Tuesday 18 September 2012

నా కళ్ళజోడు కష్టాలు



మీరు రోజులో ఎక్కువ భాగం ఏంచేస్తారో నాకు తెలీదు. నేను మాత్రం వస్తువులు వెతుక్కుంటూ ఉంటాను. చదువుతున్న పుస్తకం, తాగుతున్న కాఫీ కప్పు, రాస్తున్న పెన్ను.. ఇలా ఒకటేమిటి.. అన్నీ ఎక్కడ పెట్టానో మర్చిపోయి వెతుక్కుంటూ ఉంటాను. జీవితంలో ఇంకెప్పుడూ ఏదీ మర్చిపోకూడదని పట్టుదలగా ఉంటాను. కానీ కొద్దిసేపటికి ఆ పట్టుదలని కూడా మర్చిపోతాను!

నేను ఎక్కువసార్లు.. ఎక్కువసేపు వెతుక్కునేది నా కళ్ళజోడు. నాకీ కళ్ళజోడు వెదుకులాట బాగా అలవాటైపోయింది. ఎంత అలవాటయ్యిందంటే.. ఒక్కోసారి కళ్ళజోడు పెట్టుకుని కూడా కళ్ళజోడు కోసం వెతుకుతుంటాను!

నాకు రెండు కళ్ళజోళ్ళు. ఒకటి సీనియర్. సీనియర్ ఇంటర్ నుండి నన్నంటి పెట్టుకునుంది. కొన్ని వందల సినిమాల్ని స్పష్టంగా చూపించిన నేస్తం. రెండోది నలభైయ్యేళ్ళు దాటినందుకు చిహ్నంగా వచ్చిన చత్వారం. దీన్నే ఆంగ్లంలో రీడింగ్ గ్లాసెస్ అంటారు. నాతో ఎన్నో మంచిపుస్తకాలు చదివించింది. మిమ్మల్ని భయపెట్టే తెలుగులో చెప్పాలంటే మొదటిది దీర్ఘదృష్టి లోపం, రెండోది హ్రస్వదృష్టి లోపం!


రోజూ ఈ కళ్ళజోడు వెతుక్కోడం నాకు చికాగ్గా ఉంటుంది. అంచేత 'ఇక్కడే, ఇందాకే పెట్టాను. ఎవరు తీశారో చెప్పండి.' అంటూ ఇంట్లోవాళ్ళని సతాయించసాగాను. మా అబ్బాయి, అమ్మాయి కళ్ళజోడు వెతికి పెట్టినందుకు ఫీజు వసూలు చెయ్యసాగారు. నాకు కళ్ళజోడు దొరికేదాకా మనశ్శాంతి లేకుండా చేస్తానని గ్రహించిన నా భార్య కూడా ఈ కళ్ళజోడు వెదుకులాటలో ఓ చూపు వెయ్యసాగింది.

క్రమేణా నా కళ్ళజోడు సణుగుడు భరింపరానిదిగా తయారైనట్లుంది.. నా భార్య తన మిత్రుడు మరియూ క్లాస్‌మేట్ అయిన ఒక కంటివైద్యునికి తన గోడు వెళ్ళబోసుకొంది. ఆయన నా పీడా విరుగుడుగా ఒక నల్లటి తాడులాంటిదేదో పంపించాడు. (ఇంకానయం! ఈవిడకి ఏ ప్లీడరో స్నేహితుడైనట్లయిన నాపై గృహహింస కేసు పెట్టించేవాడు.) 

ఈ నల్లతాడుకి రెండువైపులా చిన్నరింగులు. అందులో కళ్ళజోడుకుండే రెండు పుల్లలు దూర్చి fix చెయ్యాలి. పిమ్మట ఆ తాడుని మెళ్ళో హారంగా ధరించాలి.

ఆ కళ్ళజోడు హారం మంగళసూత్రం వలె ధరించిన వెంటనే మెడ భాగం దురద పెట్టసాగింది. 'కొన్నాళ్ళకీ దురద అలవాటైపోతుంది. తియ్యొద్దు.' అని నాభార్య ఆజ్ఞాపించింది. ఆమెని ధిక్కరించు ధైర్యంలేదు.

నా మంగళసూత్రాన్ని భక్తిగా కళ్ళకద్దుకున్నాను. హఠాత్తుగా సతీఅనసూయ, సక్కుబాయిలా ఫీలవడం మొదలెట్టాను. 'ఆడది కోరుకునే వరాలు రెండేరెండు. చల్లని ఇల్లూ.. ' అంటూ పాడుకుందామనే కోరికని బలవంతంగా ఆపుకుని.. నా కళ్ళజోడు వెతుక్కునే ప్రోగ్రాంకి తెర పడినందుకు సంతసించితిని.



నా భార్యకి నేనీ కళ్ళజోడు సూత్రం తీసేస్తాననే అనుమానం కలిగినట్లుంది. 'CPM సీతారాం ఏచూరి, RSS శేషాద్రిచారిలు కూడా ఇట్లాంటి సూత్రాలతోనే టీవీల్లో కనిపిస్తుంటారు. నువ్వు కూడా వాళ్ళలాగే మేధావిలాగా కనిపిస్తున్నావ్.' అంటూ ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. నా ఛాతీ గర్వంతో రెండంగుళాలు ఉబ్బింది.

ఆస్పత్రిలో పేషంట్లని చూచుచూ.. ఈ కళ్ళజోడు వ్యవహారం మరచితిని. కానీ పేషంట్లు నా కళ్ళజోడు సూత్రం వైపు ఆశ్చర్యంగా చూడసాగారు. కొందరు నిర్మొహమాటస్తులు తాడు గూర్చి సూటిగా అడిగెయ్యడం మొదలెట్టారు. ఒకడు 'ఆ తాడు లేకపోతే మీక్కనపడదా?' అంటూ అనవసరపు కుతూహలం ప్రదర్శించగా.. ఇంకోడు 'ఆ తాడు కళ్ళజోడు చార్జికి ఎగస్ట్రానా?' అంటూ ఎగస్ట్రాలు.

ఇప్పుడొక ధర్మసందేహం. మరి నా ఈడువారు ఒకే కళ్ళజోడుతో అన్నిచూపులూ చూసేస్తున్నారే! ఇదెలా సాధ్యం? దీనికి సమాధానం ఆనతికాలంలోనే లభించినది. నాల్రోజుల తరవాత జరిగిన ఒక సైకియాట్రీ కాన్ఫరెన్సులో ఈ కళ్ళజోడు కూపీ కూడా ప్రధానాంశముగా చేర్చితిని. 

అక్కడ పిచ్చివైద్య శిఖామణులతో మాట్లాడగా తెలిసింది.. వారు ప్రోగ్రెసివ్ లెన్స్ అనబడే కళ్ళద్దాలు వాడుతున్నారుట. శివరాత్రి నాడు ఒకే టికెట్టుపై రెండు సినిమాలు చూపినట్లు.. ఒకే అద్దంలో రెండు పవర్లు ఉంటాయిట. ఇదేదో బాగానే ఉంది.

నేను మాత్రం తక్కువ తిన్నానా? హమ్ కిసీ సే కమ్ నహీ. నా భార్య స్నేహితుడైన ఆ కంటి డాక్టర్ని సంప్రదించితిని. అతగాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఎదురుగా ఉన్న ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ గళ్ళల్లో ఏవో అంకెలు కెలికాడు. నాల్రోజుల్లో నా ముఖారవిందాన్ని కొత్తకళ్ళజోడు అలంకరించింది . తిరునాళ్ళలో నాల్రూపాయలకి నల్లకళ్ళజోడు కొనుక్కుని నాగేశ్వర్రావులాగా ఫీలవుతారు. నేను మరీ అంత గర్వపడలేదుగానీ - కించిత్తు ఆనందపడ్డాను.

నా కొత్త కళ్ళజోడు గూర్చి రెండుముక్కలు. దూరం వస్తువుల్ని చూడాలంటే అద్దం పైభాగం నుండి చూడాలట. చదవాలంటే క్రిందిభాగం నుండి చూడాలిట. పైభాగం పాకిస్తాన్.. క్రిందిభాగం ఇండియా. మధ్యలో ఏదేశానికి చెందని కాశ్మీర్ వలే.. ప్లస్సూ, మైనస్సులు కలగలిపిన పవర్. ఇదేదో మాయా అద్దమువలెనున్నదే! భలే భలే! 'కల నిజమాయెగా, కోరికా తీరెగా'.
                               
కానీ ఒక చిక్కొచ్చి పడింది. ఎదుటివారితో మాట్లాడాలంటే క్షవరం చేయించుకునేవాడిలా తల దించాలి. ప్రిస్క్రిప్షన్ రాయాలంటే మోర పైకెత్తాలి. తల ఎత్తీ దించి.. దించీ ఎత్తి.. తొండ మార్కు ఎక్సర్ సైజులు చేయగా, చేయగా మెడనరం పట్టేసింది. సాయంకాలానికల్లా విసుగొచ్చేసింది. ఇక లాభం లేదనుకుని.. నా పాత రీడింగ్ గ్లాసులు పెట్టుకున్నా. ఎంతో హాయిగా ఉంది!

ఈ కొత్తరకం అద్దాలు నాకేల? నాకు రెండుకళ్ళు, రెండు చెవులు. అట్లే.. రెండురకాల దృష్టిలోపాలు. చదవడానికో జోడూ.. దూరంగా చూడ్డానికి మరో జోడు. సో వాట్? ఈ రెండు పవర్లు కలిపి ఒకే కళ్ళజోడులో ఇరికించుకొని.. నేను సాధించేదేమిటి? మెడనొప్పి తప్ప! చంద్రబాబంతటివాడిదే రెండుకళ్ళ సిద్ధాంతం. మరప్పుడు నాకు మాత్రం రెండు కళ్ళజోళ్ళ సిద్ధాంతం ఎందుకుండరాదు?

నాకీ కొత్త లెన్సులూ వద్దు.. ఆ మంగళసూత్రాలూ వద్దు. అసలు కళ్ళజోడు వెతుక్కోడంలో ఎంత ఆనందముంది! భార్యని ఆ మాత్రం ఇబ్బంది పెట్టనియెడల మగవాడి భర్తత్వానికే కళంకం కాదా! కావున.. మితృలారా! ఇందు మూలముగా యావన్మందికి తెలియజేయునదేమనగా.. నేను మళ్ళీ నా పాత కళ్ళజోళ్ళకే షిఫ్ట్ అవుతున్నాను.
       
ముగింపు -

ఈ మధ్య ఒకపెళ్ళిలో మన కంటి డాక్టరు తారసపడ్డాడు. 'మీరు తొందర పడ్డారు. ప్రోగ్రెసివ్ లెన్స్ ఓ పదిరోజులు అట్లాగే ఉంటాయి. తరవాత చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.' అంటూ సెలవిచ్చాడు. తరచి చూడగా.. ఈ కంటి డాక్టరు పక్కనేఉన్న తన స్నేహితుడైన మెడనొప్పి డాక్టరుతో మేచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడేమోనని అనుమానం కలుగుతుంది!

(photos courtesy: Google)  

29 comments:

  1. humorous post, after long time, we all share your problem, got used to progressive glasses, at times i am worse than you, i search for my glasses, even after wearing them, god save us

    ReplyDelete
  2. దాక్టరు గారూ,

    కళ్ళజోడు పెట్టుకొనే హక్కు మన కెలాగు ఉందో, వాటిని వెతుక్కునే -వీలయినప్పుడల్లా- వెతికించుకునే సర్వ హక్కులూ మన కున్నాయని చెప్పగలను. కళ్ళకు కళ్ళజోడు కనిపించనంతగా మమేకం అయిపోతున్నందు గర్వించాలి గానీ అదేదో మతిమరపు అనుకోరాదని నా సూచన.

    ఇకపోతే తినగ తినగ వేము తియ్యనుండూ అన్న వేయన సూత్రానికి అన్వయంగా పెట్ట్గగాపెట్టగా ప్రోగ్రసివు దృష్టి పట్టుబడును. అంచేత నిక్షేపంగా ప్రాక్టీసు చేయండి. నేనిది పదిహేనేళ్ళ క్రిందటే చేసాసనని మనవి చేసుకుంటున్నాను కాబట్టి మీరూ నమ్మవచ్చును.

    అన్నట్లు నాకు మొన్న కొత్త ప్రోగ్రెసివు గ్లాసెస్ ప్రిస్క్రైబ్ చేసిని నేత్రవైద్యశిఖామణిగారూ మీలాగానే రెండు రకాల అద్దాలు వాడతారు కాని తాను మాత్రం ప్రోగ్రెసివు గ్లాసెస్ వాడరు!

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అలవాటైతే సుఖంగానే ఉంటుంది. ప్రస్తుతం నేను బయటకొస్తే ప్రోగ్రెసివ్. హాస్పిటల్లో మాత్రం రిగ్రెసివ్!

      చాలమంది hair transplant surgeons కి బట్టతల ఉంటుంది. మీ కంటి డాక్టరు గారు కూడా అదే category కి చెందినవారయ్యుండొచ్చు!

      Delete
    2. ప్రోగ్రేస్సివులు అలవాటు అవుతాయి లేదో అనే అంశం పై తెలుగు టీవీ విశ్లేషకులందరినీ అడిగి చూస్తె విపరీతమయిన పరిణామాలు జరుగుతాయి. ఇట్టే అవుతాయని, ప్రోగ్రేసివు మానవ జాతిని ఉద్దరించే నూతన గాయత్రి మంత్రమని కొందరు చెబుతారు. అణగారిన వర్గాలని బూర్జువాలు దోచుకోవడానికి కనిపెట్టిన కొత్త ఆయుధం అని మరి కొందరు వాదిస్తారు. ఏతావాతా తేలేది ఏమిటయ్యా అంటే ప్రోగేసివు లెన్సుల గురించే వంద మందిని అడిగితె రెండు వందల అభిప్రాయాలు.

      Delete
  3. +, - పవర్లు రెండూ కేన్సిల్ అయి, దృష్టిలోపం సున్నా ఎందుకు కాదో ఓ అర్థం కాని ఆల్జీబ్రా.

    +, - రెండద్దాలు అడ్డంగా కాక నిలువుగా వుండేట్టు పెట్టుకుంటే పైకి కిందికి చూడక్కరలేదు. పక్క చూపులు చూడొచ్చు. మెడ నొప్పి వుండదు, అని నా ఆలోచన. :))

    ReplyDelete
    Replies
    1. ఇంకా నయం, ఒక కన్నుకి ఒక పవరూ,
      ఇంకో కన్నుకి ఇంకో పవరు గ్లాసు పెట్టుకోమనలేదు.

      Delete
    2. అయ్యా, ప్రస్తుతం నా పరిస్థితి ఇదే. కుడికంటికి +, ఎడమకంటికి -. కుడికన్ను దెబ్బవలన వచ్చిన ఛత్వారం, ఎడమకన్ను ఉద్యోగం తెచ్చిన వ్యవహారం. అంతా దైవలీల నాయనా.

      -
      ఆత్రేయ

      Delete
  4. పైన చెప్పినట్లు.... పక్క చూపుల్లో పర్ఫెక్షన్ ఉంటుందేమో...ట్రై చేయండి:-)

    ReplyDelete
  5. చిన్నప్పుడు చదువుకున్న కుచ్చూ పాఠం గుర్తు చేసారు. సూపర్...

    ReplyDelete


  6. నేత్ర వైద్య నిపుణుడిగా చెప్తున్నాను.progressive lenses ,trifocal lenses సౌకర్యంగా ఉండవు.అలవాటవడం కష్టమే.ఐనా మతిమరపు వాళ్ళకి ఏ కళ్ళజోడైనా మరపే కదా.మీరు psychiatrist కాబట్టి ఇంకొక ' పిచ్చి ' డాక్టర్ని మతిమరపు గురించి కన్సల్ట్ చెయ్యండి.

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు,

      కళ్ళ డాక్టర్లకి చత్వారం ఉండును. బట్టతలపై జుట్టు నాటు డాక్టర్లకి బట్టతల ఉండును. మతిమరుపుకి వైద్యం చేయు సైకియాట్రిస్టులకి మతిమరుపు ఉండును. మన రహస్యాలని బ్లాగుల్లో చర్చించరాదు!

      Delete
  7. హాహాహా..బాగుంది బాగుంది మీ కళ్ళద్దాల బాధ! మీకో విషయం తెలుసా..”కళ్ళజోళ్ళు ధరించు వారందరూ మేధావులు"

    ReplyDelete
    Replies
    1. అవును! కాదంటే ఈ పోస్టులో దర్శనమిచ్చిన కుక్క, పిల్లి ఊరుకోవు!

      Delete
  8. how about trying laser treatment?

    ReplyDelete
  9. Lol. Be glad that you are not ENT doctor or dentist. They wear all sorts of Wierd glasses on top of head, helmet glasses, scope glasses what not at work.

    How about contact lenses? No more searching. ;)
    Couple of my friends did lesik surgery on eyes, they no longer needed any eye glasses whatsoever. Check see if you are eligible.

    ReplyDelete
  10. WOW What a hilarious blog Ramana .my problem also same to same.I keepmy glasses on head.But still i forget. So I keep my glasses as spare in car drawing room.Clinic and one in medical shop also.Other wise have to hear a marathon class from my wife.

    ReplyDelete
    Replies
    1. same with me also. i maintain glasses at home, hospital, car and at my mother's place. but my problem is always with the glasses at home!

      i tried to write a funny piece on spectacles. thanks for the compliment.

      Delete
  11. Dear Ramana, there are other options. You can try extended wear contact lenses or preferably go for Lasik with differential correction for each eye - one eye for far vision and the other for near vision (now this might make someone more like a chicken rather than a lizard!). This sure beats bifocals, progressives and the two sets of glasses situation. I have had differential Lasik several years ago and it's still good. Highly recommend it.
    BSR

    ReplyDelete
    Replies
    1. అయ్యా! GIdoc బాబు!

      వీలైతే మా కళ్ళజోళ్ళ వారి కష్టాల్ని చదివి, రెండు చుక్కలు కన్నీరు కార్చండి! అంతేగానీ అసలు కళ్ళజోడే లేకుండా చేసే ఆలోచనలు చెయ్యకండి!

      Delete

  12. చ, జోడు పెళ్ళాలు ఉంటే అంత కష్ట పడి పోతారేమిటి దాటేరు గారు.

    ఇంతకీ కాళ్ళకి జోళ్ళు అనవచ్చు. కళ్ళకి ఎందుకు జోడు అంటారో మరి ?

    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. ఇటువంటి ధర్మసందేహం జిలేబి గారికి మాత్రమే వచ్చును. 'ఉషశ్రీ' గారిని అడిగి చెబుతాలేండి!

      Delete
    2. Because it is for both eyes (pair) as opposed to a monocle.

      Delete
  13. టపాకు సంభందం లేని వ్యాఖ్య.

    రమణగారు,

    మీ బ్లాగ్ లో కొ కు ,శ్రీ శ్రీ పోటో లు పెట్టటం చూసి త్వరలో ఓల్గా,రంగనాయకమ్మ పోటోలొస్తాయని తమాషాగా వ్యాఖ్యానిస్తే, మీరు అంచనాలను అధిగమిస్తూ బి గ్రెడ్ కమ్యూనిస్ట్ మేధావి వి శేఖర్, ఆయనకి వంత పాడే రాజశేఖర్ రాజు గారి చందమామ చరిత్ర బ్లాగులను తీసుకొచ్చి మీ బ్లాగు లిస్ట్ లో చేర్చారు. వీరిద్దరే కాక బ్లాగులో రామోహన్ అనే గొప్ప కమ్యునిస్ట్ వీరాభిమాని ఉన్నాడు, అతని బ్లాగును కూడా లిస్ట్ లో చేర్చండి ఒక పనైపోతుంది. అలాగే ఇన్ని అభ్యుదయ భావాలు ఉన్న మీలాంటి వారు స్రీల అభ్యున్నతి గురించి కూడా ఆలోచించాలి కదా, అందువలన రెంటాల కల్పన,కొండవీటి సత్యవతి ,అమయ,విహంగం మొద|| బ్లాగులు కూడా లిస్ట్ లో చేర్చండి. మిగిలినది కొత్తగా వచ్చినది మైనారిటి వాదానికి స్కై బాబా(అధురే అనే పుస్తక రచయిత) జగ్ నే కి రాత్ బ్లాగు కూడ చేరిస్తే అభ్యుదయ వాదం సంపూర్ణం అవుతుంది. మీరొక విశ్వమానవుడిగా అవతరిస్తారు :) ఆ సరికొత్త అవతారం లో మాకు త్వరలో దర్శనమిస్తారాని ఆశిస్తూ ...

    ReplyDelete
    Replies
    1. ఎవరి పిచ్చి వారికానందం! పోనిద్దురూ!

      Delete
    2. రమణగారు,
      నేను రాసిన వ్యాఖ్యకు సమాధానం, భలే ఇచ్చారు. పార్లమెంటరి రాజకీయాలలో తలపండిన మంత్రులు మంత్రులు మాత్రమే ఇలా ఇవ్వగలరు. :)

      Delete
    3. well said, even i liked the comment as well as the reply ramanagaru. kudos

      Delete
  14. very funny...especially the last line...

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.