Sunday 9 October 2011

టెండూల్కరుని టెక్కునిక్కులు


సినిమా రంగం, క్రీడా రంగం.. ఇలా ఏదోక రంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదించినవాళ్ళని సెలబ్రిటీ అంటారు. ఈ సెలబ్రిటీలు తమ కెరీర్ అయిపొయ్యాక, అనుభవాల్ని పుస్తకంగా రాస్తారు. ఈ రాతకోతల సంగతులు సెలబ్రిటీలకి తెలీనందున, వారికి సహకరించేందుకు ప్రొఫెషనల్ రైటర్స్ వుంటారు. కొన్నిసార్లు సెలెబ్రిటీల అనుభవాల్తో పుస్తకం వాళ్ళే రాసేస్తారు. ఇక్కడ ఆయా సెలబ్రిటీల క్రేజ్ కేష్ చేసుకోవడమే ప్రధాన లక్ష్యం, ఇంకేదీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ తతంగం ఎప్పణ్నుండో నడుస్తుంది. 

ఇప్పుడు మనం ఇంకో విషయం గమనించాలి. పుస్తకాల్ని మార్కెటింగ్ చేసుకోవాలంటే పుస్తకంలో కొన్ని వివాదాలు వుండాలి, వుండేట్లు రాయాలి. అప్పుడే కొనేవాడికి ఆసక్తి కలుగుతుంది. అంచేత పబ్లిషర్, రచయిత ఈ విషయాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. ఇది బుక్ పబ్లిషింగ్‌లో పురాతనకాలం నుండి అమలవుతున్న టెక్నిక్. 

వ్యాపారం అన్నాక ఎప్పుడు యేది మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో బాగా తెలిసుండాలి. అందుకే యే ఇంటర్నేషల్ క్రికెటర్ అయినా ఇండియాలో అడుగు పెట్టంగాన్లే సచిన్ టెండూల్కర్‌ని ఆకాశానికెత్తేస్తాడు. అలా చేస్తేనే అతనికి క్రికెట్ అభిమానుల ఆదరణ, మీడియాలో ప్రచారం. ఇది చాలా సింపుల్ లాజిక్, వివేకంతమైన వ్యాపార టెక్నిక్.  

షోయబ్ అఖ్తర్ పాకిస్తాన్ క్రికెటర్, అత్యంత వేగంతో బంతులు విసిరేస్తాడని పేరుగాంచాడు. సరే, అందరిలా తనూ సొమ్ము చేసుకుందామని తన అనుభవాల్తో యేదో పుస్తకం రాశాడు. అఖ్తర్‌కి ఇండియాలో అభిమానులున్నారు, కాబట్టి అతని పుస్తకానికి ఇక్కడ మార్కెట్ వుంటుంది. అప్పుడతను సచిన్ గూర్చి గొప్పగా రాయాలి, పోనీ కనీసం విమర్శించకూడదు. మరి అమ్మకాల కోసం వివాదం ఎలా సృష్టించాలి? మసాలా కోసం యే వెస్టీండీస్ క్రికెటర్నో, ఆస్ట్రేలియా క్రికెటర్నో విమర్శిస్తే పొయ్యేది. అది మంచి వ్యాపారస్తుడి లక్షణం.  

అఖ్తర్‌కి వ్యాపార తెలివితేటలు లేనట్లుగా తోస్తుంది లేదా అతనికి సరైన సలహదారులు లేరేమో. తన బంతులకి సచిన్ భయపడ్డాడనే వివాదంతో పుస్తకం మార్కెటింగ్ మొదలెట్టాడు. సచిన్ మనకి దేవుడు, దేవుడెలా భయపడతాడు! మనవాళ్ళకి సహజంగానే కోపం వచ్చింది. అందుకే పుస్తకం అమ్మకాలు అంత అశాజనకంగా లేవు. 

సచిన్ అభిమానులకి నచ్చకపోయినా - 'అక్తర్ బంతులకి సచిన్ భయపడ్డాడు' అనుకుందాం. అప్పుడు సచిన్ యేం చేస్తాడు? అక్తర్ బౌలింగ్ విడియోని తన కోచ్ అధ్వర్యంలో అధ్యయనం చేస్తూ, అతని బౌలింగుని ఎలా ఎదుర్కోవాలో సాధన చేస్తాడు, ఆ తరవాత అక్తర్ బౌలింగుని ప్రతిభావంతంగా ఎదుర్కొంటాడు. 

ఇది మంచి ఆటగాడి లక్షణం. భయపడటం అనేది బూతుమాట కాదు. అసలు ఆ భయమే చాలాసార్లు మనని కార్యసాధకుణ్ణి చేస్తుంది. కానీ తమ హీరో భయపడ్డాడంటే అభిమానులు తట్టుకోలేరు. ఈ భయపడటం అనే పదం పిరివాడి పేటెంట్ రైట్! ధైర్యానికి మాత్రం వీరుడూ, శూరుడూ అంటూ అనేక విశేషణాలున్నయ్. 

సచిన్ టెండూల్కర్‌కి భారతరత్న ఇవ్వాలని అభిమానులు అత్యంత తీవ్రంగా ఘోషిస్తున్నారు. మంచిదే, క్రికెట్ ఆడటం పబ్లిక్ సర్విస్ క్రిందకి వస్తుందేమో నాకు తెలీదు. టెండూల్కర్ బూస్ట్ నించి బర్నాల్ దాకా వంద బ్రాండ్లకి ఎంబాసిడర్ (అంబాసిడర్ కారుకీ బ్రాండ్ అంబాసిడర్‌కీ సంబంధం లేదు), గొలుసు హోటళ్ళు (chain of hotels) కూడా ఉన్నాయి. 

రేపు 'బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై భారతరత్న' అనే కొత్త ట్యాగ్‌లైన్తో మరిన్ని కాంట్రాక్టులు రాబట్టుకోవచ్చు.' వంద పెప్సీ మూతలు కలెక్ట్ చేసుకోండి, భారతరత్నతో షేక్ హ్యాండ్ చెయ్యండి.' అనే కొత్త ప్రచారం మొదలుపెట్టొచ్చు. బెస్టాఫ్ లక్ టు సచిన్. 

సామాన్య ప్రజానీకానికి సంబంధంలేని రత్నాలు, ముత్యాల మీద ఎవార్డులు ఇవ్వడమే పెద్ద జోక్. భారతబొగ్గు, భారతఉప్పు లాంటి పేర్లు ఎవార్డులకి పెడితే మరింత అర్ధవంతంగా ఉంటుందేమో! బొగ్గూ, ఉప్పు లేని బ్రతుకు ఊహించుకోలేం. మనకి ఏమాత్రం సంబంధంలేని రాళ్ళూ, రప్పల పేర్ల మీద ఎవార్డులు ఇస్తున్న ప్రభుత్వంవారి ఉద్దేశ్యం కూడా - వీళ్ళని పట్టించుకోండి అనేమో!  

అసలీ ఆటలకీ ప్రజాసంక్షేమానికీ యే మాత్రం సంబంధం లేదు. టెండూల్కర్ శరద్ పవార్‌తో్ వాళ్ళ మాతృభాష మరాఠీలో - "అంకుల్! నా అభిమానులు ఉల్లిపాయలు కొన్లేక చస్తున్నారు, ధర తగ్గించండి." అన్చెప్పొచ్చు. అప్పుడేమౌతుంది? టెండూల్కర్‌కి భారతరత్న రావటం అటుంచి, వున్న అవార్డులు, రివార్డులు పొయ్యే ప్రమాదం ఉంది. 

భారత క్రికెటర్ల సంపాదనకీ, లాబీయింగ్ రాజకీయాలకీ పితామహుడు గవాస్కర్. కాబట్టి టెండూల్కర్ ప్రజలకి సంబందించిన 'చెత్త' ఆలోచనల్ని పొరబాటున కూడా దగ్గరికి రానివ్వడు. తనకి పనికొచ్చే 'మంచి' ఆలోచన మాత్రమే చేస్తాడు. 'బొంబాయి నడిబొడ్డున నాలుగెకరాలు ఫ్రీగా ఇస్తే క్రికెట్ అకాడెమీ పెడతాను.' అంటూ గురువు గవాస్కర్ పధ్ధతిలో శరద్ పవార్‌ని అడుగుతాడు

సచిన్ ఒక మంచి క్రికెటర్. కష్టపడి ఆడాడు, ఇంకా కష్టపడి సంపాదించుకున్నాడు. అందుకతను యేవో మార్కెటింగ్ టెక్కునిక్కులు ప్రయోగించాడు, అవన్నీ మనకనవసరం. అయితే ఒక ఆటగాడికి భారతరత్న ఇవ్వాలనుకుంటే  ఈమాత్రం సరిపోతుందా? జనాకర్షణ కలిగిన ఒక ఆట ద్వారా కోట్లు వెనకేసుకోవటం, పుట్టపర్తి బాబావారి సేవలో తరించిపోవటం మించి పబ్లిక్ లైఫ్‌లో సచిన్ సాధించిందేమిటి?

'అసలిప్పుడు నోబెల్ ప్రైజులకే దిక్కు లేదు. అందరి దృష్టీ స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్, నారాయణమూర్తిల మీదే ఉంది. అట్లాంటి ఈ రోజుల్లో భారతరత్నకి మాత్రం ఏపాటి విలువుంది?' అంటారా? 

అయితే గొడవే లేదు! 

(photo courtesy : Google)   

14 comments:

  1. ##పుట్టపర్తి బాబావారి సేవలో తరించిపోవటం మించి పబ్లిక్ లైఫ్ లో సచిన్ సాధించింది ఏమిటి?## ఏమిటంటారా? "ఒక మనిషి ప్రయత్నం ద్వారా ఎంత సాధించగలడో చూపి యువత కు స్పూర్తిగా నిలవడం"
    -సురేష్

    ReplyDelete
  2. Well, it is all about money and power. If you want to be a brand ambassador you need to be non-controversial - i.e., suppress your urge to speak the truth - much less criticize perceived injustice or championing for the masses. Akhtar may be following the dictum notoriety would sell books (no publicity is bad publicity). I read with amusement about home ministry's refusal to release the information to CAG on nomination, review and selection processes for Padma awards. I also read somewhere that bad guys want to get Padma awards apparently because the IT and ACB won't go after Padma award recipients so as not to demean the awards or bring questions to the selection process. Jai Ho! http://www.indianexpress.com/news/cags-latest-ambition-let-us-audit-the-padma-awards-now/855414/

    ReplyDelete
  3. రమణగారు,
    భారత రత్న అన్నది తన రంగంల్లో ప్రతిభతో దేశ కీర్తిని జగద్విక్యాతం చేసిన వారికి ఇచ్చేదనుకుంటా, ఈ లెఖ్ఖన సచిన్ కి ఇవ్వొచ్చునేమో.

    ఇక స్టీవ్ జాబ్స్ పక్కన నారాయణ ముర్తి పేరా రతన్ టాటానీ, జాబ్స్ కి ఎంత అవమానం అండి?

    ఈ కామెంటును పబ్లిష్ చెయ్యొద్దు, ఇక్కడ సచిన్ మీద చర్చ జరుగుతుందేమో ఇప్పుడు నేను మాత్రం దూరం :)

    ReplyDelete
  4. *ఇంకా కష్టపడి బాగా సంపాదించుకున్నాడు. అందుకతను అనేక మార్కెటింగ్ టెక్కునిక్కులు ప్రయోగించాడు.*
    నేను క్రికేట్ ఆట గురించి తెలియదు & చూడను. కాని సచ్చిన్ ని మార్కెటింగ్ టెక్కునిక్కులు ప్రయోగించి డబ్బులు చేసుకొన్నాడు అని రాయటం ఎమి బాగా లేదు. ఈ రోజులలో మీడీయాలో ప్రతి అంశం మీద ఒక్కోక్క చానల్ వారు ఒక్కోక్క కోణం నుంచి వీశ్లేషణలు చేస్తూ ప్రజలను గందరగోళం లోకి నేడుతున్నారు. మీ ఈ వ్యాసం కూడా అలాగే ఉంది. సచ్చిన్ ఎదో డబ్బులకొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు మాత్రమే ఈ ఆటని ఎన్నుకొన్నట్లు రాశారు. మీకు తెలుసో లేదో వీటన్నిటికన్నా ముందు సచ్చిన్ కి టాలేంట్, ఏకాగ్రత ఉన్నాయి. అది సాధించటం అంత సులువుగాదు. భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ లిస్ట్స్, ఇంకా చాలా మంది కోటిశ్వరులంతా తమ పిల్లలను క్రికేట్ లో స్థానం సంపాదించాలని క్రికేట్ క్లబ్లకు,కోచింగ్ ఇప్పించటానికి ఎంతో డబ్బులు ఖర్చు చేస్తారు. కాని ఎంత మంది వీరి పిల్లలు క్రికేట్ లో ఉన్నరు? అదే మధ్య తరగతి నుంచి వచ్చిన సచ్చిన్,ధోనిలాంటి వారు జాతీయస్థాయిలో స్థానం సంపాదించటం ఆషామాషి వ్యవహారం కాదు. వారు ఆడిగెలిచిన ఆటలే ప్రజలకు చేసే సేవ. సచ్చిన్ ఆటమొదలు పెట్టినపుడు అతనేమి ఇన్నికోట్లు సంపాదించగలననో ఊహించి ఈ ఆటను ఎన్నుకోలేదు. గ్లోబలైసేషన్ వలన కంపేనీలు ఇవ్వటం మొదలుపేడితే దానికి అతను మార్కేటింగ్ టేక్కునిక్కులు ఉపయోగించామనటం బాగా లేదు.
    ఈ రోజులలో ఈ మార్కేటింగ్ టేక్కునిక్కులు అందరికి తెలుసు. తెలుసుకదా అని వాటిని ఉపయోగించి, క్రికేట్ ఆటగాళ్లు , క్రికేట్ లో సచ్చిన్ అంత ఎత్తుకు ఎదగగలరా? డాక్టర్లైతే అపోలో,ఫోర్టిస్ లాంటి ఆసుపత్రిని కట్టగలరా? మీ ఆలోచనలు 1970సం|| నాటి కాలాన్ని గుర్తుకు తెప్పిస్తున్నాయి. ఆరోజలలో వారికి థియరిటికల్ నాలేడ్జ్ ఎక్కువ, వాస్తవికత తక్కువ.

    ReplyDelete
  5. @క్రికెట్ ఆడటం పబ్లిక్ సర్వీస్ క్రిందకి వస్తుందేమో మనకి తెలీదు.

    చాలమ౦దికి భారతీయులమని గుర్తు చేస్తూ ఉ౦టారు గా ( అ౦దరికీ కాదు :) )

    @ రాళ్ళూ, రప్పల పేర్ల మీద ఎవార్డులు ఇస్తున్న గవర్నమెంట్ ఉద్దేశ్యం కూడా.. వీళ్ళని పట్టించుకోండి.. అనేమో!
    @'బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై భారతరత్న.'

    సూపర్ లైక్ ఈ వ్యాఖ్య లకు

    @సచిన్ అద్భుతమైన క్రికెటర్. కష్ట పడి ఆడాడు. ఇంకా కష్టపడి బాగా సంపాదించుకున్నాడు.

    ఇది నిజమే అయినా, పాపం ఈయన లా౦టి వారి కష్టం వల్లనే జనాలకు దేశభక్తి అన్న భావన పెరిగిపోయి టీ వీ లకి అతుక్కుపోడం మీరు మరిచిపోతే ఎలా ?
    ఆ దేశభక్తి దేశానికి ఎలా పనికోస్తున్నది అని మాత్రం అడగొద్దు :)

    @ భారత బొగ్గు, భారత ఉప్పు

    భలేవారే వీటి వినియోగం తగ్గి౦చే ప్రచారం చూడలేదా . మ౦తెన గారి గురి౦చి మీరు వినలేదనుకొ౦టాను ;-)

    ReplyDelete
  6. Anonymous గారు..
    వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. క్రికెట్ ఆట గూర్చి నాకు తెలియదు. చూడను. అని మీరు రాశారు. 'నాకు తెలుసు. నేను చూస్తాను.' అని మనవి చేసుకుంటున్నాను. నా ఆలోచనలు 1970 లవి అని రాశారు. నేను ఒప్పుకుంటున్నాను. ఆ రోజుల్లో భారత క్రికెట్ అంటే కేవలం బొంబాయి వాళ్ళు మాత్రమె. వీరి బాధితులు పటౌడీ, జిమ్మీ అమరనాథ్.. వంద పేర్లు రాయగలను. వీళ్ళకి చివరి రోజుల్లో ముఠా నాయకుడు గవాస్కరుడు. మేం చదువుకునే రోజుల్లో వీళ్ళని రోజూ తిట్టుకునేవాళ్ళం. నాకు తెలిసి ఈ దౌర్భాగ్యుల కబంధ హస్తాల్లోంచి భారత్ క్రికెట్ ని బయట పడేసిన వీరుడు కపిల్ దేవ్. మా 1970 వాళ్లకి ఇదో గొప్ప మలుపు.
    భారత క్రికెట్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ రాజకీయాలున్నాయి. సచిన్ అద్భుత క్రికెటర్ అనే కదా నేను రాసింది. కాకపొతే ఇదే సచిన్ ఏ హైదరాబాదీయో అయితే అంబటి రాయుడులా ఏదో లీగ్ మాత్రమే ఆడగలిగే అవకాశాలు ఉండేవేమో అనే అనుమానం నాకుంది. బొంబాయి వాడికి పది పైసల ఆట ఉంటె వంద రూపాయల హైప్ ఉంటుంది. రవి శాస్త్రి ఒక ఉదాహరణ. మిగిలిన వారికి ఈ ఫెసిలిటీ లేదు. కపిల్ దేవ్ లేకపోతె గంగూలీ లేడు. ధోనీ ఉండడు. థాంక్యూ కపిల్!
    సచిన్ అద్భుత ఆటగాడే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా అని రాశాను. ఇదొక ఎడిషనల్ క్వాలిఫికేషన్ అనే అనుకుంటున్నాను. ఈ క్వాలిటీ నాకయితే తప్పుగా అనిపించట్లేదు. డబ్బులు కోసమే క్రికెట్ ఆడాడని నేను కూడా అనుకోవట్లేదు. కానీ.. మీకు నా కవి హృదయం అర్ధం కాలేదంటే.. నాకు సరీగ్గా రాయటం చేత కాలేదేమో. బహుశా.. టెక్కునిక్కులు అన్న పదం మీకు నచ్చి ఉండక పోవచ్చు. ప్రాస కోసం ప్రయాస పడ్డాను. దయచేసి సరదాగా తెసుకోండి. సచిన్ ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ అన్న అభిప్రాయం మీతో పాటే నాక్కూడా ఉంది.
    ఏ క్రీడలో నయినా అగ్ర శ్రేణి ఆటగాడిగా ఎదగడానికి టాలెంట్, ఏకాగ్రత అవసరం. అది సచిన్ అయినా.. విశ్వనాథన్ ఆనంద్ అయినా.. పుల్లెల గోపీచంద్ అయినా. నేనూ ఒప్పుకుంటున్నాను.

    ReplyDelete
  7. మీ అభిమాన కపిల్దేవ్ తో మా ఆఫిసులో ఉద్యోగస్తుల కొరకు ఫిజికల్ ఫిట్నేస్ మీద మాట్లాడించటానికి పిలిపించాం. అతను వచ్చినపుడు షేకండ్ తీసుకొన్నాను. చాలా నిగర్వి. పిల్ల వాడిలాగా మాటాడడు.కొంతమంది కలసి క్రికేట్ ఆడాడు కూడాను. కాని ఆయనగురించి మీku తెలిసిన విషయాలు నాకుతెలియవు.

    ReplyDelete
  8. తార గారు..
    కామెంటుకి ధన్యవాదాలు.
    మీరు వద్దన్నా మీ కామెంట్ ప్రచురిస్తున్నాను.. నాకు నచ్చి.
    వద్దన్న పని చెయ్యటం చిన్నప్పట్నించి అలవాటై పోయింది.

    ReplyDelete
  9. సురేష్ గారు..
    కామెంటుకి ధన్యావాదాలు.
    క్రికెట్ కెరీర్ గా తీసుకుందామనుకునే యువతకు సచిన్ స్పూర్తిగా నిలుస్తాడు.
    ఒప్పుకుంటున్నాను.

    ReplyDelete
  10. dear GIdoc..
    thanks for the comment.
    i wish all the success to Akhtar's book.
    regarding govt. awards.. i agree with you.

    ReplyDelete
  11. Mauli గారు..
    కామెంటుకి ధన్యావాదాలు.
    మంతెన గారు తెలుసు.
    మంతెన గారి సలహాలు తు.చ. పాటించి ఆస్పత్రి పాలయిన వారూ తెలుసు.
    ఆయనగారి 'ఉప్పు రహిత సమాజం' ఉద్యమానికి చేయూతనిద్దాం!

    ReplyDelete
  12. Ramana garu,

    To say I like your blog is an understatement. I don't have enough talent to express my feelings for your blog..Keep writing and we will do our bit...

    Coming to the point,I have no second thoughts in accepting the fact that Sachin plays good cricket.. But imagine, if media does not hype so much, his fanfare would have been much less than what it is today. Example is Dravid, inspite of being a match winner, he is less regarded than contemporary Bombay folks.. There, one must salute the Westerner's talent.

    Politics play more cricket in India is a very valid statement and ever standing example for that is none other than the quoted Jimmy. He is so vexed up that he called the selectors a bunch of jokers..And it is honestly true..

    Even today, people who lick boots of few are up in the team and others aren't. I think history is repeating it self, especially in light of the recent white wash in England..

    One last bit, I sincerely believe Narayana Murthy has equal space next to Mr. Ratan Tata and other leaders around the world. The company he created, is more well known in the world than competetion and he created a space for Indian talent, within India. Slowly, as time goes, may be even Infy's charm is fading out (as some ex Infy's say), but I still think, Narayana Murthy etched a mark in Gold for India in the IT space.

    Regards

    Seetharam

    ReplyDelete
  13. సీతారాం గారు..
    ధన్యవాదాలండి.
    బ్లాగులు రాస్తూ..
    నా బుర్రలోంచి ఆలోచనలని 'అన్ లోడ్' చేస్తున్నాను.
    అవి మీకు నచ్చుతున్నందుకు ఆనందంగా ఉంది.
    థాంక్యూ!

    ReplyDelete
  14. Mantena valla dharalu perigaayandi....pallilu-pedodi jeedipappu,kaani dhara perigindi..ila konni...daralu perigindi eeyana pedodi tindi ni promote cheyadam valle

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.