవన్నీ ఆ రోజు నుండి భారీగా, ధారాళంగా వండబడ్డాయి. రాంబాబు సినిమా మంత్రం పిల్లల మీదే కాదు.. ఇందిర మీద కూడా బానే పంజేసింది.

ఇవ్వాళ ఆదివారం. ఇందిర చేసిన బీరకాయ పచ్చడి, ములక్కాడల పప్పుచారు, కాకరకాయ వేపుడుతో భారీ భోజనాన్ని పొట్ట భరీగా పట్టించి 'బ్రేవ్' మని త్రేన్పాడు రాంబాబు.

భుక్తాయాసంతో కొద్దిసేపు చిన్న కునుకేశాడు. ఆపై స్నేహితుడు సుబ్బారావు పంపిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అది మనసు ఫౌండేషన్ వారు ప్రచురించిన పతంజలి సాహిత్యం. పుస్తకాన్ని ఆప్యాయంగా తడిమాడు రాంబాబు. అతనికి పతంజలి వ్యంగ్యం ఇష్టం. ఒక్కసారిగా గోపాత్రుడు, వీరబొబ్బిలి, అప్పన్నసర్దార్ మదిలో మెదిలారు. ఇవ్వాళ పతంజలిని పరామర్శించాలి అనుకున్నాడు.

ఒక్కసారిగా పిల్లలు గదిలోకొచ్చి ఆనందంతో అరవసాగారు. "నాన్నోయ్! ఇవ్వాళ ఆదివారం. సినిమా కెళ్తున్నాం." ఉలిక్కిపడ్డాడు రాంబాబు. అప్పటిగ్గాని అతనికి ఇవ్వాల్టి సినిమా ప్రోగ్రాం గుర్తు రాలేదు.

వంటింట్లోంచి నవ్వుతూ వచ్చింది ఇందిర. "సర్లే! తొందరగా స్నానాలు చేసి రెడీ అవ్వండి. నేనీలోపు రాత్రి వంట కానించేస్తాను." అంటూ వంటింట్లోకి వెళ్ళింది.

రాంబాబు సినిమా చూసి యేళ్ళు గడిచాయి. అతనికి సినిమాలంటే బొత్తిగా ఆసక్తి లేదు. ఆ సినిమా హింస భరిస్తూ, చీకట్లో రెండు గంటలు కదలకుండా కూర్చోవడాన్ని తలచుకుని భయకంపితుడైపొయ్యాడు.

ఆ రోజు ఏదో గండం నుండి తప్పించుకోడానికి నోరు జారాడు. పిల్లలు తన మాట సీరియస్ గా తీసుకుని ఇంత బుద్ధిమంతులైపోతారని అతను కలలో కూడా ఊహించని మలుపు!

ఎదురుగా పతంజలి పుస్తకం మందహాసంతో పలకరిస్తుంది. మనసంతా దిగులుగా అయిపోయింది.

'ఎరక్కపోయి అన్నాను. ఇరుక్కుపొయ్యాను.' అరవై నాలుగోసారి అనుకున్నాడు.

పోనీ 'తూచ్!' అంటే!

నో.. నో. పిల్లలకి  ఏదో కారణం చెప్పొచ్చు గాని.. ఇందిర దెబ్బకి తట్టుకోవడం కష్టం. దేవుడా! నాకీ సినిమా గండం తప్పేలా చూడు తండ్రి!


టీవీలో వార్తలు. గులాం నబి ఆజాద్ వారాలకి, నెలలకి రోజులెన్నో లెక్కలు చెబుతున్నాడు. వయలార్ రవి తెలంగాణా కోసం మరింత లోతైన చర్చలు అవసరం అంటున్నాడు. చానెల్ మార్చాడు. ఆ చానెల్లో ఒక పక్క నుండి మధు యాష్కి, ఇంకోపక్క నుండి లగడపాటి తిట్టుకుంటున్నారు.

రాంబాబుకి చిరాకేసింది. 'వీళ్ళందర్నీ ఏ కాన్సంట్రేషన్ కేంపులోనో పడేసి తిండి పెట్టకుండా మాడిస్తేగానీ దేశం బాగుపడదు.' అనుకున్నాడు.

సడన్గా.. ఐడియా! మెరుపు మెరిసింది. కొద్దిసేపటికి బుర్ర కె.వి.పి.రామచంద్రరావులా పని చెయ్యడం మొదలెట్టింది. మరికొంతసేపటికి ఆలోచనలో క్లారిటీ వచ్చేసింది.

ఇంతలో పిల్లలు రాంబాబు దగ్గరకొచ్చారు. "నాన్నోయ్! మొన్న అమ్మ కొన్న కొత్త బట్టలు వేసుకోమా?" అంటూ అడిగారు.

రాంబాబు తల పక్కకి తిప్పుకుని.. పిల్లలకి కనబడకుండా ప్రభాకరరెడ్డిలా ఒక విషపు నవ్వు నవ్వుకున్నాడు. తల మళ్ళీ పిల్లల వైపు తిప్పి చిత్తూరు నాగయ్యలా అమాయకపు నవ్వు నవ్వాడు.

వారిని ఆప్యాయంగా దగ్గరకి పిలిచాడు. అటూఇటూ చూస్తూ ఇందిరకి వినబడకుండా లోగొంతుకతో అడిగాడు. "ఇంతకీ ఏ సినిమాకి వెళ్దాం?"


పిల్లలు ఉత్సాహంగా "నాయక్ కి వెళ్దాం నాన్నా! ఫైటింగులు భలే ఉన్నాయంట. స్కూల్లో మా ఫ్రెండ్స్ చెప్పారు." అన్నారు.

"అవునవును. సినిమా చాలా బాగుందిట. అంతా ఫైటింగు, కామెడీయేనట. తప్పకుండా దానికే వెళ్దాం. అయితే మీ అమ్మ 'సీతమ్మ చెట్టు' కి వెల్దామంటుంది.. " అంటూ అర్దోక్తిగా ఆగాడు.

పిల్లలు వెంటనే "ఛీ.. ఛీ.. అదేం సినిమా? ఒక్క ఫైటింగు కూడా లేదు. నాయక్ కి వెళ్ళాల్సిందే!" అన్నారు.

రాంబాబు 'అమ్మయ్య' అనుకున్నాడు.

"తప్పకుండా మీరు చెప్పిన సినిమాకే వెళ్దాం. మీ ఇష్టమొచ్చిన బట్టలు వేసుకోండి. అమ్మని కూడా నాయక్ సినిమాకే ఒప్పిస్తాను." అంటూ వంట గదిలోకి వెళ్ళాడు.

వంటింట్లో ఇందిర హడావుడిగా రాత్రి భోజనంలోకి బెండకాయ వేపుడు చేస్తుంది. రాంబాబు ఇందిర వైపు ప్రేమగా, ఆప్యాయంగా చూశాడు. ఇందిరకి రాంబాబు చూపులో అక్కినేని నాగేశ్వర్రావు కనబడ్డాడు. తను కూడా అతన్ని జమునలా మురిపెంగా చూసింది.

"ఇందూ! మా ఆఫీసులో అందరూ సీతమ్మ చెట్టు సినిమా చాలా బాగుందన్నారు. సెంటిమెంట్ చాలా బాగుందట. నీతో కలిసి ఆ సినిమా చూడాలని కోరికగా ఉంది. మనం ఆ సినిమాకి వెళ్తే బాగుంటుందేమో?"

చిన్నపిల్లాడిలా బ్రతిమాలుతున్న భర్తని చూడంగాన్లే ఇందిరకి జాలి కలిగింది. సావిత్రిలా కరిగిపోయింది.

'ఇంత చిన్న విషయానికి కూడా తన పర్మిషన్ అడుగుతున్న ఈ సున్నిత హృదయుడు నాకు భర్తగా లభించడం నా అదృష్టం. ఆ పుస్తకాల పిచ్చి ఉందనే గానీ.. మనసు మాత్రం బంగారం.' అని మురిసిపోతూ "అలాగే! తప్పకుండా." అని మాటిచ్చింది.

"పిల్లలకి సీతమ్మ చెట్టు ఫ్యామిలీ సెంటిమెంట్ నచ్చదేమో?" సందేహంగా అడిగాడు.

"వాళ్ళ మొహం! వాళ్ళు నేనెంత చెబితే అంతే!" గర్వంగా అంది.

"థాంక్యూ ఇందూ! యు ఆర్ మై డార్లింగ్!" అంటూ బెడ్రూంలో పిల్లల దగ్గరకి వెళ్ళాడు.


"పిల్లలూ! అమ్మ సీతమ్మ చెట్టుకే వెళ్దామంటుంది. ఆ సినిమా దరిద్రంగా ఉంటుంది. అందులో ఒక్క ఫైటింగు కూడా ఉండదు. మీకసలా సినిమా అర్ధం కూడా కాదు. అమ్మ మాట కాదంటే ఊరుకోదు. ఎంత చెత్తైనా ఆమె ఇష్టప్రకారం ఆ చెట్టు సినిమాకే వెళ్ళాలి. ఇంక బయల్దేరండి." అంటూ తను కూడా సినిమాకి రెడీ అవుతున్నట్లు హడావుడి చేశాడు.

పిల్లలకి రాంబాబు చెప్పింది నచ్చలేదు. అందులో చిన్నవాడికి కోపం ఎక్కువ.

"నేను నాయక్ సినిమాకయితేనే వస్తాను. ఏడుపు సినిమాలకి రాను." అంటూ అరుస్తూ వంటగదిలోకి పరిగెత్తాడు. వాణ్ని ఫాలో అవుతూ పెద్దవాడూ వంటింట్లోకి వెళ్ళాడు.

రాంబాబు రెండు చెవులూ వంట గది వైపు వేశాడు. అక్కడ కొద్దిసేపు వాదనలు, ప్రతి వాదనలు. ఇంకొద్ది సేపటికి కేకలు, అరుపులు, శబ్దాలు. ఇంకా కొద్దిసేపటికి వంటింట్లోంచి ఆవేశంతో ఇందిర హాల్లో కొచ్చింది.

"వేలెడు లేడు వెధవ! ఫైటింగ్ సినిమా కావల్ట! నా మాటకి విలువ లేదా? ఇప్పుడే చెబుతున్నాను.. రామం! వెళ్తే సీతమ్మ చెట్టు.. లేకపోతే సినిమా ప్రోగ్రాం కేన్సిల్!"

పెద్దాడికి ఫలానా సినిమా అంటూ పట్టింపేం లేదు. ఏదొకటి గిట్టిద్డామనుకుంటున్నాడు. ఆ విషయం గట్టిగా చెప్పలేడు. వాడు మన్ మోహన్ సింగ్ లాంటి వాడు. అందుకే వాడికి ఏడుపొస్తుంది.

సమస్యంతా చిన్నవాడితోనే! వాడు ఇందిరతో సమానంగా నాగం జనార్ధనరెడ్డి రేంజిలో ఆవేశపడుతున్నాడు. "నేనేం రాను పో! నీ బోడి సినిమా ఎవడు చూస్తాడు." అంటూ చేతిలోనున్న కోకకోలా పెట్ బాటిల్ విసిరి నేలకేసి కొట్టాడు. హాలంతా కొకకోలా చిమ్మింది.

"అది కాదు నాన్నా! అమ్మ చెప్పినట్లు విని.. " అంటూ చిన్నవాణ్ణి బుజ్జగించబోయ్యాడు రాంబాబు.

"వాడికి పోగరెక్కింది. నోటికేంతోస్తే అంత వాగుతున్నాడు. ఇవ్వాళ సినిమా ప్రోగ్రాం కేన్సిల్. రామం! నువ్వు నీ రూంలోకెళ్ళి పుస్తకం చదువుకో. వాడితో నువ్వేం రాయబారాలు చెయ్యనక్కర్లేదు. నువ్వు ఎవర్నైనా సినిమాకి తీసుకెళ్ళావా.. నేను మా ఇంటికెళ్ళి పోతాను.. జాగ్రత్త!" భద్రకాళి అయ్యింది ఇందిర.

పాకిస్తాన్, ఇండియా సైనికుల మధ్యన చిక్కుకుపోయిన కాశ్మీరి పౌరుడి వలే 'అసహాయ దృక్కుల'తో అలా నిలబడిపొయ్యాడు రాంబాబు. తరవాత 'భారంగా' తన రూంలోకి వెళ్ళాడు.

టీవీలో మధు యాష్కి, లగడపాటి ఇంకా తిట్టుకుంటూనే ఉన్నారు. గులాం నబి ఆజాద్ వారానికి వెయ్యి రోజులని, నెలకి లక్ష రోజులనీ తేల్చేశాడు. వయలార్ రవి లుంగీ పైకెత్తి కట్టుకుని.. టేపు తీసుకుని సమస్య లోతు కొలుస్తానంటున్నాడు.

'యాహూ! థాంక్యూ కాంగ్రెస్ హైకమాండ్! థాంక్యూ!' అని సంతోషంగా, ఆనందంగా మనసులోనే అనుకుంటూ.. పతంజలి పుస్తకాన్ని ఆప్యాయంగా చేతిలోకి తీసుకున్నాడు రాంబాబు.

(photos courtesy : Google)

32 comments:

  1. నాన్నే నాయక్ బావుంటుంది వెళ్దాం అన్నాడు అని చిన్నోడు శంకరరావు లాగా నోరు జారితే?

    ReplyDelete
    Replies
    1. చిన్నవాడిని శంకరరావుతో పోల్చడం బాగుంది.

      అవును. ఆ రిస్క్ ఉంది. అయితే.. ఆవేశపరులకి ఆలోచన తక్కువ!

      Delete
  2. ఒక విషయం గమనించారా? వారం కిందటి పరిస్తితులే మళ్ళీ దాపరించాయి

    వారం అంటే ఎన్ని రోజులో నన్ను మాత్రం అడగొద్దు :)

    ReplyDelete
    Replies
    1. దురదృష్టం.. వారం అంటే ఎన్నిరోజులో ఎవరికి మాత్రం తెలుసు?!

      Delete
    2. నాకు తెలుసండీ. అయితే ఇప్పుడు చెప్పను: ఒక వారం తరువాత చెబుతాను.

      Delete
  3. హ హ హ. సూపరో సూపర్
    మీరు పత్రికల్లో కథలేమన్నా వ్రాసారా ? వ్రాస్తున్నారా ? వ్రాస్తారా ?

    ReplyDelete
    Replies
    1. థాంక్స్!

      నేను పత్రికల్లో కథలు రాయలేదు. రాయను. రాయబోను.

      నాకున్న పరిమిత సమయంలో ఏదో సరదాగా రాస్తుంటాను. మీవంటి సహృదయుల కాంప్లిమెంట్స్ కి తీవ్రంగా ఆనందపడుతుంటాను.

      Delete
    2. ఈ 'పెద్దబ్బాయి' ల గురించి ఎమన్న ఉంటె చెప్పండి.
      చాల మంది నెమ్మది గా ఉంటారు, అదే చిన్న వాళ్ళు చాలా చురుగ్గా ఉండటం చూసాను. ఏంటో నిర్ణయం తీసుకోవాలంటే బెరుకు , భయం , ఏదైనా పరవాలేదు లే ఏదో ఒకటి అన్న మనస్తత్వం , పెద్దోల్లె ఇలా తయరవుతారా లేక అది నా భ్రమా ?


      Delete
  4. Take a bow sir (ఎయిర్ ఇండియా మహరాజ స్టైల్లో సలాం అనమాట:)

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ సర్! (అతి వినయంగా.. medical representative స్టైల్లో అన్నమాట:)

      Delete
  5. అద్భుతం. పొద్దున్నే మనసారా నవ్వుకున్నాను.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      (మీరు పొద్దున్నే మనసారా నవ్వుకోడానికి.. నేను రాత్రంతా కీ బోర్డ్ నొక్కితిని.)

      Delete
  6. super :-)nice idea for the husbands :-) :-)

    ReplyDelete
    Replies
    1. thank you!

      i brought congress party's bad politics into the post and thanks to congress party for inspiring me to write this piece.

      Delete
  7. @ వాడు మన్ మోహన్ సింగ్ లాంటి వాడు. అందుకే వాడికి ఏడుపొస్తుంది.

    LoL...

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!


      ఒకపక్క మన్ మోహన్ సింగ్ ఏడుస్తుంటే మీ LOL ఏంబాలేదు. :)

      Delete
    2. మన్మోహన్ కి ఏడ్చే అవసరం ఉందంటారా? మన్మోహన్ కి సినిమాకి వెళ్ళినా, వెళ్లకపోయినా పోయేదేం లేదు .మీటింగులు అంటే బోర్ కొట్టి ఏడుస్తున్నాడా? లేక నిజంగానే ప్రజా ప్రేమ మన్మోహన్ లో మిగిలుందా ?

      Delete
  8. LOL. age old British logic of divide and rule!

    ReplyDelete
    Replies
    1. Indian National Congress still follows British logic!

      Delete
  9. ప్రతి మొగవాడికి ఇంత తెలివి వుంటే ఎంత బాగుంటుంది. రాజకీయాలు ఈ విధంగా కూడా వాడుకోవోచ్చని నాకు ఇవాళే తెలిసింది.
    గో వె ర

    ReplyDelete
    Replies
    1. దీనికంత తెలివి అవసరమా?! నాకిది అలవాటే!!

      Delete
  10. :)))))పోస్ట్ సంగతి సరేసరి..కామెంట్లలో మీ సమాధానాలు కూడా :)

    టపా..ప్రతి వాక్యం నవ్వించింది. ఈ మధ్య కాలం లో పైకి నవ్వుతూ చదివిన పోస్ట్ ఇదే.. ఒరిజనల్ కథ ని ఊహించుకుంటూ చదువుతుంటే.. చప్పట్లు

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      కాంగ్రెస్ మీద కోపంతో.. ఒక చిన్న పాయింట్ రాద్దామని మొదలెట్టాను. రాసింతర్వాత చూసుకుంటే పోస్ట్ దాసరి నారాయణరావు డైలాగులా పొడుగ్గా అయిపోయింది. మీకు నచ్చినందుకు సంతోషం.

      Delete
  11. కెవ్వ్వ్వ్వ్ ...కెవ్వ్వ్వ్వ్ .....సూపరో....సూపర్..... :)

    ReplyDelete
  12. చాలా బాగుంది. రెండో సారి చదువుతున్నా.

    ReplyDelete
  13. సూపరో సూపరు డాక్టరు గారు. భలే ముగించారు!!

    ReplyDelete
  14. మహానుభావా! నువ్వు సాహిత్యసేవ చేసుకుంటూ తరించు. పేకాట, తాగుడు కన్నా దరిద్రపు వ్యసనం నీది.

    ఇటువంటి మాటలు దాదాపు ప్రతి రోజు వింటుంటాను.

    ReplyDelete
    Replies
    1. కాస్త అటూఇటుగా మనమందరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం!

      Delete
  15. ramana..adbhutaha nee blog. nenu kooda enter ..blog lokamloki..neeku nenu ekalove duni..aseervadinchu guruva ee gurivini. guravareddy

    ReplyDelete
    Replies
    1. డియర్ గురవారెడ్డి,

      తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం.. సుస్వాగతం.

      నీ కబుర్లతో మమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తిస్తావని ఆశిస్తున్నాను.

      నీ హడావుడి.. కావాలి తెలుగు బ్లాగుల్లో సందడి! బెస్ట్ ఆఫ్ లక్.

      Delete

comments will be moderated, will take sometime to appear.