Thursday 17 May 2012

సుబ్బు! ది గ్రేట్ సెఫాలజిస్ట్!!



ఉదయం  పది గంటలు. ఆంధ్రజ్యోతి  పేపర్  ఎడిట్  పేజ్  చదువుతున్నాను. మొత్తానికి  ఉప ఎన్నికల  వేడి  రాజుకుంది.

"రవణ మావా! కాఫీ!" అంటూ  హడావుడిగా  లోపలకొచ్చాడు  సుబ్బు.

"కూర్చో  సుబ్బు! ఏంటి  ఉప ఎన్నికల్లో  ఎవర్ని  గెలిపించబోతున్నావ్?" అడిగాను.

"ఉప ఎన్నికల  గూర్చి  ఇప్పటిదాకా  ఏమీ  ఆలోచించలేదు. ఫలితాన్ని  బట్టి  కిరణ్ కుమార్ రెడ్డి, సత్తిబాబుల  ఉద్యోగాలు  ఉండేదీ, ఊడేదీ  తేలిపోతుంది. చంద్రబాబు, జగన్ల  షేర్  వేల్యూ  పెరిగేదీ, తరిగేదీ  తెలుస్తుంది."

"నేను  ఎవరు  గెలుస్తారు  అనడిగాను. నీ  ఎనాలిసిస్  కాదు."

"అదేమంత  కష్టమైన  పనా? సంగడిగుంట, చుట్టుగుంట, కంకరగుంట... " నవ్వుతూ  అన్నాడు  సుబ్బు.

"ఇవన్నీ  మనూళ్ళో  పేటలు. నేనడిగింది.. "

సుబ్బూ  ఇంకా  నవ్వుతూనే "లక్ష్మీపురం, చంద్రమౌళి నగర్, రింగ్ రోడ్.. " అన్నాడు.

"సుబ్బూ! ఏంటి  నీ  అసందర్భ  ప్రేలాపన? ఒక  సీరియస్  ప్రశ్న  అడిగాను. నువ్వేమో సిటీ బస్  కండక్టర్లా  ఏవేవో  పేటల  పేర్లు  వాగుతున్నావ్ ! నీతో  ఇదే  తంటా!" విసుక్కున్నాను.

"ఉప ఎన్నికల్లో  ఎవరు  గెలుస్తారని  అడిగావుగా? వెళ్దాం  పద. ఆ  పేటల్లో  సర్వే  చేద్దాం. కొద్దిసేపట్లోనే  నీకు  ఎవరెవరు  ఎంత  మెజారిటీతో  గెలుస్తారో  చెప్పేస్తాను."

"వార్నీ! సర్వేనా. ఈ  పేటల్లో  తిరిగి  సర్వే  ఏమిటోయ్! అసలు  మనూళ్ళో  ఉప ఎన్నికలే  లేవు. సరే గానీ.. చివరకి  నువ్వు  కూడా  సర్వే  అంటూ  బయల్దేరావా  సుబ్బూ! లగడపాటి  డబ్బేమన్నా ఇచ్చాడా?"

"రవణ మావా! ఫలానా  నియోజక వర్గం  అని  నేను  చెప్పట్లేదు. ఎన్నికలు  ఉన్నా, లేకున్నా  ప్రజల  మూడ్  అనేది  ఒకటి  ఉంటుంది. కాబట్టే  ఎలెక్షన్లలో  కూడబలుక్కున్నట్లు  ఇచ్చాపురం  నుండి  తడ  దాకా  ఓటింగ్ లో  ఒక  పేటర్న్  ఉంటుంది. అందువల్ల.. నేనిప్పుడు  ఒక  కొత్త రకం  ఎలెక్షన్   సర్వేని   ప్రపోజ్  చేస్తున్నాను. కంట్రోల్  గ్రూప్స్, శాంపిల్  కలెక్షన్, మెథడాలజీ, స్టాటిస్టిక్స్.. అంతా  కొత్తగా  ఉంటుంది."

సుబ్బు  వైపు  ఆసక్తిగా  చూస్తూ  ఆంధ్రజ్యోతి  పేపర్ని  మడిచి పక్కన  పడేశాను.

ఆలోచిస్తూ  నిదానగా  చెప్పసాగాడు  సుబ్బు. "కంపేరిటివ్  గ్రూప్స్  రెండు. వంద  సంఖ్యకి  స్టాండర్డైజ్  చేద్దాం. మొదటి  గ్రూప్  అప్పర్  మిడిల్  క్లాస్. రెండో  గ్రూప్  లోయర్  మిడిల్  క్లాస్."

"ఇంటరెస్టింగ్  సుబ్బు! యూ  సౌండ్  లైక్  యోగేంద్ర  యాదవ్!"

"రింగ్  రోడ్  మనూళ్ళో  పోష్  ఏరియా. కాబట్టి  మన  స్టడీకి  ఫస్ట్  గ్రూప్  రింగ్  రోడ్  వాసులు. ఈ  స్టడీకి  ఇంక్లూజన్  క్రైటీరియా  రోజూ  న్యూస్  పేపర్  చదివేవాళ్ళు. ఇంగ్లీష్  పేపర్  చదివేవాళ్ళయితే  మరీ  మంచిది. వీరి  అభిప్రాయం  మనకి  చాలా  విలువైంది. ఎలెక్షన్లలో  ఎవరు  ఓడిపోతారో నిర్ణయించేది  వీరే! ఈ  స్టడీ  అర్ధం  కావడం  కోసం  కొన్ని  ఫిగర్స్  ఇస్తాను. రింగ్ రోడ్  శాంపిల్  ఒపీనియన్   రిజల్ట్  ఇలా  ఉందనుకుందాం. చంద్రబాబు  50, జగన్  30, కాంగ్రెస్  15, లోక్ సత్తా 5. మొత్తం  100. ఇప్పుడు  100/10 = 10. ఇదే  రేషియోలో  అన్ని  పార్టీలకి  ఓట్లు  పదో వంతుకి  పడిపోతయ్."

ఇంతలో  కాఫీ  వచ్చింది.

"సుబ్బూ! నీకు  లెక్కలు  రావని  నాకు  తెలుసు. కానీ  మరీ ఇంత  పూర్  అని  అనుకోలేదు."


"నా  లాజిక్  చాలా  సింపుల్! ఈ  శాంపిల్  గ్రూప్ కి  విషయం  తక్కువ. హడావుడి  ఎక్కువ. 'సామాజిక సృహ' తో  పేపర్లకి  ఉత్తరాలు  రాస్తుంటారు. టీవీల్లో  ఉపన్యాసాలు  చెప్తుంటారు. అవినీతిపై  పోరాటం  అంటూ  కొవ్వొత్తుల  ప్రదర్శనలు  చేస్తారు. కొవ్వొత్తుల  ఫ్యాక్టరీ  వాడికి  వ్యాపారం  పెరగడం  తప్ప  ఒరిగేదేముండదు. ఎయిడ్స్ కి  వ్యతిరేకంగా  పరిగెత్తుతారు. మనకి  ట్రాఫిక్  కష్టాలు. వాళ్ళకి  పిక్కల  నొప్పులు. వీళ్ళ  హడావుడి  బట్టి  ఫలానా  అభ్యర్ధి  గెలుస్తాడనే  భ్రమలు  పెట్టుకోకూడదు. ఇన్ ఫాక్ట్  ఆపొజిట్  ఈజ్  ఆల్వేస్  కరెక్ట్. అందుకే  రాజకీయ  పార్టీలు  కూడా  వీళ్ళని  పట్టించుకోవు."

"ఎందుకని?"

"ఈ  గ్రూపుకి  ఎలెక్షన్  కన్నా  క్రికెట్  మ్యాచ్ లకే  ప్రాముఖ్యత. అందుకనే  ప్రభుత్వాలు  కూడా  ఎలెక్షన్   రోజు  క్రికెట్  మ్యాచ్  ఉండేట్లు  ఏర్పాట్లు  చేస్తున్నాయ్. టీవీలో  లేటెస్ట్  సినిమా  ప్రసారం  చేయిస్తాయి. ఎండా కాలంలో ఎలక్షన్లు  ఒచ్చేట్లు  జాగ్రత్తలు  తీసుకుంటాయి. వీళ్ళు  ఇన్ని  అవరోధాలు  దాటుకుని  రోడ్డేక్కే  అవకాశం  లేదు. కాబట్టి  నూటికి  తొంభై మంది  ఓటే  వెయ్యరు. అందుకే  పదితో  డివైడ్  చేశాను."

"ఒకే! ఒప్పుకుంటున్నా!"

"మనమిప్పుడు  సెకండ్  గ్రూపుకి  వద్దాం. కంకరగుంట.. "

"ఆపు  సుబ్బూ! ఇందాక  ఆ  గుంటలన్నీ  చెప్పేశావ్. దిగువ  మధ్య తరగతి  ఏరియాలని  చెప్పు. చాలు." అన్నాను.

"ఓకే! ఇప్పుడు  మన  సెకండ్  గ్రూప్  స్టడీకి  exclusion  క్రైటీరియా  న్యూస్  పేపర్  చదివేవాళ్ళు. పొరబాటున  కూడా  న్యూస్ పేపర్  కేసి  చూడని వాడయితే  మరీ మంచిది. ఇది  చాలా  ముఖ్యమైన  గ్రూప్. ఏ  రాజకీయ  పార్టీ  గెలుస్తుందో  నిర్ణయించేది  వీరే్! ప్రజాస్వామ్యాన్ని  కాచి  వడబోసిన వారు  ఈ  గ్రూపులో  ఉంటారు. ఏ  పార్టీ  అధికారం లోకొచ్చినా  చేసి  చచ్చేదేమీ  లేదని  గ్రహించిన  మహానుభావులు  వీరు. అందుకే  హాయిగా  'దమ్ము', 'గబ్బర్ సింగ్'  సినిమాలు  ఒకటికి  రెండు సార్లు  చూసుకుంటూ.. ఎలెక్షన్   రోజున  ఐదొందలు, వెయ్యి  నోటు  తీసుకుని  ఓటేస్తారు."

ఇంతలో  ఏదో  ఫోన్. ఆన్సర్   చేసి  సుబ్బు  వంక  చూశాను. సుబ్బు  మళ్ళీ  చెప్పసాగాడు.

"ఇప్పుడు  మన  రెండో  గ్రూప్  ఒపీనియన్   రిజల్ట్  ప్రకటిస్తున్నాను. సాధారణంగా  ఈ  రెండు  గ్రూపుల  ఓటింగ్  ఆపొజిట్  డైరక్షన్లో  ఉంటాయి. ఇందాక  చంద్రబాబుకి  ఎక్కువొచ్చాయి. ఇప్పుడు  జగన్ కి  ఎక్కువ  రావాలి. కాబట్టి  జగన్   50. చంద్రబాబు  35. కాంగ్రెస్  14. లోక్ సత్తా 1. మొత్తం  100. ఇప్పుడు  100 x 2 = 200.


"చూడు  మైడియర్  ప్రన్నొయ్ రాయ్! ఈ  డివిజన్లూ, మల్టిప్లికేషన్లు.. "  ఏదో  చెప్పబోయాను.

నన్ను  మాట్లాడొద్దన్నట్లుగా  చేత్తో  సైగ  చేశాడు  సుబ్బు.

"ఇందాక  చెప్పాగా. వీళ్ళు  ఎండలో  ఎండుతూ.. క్యూలో  నించుని  మరీ  ఓట్లేస్తారు. కుర్రకారు  తమ  అభిమానాన్ని ఒకటికి  రెండు సార్లు (రెండు  ఓట్లతో) నిరూపించుకుంటారు. వీరికి  ఓటు  'విలువ'  తెలుసు. అందుకే  మన  శాంపిల్ని  రెండుతో  హెచ్చవేశాను. ఇప్పుడు  ఈ  రెండు గ్రూపుల్ని  కలిపెయ్యి. ఫైనల్  రిజల్ట్  ఇలా  ఉంటుంది."

   పార్టీ  పేరు                                                గ్రూప్ 1                గ్రూప్  2           మొత్తం.
తెలుగు దేశం ....................................   05  (50/10)     +    70   (35 x 2)   =   75        
YSR కాంగ్రెస్  పార్టీ ............................   03  (30/10)     +   100  (50 x 2)   =  103                    
కాంగ్రెస్ ............................................    1.5  (15/10)    +     28  (14 x 2)    =   29.5
లోక్ సత్తా ..........................................   0.5  (5/10)      +     02  (1 x 2)      =   2.5

"నువ్వు  జగన్ని  గెలిపించావేమిటి? చంద్రబాబు  వ్యతిరేకివా?"

"నాకెవరైనా  ఒకటే. ఏదో  ఉదాహరణ  కోసం  ఆ  ఫిగర్స్  చూపించాన్లే. నాకు  ఇల్లూ, ఆనంద భవన్  తప్ప  వేరే  ప్రపంచం  తెలీదు. ఆ మాటకొస్తే  నీకు  మాత్రం  ఏం  తెలుసు? పొద్దస్తమానం  ఈ  నాలుగ్గోడల  మధ్య  సెంట్రల్  జైలు  ఖైదీలాగా  గడిపేయడం  తప్ప! అందుకే  నిన్ను  బయటకి  రమ్మంటుంది. అప్పుడు  మనకి  కరెక్ట్  పొజిషన్ తెలుస్తుంది."

"ఏడిసినట్లుంది. ఇదొక  సర్వే! నువ్వొక  సెఫాలజిస్ట్ వి! ఒకడికి  ఒక  ఓటే  ఉంటుంది. అంతేగాని  ఒకసారి  పదో వంతు  వోటు, ఇంకోసారి  రెండు  ఓట్లు  ఎలా  సాధ్యం? అంతా  గందరగోళంగా  ఉంది. నీ  లెక్క  నాకు  నచ్చలేదు."


"నీ  ఖర్మ! చంద్రబాబుకి  జ్ఞానోదయం  అయ్యిందిగానీ.. నీకు  మాత్రం  అవ్వలేదు." అన్నాడు  సుబ్బు.

"ఏంటోయ్  నీ  గోల?"

"అవును రవణ మావ! రింగ్ రోడ్  వాడి  కారు  కోసం  చంద్రబాబు  రోడ్లు  వెడల్పు  చేశాడు. ఆ  ప్రాసెస్ లో  చుట్టుగుంట, సంగడి గుంట, కంకరగుంట  వాళ్ళ  అరటికాయ బళ్ళూ, పూల బుట్టలు, బడ్డీ కొట్లూ  కోల్పోయారు. వీళ్ళకి  కడుపు  మండింది. ఆ  సెగకి  చంద్రబాబు  మసాలా అట్టులా  మాడిపొయ్యాడు." అంటూ  ఖాళీ  కప్పు  టేబుల్  మీద  పెట్టాడు.

"మరి  రాజశేఖరరెడ్డి?"

"చంద్రబాబు  ఒక  మనిషి  ఒక  ఓటుతో  సమానం  అనుకున్నాడు. కాబట్టే  ఈ  సెఫాలజీ  కేలిక్యులేషన్  అర్ధం  చేసుకోలేకపోయాడు. రాజశేఖరరెడ్డికి  విషయం  బాగా  అర్ధమయ్యింది. అందుకే  ఫస్ట్  గ్రూప్ ని  వదిలేసి  సెకండ్  గ్రూప్  మీద  దృష్టి  పెట్టాడు. వాళ్ళకి  ఆరోగ్యశ్రీ  అన్నాడు. ఫీజ్  రీ ఇంబర్స్ మెంట్  అన్నాడు. జనాలు  కూడా  తెలివి  మీరి  పొయ్యారు. జంధ్యాల  తీసిన  'అహ! నా పెళ్ళంట!' సినిమా  చూశావుగా? అందులో  కోట  శ్రీనివాసరావు  అడుగుతుంటాడు  'నాకేంటి?' అని! ప్రజలు  కూడా  ఎవరికి వారే 'నాకేంటి?' అని  అడుగుతున్నారు. అందుకే  ప్రాజెక్టులే  లేకుండా  కాలవలు  తవ్వుతూ  డబ్బులు  దోచేస్తున్నారని  నెత్తీ, నోరూ  కొట్టుకుంటున్నా.. 'అయితే  ఏంటంట?' అంటూ  వంకరగా  నవ్వుతున్నారు."

"సుబ్బూ! రోజూ  ఉప్మా పెసరట్టు  తిని  గొప్ప  జ్ఞానివైపొయ్యావు." అన్నాను.

సుబ్బు  నవ్వాడు. " ప్రజలు  మాత్రం  అజ్ఞానులు  కారు. డబ్బు  విలువ  పెరిగిపోయింది. ఎవరి  ఎజెండా  వారికుంది. ఓటుకి  వెయ్యి రూపాయిలు  నిలబెట్టి  వసూలు  చేసుకుంటారు. అర్హత  లేపోయినా  తెల్లకార్డు  పుట్టించి  ఆరోగ్యశ్రీని  వాడుకుంటారు. పక్కనోడు  చస్తున్నా  పట్టించుకోవడం  మానేశారు. 'నువ్వు  ఎంతైనా  తిను. నాకెంతిస్తావ్ ?' అంటున్నారు. ఇది  గమనించిన  చంద్రబాబు  డబ్బులు  నెలనెలా  ఇళ్ళకి  పంపిస్తానని  వాగ్దానం  చేశాడు. తను  మారిన  మనిషినని  ఘోషించాడు. బట్  టూ  లేట్, టూ  లిటిల్! అందుకే  జనాలు  నమ్మలేదు. ఇంక  దానం  చెయ్యడానికి  రాజకీయ పార్టీలకి  సెక్రటేరియట్  తప్ప  ఏమీ  మిగల్లేదు."

"కానీ  రాజకీయాల్ని  ప్రక్షాళన  చెయ్యాలంటే.. "

"ప్రక్షాళన  చెయ్యాల్సిన  రాజకీయ  నాయకులు  ఓట్ల  భిక్షాటనలో  పడ్డారు. ఈ  దేశంలో కడుపు  నిండిన వాడే  మేధావి. బోలెడు  నీతులు  చెబుతాడు. వాటినే  నువ్వు  పరమ పవిత్రంగా  న్యూస్ పేపర్లలో  వార్తలుగా  చదువుతుంటావ్. తీవ్రంగా  ఆలోచిస్తూ  బుర్ర  పాడు  చేసుకుంటావ్. కానీ  ఈ  మేధావులకి  కూడా  హిడెన్   ఎజెండా  ఉంటుందని  గుర్తుంచుకో. నా  దృష్టిలో  డబ్బు  తీసుకుని  ఓటేసేవాడి  కన్నా ఈ  మేధావులే  ప్రమాదకారులు." అని  టైం  చూసుకుంటూ..

"నేవెళ్ళాలి. దారిలో  చాలా  పనులున్నయ్." అంటూ  నిష్క్రమించాడు  సుబ్బు! ది  గ్రేట్  సెఫాలిజిస్ట్!


34 comments:

  1. I see Subbu excels at teaching psychiatrists a thing or two about human psychology, Ramana! His prognostication of pseudocyesis for Chandra Babu may indeed need some psyllium to get better. Jagan, I guess will be singing psalms. Sonia meanwhile will be playing psaltery while Telangana burns. Pshaw!, everybody knows that psephology is no pseudoscience!

    ReplyDelete
  2. ఇంక దానం చెయ్యడానికి రాజకీయ పార్టీలకి సెక్రటేరియట్ తప్ప ఏమీ మిగల్లేదు."
    :))))
    సుబ్బు.. సుభాషితం ..చాలా బాగుంది రమణ గారు.

    ReplyDelete
  3. సుబ్బు సెఫాలజీ లెక్కలమోఘం! మసాలా అట్టు, ఉప్మా పెసరట్టు లేకుండానో, సుబ్బు కి కాఫీ పొయ్యటమో ఎప్పుడనా మరుస్తావేమో అని ఎదురు చూస్తున్నా!! ఊహూ. కుదిరేట్లు లేదు.

    జి ఐ డాక్ మీ ప గుణింతం నచ్చింది.
    గౌతం

    ReplyDelete
  4. @GIdoc,

    ఈ పోస్ట్ కాంప్లికేటెడ్ (లెక్కలు గట్రాలతో) గా ఉండి, చదవడానికి చికాగ్గా ఉంటుందేమోననే అనుమానం నాకుంది.

    మీ కామెంట్ ('P' లతో) నా పోస్టుకి తగ్గట్లుగానే ఉంది!

    ReplyDelete
  5. వనజవనమాలి గారు,

    ధన్యవాదాలు.

    నిన్న మా గుంటూరు ఎండకి రోస్టయిపొయింది. కర్ఫ్యూ వాతావరణం. అస్సలు బేరాల్లేవు. అంచేత 'పని లేక.. ' ఈ పోస్ట్ రాసేశాను. రాత్రికి టైపో ఎర్రర్స్ (నాకు ఎక్కువ టైం పట్టేది దీనికే) సరిచేసి.. పొద్దున్నే పబ్లిష్ చేసేశాను.

    ReplyDelete
  6. I have seen similar crazy survey results on TV5 yesterday.

    ReplyDelete
  7. @TJ"Gowtham"Mulpur,

    డియర్ గౌతం,

    'ఉప్మా పెసరట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ.' అంటాడు సుబ్బు!

    (i tried my best to simplify the calculations part. don't know how to skip the table.)

    ReplyDelete
  8. ఎవడికివాడు తెలివి మీరి పోయాడు. "ఇందులో నాకేంటి?" అనే అలోచనే ఎక్కడైనా కనిపిస్తోంది. తప్పు అని నా ఉద్దేశ్యం కాదు - కానీ మరీ సంకుచితంగా తయారయిపోయింది ధోరణి. "నాకేంటి?" బదులు "మాకేంటి?" అని ఆలోచితే పరిస్థితి వేరేగా ఉంటుందేమో! ఇక్కడ "మాకేంటి?" అంటే "మా కులానికేంటీ?" లేదా "మా మతానికేంటీ?" అని కాదు సుమండి!

    ReplyDelete
  9. మొత్తానికి, రింగురొడ్డు గాళ్ళ TAX కట్టడానికి, కంకరగుంట వాళ్ళు ఓట్లు వెయ్యడానికి అన్నమాట.

    కాముధ

    ReplyDelete
  10. మీ సుబ్బు చెప్పింది బాగుంది . విషయం అర్థం కానీ వారు సుబ్బు పలానా పార్టీ అభిమాని అని అంటారేమో 2009 లో మహా కూటమి దున్నేస్తుంది , పొడిచేస్తుంది అంటూ ఏవేవో రాసినా( అనుమానం ఉంటే అప్పటి పేపర్లు చూడ వచ్చు) వోటు వేసే వారు మాత్రం అవి పట్టించుకోలేదు . కరుడు కట్టిన హిందుత్వ వాది అయినా కొంచం ఆలోచించ గలిగితే హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో ఎవరు గెలుస్తారు అంటే మజ్లిస్ అనే చెబుతాడు .. కానీ అభిమానం తో చివరకు మొన్న పాత బస్తీలో తమ అభిమాన పార్టీ దుసుకేలుతుందనివార్తలు రాశారు

    ReplyDelete
  11. తెలుగు భావాలు గారు,

    >>"నాకేంటి?" బదులు "మాకేంటి?" అని ఆలోచితే పరిస్థితి వేరేగా ఉంటుందేమో!<<

    మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  12. kamudha గారు,

    >>మొత్తానికి, రింగురొడ్డు గాళ్ళ TAX కట్టడానికి, కంకరగుంట వాళ్ళు ఓట్లు వెయ్యడానికి అన్నమాట.<<

    అంతే కదా!

    ReplyDelete
  13. buddha murali గారు,

    తెలుగు వార్తా పత్రికల యాజమానులు తమ ప్రయోజనాలకి అనుకూలంగా వార్తలు రాసుకుంటున్నారు. మనం ఆ పత్రికల్ని డబ్బులిచ్చి కొనుక్కుంటున్నాం.

    ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా.. కులానికీ, ప్రాంతాలకీ అతీతంగా ఆలోచించలేకపోవటం దురదృష్తం.

    అందువల్లనే మనకింత confused atmosphere ఉందని అనుకుంటున్నాను.

    ReplyDelete
  14. Yaramana ఉన్నత పదవుల్లో ఉన్నా వేరే ఎక్కడున్నా, సరే, కులం, ప్రాంతం మతం వేరే ఎదైనా సరే తమకి దేని వల్ల ఎక్కువ లాభమో దాన్నీ గురించి మాత్రమే ఆలోచిస్తారు.

    కాముధ

    ReplyDelete
  15. Weighted average method బాగానే ఉంది. మొత్తం కలిపితే 210 బదులు 100 వచ్చింటే ఇంకా బాగుండేది.

    లోక్సత్తాకి అన్ని వోట్లా! పొరబాటున ఆయనకి తెలిస్తే సుబ్బు గారికి అర్జెంటుగా మాలేయగలడు.

    ReplyDelete
  16. Jai Gottimukkala గారు,

    210? నాకర్ధం కాలేదు.

    JP (లోక్సత్తా) మెడికల్ కాలేజ్ లో నాకు సీనియర్. ఆ రోజుల్లో మా బ్రాడీపేట వాసి. మా మైసూర్ కేఫ్ లో అనేక ఇడ్లీ సాంబార్లు తిన్న వ్యక్తి. కాబట్టి నేను biased. (కొంచెం పాత ప్రేమలు ఉంటాయి లేండి!)

    ReplyDelete
  17. రమణా,

    పెద్ద గురువు (జీ.ఐ డాక్)గారి చేత "ప" గుణింతం పలికించినందుకు పాదాభివందనం! "సుబ్బు" పలుకులతో పలు రాజకీయ పార్టీల ప్రహసనాలని ప్రజలు పళ్ళికిలించేలా మంచి పద ప్రయొగాలతో "సెఫాలజిస్టుల" పనికిమాలిన "పనులని" ప్రజామోద్యంగా పారడీ వ్రాశావు. పరమానందం!!

    దినకర్.

    ReplyDelete
  18. /మా మైసూర్ కేఫ్ లో అనేక ఇడ్లీ సాంబార్లు తిన్న వ్యక్తి. కాబట్టి నేను biased. /

    సహ ఇడ్లీ-సాంబార్ భోజితుడిపై మీ అభిమానం ... అజరామరం, అప్రతిహతం, ఆచరణీయం. మీ biasing న్యాయమైనది, ధర్మసమ్మతం, నాకు నచ్చింది, ప్రొసీడైపోవచ్చు. :D

    ReplyDelete
  19. Dinkar,

    ఇక్కడ ప్రజలు తెలివి మీరిపోయారు. అందరికీ అన్నీ తెలుసు.

    బలమైన వర్గాల మధ్య 'నువ్వా-నేనా' అన్నట్లు యుద్ధం జరుగుతుంది. ఈ ఎలక్షన్లు ఇద్దరు జమీందార్ల మధ్య జరుగుతున్న ఆస్థి తగాదా వంటిది.

    ఈ ఎలక్షన్లు మనలాంటి అర్భకులకి సంబంధించిన వ్యవహారం అస్సలు కాదు. మరి మనమేం చెయ్యాలి?

    హాయిగా ఆనంద భవన్లో మూడు ముక్కల మినపట్టుని కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడిలతో నంచుకుని తింటూ.. చిరంజీవి ఫైటింగ్ సినిమాని ఎంజాయ్ చేసినట్లు.. చూస్తూ ఆనందిద్దాం! వాళ్ళకి సంకటం.. మనకి వినోదం!

    ReplyDelete
  20. SNKR గారు,

    అర్ధం చేసుకున్నారు. థాంక్యూ!

    ReplyDelete
  21. రాష్ట్రము పర్మనెంట్ గా రెడ్ల పరిపాలన లేక కమ్మల పరిపాలనా అనే క్లారిటీ రాబోయే ఉప ఎన్నికలలో 90 శాతం ,2014 ఎన్నికలలో 100 శాతం తెలుస్తుంది. మరి బలహీన ,దళిత,ఇతర భుజ బలం లేని అగ్ర కుల పరిపాలానలోకి అసలు వస్తుందా మన రాష్ట్రం? ఈ ప్రజాస్వామ్యం లో ఎవరయినా రాజు కావచ్చు అనే వాఖ్యం తప్పు అని రాసుకోవాలేమో? కుల ,మత సంబంధం లేని ఎన్నికలు ఎప్పుడు చూస్తామో మీ సుబ్బుగారి చేత ఒక చెప్పించండి రమణ గారు. పోస్టు చాలా బాగుంది.

    ReplyDelete
  22. రమణ గారూ, మీ (సుబ్బు గారి) లెక్కలు కూడితే అన్ని పార్టీలకు కలిపి 210 "యూనిట్లు" వస్తాయి.

    75 (తెలుగు దేశం)+103 (YSR కాంగ్రెస్ పార్టీ) + 29.5 (కాంగ్రెస్) + 2.5 (లోక్ సత్తా)= 210.

    దీన్ని కొంచం అడ్జస్ట్ చేసి వందకు తెస్తే, వోట్ల శాతం ఈజీగా తెలుస్తుంది. ఇప్పటికీ ఈ పని చేయొచ్చు (ఉ. తెలుగు దేశం= 75/210 ~ 35.7%) కానీ ప్రేక్షకులకు సులువుగా అర్ధం కాదేమో.

    దాని తరువాత ట్రెండులని స్వింగులని అనేకరకాలుగా విరగదీయొచ్చు. గత ఎన్నికలకు, రాబోయే ఎన్నికలకు, కులాల సమీకరణకు ఇతరత్రా ఎన్నో విషయాలకు పనికి వచ్చినా రాక పోయినా లంకె పెట్టుకోవచ్చు. ఘంటలకు ఘంటలు ప్రత్యక్ష ప్రసారాలు, స్క్రోల్లింగులు, విపరీతమయిన విశ్లేషణలు, లైవు ఇంటర్వ్యూలు, మధ్య మధ్య బ్రెకింగులు, పావు ఘంటకు అయిదు నిమిషాల వ్యాపార ప్రకటనలు, ఒకటేమిటి నా సామిరంగా. టీఆర్పీ రేటింగులు, కీర్తి ప్రఖ్యాతులు, రమణ/సుబ్బు అభిమాన సంఘాలు, బోలెడంత డబ్బు కొట్టేయచ్చు. మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్న "మేధావి" హోదా దానంతట అదే రాక చస్తుందా, ఎన్నికల విశ్లేషణా మజాకా మరి.

    "కొంచెం పాత ప్రేమలు ఉంటాయి లేండి!"

    అర్ధం అయింది. ఆయనను నేను ఎప్పుడయినా కించపరిచి ఉంటె నన్ను క్షమించండి. ఆయన గురించి నేను కూసిన కారు కూతలన్నీ delete చేయరూ please!

    ReplyDelete
  23. /ఆయన గురించి నేను కూసిన కారు కూతలన్నీ delete చేయరూ please!/

    'కారు' కూతలు ... కారు వీరాభిమానులు ఆ మాత్రం కూయకపోతే ఏంబాగుంటుంది? అదేం కారు కూతలు కావులే, మరీ ఇదైపోతున్నారు అదేమిటో! మాకేమైనా కొత్తా ఏమిటి! మరీ అంత జెంటిల్మేనయిపోతే లొల్లి ఎవలు జేస్తరు?! ఆ చాల్లే ... పోదురూ ... :P :))

    ReplyDelete
  24. @ఈ ఎలక్షన్లు ఇద్దరు జమీందార్ల మధ్య జరుగుతున్న ఆస్థి తగాదా వంటిది


    Ha ha ..100% correct

    ReplyDelete
  25. @Truth Seeker,

    రాబోయే ఎలక్షన్లు మైనింగ్ మరియు కాంట్రాక్టర్ల మాఫియా చూపించబోయే కండబలానికి పరీక్ష.

    నా లెక్క ప్రకారం 'డబ్బు బలం' మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబోతుంది.

    తెలుగు దేశం పార్టీ ఒక date expired medicine వంటిది. నేను ఆ పార్టీని serious contender గా చూడటం లేదు.

    ReplyDelete
  26. Jai Gottimukkala గారు,

    210 అంటే ఇప్పుడు అర్ధమయింది. ఇప్పటికే నా పోస్టులో లెక్కలు ఎక్కువ అయ్యాయి. ఆల్రెడీ మన బ్లాగర్లు సుబ్బుని మేధావిగా గుర్తించేశారు లేండి!

    మన దేశంలో ఒక రాజకీయ పార్టీ (TDP) కార్పొరేట్ పాలిటిక్స్ ని నమ్ముకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. CEO గారికి (CBN) ఫలితం అనుకున్నట్లుగానే వచ్చింది.

    ఎందుకు ఇలా జరుగుతుంది/జరిగింది? ఈ ఆలోచనకి సమాధానంగా రాసింది ఈ పోస్ట్.

    ReplyDelete
  27. అయ్యా డాక్టర్ గారు
    అందుకే నాకు ఈ రాజకీయ వాతావరణం మొదలు నించి పడదు. మనం అటు కంకర గుంట బ్యాచి కాదు ఇటు రింగ్ రోడ్ బ్యాచి కాదు. నువ్వు చెప్పినట్టు హాయిగా ఆనంద భవన్ మినపత్తో , మైసూరు బజ్జినో తింటూ జీవితం ఎంజాయ్ చెయ్యటమే.
    గో వె ర

    ReplyDelete
  28. @Go Ve Ra,

    మిత్రోత్తమా!

    లెస్స పలికితివి!

    ReplyDelete
  29. "తెలుగు దేశం పార్టీ ఒక date expired medicine వంటిది"

    రమణ గారూ, రాజకీయాలలో మందులు ఎక్ష్పయిరు కావచ్చు కానీ ఆసుపత్రులు ఉంటాయి. రామారావు స్థాపించిన గ్రామీణ దవాఖానాను చంద్రబాబు సూపర్ స్పెషాలిటీగా మార్చారు. ఇంకొన్ని రోజుల తరువాత ఆయన కాకపొతే ఆయన వారసులు హోమియోపతి క్లినిక్ గా మార్చి మళ్ళీ వ్యాపారం పెంచుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదు.

    ReplyDelete
  30. సుబ్బు లెక్క తప్పింది. సాంపిల్ రెండు వందలు. మొత్తం వేసిన వోట్లు రెండు వందల పది. కొంచెం కనుక్కోవా ...
    - పుచ్చా

    ReplyDelete
  31. *ప్రజలు కూడా ఎవరికి వారే 'నాకేంటి?' అని అడుగుతున్నారు.*

    ప్రజలు ఇలా కావటానికి మూలాలు కిలో రెండు రుపాయల బియ్యం పథకం లో ఉన్నాయి. ఇది మొదట్లో పేద ప్రజల కు ఉపయోగపడినా తరువాత దానిని కొనసాగించటానికి నిధులు లేకపోయినా, తెలుగు వారుని వాహిని పథకం మొదలు పెట్టి, ప్రజలకు తాగుడు అలవాటు చేసి మరి కొనసాగించారు. కొన్ని సం|| క్రితం ఎన్నికలలో తెదె పార్టి గెలిచినపుడు ఆయనని జాతీయ విలేఖరులు ఎలా ఈ పథకాన్ని కొన సాగించగలరు ప్రస్తుత పరిస్థితులలో అని గుచ్చి గుచ్చి అడిగితే బాబు గారు మనసుంటే మార్గం ఉంట్టుందని చెప్పాడు. అప్పుడు తెలుగు దేశం పార్టి ప్రజలకు నేర్పిన ఉచిత పథకాల అలవాటు పెరిగి పెద్దదై ఇప్పుడు బాబు గారినే మింగేసాయి.

    ReplyDelete
  32. రమన గారూ, కంగ్రాంట్స్. ( ఇవాల ఆంధ్రజ్యొతి లో మీ పోస్ట్ వచ్చినందుకు)

    ReplyDelete
  33. @cheekati,

    ధన్యవాదాలండి!

    ReplyDelete
  34. Dr Radha Krishna20 May 2012 at 22:45

    రమణ గారూ! కొంచెం ఆలస్యంగా అయినా మీబ్లాగు గురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. చాలా సార్లు గుంటూరు కు రావలసి వస్తొంది. బాబు అక్కడ చదువుతున్నందుకు.మిమ్మల్ని కలవాలని అనిపిస్తొంది. మీ హాస్పిటల్ కు రావొచ్చా?

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.